Site icon Sanchika

పూచే పూల లోన-20

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[సమీర్ సుందర్ మాట్లాడుకుంటూ కారులో వస్తూంటారు. తాను ఒకసారి హీరో అంటే ఎవరని అడిగితే తెగింపు ఉన్నవాడు హీరో అని సుందర్ అన్నాడని సమీర్ గుర్తు చేస్తాడు. అయితే తెగింపు ఒక్కటే చాలదంటాడు సమీర్. ఒక అందమైన లోయ ఉన్న చోట కారుని ఆపుతాడు. జాగ్రత్తగా చూడమని సుందర్‍తో చెప్పి, ఏం కనబడుతోందని అడుగుతాడు. అక్కడ రాళ్ళ పక్కగా ఉన్న పూల మొక్కలలో డార్క్ పింక్ పూలు ఎంతో అందంగా కనబడతాయి. అవేంటో తెలుసా అని సమీర్ అడిగితే, తెలుసనిని, ఈ మధ్య పరిచయమైన కృష్ణప్రసాద్ గారి ద్వారా పూల గురించి కొన్ని వివరాలు తెలిసాయని అంటాడు సుందర్. ఆ పువ్వు అంతటా తననే చూపిస్తుందని అంటాడు సమీర్. ఆ పువ్వుని జపనీస్ భాషలో ‘టచ్ మీ నాట్’ అని అంటారని చెబుతాడు. ఆ పువ్వు విశిష్టత ఏమిటంటే ఎక్కడున్నా అదే హైలైట్ అవుతుందనీ, తొందరగా నలగదనీ. మొక్క కాడలు కూడా గొప్పవనీ, దానికున్న గుణాల వల్ల అది ఒంటరిదని చెప్తాడు. ఆ మొక్క వైద్యపరంగా ఎలా ఉపకరిస్తుందో చెప్తాడు. నిజమైన హీరో ఎలా అయ్యారని సుందర్ అడిగితే, సమీర్ చెప్తాడు. కారు మెకానిక్ షెడ్ ఒంటరిగానే నడిపాననీ, ఒకరోజు నలుగురు వ్యక్తులు అకారణంగా తన మీద దాడి చేశారని చెప్తాడు. అప్పుడు అక్కడికి వీరమణి వచ్చాడని, హీరో ఎవరో, ఎలా ఉండాలో తనకి నేర్పించాడని చెప్తాడు. తన షెడ్‍లో టీ పెట్టించుకుని తాగుతాడు వీరమణి. తమ పూర్వీకులు బార్‍డేజ్ నుంచి వచ్చారని చెప్తాడు. హీరోలకి స్థానికమైన అంశాలు అన్నీ తెలిసి ఉండాలని వీరమణి సమీర్‍కి చెప్తాడు. స్థానికంగా ప్రసిద్ధుడైన రవల్‍నాథ్ అనే దేవుడి గురించి చెప్తాడు. రవల్‍నాథ్ యుద్ధకౌశలానికి చెందిన దైవమని, ఆయన ప్రారంభించిన యుద్ధకళను అభ్యసించినవారు ఆలయానికి రక్షణగా ఉంటారని చెప్తాడు. తాను ఆ కళను అభ్యసించాననీ, సమీర్‍ని కూడా నేర్చుకోమంటాడు వీరమణి. ఇక చదవండి.]

“హీరో గురించి మాట్లాడుతూ మీరు తెగింపు అన్నారు. నేను హీరో నిజమన ఒంటరివాడని కూడా అన్నాను” సమీర్ చెబుతున్నాడు.

ఏది ఏమైనా సమీర్ నిజజీవితంలో కూడా హీరోనే! వీరమణి మద్దతు సంపాదించినా స్వతంత్రంగా బ్రతికేందుకు కావలసినవన్నీ నేర్చుకున్నాడు.

“హీరో అంటే ఇంకా ఏదైనా చెప్పవచ్చా?”

“ప్రతి హీరో నార్సిసిస్ట్ గానే మిగిలిపోతాడు”

ఒప్పుకోవాలనిపించలేదు. నిజం చెప్పాలంటే వ్యక్తిత్వాల గురించి మాట్లాడాలంటే ఇతను ఎన్నో విషయాలలో చాలామంది కంటే చాలా పైన ఉన్నాడు.

