[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[ఒకరోజు సుందర్ రోడ్డు పక్కగా నడుస్తున్నప్పుడు, ఓ వ్యక్తి జాగింగ్ చేస్తూ అతన్ని దాటేసి, కాస్తా దూరంలో ఆగుతాడు. సుందర్ కేసే చూస్తూంటాడు. సుందర్ వచ్చేదాకా అక్కడే ఆగి తనని గుర్తుపట్టారా అని అడుగుతాడు. అతను మధుకర్ ఇంట్లో కింద ఉంటాడని సుందర్ గుర్తుపడతాడు. తన పేరు కార్వాలో అని చెబుతాడతను. తమది ప్రైమ్ లొకేషన్ అనీ, పెట్టుబడి పెడితే లాభాలు తథ్యమని అంటాడు. తాగు గోవాకి వ్యాపారం కోసం రాలేదని అంటాడు సుందర్. అందరూ మొదట అలాగే అంటారనీ, చివరికి అందరూ చేసేది వ్యాపారమే అంటూ మధుకర్ ప్రస్తావన తెస్తాడు. ఈ సందర్భంగా మధుకర్ ఇంట్లో ఉందే పెద్దావిడ ఏంజలినా గురించి చెప్తాడు కార్వాలో. ఆవిడకున్న అద్భుతశక్తుల గురించి చెప్తాడు. తాను ఆవిడకి సమీప బంధువుననీ, తనను మోసం చేసి తన ఇంటిని ఆక్రమించుకున్నారని అంటాడు. తాను ఎక్కువ గొడవ చెయ్యకుండా తన మొహాన ఏదో నెలకింత డబ్బు పారేస్తారని చెప్తాడు. ఎవరు పారేస్తారని సుందర్ అడిగితే, జవాబు చెప్పడు కార్వాలో. తాను ఓషియానాలజీ చదివానని చెప్తాడు. మీకు పెళ్ళయిందా అని సుందర్ అడిగితే, గతంలో జరిగిన ఓ సంఘటన చెప్పి, స్టెల్లా తనకి చెల్లెలి వరుసవుతుందంటాడు. ఇక చదవండి.]
[dropcap]క్రిం[/dropcap]ద లౌంజ్‌లో ఎవరో నా కోసం కూర్చునున్నారని తెలిసి ఉదయాన్నే గబ గబా తయారయి మెట్లు దిగాను. చిత్ర అలా అక్కడ కూర్చోదు. పెద్దగా మర్యాదలు పాటించదు. నేరుగా తలుపు దగ్గరకొచ్చి నిలబడుతుంది. మామూలుగా నాకు కేటాయించిన డ్రైవర్ ఆ రిసెప్షన్ దగ్గర కూర్చునుంటాడు. పేపరు చదువుతూ ఉంటాడు. నన్ను చూడగానే చిత్రంగా నవ్వి లేచి కారు వైపు వెళ్లిపోతాడు. కానీ అతను ఇలా నేను వేచి ఉన్నాను అనే సందేశం పంపడు..
మెట్ల మీద నుండే గమనించాను. మధుకర్ గారు కళ్లు మూసుకుని ఏదో ఆలోచిస్తున్నారు.
“గుడ్ మార్నింగ్”, అన్నాను. కళ్లు తెరచి చిన్నగా తల ఆడించారు.
“ఏం జరిగింది?”, అడిగాను.
“పదండి” అన్నాను.
లేచి నిలబడ్డారు. “అలా విహారానికి వెళదామా?” అడిగారు.
ఇద్దరం బయలుదేరాం. వాతావరణం పొడిగా ఉంది. మా రిసార్ట్స్ దాటి కిలోమీటరు నడిస్తే కృష్ణప్రసాద్ గారి ఉద్యానవనం ఉంటుంది.
“ఏం లేదూ..” అన్నారాయన.
“చెప్పండి. ఊరకరారు మహాత్ములు!”
“మీరు మహాత్ములు”
“అలా కూడానా?”
“అవును”
“ఎలా?”
