పూచే పూల లోన-21

0
2

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[సమీర్ సుందర్ మాట్లాడుకుంటూ కారులో వస్తూంటారు. హీరో అనేవాడు నార్సిసిస్ట్ గానే మిగిలిపోతాడని అంటాడు సమీర్. అందుకు ఒప్పుకోడు సుందర్. తన అభిప్రాయాన్ని కొన్ని ఉదాహరణలతో సమర్థించుకుంటాడు సమీర్. తరువాత డాఫోడిల్స్ పువ్వులు కూడా నార్సిసిస్ట్ ఫామిలీకి చెందినని అంటాడు. ఒక లోయ పక్కగా కారు ఆపి డాఫోడిల్స్ ఉన్న చోటుకి తీసుకువెళ్తాడు. ఒక మొక్కని తాకగానే ఆ పువ్వు తల వంచుకుని మరల పైకి లేపుతుంది. మిగతా పూలు నిక్కపొడుచుకుంటాయి. వాటిని సుందర్‍కి చూపిస్తాడు. పైకి వచ్చి కారెక్కుతారు. ఈ మొక్కల్లోంచి తీసే మందు మతిమరపుకి వాడతారనీ, అల్జీమీర్స్ నుండి విముక్తి దీని నుంచే కలుగుతుందని సమీర్ చెప్తాడు. ఈ గాలికీ, ఈ మట్టికీ, ఈ వాతావరణానికీ, ఈ పూలకీ, సమీర్ ఆలోచనలకీ చక్కని అనుబంధం ఉందని అంటాడు సుందర్. ఇక చదవండి.]

“ఒంటరిగానే మిగిలిపోయాను..” సమీర్ చెబుతున్నాడు. “..కానీ నిరాశ చెందలేదు. డాఫోడిల్స్ పూలలో దాదాపు 32 రకాలున్నాయి. నేను వాటిలో స్పేత్ లాంటి వాడిని”

ఇదే సమస్య. ఈ హీరో రకరకాల విషయాలు, ఘటనలు, సంఘటనలు అలా క్రిందకి రాలుతున్న వాన చినుకుల్లా నా మెదడులోకి పడేస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ మెదడు వాటిని ఎక్కడికి తోస్తోందో, అసలు ఎక్కడో అక్కడ పెట్టుకుని వాటి గురించి ఆలోచిస్తోందో లేదో ఏ మాత్రం అర్థం కావడం లేదు.

“అయ్యా డాఫోడిల్ గారూ, ఇలా బాధ పెడుతున్నారేంటి?”

“ఎలా బాధ పెట్టమంటారు?”

“ఇంకో పద్ధతి ఎంచుకోండి. ఈ స్పేత్ అంటే ఏమిటో గట్టిగా చెప్పేస్తే అసలు మీ వద్ద బాధ పడాలో, పడకూడదో క్షణంలో గట్టి నిర్ణయం తీసుకుంటాను”

నవ్వాడు సమీర్. ఠక్కున పక్కకి తీసుకుని కారు ఆపాడు.

“ఇక్కడ ఎక్కడైనా ఆ మొక్క ఉన్నదా?”

“కాదు. కొద్దిసేపు మొబైల్ పూర్తిగా స్విచ్ ఆఫ్ చెయ్యండి” అని అంటూనే తనూ అదే పని చేసాడు! కొద్ది సేపూ ఏదీ అర్థం కాలేదు. ఏదో పరికరాన్ని కారు డెక్ లోంచి తీసి ఇగ్నీషన్ దగ్గర పెట్టి కారు స్టార్ట్ చేసి ఆపాడు. అలా రెండు మూడు సార్లు చేసి ఊరుకున్నాడు. గబగబా దిగి వెనుక ఉన్న సీట్లోంచి మరో మొబైల్ తీసుకుని తిరిగి స్టీరింగ్ దగ్గర కూర్చున్నాడు. ఆ మొబైల్‍నే చూస్తూ సిగరెట్ ముట్టించాడు. ఓ పావు గంట తరువాత తన మొబైల్ ఆన్ చేసి కారు స్టార్ట్ చేసాడు.

