[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[గదిలోకి వచ్చిన జో ని వింతగా చూస్తుంది జ్యోతి. రెండడుగులు వేసి కుర్చీలో కూర్చుంటుంది జ్యోతి. జో నిలబడే ఉంటాడు. సుందర్, చిత్ర కూర్చుంటారు. టీ తాగావా అని జో – జ్యోతిని అడుగుతాడు. ఆమె సమాధానం చెప్పకుండా పళ్ళికిలిస్తుంది. మళ్ళీ అడుగుతాడు జో. జ్యోతి కుర్చీలోంచి లేచి, ఒక వేలితో గదిలోని అందర్నీ చూపిస్తుంది. ఫ్లాస్క్ మూత జాగ్రత్తగా విప్పి, అక్కడున్న ఒక కప్పులో టీ పోస్తుంది. ఆ కప్పుని పట్టుకుని చుట్టూతా చూస్తుంది. తమ మీద పోస్తుందేమోనని చిత్ర, సుందర్ అనుకుంటారు. నెమ్మదిగా ఆ కప్పులోని టీ తాగేస్తుంది జ్యోతి. కప్పుని బల్ల మీద పెట్టి ఫ్లాస్క్‌ని జో మీదకి విసిరేస్తుంది. దాన్ని జాగ్రత్తగా పట్టుకుంటాడు జో. దానిలో నాలుగు కప్పులు టీ తెచ్చేయమని అంటుంది చిత్ర. పేస్ట్రీలు కావాలా అని అడుగుతాడు, వద్దంటుంది చిత్ర. జో వెళ్ళిపోతాడు. ఇంతలో ఒక సిస్టర్ వచ్చి జ్యోతికి బిపి చూసి వెళ్తుంది. సుందర్ బయటకు వచ్చేస్తుంటే, చిత్ర కూడా వస్తుంది. ఇద్దరు లౌంజ్ లో కూర్చుంటారు. జ్యోతి విషయంలో ఏం చేయాలో ఆలోచిస్తారు. ఎవరు బాధ్యత తీసుకోవాలా అని అనుకుంటారు. జో టీ తీసుకుని లోపలికి వెళ్తుంటే, అతన్ని పిలుస్తారు. ముగ్గురు అక్కడే కూర్చుని టీ తాగుతారు. తాను డాక్టర్‍తో మాట్లాడాననీ, పారానాయిడ్ స్కిజోఫ్రినియాలా ఉందని అన్నాడని చెప్తాడు జో. హఠాత్తుగా మాధవ్ గుర్తుకొస్తాడు సుందర్‍కి. గవాడె గారిని అడిగి అతడిని సంప్రదించాలని అనుకుంటారు. కానీ జ్యోతి ఇలా అవడానికి కారణమే మాధవ్ కాబట్టి అది అంత మంచి ఆలోచన కాదని భావిస్తాడు సుందర్. తనకి సహకరిస్తే తాను జ్యోతికి నయం చేయగలనని అంటాడు జో. ముగ్గురు లేచి జ్యోతి గదికి వెళ్తారు. కిటికీ దగ్గర నిల్చుని కాన్వాస్ మీద ఏదో స్కెచ్ వేస్తూ ఉంటుంది. – ఇక చదవండి.]
[dropcap]ఇ[/dropcap]ప్పటి వరకూ వ్రాసిన కాగితాలన్నీ ఎందుకో ఒకసారి నిమిరి చూసి బాధతో కుర్చీలో కూలబడ్డాను. నిజమే. నా మీద నాకు తీవ్రమైన కోపం వచ్చింది. కదంబ రాజులు కట్టడాలు, ఆగ్రహారాలు, రాగి శాసనాలు, పంచ శబ్ద ఉపాసనలు – ఇవన్నీ కలబోసి పుంఖాలు పుంఖాలుగా వ్రాసి ఎన్నో కొత్త విషయాలు చెప్పేననుకుని ఏదో విజయాన్ని పొందానని అనుకున్నాను. ఏంటి నేనూ, చిత్ర అనుకున్నవి?
కుర్చీ లోంచి లేచి మంచి నీళ్ల బాటిల్ చేతిలో పట్టుకుని అద్దం ముందు నిలబడ్డాను. ‘ద పేపర్ మెన్’ నవలలో విలియమ్ గోల్డింగ్ చెప్పిన ‘కాగితం మనిషి’ ఒక్కడే కనిపించాడు. ఆ మాటకొస్తే మనిషి కూడా సరిగ్గా కనిపించలేదు. ఏదో పరిశోధన చేసేసాననుకుని, మరేదో గొప్ప విషయం అందరికీ చెప్పేసాననుకునే ప్రతి రచయితా ఇలాగే ఉంటాడా? ఈ ఆస్పత్రి, ఈ లోకం, ఈ అమ్మాయి.. వీటితో నాకేంటి సంబంధం అంటావా? ‘మీరు సిగ్గుపడే వారైతే స్టేజ్ మీదకి రావక్కరలేదు’ అనేవాడు మా టీచర్. అది స్టేజ్ ఫియర్ విషయంలో చెప్పిన మాటలు. ఈ అద్దంలో పూర్తిగా సిగ్గే లేని ఒక మనిషి కనిపిస్తున్నాడు..
