[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[పంజీమ్ నుంచి కర్మాలి అనే ఊరుకి బయల్దేరుతాడు సుందర్. ఇంతలో రచనల్లో సుందర్‍కి సహాయం చేసే కిరణ్ అనే అతను ఫోన్ చేస్తాడు. సమీర్‍ని కలిసారా అని అడిగుతాడు. కలిసానని సుందర్ చెప్తే, ఎవరైనా ఫోన్ చేసి అడిగితే సమీర్‍ని కలిసినట్టు చెప్పద్దని కిరణ్ అంటాడు. ఏదైనా సమస్య అంటే అవునని చెప్పి, సమీర్ కోసం నిర్మాతలూ, దర్శకులూ, ఆఖరుకి కొన్ని ఇతర సంస్థలవాళ్లు వెతుకుతున్నారని అంటాడు కిరణ్. కారణమడిగితే, తర్వాత చెప్తానని ఫోన్ పెట్టేస్తాడు కిరణ్. సుందర్ గమ్యం చేరి అక్కడి బ్రహ్మ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వస్తాడు. కొద్ది దూరంలో ఒక అమ్మాయి ఆ గుడి స్కెచ్ వేస్తూ కనిపిస్తుంది. స్కెచ్ గీయటం అయ్యాకా, బ్యాగ్ లోంచి ఒక పుస్తకం తీసి చదవడం మొదలుపెడుతుంది. ‘మధుకర్’ అని గట్టిగా అంటాడు సుందర్. ఆమె ‘తెలుగా’ అని అడుగుతుంది. ఎలా చెప్పారని సుందర్ అడిగితే, పుస్తకం చూపిస్తుంది. దాని మీద ‘మధుకర్’ అని తెలుగులో ఉంటుంది. మధుకర్ గురించి, ఆ గుడి గురించి మాట్లాడుకుంటారు. సుందర్‍ని పేరు అడిగి, తన పేరు చిత్ర అని చెబుతుంది. తన విజిటింగ్ కార్డ్ సుందర్‍కి ఇస్తుంది. ఆ కార్డు మీదున్న వివరాల ప్రకారం ఆమె ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ అనీ, బెంగుళూరుకు చెందినదని తెలుస్తుంది. కాసేపు ఆ పుస్తకంలో మధుకర్ వ్రాసిన గుడి చరిత్ర గురించి మాట్లాడుకుంటారు. తర్వాతి అక్కడి కదంబ వృక్షం దగ్గరికి తీసుకువెళ్ళి మరికొంత చరిత్ర చెబుతుంది. కాసేపటికి అక్కడ్నించి బయల్దేరుతాడు సుందర్. ఇక చదవండి.]
[dropcap]ల[/dropcap]య అంటే ఏమిటి? కిటికీ లోంచి దూరంగా చూస్తుంటే ఎందుకో ఆలోచన అటుగా సాగుతోంది. నేనుంటున్న ఆ రిసార్ట్‌లో అతి పెద్దవి కిటికీలున్నాయి. సాగరం అంచున అస్తమిస్తున్న సూర్యుడు ఒక వేళ ఆలోచనలోకి వెళితే రాత్రి వేళ ఈ సముద్రం, ఆ భూమి, ఆ కెరటాలు, ఆ చెట్లు.. ఇవన్నీ ఏం చేస్తాయి అనేనేమో కొద్ది సేపు ఆలోచిస్తాడు కాబోలు. ఆ సందేహానికి సమయం కేటాయించి కొద్ది సేపు అక్కడే ఆగిపోయి నన్ను మరవద్దు అని చెప్పేందుకు అలా తన కాంతిని ఆ నీటి మీద ప్రసరింప జేసి ఇక చాలు రేపు చూద్దాం అన్నట్లు మాట్లాడకుండా వెళ్లిపోతాడు.
లయ అంటే ఈ క్రమం తప్పకుండా జరిగిపోతున్న లీలేనా? లేక ఓ శబ్దావళిని సమకూర్చి, అంతటా వ్యాపింప జేసి ఎవరో నిశ్శబ్దంగా తాళం వేసుకుంటూ ఆనందం పొందుతూ తనలో తాను ఆనందనర్తనం గావిస్తూ ఆ శబ్దాలకి శక్తిని ప్రసాదిస్తూ రమిస్తూ రమింప జేస్తున్నాడా? నిజమే తనతో తాను ఆనందాన్ని పొందలేనివాడు మరొకరికి ఏం ఆనందం ఇవ్వగలడు? మరి ఈ సృష్టి యావత్తు ఆనంద స్వరూపమేనా? మరి ఇంత అమానుషం, ఇంత తాపం, ఇంత హింస కూడా ఇందులో భాగం ఎందుకు అయింది?
