Site icon Sanchika

పూచే పూల లోన-36

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[పాడుబడ్డ ఆ భవంతిలోని పెయింటింగ్స్‌ని సుందర్‍కి చూపిస్తుంటాడు జో. జ్యోతి గట్టిగా అరిచి పడిపోయిన భంగిమలో ఓ స్త్రీ ఉన్న బొమ్మని చూపించి, జ్యోతి రీసెర్చ్ చేస్తోందా అని అడుగుతాడు జో. కాదని చెప్పి, పెయింటింగ్ తన హాబీ అని అంటాడు సుందర్. మనిషి దౌర్జన్యాలకు అద్దం పట్టే ఎన్నో పెయింటింగ్స్ ఆ భవంతిలో ఉన్నాయని చెప్తాడు జో. ఇవన్నీ నాకెందుకు చూపిస్తున్నారని సుందర్ అడిగితే, సమీర్ చూపించమన్నాడని అంటాడు జో. మరో పెయింటింగులో నలుగురు మనుషులు ఒకడిని క్రింద పడుకోపెట్టి కాళ్లతో తొక్కుతుంటారు. అలా చిత్రహింసలు పెడుతున్న వ్యక్తుల ముఖాలను పరిశీలిస్తాడు సుందర్. మరో బొమ్మలో స్త్రీని నగ్నంగా చేసి హింసిస్తున్న దృశ్యం ఉంటుంది. ఆ పెయింటింగ్స్ గురించి చెప్పమంటే, తన హృదయంలోని వేదనకి అద్దం పట్టేలా వ్యాఖ్యానిస్తాడు సుందర్. ఒకసారి స్వామి వివేకానంద రాచోల్ సెమినరీకి వచ్చిన సంగతి చెప్తాడు సుందర్. పోర్చుగీస్ వారు ఇక్కడి స్పైస్ వ్యాపారాన్ని చేతిలోకి తీసుకునే క్రమంలో దారుణానికి ఒడిగట్టిన వైనాన్ని చెప్తాడు. క్రైస్తవంలోకి మతమార్పిడికి ఎందుకు మార్చారో చెప్తాడు.- ఇక చదవండి.]

[dropcap]ఆ[/dropcap] చీకటిగా ఉన్న హాల్లో ఒకే ఒక బూజు పట్టిన కిటికీ ఉంది. జో ఆ కిటికీని జాగ్రత్తగా తెరిచాడు. జోఆక్విమ్‌ని, అతని మాటలనీ బట్టి ఇతను బాగా చదువుకున్న వాడిలా కనిపించాడు. అతని మాటలలో ఏ రోజు స్కూలుకు వెళ్లినట్లు చెప్పలేదు. మరి పదిమంది దగ్గర విన్న మాటలా? అదే అధ్యయనమా? ఏమో! మార్క్ ట్వెయిన్ అంటాడు – ‘ఏ రోజూ నా స్కూలింగ్‍ను నా విద్యార్జనలో జోక్యం చేసుకోనీ లేదు!’ అని.

“చరిత్ర లోంచి తొంగి చూస్తున్నారా?” అడిగాను.

ఆ కిటికీ లోంచి వెలుతురు అతని ముఖం మీద పడినప్పుడు అక్కడ ఓ వింత ఆలోచన వచ్చింది. ఆ కిటికీ ఫ్రేములో ఉన్న బూజుతో పాటు కరుణామయుడైన ఏసుక్రీస్తు పోర్చుగీస్ వారి వలన మలినమైపోయాడా? ఇలాగే, ఇక్కడే నిలబడి ఓ బొమ్మ గీస్తే ఎలా ఉంటుంది?

జో జాగ్రత్తగా సిగరెట్ ముట్టించి ఆ వెలుతురు లోనే గోడ మీద ఒక బొమ్మ చూపించాడు. ఆరు కోణాల బొమ్మ అది. ఎర్రగా రక్తపు వర్ణంలో ఉంది.

“ఇదేంటి?”

“స్టార్ ఆఫ్ డేవిడ్.”

“ఓ. జ్యూ ల మత చిహ్నం.”

“మామూలుగా ఐతే ఇది ఇక్కడ ఉండకూడదు..”

“అవును. నేనూ అదే ఆలోచిస్తున్నాను.”

జో గోడకి ఆనుకుని ఆ చిహ్నం క్రింద చతికిలబడ్డాడు.