ఫ్లాస్క్‌లో టీ నింపుకొని వచ్చి ‘నేను ఈ అమ్మయికి నయం చేయగలను’ అని జో అన్న మాటలు గుర్తుకొచ్చాయి. ఇటు తిరిగి పోయి కళ్లు మూసుకున్నాను.
“ఏ మనిషి కార్య నిర్వహణకైనా కొన్ని పరిధులుంటాయి..”, అద్దంలోంచి వాడు వాగేస్తున్నాడు.
“నేనూ మామూలు మనిషినే, వదిలెయ్! నాకు ఎటువంటి బాధ్యతలూ, శక్తులూ లేవు. నేనూ సందుల్లోంచి దూరిపోయే వాడినే.”
“మామూలు మనుషులు మామూలుగా సందుల్లోంచి దూరిపోవటం పెద్ద విషయం కాదు.”
“మరి?”
“నిన్ను నువ్వు సమర్థించుకునేందుకు సందులు వెతుక్కునే శుంఠవి.”
మంచి నీళ్లు కూడా తాగాలనిపించటం లేదు. మామాలు మనిషిని కనీసం మాములుగానైనా గౌరవించే సమాజం కోసం.. మనం ఇతరులకు చెప్పిన మాటలే కదా?
“నేను చరిత్ర వ్రాయటానికి వచ్చాను.”
“ఎవరికి కావాలి చరిత్ర? నీకు నిజంగా వీళ్ల పట్ల ఆసక్తి ఉన్నదా? నీ పేరుతో ఒక క్రొత్త రకం పుస్తకం ఇవతలకి రావాలని ఆరాటపడ్డావు. ఏం సాధించావు?”
“వ్రాయాలనుకోవటం రచయిత తప్పా?”
“నీ రాగి శాసనాల వ్యవహారాలు ఎంత నిజమో ఆ అమ్మాయి స్కెచ్చులలో నీకు తెలిసింది కదూ!”
“..”
“మాట్లాడు.”
“ఇవాల్టికి వదిలెయ్ తమ్ముడు.”
“నో. నిన్ను వదలకూడదు. నీలాంటి వాళ్లనీ వదలకూడదు.”
“నేను కాగితం మీద నిజాలను చెబుతాను.”
“ఎవరి కోసం?”
“అందరి కోసం.”
“ఆ తరువాత?”
“ఇంకేం చెయ్యాలి?”
“దుష్టుడా”
“నిజమే. దుర్మార్గుడినే, ఆ తరువాత ఏం చెయ్యమంటావు?”
“ఎక్కడికో వెళ్లి దాక్కుంటావు.”
“మరేం చెయ్యమంటావు?”
“నిరర్థమైన పరంపరలను తీవ్రంగా ఖండిస్తూ అందరి కోసం ఎందుకు నిలబడవు? గొంతు ఎందుకు విప్పవు?”
“నా కలం మాట్లాడుతుంది.”
“గోవా వదిలి వెళ్లిపోతావా?”
“ఇంకా ఏం చెయ్యాలి?”
“అంతే కదా? ఏడాదికోసారి ఓ దిక్కుమాలిన సాహితీ సభ నిర్వహించి నేనున్నాను, అని ఒకడంటే నేనూ ఉన్నానని నువ్వంటావు. అక్కరలేదు నేనే ఉన్నానంటాడు మరో సాహితీ పాత సార్వభౌమ.”
గబ గబా బాల్కనీ లోకి వెళ్లిపోయాను. రిస్టార్ట్ లాన్‌లో మెల్ల మెల్లగా లైట్లు వెలుగుతున్నాయి.
***
ఆస్పత్రిలో జ్యోతి ఉన్న గది తలుపు దగ్గర ముగ్గురం నిలబడి ఉన్నాం. జ్యోతి ఎదురుగా ఉన్న కాన్వాస్ మీద – చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ భయం భయంగా ముడుచుకుని నా జోలికి రావద్దంటున్న అమ్మాయి – చిత్రాన్ని గీసి తుది మెరుగులు దిద్దుతోంది. ఈ బొమ్మ ఇప్పుడు ఎందుకు గీస్తోంది? చిత్రకి పెద్దగా ఏమీ అర్థం కాలేదు. నాకూ, జో కీ చాలా విషయాలు అర్థమవుతున్నాయి. స్కెచ్ వేసిన కొద్దిసేపటికి కుర్చీలో వెనక్కి వాలి చాలాసేపు దానిని చూసి ఎందుకో గొంతు పట్టుకుని దగ్గి, మరల స్కెచ్ లోకి వెళుతోంది జ్యోతి.