సాయంకాలపు సమయంలో కొన్ని వింతైన పక్షుల కూతలు వినిపిస్తూ ఉంటాయి. ఈ కిటికీ క్రింద అటువైపు ఓ చిన్న బాల్కనీలా ఉంటుంది. దానికి క్రింద వైపు వరుసగా రాళ్ళు రప్పలూ – వాటిని ఎవరో చక్కగా అమర్చి ఓ పది చోట్ల నాలుగు కుర్చీల చొప్పున చుట్టూ పేర్చి టేబుల్స్ ఉంచారు. వటికి చుట్టూ ఉన్న చెట్ల చాటున సముద్రం ఇక్కడే ఉన్నానన్నట్లు కనిపిస్తుంది.
ఈ సృష్టి మనకు చెందినది, మనం దీనిలోని అందమైన భాగాలం అనే ఆలోచనే కవిత్వమా అనిపించింది.
ఈ సముద్రం మీద అలలు పెద్దగా లేవు. ఏవో అక్కడక్కడ పైకి, క్రిందకి సాగుతున్న నీటిలా వుంది. వాటి మీద మెరుస్తున్న ఎర్రని, కేసరి రంగులను చూస్తుంటే ఆలోచనలు మరోలా మారుతున్నాయి. ఈ సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఎన్నో సముద్ర తీరాలను తాకుతాడు. చూసేవారికి ఇక్కడే అస్తమిస్తున్నట్లుంటాడు. ఈ నీటి మీద సాగుతున్న పరంపరలను పేజీలుగా మార్చుకుని ఈ రోజు చరిత్రను అలా పుస్తకాలలోకి దింపేస్తున్నాడా? ఏమో! వాటిని మరల తన దగ్గర ఉంచకుండా ఈ ప్రాంతానికే వదిలేస్తున్నాడా? ఎందుకో?
సముద్ర తీరాల వద్ద ఎదిగిన సంస్కృతి చరిత్ర పుటలను నింపేసింది. సముద్రాల తోనే ద్వీపాలను గుర్తించారు. సముద్రాన్నే వాడుకుని ఆక్రమణలు చేసి రాజ్యాలు పొంది మరో చరిత్రను సృష్టించారు. మీరు ఋషులు కారు, మేము మనుషులం అన్నారు. మీరు చేస్తున్నది ధర్మం కాదు, మేము చెప్పినది న్యాయమన్నారు. దమ్మున్నవాడు దుమ్ము లేపాడు.. అలా లోపలికి జారిపోయిన అలలా అంతా ఎక్కడికో జారుకున్నారు..
ఓ చిన్న పిట్ట ఎక్కడి నుంచో వచ్చి ఓ కొమ్మ మీద వాలి అలా చూస్తోంది. అదీ అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తోంది. ఓ వింత ప్రపంచం ఇది. దానికి సూర్యుడు కనిపిస్తాడో ఏమో! ఆ పూలు ఎలా అగుపిస్తాయో ఏమో! నీటిలో ప్రతిబింబం చూసుకుని ఏమనుకుంటుందో ఏమో!
రచనలు ఎలా ఉంటాయి? ఆ పిట్ట చేసిన చిన్ని కుదుపుకు ఆ నాలుగు పూలూ స్ప్రింగులా ఊగాయి. నలుగురు ఋత్విజులు ఉదాత్త అనుదుత్తములకు వేళ్ళు కదిపి స్వరం కలిపినట్లుంది. రచన స్పందనకు చెందినది. ఒక ఆలోచన లోకి రంగు నింపుతుంది. బీజం నాటినప్పుడు ఈ మొక్క ఇంతదవుతుందని, దీనికి ఈ రకం పూలు ఇంతింత వ్యత్యాసంతో పూయునని, అవి ఈ రంగుల్లో ఉంటాయని ఆ మట్టి తెలపదు, ఆ గాలీ గీత గీయదు, ఆ మొక్కా మాట్లాడదు. కాకపోతే ఓ అస్తిత్వం ఏర్పడుతోంది. ఓ ఆలోచన అలా నిలబడిపోయి కొద్ది కాలం ఓ రంగు అందరికీ కనిపిస్తోంది.
నా ఎడమ ప్రక్క చక్కని చెట్ల గుబురు లోకి అప్పటికే చీకటి చోటు చేసుకుని దోబూచులాడుతున్నది.
