పూచే పూల లోన-32

0
2

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[ఆడిటోరియమ్‍లో షో అయిపోయాకా, అందరూ మెల్లగా బయటకు వెళ్లిపోతారు. చిత్ర, జ్యోతి, సుందర్ మాత్రం కూర్చునే ఉంటారు. వెళ్ళిపోదామని చిత్ర అంటే, ఇంకా అసలు షో అవలేదని చెప్తాడు సుందర్. ఏం జరుగుతోందని చిత్ర అడిగితే, భయపడవద్దని అంటాడు. ఇంతలో ఒక పెద్దాయన వచ్చి సార్ రమ్మంటున్నారు అని చెప్తాడు. షోలో ప్రధాన పాత్ర పోషించిన జోవాక్విమ్‍ని చూద్దామని జ్యోతిని, చిత్రని బయల్దేరదీస్తాడు సుందర్. మెట్లు దిగి ఆడిటోరియమ్ క్రిందకి వెళ్తారు. ఒక్కో గది దాటుకుంటూ ఆఫీసు రూమ్‍లోకి వెళ్ళి అక్కడ జోవాక్విమ్‍ను కలుస్తారు. పరిచయాలవుతాయి. మీ పెర్ఫార్మెన్స్ బావుందని చిత్ర జోతో అంటుంది. నాటకం గొప్పదని, జరిగిన దాన్ని ఎన్నో సార్లు రకరకాల పద్ధతులలో అనుభవించి మరల మరల చెప్పవచ్చని అంటాడు జో. కలాన్‌గుటె గొప్ప ఊరనీ, ఇక్కడ తయారైన షిప్పులు శాస్త్రజ్ఞులను విస్మయపరిచాయని, ఎన్నటికీ రస్ట్ పట్టని ఇనుముతో వాటిని ఎలా చేసారన్నది ఎవరికీ తెలియదని అంటాడు. చరిత్రని మన వెనుక నిలబెట్టి మనం ఎలా ఉన్నా, ఇలా ఎందుకున్నామని తాను నాటకంలో చూపిస్తానని చెప్తాడు. సమీర్ చెప్పిన ఓ డైలాగ్‍ని గుర్తు చేసుకుంటాడు జో. వాళ్ళు కూర్చున్న ఆ భవనం ఏ చారిత్రాత్మక భవంతికీ తీసిపోదని చెప్పి, వాళ్ళని బయటకు తీసుకువెళ్తాడు. డాఫోడిల్స్ ఆడిటోరియమ్ నుంచి ఇప్పుడు తాము వెళ్లే చోటుకి ఒక సొరంగం ఉందని చెప్తాడు జో. కొంత దూరం నడిచి ఓ పాత భవనం దగ్గరకి వెళ్తారు నలుగురు. అందరికంటే చివరగా ఉన్న జ్యోతి గట్టిగా కేకలు పెడుతుంది. నన్ను వదిలెయ్యండి అని అరుస్తుంది. ఇక చదవండి.]

[dropcap]కొ[/dropcap]న్ని శతాబ్దాల క్రితం ఇబ్న్ బటూటా వ్రాసిన ఉదంతం ఒకటున్నది. ఒక పురాతనమైన మందిరంలో రెండు మూర్తుల మధ్య ఒక యోగి నిలుచునున్నాడు. ఈ యాత్రికుడు మరి కొందరు సహచరులతో అక్కడ విహరిస్తున్నాడు. ఆ యోగి ఎవరు? అతని పేరేమిటి, ఎక్కడి వాడు అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసాడు బటూటా. అతను మాట్లాడటం పక్కన పెట్టి వీళ్ళ వైపు చూడను కూడా చూడలేదు. అతను మహమ్మదీయుడా లేక హిందువా అని తెలుసుకుందామని దగ్గరగా వెళ్లారు. అతను ఎంతో గట్టిగా అరిచాడు. ఆకాశం లోకి చూశాడు. అంతే. ఎక్కడినుండో ఒక కొబ్బరి బొండం వచ్చి పడింది. వారందరూ దానిని పగలగొట్టు కొబ్బరినీరు త్రాగి కొబ్బరి తిని ఆకలి తీర్చుకున్నారు. గోవాలోని ఈ సాధువు వివరాలు దొరకలేదని బటూటా వ్రాసాడు. కాకపోతే ఆ యోగి బటూటాని వెనక్కు పిలిచి కొన్ని బంగారు నాణాలు ఇచ్చినట్లు చెప్పాడు..

