[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[మరునాడు ఉదయం అలవాటుగా కృష్ణప్రసాద్ గారి తోట వైపు నడుచుకుంటూ వెళ్తాడు సుందర్. సమీర్ ఏ నేరంలో ఇరుక్కున్నాడో, ఎందుకు తప్పించుకు తిరుగుతున్నాడో అని అనుకుంటాడు. తన అసిస్టెంట్ కిరణ్‍కి ఫోన్ చేసి కొన్ని వివరాలు తెలుసుకుంటాడు. ఇంతలో అతనికి మరో ఫోన్ వస్తుంది. తెలియని నెంబర్ కావడంతో మాట్లాడడు. కానీ అదే నెంబరు నుంచి మళ్ళీ మళ్ళీ వస్తుండడంతో ఎత్తుతాడు. ఆ ఫోన్ చేస్తున్నది జ్యోతి. దయచేసి కాసేపు మాట్లాడమని అంటుంది. ఆ రోజు ఆమె కళ్ళనీళ్ళ పర్యంతం అవడంతో తనకి ఏం మాట్లాడాలో తెలియలేదని, జ్యోతికి అలా అవడం మామూలేనని చిత్ర చెప్పిందని అంటాడు సుందర్. అనుభవించినవారికే తెలుస్తుందని అంటుంది జ్యోతి. తన సమస్యల గురించి సుందర్‍కి చెబుతుంది. ఆమెకి ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అటుగా వచ్చిన కృష్ణప్రసాద్ గారు సుందర్‍ని కొలను వద్దకి తీసుకువెళ్ళి దానిమ్మ రంగులోని చేపలని చూపించి వాటి గురించి చెప్తారు. కిరణ్ ఫోన్ చేసి, గోవా పోలీసుకు సమీర్‍ను పట్టుకోరనీ, అతను అక్కడ నిజమైన హీరో అని చెప్తాడు. ఇక చదవండి.]
[dropcap]మం[/dropcap]డోవీ నది ప్రక్కగా ఉన్న రోడ్డు మీద ఉదయాన్నే నడుస్తున్నప్పుడు చక్కని అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఆ నదీ జలాలు ఇక్కడి భూమిని చేరి అందరికీ కనువిందు చేస్తూ ఉంటాయి. నీవు నా దానవు, ఈ భూమి మీదనే జన్మించిన దానవు అంటే అవునన్నట్లు చక్కగా తల ఊపి మనతో పాటు కబుర్లు చెబుతూ ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తుంది. బాగుంది కదా అని ఆ నీటిలోకి ఓ స్టీమర్‌లో కూర్చొని అలా సాగిపోతే చివరకు సముద్రం దాకా తీసుకొని పోయి ఇదిగో నేను ఇందులో కలిసి పోతున్నాను, జాగ్రత్తగా చూడండి అన్నట్లు ఉంటుంది. నా అసలు గమ్యస్థానం ఇదీ.. ఏమర్థమైంది? అంటుంది.
నన్ను దాటేసి ఎవరో పరుగు తీస్తూ ఎందుకో ఆగిపోయి నిలబడ్డాడు. టి షర్ట్, షార్ట్స్‌లో ఉన్నాడు. నా వైపు తిరిగి రెండు చేతులో నడుము మీద పెట్టి అలానే చూస్తూ నిలబడ్డాడు. ఎందుకైనా మంచిదని అటూ అటూ చూసాను. పెద్దగా జనం లేరు. ఎందుకు ఈ పిచ్చి ఆలోచనలు అని అనుకుని ముందుకు సాగిపోయాను. అతను అక్కడి దాకా వచ్చే వరకూ అలాగే నిలుచుని ఉన్నాడు.
“గుర్తు పట్టారా?” అడిగాడు.
“మధుకర్ గారి ఇంటి క్రింద..”
“యస్. కార్వాల్లో” అంటూ చేయి ముందుకు చాచాడు.
ఇద్దరం కొద్ది సేపు ముందుకు నడిచాం.
“మాది ప్రైమ్ లొకేషన్ సార్..”, చెప్పాడు. “..మీరు కొద్దిగా జాగ్రత్తగా పెట్టుబడి పెడితే లక్షలు సంపాదించవచ్చు.”
“సార్, నేను ఇక్కడికి వ్యాపారం కోసం రాలేదు”
“అందరూ అలాగే చెబుతారు సార్. చివరికి అందరూ చేసేది వ్యాపారమే. మధుకర్ ఏం చేస్తున్నాడు?”
ఈ మధ్య నేను లౌక్యం నేర్చుకుంటున్నాను.
