పూచే పూల లోన-33

0
2

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[జోవాక్విమ్ వెంట వెడుతున్నప్పుడు వెనుకగా ఉన్న జ్యోతి పెట్టిన కేకకు అక్కడున్న పావురాలన్నీ ఎగిరిపోతాయి. ఓ మెరుపు మెరిసి సన్నగా వాన ప్రారంభమవుతుంది. ఇంతలో అక్కడ జనమ్ పోగయి, జోవాక్విమ్‍ను, సుందర్‍ను అనుమానంగా చూస్తారు. ఒక పక్క ఎవరో తనని బలాత్కరిస్తున్నట్లు భయపడతూ గింజుకుంటుంది జ్యోతి. పోలీసులని పిలుద్దామని ఒకరంటారు. ఇంతలో అటుగా బైకు మీద వెళ్తున్న ఓ వ్యక్తి ఆగి జో ని పలకరించి ఏమైందని అడుగుతాడు. జరిగినది చెప్తాడు జో. ఆ బంగళా వైపు ఎందుకు వెళుతున్నారని మరొకరు అడుగుతారు. జో కళాకారుడనీ, తానో రచయితననీ, చిత్ర డాక్యుమెంటరీ మేకరనీ చెప్తాడు సుందర్. అమ్మాయిని అక్కడికి తీసుకెళ్ళి ఏం చేయాలనుకున్నారని అడుగుతాడింకో వ్యక్తి.  చిత్ర తన బ్యాగ్ లోంచి ఓ కార్డు తీసి వారి చూపిస్తుంది. ఇంతలో బాలా అలసిపోయిన జ్యోతి నేలమీదకు వాలిపోతుంది. జో అంబులెన్సుకు ఫోన్ చేస్తాడు. అంబులెన్సులో చిత్ర కూడా పంజిమ్ వెడుతుంది. ఆసుపత్రిలో ఐసియు బయట ఉన్న కుర్చీల్లో కూర్చుని మాట్లాడుకుంటారు సుందర్, జో. ఆ అమ్మాయికి ఏమైందని జో అడిగితే, జ్యోతికి దృశ్యాలు కనబడతాయని చెప్తాడు సుందర్. లోపలి నుంచి బయటకి వచ్చిన డాక్టర్‍ని చూసి ఎలా ఉందామెకు అని అడిగితే, చాలా వీక్‍గా ఉందని, డెల్యూజన్స్ ఉన్నాయని అంటాడాయన. జ్యోతి కోసం ఇంజక్షన్ కొనుక్కుని వస్తుంది చిత్ర. తన వల్లే ఆమెకిలా అయింది కాబట్టి వైద్యం ఖర్చులు తాను భరిస్తానంటాడు జో.  అసలు అది నయమయ్యే జబ్బు కాదని చెప్పి చిత్ర లోపలికి వెళ్ళిపోతుంది. తనకి అర్థం కావడం లేదంటాడు జో. ఆ భవనంలోకి వెళ్ళకపోయినా, అక్కడ జరిగినవాటిని అనుభవించి అలా పడిపోయిందని జో అంటాడు. ఇక చదవండి.]

[dropcap]జో[/dropcap]వాక్విమ్ ఎందుకో ఆలోచనలో పడ్డాడు. పన్‌జిమ్ లోని ఆ ఆస్పత్రికి దగ్గరగా ఓ కేఫ్‍లో కూర్చున్నాం.

“మీ గురించి సమీర్ చెప్పాడు.” అన్నాడు.

“సమీర్ కేవలం ఒక సినీ స్టార్ అనుకున్నాను. కానీ కాడు. అతను చరిత్రను మోస్తున్నాడో లేక చరిత్రతో పాటు ప్రయాణం చేస్తున్నాడో తెలియదు కానీ మొత్తానికి అతన్ని బాగా శోధించి తెలుసుకోవలసింది చాలా ఉంది.”

“మీ గురించీ కొన్ని చిత్రమైన మాటలు చెప్పాడు.”

“ఏంటవి?”

“ఎక్కువ మాట్లాడరు కానీ మాట్లాడినవి ఎంతో ఆలోచింప చేస్తాయి అని అన్నాడు”.

“గోవా నన్ను కదిలించింది.”

జో సిగరెట్ తీసి జాగ్రత్తగా ముట్టించాడు.

“ఎందుకని?” అడిగాడు.

“దాదాపు నాలుగు శతాబ్దాలు పోర్చుగీస్ ఆధీనంలో ఉన్నా, భౌగోళికంగా సహ్యాద్రి పర్వతాల వలన భారతదేశానికి దూరంగా ఉన్నట్లున్నా, భారతీయులుగా ఉంటునే విలక్షణంగా కనిపిస్తారు.”