నేనూ, చిత్ర, జోవాక్విమ్ అలా ఆ సన్నని దారి మీద నిలుచుని ఉన్నప్పుడు మా వెనక ఉన్న జ్యోతి పెట్టిన కేకకి అక్కడ భవంతుల గోడ మీద, చెట్ల మీద ఉన్న పావురాలన్నీ ఎగిరిపోయాయి. ఈమె కేకకు కాకపోవచ్చు కానీ అప్పుడే ఓ మెరుపు మెరిసి సన్నగా వాన ప్రారంభమైంది. ఇదంతా బాగానే ఉంది కానీ ఎక్కడి నుండో మెల్లగా జనం పోగయ్యారు. జోవాక్విమ్‌ని, నన్ను అనుమానంగా చూసారు. చిత్ర అక్కడ ఉండటం వలన బ్రతికి పోయాం. అక్కడున్న ఓ దిబ్బ మీద జ్యోతిని కూర్చోపెట్టారు. సమస్య మరొకటి ఎదురైంది. ఎవరో తనని బలాత్కరిస్తున్నట్లు భయపడతూ గింజుకుంటోంది జ్యోతి. తనను తాను చేతులతో కప్పేసుకుంటుంది.

“పోలీసులను పిలుద్దాం” ఎవరో అంటున్నారు.

అటుగా బైకు మీద వెళుతున్న ఓ పెద్ద మనిషి బండి ఆపి దిగి మా వైపుగా వచ్చాడు. జ్యోతి పూనకం వచ్చినదానిలా ఒకటే ఊగిపోతుంది.

“అరె జో..!” అన్నాడు అతను. జో నడుము మీద చేతులు పెట్టుకున్నాడు. అతని వైపుగా చెయ్యి చూపించాడు. జనం కొద్దిగా కదిలారు.

“ఏమైంది?” అడిగాడు.

“మేము నలుగురం కలిసి అదిగో అటువైపు ఆ పాడుపడ్డ బంగళా వైపు వెళుతుండగా ఈ అమ్మాయి కేక పెట్టి వింతగా ప్రవర్తిస్తోంది.”

అతను జేబు లోంచి తాళం చెవులు తీసి చేతిలో పెట్టాడు.

“ఇవి ఫిట్స్ కావు”, ఎవరో అంటున్నారు.

చిత్ర చేతులూ, తల మీద ఒకటే నిమురుతోంది. ఎవరో తనని నిరంతరం వేధిస్తున్నట్లుగా ఒకటే వెక్కి వెక్కి ఏడుస్తోంది జ్యోతి.

“నన్ను విడిచిపెట్టండి”, బేలగా అంటోంది.

“జ్యోతీ.. నేను.. నేను చిత్రని”

“మీరు ఆ బంగళా వైపు ఎందుకు వెళుతున్నారు?”, ఒకడు అడిగాడు.

“ఈయన కళాకారుడు..” చెప్పాను. “..జోవాక్విమ్ డాఫోడిల్స్ ఆడిటోరియమ్‍ నుండి మమ్మల్ని ఏదో చూపించటానికి ఇక్కడికి తెచ్చాడు. ఈమె డాక్యుమెంటరీలు తీసే ఆవిడ, పేరు చిత్ర. నేను రచయితను.”

