[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[రిసార్ట్స్ లోని బాల్కనీ మీది నుండి సూర్యాస్తమయాన్ని చూస్తూంటాడు సుందర్. ఓ చిన్న పరిశోధన కోసం గోవా వచ్చిన తనకి ఎదురైన వింత అనుభవాలను తలచుకుని ఆశ్చర్యపోతాడు. కింద హడావిడి మొదలవుతుంది. జనాలు రావడంతో టేబుల్స్ అన్నీ బాటిల్స్‌తో నిండుతాయి. ఇంతలో అక్కడికో పోలీసు జీప్ వచ్చి ఆగుతుంది. సిఐ, మిగతా సిబ్బంది దిగుతారు. సమీర్ ఎక్కువగా, కూర్చునే టేబుల్ దగ్గర ఓ కుక్కని తిప్పుతారు. అది అటూ ఇటూ తెగ తిరుగుతుంది. పోలీసులు రిసార్ట్స్ కారిడార్ లోకి, గదులలోకి కూడా వెళ్తారు. తన దగ్గరికి కూడా వస్తారేమో అని అనుకుంటాడు సుందర్. ఏం చేయాలో పాలుపోదు. ఇంతలో బెల్ మ్రోగుతుంది. రండి అనగానే చిత్ర లోపలికి వస్తుంది. ఏం తీసుకుంటారని సుందర్ అడిగితే, అరటికాయ చిప్స్, కాఫీ తెప్పించమంటుంది. జ్యోతి గురించి, కుండోదరి ఆలయం గురించి, శాసనాల గురించి మాట్లాడుకుంటారు. బేరర్ వచ్చి సుందర్ ఆర్డర్ ఇచ్చినవి తెచ్చి కాఫీ తరువాత తెస్తానని చెప్పి, మీ కోసం సిఐ వచ్చారని చెప్పి వెళ్ళిపోతాడు. సి.ఐ. లోపలికి వస్తాడు. సమీర్ ఫోటో చూపించి, ఇతన్ని ఎక్కడైనా చూశారా అని అడుగుతాడు. ఇతనో కాదో చెప్పలేను, కానీ ఇలాంటి వాడ్ని చూసానంటాడు సుందర్. ఎక్కడని సిఐ అడిగితే, బాల్కనీ చివరికి తీసుకువెళ్ళి, ఓ టేబుల్ చూపించి అక్కడ కూర్చుని డ్రింక్ చేసేవాడని చెప్తాడు సుందర్. అతనితో మాట్లాడారా అని ఆయన అడిగితే, ఒకసారి ఆ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు తన ఎదురుగా వచ్చి కూర్చున్నాడనీ, తనలో తాను ఏదో మాట్లాడుకున్నాడనీ, ఓ ముసలి జంట వచ్చి అతన్ని తీసుకెళ్ళిపోయారని చెప్తాడు సుందర్. అతను మళ్ళీ కనిపిస్తే తమకు ఫోన్ చేయమని చెప్పి వెళ్ళిపోతాడు సిఐ. కుర్టోరిమ్ నగరం గురించి మరిన్ని వివరాలు చిత్రకు చెప్తాడు సుందర్. జ్యోతి గీసిన స్కెచ్, సుందర్ చెప్పిన విషయాలు అద్భుతంగా కలిసాయని అంటుంది చిత్ర. ఇక చదవండి.]
[dropcap]మ[/dropcap]రునాడు ఉదయం అలవాటుగా కృష్ణప్రసాద్ గారి తోట వైపు నడుచుకుంటూ వెళ్లాను. నేరం చేసిన వాళ్లని మన వైపు చేర్చుకుని వాళ్ల గురించి తెలిసినా అధికారులకు చెప్పకపోవటం చట్టరీత్యా అపరాధమే! కానీ సమీర్ గురించి నాకు తెలిసిందేమీ లేదు. నిజానికి ఎక్కడుంటున్నాడో తెలియదు. సినీ రంగాన్ని ఒక ఊపు ఊపిన వాడని మటుకు తెలుసు. అసలు ఏ నేరంలో ఇరుక్కున్నాడు? ఎందుకు తప్పించుకుంటున్నాడు?
బాగా ఆలోచించి కిరణ్‍కి ఫోన్ చేశాను. ఆరు సార్లు రింగ్ వెళ్లినా అతను ఎత్తలేదు. ఈ పోలీసులు నాతో మాట్లాడటానికే ఇక్కడికి వచ్చి అంతా తిరిగారా లేక రిసార్ట్స్‌ను కలయ తిరిగి అందులో భాగంగా నన్ను అడిగారా? ఫోన్ మ్రోగింది. కిరణ్ చేస్తున్నాడు.