“సార్, ఈ బిల్డింగ్ లోని వన్నీ ఒక సమయంలో గీసిన బొమ్మలు కావు. ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఇది మ్యూజియమ్ కూడా కాదు.”

“మరి ఎవరి ఆధీనంలో ఉoది?”

“ఎవరి అధీనంలో లేదు. ఈ ఆస్తి మాది అని ఒకరు కోర్టులో కాగితం పెట్టారు. మీ ఇంట్లో పెయింటింగులు ఏమిటి అని పురావస్తు శాఖ వాళ్ల వాదన. మా ఇంట్లో మా ఇష్టమైనవి వేసుకుంటాం అని వీళ్లంటారు. ఇలాంటి బొమ్మలు ఎలా వేస్తారని కోర్టు వాళ్ళు. మా కళ అని అంటారు వీళ్ళు.”

“ఆ కేసు పెట్టిన వాళ్ళ పేరు ఏంజలీనా అని ఎక్కడన్నా విన్నారా?”

ప్రశ్నార్థకంగా చూసాడు.

“మీకెలా తెలుసు?”

“ఆమెను చూసాను. గవడె గారింట్లో.”

“అది గవడె ఇల్లు కూడా కాదు.”

“అవును. అదో పెద్ద కథ. ఇంతకీ దీని సంగతేమిటి?”

“ఇలాంటివి చాలా ఉన్నాయి గోవాలో. కోర్టు అధీనంలో ఉంది.”

“మరి మనం ఎలా లోపలికి వచ్చాం?”

“ఆ వాచ్‌మాన్ తాళం తెరిచాడు కదా?”

జో ఇలాంటి కుళ్లు జోకులు వేస్తాడనుకోలేదు.

“కమాన్. అసలు సంగతి చెప్పండి.”

“ఏం లేదు. కొన్ని తరాల జీవితాలే ఇతరుల పాలన వలన ఎన్నో వాయిదాలు పడిపోయాయి. ఇక్కడున్నది ఎవరికీ అర్థమూ కాదు, అవసరమూ లేదు. గోవా చరిత్రలోంచి ఎవరో నా లాంటి వారు, సమీర్ లాంటి వారు అప్పుడప్పుడిలా తొంగి చూస్తూ ఉంటాం. ఆ సమయంలో మీలాంటి వారు కనిపిస్తూ ఉంటారు.”

“ఈ బాధ ఒక కళాకారుడి బాధా లేక ఒక సగటు మనిషి బాధా?”

కిటికీ లోంచి ఆ వాచ్‌మన్ చెయ్యి ఊపాడు. ఎక్కడి నుండో సిగరెట్ తీసి వాడి చేతిలో పెట్టాడు జో. అతను ఏదో అర్థం కాని పాట పాడుకుంటూ వెళ్లిపోయాడు.

“ఓ మంచి డైలాగ్ చెప్పండి సార్”, అన్నాడు జో.

“సమీర్ నా గురించి ఏవేవో తప్పుడు విషయాలు చెప్పినట్లున్నాడు మీకు.”

“నో. సమీర్ ఎన్నడు తప్పులు చేయలేదు. మా జీవితాలు జీవిత ఖైదీ జీవితాలు.”

“అదేంటి?”

“అవును, మా చుట్టూతా ఉన్న వాటి పట్ల తీవ్రమైన అసహనం, అసహ్యంతో జీవిత కాలం గడిపేసాం. ఏడాదికి రెండు సార్లు అలా పైపైకి ఎగిరిపోయి మాయమైపోయే పెరినియల్స్ లాంటి వాళ్లం.”

“పెరినియల్స్.. కొత్త పూలా?”

“పాతవే! పేరు పెరినియల్స్. కానీ ఏడాదికి రెండు సార్లే పూస్తాయి. తోటలోకి చూస్తే అన్నిటి మధ్యలోంచి అలా ఎదిగి తొంగి చూస్తాయి. మిగతా పూలు నచ్చకో లేక ఈ లోకమే అర్థం కాకపోవటంతో అలా చిన్నబోయి మాయమవుతాయి. సార్, ఏది పెరినియిల్? ఆలోచనా, బాధా కాక నిరర్థకమైన మానవ జీవితమా?”

లేచి నిలబడి పాంటు దులుపుకున్నాడు జో.