“అమ్మాయిని అక్కడికి తీసుకెళ్ళి ఏం చేయాలనుకున్నారు?” అడగనే అడిగాడు ఓ మహానుభావుడు.

“ఎలా కనబడుతున్నాం?”, జో అడిగాడు.

“కనిపించడం లేదు, అర్థమవుతోంది.”

“అమ్మాయి నా టీంలోనే ఉంటుంది. ఏదో భయపడి ఇలా మారింది” అన్నాను.

చిత్ర తన బాగ్ లోంచి ఓ కార్డు తీసి వాళ్లకి చూపించింది. ఇంతలోనే బాగా నీరసంగా తయారయి జ్యోతి పూర్తిగా నేల మీదకి జారిపోయి పడిపోయింది. తనలో తాను నత్తగుల్లలా ముడుచుకుని పోయి మూలుగుతోంది. జో అంబులెన్స్‌కి ఫోన్ చేసాడు. జ్యోతి షాక్ తగులుతున్నట్లు కదులుతోంది.

***

కలాన్‌గూటె నుండి పంజిమ్‍కి వచ్చాం. అంబులెన్స్‌లో చిత్ర ఒక్కతే ముందరగా వెళ్లిపోయింది.

ఐసియులో డోర్ ఇవతల మా కోసమే అన్నట్లుగా రెండు కుర్చీలున్నాయి. దీర్ఘంగా నిట్టూర్చి వాటిల్లో కూర్లున్నాం.

“ఎవరీ అమ్మాయి?” జో అడిగాడు.

“పెద్ద కథ..!” చెప్పాను. “..మామూలు మనిషి కాదు. ఏవో దృశ్యాలు చూడగలదు. తన బాధ ఎవరికీ చెప్పుకోలేదు. అద్భుతమైన స్కెచ్‍లు, పెయింటింగులూ వెయ్యగలదు. కాకపోతే ఇలా జరగటం.. నా సమక్షంలో మొదటిసారి.”

జో ఆలోచిస్తున్నాడు.

“దృశ్యాలంటే?”

“మీరనుకుంటున్న డెల్యూజన్స్ కావు?”

“మరి?”

“నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ మానసిక రోగులకుండే వ్యవహారం మటుకు కాదు.”

“ఇది ఆలోచించాలి.”

చిత్ర లోపలి నుండి వచ్చింది. ఈమెను లోపలికి ఏ కారణం చేతనో రానిచ్చినట్లున్నారు. చేతిలో ఏదో కాగితం ఉంది.

“ఇంజెక్షన్స్ కొని తెమ్మన్నారు” అంటూ ఫార్మసీ వైపు వెళ్లిపోయింది.

“ఈమె ఏమవుతుంది ఆ అమ్మయికి?”

“ఏమీ కాదు. కలిసి గోవాలో పరిశోధనలు చేస్తున్నారు.”

“ఇలాంటి సమస్య పెట్టుకుని ఈ పనులెందుకు?”

“అదే విచిత్రం. ఈమె ఈ పరిశోధనలో భాగం!”

జో నవ్వాడు.

“కొన్ని వృత్తులు పిచ్చులతో కూడి ఉంటాయన్నారు”, అన్నాడు.

“నిజమే. ఈ వృత్తి పూర్తి పిచ్చితో కూడినది.”

లోపలి నుండి డాక్టర్ వచ్చాడట. మమ్మల్ని దాటి ఎందుకో ఆగాడు.

“ఈ అమ్మాయి..”

“ఎలా ఉంది ఆమెకు?”, ఇద్దరం లేచాం.

“బాగా వీక్‌గా ఉంది. డెల్యూజన్స్ ఉన్నాయి. ఏవో మాటలు వినిపిస్తున్నాయి, ఏవో కనిపిస్తున్నాయి. ఆయిల్ ఇంజక్షన్స్ ఇచ్చి కొద్ది రోజులు చూస్తాం. ఇలాంటి వాళ్లు మెల్లగా తేరుకుంటారు.”

