పూచే పూల లోన-43

0
2

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[ఆ రాత్రి చిత్ర ఎంతో దిగులుగా, కొంత విసుగ్గా, భయంగా గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతుంది. జ్యోతి గురించి, చిత్ర గురించి ఆలోచిస్తాడు సుందర్. వాళ్ళిద్దరినీ ఇక్కడ వదిలేసి తాను హైదరాబాద్ వెళ్ళిపోయినా, సమస్య పరిష్కారం కాదని భావిస్తాడు. మర్నాడు ఉదయం కృష్ణప్రసాద్ గారి తోటకి వెళ్తాడు. ఆయన ఏవో పూలూ, ఆకులూ కోయిస్తూ ఉంటారు. ఎందుకు కోయిస్తున్నారని అడిగితే, ఏమైపోయారని ఆయన ఎదురు ప్రశ్నిస్తారు. ఇద్దరూ పూల గురించి, పూల వల్ల ఒనగూడే ఆరోగ్య ప్రయోజనాల గురించి మాట్లాడుకుంటారు. తాను కోయించిన ఆకులని ఆప్తులు అని అంటారని చెప్పి, వాటి ఉపయోగాలను చెప్తారు. ఇంతలో కార్వాల్లో అక్కడికి వచ్చి సుందర్ వెనుక నిల్చుంటాడు. వెనక్కి తిరిగి చూసిన సుందర్ ఆశ్చర్యపడి, ఇక్కడున్నారేంటి అంటే, చాలా ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను అంటాడు కార్వాల్లో. – ఇక చదవండి.]

[dropcap]కా[/dropcap]ర్వాల్లోతో రిసార్టు లోని కేఫ్‍లో కూర్చున్నాను. ఒక సంచీ లోంచి ఏవేవో కాగితాలు తీసి నా ముందుంచాడు.

“మా కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు.”, చెప్పాడు

“ఏం కావాలి?”

“మరచిపోయారా?”

ఇది మరీ బావుంది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచీ జరుగుతున్నవన్నీ గుర్తుపెట్టుకుంటే ఒక బాధ, మరిచిపోతే మరొకటి. మరచిపోవాటంటే మరో బాధ.

“దాదాపుగా, కాకపోతే, ఏదో ప్రాపర్టీ మేటర్ అనే అలా అలా గుర్తు.”

“అవును. మా బంగళా ఆర్కియాలజీ వారు తీసేసుకుంటే, ఆ ఒక్క హాలులో నేను చరిత్రను, నన్నూ కాపాడుకుంటూ వస్తున్నాను.”

“శభాష్.”

ఈ మాట బాగుంది. సొంత భూమినీ, ఆస్తినీ గట్టిగా కౌగలించుకుని జీవితాంతం పోరాడేవాడు లడాక్ బార్డర్‍లలో శత్రుసైన్యం ఆక్రమించకుండా ప్రాణాలకు తెగించి కాపాలా కాస్తున్నవాడితో సమానం! కాకపోతే తేడా ఒకటే. ఇక్కడ ఎవడో ఇప్పటికే ప్రాణాలు తీసేసాడు, అక్కడ తీయడానికి సిద్ధంగా ఉన్నాడు.

“ఎందుకు? శభాష్ అన్నారు?”

“రెండు..”

“చెప్పండి.”

“ఒకటి.. యావత్ గోవా చరిత్రనూ, నన్ను అన్నారు.”

“అవును, తప్పేంటి?”

“తప్పు అని నేననలేదు.”

“మరి?”

“అలా రెండింటినీ కలపటం విశేషం అన్నాను.”

“రెండవది?”

“మీ ఆస్తిని కాపాడుకోవటం గోవా చరిత్రను పునర్నిర్మించటం అనే మాట గంట కొట్టినట్లు వినిపిస్తోంది.”

అతను నా చేయి పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు. బేరర్ వచ్చి టీ కప్పులు టేబుల్ మీద పెట్టి చిరునవ్వు నవ్వాడు. కార్వాల్లో వింతగా చూసాడు అతన్ని.

“నీ చేయికి కూడా ముద్దు పెట్టాలా?”, అడిగాడు.

“నో.”

“మరి దయ చేయి.”

అతను వెళ్లిపోయాడు.

“ఇంతకీ నా చెయ్యికి ఎందుకు ముద్దు పెట్టారు?”

“నా బాధను అర్థం చేసుకోవటమే కాదు, గుర్తించి, నా ఘర్షణను మెచ్చుకున్నారు కూడా!”

“ఊఁ. ఇంతకీ ఏంటి సంగతి? నాతో ఏంటి పని?”

“ఏంజలీనా నాకు దూరపు బంధువు అని ఎలాగో అలాగ నిరూహించాలని కోర్టు వారంటున్నారు.”

“నిరూపించండి!”

“ముందర, వాడు పెట్టిన టీ తీస్కోండి, అన్నట్లు ఎంత చక్కగా చెప్పారు సార్!”

“కరెక్ట్, టీ తీస్కోండి. చల్లరిపోతుంది.”