“హీరో అంటే నార్సిసిస్ట్ అనటం అంత సబబు కాదేమో..”

నవ్వాడు సమీర్. నల్లని మీసం, నల్లని గెడ్డం మధ్యలోంచి అప్పుడప్పుడు ఇలా చక్కని పలువరస చూపిస్తూ వింతగా నవ్వుతాడు. అలా నవ్వినప్పుడు అతని కళ్ళు భలేగా మెరుస్తాయి. ఆ నవ్వులో అమితమైన ఆత్మవిశ్వాసం, ఎవరినీ కేర్ చెయ్యని ఒక నైజం ఉట్టిపడుతూ ఉంటాయి.

“మీకు పెద్దగా మతిమరుపు లేదనుకుంటాను”

“లేదు”

“మనం కొద్ది రోజుల క్రితం ఈ తోట మీదుగా వెళ్ళాం. గుర్తుందా?”

కారు పోతున్న దారి అంతగా గుర్తు రాలేదు. ఆ మాటకొస్తే ఇక్కడ అన్ని ప్రదేశాలూ ఒకేలాగా ఉంటాయి.

“గుర్తుకురావటం లేదు”

“నార్సిసిస్ట్ అంటే అంత ఆలోచించక్కరలేదు సార్! అద్దం ముందర ఎంతసేపు నిలబడతారు?”

“షర్ట్ టక్ చేసుకుని తల దువ్వుకునే వరకు”

“అంతేనా?”

“ఏమో, మరి స్పెషల్‍గా అవసరమైతే మరి కాసేపు”

“ఊ.. బావుండాలి అనుకోవాలని ఉంటుంది. అవునా?”

“మరీ బాగుంది. మీ మీద మీకు మంచి అభిప్రాయం ఉండటం, అది ఇంకా గట్టిపడాలనుకోవటం నార్సిసిసమ్ కాదు కదా?”

“కాదు”

“ఊ.. మీ గురించి మీకు ఎన్నో విషయాలు గుర్తుండటం మంచి అలవాటే కదా?”

“తప్పకుండా”

“హీరో కూడా అంతే!”

నేనేమీ మాట్లాడలేదు. ఈ రోజు సమీర్ చాలా ఆసక్తికరంగా మాట్లాడుతున్నాడు.

“ఆకాశంలో అలా సాగిపోతున్న పక్షులను చూడండి.. వాటిలో ఒక హీరో ఉన్నదా?”

“ఎలా చెబుతాం?”

“జాగ్రత్తగా చూడండి. ఇవన్నీ ఎక్కడో ఒకచోట కూర్చుని ఉంటాయి. ఒక పక్షి ఒక్కసారి లేవగానే అన్నీ దానితో పాటే లేచి అలా ఎగురుతాయి”

“అలా కాకుండా ఒక్కసారిగా అన్నీ లేచి ఎగురుతాయి అని ఎందుకు అనుకోకూడదు?”

సమీర్ తల వంచుకుని సిగరెట్ తీశాడు. జాగ్రత్తగా లైటర్‍తో ముట్టించాడు.

“చరిత్రకీ, ఫాంటసీకీ ఇదే తేడా! మొదటిసారి ఆ హీరో అలవాటు చేస్తాడు. ఆ తరువాత అన్నీ ఒక్కసారి కలసిమెలసి ఎగురుతాయి. మొదటిసారి అది హీరోయిజమ్, ఆ తరువాత అంతా ఒక అలవాటు, ఒక నైజం, ఒక దారి, ఓ జీవన విధానం. ఈ డాఫోడిల్స్ అన్నీ అందంగా, వరుసగా ఉన్నాయి. ఈ పూలు నార్సిసిస్ట్ ఫామిలీకి చెందినవి!”

“ఛా”

“అవును. బొటానికల్ నేమ్ అది”

“అలా ఎలా వచ్చింది?”