“హలో!”
“సార్, కాల్ చేసారు?”
“ఊఁ.. చాలా రోజులయింది. ఏంటి సంగతి?”
“కరెక్ట్. ఏదో ఓ రోజు మీరే చేస్తారని తెలుసు!”
“జైలు లోంచి అనే అంచనానా?” చిన్నగా నవ్వాను.
“అయ్యో అదేంటి సార్? కానే కాదు. సమీర్ గురించి మిమ్మల్నీ అడిగారా?”
“అడిగారు. కేవలం కలిసి మాట్లాడానన్నాను. ఇంతకీ నీకు తెలిసిన వివరాలేంటి?”
“పెద్దగా లేవు. పరారీలో ఉన్నట్లు రికార్డ్స్‌లో ఉన్నాయి..”
“ఎందుకు పరారీలో ఉన్నాడు?”
“హత్య కేసులో ఇరుక్కున్నాడు”
“అని నీకున్న సమాచారం. అవునా?”
“అవును. ఇంత స్పెసిఫిక్‌గా, ఏదో కోర్టులో మాట్లాడుతున్నట్లు అంటున్నారు?”
“ఒక పాయింట్ తరువాత ఇదే పద్ధతి.”
“అర్థమైంది సార్.”
“ఎవరి హత్య అన్నది నీకు తెలుసా?”
“నాలుగేళ్ళ క్రితం సారిక ఆత్మహత్య చేసుకున్నట్లు టి.వి.లో చూసి ఉంటారు.”
“చూసాను”
“అమెది ఆత్మహత్య కాదు, హత్య అని ఆరోపణ వచ్చింది. అందులో ఈ పేరు ప్రబలంగా పేర్కొన్నారు.”
“ఓ. కాలం ఎంత చిత్రమైనదో..”
“కరెక్ట్ సార్.”
“ఇద్దరు తారాస్థాయికి చేరుకున్న తారలను ఓ గన్‌తో షూట్ చేసి నేల కూల్చినట్లు చేసింది.”
“కరెక్ట్, మీరక్కడ ఇంకా ఎన్ని రోజులుంటారు సార్?”
“ప్రాజెక్ట్ ముందుకు వెళుతుంది. ఇంకా సమయం ఉంది. నీ దగ్గరికి పోలీసులొచ్చారా?”
“అదేంటి సార్, అలా అడిగేసారు?”
“ఈ సంగతులు ఎలా తెలుస్తున్నాయి?”
“మరోలా అనుకోకండి సార్! మీడియాలో ఉన్నాను. క్రైమ్ రిపోర్ట్స్ చూస్తాం కదా?”
“ఊఁ.. ఏదైనా కీలకమైనవి చెప్పదలచుకుని గబగబా ఫోన్లు నొక్కెయద్దు. వెనకా ముందు.. అర్థమైందా? ఏదో కాల్ వస్తోంది. మరల చేస్తాను.”
ఫోన్ పెట్టేసాను. ఈ కాల్ ఎవరిదో తెలియలేదు. మనకెందుకని పట్టించుకోలేదు. ఆమడ దూరంలో కృష్ణప్రసాద్ గారి తోట – కాదు.. అదొక కోట! ఈ పూలు విరిసిన చోటు మన ఉనికిని గుర్తు చేసే చోటు. ఫోన్ మరల మ్రోగింది. ట్రూ కాలర్ కొద్ది రోజులు వాడి ఎందుకో తీసేసాను. నాలుగడుగులు తోట వైపుకు వేసాక మరల మ్రోగింది. సమీర్ ప్రయత్నం చేస్తున్నాడా? కొత్త నంబరు వాడుతున్నాడా? అదే నిజమైతే ఎవరికో భయపడి ఎందుకు మాట్లాడకూడదు? మాట్లాడినంత మాత్రాన నేను నేరం చేసిన వాడినా? అయినా కన్విక్ట్ అయ్యే ముందు ఎవరూ నేరస్థుడు కాడు.
ఇంతలో మరల మ్రోగింది. చంటి పిల్లవాడు పాలకు ఏడుస్తున్నట్లు మ్రోగుతోంది.. బొటన వేలుతో గ్రీన్‍ను పైకి తోసాను. చెవి దగ్గర పెట్టుకున్నాను. కానీ హలో అనలేదు.
“హలో”, అటు నుండి వినిపించింది. అమ్మాయి గొంతు.
“సార్, నేను జ్యోతిని. ప్లీజ్, కొద్ది సేపు మాట్లాడండి.”