అతను కప్పు తీసుకున్నాడు.

“నిజమే. చల్లారకుండానే త్రాగాలి. మీరు కూడా వేడి చల్లారే ముందరే నాకు సహయం చెయ్యలి.”

“మీకూ, ఆ పైన పడక కుర్చీలో కూర్చున్నదో, పడుకున్నదో తెలియదు, చుట్టూతా చిత్ర విచిత్రాల పెయింటింగులన్నీ గోడల మీద పెట్టుకుని అప్పుడప్పుడు మురిసిపోతూ, అప్పుడప్పుడు నిట్టూరుస్తూ ఉన్న ఆ వయోవృద్ధురాలికి బంధుత్వం ఉన్నదన్న విషయం నిరూహించటానికి ఏ మాత్రం సంబంధం లేని నేను సహాయపడాలి. ..జీవితాన్ని పూర్తిగా కామెడీగా చూడటం సాధ్యమా! చివరకు మిగిలేది అంతా కామెడీనే అని అనుకోవడమూ సాధ్యమే. అక్కడక్కడ ఎంతో కొంత అందరి జీవితాలలో కామెడీ నింపుకోవడం కూడా ప్రయత్నించి చేయవచ్చు. ముక్కూ మొహం తెలియని వ్యక్తిని పెళ్ళి చేసుకుని సంసారం చేయవచ్చు. నిజానికి అదీ కామెడీయే! ఎవరెవరికో సంబంధాలున్నాయి, ఎవరెవరికో మధ్య ఏ సంబంధమూ లేదు అని కోర్టు హాలులో నిలబడి.. యువరానర్, దీని బట్టి ఇది తేలిపోతోందని చేతులు రెండూ ఆకాశానికి అప్పజెప్పి అరిచేందుకు నేను లాయర్‌ని కాదు.”

“మీ కామెంట్రీ బాగుంది. ఈ టీ కూడా బాగుంది.” అన్నాడు.

“గుడ్. మరి?”

“పాయింట్‌కి వస్తున్నాను. మా లాయర్ నన్ను ఇక్కడికి పంపాడు.”

గొంతులో ఏకంగా కొబ్బరికాయ పడ్డట్టుంది. నా పరిస్థితి ఎంత దారుణంగా తయారవుతోందో పూర్తిగా అర్థమయిపోతోంది. నాలుగడుగుల దూరంలో ఓ టేబుల్ దగ్గర ఒకాయన పేపరు చదువుతున్నాడు. ఆ పేజీలో ఎవరిదో ఫొటో ఉంది. అదేంటో కొద్దిగా నా ఫొటోలా ఉంది? నిజమా? భ్రమా?

ఈ లోకంలోకి వచ్చాను.

“ఊఁ.. జీవితంలో లాయర్లు, పోలీసులు, గవర్నమెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవసరం రాకూడదని పెద్దలంటారు ఇప్పుడర్థమైంది. నా బ్రతుకు యావత్తూ ఇక్కడ తెలిసిపోయిందన్న మాట. ఇక జరగబోయేది చాలా స్పష్టంగా ఉంది.”

“చెప్పింది మామూలు లాయరు కాదు. ముంబయి హై కోర్టులో అందరికంటే సీనియర్ లాయర్. ఇక్కడికి తరచూ వస్తూ ఉంటాడు.”

“ఓ. ఇంకా ఇక్కడే అనుకున్నాను. కిటికీ బయటకి చూసి నౌకరెవరో – సార్, అప్పులవాళ్ళు వస్తున్నారన్నాడట! మామూలుగా ఉన్నారా, ఊరుకున్నారా అన్నాడుట. కత్తులతో వస్తున్నాడన్నాడు. ఇంకా ఏం చేస్తున్నారన్నాడు.. ఒకడు కత్తులకు పదును కూడా పెడుతున్నాడన్నాడు.”

“జోక్ బావుంది” అన్నాడు కార్వాల్లో.

బేరర్ వచ్చి టీ కప్పులు తీసుకుని చిరునవ్వు మళ్లీ ప్రదర్శించాడు. నన్ను ఎందుకో జాలిగా చూసి వెళ్లిపోయాడు!

“ఇంతకీ నేను చేయగలిగింది ఏముంటుంది?” సూటిగా అడిగాను.

“మీకు కొందరు పరిచయం.”

“ఎవరు?”

“స్టెల్లా.”

దాదాపు కుర్చీలోంచి పడిపోయాను. పేపరు చదువుతున్న మనిషి నన్ను ప్రశ్నార్థకంగా చూసాడు.

“నాకు పరిచయం కాదు. ఆమెను ఒకసారి చూసాను. అంతే.”

కార్వాల్లో నవ్వాడు. చెయ్యి అభయ హస్తం చూపించినట్లు చూపించాడు.

“గతంలో స్టెల్లా గురించి నేనే ప్రస్తావించాను. ఆ ఇంటికీ, మాకూ సంబంధాలున్నాయి.”

