పూచే పూల లోన-34

0
2

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[ఆస్పత్రికి దగ్గరగా ఓ కేఫ్‍లో కూర్చుని మాట్లాడుకుంటూంటారు జో, సుందర్. గోవావాసులు భారతీయులుగా ఉంటూనే విలక్షణంగా ఉంటారని సుందర్ అంటాడు. మహరాష్ట్రలో కలవాలా వద్ద అన్న చర్చ వచ్చినప్పుడు ఒక ప్లెబిసైట్ ద్వారా వద్దని తెలిపి తమ అస్తిత్వాన్ని కాపాడుకున్నామని చెప్తాడు జో. తానెక్కడి నుంచో వచ్చానో తెలియకపోయినా తాను మంచివాడిని అంటాడు జో. తన గురించి చెప్పడం మొదలుపెడతాడు. తన పేరుకి అర్థం సమయానికి రంగంలోకి దిగి కాపాడేవాడు అని చెప్తాడు. చెట్ల మాటున, పుట్లు మాటున పెరిగాననీ, ఎవరైనా పిలిచి ఏదైనా తెచ్చి పెట్టమంటే ఎక్కకైనా వెళ్లి అది తెచ్చేవాడినని చెప్తాడు. ఓ రోజు ఒక ముసలి వైద్యుడు, ఇంటికి తీసుకెళ్లి పెండుకుళి పూల బొమ్మ చూపించి – మూడు రంగులవి కాడలతో సహా కావాలని అడుగుతాడు. గులాబీ, ఎరుపు రంగుల పూలు దొరుకుతాయి, కానీ తెల్లవి దొరకవు. జో తో ఉండే కుక్క అతన్ని అడవిలోకి తీసుకువెళ్ళి ఆ తెల్ల పూలున్న చోటుని చూపిస్తుంది. కోసుకుని వెళ్ళీ వైద్యుడికిస్తాడు. ఆయన వాటితో మందు తయారు చేసి, ఓ వ్యక్తికి ఇచ్చిరమ్మని పంపుతాడు. అలా జో, సాయాజీ అనే ఆ వైద్యుడికి కావల్సిన పూలు తెచ్చిస్తూంటాడు. ఓసారి ఇద్దరు వ్యక్తులు వచ్చి, జో ని జీపులో ఎక్కించుకుని ఓ పాడుబడిన బంగ్లాకి తీసుకెళతారు. అక్కడ ఓ వ్యక్తిని కుర్చీకి కట్టేసి ఉంటారు. అతన్ని గుర్తుపట్టావా అని జో ని అడుగుతారు. మొదట లేదంటాడు జో. ఇంకో లైట్ వేసి సరిగ్గా చూసి చెప్పమంటారు. అతనికి తాను సాయాజీ గారి మందు ఇచ్చానని చెప్తాడు జో. ఎన్నాళ్ళ క్రితం అంటే, ఆరు నెలలయిందంటాడు జో. ఏం మందు అంటే తనకి తెలియదని, సాయాజీనే అడగమని అంటాడు. నువ్వు ఆయనకి పూలు కోసి తెస్తావట గదా, ఆ రోజేం పూలు కోసిచ్చావో చెప్పమని అడుగుతారు. మొదట ఏదో పువ్వు పేరు చెప్పి తప్పించుకోవాలని చూస్తాడు జో. వాళ్ళు నిజం చెప్పమని ఒత్తిడి చేస్తుంటే, కుర్చీలో కట్టేసి ఉన్న అతనే చెప్పేస్తాడు తనకి ఏ పూలతో మందు చేసి ఇచ్చారో. ఆ గుండాలు అతనికి ఏదో ద్రావకం ఇచ్చి బలవంతంగా తాగిస్తారు. ఇక చదవండి.]

[dropcap]జో[/dropcap]వాక్విమ్ సామాన్యుడు కాడని అర్థమైంది. అతని బైక్ మీద కూర్చున్నాను.

“పెండుకుళి గురించి ఇంకా తెలుసుకోవాలనుంది” చెప్పాను.

“చాలా సింపుల్..”, అతను చెబుతూ వెళుతున్నాడు, “నిజానికి ఆ గూండాల వలన నాకు చాలా విషయాలు తెలిసాయి, పట్టుదలతో సాయాజీ గారి దగ్గర అన్నీ నేర్చుకున్నాను.”