“యస్”
“చిత్ర మీ నంబరు షేర్ చేసింది.”
“ఓకే. ఎలా ఉన్నావు?”
“ఎందుకలా అడుగుతున్నారు?”
అక్కడే ఉన్న ఓ చెంచ్ మీద కూర్చున్నాను.
“ఆ రోజు స్కెచ్ గీసి ఎందుకో కన్నీళ్ల పర్యంతం అయ్యావు. ఏం మాట్లాడాలో నాకే తెలియలేదు. నా పనిలో నేనుండి అలా రాగి శాసనాల వైపు వెళ్లి పోయాను. నిన్న జాగ్రత్తగా చూసుకోమని చిత్రకి చెప్పాను. అది మామూలేనని చిత్ర చెప్పింది.”
“హు. మామూలే. అసాధారణమైనవన్నీ కొందరికి మామూలే! అనుభవించిన వారికి తెలుస్తుంది.”
“..”
“సార్. మీతో చెబితే ఏదైనా పరిష్కారం దొరుకుతుందని చేసాను.”
“అదేమో కానీ నాతో మాట్లాడటం వలన ఉపయోగం ఉండవచ్చు కానీ నష్టమైతే ఉండదు. అది నా నమ్మకం.”
“అందరూ అలా అనుకుంటారా?’
“అర్థం కాలేదు. అలాంటి నమ్మకం అందరికీ ఉంటుందనా?”
“కాదు. మీతో మాట్లాడే వారందరూ ఆ మాట ఒప్పుకుంటారా?”
ఇదేంటి? ఇంత తీవ్రమైన విశ్లేషణ?
“దాదాపుగా! కాకపోతే కొందరి గురించి చెప్పగలను. వాళ్ల గురించి వారికి దురభిప్రాయాలున్నవారికి, ఏదో కాంప్లెక్స్ గల వారికి, లేనివేవో నిరూపించాలనుకునే వారికి నేను చాలా దూరంగా ఉంటాను.”
“లోకంలో ఎక్కువగా వారే కదా? మరి మీరు ఒంటరివారా?”
“అక్కర్లేదు. అలాంటి వారు వారంతట వారే దూరమవుతూ ఉంటారు.”
“మీకు బాధ కలగదా?”
“భయపడటం, బాధ పడటం సుందర్‍కి చేతకాని పనులు.”
“మరి రచనలు ఎలా వేస్తారు? బాధ పడనన్నారు?”
“బాధలు, భయాలు జీవిత సత్యాలు. అని తప్పవు అని చెప్పేందుకు రచనలు చేస్తాను.”
“మసి పూస్తారు.”
ఆలోచించాను. పొద్దున్నే ఈ చర్చ ఏంటి? ఎందుకో నాకూ మంచి మూడ్ వస్తోంది!
“తెల్లని కాన్వాస్ మీద నువ్వు గీసింది బొగ్గు తోనే కదా?”
“సార్! జీవితంలో మొదటి సారి ఈ మాట విన్నాను”
“నాతో ఎందుకు మాట్లాడాలనుకున్నావు?”
“నేను గీసిన బొమ్మ నిజమని తేల్చిన మొదటి వ్యక్తి మీరు. ఈ రోజు వరకూ నా అంతరంగాన్ని అందరూ కల్పన, ఫేక్ అన్నారు. చిత్ర కూడా నన్ను నా కళనీ ఏదో విధంగా వాడుకోవాలని నాతో కలిసి ప్రయాణిస్తోంది.”
“నాకూ వింతగానే ఉంది. ఒక ఎత్తైన ప్రదేశం మీద నుండి పూర్తిగా ఆ లోయ లోకి, అలాగే ఆకాశం మీదికీ చూసి త్రికాలాలనూ కలసి కలబోయగల్గటం ఆశ్చర్యకరమైన విషయం. అది యోగులకే సాధ్యం.”
“కానీ నేను యోగినిని కాను. నా బాధ వేరే!”
నిట్టూర్చాను.
“చెప్పదలచుకుంటే నాకు చెప్పవచ్చు.”
“చెప్పాలనే ఇన్ని సార్లు చేసాను. మీరు ఎత్తలేదు”
“మార్నింగ్ వాక్‌లో ఉన్నాను. ఫరవాలేదు. మాట్లాడవచ్చు.”
“నేను కాగితం మీద నా పేరు జ్యోతి అని వ్రాయాలన్నా ఆలోచిస్తాను.”
“ఎందుకలాగ?”
“కానేమో అనే సందేహం వెంటాడుతుంది. మీరిది దయచేసి మానసిక పరమైన జబ్బు అనుకోవద్దు..”
