[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[తాను మందారాల గురించి ఆలోచిస్తున్న సమయంలోనే జ్యోతిని వెంటబెట్టుకుని చిత్ర రావటం, డోర్ బయట నిలబడి – మందారం మొక్క ఇంట్లో ఉంటే లోపలికి రాలేనని జ్యోతి అనటం వింతగా తోస్తుంది సుందర్‍కి. ఆ మొక్క ఇంట్లో ఉంటే లోపలికి రావడం కుదరదా అని సుందర్ అడిగితే, కొందరికి ఎలర్జీ చాలా దారుణగా ఉంటుందని చెప్పి, పోనీ క్రిందకి వెళ్లి టీ తాగుతూ మాట్లాడుకుందాం అంటుంది చిత్ర. వాళ్ళు ముగ్గురూ ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటారు. ఆ మాటల సందర్భంగా ఆల్ఫ్రెడ్ నార్త్ వైట్‌హెడ్ రచించిన ‘ప్రాసెస్ అండ్ రియాలిటీ’ పుస్తకంలో వాక్యాలను చెబుతుంది జ్యోతి. మంచి పుస్తకం చదివావు అంటాడు సుందర్. తనని నమ్మని వారిలో మాధవ్ ఒకడని, ప్రస్తుతం జైల్లో ఉన్నాడని చెప్తుంది జ్యోతి. మధుకర్ గావడే గురించి చెబుతూ, అతనే మాధవ్‍ని జైల్లో పెట్టించాడని చెప్తుంది. మధుకర్ గావడే వారానికి రెండుసార్లు మధుకర్ జైలుకి వెళ్లి మాధవ్ చెప్పేవన్నీ వ్రాసుకుంటూ డాక్యుమెంట్ చేస్తున్నాడనీ. త్వరలోనే ఓ సంచలనాత్మకమైన పుస్తకం రాబోతోందని చెప్తుంది జ్యోతి. అవన్నీ నువ్వు చెప్పిన స్కెచ్‌లే కదా అని అడుగుతాడు సుందర్. అవునంటుంది జ్యోతి. సుందర్‍ని చాలా సార్లు తన కలల్లో చూసానని చెప్పి, ఏది ప్రాసెస్, ఏది రియాలిటీ అని ప్రశ్నిస్తుంది. ఇక చదవండి.]
డాఫోడిల్స్ ఆడిటోరియమ్ చాలా అందంగా ఉంది. ఇద్దరు హీరోయిన్లు ఒక హీరోతో లెక్క లేని సినిమాలున్నాయి. నాకు నా సినిమా కూడా కొద్దిగా అలానే అనిపిస్తోంది. నాకు ఎడమ వైపు చిత్ర, కుడి వైపు జ్యోతి కూర్చున్నారు. వీళ్లద్దరూ ఒకరి పక్క ఒకరు కూర్చుంటే – నా దునియాలో నేనుంటే కాలం దాని పని అది చేసుకుని పోయేది. ఎంత ప్రయత్నించినా అలా జరగలేదు.
“మీరు ఏదైనా మాట్లాడితే మా ఇద్దరికి వినపడాలి కదా?” ఇది వాళ్ళ వాదన.
“మామాలుగా ఏదైనా షో ఉన్నప్పుడు నేను పెద్దగా మాట్లాడను” అన్నాను.
“మేము మాట్లాడిస్తాం”, ఏక కంఠంతో అన్నారు.
నాదేం పోయిందని అలా కూర్చున్నాను. ఈ సాయంత్రం ఇక్కడ రెండు కార్యక్రమాలు – ఒకటి సంగీత విభావరి, రెండు, ఒక గోవాలోని నాటకం. ఇది ఎంతో పేరు సంపాదించిన నాటకం అని వినికిడి. నాకు ఎడమ వైపు కూర్చున్న చిత్ర ఈ రోజు చీర బదులు చుడీదార్‌లో ప్రత్యక్షమైంది. దాని గురించి ఏమైనా అంటానేమోనని, అనాలని ఎదురు చూసినట్లు నాకు అనిపించింది. కానీ ఏమీ మాట్లాడలేదు.
జ్యోతి ఎప్పటిలాగే ఓ టీ షర్ట్, జీన్స్‌లో దిగింది. గోవాలాంటి ప్రదేశంలో పాతకాలపు షోలు, నాటకాలు జరుగుతున్న చోటు దాదాపు అరుదనే చెప్పాలి. ఇది అందులో ఒకటి. సమీర్ నాకు ఈ ఆడిటోరియాన్ని గతంలో స్వయంగా చూపించాడు.
“నాటకాలలో పాల్గొన్నారా?” అడిగాను.
“లేదు, చూసాం” అన్నారు ఇద్దరూ.
“ఇంతకీ ఇక్కడికే ఎందుకు తీసుకొని వచ్చారు?” చిత్ర అడిగింది.
