పూచే పూల లోన-40

0
2

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[తాను అప్పటి వరకూ రాసిన కాగితాలన్నిటినీ ఒకసారి నిమిరి బాధతో కుర్చీలో కూలబడతాడు సుందర్. తాను వ్రాసిన వాటిలో కొత్త విషయాలు ఏమున్నాయని అనుకుంటాడు. అతనిలో అంతర్మథనం జరుగుతుంది. తర్వాత ఆసుపత్రికి వెళ్తాడు. చిత్ర, జో, సుందర్ ముగ్గురు జ్యోతి వేసిన బొమ్మని చూస్తారు. చిత్రకి ఏమీ అర్థం కాకపోయినా, జో కి, సుందర్‍కి చాలా విషయాలు అర్థమవుతాయి. అది ఎవరి బొమ్మ అని జో అడిగితే, జ్యోతి సమాధానం చెప్పదు. నీ బొమ్మలానే ఉంది అని చిత్ర అంటుంది. ఎవరి బొమ్మ వేస్తున్నావని సుందర్ అడిగితే, అది అసలు బొమ్మే కాదని జరిగిన కథ అని అంటుంది జ్యోతి. వివరాలు చెప్పమంటే, చెప్పదు. గట్టిగా అరుస్తుంది. సిస్టర్ లోపలికి వచ్చింది. జ్యోతి మనసుని ఎక్కువగా కష్టపెట్టకూడదని, బయటకి వెళ్ళిపోమంటుంది. జోని చూసి ఆయనెవరు అని అడుగుతుంది సిస్టర్. సుందర్ చెబుతాడు. చిత్ర ఒక్కర్తీ గదిలో ఉండి, జో ని, సుందర్‍ని బయటకు పంపేస్తుంది. – ఇక చదవండి.]

[dropcap]“జ[/dropcap]బ్బులన్నీ కేవలం శారీరికం, మానసికం అని వైద్య విజ్ఞానం చెబుతుంది..”

జో గంభీరంగా అన్నాడు.

“మరి?”

“మనకు కనిపించనివి, వినిపించనివి చాలా ఉన్నాయి.”

“కావచ్చు.”

“ఎంత వైద్యం చేసినా తగ్గని జబ్బులున్నాయి.”

“ఉంటాయి.”

“ఎన్ని టెస్టులు చేసిన రిపోర్ట్‌లన్నీ నార్మల్ అంటాయి.”

“జబ్బేమిటో తెలియదు.”

ఆస్పత్రిలో కూర్చున్న వాళ్లు ఒకళ్లిద్దరు మమ్మల్ని బాగా చెప్పారన్నట్లు చూస్తున్నారు. జో కళ్లు మూసుకుని మీసం, గెడ్డం కలిసిన చోట ప్రేమతో నిమురుకున్నాడు.

“జ్యోతికి కనిపిస్తున్నవన్నీ డాక్టర్ల ప్రకారం రైటే. కానీ మీకూ, నాకూ ఒక్క విషయం తెలుసు.”

“నాక్కూడానా? ఏంటది?”

“బిల్డింగ్ లోపలున్న ఓ చిత్రంలోని అమ్మాయిలా తను మారిపోయి అరుపులు, కేకలు పెట్టింది. అవునా కాదా?”

“నిన్నటి వరకు అది మన అంచనా, ఊహ అనుకున్నాను. ఈ రోజు మటుకు పూర్తిగా నిర్ధారించున్నాను. ఆ కాన్వాస్ మీద స్కెచ్ చూసాక మతిపోయింది.”

“యస్. మరి ఇది జబ్బా, ఏంటి?”

“ఓకే. మీరు దీనిని నయం చేస్తారన్నారు. ఎలా?”

“పూచే పూలతో!”

ఆశ్చర్యం వేసింది. జో కి అప్పుడు బై చెప్పి వచ్చేసాను కానీ బుర్ర బుర్రలో లేదు.

బాల్కనీలోంచి చూస్తే మెల్లగా రిసార్ట్స్‌లో కుర్చీలు నిండుతున్నాయి. జ్యోతికి వైద్యం చాలా అవసరం. నేను సంపాదించిన రాగి శాసనాలు ఎన్నో అర్థం కాకుండా అలా ఉండిపోయాయి. ఇప్పటివరకు అర్థమైన వాటిని అటూ ఇటూ మార్చేసి పుస్తకం అయి పోయింది, నా పని కూడా అయిపోయిందని చేతులు దులుపుకుంటే? గవడె ఆమోదించడు. జాగ్రత్తగా ఆలోచిస్తే గవడెకి, జ్యోతి ఎన్నో సార్లు చెప్పిన మాధవ్‌కి లాలూచీ ఉంది. పోనీ ఇంటికి వెళ్లొస్తానని చెప్పి కొన్నాళ్ళు ఈ గొడవని గొడవకే వదిలేస్తే? చిత్ర లాంటి వాళ్లు తిడుతూనే ఉంటారు. అవన్నీ పట్టించుకోకూడదు. కానీ ఒక్క సమస్య ఉంది. ఈసారి వచ్చినప్పుడు ఈ మనుషులెవరూ నాకు దొరక్కపోవచ్చు.

