పూచే పూల లోన-23

0
1

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[సమీర్, సుందర్ మాట్లాడుకుంటుంటారు. సుందర్‍కి సంగీతంలో ప్రవేశముందా అని అడుగుతాడు సమీర్. లేదు, కానీ ఆస్వాదించగలనని చెప్తాడు సుందర్. సమీర్ తనని ప్రతిక్షణం ఆశ్చర్యపరుస్తున్నాడని అంటాడు సుందర్. జీవితమంతా సంఘటనలు, గొడవలు, సిద్ధాంతాలు మిగిలిపోయిన ఏ మనిషికైనా అసలు హాయిగా ఓ క్షణం గడిపే అవకాశం ఉండదేమో అని అనిపిస్తుందని చెప్తాడు సమీర్. జోకీని కలిసినప్పటి నుండి తనకి గిటార్ పైన మోజు మరింత పెరిగిందని అంటాడు సమీర్. కొన్నాళ్ళు జోకీ కనబడలేదని, అప్పుడొకతను జోకీ గురించి అడిగి, రెండు కరెన్సీ నోట్లు అందించాడని చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత జోకీ వస్తాడు. ఒక బిల్డింగ్ కొనేందుకు బిడ్ వేస్తున్నానని, ఇరవై రూపాయలు తక్కువయ్యాయని చెబితే, తాను ఆ ఇరవై రూపాయలు ఇచ్చానని చెప్తాడు. ఓ తోటలోకి తీసుకెళ్ళి కారు ఆపుతాడు సమీర్. అక్కడున్న చంద్రకాంత మొక్కలను సుందర్‍కి చూపిస్తాడు. కొంచెం ముందుకు వెళితే ఒక ఆడిటోరియం కనిపిస్తుంది. దాని మీద డాఫోడిల్స్ అని రాసి ఉంటుంది. ఆ ఆడిటోరియమ్‍నే జోకీ వేలంలో కొన్నాడని చెప్తాడు. బిడ్ వేయడానికే డబ్బులు లేని జోకీ ఆ బిల్డింగ్‍ని ఎలా కొనగలిగాడని అడిగితే, ఓ అంతకు ముందు ఇరవై రూపాయలు ఇచ్చిన పెద్దాయన డబ్బు కట్టాడని తెలుస్తుంది. సుందర్ చుట్టూ చూస్తాడు. డాఫోడిల్స్, చంద్రకాంతలు అలా గాలికి మెల్లగా ఊగుతుంటాయి. ఇక చదవండి.]

[dropcap]స[/dropcap]మీర్‍తో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ నేను వచ్చిన పని మీద దక్షిణ గోవాలో తిరుగుతున్నాను. తను కొద్ది రోజులు నాకు కనిపించను అని చెప్పి ఆ మైనింగ్ గనుల వైపు వెళ్ళిపోయాడు. మధుకర్ గవడే చెప్పిన విషయాలు డైరీలో వ్రాసుకుని కుర్టోరిమ్‍కు చేరుకున్నాను. అద్భుతమైన వాతావరణం ఎదురయింది. చక్కని చెట్ల మధ్యలో కారు ఆగింది. నా డ్రైవరు అలవాటుగా నవ్వాడు. డోర్ తెరుచుకుని నువ్వే దిగాల్సి ఉంటుంది కానీ నేను దిగి డోర్ తెరవను అన్నట్లు నవ్వాడు. అలాగే అన్నట్లు నేను కారు దిగి వాడి వైపు చూసాను. అసలు నీకు ఈ కారెందుకు అన్నట్లు నవ్వుతున్నాడు. కానీ ఆ నవ్వు అందుకు కాదని అప్పుడే అర్థమైంది. కారు అద్దంలో నా వైపే వస్తున్న చిత్ర కనిపించించి. అటు తిరిగాను.

“బహుకాల దర్శనం” అంది.

“ఓ.. ఈ ప్రాంతాన్ని ఇంకా వదలలేదా?”

“లేదు”

“అంత పెద్ద డాక్యుమెంటరీయా?”

“డాక్యుమెంటరీలు మీలాగా ఓ కిటికీ దగ్గర కూర్చుని వ్రాసేసేవి కావు. కథలు కావు, నాటకాలు అంతకంటే కావు.”

“అవును సినిమాలూ కావు”

“అస్సలు”

“ఇంతకీ మీ బాధేంటి?”

తల ఆకాశంలోకి ఎత్తి పిచ్చి పిచ్చిగా నవ్వింది. ఆ అలజడికి వెనుక నుండి ఒక్క గెంతులో ముందుకి దూకిన ఆ జడ ఆమె చేతి సంచీకి తగిలి ఇరుక్కుంది. అదే వయ్యారంతో ఆ జడను మరల వెనక్కి తోసింది. ఒక స్త్రీ సౌందర్యం ప్రకృతి పరవశించే ప్రదేశంలో చూడాలి.

“ఇంతకీ ఎందుకలా నవ్వారు?”