“కొంకణి సంస్కృతికి ప్రాణం పోసిన కళాక్షేత్రం ఇది. వేరే ఏ కార్యక్రమాలు ఇక్కడ జరిగినా నెలకి ఒకసారి ఖచ్చితంగా నాటక ప్రదర్శన ఉండటం పరిపాటి.”
తెర మెల్లగా పైకి వేస్తోంది. ఉన్న కొద్ది మంది చప్పట్లు కొడుతున్నారు. మొబైల్ మ్రోగింది.
“హలో?”
“మొత్తానికి మా థియేటర్‍కి వచ్చారు.”
అటూ ఇటూ చూసాను. సమీర్ మాట్లాడుతున్నాడు.
“సార్, ఊళ్ళో పోస్టర్ చూసి వచ్చాను. మీకెలా తెలుసు?”
“హహహ.. అటో అమ్మాయి, ఇటో అమ్మాయి. ఇది బాగుంది. ఏమో అనుకున్నాను. ఎంత సేపు నా లాంటి వాడితో తిరిగితే ఏమొస్తుంది?”
“అయ్యా ఇంతకీ నన్ను ఎక్కడ చూసారు? ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?”
“డాఫోడిల్స్ ఒక థియేటర్ మాత్రమే కాదు. రకరకాల వ్యవస్థలు ఇక్కడున్నాయి.”
“అంటే..”
“ఊ.. ఇక్కడ నా మిత్రుడు రంగులు పులుముకుంటున్నాడు.”
“మిత్రుడంటే..”
“జోవాక్విమ్.. జో”
“ఓ.. అతను ఇంకా ప్రదర్శనలిస్తున్నాడా?”
“ఓ! కింగ్. కళారంగానికే కింగ్. ఊ.. మీరు ఎప్పుడు ఫోన్ పెట్టేస్తారా అని ఆ ఇద్దరమ్మాయిలూ ఎదురు చూస్తున్నారు.”
ఇద్దరినీ చూసాను. ఈయనకెందుకు ఈ బాధ?
“ఇంతకీ హల్లో కెమెరాలున్నాయన్న మాట!’
“ఊ.. షో అయిపోయాక నేను కనిపించను. కొద్దిసేపట్లో వెళ్లిపోతాను. కానీ ఒక్క విషయం చెప్పటానికి కాల్ చేసాను.”
“చెప్పండి.”
“జో ని కలవండి.”
“దేనికి?”
“చాలా విషయాలు తెలుస్తాయి.”
స్టేజ్ మీద పడవ నడుపుతున్నట్లు ఇద్దరమ్మాయిలు అందంగా నాట్యం చేస్తున్నారు. వారి వెనుక సముద్రం లైట్లలో కదులుతోంది. కొంకణి భాషలో ఓ చక్కని పాట..
‘సూరీడు దిగిపోవాలి అంతంత లోన..
నా ఈడు ఆగిపోవాలి ఇంతింత లోన
నీటి కెరటం..
నాటి ఆరాటం
మాటి మాటికి
పోటీ చేసి
సూరీడ దిగిపోవాలి అంతంత లోన..’
జ్యోతి తెలుగులో తర్జుమా చేస్తోంది. చిత్ర కాలి చెప్పుతో తాళం వేస్తోంది.
“ఏదైనా మాట్లాడుతారని విందామని కూర్చున్నాను. ఇలా అయితే నా వల్ల కాదు. వెళ్లి పోతా..” అంటూ కొద్దిగా సద్దుకుంది.
“పాట బాగుంది” అన్నాను.
జ్యోతి పక్కున నవ్వింది..
“ఏం? బాలేదా?”
“కాదు..” చెప్పింది. “..ఏదో మాట్లాడుతారంటే ఇదా?”
“ఓకే. మాట్లాడమంటున్నారు కదా! నేను కొన్ని అడుగుతాను. చెబుతారా?”
“యస్. ఇది బాగుంది.”
“ఆ స్టేజ్‍కి, మనకి ఏంటి అడ్డం?”
“తెర”
“ఆ తెర గురించి ఆలోచించారా?”
“నిజమే. ఒక తెర అడ్డం పట్టుకుని ఓ గొప్ప కళని సృష్టించేసాడు మానవుడు.”
“అవును. ఏమి సాధిద్దామని?”
“మన చుట్టూ ఉన్నదాన్ని ఆలోచింపజేసి అందులో ప్రతిబింబింప జేద్దామని”
“అలా చేసి?”
“సృష్టికి ప్రతిసృష్టి చేద్దామని”, జ్యోతి టక్కున చెప్పింది.
“కానీ ఈ ప్రతిసృష్టి నిజం కాదు కదా?”
“నిజమైన ప్రతిదానినీ అక్కడ పెట్టి కేవలం ఒక తెరను అడ్డం తెచ్చి ఆలోచించమంటున్నాడు”
“ఏది గొప్పది? నాటకమా? తెరా?”
