Site icon Sanchika

పూచే పూల లోన-19

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[సమీర్‍ని కొడుతున్న రౌడీలు వీరమణికి సలాం చేసి పక్కకి తప్పుకుంటారు. నల్లగా భీకరంగా ఉంటాడు వీరమణి. ఎత్తు పళ్ళ వలన నవ్వుతున్నట్లు కనిపిస్తున్నా గంభీరంగానే ఉన్నాడు. కొట్టడం ఎందుకు ఆపేసావని రౌడోని అడుగుతాడు. కొట్టీ కొట్టీ తాను అలసిపోతున్నా గానీ సమీర్ నోటి నుంచి అమ్మా, అయ్యా అనే మాటలు రావడం లేదని అంటాడా రౌడీ. కుర్రాడు కొత్తగా ఉన్నాడు అంటూ, ఎవరితను అని అడుగుతాడు వీరమణి. కోపాల్ కొడుకని చెప్తాడా రౌడీ. ఏం చేసాడని అడిగితే, కోపాల్ ఈడ్చుకుని రమ్మన్నాడని చెప్తాడు. ఇంట్లోంచి పారిపోయివచ్చావా అని వీరమణి సమీర్‍ని అడిగితే సమీర్ మౌనంగా ఉండిపోతాడు. ఒక రౌడీ ముందుకొచ్చి వీరమణి చెవిలో అసలు కారణం చెప్తాడు. ఎక్కడ దాక్కున్నావని సమీర్‍ని అడుగుతాడు వీరమణి. సమీర్ మాట్లాడడు. నీకు అమ్మలేదా అని అడుగుతాడు. ఉందని ఒక రౌడీ చెప్తాడు. నీ తల్లిని కూడా తీసుకుని పారిపోలేదా అని సమీర్‍ని అడుగుతాడు. సమీర్ మాట్లాడడు. నీలో హీరో ఉన్నాడు అని సమీర్‍తో అంటాడు వీరమణి. దారికి రాకపోతే కోపాల్ చంపెయ్యమన్నాడని ఆ రౌడీ చెప్తాడు. తండ్రి కొడుకుని పొట్టన పెట్టుకోవాలని చూడ్డం ఆశ్చర్యమని అంటాడు వీరమణి. కాసేపు సమీర్‍ని జాగ్రత్తగా పరిశీలించి – ఏం చేయాలని అనుకుంటున్నావు అని అడుగుతాడు. తన బతుకు తనని బతకనీయమని అంటాడు సమీర్. రాణోలు గొడవపడింది మీ ఇంట్లోనే కదా అని అడిగితే, అవునంటాడు సమీర్. తనతో వచ్చి మైనింగ్ చేస్తావ అని అడిగితే, తనకి ఆ పని నచ్చదని, భూమిని ఎందుకు కుళ్ళదీయడం అని అంటాడు సమీర్. కొంచెం కోపం తెచ్చుకున్న వీరమణి, కదిలి బండి ఎక్కి ముందుకు వెళ్ళిపోతాడు. కొన్ని క్షణాల తరువాత బండి ఆపించి, దిగి వస్తాడు, అప్పుడు తాను ఒక మెకానిక్ షెడ్ పెట్టుకుంటానని అంటాడు సమీర్. అక్కడున్న షెడ్ తనదేనని, దాన్ని వాడుకోమని చెప్పి వెళ్ళిపోతాడు వీరమణి. ఇక చదవండి.]

[dropcap]“హీ[/dropcap]రో అంటే ఎవరు? అని నేనడిగినప్పుడు తెగింపున్నవాడు హీరో అని మీరన్నారు, అవునా?” సమీర్ అడిగాడు.

“కరెక్ట్”

ఆ కారుని షెడ్డు నుండి ఎటువైపో తీసుకొని పోతున్నాడు. కారు ఈసారి చాలా వేగంగా పోతోంది. హీరోల గురించి సినిమాల్లో తెలుసుకున్నాం, సాహిత్యంలో కావ్యనాయకులు, కావ్య నాయికలు – వీరి చిత్రీకరణలను అధ్యయనం చేసాం. ఇంత హృద్యమైన చరిత్ర గల ఒక వ్యక్తిని హీరో కాదు, మరేదైనా చక్కని మాటతో వర్ణించాలనిపించింది.