“మాట్లాడండి సార్”, గమ్మత్తుగా అడిగాడు. సమీర్‌ను చాలా దగ్గరగా చూసినట్లున్నాడు. జీవితానికి చాలా దగ్గరగా రాసుకున్నట్లున్నాడు. ఒక మంచి రచయితలా మనిషి మనుగడని గడగడలాడే రక్తంతో వాస్తవాల శిలల మీద శాశ్వతంగా వ్రాసేసుకున్నట్లున్నాడు. కళాకారుల దేహం దేహానికి సంబంధించినది కానే కాదు..

“కిటికీ లోంచి ఏం చూస్తున్నారు సార్?”

రకరకాల కలుపు మొక్కల మాటున ఆ పాడుబడ్డ గేటు దగ్గర ఆ ముసలి వాచ్‍మన్ ఆ సిగరెట్‍ను తనివితీరా తాగుతున్నాడు.

“ఏ మూలనో దాగుంది యథార్థం..” అన్నాను. “..ముళ్లలోనూ, మామూళ్లలోనూ మూలుగుతోంది మానవత్వం.”

గెడ్డం నిమురుకున్నాడు జో. చొక్కా చేతి మీద నుండి వెనక్కితోసాడు.

“వెంట్రుకలు నిలబడుతున్నాయి.. చెప్పండి.” అన్నాడు.

“మామూలు మనిషిని కనీసం మామూలుగానైనా గౌరవించే సమాజం ఎక్కడా అని ఈ కిటీకీ లోంచి చూస్తున్నాను.”

ఆ వాచ్‌మన్‌ని చూసి చెయ్యి జేబులోకి పోనిచ్చాడు జో. ఆపాడు.

“గోవా అతిథులు డబ్బులు తీస్కోరు” అంటూ తన జేబు లోంచి కొన్ని నోట్లు తీసి కిటికీ లోంచి పట్టుకున్నాడు.

అతడు గబగబా వచ్చి అటూ ఇటూ చూసి గబుక్కున లాక్కుని పాంటు జేబులోకి తోసి ఈల వేసుకుంటూ ఎటో వెళ్ళిపోయాడు.

“ఇంతకీ నాకు – ఆ జ్యూ చిహ్నం ఇక్కడెందుకుందో చెప్పలేదు!” అన్నాను.

నా భుజం మీద చెయ్యి పెట్టి ఆ చిహ్నం గల గోడ అవతలకి తీసుకుని వెళ్ళాడు.

“ఇరవై నాలుగు గంటలూ ఒక చీకటి గదిలో ఉన్న ఖైదీ ఏం చేస్తాడు?” అడిగాడు.

“ఎక్కడో ఏదో బెజ్జం లాంటి దాంట్లోంచి సూర్యరశ్మి వస్తూ ఉంటే దాని వైపే చూస్తూ కాలం గడిపేస్తాడు!”

“కరెక్ట్. అటువంటి వాడే, జెరొనిమో డియాస్.”

“ఓ. ఎవరతను?”

అక్కడ గోడ వైపు చెయ్యి చూపించాడు. జ్యూ చిహ్నం ఆ గోడ మీద అతి పెద్ద ఆకారంలో ఉంది. ఆ చిహ్నామంతా నిప్పుల్లో కాలిపోతోంది. ఆ నిప్పుల మధ్యలో ఒక వ్యక్తి తన మెడను గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుని నిలబడి కాలిపోతున్నాడు.

“ఇతను వాస్తవానికి జ్యూ కాదు. 1543లో ఇక్కడ ఉంటున్న ఒక డాక్టర్. ఆ రోజుల్లో అతన్ని కొత్త క్రిస్టియన్ అనేవారు. మనం మాట్లాడకుంటున్నట్లే కొందరు స్నేహితుల మధ్య కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుతూ క్రిస్టియానిటికి విరుద్ధంగా కొన్ని ప్రస్తావనలు చేసాడు. అతన్ని గమనించి, అరెస్టు చేసి ఇతరులతో పాటు విచారించినప్పుడు, అతను ధైర్యంగా పాత పాటే పాశాడు. అప్పటి బిషప్ ఇతను క్రైస్తవుడు కాడు, జ్యూ అని నిర్ధారణ చేసి దండన విధించాడు.”

“ఇదేంటీ? జ్యూ అని నిర్ధారించి దండన?”