కాలింగ్ బెల్ మ్రోగింది. తలుపు తెరిచాను. చిత్ర నిలుచునుంది.

మాట్లాడకుండానే లోపలి కొచ్చి సోఫాలో కూర్చొని తల పట్టుకుంది.

“ఏమైంది?” అడిగాను.

“గోవా వదిలి వెళ్లిపోతారా?”

“అది తలచుకుని తలనొప్పి తెచ్చుకున్నావా?”

కోపంగా చూసింది.

“తమాషాగా ఉందా?”

“జ్యోతి తాలూకు బంధువుల నంబర్లు నాకు ఇయ్యి. నేను మాట్లాడతాను.”

ఫోన్ తీసి గబగబా కొన్ని నంబర్లు షేర్ చేసింది.

“మాట్లాడండి”, అంది.

“సరే కానీ ఈమె తల్లిదండ్రుల నంబర్లు చెప్పు. వారు ముఖ్యం.”

“అవి లేవు.”

“మరి కరెక్ట్‌గా బాధ్యత గల వారెవరు? అది తెలియాలి కదా?”

“పేరు తెలియదు కానీ నాలుగు ఎస్‌లు గల నంబరు.”

మెల్లగా వెతికి తీసాను. నాలుగు ఎస్‌లు దొరికాడు.

ఫోన్ తిప్పాను. ఫోన్‌లో మాట్లాడాటానికి సిద్ధమైనట్లు తెలిసింది కానీ నేను హలో అనేవరకూ అతను హలో అనటం లేదు.

“నమస్కారమండీ”, అన్నాను.

“ఎవరు?”

“నా పేరు సుందర్.”

“ఎక్కడి నుంచి?”

“గోవా..”

కట్ అయిపోయింది. అక్కడ చిత్ర పిచ్చి పిచ్చిగా నవ్వుతోంది. మెల్లగా బాల్కనీలోకి వెళ్లాను. చిత్ర కూడా వచ్చి ప్రక్కన నిలుచుంది.

“కోపం వచ్చిందా?”

“వీళ్లు ఇలాగే ఉంటారు. ఇంట్లో ఇవరికీ చెప్పకుండా వచ్చేసిందా?”

“ఇన్ని రోజులు ప్లాన్ చేసుకుని అన్నీ సద్దుకుని ఇక్కడ ఉంటోందంటే ఆ బాపతు కాదు.”

“ఈ అమ్మాయికి ఉన్న సమస్య ఇంట్లో అందరికీ తెలిసే ఉంటుందని నా అనుమానం. ఎవరూ పెద్దగా పెట్టించుకోరనుకుంటున్నాను.”

“ఇంతకీ ఇక్కడ ఉంటారా? వెళ్లిపోతారా?”

“ఉంటే ఏంటి? వెళ్లిపోతే ఏంటి?”

“ఏదో ఒకటి చెబితే నేను నా ప్రోగ్రామ్ వేస్కోవాలి”

“జ్యోతి లేకపోతే మీ డాక్యుమెంటరీ ఆగిపోతుందా?”

“ఆగదు. వేరే వాళ్లు వచ్చేవరకూ ఆగాలి. కానీ జ్యోతిని ఇలా వదలి వెళ్ళటం – ఇక్కడున్నా కూడా.. నాకు ఇష్టం లేని పని.”

“మొదటి విషయం- జ్యోతి నీతో ఉన్న అమ్మాయి. యాదృచ్ఛికంగా నా పనిలోకి వచ్చింది.”

“మనిద్దరికీ జాయింట్‌గా ఏ బాధ్యతా లేదా?”

“ఉంటుంది. కానీ ఎన్ని రోజులు అన్నది ఆలోచించాలి.”

“కనీసం ఆస్పత్రిలోంచి బయటకొచ్చేవరకైనా?”

“కావచ్చు. ఆస్పత్రిలో వాళ్లు ఏమంటున్నారు?”

“ఇంట్లో జాగ్రత్తగా చూసుకోగల్గితే ఇప్పుడే తీసుకెళ్లి మందులు వాడమంటున్నారు!”

“ఈ డబ్బులు, వ్యవహారాలు?”

“నేను కొంత ఖర్చు పెట్టాను. నిన్ననే ఎ.టి.ఎమ్ కార్డ్ ఇచ్చి పిన్ నంబరు కూడా ఇచ్చింది.”