“ఇంతకీ ఆ గూండాల బాధ ఏంటి?”

గట్టిగా నవ్వాడు.

“మేము ఏ మందు ఎవరికి ఇచ్చామో ఆధారం కోసం వాళ్ళు వెతికారు. అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారికి సంక్రమించే వ్యాధికి రుజువు ఈ మందు! కానీ అక్కడ కట్టి పడేసిన వ్యక్తి సామాన్యుడు కాడు. పెండుకుళికి మరో ఆకు కలిపి సాయాజీ గారి దగ్గర ఓ మందు తయారు చేసుకుని వాడేవాడు.”

“మరో రోగం కూడా ఉన్నదన్నమాట!’

“కాదు. ఎంత అనైతికంగా శారీరిక సంబంధాలు పెట్టుకున్నప్పుటకీ ఏ సమస్యా రాకుండా ముందుగానే జాగ్రత్త పడ్డాడు.”

“పెండుకుళి ప్రభావం.”

“కరెక్ట్. అంతేకాదు, మరో విన్యాసం ఉంది. చాలా కాలం క్రితం మీరు విషకన్యల గురించి విని ఉంటారు.”

“అవును. వాళ్లు విషంతోనే బ్రతికి చివరికి గొప్ప అందగత్తెలుగా మారి వారితో సంగమించిన వారిని కేవలం సంగమం ద్వారా చంపేసేవారు.”

“ఇక్కడ దానిని మించిన వ్యవహారం ఉన్నది.”

జో అలా బైక్ నడపుతుంటే ఆ అడవుల మీదుగా వేస్తున్న గాలి అల్లరి పెడుతోంది. అసలు మనిషికి ఏం కావాలి?

జీవించి ఉన్నందుకు జీవితాన్ని ఒక ఉత్సవంగా జరుపుకోలేరా? ఓ రచయిత ‘సెక్స్ ఈజ్ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్’ అన్నాడు. నిజమా? ఎంత మోతాదులో? ఎందుకో ఆలోచనలు తీస్తున్నాయి. ధనవంతులైనా, కీర్తిమంతువైనా, రాజులైనా, మహరాజులైనా ఎక్కడికి వచ్చి ఆగారు? కేవలం కామవాంఛ దగ్గర. ఈ ప్రక్రియ మానవాళిని బ్రతికించిందా? అంతమొనర్చిందా? ఇదే ప్రక్రియలోకి మతపరమైనవి కూడా దూరిపోవటం  ఆలోచించవలసిన మరో విషయం. విచ్చలవిడి జీవితానికి ఒక అంకుశంలా పని చేయవలసినది ఒక మతపరమైన ధార్మిక జీవితం. అదే విచ్చలవిడితనాన్ని మరి కాస్త పెంచుకుని అందరినీ భయపెట్టి పశువుల్లా జీవించేందుకై ఒక జాతి మీద ఒక మతాన్ని రుద్దిన వారిని ఏమనాలి?

జో చెబుతున్నాడు.

“అమితమైన కామవాంఛ ఉన్నవాళ్ళు అలా ఈ కొన్ని పూలకు సంబంధించిన కాడలు, గింజలు కలిపి తగు మోతాదులో సేవించినప్పుడు వారితో – మగవారితో సంగమించిన ఏ యువతీ మరో మగవాడి వద్దకు పోదన్నది కొందరి విశ్వాసం, సాయాజీ గారు కూడా ఆ విషయాన్ని నిర్ధారించారు. ఆ రోజు అక్కడ కట్టేసి ఉంచిన వ్యక్తి ఆ విధంగా తనను తాను మార్చుకున్నాడు. కనిపించిన ప్రతి సుందరాంగినీ వశపరచుకున్నాడు. వారిలో వివాహాలు జరిగిన వారూ ఉన్నారు.”

“మరి పెండుకుళి రహస్యాన్ని ఈ విధంగా వాడటం సాయాజీ చేస్తున్న తప్పు కదా?”

“తప్పే. ఆయనికి గత్యంతరం లేదు. ప్రకృతి విచిత్రమైనది. మందు ఇది అని సూచించింది. దానిని విశ్లేషించి మరి కొన్ని వ్యాధులకు మనం ఇంకా చాలా చాలా తయారు చేస్తాం. సాయాజీ గారు కేవలం రోగానికి మందు ఇచ్చారు. జనం దానిని ఇలా స్వార్థానికి వాడుకుంటారని ఎలా ఆలోచిస్తారు?”