రెండు మైనాలు ఇరువురినీ ముక్కులతో సరదాగా పొడుచుకుంటున్నాయి. ఒక నేపథ్యాన్ని సృజించి అందులోకి ఓ కాన్వాస్‍ని పంపించి ఒక అద్భుతమైన చిత్రాన్ని గీయాలనుకుంటారు కొందరు. అనుభవించిన చీకటిని ఆ తెల్లని పరదా మీదకి తెచ్చి, ఈ చీకటిని చూసి ఆలోచించమంటారు. ఆ చిత్రం చిత్రమైనదన్నది అందరికీ తోచాలనే విచిత్రం మరింత చిత్రంగా ఉంటుంది. రచన ఎంతో దట్టంగా ఎదిగి వృక్షంలా మారి మరి కొన్ని వృక్షాలను సవాలు చేస్తూ ఉంటుంది. కాలగమనంలో లైట్ హౌస్‍లా నిలబడి నాకు జరిగిన అనుభవానికి ఇదే ప్రతిబింబం అంటుంది!
అలల అలజడిలోని అంతరాలలోకి చీకటి చేరి మధ్యమధ్యలో ఏర్పడుతున్న ఎత్తు పల్లాల మీద సూర్యుని క్షీణిస్తున్న కాంతిని ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తున్నట్లుంది. ఇక ఈ ఇల్లు మాది అని గట్టిగా చాటుతున్నట్లుంది. అలా కాదు, నా వల్ల నువ్వు అంటోంది ఆ చిరు వెలుగు. సర్లే, నాకు బార్డరుగా ఉన్నావు కాబట్టి నీకు ఆ అస్తిత్వం అంటోంది ఈ నల్లటి ‘కాంతి’! ఈ వేదాంతమంతా నాకెందుకు అని దాదాపు సగం క్రిందకి దిగిపోయాడు ఆ సూర్యుడు. అలాగే ఉండు, నాకో క్రొత్త ఆలోచన వస్తోంది, నా కలాన్ని ఇందులోకి ముంచేసి నేను ఏదో వ్రాసేస్తానంటున్నాడు ఓ రచయిత! వీడు బాగుపడడు! చీకటి వెలుగుల మధ్యనే నేను బ్రతకాలి, బ్రతికెయ్యాలి అంటున్నాడు! వీడిని ఎవరూ బాగుచెయ్యలేరు. ఆకాశం పరిచిన మబ్బులతో నిండి ఉంది.
ఈ రిసార్ట్‌లో గోడలు కూడా ఎంతో అందంగా అమర్చారు. ఒక వింత కోటును కుడి భుజం మీద నుంచి జారవేస్తున్నట్లున్నాడు సమీర్. నేను నిలబడ్డ బాల్కనీ క్రిందనున్న కారిడార్ లోంచి ఆ లాన్ మీదకి వచ్చాడు. అందరినీ తప్పుకుంటూ ఆ చివార్న ఉన్న గోడ దాకా వెళ్ళాడు. అక్కడ నిలబడి సిగరెట్ ముట్టించాడు. ఇద్దరు కుర్రాళ్ళున్నారు. అక్కడున్న టేబుల్‍ను గోడ వరకూ జరిపారు. ఒక కుర్చీ తీసేసారు. ఒక్క కుర్చీని గోడకి ఆన్చారు. వాళ్ళు వెళ్ళిపోయాక సమీర్ ఆ కుర్చీని కాలితో తన్నుతున్నట్లు జరిపినా అది గోడ వైపుకి తిరిగింది. ఎడమ వైపు టేబుల్ ఉంది. కోటు కుర్చీకి తగిలించాడు సమీర్. జాగ్రత్తగా కూర్చుని రెండు కాళ్ళూ ఆ గోడ మీదకి జాపాడు. అది పిట్టగోడ. అటువైపు కూడా కుర్చీలూ, టేబుళ్ళూ, జనం ఉన్నారు. అందుకేనేమో ఈ అలవాటున్నా రిసార్ట్ వాళ్ళు ఒప్పుకోరు. ఇతనొక్కడికే ఆ అవకాశం ఇచ్చినట్లున్నారు.