“నిన్ను గుర్తు పట్టి, నమ్ముతోంది. కానీ ఎందుకో ఏమీ తెలియనట్లు, నిన్ను ఎరుగనట్లు అరుస్తుంది. ఇదేంటో?”

“అందుకే కదా ఆస్పత్రిలో ఉంది.”

“దీనినే పిడకల వేట అన్నారు.”

“నిజంగా మీకు జ్యోతితో పని లేదా?”

“ఒకటి చెప్పు. నాకు నిజంగా పని ఉన్నా ఒకవేళ ఆమె నాకు సహకరించ లేదనుకో.. అప్పుడు? నా దారి నేను చూసుకోవాలి కదా?”

దూరంగా సముద్రంలో లైట్లు వెలుగుతున్నాయి. చిత్ర ఏమీ మాట్లాడటం లేదు.

“సరిగ్గా జీవించాలంటే రెండు పనులు చెయ్యమన్నాడు.” అంది.

“ఎవరన్నారు?”

“పో.. ఎడ్గర్ ఎలన్ పో.”

“ఓ.. ఏమంటాడు?”

“కనిపించనిది దేనినీ అస్సలు నమ్మద్దన్నాడు.”

“రెండవది?”

“కనిపిస్తున్న దాంట్లో ఎప్పుడూ నిజమే నమ్మమన్నాడు. ‘

ఆలోచించాను.

“నేను మరోలా చెప్తాను” అన్నాను.

“అంటే?”

“కనిపించే దానిని ఏ మాత్రం నమ్మను.”

“ఓ”

“కనిపించని దానిని మొత్తం నమ్ముతాను!”

“ఎందుకలాగ?”

“కనిపించని దానిలో ఏదో వింత, ఏదో శక్తి ఉంటుంది. అవునా?”

“నిజమే. ఒక్కోసారి మనం చూడలేదన్నంత మాత్రన అది అక్కడ లేదనుకోవటం పొరపాటు కాదా?”

“అవును.. ఇంతకీ ఈ మాటలెందుకు ఇప్పుడు?”

“ఊఁ.. మిమ్మల్ని చూసి మంచివారనుకున్నాను.”

“చాలా పొరపాటు. నేను అందరి లాంటి వాడినే. మంచి వాడినే, చెడ్డ వాడిని కూడా.”

“కానీ రచయిత కూడా”

“అది సమాజంలో ఒక మాట. అంత కంటే ఏమీ లేదు”

“ఇంతకీ జో అనే వ్యక్తి ఎందుకు జ్యోతి పట్ల ఇంత ఆసక్తి చూపిస్తున్నాడు?”

“అదో పెద్ద కథ.”

“నాకు తెలియాలి.”

“జో ఒక వింత పరిశోధకుడు. అతనికి చాలా విషయాలు తెలుసు.. వైద్యం కూడా!”

“ఓ. భూత వైద్యుడా?”

నవ్వాను. “అలా కనిపిస్తాడు. నీకో సంగతి తెలుసా?”

“ఏంటి?”

“నేనిక్కడ లేకపోయినా ఫరవాలేదు.”

“ఎందుకు?”

“నువ్వు జో తో కాంటాక్ట్ పెట్టుకో. అతను జ్యోతికి వైద్యం చెయ్యగలనున్నాడు.”

“ఏంటి? ఈ మనిషా? అతనికే వైద్యం అవసరం అనుకున్నాను.”, గట్టిగా నవ్వింది.

“అవును. అతను ఒక గొప్ప వైద్యుని వద్ద చిన్నప్పుడు ప్రకృతిలోని ఎన్నో రహస్యాలను తెలుసుకున్నాడు.”

ఎందరో ఉన్నట్టుండి గబ గబా బాల్కనిలోంచి హల్లోకి వెళ్లి సోఫాలో కూలబడింది. తల గట్టిగా పట్టుకుంది.

“ఏమైంది చిత్రా? ఉన్నట్టుండి తలనొప్పి వచ్చిందా?”

ఏమీ మాట్లాడలేదు. నన్ను వచ్చి ఎదురుగా కూర్చోమంది.

జాగ్రత్తగా వచ్చి కూర్చున్నాను. నన్ను అదోలా చూసింది.

“మీకో సంగతి తెలుసా?”

“ఏంటి?”

“మీరు ఆస్పత్రి నుండి వెళ్లిపోయాక పోలీసులు అతన్ని వెతుక్కుంటూ వచ్చి తీసుకొని వెళ్లిపోయారు.”

క్రింద రిసార్ట్స్ లాన్‌లో ఎవరో గట్టిగా నవ్వుతున్నారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here