“ఏం చేస్తున్నాడు?”
“ప్రభుత్వం తరఫున అంత పెద్ద మేడలో స్థిరపడిపోయాడు. ఏవేవో కాగితాలు తెస్తు ఉంటాడు, భూతద్దంలో చూస్తూ ఉంటాడు. ఏంజెలినాని మాట్లాడించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆవిడ మాట్లాడదు. నెలకొక రిపోర్ట్ పంపిస్తాడు. ఓ సారి ముంబయి, ఓ సారి ఢిల్లీ వెళ్లొస్తాడు. తింటాడు, పడుకుంటాడు.”
“అది వ్యాపారం ఎలా అవుతుంది?”
ఆగాడు. నన్ను చూసి చిత్రంగా నవ్వాడు.
“సార్, అదే వ్యాపారం. పురాతనమైన కట్టడానికి కేర్ టేకర్ అయిపోయాడు. చరిత్ర ఎవరికి కావాలి సార్? నేను కోర్టులో కేసు వేసి డబ్బులు ఖర్చు పెట్టి ఓపిగ్గా పోరాడి నా భాగం చిక్కించుకున్నాను. ఇంకొకడైతే పారిపోయి ఏ బార్ లోనే అందరికీ బీరు పొస్తూ కాలం గడిపేవాడు.”
“ఇప్పడం చేస్తున్నారు?”
“మీ లాంటి వాళ్లు బార్ కడితే ఓ మూల కూర్చుని బీరు త్రాగాలనుకుంటున్నాను.”
“ఎవరూ ఎందుకు ముందుకు రావటం లేదు?”
“ఏంజలినా బ్రతికున్నంత వరకూ ఇబ్బందే”
“ఎందుకు?”
“ఆవిడ వయసు ఎవరికీ పూర్తిగా తెలియదు.”
“ఇది విచిత్రంగా ఉంది. ఏంజలినా వయసు తెలియక పోవటానికీ, మీరు మీ భాగంలో వ్యాపారం చెయ్యటానికి ఏంటి సంబంధం?”
“ఆవిడది చాలా పెద్ద చరిత్ర”
“కొద్దిగా చెప్పండి”
“సలౌలి అని ఒక డామ్ ఉంది”
“సలౌలి”
“ఆ డామ్ కట్టినప్పుడు ఒక వింత జరిగింది. దాని క్రింద కొట్టుకుని పోయిన ఒక ఊరు కనిపించింది. ఈ మధుకర్ లాంటి వాళ్ళు వచ్చి ఏవేవో పరిశోధనలు చేసారు.”
అక్కడున్న బెంచ్ మీద కూర్చొన్నాను.
“అక్కడ దొరికిందా? ఏంజలినా?”
నవ్వి ప్రక్కన కూర్చొన్నాడు.
“మేమంటే అందరికీ కామెడీ! నేను పట్టించుకోను. ఏంజలినా అక్కడ దొరకటం కాదు. అక్కడ దొరికిన ప్రతి దాని గురించీ ఆవిడ చాలా చెప్పింది.”
“ఓ”
“అవును. ఇలా పూర్తిగా మాట పడిపోయే వరకూ కూడా ఏదో తెలియని దారిలో భూమి లోపలికి ఆ నది దాటి వెళ్లి రాగలిగే శక్తి ఆవిడకుండేది.”
“మరి ఆవిడంటే భయం ఎందుకు?”
“సార్, ఎవరికైనా ఏదైనా వింత శక్తి ఉంటే వారిని జనం అదోలా చూస్తారు. కొద్దిగా దూరంగా వెళతారు. అవునా కాదా?”
“అవును”
“ఆవిడను జాగ్రత్తగా కాపాడుకొస్తున్నాడు మధుకర్”
“ఆ పెయింటింగులు ఆవిడవా?”
“అవును. మాట పడిపోయాక వెయ్యటం ప్రారంభించింది. డచ్, పోర్చుగీస్, బ్రిటిష్, ఐరిష్ వాళ్ళు కాలానికీ, అంతకు ముందు రాజ్యం ఏలిన కదంబ రాజులకీ మధ్య ఏదైనా చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఏంజలినా ద్వారానే తెలుసుకోవాలి. మరెక్కడా ఆధారాలు లేవు.”
“ఇప్పుడు ఆవిడ ఏమీ చెప్పలేదు కదా?”
“లేదు. మా ఇల్లు గోవా చరిత్రకు అంకితం అయింది”
“మీ ఇల్లంటే?”