కెమెరా పట్టుకుని అందులోకి ఎవరైనా వచినప్పుడు క్లిక్ చేయటం ఒక విధమైన రచన. ఎవరినో, ఎక్కడో ఉన్న వాళ్ళని ఎంచుకుని అక్కడ దాకా పరుగులు తీసి అక్కడ మరల మరల వెతికి కెమెరా పట్టుకుని కథ నడపటం కోసం మరో రచన. ఒకరి దృష్టికి ఒక సృష్టి కనిపించినప్పుడు దానినే ప్రతిసృష్టి అనుకుని కాగితాలు నింపటం మరో దారి. ఇంతకీ నా పద్ధతి ఏమిటో నాకు తెలియలేదు కానీ నేను వ్రాద్దామనుకున్న దాంట్లోకి సమీర్ ఒక పాత్రలా దూరాడా లేక తొంగి చూస్తున్నాడా అన్నది అర్థం కాలేదు.
సమీర్‍కు ప్రక్కగా ఉన్న టేబుల్ వద్దకు ఓ వృద్ధ జంట వచ్చి కూర్చుంది. ఇద్దరూ గ్లాసులు పైకెత్తి సమీర్ వైపు చూస్తూ కొద్ది సేపు కళ్ళు మూసుకుని ఏవో అన్నారు. సమీర్ ఒక సిగరెట్ ముట్టించి వాళ్ళ వైపు పొగ వదిలాడు. వాళ్ళు పట్టించుకోలేదు. రెండు సార్లు గ్లాసులు పైకెత్తి మరల ఏదో అన్నారు. సమీర్ అటు తిరిగి మొహం చాటేసాడు. వాళ్ళు మరల ఏవో ఒకే గొంతుతో అన్నారు. నిదానంగా కూర్చుని డ్రింక్‍ను సేవిస్తున్నారు.
ఇదేంటి? ఈ వయోవృద్ధులకు ఈయనతో పనేంటి? కిరణ్ ఈ స్టార్ పవర్ ఇక్కడ కనిపించినట్లు ఎవరికీ చెప్పద్దంటాడు. వివరాలు చెప్పకుండా ఫోన్ కట్ చేసాడు. ఈ ప్రాంతంలోని విషయాలను, విశేషాలను అర్థం చేసుకోడానికి వస్తే ఇక్కడ కేవలం ఒక విశేషమే గట్టిగా కనిపిస్తోంది. సమీర్ సిగరెట్ పారేసాడు. వీళ్ళిద్దరూ అదే పనిగా తాగుతున్నారు. అక్కడికి వెళ్ళి సమీర్‍ని పలకరిస్తె ఎలా ఉంటుంది? ఎందుకో వెళ్ళాలనిపించలేదు. ఈ ముసలి జంట వెళ్ళిపోతే వెళ్ళి కూర్చోవచ్చనిపించింది!
ఈ వృద్ధ జంటకీ, సమీర్‍కీ ఏంటో వ్యవహారం అర్థం కాలేదు. గ్లాసులు సగం ఖాళీ చేసి మరల నిలబడ్డారు. సమీర్ ఈసారి పూర్తిగా అటు తిరిగిపోయాడు. అయినా ఇద్దరూ ఒక పుస్తకం పట్టుకుని అందులోంచి ఏదో చదువుతున్నట్లు అర్థమవుతోంది. అలా చదువుతున్నంత సేపూ సమీర్ కళ్ళు మూసుకున్నట్లు కూడా అర్థమవుతోంది. చాలా అసహనంగా ఉన్నట్లున్నాడు. రెండు చేతులతో తల పట్టుకుని అటూ ఇటూ ఊగాడు. లటుక్కున లేచాడు. ఇది ఆ పుస్తకంలోని మాటల ప్రభావం క్రింద వాళ్ళు భావించినట్లున్నారు. పుస్తకం మూసేసారు. ఆయన రెండు చేతులూ సమీర్ తల మీద తాకకుండా పెట్టాడు. ఈ వింత గోలను అందరూ చూస్తున్నారు. అలా చూస్తున్న వారందరినీ ఆవిడ ఏదో అనంతమైన శక్తి పూనిన దానిలా చూసి ఆస్వాదిస్తోంది. ఈ సినిమా హీరో అంతగా గెడ్డం పెంచి పిచ్చివానిలా తయారవటానికి ఇదొక బలమైన కారణం అయి ఉండవచ్చని గట్టిగా అనిపించింది. సమీర్ కూర్చుని పూర్తిగా వెనక్కి వాలిపోయాడు. వాళ్ళిద్దరూ గ్లాసులు ఖాళీ చేసి బిల్లు చెల్లించి వెళ్ళిపోయారు. ఈ ప్రక్రియ యావత్తూ ఏదో తీవ్రమైన పరిశోధన చేసి అర్థం చేసుకోవాలనిపించింది. రంగంలోకి దిగవలసిన సమయం ఆసన్నమైందని గ్రహించాను.