“అదే సమస్య. కొచ్చిన్ మహరాజు దగ్గర నిర్భయంగా జీవిస్తున్న జ్యూలు పోర్చుగీస్ వారికి నచ్చలేదు.”

“ఇంతకీ ఏమిటా దండన?”

“శరీరాన్ని బూడిద పాలు చెయ్యటం.”

“అప్పటి దండనా విధానమా?”

“విధానం కాదు. క్రౌర్యంతో కూడిన ఒక పంతాన్ని నెగ్గించుకునే వ్యవస్థ. ఇది ఒక బిషప్, పోర్చుగల్ రాజు పేరుతో ఇచ్చిన దండన.”

ఆ చిత్రాన్ని అలా కొద్ది సేపు చూస్తూ ఉండిపోయాను.

“ఆ దండన ఇదేనా?”

“కాదు. ఒక వేళ అతను తప్పు ఒప్పుకుని పది మందిలో తనను తాను దండించుకుంటే..”

“జీవిత ఖైదీని చేస్తారా?”

జో విరగబడి నవ్వాడు.

“సార్, మత పెద్దలు సామాన్యులు కారు. వారి సిద్ధాంతాల కోసం వాళ్ళు చెయ్యని క్రౌర్యపు చేష్టలు రాజులకు కూడా చేతకానివి.”

“మరి ఏం చేసారు?”

“పది మందిలో తనను తాను దూషించుకోవాలి – అంటే ఇది నేను చేసిన దారుణమైన అపచారం అని పది మంది తెలుసుకోవాలి. డియాస్ ముందు చర్చ్‌లో కన్ఫెస్ చేసాడు. తరువాత పది మందిలో తనని తాను దూషించుకున్నాడు.”

“ఓ. అందరికీ తెలియాలన్న మాట.”

“అవును.”

“శిక్ష తగ్గించారా?”

“తగ్గించారు!”

జో ఆ పెయింటింగ్ దగ్గర నిలబడి అతని ముఖం మీద చేతితో నిమిరాడు.

“శిక్ష తగ్గించారు..” చెప్పాడు. “..సజీవంగా నిప్పుల్లో కాల్చి బూడిద చేసే బదులు రెండు చేతులు వెనుక కట్టేసి గొంతు నొక్కేసి మనిషిని చంపేసి అతని శరీరాన్ని నిప్పుల కంకితం చేసారు.”

ఆ పెయింటింగ్‌కు ఎడమ ప్రక్క ఒక స్తంభం ఉంది. జో దానిని చూపించాడు.

“ఇది కరుణకు సంబంధించిన స్తంభం. కన్ఫెషన్ తీసుకున్న టీచర్ డియోగా బోర్బా.. ఇతని వెంట నడిచి ఇక్కడ ఆ దండనను పర్యవేక్షించాడు. దండనను తగ్గించిన ఈ ప్రక్రియకు ఈ స్తంభం కరుణస్తంభంగా కీర్తి గడించింది.”

స్టార్ ఆఫ్ డేవిడ్ వెనుక నిప్పుల మధ్యలో ఆ యువ డాక్టర్ తన గొంతు పట్టుకుని ఉన్నాడు. ఏమనుకుంటున్నాడు? ఈ గొంతులోంచి ఆ మాటలు ఎందుకొచ్చాయనా? పెరినియల్ మొక్కలా సుందరంగా ఒక్కసారి అందరి మీదుగా ఎందుకు ఎదిగాడనా?

జో రెండు సార్లు ఆ గోడని చేతితో కొట్టాడు.

“దారుణమైన గోవా ఇన్‍క్విసిషన్‌కి ఈ సంఘటన నాంది పలికింది.”

కిటికీ అవతల చీకటి కమ్ముకుంటోంది. జో కిటికీ తలుపులు మూసేసాడు.

“చరిత్రంతా చీకటే..”, అన్నాడు “..ఎందరో ఇలా జరుగుతున్న దానికి వెలుగు చూపుతూ, పది మందికీ చూపిస్తూ అగ్నికి ఆహుతి అయిపోయేరు.”

“ఊ.. చీకటి గురించి వింటుంటేనే లోపల ఏదో కాలిపోతోంది! ఇంకెంత, ఎలా చూడాలా అనే ఆలోచన కలుగుతోంది.”

(ఇంకా ఉంది)

Exit mobile version