“మహరాష్ట్రలో కలవాలా వద్దా అన్నప్పుడు ఈ ప్రాంతం వారు ఒక ప్లెబిసైట్ ద్వారా వద్దని వారి అస్తిత్వాన్ని కాపాడుకున్నారు.”

“కరెక్ట్. మతపరంగా..”

జో చేయి అడ్డుపెట్టాడు.

“మతం కంటే మా ఆస్తిత్వం ప్రధానం. దేశంలోని ఇతర ప్రాంతాలలా కాదు. ఇక్కడ అన్ని మతాల వారినీ చక్కగా ఆదరిస్తాం.”

“చాలా మంచి అలవాటు. దానికి ఏదైనా ప్రధానమైన కారణం ఉన్నదా?”

“ఇప్పుడు చెప్పినదే. నాకు మతం కంటే ఈ ఆస్తిత్వం ప్రధానం.”

“అస్తిత్వం అనేది మతం వలన ఎక్కువగా ఏర్పడతుందంటే?”

“అది మాయ సార్. మనం ఎక్కడి నుండి వచ్చామో తెలియక పోయినా, అమాయకంగానైనా ఒక మంచి మనిషిలా బ్రతకలేమా?”

“మీరెక్కడి నుంచి వచ్చారు?”

“తెలియదు. కానీ చాలా మంచివాడిని!”

ఇద్దరం విరగబడి నవ్వుకున్నాం. చాలా మంది ఈ ప్రాంతపు ప్రజలను బద్దకస్తులుగా వర్ణిస్తారు. అది నిజం కాదు. ఒక లైఫ్ స్టైల్ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఏదేదో సంపాదించి, ఏదో చదివి కోట్లు గడించాలని ఎవరికీ ఉండదనిపిస్తుంది. కావలసినది ఆర్జించుకుని తృప్తిగా ఓ గ్లాసు తాగి విశ్రాంతి తీసుకుంటారా! ఏమో. ఇక్కడి ప్రశాంతతను చూస్తే హాయిగా ధ్యానం చేసుకోవాలనిపిస్తుంది.

“నా పేరే చిత్రమైనది..” జో చెప్పాడు. “..సమయానికి రంగంలోకి దిగి కాపాడేవాడు అని అర్థం. నా బాల్యం గురించి గుర్తున్న మేరకు చెప్పగలను. చెట్ల మాటున, పుట్లు మాటున పెరిగాను. ఎవరైనా పిలిచి ఏదైనా తెచ్చి పెట్టమంటే ఎక్కకైనా వెళ్లి అది తెచ్చేవాడిని. ఓ రోజు ఒక వైద్యుడు, బాగా మసలివాడు నన్ను ఇంటికి తీసుకెళ్లి పెండుకుళి పూలు కావాలి అని దాని బొమ్మ చూపించారు. ఊరంతా తిరిగి చివరకి అడవిలోకి వెళ్లాను. మామూలుగా ఇళ్లల్లోనూ, గార్డెన్లలోనూ దొరుకుతాయి. కానీ నాకు ఆయన ప్రత్యేకంగా మూడు రంగుల పూలే కాదు, వాటి కాడలు కూడా కావాలన్నాడు. పింక్ కలర్లోవి, ఎరుపు రంగులోని దొరుకుతున్నాయి. తెలుపు రంగులోని మటుకు ఎంత ప్రయత్నించినా దొరకలేదు. బాగా చీకటి వేరే సమయానికి నాతో ఎప్పుడూ ఉండే కుక్క, దాని పిల్ల నన్ను ఏ అడవిలోకో లాక్కెళ్లాయి. వాటికి నా మనస్సులోని మాటలు ఎలా తెలుసో అర్థం కాలేదు, అక్కడ టైడల్ నది అంచున వరుసగా ఈ పూలే.

గబుక్కున కోసుకుని దాదాపు అర్ధరాత్రి ఆ వైద్యుని వద్దకు చేరాను. అన్నింటినీ పరిశీలించి చూసాడు. నన్ను ప్రేమగా చూసాడు. తల నిమిరాడు. తన గదిలోకి వెళ్లి మందు తయారు చేసాడు. ఈ పువ్వు, దాని కాడలు, మాలాలు కలిపి ఒక రకమైన జ్యూస్ చేసి మందుగా వాడతారు. మర్నాడు ఉదయం నాలుగున్నరకే నన్ను లేపి ఒకరింటికి వెళ్ళి దాన్ని ఇమ్మని దారి చూపించాడు. నా కుక్కలు నన్ను అంటిపెట్టి ఉండగా అలా ఆ బంగళా వద్దకెళ్లి గేటు దగ్గర నిలుచున్నాను. కానీ లోపలున్న పెంపుడు కుక్కలు వీటిని చూసి అరుస్తున్నాయి. ఇవే నాలాగే వాటిని అస్సలు పట్టించుకోవటం లేదు. పైన ఓ గదిలో వైటు వెలిగింది.