“చిత్ర కలిసింది”
“ఓ”
“ఊ. తన దగ్గర ఆ అమ్మాయి ఎవరు? జ్యోతి”
“కరెక్ట్”
“ఆమె గీసిన అగ్రహరం బొమ్మ కాన్వాస్ మీద ఉంది.”
“అదొక అద్భుతం సార్”
“సందేహం లేదు. ఇక్కడ మరో అద్భుతం ఉంది”
“చెప్పండి”
“ఆ కాన్వాస్‌ని జాగ్రత్తగా ఏంజలినాకి కనిపించేటట్లు భద్రపరిచాను.”
“ఆవిడ చూసిందా? అసలు చాలా రోజులయింది చూసి. ఆరోగ్యం గానే ఉందా?”
“ఓ. అది చూసినప్పటి నుండి ఆవిడలో వింత కదలికలు ప్రారంభమైనాయి.”
“ఓకే. ఇక్కడేదో ఆలోచించవలసిన అవసరం ఉంది”
“అంతే కాదు. ఆవిడ ఏ అర్ధరాత్రి పూటో అందులో రంగులు నింపుతోంది”
నడుస్తున్న వాడ్ని కాస్తా ఆగిపోయాను.
“నిజం..” అన్నారాయన. “..ఇది నాకూ అర్థం కావటం లేదు. ఏంటి ఇదంతా?”
“మనం ఒక కాలానికి చెందిన వారం కాము.”
ఇద్దరం ఒకళ్ల మొహలొకళ్ళు చూసుకుని ముందుకు సాగిపోయాం.
ఉద్యానవనం గేటు దగ్గిర కృష్ణప్రసాద్ గారు నిలబడి ఉన్నారు. నాకు తెలిసి ఎంత ప్రయత్నం చేసిన, టి షర్ట్ అంత కంటే చిన్న సైజు రాదు. కానీ అయిన అదే తొడుక్కుంటారు.
మధుకర్ గారిని చూసి చేయి కలిపారు.
“కృష్ణ.. పూల బాలకుడిని”
“అంటే?”
“పూల బాలలా పూల బాలకుడ్ని!”
“ఓ. మధుకర్.. భ్రమరాన్ని”
“పదండి. బాగుంది”
“ఎక్కడికి?”
“పూల తోటలోకి”
“శభాష్”
ముగ్గురం లోపలికి నడిచాం.
“మనసనేది ఒక అందాల పూల తోట..” కృష్ణప్రసాద్ గారు అన్నారు.
“ఆలోచనలు పూలలా వికసిస్తాయి!” అన్నాను.
“పుస్తకాలు పుష్పగుచ్ఛాలలా ముందుకు వస్తాయి” మధుకర్ అన్నారు.
“కొన్ని పూలు రాలిపోతాయి”, కృష్ణ అన్నారు.
“కొన్ని తీగలు వాలిపోతాయి” నేనన్నాను.
“కొంత గంధం గాలిలో కలిసి పోతుంది”, మధుకర్ అన్నారు.
నాకు ఎడమ వైపు వరుసగా ఒక చిత్రమైన పువ్వు కనిపిస్తోంది.. ఒక పులి పంజా ఆకారంలో ఉంది. ఎర్రవి, తెల్లవి, చాలా రంగుల్లో ఉన్నాయి. అంతే. నేను ఎక్కడైనా ఆగానంటే కృష్ణప్రసాద్ గారు ఊర్కొరు. అలా లోపలికి లాక్కెళ్లారు.
“ముట్టుకోకండి”, గట్టిగా అన్నారు.
“ఎందుకు?”
“ఆ పువ్వే కాదు. మొక్క యావత్తూ విషమే”
“ఓ. మరి పెంచటం దేనికి?”
“విషంతో చాలా పనుంటుంది..” మధుకర్ అన్నారు,
“..ఇది గ్లోరియాసా లిలీ అనే పువ్వు.”
“అంటే మీకు ఇందులోనూ ప్రవేశం ఉంది”
“కొద్దిగా. కొన్ని వందల సంవత్సరాల క్రితం జంతువులను, మనుషులను కూడా చంపేందుకు దీనిని వాడేవారు.”