చిత్ర దగ్గింది.
“నాటకమే గొప్పది. తెర లేకపోయినా ఆడవచ్చు.”
“ఆడుకోవచ్చు!” జ్యోతి పలికింది.
“తేడా ఏంటి?”
“జీవితంలో ఎన్నో నాటకాలు మనం ఆడుకుంటున్నాం కదా? ఏ తెర పట్టుకుంటున్నాము?”
“లైట్లు మారుతున్నాయి. చీకటి అవుతోంది. మరల లైట్లు వస్తున్నాయి. తెర లేకపోయిన నాటకం ఉంది.” చిత్ర చెప్పింది.
“నిజమే. కానీ అసలు కళ అనేది కేవలం ఒక తెరతోనే ప్రారంభమైంది. అవునా?”
“అది నిజమే. ఇంతకీ ఈ తెరను పట్టుకున్నారేంటి ఈ రోజు?”
హాలు చీకటైంది. స్టేజ్ మీద ఓ గోళాకారంలో లైటు వెలుగుతోంది. అందులోకి జుట్టంతా విరబోసుకున్న ఓ వయోవృద్ధుడు ప్రవేశించాడు. వెనుక గొడుగు లాంటిది విప్పాడు.
పసుపు పచ్చని పూల రేకులతో ఏర్పడిన గొడుగు అది. జనం విపరీతంగా ఈలలు, చప్పట్లతో అతనికి స్వాగతం పలికారు.
ఇతనే జోఆక్విమ్ లేదా ‘జో’ అని అర్థమైంది. గిటార్ సంగీతం తారాస్థాయికి చేరింది.
అతను ఇంగ్లీషులో చెబుతున్నాడు.
“అందరికే వెలుగు కావాలి. అందరి మీద వెలుగు పడాలి. ఎందుకు?”
నిశ్శబ్దం కమ్ముకుంది. అతనితో పాటు ఆ ఫోకస్ కదలుతూ పోతోంది.
“వెలుగును బలవంతంగా లాక్కొచ్చి బంధించగలనా? లేదు. అలా అని దాన్ని పెంచుతూ పోనా? సూపర్ నోవా సైజుకు లాక్కునిపోనా? అది కొలాప్స్ అయిపోతుంది.”
స్టేజ్ చీకటైంది. సన్నని సంగీతం వినిపిస్తోంది.
“కానీ ఆ కొలాప్స్ అయిన చోట ఒక బ్లాక్‌హోల్ ఏర్పడుతుంది..” అతను చెబుతుండగా ఆ మెరుస్తున్న పసుపుపచ్చని గొడుగు ఒక పువ్వులా విచుకుంటోంది. జనం చప్పట్లు కొడుతున్నారు. అందులోంచి ఓ అందమైన అమ్మాయి నాట్యం చేస్తున్న పోజ్‍లో బయటకి వచ్చింది. జోవాక్విమ్ స్టేజ్ ముందుకు వచ్చాడు.
“అమ్మాయి మీద వెలుగు రేఖలెందుకు? అమ్మాయితోనే నిజమైన వెలుగు. ఈ పువ్వు ఏమిటో తెలుసా? మన ప్రాంతంలో విరబూసే హోర్నా పవ్వు. దీని కొమ్మలను సలాడ్‌లో తింటాం!”
అమ్మాయి ఆ పువ్వులోంచి ఇవతలకి వచ్చి కొన్ని విన్యాసాలు చేసింది.
“అమ్మాయి మీద.. అందమైన అమ్మాయి మీద జాలువారే వెలుగు అందరినీ అలరిస్తుంది. కానీ ఒక్క సంగతి తెలుసా? ఆ వెలుగే ఆ అమ్మాయిని అంతమొందిస్తుంది.”
మెల్లగా ఆ అమ్మాయి అందంగా నడుచుకుంటూ ఆ పువ్వు లోకి వెళ్లిపోయింది. అద్భుతమైన సంగీతం వినిపిస్తుండగా ఆ పువ్వు రేకులు ముడుచుకుపోయాయి.
జోవాక్విమ్ ముందరకి వచ్చాడు..
“మనకి వెలుగునిచ్చే అందమైన అమ్మాయిల మీద – అనర్థాలకు దారితీసే కాంతి ప్రసరిస్తే ఏమవుతుందో తెలుసా? ఈ పువ్వు రేకులు కొన్ని తిని చూడండి..”
ఏదో భూకంపం వచ్చినట్లు శబ్దాలు వినిపించాయి.
“ఏమవుతుంది?” నా ప్రక్కన్న ఇద్దరమ్మాయిలో అడిగారు. ఆడవాళ్లనిపించుకున్నారు.
“ప్రాణాలు గాలిలో తేలిపోతాయి” అన్నాను.
(ఇంకా ఉంది)