బాగా ఒడ్డూపొడుగూ ఉన్న ఆ మనిషి గేటు దగ్గర కొచ్చాడు.

‘ఏం కావాలి?’ అడిగాడు.

‘సాయాజీ ఇచ్చారు’ అంటూ దానిని చేతికిచ్చాను.

చేతిలోకి తీసుకుని ఓ సారి వెనక్కి తిరిగి చుట్టూతా ఎందుకో చూసాడు.

‘వెళ్ళు’ అన్నాడు.

ఏ రోజూ ఎవరి దగ్గరా ఏదీ ఆశించలేదు. వెనక్కి తిరిగి నాలుగడుగులు వేసాను. బంగళాలో లైటు అరిపోయింది. మరో నాలుగడుగులు వేసాకా ఒక టార్చ్ వైట్ తాలూకు కాంతి నా దగ్గర కదులుతోంది. ఆగాను. ఒక బిస్కెట్ పాకెట్ వచ్చి పడింది. కుక్క దాన్ని నోటితో కరచుకుని తెచ్చి అందించింది. మరల చీకటైపోయింది.

ఇలా పలు చోట్లకి మందులందిస్తూ గడిపాను. ఆ మందులేమిటో, అవి ఏ రోగానికో నాకు తెలియదు. పూలు ఎందుకు పూస్తాయో తెలియదు, ఎవరి కోసం పూస్తాయో తెలియదు. ఒక రోజు సాయాజీ గారింటి వరండాలో పడుకుని ఉండగా ఇద్దరు మనుషులు చెరో రెక్కా పట్టుకుని లాక్కుని పోయారు. ఒక జీప్ ఎక్కించుకుని ఎక్కడికో తీసుకువెడుతున్నారు. నా చిరకాల మిత్రులైన కుక్కలు చాలా దూరం ఓపికున్నంత వరకు అరుస్తూ వెంబడించాయి. తరువాత మాయమైపోయాయి. ఒక పాడబడ్డ ఇంటి ముందు బండి ఆగింది.

నన్ను దాదాపు లోపలికి ఈడ్చుకుని వెళ్ళారు. అక్కడ కుర్చీలో ఒకరిని కట్టిపడేశారు. దెబ్బలు తిన్నట్లున్నాడు. కళ్ళు మూసుకుని ఉన్నాడు. నా తలను అతని వైపు తిప్పారు.

‘గుర్తు పడతావా?’, అడిగాడు నన్ను పట్టుకున్నవాడు. నాకు అర్థం కాలేదు, గుర్తు రాలేదు. మరో లైటు వేసారు.

‘ఇప్పుడు చూడు.’

‘అవును..’ చెప్పాను. ‘..ఈయనకు సాయాజీ గారి మందు ఇచ్చాను.’

‘ఎన్నాళ్ళైంది?’

‘ఆరు నెలలు కావచ్చు.’

‘ఏం మందిచ్చావో చెప్పగలవా?’

కళ్ళు మూసుకున్నాను. ఆ ముగ్గురు మనుషులు నన్ను అక్కడున్న ఇనప కుర్చీ మీద కూర్చోబెట్టారు.

‘బాగా గుర్తు తెచ్చుకో.’

‘సాయాజీ గారిని అడగండి.’ అన్నాను. వాళ్ళు నవ్వుకున్నారు.

‘బాబూ..’, మృదువుగా అడిగారు, ‘..నువ్వు ఆయనకి పూలు కోసి తెస్తావట గదా?’

‘అవును.’

‘ఆ రోజు ఏ పూలు తెచ్చావు?’

గుండెలో రాయి పడింది. ఇదా సంగతి? వైద్యం తాలూకూ రహస్యం లాగాలని తెచ్చారా?

‘గుర్తు రావటం లేదు.’

‘తొందర లేదు. మెల్లగా ఆలోచించు. మామూలుగా ఏ పూలు కోసుకొస్తూ ఉంటావో జాగ్రత్తగా గుర్తుతెచ్చుకో.’

కుర్చీ లోని మనిషి కదులుతున్నాడు. సన్నగా మూలిగాడు..

‘ఊ. గుర్తు చేసుకో. నీకు కష్టం కాదు’, నా తల నిమురుతున్నారు.