“తెగింపు ఒక్కటే చాలదు సార్..” చెప్పాడు సమీర్. “..ఒకసారి తెగించాకా, నువ్వొకవైపు, లోకం ఒక వైపు”

కారు ఆపాడు. అక్కడ మా ఎడమ వైపు అందమైన లోయ ఉంది.

“జాగ్రత్తగా చూడండి” చెప్పాడు. “విశేషంగా ఏం కనిపిస్తోంది?”

చుట్టూతా చూసాను.

“ఏమో! మీ కథ విన్నాకా ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు”

తల ఒక్కసారిగా ఆకాశంలోకి విసిరేసి వింతగా నవ్వాడు.

“మీరన్నదీ పాయింటే. ఇక్కడి నుండి అక్కడి వరకూ ఒక రకమైన అందం కనిపిస్తోంది, మళ్ళీ చూడండి”

ఈసారి అతను చూపిస్తున్న వైపు చూసాను. ఆ రాళ్లకు ప్రక్కగా పూల మొక్కలున్నాయి. డార్క్ పింక్ రంగులో ఎంతో అందంగా ఉన్నాయి.

“ఇవేమిటో తెలుసా?” అడిగాడు.

“తెలుసు”

నన్ను అనుమానంగా చూసాడు.

“ఏం లేదు, ఈ మధ్య కృష్ణప్రసాద్ గారని ఒకాయన పరిచయం అయ్యారు”

“ఓ”

“పూలు తప్ప మరే విషయం ఆయనకి అక్కరలేదు. ప్రపంచాన్ని పూలతోనే అర్థం చేసుకున్నారు”

“ఇవేమిటో చెప్పండి”

“ఇంపేషియన్స్ బాల్సామినా”

“ఇంకా?”

“అంతే తెలుసు”

“ఊ..” సిగరెట్ ముట్టించాడు.

“సార్..!” చెప్పాడు. “..ఇప్పుడే మీరో మాటన్నారు – ఎక్కడ చూసినా నేనే కనిపిస్తున్నాను అని”

“అవును. అది నిజమే”

“ఈ పువ్వు అంతటా నన్నే చూపిస్తుంది”

“ఛా”

“అవును. దీనికి మరో పేరుంది. జపనీస్‍లో దీనిని ‘టచ్ మీ నాట్’ అంటారు.”

“అంటే ముట్టుకోనివ్వదా?”

“కాదు. రకరకాల పూలతో ఒక బుట్ట తయారు చేసి అందులో ఈ ఒక్క పువ్వుని పెట్టండి -మిగతా పూలు కొద్దిగా ఎందుకో జరిగిపోయినట్లు కనిపిస్తాయి.”

“దీని గంధం వాటికి పడదా?”

“శాస్త్రజ్ఞులు పరిశోధించారు. అది కాదని తేల్చారు. ఈ పువ్వు యొక్క వైశిష్ట్యం ఏమిటంటే ఎక్కడున్నా ఇదే హైలైట్ అవుతుంది. తొందరగా నలగదు. మొక్క కాడలు కూడా గొప్పవి. దీనికున్న గుణాల వల్ల ఇది ఒంటరిది. ఒక చిత్రమైన హీరో..”

“మీరు ఒంటరితనాన్ని కోరుకున్నారు కదా?”

“లేదు. నా చుట్టూ ఉన్నదాన్ని తిరస్కరించటం వలన ఒంటరివాడినైనాను. నేను ఒంటరిని కాను. ఈ మొక్కలో రిఅక్టేసేస్ అనే ఎంజైమ్స్ ఉంటాయి. అవి టెస్టోస్టిరాన్‌ని డైహైడ్రోటెస్టోస్టెరోన్స్‌గా మారుస్తాయి. అవి టెస్టోస్టెరాన్ యొక్క క్రియను తగ్గిస్తాయి. ఈ ప్రాంతంలోని రుగ్మతలు, సంయమనం లేని శృంగారం, విలాసవంతమైన జీవితాలు అందరికీ తెలిసినవే! ఈ ప్రదేశంలో ఈ మొక్క కూడా ఒంటరిగా ఎక్కువగా పెరుగుతూ, ఇది కాదు, ఇది సరైన జీవితం అని చెప్పే హీరో.. ఒంటరి హీరో. పలు అనారోగ్యాలకు ఇంది మందు. పాము కాటుకు ముఖ్యంగా వాడే మందు ఇది”