“మీరూ ఆన్ చెయ్యచ్చు” అన్నాడు.

ఆన్ చేసి అతన్ని వింతగా చూస్తూ కూర్చున్నాను. కారు ముందుకు దూకుతోంది.

“ఇప్పుడు జరిగిన దాని మీద ఏదీ చెప్పను. దయ చేసి అడగకండి. మీకు ఏ సమస్యా రాదు. భయపడకండి. ఒంటరిగా ఉంటే కౌబోయ్ లాంటి వాడిని! నా వెంట్రుక ముక్క పీకటం కాదు, తాకటం కూడా ఎవరి వలనా కాదు”

ఇలా ఎవరైనా మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక తీవ్రమైన పరిస్థితి లోంచి అప్పుడే బయటకి వచ్చారన్న మాట అక్షరసత్యం.

“స్పేత్ గురించి మాట్లాడుదాం”

“ష్యూర్..!” అన్నాడు. “..దీని ఆకే పువ్వులా కనిపిస్తుంది. అది వికసించిన తరువాత అందులో పువ్వు కనిపిస్తుంది. దీనినీ స్పేత్ అంటారు. ఇది ఈ జాతిలో ఒంటరిది – నాలాగ!”

“ఒంటరితనాన్ని తెచ్చుకున్నది మీరే కదా?”

“అవును. ఒంటరివారిలో రెండు రకాలు – మొదటిది, చేతకానివారు, తనలో దేనినో చంపుకున్నవారు ఒంటరిగా మారుతారు. రెండవది – చుట్టూతా ఉన్న లోకాన్ని ధిక్కరించి ఇదిగో, ఈ చెత్త గని లోంచే నిగనిగలాడుతూ వెలుపలికి వచ్చిన బంగారాన్ని నేను. నాకు ఒక ధర అనేది ఉండదు, నా ధరతో ఇతర ధరలను లెక్కించగలిగే స్తోమత ఉన్నవాడిని అని సూటిగా చెప్పే ఒంటరితనం. నేను ఆ రెండవ రకానికి చెందినవాడిని! వీరమణి ఎన్నో విద్యలు నేర్పించాడు. ఆ కారు షెడ్డులో ఒంటరిగా ఎలా బ్రతకాలో నేర్చుకున్నాను.”

“ఒంటరిగానే పడుకునేవారా?”

నవ్వాడు.

“అంటే?”

“మామూలుగా అడిగాను. విపరీతార్థం లేదు.”

“నాతో పాటు కొండచిలువలు, కోబ్రాలు కూడా పడుకునేవని ఆలస్యంగా తెలుసుకున్నాను.”

“వామ్మో”

“పాములకు రస్ట్ అంటే విపరీతమైన ప్రీతి. షెడ్డులో ఎక్కడైనా పాత రేకులు ఉంటే చాలు, వాటి క్రింద ఇవి తప్పకుండా చేరేవి. నా జోలికి ఎప్పుడూ రాలేదు”

మెల్లగా డెక్ లోంచి ఏదో వెతికి తీశాడు. అది ఓ పెన్ డ్రైవ్. స్పీకర్‍లో పెట్టాడు.

గిటార్ సంగీతం వినిపిస్తోంది. కొద్ది సేపయ్యాకా, ఓ చిక్కని గొంతులో ఓ పాట వినిపించింది. ఇతని కంఠమా కాదా అనే ఆలోచన వచ్చింది. పాట తియ్యగా ఉంది.

‘గరీబోడిదీ నాటకం..’ పాట వినిపిస్తోంది.