‘ఇక్కడ దాదాపు అన్నీ అన్ని పూల కొస్తాను’, అన్నాను.

‘కాదు బుజ్జీ.. ఇతనికి మందు ఇచ్చినప్పుడు ఆ రోజు, లేదా క్రిందటి రోజు ఈ పూలు కోసావు? గుర్తు తెచ్చుకో.’

ఆలోచించాను. గుర్తు రానట్లు నటిస్తున్నాను. కానీ నాకు గుర్తుంది. అది పెండుకుళి – అడివిలో దీపం అంటారు దానిని. వీళ్లకి ఎందుకు చెప్పాలి! సాయాజీ గారిని ఇబ్బంది పెట్టటం తప్పు కదా? ఇలా జబర్దస్తీగా చెప్పిస్తున్నారంటే ఏదో కుట్ర ఉంది. ఆ మాత్రం తెలివితేటలు లేనివాడిని కాను. ఎక్కువ నన్ను బలవంతం పెడితే వేరే ఏదో చెప్పాలని నిర్ణయించాను. ఐదో లెక్క వేస్తున్నట్లు నటించాను.

‘ఆ మందు వలన ఈయనకేమైంది?’ కావాలని అమాయకంగా అడిగాను.

‘ఏదీ కాలేదు, అదే నా బాధ’ అన్నాడ గడ్డం వాడు.

‘ఇంతకీ గుర్తొచ్చిందా?’

మరల ఆలోచనలో పడ్డాను. సాయాజీ గారు ఏమిచ్చారు? ఏంటి ఈ గోల! ఈ రకంగా ఆలోచిస్తే వీళ్లు ఖచ్చితంగా నన్ను వదిలేటట్లు లేరు.

‘ఆప్టా పత్రాలు!’ అన్నాను.

‘బుజ్జీ, డ్రామాలాడకు. అది దసరా సమయం కాదు. కరెక్టుగా చెప్పు.’

కుర్చీలో ఉన్న మనిషి కళ్ళు తెరిచాడు.

‘నేను చెబుతాను.’ అన్నాడు. వాళ్లు అతనికి దగ్గరగా వెళ్లారు.

‘ఆ కుర్రాడిని వదిలెయ్యండి’, దాదాపు అరచినంత పని చేసాడు.

`నిజం చెబుతావా?’ అడిగారు.

‘నిజమే చెబుతాను. కావాలంటే సాయాజీ గారి దగ్గర నిర్ధారించుకోండి.’

‘ఆ ముసలాయన జోలికి మేము వెళ్ళం. ఆయనతో మాకు వేరే పనులున్నాయి. నువ్వు చెప్పు.’

‘కట్లు విప్పు.’

వాళ్లు ఒకళ్ల మొహలొకరు చూసుకున్నారు. ఒకడు వెళ్లి మెల్లగా కట్లు విప్పాడు.

ఆ మనిషి ఒళ్లు విరుచుకున్నాడు.

‘పెండుకుళి, ఎరుపు, పింకు, తెలుపు.. కాకపోతే, వాటిని ఎలా కలపాలో నాకు తెలియదు’

‘దాని సంగతి మాకు వదిలెయ్. అది పుచ్చుకున్నాక నీకు ఎలా ఉంది? నువ్వసలు ఎందుకు పుచ్చుకున్నావు?’

‘మనిషి ఎలా పుడతాడో తెలుసా?’, అతను ఎందుకో నవ్వుతూ అడిగాడు.

‘ఒక ఆడ, ఒక మగ కలవాలి’

‘ఆ ఇద్దరికీ గల ప్లస్సూ, మైనస్సూ దాటి ఈ పుట్టినవాడు బ్రతకగలడా?’

‘…..’

‘ఒక రోగానికి నువ్వు జీవితాంతం భయపడి బ్రతికి దానిని అధిగమించిన తరువాత నువ్వు మరో మనిషివవుతావు.’

‘ఒకరితో సంగమింప చేసి ప్రాణాంతకమైన రోగాన్ని కట్టబెట్టిన తరువాత నువ్వేమవుతావు?’

‘ఏకంగా మృత్యువునే కోరుకుంటావు!’

నేను చేతులు కట్టుకుని ఓ మూల నిలుచున్నాను. అతనికి ఎవరో ఓ గ్లాసు అందించాడు.

ఇంకెవరో అందులో ఏదో పోసారు.

గడ గడా త్రాగి వికటాట్టహసం చేసాడు.

‘ఆ రోగాన్ని కూడా తట్టుకుని నిలబడగలిగితే దేనిని కోరుకుంటాడు?’

‘…..’

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here