“అవును..” కృష్ణప్రసాద్ అందుకున్నారు. “..సార్, దీనిని అగ్నిశిఖ అని కూడా అంటారు. దీని నుండి తయారు చేసే మందు పురుషులలో మగతనాన్ని పెంచుతుంది.”
“మగతనం మరి విషమా?”
దూరంగా ఓ బస్సు వచ్చి ఆగింది. ఏదో కాలేజీ నుండి టారిస్టు బస్సులో వచ్చిన అమ్మయిలు, అబ్బాయిలు గోల చేసుకుంటూ దిగుతున్నారు.
“ఇలాంటి ప్రశ్నలకు చరిత్ర సమాధానాలు చెబుతుంది. నేను కాదు. పాము కాటుకు వాడేరు ఈ మొక్కను. కుష్టు రోగం నయం చేస్తుంది. స్త్రీలలో సంతానోత్పత్తిని పెంచుతుంది. ముఖ్యంగా ఈ పువ్వులు తంత్ర విద్యలో వాడుతారు”
మధుకర్ నవ్వారు.
“మీకో సంగతి చెబితే ఆశ్చర్యపోతారు. ఈ పువ్వుని ఎల్.డి.టి.ఈ వారు వారి సంస్థకి చిహ్నంగా ఎంచుకున్నారు. నైజీరియాలో వాడే బాణాలకు దీనిని గుచ్చి వదులుతారు. గుచ్చుకున్న వాళ్ళు ఇక లేవరు. గర్భిణీ స్త్రీ వాడితే అబార్షన్ అయిపోతుంది!”
“ఇలాంటి పూవు ఇక్కడ పెంచటం దేనికండీ? ఆ పిల్లలెవరైనా కోసుకుంటే..?”
“భయపడకండి. మా వాచ్‍మన్ ఉన్నాడు”
“ఓకే”
మందుకు వెళ్లాం. కృష్ణప్రసాద్ గారు ఉత్సాహంగా సాగిపోతున్నారు. మేమిద్దరం కొద్దిగా వెనకబడ్డాం..
“కదంబ రాజ్యం తంత్రానికి ప్రసిద్ధి..” మధుకర్ చెబుతున్నారు, “..మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. పంచశబ్ద ఉపాసన కుర్టోరిమ్ లోని శాసనంలో చెప్పారు.”
“కరెక్ట్. కానీ ఇంత గొప్ప సంస్కృతి ఎక్కడికో, ఎలాగో జారిపోయింది.”
“అది స్పష్టం. కానీ ఒక ఆలోచన వలన నాకు నిద్ర పట్టదు.”
వెంటనే అక్కడున్న ఓ చక్కని పూవును కోసి ఇచ్చాను.
“ఇది వాసన చూడండి” అన్నాను.
ఆయన దానిని పుచ్చుకున్నాడు.
“మీకు తెలియుకుండానే మంచి పువ్వే చేతిలోకొచ్చింది.”
“ఓ”
“ఇది తలలో అమ్మాయిలు కుడి వైపు పెట్టుకుంటే వివాహానికి సిద్ధం అని అర్ధం. ఎడమవైపు పెట్టుకుంటే వివాహం నిశ్చయమైనదని అర్థం.”
“ఇలా చేతిలో పట్టుకుని తీసుకోమంటే?”
“ఆ పెద్దాయాన్ని అడగాలి!”
కృష్ణప్రసాద్ దూరంగా నిలబడి మమ్మల్నే చూస్తున్నారు.
“పదండి” అంటూ కదిలాం..
పూలలో చాలా ఉంది. ఈ ప్రదేశంలో మనిషి మనుగడ యావత్తూ ఈ పూలలోనే దాగి ఉన్నట్లుంది.
“సమీర్ మరల కలిసాడా?”
ఆలోచించాను.
“లేదు”
“కలిస్తే చెప్పండి”
“అలాగే”
“ఏమీ భయపడక్కర లేదు. కార్వాల్లో ఏదైనా మాట్లాడాడా?”
ఏం మాట్లాడాలో తెలియలేదు.
(ఇంకా ఉంది)