[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[కృష్ణప్రసాద్ గారిని కలవడానికి ఆయన తోటకి వెళ్తాడు సుందర్. ఒక పువ్వు పట్టుకుని ఓ పొద వెనుక నుంచి వస్తారాయన. ఆ పువ్వు పేరు చిడ్డో అని చెప్పి, దాని స్వభావం గురించి చెప్తారు. మా ఆవిడకేమయినా పనికొస్తుందా అని సుందర్ అడిగితే, మీకు పెళ్ళయిందా అని కృష్ణప్రసాద్ గారు ఆశ్చర్యపోతారు. వారి సంభాషణలలో రచయితల గురించి, ప్రాక్టికల్‍గా ఉండే మనుషుల గురించి చర్చ జరుగుతుంది. మాటల్లో గుట్ర అనే మూన్ ఫ్లవర్ గురించి కృష్ణప్రసాద్ గారు చెబితే, తాను ఆ పూల కోసమే వచ్చానని అంటాడు సుందర్. తాను పూలు మాత్రమే ఇవ్వగలనని, మందు చేయడం రాదని అని చెప్పి, మూన్ ఫ్లవర్ రహస్యాలు కొన్ని చెప్తారు. కదంబ రాజుల కాలం ఒక ఆచారం గురించి, పంచ శబ్ద ఉపాసన గురించి వివరంగా చెప్తారు. మూన్ ఫ్లవర్, మందారం, చిడ్డో ఈ మూడు పూలూ తనకు మూడు గంపలు కావాలని అడుగుతాడు సుందర్. ఎందుకని ఆయన అడిగితే, వైద్యానికి అని అంటాడు సుందర్. వైద్యం ఎవరు చేస్తారని అడిగితే తెలియదంటాడు. – ఇక చదవండి.]
[dropcap]కా[/dropcap]రులో మూడు సంచీల పూలను ఎక్కించాను. కృష్ణప్రసాద్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నట్లుగా కనిపించారు. అందుకే కొద్ది సేపు అలాగే నిలబడ్డాను.
“మళ్లీ కలుస్తాను..!” అన్నాను. “..ఇవే పూలు మరల అవసరం కావచ్చు.”
“వాటి మీద దృష్టి పెడతాను..”, చెప్పారు. “..కానీ ఒక్క విషయం అర్థం కావడం లేదు.”
“ఏంటది?”
“వైద్యుడెవరు?”
“తెలియదు.”
“రోగి ఎవరు? తెలుసా పోనీ?”
“రోగి తెలుసు. అన్నింటినీ మించి రోగం గురించి తెలుసుకోవాలనుంది.”
“పూల ద్వారా ఎలా తెలుస్తుంది?”
“ఈ మధ్యనే ప్రపంచంలో అన్నీ అన్నింటికీ సంబంధం ఉన్నవేనని తెలుసుకున్నాను.”
“తత్వజ్ఞానం.”
“కరెక్ట్. కాకపోతే ఈ రోగం నయమైతే కొందరికి ఇబ్బంది. కాకపోతే మరి కొందరికి రోగాలొస్తాయి.”
“అదేంటి?”
“అదే తమాషా.”
“నాకు ఆ రోగం ఉన్న వాళ్లని చూడాలనుంది.”
“తప్పుకుండా. మీతో నాకు చాలా పని ఉంది. దయ ఉంచి ఎక్కడికీ వెళ్లకండి.”
“నేనక్కడికండీ వెళ్లేది? మరో ప్రశ్న”
“చెప్పండి.”
“వైద్యుని గురించి చెప్పలేదు.”
“నిజానికి తెలియదు. ఆ ప్రయత్నం మీదనే వెళుతున్నాను. ఉంటాను.” కారెక్కి ఆ ఉద్యానవనం నుంచి బయటకు వచ్చాను. అక్కడ వాచ్‌మన్ ఆపాడు. ఇదేంటి? కొత్తగా ఆపుతున్నాడు అనుకున్నాను. అద్దం మీద – తెరవమని తట్టాడు. అద్దాన్ని క్రిందికి తీశాను.
“సార్, మీ కోసం అక్కడ ఇద్దరు మనుషులు చాలా సేపటిగా నిలుచునున్నారు.” అంటూ అటు వైపు చూపించాడు. అక్కడ ఒక ఇన్నోవా బండి ఉంది. ఆ ఇద్దరూ ఇటు వైపే నడుచుకుంటూ వస్తున్నారు. కారు దిగాను. ఇద్దరూ చాలా స్మార్ట్‌గా ఉన్నారు. ఒతను కాప్ పెట్టుకున్నాడు, ఇంకొంకతను బెర్ముడా షార్ట్స్‌లో ఉన్నాడు. కాప్ పెట్టుకున్నతను చేయి ముందుకు చాచాడు.