“ఇలా రండి” అంటూ ఆ లోయలికి మెల్లగా తీసుకుని వెళ్ళాడు. ఓ గుబురులా ఉన్న చోట ఒక మొక్కని క్రింద నుంచి పై వరకూ చాలా సున్నితంగా నిమిరాడు.

“ఏం కనిపించింది?”

“తెలియదు”

నవ్వాడు.

“రచయిత గారూ..”

నేను అటు తిరిగాను.

“అయ్యా, నన్ను అలా పిలిచినప్పుడు వెక్కిరించినట్లుంది”

“ఎందుకు? మీరు హీరో కాదనా?”

నమస్కారం చేసాను.

“వద్దు”

“ఎందుకు? ఎందరో హీరోలను మీ రచనలలో నింపుతారు కాబట్టి జీవితంలో ఒక్క హీరో అవటం మీకు ఇష్టం లేదు”

“అదలా ఉంచండి. ఇంతకీ ఈ మొక్కలో ఏముంది?”

“నార్సిసిసమ్..” వింతగా నవ్వాడు.

“మరల చూడండి..” అంటూ జాగ్రత్తగా క్రింద నుండి పైకి నిమిరాడు. “..చూడండి, తాకగానే ఆ పువ్వు తల వంచుకుని మరల పైకి లేపుతుంది. మిగతా పూలు నిక్కపొడుచుకుంటాయి”

“అయితే నార్సిసిస్ట్ అయిపోతాయా?”

సమీర్ లేచి నిలబడ్డాడు.

“సార్, అందమైన అమ్మాయిని ఈ విధంగా తాకుతూ, ముఖ కవళికలను గమనించి అందమైన కవిత్వం చేసారా?”

“నిజమే. వర్డ్స్‌వర్త్ అన్నాడు – ఒక్కసారి పదివేల పూలను తలలు ఆడిస్తూ నృత్యం చేస్తున్నట్లు చూసాను అని, ‘డాఫోడిల్స్’ అనే కవితలో.

“కరెక్ట్”

సమీర్ నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టాడు.

“సార్, ప్రేమికుడెవరో తెలుసా? ఒక్క అందమైన అమ్మాయి కళ్ళల్లోకి చూసి వేల డాఫోడిల్స్ తలలు ఊపుతూ నృత్యం చేస్తున్న దృశ్యాన్ని చూడగలిగినవాడు! ఆలాగే చూడు, నాలో నాకు తెలియనివి కూడా కనిపించాలి అనే అమ్మాయికి, అవును, నేను చూస్తాను, నేనే చూస్తాను, అనగలిగే అబ్బాయికీ మధ్య ఆ నృత్యంలోని లయ మాధుర్యం ప్రేమగా చిగురిస్తుంది..”

నవ్వాను.

“నేను హీరోను కాను..!” చెప్పాను. “..మీరు హీరోయే కాదు, రచయిత కూడా!”

ఇద్దరం రోడ్డు మీదకి వచ్చి కారులో కూర్చున్నాం.

“సార్, ఈ పూలలో మరో విశేషం ఉంది.”

“యస్?”

“ఈ మొక్కల్లోంచి తీసే మందు మతిమరపుకి వాడతారు. అల్జీమీర్స్ నుండి విముక్తి దీని నుంచే కలుగుతుంది!”

“బాగుంది. నార్సిసిస్ట్స్ ఇలా పని చేస్తాయన్న మాట!”

“సుందరం గారూ, నన్ను నేను మీతో పాటు ఇలా గుర్తు చేసుకుంటుంటే ఎందుకో మరోసారి హీరోలా గర్విస్తున్నాను”

“అదలా ఉంచండి! మీ గతంలో ఏదో గీత ఉంది. మీ మాటలలో చరిత్ర ఉంది. ఈ గాలికీ, ఈ మట్టికీ, ఈ వాతావరణానికీ, ఈ పూలకీ, మీ ఆలోచనలకీ చక్కని అనుబంధం ఉంది. ఇలా ప్రయాణిస్తుంటే ఎక్కడ ఏ అంశం పలకరిస్తుందో, ఎక్కడ ఏ విషయం పులకరిస్తుందో తెలియటం లేదు.”

(ఇంకా ఉంది)

Exit mobile version