“నేను అడగవలసిన ప్రశ్న అది. అదే ఇంకా ఈ ప్రాంతం వదిలి వెళ్ళలేదా అనేది మీరు నన్ను అనవసరంగా అడిగారు”

“ఓ . అవునా. మీతో ఒక అమ్మాయిని ఆ రోజు పరిచయం చేసారు.”

“ఎవరూ?”

“అదే.. ఎవరినో జైల్లోంచి విడిపించండి, ఇవతలికి రాగానే చంపుకోవాలి అని చెప్పింది!”

“ఓ.. అటు చూడండి.”

ఆ చూపుడు వేలు దిక్కు వైపు చూసాను. అక్కడ ఒక ట్రైపాడ్, దాని మీద ఓ కెమెరా, ప్రక్కగా ఒక చిన్న ఆర్టిస్ట్ పోడియమ్ ఉన్నాయి.

“ఎవరూ లేరే?” అన్నాను.

ఇంతలో ఏదో ఫ్రేమ్ సెట్ చేసుకుంటూ అటు చూస్తూ వెనక్కి జాగ్రత్తగా అడుగులు వేస్తూ జ్యోతి కనిపించింది. మేమిద్దరం అటుగా నడిచాం. నిజమే, ఆమె ఎంచుకున్న కోణం గొప్పది. ఆ చివార్న ఓ కట్టడం – ఓ చాపెల్‍లా ఉంది. దానికి ముందరే ఓ పురాతనమైన ఆలయం ఉంది. కెమెరా సెట్ చేసి ప్రక్కనున్న టేబిల్ దగ్గర కూర్చుని మంచి నీళ్ళ బాటిల్ ఖాళీ చేసింది. చివరి గుటక మింగే లోపు నన్ను చూసి ఆగిపోయింది. బుగ్గలు నీటితో ఉబ్బిపోయి ఉన్నాయి. ఆ నీరంతా నా మొహం మీదకి స్ప్రే చేయవచ్చనే ఆలోచన కలిగి కొద్దిగా వెనక్కి జరిగాను. నన్ను చూపిస్తూ చిత్ర వైపు తిరిగింది. చిత్ర మరల నవ్వటం ప్రారంభించింది.

జ్యోతి అతి కష్టం మీద నీళ్ళు గొంతు లోకి పోనిచ్చి కళ్ళు పెద్దవి చేసింది.

“ఈయన..” నవ్వటం మొదలుపెట్టింది. ఇదెక్కడి గోలో అర్థం కాలేదు. ఈ ఇద్దరు నన్ను ఇలా జోకర్‍లా ఎందుకు చూస్తున్నారో అర్థం కాలేదు.

“మాధవ్‍ను విడిపిస్తే వాడిని నేను చంపాలి అన్నాను.”

“కరెక్ట్”, చిత్ర చెప్పింది.

“అంతే. ఆ క్షణం నుంచి కనబడకుండా మాయమైపోయారు.”

“లేదు..”, చిత్ర చెప్పింది. “..మనమే కాంటాక్ట్‌లో లేము”.

“ఇక్కడేం చేస్తున్నారు?” జ్యోతి అడిగింది.

“ఇక్కడ శిలాశాసనాలను చూడాలి”

“ఓ” అని పలికి కాన్వాస్‍ని రోల్ లోంచి క్రిందకి లాగి తగిలించి స్కెచ్ వేయటం ప్రారంభించింది. మేమిద్దరం ఆ స్కెచ్ చూస్తూ నిలబడ్డాం.

“చిత్రగారూ..” అడిగాను.

“చెప్పండి”

“నాకొకటి అర్థం కాదు”

గట్టిగా నవ్వింది.

“ఇదెక్కడి గోలందీ? నేనొక జోకర్‍లా కనిపిస్తున్నాను కదా?”

“మరోలా అనుకోకండి. ఎప్పుడూ ఒకటి అర్థం కాని వాడికీ, ఎన్నో విషయాలు అర్థం కాని వాడికీ ఏంటి తేడా?”

“డాక్యుమెంటరీ తీసేవాడికీ, కథలు వ్రాసేవాడికీ తేడా!”

“గుడ్. ఇంతకీ అర్థం కానిదేంటి?”

“జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఈ అమ్మాయి కెమెరా పెట్టింది. ఫ్రేమ్ చూసుకుని వచ్చింది. ఇప్పుడేమో చార్‌కోల్‌తో స్కెచ్ వేస్తోంది. లెక్క తేలటం లేదు.”

చిత్ర కాన్వాస్ దగ్గరకి వెళ్ళింది. నన్ను నాలుగడుగులు వెనక్కి తీసుకుని వెళ్ళింది.

“జ్యోతి గురించి కొన్ని విషయాలు చెప్పాలి..” చాలా చిన్న గొంతుతో చ్పెపింది. “..జ్యోతిష్కులు జరగబోయే వాటి గురించి చెబుతారు ఈమె కథ వేరు.”

“అంటే జరిగిన దాని గురించి చెప్పగలదా?”

“అంత సూటిగా చెప్పలేను. కానీ అటువంటి గొప్ప కళ ఈమెలో ఉంది. మీకు ఇక్కడి నుండి ఏం కనిపిస్తోంది?”