“గరీబోడిదీ నాటకం

గరీబోడిదీ నాటకం

సరదాలు లేవు పరదాలు లేవు,

వరదలా పారే పేదరికం

గరీబోడిదీ నాటకం

గరీబు తోని నాటకం!”

“ఎప్పటిదీ పాట?”

అతనేమీ మాట్లాడలేద్దు. పాట అలా సాగుతోంది.

“నువ్వెవరయ్యా, నేనెవరయా

దొరగారి కోటులో పువ్వెవరయ్యా

గరీబోడిదీ నాటకం

గరీబు తోని నాటకం!”

కొద్దిగా ఫార్వర్డ్ చేసి మరో పాట వినిపించాడు.

“ఆట ఆడాలి, ఒక పాట పాడాలి..

పామరుడైనా పండితుడైనా

ఆమడ దూరం చేరే లోగా

పాట పాడాలి, ఒక ఆట ఆడాలి”

“గొంతు ఒకరిదే” అన్నాను.

కేవలం తల ఆడించాడు.

“మాన్యుల కోసం మహళ్ళు కట్టి..” పాట వినిపిస్తోంది.

“మాన్యుల కోసం మహళ్ళు కట్టి..

సామాన్యునికో సమాధి కట్టి

పాట పాడాలి, ఒక ఆట ఆడాలి..”

పాట ఆగిపోయింది.

“సుందరం గారూ..” సమీర్ ఎందుకో నిట్టూరుస్తున్నట్లు అన్నాడు. “పాటలు ఎలా ఉన్నాయి?”

“చాలా బాగున్నాయి సార్, ఎవరు రచించారు? ఎవరు పాడారు?”

“రెండూ నేనే”

“అనుకున్నాను”

“నా షెడ్ బయట సాయంత్రం పూట ఓ గిటార్ పట్టుకుని పాడుకుంటూ ఉండేవాడిని. గిటార్ కవర్ నే కూర్చున్న రాయి ప్రక్కన అలా పడి ఉండేది. ఈ ప్రాంతంలో ఒక అలవాటు ఉన్నది చాలా మందికి – ఇలా గిటార్ వాయించే వారి ముందర ఆగి పాట విని, ఆ కవర్‍లో డబ్బులు పడేస్తారు. నేను తీసుకునేవాడిని కాను.”

“దానం ఇచ్చేవారా?”

“కాదు. అలా ఒంటరిగా పాడుకునే సమయంలో దాదాపుగా నా వయసు ఉండే జోఆకిమ్ వచ్చి అక్కడ కూర్చునేవాడు. జీసస్ క్రైస్ట్‌లా పొడుగ్గా ఉండే జుట్టు, చక్కని గడ్డం, అందమైన ముక్కు, దూరంగా దేనినో చూస్తున్నట్లు కనిపించే కళ్ళు.. నా కంటే ఇంకో రెండు అంగుళాలుండే పొడవు.. వాడి చొక్కాకి క్రింద నుండి ఒకే గుండీ పెట్టుకుని ఉండేవాడు. చేతి గుండీలు కూడా ఊడదీసుకుని ఉండేవాడు. వాడిని జోకీ అనేవాడిని. పాట మొదలవగానే వచ్చి కూర్చునేవాడు. అక్కడే ఉన్న డబ్బా తీసుకుని తాళం వేసేవాడు. ‘పాట పాడాలి, ఒక ఆట ఆడాలి..’ ఆ లైనులో మటుకు గొంతు కలిపేవాడు. పాంటు రెండు జేబుల్లోనూ ఏవో నాలుగు బుడ్డీలున్నట్టు కనిపించేవి. కాలి చెప్పులు ఖచ్చితంగా వాడివి కావని చెప్పవచ్చు. రోజుకో రకం, రోజుకో సైజు, రోజుకో కలర్‍లో కనిపించేవి.

“వైవిధ్యం కోరుకునే వ్యక్తి!”

