పూచే పూల లోన-44

0
2

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[రిసార్ట్స్ లోని కేఫ్‍లో కార్వాల్లోతో కూర్చుంటాడు సుందర్. తన సంచీలోంచి ఏవో కాయితాలు తీసి సుందర్ ముందు ఉంచి తమ కేసు ఇంకా ఓ కొలిక్కిరాలేదంటాడు. మీకేం కావాలని అడుగుతాడు సుందర్. మర్చిపోయారా అంటాడు కార్వాల్లో. ఏదో ప్రాపర్టీ మేటర్ అని గుర్తు అని చెప్తాడు సుందర్. అవునంటాడు కార్వాల్లో. ఆ ఒక్క హాలులో చరిత్రనూ, తననూ కాపాడుకుంటూ వస్తున్నానని చెప్తాడు. చరిత్రనీ, తననీ కలపడం విశేషమని అంటాడు సుందర్. ఏంజలీనా తనకు దూరపు బంధువని ఎలాగో అలాగ నిరూహించాలని కోర్టు వారంటున్నారని చెప్తాడు కార్వాల్లో. అందుకు సుందర్ సహాయం అవసరమని అంటాడు. తనని వాళ్ళ లాయర్ ఇక్కడికి పంపాడని చెప్తాడు. తాను చేయగలిగిందేముందని అడుగుతాడు సుందర్. స్టెల్లా, జోవాక్విమ్, సమీర్, ఇంకా ఇద్దరు అమ్మాయిలు – మీకు పరిచయమేగా అంటాడు కార్వాల్లో. తనని ఊబిలోకి లాగొద్దని అంటాడు సుందర్. ఈ వివరాలన్నీ జో పోలీసులకి చెప్పాడని అంటాడు. సుందర్‍కి ఏ హాని ఉండదని, తనని నమ్మమంటాడు. పోలీసులు సుందర్‍నీ విచారిస్తారనీ, ఆ విచారణలో – స్టెల్లా తల్లిదండ్రులు నిజమైన తల్లిదండ్రులు కారనీ, అసలు తల్లిదండ్రులను వెతకమని చెప్పమంటాడు. ఎందుకని సుందర్ అడిగితే, వాళ్ళ దాయాదులు ఏంజలినాకి నిజమైన సోదరులు అంటాడు.  మరి గవడె సంగతేమింటటే, అతనికి సహకరించే కెమెరామాన్ మాధవ్ వద్ద కొన్ని రహస్యమైన పోటోలు ఉన్నాయని అంటాడు. మాధవ్‍ ఎన్నో విషయలను మెదడులో బంధించి మన ముందుంచగలడని చెప్పి, అతను తీసిన కొన్ని ఫోటోలలో జ్యోతి పడకపోవడం గురించి చెప్తాడు. విస్తుపోతాడు సుందర్. – ఇక చదవండి.]

[dropcap]పం[/dropcap]జిమ్ పాత మున్సిపల్ ఆఫీసు దాటి మాండోవీ నది వైపు కారులో వెళుతున్నాను. ఫలానా రోడ్డు మీదకి పద అనగానే అలాగా అన్నట్లు నవ్వాడు ఆ డ్రైవరు. విచిత్రం ఏమిటంటే ఆ రోడ్డు మీద ఎక్కడి దాక వెళతావు అని అడగలేదు. ఇంతకంటే ఆడ్రస్సు చెప్పటం నీ వల్ల కాదులే అన్నట్లు కారు స్టార్ట్ చేసాడు. మండోవీ నది ప్రాంతానికి చేరగానే కారు ఆగిపోవాల్సి వచ్చింది. మా వెనుక కూడా చాలా బండ్లు ఆగిపోయి ఉన్నాయి. పోలీసుల ఈలలు బాగా వినిపిస్తున్నాయి. ఈ డ్రైవరుతో ఏ రోజూ నేను సరిగ్గా మాట కలపలేదు, అదొక సాహసం. అయినప్పటికీ అడిగాను, “ఏం జరిగింది?” అని. నువ్వు కూడా మాట్లాడతావా అన్నట్లు నవ్వాడు.

“అలాక్కాదు..” అన్నాను. “..ఎందుకు జామ్ అయింది?”

“పోలీసులు”, అన్నాడు.

“అది నాకు కనపడుతోంది. పోలీసులు ఏం చేస్తున్నారు?”

“ట్రాఫిక్.”

“అది కనపడుతున్నది. ఎందుకలాగ?”