మరల కారెక్కాం. ఎ.సి. ఆపేసి అద్దాలు క్రిందకి దించాం. ప్రకృతిలో ఏదీ అకస్మాత్తుగా ఏర్పడింది కాదు. అన్నింటి వెనుకా ఏదో రహస్యం దాగి ఉంది!

ఎందుకడగాలనిపించిందో అడిగాను, “సమీర్ గారూ?”

“యస్?”

“నిజమైన హీరో ఎలా అయ్యారు?”

***

“కారు రిపేర్ షెడ్ ఒంటరిగానే నడిపాను. షట్టర్ పైకి లేపి ఒక రోజు గరాజ్ వైపు నడిచాను. పిట్ మీదున్న కారొకటి క్రిందటి రోజు సాయంత్రమే డెలివరీ అయింది. టూల్స్ అన్నీ ఎక్కడివి అక్కడ పెట్టారో లేదో చూడటానికి పిట్ మీదకి వెళ్ళాను. అంతే. నా కాలు లోపలికి లాగు అక్కడున్న నలుగురు ఒకేసారి కుమ్మేసారు. ఆ తరువాత ఇవతలికి లాగి నాలుగు తన్నారు. ఎవరై ఉంటారు వీళ్ళు, వీరమణి నాకు అండగా ఉన్నాడని తెలియదా? అనుకుంటూ బాధలో మోకాళ్లు పట్టుకుని పైకి చూసాను. ఓ మూల నుంచి వీరమణి ప్రత్యక్షమైనాడు.

“మోకాలు కదలటం లేదా?” అడిగాడు.

“ఎవరు వీళ్లు?” అడిగాను.

“నిన్ను హీరోగా మార్చటానికి వచ్చిన వాళ్ళు”

“నాకు హీరో అవాలని లేదు”

పిడికిలి బిగించి శబ్దం చేసాడు వీరమణి.

“అది నీ చేతిలో లేదు. ఇలా దెబ్బలు తింటూనే ఉంటావా?” నా భుజం మీద చెయ్యి పెట్టి దూరంగా గోడ వైపు తోసాడు. గోడకి తల తగులుకుంటుందన్న జాగ్రత్తలో చేతులు రెండూ అడ్డంపెట్టి నిలదొక్కుకున్నాను.

“మనకేదైనా చేతైనప్పుడు దేనికీ భయపడం. భయపెట్టేవాడు విలన్”

“మరి హీరో ఎవరు?”

“వాడు ఎవరినీ భయపెట్టకుండానే అందరూ వాడికి భయపడేవాడు హీరో”

అంటూనే అతని ప్రక్కనున్న వాడిని గోడవైపుకు తోసాడు. వాడు గోడకి స్ప్రింగ్‍లా తగులుకుని వెనక్కి పల్టీ కొట్టి ఒక్క దూకుడులో నేల మీద భూచక్రంలా వీరమణి కాళ్ల దగ్గర తన కాళ్లతో దాడి చేసాడు. నన్ను చూస్తూనే వీరమణి చిన్నగా ఒక అడుగు ఎగిరి దాన్ని తప్పించుకుని మామూలుగా నిలబడ్డాడు.

“వీడి పనంతా వృథా అయింది. అవునా?”

“అవును”

“అంతే కాదు. నేను వాడి మీద దెబ్బ తియ్యవచ్చు. హీరో ఎవరో తెలుసా? సెంటర్‍లో నాలా నిలబడి కంట్రోల్‍లో ఉంటూ కంట్రోల్ చేసేవాడు. నీ దగ్గరికి వచ్చాం. టీ కూడా ఇప్పించవా?”

ఎందుకో నవ్వొచ్చింది. “పదండి” అని షెడ్డుకు తీసుకుని వచ్చాను. స్టవ్ వెలిగింది కెటిల్ పెట్టాను.