క్రిందకి దిగి సమీర్ వద్దకు వెళ్ళాను. చిరుత పులి కళ్లు రెండూ పైకెత్తి చూసినట్లు జాగ్రత్తగా చూసాడు. ఎదురుగా కూర్చున్నాను.
“సుందర్ కదా, మీ పేరు”
“కరెక్ట్”
“ఏంటి ఇదంతా?”
అతను చుట్టూతా చూసాను.
“ఇది మా రెగ్యులర్ జాయింట్”
“అది కాదు. వీళ్ళెవరో వృద్ధులు ఏదేదో చేసారు..”
విరగబడి నవ్వాడు.
“ఎందుకలా నవ్వారు?”
“చిన్నప్పుడు ఇంట్లో తలంటు పోసేవారు గుర్తుందా?”
“ఉంది. నాకు కుంకుడుకాయ రసం పడదు. కళ్ళల్లోకి వెళ్ళకుండా జానపద హీరోలా కళ్ళకు కట్టుకుని కూర్చునేవాడిని”
“అప్పుడు తల మీద బాదుతున్నవారికి స్వర్గసుఖం దగ్గిరలో ఉండేది”
“కరెక్ట్”
“ఇదీ అంతే!”
“అంటే వాళ్ళు మీ తల్లిదండ్రులన్న మాట”
చేతి లోని గ్లాసు వెంటనే జారి టేబుల్ మీద కూర్చుంది.
“కారు” అంతే అన్నాడు.
“మరి వింతగా తలంటు కార్యక్రమం పెట్టారెందుకు?”
“మీకు చాలా విషయాలు చెప్పాలి”
“చెప్పండి. నేనుందుకే ఉన్నానిక్కడ”
“శభాష్. ఇప్పుడు ఇక్కడ మజ్జిగ దొరకదు”
“అయితే..”
ఒకడ్ని పిలిచాడు సమీర్. ఏవో సాఫ్ట్‌డ్రింక్స్, స్నాక్స్ చెప్పి సిగరెట్ తీసాడు.
“మీరు ఏవేవో వ్రాస్తూ ఉంటారు. అవునా?”
“ఏవేవో కాదు”
చెయ్యి చూపించి ఆపాడు.
“ఏదో ఒకటి..”
“ఓ.కే. అయితే?”
“ఎందుకని వ్రాస్తారు? శిలా విగ్రహం మీద పూలదండకైతే కాదు కదా?”
“కాదు”
“ఒక ప్లాస్టిక్ బిళ్ల మీద మేధావి అని వ్రాయించి చొక్కాకి తగిలిచుకోవటం కోసమా? కాదు”
“కానే కాదు”
“పది మందీ మిమ్మల్ని పదిమందిలో గుర్తు పట్టేందుకా?
“కాదు అసలు గుర్తుపట్టకుండా ఉండేందుకు. అందుకే చాలామంది కలం పేరుతో వ్రాస్తారు.”
“మరి ఎందుకు వ్రాస్తారు?”
“నిద్ర బాగా పట్టేందుకు”
“హు! దానికి ఇవన్నీ ఉన్నాయి..” బాటిల్స్‌ని చూపించాడు.
“రచయిత వ్రాసినవి చరిత్రలో భాగాలు”
“ఛా! పాత వైన్ ఎంతో పాత చరిత్ర లోని భాగం! మత్తెక్కిస్తుంది”
“ఇంతకీ నా ప్రశ్నకి సమాధానం రాలేదు”
“చెబుతాను. వాళ్ళిద్దరూ తరతరాలుగా ఓ విద్యను అభ్యసిస్తున్నారు.”
“ఓ”
“అది మా ప్రాంతానికి చెందిన ఆనవాయితీ. ఎవరైనా తన అస్తిత్వాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తుంటే ఇలా చేసి వారికి వారి గురించి తెలియజేస్తారు.
“అంటే మీకు మీరే గుర్తులేరా? మీరే వారి సేవలను అడిగారా?”
“కాదు. ఎవరో పంపారు. వారానికోసారి ఈ వ్యవహారం చేస్తారు”
“ఒక చోట మీరు తీవ్రంగా స్పందించారు?”
“అవును. నటుడిని కదా!”
“ఓ, ఎందుకు? అవసరమా?”
“చాలా పెద్ద కథ.. ఈ బాటిల్ చాలదు..”
గోవన్ మ్యూజిక్ ప్రారంభమైంది.
(ఇంకా ఉంది)