“ఇది సామాజిక పరమైన, ధార్మిక పరమైన అంశం. క్రమశిక్షణ, సంస్కారం వంటివి ముందుకొస్తాయి.”

నవ్వాడు జో.

“ముందుకు రానీయండి, వెనక్కి పోనీయండి. ఎవరికి కావాలి? సుఖపడటమే జీవన విధానం. దానిని మించిన నిజం లేదు.”

“జో.. ఒకటి అడుగుతాను చెబుతావా?”

“యస్?”

“నువ్వు పుట్టుకతో క్రైస్తవుడివి కావు కదా?”

“కాను.”

“మరి అలాగే ఎందుకు మిగిలి పోయావు?”

“ఊ.. ఎలా మిగలాలి?”

“ఒక గోవా పౌరునిగా మిగలాలి.”

“నాలుగైదు తరాలు ఒక పద్ధతిలో కలసి పోయాక ఈ రోజు మీరెవరు? అనడిగితే? నిజానికి ఎవరెవరు?”

“గోవా చరిత్ర తెలిసిన వాడివి”

“అవును. కదంబ రాణి నాయకీ దేవి 1178లో మహమ్మద్ ఘోరీ చేసిన దాడిలో పోరాడి తరిమికొట్టింది. గదర్‌ఘట్టాలోని సన్నని కొండ దారులను ఎంచుకుని, శత్రువుల బలహీనతలను అర్థం చేసుకొని ఒక బాలుడిని తన ఒడిలో పెట్టుకుని ఏనుగుల మీద స్వారీ చేస్తూ చేసిన యుద్ధమది. ఈ గాలీ ఈ మట్టి ఎందరో నారీమణుల శౌర్య పరాక్రమాలకు సాక్షులు.”

“పోర్చుగీస్ వారు మతం అనే ప్రాతిపదికను ఎందుకు ఎంచుకున్నారు?”

బైక్ ఆగింది. జ్యోతి గట్టిగా అరచి పడిపోయిన ప్రదేశానికి వచ్చాం.

“మనం ఆ భవనం లోపలికి ఆ రోజు వెళ్లలేకపోయాం.. ఈ రోజు వెళదాం.”

“పదండి.”

ఇద్దరం జాగ్రత్తగా ఆ సన్నని మట్టి దారి మీద నడుచుకుంటూ సాగిపోయాం. కొద్దిగా కష్టపడ్డాం. ఎలాగైతేనేం ఆ పాడుబడ్డ గేటును తోసుకుని లోపలికి వెళ్ళాం. అక్కడ ఒక వాచ్‍మన్ కాళ్ళు జాపుకుని కునికిపాట్లు పడుతున్నాడు. జో చిన్నగా ఈల వేసాడు. అతను ముందు జాగ్రత్తగా చూసాడు. గుర్తు పట్టగానే టక్కున లేచాడు. బట్టలు దులుపుకుని చేతులు కట్టుకున్నాడు.

“లోపల లైట్ ఉందా?” అడిగాడు జో.

“లేదు” అన్నాడు.

జో నా వైపు తిరిగాడు.

“మన మొబైల్ లైట్‌లో చూడగలరా?” అడిగాడు.

“మరో దారి లేనప్పుడు తప్పదు!”, అన్నాను.

ఆ పాడుబడ్డ ద్వారానికి ఎడమ ప్రక్క ఉన్న టైల్ మీద వ్రాసి ఉంది.. ‘ఏంజలినా కుబెర్టిన్’.

ఎక్కడో ఏదో వెలిగింది.

“ఈ పేరెక్కడో విన్నట్లుంది”, అన్నాను.

జో నడుం మీద చెయ్యి పెట్టుకున్నాడు.

“ఎక్కడ?”

“గవడే గారింట్లో

జో చేతులు గెడ్డం మీద పెట్టుకొన్నాడు.

“గవడే ఎవరు?”

“పురాతత్వవేత్త.”

దీర్ఘంగా నిట్టూర్చాడు జో.

“అక్కడా? ఎలా విన్నారు?’

“వినటం కాదు. ఆయన వద్ద ఈమె ఉంటోంది.”