“కరెక్ట్! ఆ గిటార్ కవర్‍లో డబ్బులు పడుతున్నప్పుడల్లా బుడ్డీ తీసి కరెక్టుగా రెండే రెండు గుటకలు మ్రింగేవాడు. ఆ గుటకల ధర అంత అయి ఉంటుందని అనుకునేవాడిని. నాకు దాదాపు రోజూ కంపెనీ ఉండేవాడు. ఈ జోకీ నన్ను ఎన్నడూ ఏదీ అడగలేదు. వాడి వెంట ఒక ఊరకుక్క వచ్చి బుద్ధిగా కూర్చునేది! ఒక్కోసారి అతనే గిటార్ వాయించేవాడు. ఒక్కోరోజు ఆ కారు షెడ్డుకి వెనకాల ఉన్న చర్చ్‌కి వచ్చినవాళ్ళు ఇళ్లకి వెళుతూ ఆగేవారు. మేమిద్దరం అప్పటికప్పుడు ఆలోచించుకుని చిన్న చిన్న స్కిట్స్ ఆ షెడ్డులోనే ప్రదర్శించేవాళ్ళం. జోకీకి చక్కని సమయస్ఫూర్తి ఒక వరంలా ఉండేది. చక్కని కామెడీ చేసేవాడు. ఏదైనా లయబద్ధమైన పాట అందుకుంటే దానితో పాటు నాట్యం చేసేవాడు. ఆ పొడుగాటి చేతులు నడుము మీద పెట్టుకుని బలపాలని కదిపినట్టు రెండు కాళ్ళనూ కదిపేవాడు. ఇద్దరం బేకరీ వాడు ఇచ్చిన బ్రెడ్, బన్ను తింటూ కబుర్లు చెప్పుకునేవాళ్ళం. మూడో వ్యక్తి ఎవరైనా వస్తే ఆ కుక్క వాళ్ళ సంగతి చూసుకునేది. బాగా పొద్దుపోయాకా, ఖాళీ బుడ్డీలు రోడ్డు మీద పారేసి ‘వస్తాను’ అనేవాడు. అక్కడ పడి ఉన్న గిటార్ కవర్ నాకు అందించేవాడు. ఆశ్చర్యం వేసేది. ఎవరితను? ఎక్కడుంటాడు? తెలియదు. నాకు నీడలా ఉండేవాడు. ఆ గిటారు కవరు లోని డబ్బులు తీసి అతని చేతిలో పెట్టాను. ఇదేంటి అన్నట్లు చూసాడు.

“తీస్కో, నీకే” అన్నాను. అతను ఎందుకో ఒక రెండు రూపాయల నోటు మాత్రం తీసుకున్నాడు.

“చాలు” అన్నాడు.

“అదేంటి?”

“దీనితో చిన్న పాకెట్ దొరుకుతుంది. అందులోది నీటిలో కలుస్తుంది. అవే ఈ బొట్లు. మరి చాలు!”

“కుదరదు” అంటూ మొత్తం అతనికిచ్చాను. బలవంతం మీద తీసుకున్నాడు. అందులోంచి రెండు రూపాయలు తీసి ఆ షెడ్దులో ఓ మూల ఉన్న వినాయకుడి బొమ్మ దగ్గర పెట్టాడు. నా భుజం తట్టి నా చేయిని దగ్గరకు తీసుకుని ముద్దాడి అలా తన కుక్కతో పాటు రోడ్డు మీద ఈల వేసుకుంటూ చీకటిలో మాయమైపోయాడు. అతను మరల కనిపించడు అనుకున్నాను. అది నా తప్పు ఆలోచన!

అతనే నాకు జీవితాంతం తోడు అన్న సంగతి అప్పుడు నాకు తెలియదు.

జోవాక్విమ్ లేదా జోవానిమ్ లేదా కొంకణిలో జోకీ అంటే మన కోసం దైవం పంపిన ఒక వ్యక్తి అని అర్థం!”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here