“సమస్య ఏంటి?”, జో నిలదీసాడు.

“ఇప్పుడు చెప్పలేం, టెలిమెట్రీ పరీక్షలు చేస్తాం. ప్రస్తుతానికి మానసికంగా ఎంతో దీర్ఘమైన బాధలో ఉన్నట్లుంది. ఆందోళన ఏమీ లేదు”, అంటూనే మొబైల్ చూస్తూ వెళ్లిపోయాడు. అటువైపు నుండి చిత్ర వస్తోంది. చేతిలో ఇంజక్షన్ ఉంది.

“డాక్టర్ మాట్లాడారా?” అడిగింది.

“ఊ. డబ్బుల సంగతేంటి?” అడిగాను.

చిత్ర అటూ ఇటూ చూసింది.

“ఈమె నాతో ఉంది. నా బాధ్యత కదా?”

జో ముందరికి వచ్చాడు.

“కాదు..!” అన్నాడు. “..నేను తీసుకెళుతుందిగా జరిగింది. మొత్తం వైద్యం నా బాధ్యత” అన్నాడు.

చిత్ర ఆగమని చెప్పి లోపలికెళ్లి ఇంజక్షన్ సిస్టర్‌కి అప్పజెప్పి తిరిగి వచ్చింది.

“ఏమన్నారు?” అడిగింది.

“అంటే ఇది.. నేను భరిస్తాను.”

“ఎన్ని రోజులు?”

“ఎన్ని రోజులైనా?”

“డిస్‌ఛార్జ్ అయ్యాక?”

జో నన్ను వింతగా చూసాడు.

“అంటే? ఆస్పత్రి నుండి ఇవతలకి వచ్చాక కూడా ఒకవేళ వైద్యం ఉంటే అదీ చూద్దాం.”

చిత్ర అక్కడ వెనక ఉన్న కిటికీకి ఆనుకుని చేతులు కట్టుకుంది.

“జోవాక్విమ్ గారూ, సూటిగా ఓ ప్రశ్న వేస్తాను.”

“యస్?!”

“వైద్యం అంటే?”

“మీరేదో చెప్పాలనుకుంటున్నారు?”

“అవును. ఇది నయమయ్యే జబ్బు కాదు. అసలు నిజానికి ఇది జబ్బు కూడా కాదు.”

“మై గాడ్. మరేంటి?”

“ఇదొక ప్రక్రియ. ఇక్కడ ఇలా మాట్లాడితే మనల్ని బైటకి పొమ్మటారు..”

సిస్టర్ బయటికి వచ్చింది. చిత్రని లోపలికి తీసుకెళ్లింది.

నేను జోని వెంటపెట్టుకుని ఐసియు నుండి ఇవతలకి వచ్చాను.

“మీకెందుకండీ ఈ శ్రమ?” అడిగాను.

జో తన జులపాలు విదిలించాడు.

“నాకు అర్థం కావటం లేదు” అన్నాడు.

నేనేదో చెప్పబోతుంటే చెయ్యి అడ్డు పెట్టాడు.

“సార్, ఇది నిజంగానే జబ్బు కాదు. నాకు అర్థం కాకపోవటంలో ఆ సత్యం దాగి ఉంది.”

“ఏంటది?”

“మనం ఇంకా ఆ భవనం లోకి వెళ్లలేదు. ఈ అమ్మాయి ఆ భవనంలోనివి చూడలేదు. కానీ అక్కడ జరిగిన వాటిని అనుభవించి అలా పడిపోయింది!”

దూరంగా సూర్యాస్తమయం అవుతోంది. జో జులపాలు బ్రౌన్ రంగులో మెరుస్తున్నాయి. ఆ ఆస్పత్రి బయట సూర్య రశ్మి అతని జుట్టు మీద మరింత వింతగా మెరుస్తోంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here