“నాకు కొందరు పరిచయం అనటం విన్నాను. ఇంకా ఎవరు సార్?”

“హ హ.. జోవాక్విమ్ లేదా జో.”

ఇతను నా వద్దకు సహయానికి వచ్చాడా లేక ఏ సి.ఐ.డి. వాళ్ళో పంపగా వచ్చాడా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇతను సరిగ్గా గవడే గారి క్రిందనే ఉంటాడు.

“ఇంకా?”

“సమీర్ కుమార్.”

అక్కడ నలుగురైదుగురు నా వైపు తిరగటం గమనించాను. కార్వాల్లో సీరియస్‌గా ఉన్నాడు.

“ఇంకా?”

“మీ పరిశోధనలో మీతో సహకరిస్తున్న ఇద్దరమ్మాయిలు.”

“బాగుందండీ వ్యవహారం! మీరు నన్ను ఏదో ఊబి లోకి లాగుతున్నారు. నన్ను వదిలెయ్యండి.”

“భయపడకండి. ఇదంతా కస్టడీలో ఉన్న జోవాక్విమ్ పోలీసులకి చెప్పిన విషయం.”

“నా గురించి పోలీసులు అడిగితే చెప్పాడా లేక తనంతట తానే చెప్పాడా?”

“సమీర్ కుమార్ గురించి ప్రశ్నిస్తూ ఇటీవల ఎవరెవరితో కలిసారా అన్నప్పుడు ఈ మాటలు ముందుకు వచ్చాయి. నాకు జో గురించి తెలుసు. అతనికి చాలా మంచి పేరుంది.”

ఆలోచించాను. ఎందుకైనా మంచిది. ఇతని దగ్గిర కొన్ని విషయాలు రాబట్టుకోవటమే ఉత్తమం అనిపించింది.

“మీరు కోర్టుల చుట్టుతా తిరుగుతూ పోలీసుల గురించి కూడా తెలుసుకుంటున్నారని అర్థమైంది. సూటిగా చెప్పండి, నాకు ఎటువంటి హాని ఉన్నదో తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ సంగతి తరువాత..!”

“ఏ హానీ లేదు.. నన్ను నమ్మండి. మీకు ఏదో హాని ఉన్నదంటే మీ దగ్గరకు సహాయానికెందు కొస్తాను?”

కొంత ఊరట కలిగింది. కార్వాల్లో నాకు ఎందుకో మంచివాడే అనిపించాడు. అతనే అన్నాడు..

“సార్, పోలీసులు సమీర్‌ను గాలిస్తున్నారు. మిమ్మల్నీ విచారిస్తారు. అదేమీ పెద్ద విషయం కాదు. ఆ విచారణలో నాకు మీరు ఒక పని చేసి పెట్టాలి.”

“ఓ.. ఏంటది?”

“స్టెల్లా తల్లిదండ్రులు నిజమైన తల్లిదండ్రులు కారు.”

“ఓ. అయితే?”

“అసలు తల్లిదండ్రులను పోలీసులను వెతకమని చెప్పండి.”

“ఎందుకు?”

“వాళ్ల దాయాదులు ఏంజలీనాకి నిజమైన సోదరులు.”

“ఓ.”

“వాళ్ళు దొరికితే నా కేసు బలం పుంజుకుంటుంది.”

“అర్థమైంది. గవడే సంగతేమిటి?”

“ఏంజలీనాకు సంబంధించిన కొన్ని రహస్యమైన ఫొటోలు గవడే తాలూకు కెమెరామెన్ వద్ద ఉన్నాయి..”

కళ్లు నలుపుకున్నాను. ఎక్కడో ఏదో వెలుగుతోంది.

“అతని పేరు?”

“మాధవ్!”

“కరెక్ట్! జైల్లో ఉన్నాడు. అవునా?”

కార్వాల్లో సిగరెట్ తీసి ముట్టించాడు.

“అవును. అతని వద్ద ఉన్న కళ చాలా గొప్పది.”

“ఏంటది?”

“అతను ఫొటోలే కాదు, చాలా విషయాలను మెదడులో బంధించి ముందరుంచగలడు.”

“ఉదాహరణకి..”

“మీకు పరిచయం అయిన ఒక అమ్మాయి ఫొటోలు..”, అంటూనే చెయ్యి అడ్డు పెట్టాడు.

“మరోలా అనుకోకండి.. నేను అశ్లీలమైన వాటి గురించి చెప్పటం లేదు..”

“మరి?”

“కొన్ని సందర్భాలలో ఆ అమ్మాయి ఫొటోలో పడలేదు.”

”అయితే?”

“మీకెలా చెప్పాలి? నలుగురిలో మధ్యలో నిలబెట్టి తీసినప్పుడు ఈ అమ్మయి తప్ప ముగ్గురూ పడ్డారు!”

“ఛా.”

“అవును. మిగతా సందర్భాలలో ఫొటోలలో బాగానే పడింది – అన్ని పోజులలో!”

నా కాళ్ల క్రింద భూమి కదులుతున్నట్లనిపించింది..

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here