“అవును. అది పూర్తిగా మాది. ఏంజలినా నాకు బంధువు. ఆవిడ వైపు నేనొక్కడినే ఉత్తరాధికారిని. నన్ను వెర్రి వాడిని చేసి అంతా ఆక్రమించుకున్నారు.”
“చాలా అన్యాయం.”
“అవును. ఎవరూ అడిగే వాళ్లు లేరు. నేను ఎక్కువ గొడవ చెయ్యకుండా నా మొహాన ఏదో నెలకింత అని పారేస్తూ ఉంటారు.”
“ఎవరు పారేస్తారు?”
చెప్పబోయి ఆగాడు.
“ఎందుకు లెండి. వదిలెయ్యండి.”
ఇద్దరం లేచాం. అలా అదే పనిగా నడచుకుంటూ వెళితే మీరామర్ బీచ్, దాని ముందర కళా ఎకాడమీ.. వాస్తవానికి పన్‌జిమ్ అందమైన నగరం. ఇతర రాష్ట్రాలలోని ముఖ్య పట్టణాలలో ఉండే రద్దీ, కాలుష్యం వంటివి కనిపించవు.
“నేను బాగానే చదువుకున్నాను సార్..” కార్వాల్లో చెబుతున్నాడు. “..సముద్రాన్ని బాగా అధ్యయనం చేసాను. కాలేజీలో ఓషియానాలజీ చదివాను.”
“మీకు పెళ్లయ్యిందా?”
“అంటే?”
“..”
“ఓ.. పెళ్లా? అదో పెద్ద కథ, కాష్యూనట్ కల్టివేషన్‍లో చాలా కాలం గడివేశాను. మాది గోవాలో
పదకొండవ జనరేషన్. మా పై తరం వాళ్లు భూ వివాదాలలో మునిగి తేలి ఒక్కొక్కరూ బ్రిటన్, ఐర్లాండ్ దేశాలలో స్థిరపడుతూ, ఇక్కడినుండి ఒక్కొక్కరినీ అక్కడికి లాక్కుంటూ వలస వెళ్ళిపోయారు. అదే సమయంలో ఒక విధమైన కరువు కూడా మా ప్రాంతాన్ని పీడించింది. నేను ఇంకా ముంబైలో డిప్లొమా చదువుతున్న రోజులవి. ఒక రేకుల ఇంట్లో పదిమంది కుర్రాళ్లం ఉండే వాళ్లం. ఒక రోజు విపరీతంగా వాన కురుస్తోంది. అలాంటప్పుడు మేమందరం ఆ ఇంట్లో మధ్యలో ఏ చాప చుట్టలో దగ్గరవుతూ ఉంటాం. అలా వాన వెలిసే వరకూ జట్టుగా ఉంటాం. అదేదో అనుబంధమో, ఆటో కాదు. పై నుంచి కారుతున్న నీటి నుండి తప్పించుకునే ఏకైక విధానం అది. అలా ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఏదో పాట పాడుతూ ఉంటాం. తలుపు చప్పుడైంది.
తలుపు తెరుచుకునే సరికి ఆ ద్వారం లోంచి జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ ఓ పెద్దాయన తన చంకలో బొద్దుగా కన్నా పిల్లను ఎత్తుకుని లోపలికొచ్చాడు. ఆ పిల్ల తల మీద టోపీ చిత్రంగా ఉంది.
“కార్వాల్లో ఎవరు?” అడిగాడు.
నేను ముందుకొచ్చాను. ఆయన చంకలోంచి ఆ పిల్లను క్రిందికి దింపాడు. ఆ బాగ్ లోంచి ఏవేవో కాగితాలు తీసి కొన్ని తిరిగి లోపల పెట్టి కొన్నింటిని జాగ్రత్తగా భద్రపరిచి ఓ ప్లాస్టిక్ సంచీలో పెట్టి నాకు అందజేసాడు.
“ఏంటివి?” అడిగాను.
ఆయన నడుము మీద చేతులు పెట్టుకుని ఏదో ఆలోచించాడు.
“ఈమె పేరు స్టెల్లా..” చెప్పాడు. ఆ పిల్ల నోట్ల వేలు పెట్టుకుంది.
“అయితే?”
“కొన్ని కోట్లు విలువ చేసే ఆస్తికి వారసురాలు.”
“అయితే?”
“అమాయకురాలు”
“ఓ”
“నీకు చెల్లెలు!”
నేను ఒక్క క్షణం ఆగాను.
“పేరేమన్నారు?”
“స్టెల్లా..”
(ఇంకా ఉంది)