“నన్ను నమ్మాలి. మొన్న జరిగిన దానిని ఏ మనోవైజ్ఞానికుడూ శాస్త్ర రూపంలో నిర్ధారించలేడు. నీకు ఆ శాసనాల గురించి తెలియదు. నాకు నీ కళ గురించి తెలియదు. కానీ అగ్రహారం అనేది నిజం.”
“అందుకే జీవితంలో నా బాధలన్నీ మీ ఒక్కరితోనే పంచుకోవాలనుకుంటున్నాను.”
“అది నా అదృష్టం అనుకుంటాను.”
“కొన్ని ప్రశ్నలడుగుతాను.”
“నిర్భయంగా”
“నేను డ్రగ్స్ తీసుకునే దానిలా కనిపిస్తానా?”
“నో”
“ముందు తాగి విచ్చలవిడిగా కాలం వెళ్లదీసే దానిలా ఉంటానా?”
“ససేమిరా”
“కామదాహంతో చిల్లర కాగితంలా రోడ్డు మీద ఉన్న దానిలా ఉంటానా?”
“అదేం మాట? ఎందుకలా అనుకుంటావు?”
“ఒక్క మాటలో నేను చెడిపోయిన దానిలా ఉన్నానని అనిపిస్తుందా?”
“జ్యోతీ! జాగ్రత్తగా విను. కొద్ది సేపు క్రితం చెప్పిన ప్రస్తావించిన జీవిత సత్యాలను చెబతాను. నాలుగు పుస్తకాలు చదివేసే ప్రసంగాలు చేసేవారు బుద్ధిజీవులూ కారు, బుద్ధి ఉన్నవారే కాదు. ఏ.సి. ఆశ్రమాలలో కాషాయం కట్టుకుని కోట్లు గడించి కోట్ల మందితో వ్యాపారం చేసేవారు యోగులూ కాదు, భారతీయ తత్వ చింతనకు అధిపతులూ కారు. ప్రకృతితో ఏకమై పరవశించే ఏ ప్రాణి హీనమైనది కాదు, మేధా సంపత్తి నాది అని చెప్పుకునే మానవుడూ పశువు కాడు, అనుకున్న వాడు మేధావీ కాడు! మంచి నీళ్ళు దాహం తీర్చినట్లు ఏ పానీయం తీర్చదు. అనవసరపు ఆలోచనలు వద్దు!”
జ్యోతి గొంతు బొంగురు పోయింది. భావుకురాలై కన్నీళ్ళు కారుస్తోందని అర్థమైంది.
“నేను.. మరల మాట్లాడతాను..”
ఆ మాటలన్న తరువాత ఫోన్ కట్ చెయ్యటానికి ఆ అమ్మాయికి టైమ్ పట్టినట్లు అర్థమైంది.
బరువుగా బెంచ్ మీది నుండి లేచాను. అటు నుండి కృష్ణప్రసాద్ గారు వస్తూ కనిపించారు.
“గుడ్ మార్నింగ్. ఈసారి ఇటు దిగుదాం” అన్నారు. తోట అటు వైపుంటే ఈ రోజు ఇటువైపు క్రిందికి దిగాం. ఇక్కడ చిన్న చిన్న కొలనులలో అందమైన చేపలను పెంచుతున్నారాయన.
“అద్భుతం” అన్నాను.
“ఏంటి?”
“దానిమ్మ రంగులోని ఈ చిన్ని చేపలు మత్తెక్కిస్తున్నాయి.”
“దాని కంటే గొప్ప విషయం చెబుతాను వినండి. ఇవి సిక్లిడ్ చేపలు!”
“అంటే?”
“జాగ్రత్తగా చూడండి. జట్టులోంచి ఓ చేప వేగంగా, ధైర్యంగా దిశ మారుస్తోంది. చూడండి.. దాని వెనుక మిగితావి వచ్చి అనుసరిస్తాయి..”
కృష్ణప్రసాద్ గారు మోకాళ్ల మీదికి వంగి మరీ చూపిస్తున్నారు.
“అదుగో.. అదిగదుగో..”
“వీటిల్లో కూడా హీరోలన్న మాట..”
ఫోన్ మ్రోగింది. కిరణ్ కాల్ చేస్తున్నాడు.
“హలో”
“సార్. మీకు చెప్పాలని చేస్తున్నాను.. గోవా పోలీసులు ఎట్టి పరిస్థితులలో సమీర్‌ను పట్టుకోరు. అతను అక్కడ నిజమైన హీరో..” అన్నాడు.
(ఇంకా ఉంది)