“దూరంగా ఓ చాపెల్, లేదా చర్చ్. ఈ ఎడమవైపు ఓ గుడి. అంతకంటే ఇంకేమీ చూడలేను. కాకపోతే అక్కడి దాకా వెళితే మరేమో..”

“మరి ఏవో శాసనాలు చూడాలన్నారు?”

“వాటి వ్యవహారం నాకు మధుకర్ ఇచ్చారు. దానికి చాలా దూరం వెళ్ళాలి”

“ఓ. మీకు కనిపించినవి ఫొటో తియ్యగలరు. కానీ ఇదే ప్రదేశం ఒకప్పుడు ఏమిటీ అనేది ఆ స్కెచ్‌లో కనిపిస్తుంది. దటీజ్ జ్యోతి!”

మతి పోయింది. ఆ కాన్వాస్ మీదకి దృష్టి మళ్ళించాను. చార్‍కోల్‍తో వేస్తున్న ఆ చిత్రం ఏదో ‘మాల్గుడి డేస్’లో బొమ్మలా కనిపిస్తోంది. ఒక వృత్తంలో చక్కని ఇళ్లలా.. చాలా చిన్న చిన్న ఇళ్లలా ఉన్నాయి. కొబ్బరి చెట్లు గుబుర్లు గుబుర్లుగా పెరిగినట్లు కనిపిస్తున్నాయి. ఇటు ప్రక్క కనిపిస్తున్న గుడి చాలా పెద్దగా ఉంది. గుడి వైపుకు రాజమార్గం కనిపిస్తోంది. చర్చ్ లేదు. అక్కడ అంగళ్ళు కనిపిస్తున్నాయి. గుడి వెనుక వైపుకు ప్రక్కగా ఓ సెలయేరు ప్రవహిస్తోంది. జ్యోతి అలా ముందుకు చూస్తోంది, ఇలా కాన్వాస్ మీద చెక్కుతోంది..

కనిపిస్తున్నది ఒక అస్తిత్వం అనుకుంటే, కనిపించని గతం ఏ అస్తిత్వం? ఒక ప్రక్రియలో వాస్తవమా? ఆ ప్రక్రియలో ఏర్పడ్డ విషయం వాస్తవమా? ఏమో! అన్నింటినీ అవతల పెడితే మనిషి మేధస్సును మించిన వాస్తవం మరొకటి లేదు.

ఆమె చిత్రీకరిస్తున్నమనుషుల ఆకారాలు ఆలోచింపజేసాయి. జాగ్రత్తగా పరిశీలించాను. తలకి తలపాగాలున్నాయి. నుదుటి మీద నామాలున్నాయి. చేతులలో తాళపత్రాలున్నాయి. కర్నాటక ప్రాంతంలో కట్టే వేషధారణ స్పష్టంగా ఉంది.

జ్యోతి వేస్తున్న బొమ్మ దాదాపు పూర్తి అవుతోంది. ఇద్దరం ఆమె వెనుక నిలబడి చూసాం. ఎక్కువగా ఇలాంటప్పుడు డ్రైవర్ కలుగజేసుకోడు. ఎందుకో మాతో వచ్చి నిలబడ్డాడు. ఈ బొమ్మ సామాన్యంగా ఇంట్లో కూర్చుని వేసుకోవచ్చు. అది పెద్ద విషయం కాదు. ఈ అమ్మయి చేతిలోని కళ నన్ను కదిలించింది. ఇది ఈ ప్రదేశం – మీరు చూస్తున్నది కాదు అని చెబుతున్నట్లుంది!

పూర్తి చేసి చేతి వేళ్ళు నలుపుకుంది.

“సుందర్ గారూ?” చిత్ర అడిగింది.

“చెప్పండి”

“ఇంతకీ మధుకర్ గారు ఈ ప్రదేశం గురించి ఏం చెప్పారు?”

“కుర్టోరిమ్ ఇప్పటి పేరు..” చెప్పాను. “..ఇది ఒకప్పుడు కుర్తారిక అగ్రహారం!”

“అగ్రహారమా?”, ఏక కంఠంతో అడిగారు ఇద్దరూ.

“ఆ గుడి ఏంటో తెలుసా?”

“అమ్మవారి గుడి”

“అమ్మవారి పేరు కుండోదరి.. మహామాయ క్షేత్రం ఇది. జ్యోతి కరెక్ట్‌గా చిత్రించింది!”

జ్యోతిని జాగ్రత్తగా చూసాను. ఆ గుడి వైపే దీర్ఘంగా చూస్తోంది.

ఓ సంఘటన ఓ చరిత్ర లోనిది. ఓ ఘటన ఓ చరిత్ర అవుతుంది. ఆ కాన్వాస్ మరి ఏమి చెబుతుందో అర్థం కాలేదు. ఏదో అనిపించి జ్యోతిని జాగ్రత్తగా చూసాను. ఆమె చెంపల మీదుగా ఎందుకో కన్నీరు అలా కారిపోతోంది!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here