“ఎవరి బొమ్మ అది?”, జో అడిగాడు.
జ్యోతి మా వైపు తిరగలేదు. బొమ్మ వంకే చూస్తోంది.
“నువ్వేనా?”
తల అడ్డంగా తిప్పింది.
“నీ బొమ్మలాగే ఉంది”, చిత్ర అంది.
ప్రతిక్రియ ఏదీ లేదు. ఎందుకో కిటికీ వైపుకు చూసింది. మెల్లగా లేచి నిలబడింది. మా వైపు తిరిగి చేతులు కట్టుకుంది.
“ఎవరి బొమ్మ వెయ్యమంటారు?” చక్కని గొంతులో అడిగింది.
“ఎవరి బొమ్మ వేస్తున్నావు?”, నేనడిగాను.
“ఇది బొమ్మ అని ఎందుకనుకుంటున్నారు?”
“అంటే ఇప్పటికే ఎక్కడో ఉన్న బొమ్మని గుర్తు తెచ్చుకుని ఇక్కడ మరల గీసావా?”
“బొమ్మ కాదన్నానా?” అరచినంత పని చేసింది.
చెయ్యి అడ్డు పెట్టాడు జో.
కొద్దిగా లోపలికి వెళ్లి తలుపు దగ్గరికి వేసి కూర్చొన్నాం. జ్యోతి కూడా కూర్చుంది.
“జరిగిన కథ”
“ఎవరికి?”
కూర్చీలో వెనక్కి వాలిపోయింది.
“మీకెందుకు చెప్పాలి?”, కళ్ళు మూసుకుంటూ అంది.
“ఎందుకు చెప్పకూడదు?”
గబుక్కున లేచి రూమ్ పై కప్పు పగిలిపోయేలా అరిచింది..
“నేను ఒక ఆడదాన్ని! అర్థమైందా?డూ యూ అండర్‌స్టాండ్..?”
ఎక్కడో అలారమ్ మ్రోగింది.
కారిడార్‍లో బూట్ల చప్పుడు వినిపిస్తోంది. ఇక్కడికి డాక్టర్లు, సిస్టర్లు ప్రయాణమయి వస్తున్నారని అర్థమైంది. ముగ్గురం ఒకళ్ళ మొహలొకళ్ళు చూసుకున్నాం.
సిస్టర్ లోపలికి వచ్చింది. ఇలాంటప్పుడు కాస్త గట్టి వాళ్లు కొంతమంది వెంట ఉంటారు. ఇద్దరు గట్టి మహిళలు లోపలికి వచ్చారు.
“మీరెవరు?” అడిగారు.
ఇది సరైన ప్రశ్న. నిజమే. మేమెవరం? చిత్ర ముందుకు వచ్చింది.
“వీళ్లు నాతో ఉన్నారు. ఆ బొమ్మ చూస్తూ ఎవరి బొమ్మ అని అడిగాం. అంతే, గట్టిగా అరచింది. అంతకంటే ఏం లేదు.”
జ్యోతి మరల కుర్చీలో కూలబడింది.
“ఎక్కువగా మనసును కష్టపెట్టకూడదు. వదిలెయ్యండి”, సిస్టర్ హితవు పలికింది.
“అసలు ఇంత మంది రూమ్ లోకి ఎందుకొస్తున్నారు?” ఇంకొకరు వత్తాసు పలికారు.
ఎందుకైనా మంచిదనుకున్నాడో ఏమో, జో బయటకి వెళ్లిపోయాడు.
“అసలు ఆయనెవరు?”, వాళ్లు అడిగారు.
“జోఆక్విమ్”, అన్నాను.
“అంటే?”
“డాఫోడిల్స్ ఆడిటోరియమ్ యజమాని.”
“ఆయనకేం పని ఇక్కడ?”
“అయ్యో. అలా అనకండి. ఆయనని కలవటానికి వెళ్లినప్పుడే ఇదంతా జరిగింది.”
“ఓ. ఎనీ వే, ఆమెను ఒంటరిగా వదిలెయ్యండి.”
చిత్ర నన్ను వెళ్లిపొమ్మని సైగ చేసింది. నేను మెల్లగా సద్దుకుని క్రిందకి వచ్చేసాను.
“అర్థమైందా?”, వెనుకనుండి వినిపించింది. అక్కడ జో కూర్చున్నాడు.
“ఏంటి?”
“ఇది జబ్బంటారా? రియాలిటీ షో అంటారా?”
అతని ప్రక్కన కూర్చున్నాను.
“మీరు నయం చేయగలనన్నారు. అవునా?”
“యస్.”
“దేనిని? జబ్బునా? రియాలిటీ షోనా?”
జుట్టు విదిలించుకున్నాడు జో..
(ఇంకా ఉంది)