నవ్వాడు. “సినిమా హీరో” అన్నాడు.

“ఓ. హీరో వెళుతున్నాడా?”

“కాదు. పోలీసులు” అన్నాడు.

అనవసరం అనుకుని చూస్తూ కూర్చున్నాను. ఫోన్ మ్రోగింది. చిత్ర కాల్ చేస్తోంది.

“సార్, జ్యోతిని డిస్చార్జ్ చేసేస్తున్నారు!”

“ఓకే. ఏదైనా ఇబ్బందా?”

“ఇబ్బంది కాదు, నేను మా ప్రొడ్యుసర్‌కి చెప్పాను.”

“జ్యోతి ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అవటానికి, మీ ప్రొడ్యూసర్‌కీ ఏంటి సంబంధం?”

“సూటిగా మాట్లాడడం, సూటిగా వినటం, సూటిగా అర్థం చేసుకోవటం ఏ మాత్రం  చేతకాని వాళ్లని రచయితలంటారని చాలా సార్లు ఓ పెద్దాయన చాలా దీటుగా చెప్పియున్నాడు.”

“నేను పూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఇంతకీ ఏంటి సంబంధం?”

“ఏమీ లేదు. నాకు మా ప్రొడ్యుసర్ ఏర్పాటు చేసిన గెస్టుహౌస్‍లో నేను జ్యోతిని ఉంచవచ్చా అని అడిగాను.”

“వెరీ గుడ్.”

“గుడ్ కాదు, వెరీ బాడ్.”

“ఎందుకలాగా?”

“వాళ్ళు ఒప్పుకోలేదు.”

“ఎందుకని?”

“ఎవరు సార్ రిస్క్ తీసునేది?”

“పూర్తి వివరాలు పూస గుచ్చినట్లు అనవసరంగా చెప్పేవాళ్లను ఆడవాళ్లంటారని ఇద్దరు ముగ్గురు పురుష పుంగవులు నాకు చెప్పియున్నారు.”

“చెప్పకపోతే? రేపు పొద్దునా సమస్య ఎదురై నన్ను అవతలికి పొమ్మంటే?”

“సరే. ఇప్పుడేమిటి పరిస్థితి?”

“మీ రిసార్టుకు తీసుకుని వస్తున్నాను.”

డ్రైవరు ఎందుకో నన్ను చూడకుండానే నవ్వుతున్నాడు. నా గుండెలో ఏదో కదులుతోంది.

“తొందర పడకు. నేను రిసార్ట్స్‌లో లేను. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను.”

ఫోన్ పెట్టేసాను. ట్రాఫిక్ ఆగిపోయి ఉంది.

“ఎలా?..” అడిగాను. “..మనం అర్జెంటుగా ఆస్పత్రికి వెళ్ళాలి.”

“సినిమా హీరో”, అన్నాడు అతను.

ఇదెక్కడి గొడవో అర్థం కావటం లేదు. దూరంగా ఒక గుంపు వస్తోంది. ఏవో బానర్స్ పట్టుకునున్నారు. ఏదో ప్రొటెస్ట్ అని అర్థమవుతోంది. వాళ్లు చేతులు పైకి ఎత్తి కేకలు పెడుతున్నారు.

“ఈ రోజు నా టైమ్ బాలేదు”, అన్నాను.

“మీ సన్ సైన్ ఏంటి?”, అడిగాడు.

ఇతని వద్ద ఈ విద్య కూడా ఉన్నదా అనుకున్నాను.

“లియో.”

“ఓకే” అంటూ పేపరు తీసాడు. స్టైలుగా చదివాడు.

“సార్, ఈ రోజు అద్భుతంగా ఉంది. ఏం ఫరవాలేదు”, అన్నాడు.

ఆ గుంపు దగ్గరవుతోంది. ఆ బానర్లను చూస్తే వెంట్రుకలు నిలుచున్నాయి.

‘సమీర్ నిర్దోషి, అరెస్ట్ చేయకండి’ అని ఉన్నాయి. బానర్ల మీద సమీర్ బొమ్మలున్నాయి. డ్రైవర్ వాటిని చూపిస్తున్నాడు.

“సార్, అతను హీరో.”

ఆలోచించాను.

“నిజమా?”

“అవును. సినిమా హీరో.”

“అయితే?”, కావాలని అడిగాను.

“కేవలం తెర మీద కాదు సార్. మా అందరికీ నిజజీవితంలో కూడా హీరోనే.”