అక్కడున్న బెంచ్ మీద కూర్చున్నాడు వీరమణి.

“బార్‍డేజ్ పేరు విన్నావా?”

“తెలుసు”

“నేను అక్కడి నుండి వచ్చాను. మా తాత ముత్తాతలు సారస్వత బ్రాహ్మణులు!”

ఇదంతా ఎందుకు చెబుతున్నాడో అర్థం కాలేదు. నాతో ఇతనికి ఏదో చిత్రమైన పని ఉన్నట్లుంది..

“బార్‌డేజ్ అంటే బారహ్ దేశ్ అని అర్థం. అవి ఏమిటో తెలుసా? అల్దోనా, అన్జునా, అస్సగావ్, కాండోలిమ్, మోయ్‍రా, నచినోలా, ఒలేలిమ్, పొంబుర్పా, సాలిగావ్, సంగోల్డా, సెరులా, సియోలిమ్. ఛపోరా, మాండోవి, మాపుసా నదుల మధ్య గల గొప్ప ద్వీపం ఇది. 1567లో మూడు వందల ఆలయాలను ఫ్రాంసిస్కన్లు ధ్వంసం చేసారు. నాచినోలా అనే గ్రామం మాది. అక్కడి దేవాలయాలు రామనాథ్, మాల్కుమి (మహాలక్ష్మి), గ్రామ పురుష్, రవల్‌నాథ్, విఠల్, గోపినాథ్‍లకు సంబంధించినవి. ఈ దేవతామూర్తులను ఛిన్నం చేశాకా వచ్చిన ధాతువులతో చర్చ్‌లలో కేండిల్స్ వెలిగించి ఉంచేందుకు వాడుకునే స్టాండులను తయారు చేసారు వారు”

“ఎందుకలాగా?”

“అందులో మహిమ ఉందని వారి నమ్మకం”

“నిజమా?”

వీరమణి లేచాడు. స్వయంగా ఆ కెటిల్ దింపి టీ తయారు చేసి అందరికీ పంచాడు. అతని అనుచరులు భయపడుతూనే గ్లాసులు తీసుకున్నారు. నాకో గ్లాసు ఇచ్చి తన గ్లాసు తీసుకుని నవ్వాడు.

“ఓ హీరో.. హీరోలకి చరిత్ర తెలిసుండాలి. ఈ నేల, ఈ మట్టి.. ఈ నదులలోని జలం ఎందుకలా గోల చేస్తాయి.. అన్నీ తెలిసుండాలి. ఆ కేండిల్ స్టాండ్స్ గురించి నాకు తెలియదు. కానో ఒక్క సంగతి చెబుతాను”

అందరం శ్రద్ధగా వింటున్నాము. ఇతను ఇంత చదువుకున్నాడా? లేక ఇంత తెలుసుకున్న వాడా?

“ఇందాక నేను చెప్పిన దేవుళ్ళ విగ్రహాలలో రవల్‍నాథ్ అనే పేరు చెప్పాను గుర్తుందా?”

“అవును”

“ఆయనెవరో తెలుసా? కదంబ రాజుల కాలం నుండి ఈ రవల్‍నాథ్ యుద్ధ కౌశలానికి చెందిన దైవం. ఈయన విగ్రహం ఈ ప్రాంతంలో చాలా దేవాలయాలలో ఉంటుంది. దానికి ప్రధానమైన కారణం ఉంది. రవల్‍నాథ్ ప్రారంభించిన ఒక అద్భుతమైన యుద్ధకళను అభ్యసించే వారు ఆలయానికి రక్షణగా ఉంటారు. వారు ప్రతిష్ఠించి తొలుత ఆ విగ్రహానికి పూజ చేస్తారు. ఆ కళను అభ్యసించేవాడిని ప్రస్తుతం నేనొక్కడినే. వీళ్ళు కొంత నేర్చుకున్నారు..”

నా కళ్ళల్లోకి చూసాడు.

“తలచుకుంటే.. ఏంటి? గట్టిగా.. నువ్వు పూర్తిగా నేర్చుకోగలవు”

(ఇంకా ఉంది)

Exit mobile version