జో ఆలోచనలో పడ్డాడు.

“ఇది ఆమె భవంతి! అద్భతమైన పెయింటింగులు వేసిన మనిషి. ఆమె ఆర్టిస్ట్ మటుకే కాదు. చరిత్రను అనుభవించి సృష్టించిన కళాఖండాలు అవి.”

తలుపు తెరచి లోపలికి వెళ్లాం. లోపల చాలా పెద్ద గదులున్నాయి.

నా కుడి ప్రక్కనున్న గోడ మీద లైట్ వేసాను.

‘మానవాళి మానవాళి గురించి తెలుసుకోవటమే చరిత్రకు నివాళి..’ ఆంగ్లంలో ఉంది. ‘మీకు కనిపించబోయేది మీరు తట్టుకోగలిగితే చూడండి. ఆలోచించండి. ఇక్కడ ఉన్న చిత్రాలన్నీ  శబ్ద చిత్రాలు. ఇవి గీస్తున్నప్పుడు నాకు ఎన్నో మూలుగులు, అరుపులు, కేకలు అలా వినిపిస్తుంటే గీసినవి. మతం వ్యాపారం కోసం మరొకరి మీద రుద్దటం మొదటి అంశం. దానిని విస్తరింపచేయటం కోసం యుద్ధం. రక్తపు మడుగులలోంచి వినిపిస్తున్న ఈ పొలికేకలు ఎవరివి? మానవ జన్మ ఎత్తినందులకు దీని తరువాత ఏమిటి అని తెలుసుకునే జిజ్ఞాసలో నిశ్శబ్దంగా నిగ్రహంతో సాధన చేసుకుంటున్నా సాధుజీవులవా? డొక్క ఆడటం కోసం  ఒకరి వద్ద పని చేసుకుంటూ ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఒకరి ఆజ్ఞ మేరకు ఇక్కడ వారిని వివాహం చేసుకుని ఇంతకీ మేమెవరణం అని అడుగుతున్న బలహీనులవా? మరొకరి పద్ధతిలోనే జీవిస్తే తప్ప మరొకరి పరిశ్రమ పూర్తిగా వారికి పనికి రాదనే ఆలోచన సృష్టించిన ఆవేదనా?

ఈ శబ్దాలు నన్ను వదలవు. మనిషి నాకు అర్థం కాడు.. ఇట్లు డెల్లన్!’ అని ఉన్నది.

జో నాలుగడుగులు ముందుకు వేసాడు. అతన్ని అనుసరించాను. నా ఎడమ వైపు లైటు వేసాడు జో. సంకెళ్ళు కాళ్లకి కనిపిస్తున్నాయి. వాటిల్లోంచి ఒక చెయిన్ మనిషి చేతులకి బంధనంగా ఉంది. వాళ్లకు ప్రక్కగా ఇద్దరు తల నేల వైపుకు తిప్పి పడుకునుండగా మరో మనిషి వాళ్లని గట్టిగా పట్టుకున్నాడు. వాళ్లని కట్టెలతో వెనుక భాగం మీద బాదుతున్న దృశ్యం..

జో రెండడుగులు ముందరికి వెళ్లట. అక్కడ ఆగాడు. లైట్ వేసాడు. జాగ్రత్తగా చూసాను. మతిపోయింది. ఒక యువతి నగ్నంగా ముడుచుకుని గర్భంలో ఉన్న శిశువులా చేతులు వెనక పెట్టుకొని బేలగా కన్నీటి ధారలతో అలా ఎటో చూస్తోంది. ఆమె జుట్టును ఓ వ్యక్తి చేతిలో గట్టిగా పట్టుకుని కాలితో మెడ మీద నొక్కుతున్నాడు..

నా శ్వాస శబ్దం నాకు వినిపిస్తోంది. జో నా భుజం మీద చెయ్యి పెట్టాడు.

“సార్, ఆ సాయంత్రం జ్యోతి గట్టిగా అరచి క్రింద పడిపోయి ఈ భంగిమ లోనే ఏడవటం ప్రారంభించింది. అవునా?”

దీర్ఘంగా నిట్టూర్చాను. అవునన్నట్లు తల ఊపాను. కానీ, తెలియని భయం, ఆవేదన కలసి కడుపులో ఏదో కదలిపోయింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here