“ఏం చేసాడు మీకు?”

“మాకనే కాదు, గోవా మొత్తం క్రొత్త నీరు పారేలా చేసాడు, సరిక్రొత్త గాలి వీచేలా చేసాడు..”

ఆ గుంపు మా ప్రక్కగా వెళుతుంటే ఆ బొమ్మలకు నమస్కారం చేసుకున్నాడు డ్రైవర్. మరో గుంపు దగ్గరవుతోంది. వీళ్లు డప్పులు, డ్రమ్ములతో వస్తున్నారు. ఏవో పాటలు వాయిస్తున్నారు. ఏదో జరగబోతోందని అర్థమవుతోంది. సమీర్ తాలూకు సమాచారాన్ని పొలీసులు జోవాక్విమ్ నోటి ద్వారా కక్కించినట్లు అర్థమవుతోంది.

రెండు మూడు రోజులలో అతన్ని కస్టడీ లోకి తీసుకోవచ్చనిపించింది.

“ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు?”, తెలిసి కూడా అడిగాను.

“మర్డర్ కేసు!”

“ఎవరి మర్డర్?”

“సారిక, హీరోయిన్ సారిక.”

ఈసారి మరో గుంపు ఎదురుగా వస్తోంది. బానర్ల మీద బొమ్మలు ఆలోచింప చేస్తున్నాయి, నలుగురు అమ్మయిలు అర్ధ నగ్నంగా కూర్చుని ఉన్న కేరికేచర్. వాళ్లకు అడ్డంగా సమీర్ నిలబడి రెండు చేతులూ చాపి ఎవరినో వాళ్ల వైపు వెళ్లినీయకుండా ఆపుతున్నట్లుంది. ఈ బానర్లను అమ్మయిలు పట్టుకున్నారు.

“ఏంటిది?”

డ్రైవర్ కళ్లు నలుపుకున్నాడు.

“సార్, సమీర్ ఊహలకందని ఎత్తుకు ఎదిగిపోయాడు. రేపు పొద్దున ఎన్నికలలో నిలబడితే తేలిగ్గా గెలుస్తాడు. అందుకని కేసు పెట్టారు.”

“ఈ బానర్ ఏంటి?”

అతను కారు లోంచి కొద్దిగా వంగి చూసాడు.

“సార్, గోవా అంటే అందరికీ చులకన. ఇక్కడ కేవలం అమ్మాయిలు, సరదాలు అనుకుంటారు.”

“నేనలా అనుకోను.”

“మీరు కాదు సార్. అందరూ అలా అనుకునే పద్ధతిని సమీర్ ఎదిరించాడు. ఇక్కడ ఉంటూ గతి లేక ఆ వృత్తిలోకి దిగిన ఎందరో అమ్మాయిలను రక్షించాడు సమీర్. పనులు కల్పించాడు.. ఇవన్నీ కాదు సార్, మాకు అభిమానంగా, స్వతంత్రంగా మెలిగే ఆలోచనలు కల్పించాడు.”

“ఇతనెవరు?”

బానర్ వైపు చూసాడు.

“ఇతను జోవాక్విమ్. డఫోడిల్స్ ఆడిటోరియమ్ యజమాని. గొప్ప కళాకారుడు.”

“అంతేనా?”

“కాదు. సమీర్‍కి కుడి భుజం.”

“ఓ, ఇతనెందుకు కనిపిస్తున్నాడు బానర్ మీద?”

“ఇతన్ని అరెస్ట్ చేసి లోపల ఉంచారు.”

“ఓ, ఇతన్ని విడుదల చేయమంటున్నారా?”

“అవును.”

“ఇతనూ అంత గొప్పవాడా?”

“మరి?”

“బాగా పాడతాడు కదూ?”

“అవును. ఇతనికి చాలా విద్యలు తెలుసు.”

చిత్ర ఫోన్ చేస్తోంది. అన్సర్ చెయ్యలంటే.. ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు..

“నా టైం బాగుందా నిజంగా?”, అడిగాను.

“బాగుంది సార్. నేను ఈ పేపర్ రోజూ చూస్తాను.”

మొబైల్ తీసి టకటకా కార్వాల్లోకి ఫోన్ చేసాను. అతను రెండు రింగులకే ఎత్తాడు.

“హలో?, సార్, చెప్పండి.”

“నాకో సహాయం కావాలి.”

“ఆర్డర్.”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here