“నా పేరు మాధవ్” అన్నాడు.
చేయి కలపాలా వద్దా అనే ఆలోచన వచ్చింది. కానీ కలిపాను. బెర్ముడా కుర్రాడు “ఐయామ్ ప్రేమ్” అన్నాడు.
“నేను మీకెలా తెలుసు?” అడిగాను.
“గవడె గారు చెప్పారు”
“ఓ. ఏంటి పని?”
“నేను మొన్నటి వరకు జైల్లో ఉన్నట్లు మీకు తెలుసు.”
“ఎందుకున్నారో తెలియదు.”
అతను నవ్వాడు.
“వివరాలు తరువాత చెబుతాను. జ్యోతి ఎలా ఉంది?”
నిజానికి నాకు తెలియదు. విచిత్రమైన రోగం అది. బాగుందని చెప్పాలా లేక బాగవ్వచ్చని చెప్పాలో తెలియలేదు.
“ప్రస్తుతానికి బాగానే ఉంది. జ్యోతి మీకేమవుతుంది?”
“ఏమీ కాదు.”
“జైల్లోకి పంపించింది జ్యోతే కదా?”
“కాదు.”
“అదేంటి? ఎవరు మరి? ఎందుకు?”
ప్రేమ్ ముందుకు వచ్చాడు.
“సార్..”
నేను ఆపాను.
“ఇంతకీ మీ ఇద్దరూ ఏం చేస్తూ ఉంటారు?”
“ఇతను డైక్టక్టర్” మాధవ్ ప్రేమ్‍ను చూపించాడు. “..నేను కెమెరా.”
“ఓ. చెప్పండి, నేను ఏం చెయ్యాలి?”
“మీరు ఎక్కడికో వెళుతున్నట్లున్నారు.”
“అవును. మరోసారి మాట్లాడదామా?”
మాధవ్ అటూ ఇటూ చూసాడు.
“సార్. ఏమీ అనుపోతే మీతో కార్లో కొంత దూరం వస్తాను.”
ఆలోచించాను.
“ఓకే.. పదండి. మరి ఆయన?”
“ఆఁ. అతను వెళ్లిపోతాడు.”
కారెక్కాడు మాధవ్. పన్‍జిమ్ దాటి చెట్ల మధ్య అలా పోతున్నాం.
“చెప్పండి మాధవ్”, అన్నాను.
“ఏం లేదు సార్. నేను ఒక వెబ్ సీరిస్ చేసే పనిలో పడి ఇక్కడ ఇరుక్కపోయాను. మా ప్రొడ్యూసర్ చేతులెత్తేస్తారు. గోవా కల్చర్ మీద ఇరవై ఆరు ఎపిసోడ్స్ తీస్తున్నాం. ఈలోపల అనుకోకుండా జ్యోతి పరిచయం అయింది.”
“ఎలా పరిచయం అయింది?”
“నేను కెమెరా పనిలో ఉండగా ఆమె స్కెచ్ వర్క్ చేస్తోంది. నా ఫోటోలను స్కెచ్ వేసి చూపించేది. మా డైరెక్టర్ అ స్కెచ్‌ను సెట్స్ క్రింద వాడేవాడు.”
“మీరు బాగా దగ్గరైనారా?”
“అంటే?”
“ఏం లేదు కలిసి మెలసి.. అలసి సొలసి..!”
అతను నవ్వాడు. మా డ్రైవర్ ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. ఈసారి ఏదో బాగా అర్థమైపోయినట్లు నవ్వాడు.
“ఏం లేదండీ.”
“జ్యోతి నీకెలా అనిపించింది?”
“అంటే?”
“ఆమెలో ఏదైనా విశేషం?”
“ఒకటా? నా మతి పోయి ఈ మధ్యనే వెనక్కి వస్తోంది. నన్ను ఎందుకు అరెస్ట్ చేసారో తెలియదు, ఎందుకు విడుదల చేసారో తెలియదు.”
“ఆమెను పెళ్లి చేసుకుంటావని మాట ఇచ్చావుట?” కావాలని ఊరకే అడిగాను.
“పెళ్ళా? ఇంకా నయం. ఇప్పుడు చెప్పిన మాటే మరల చెప్పాల్సి వచ్చేది.”
“అర్థం కాలేదు.”
“ఎందుకు పెళ్లి అయిపోయిందో, ఎందుకు బ్రేక్ వచ్చేదో చెప్పలేని పరిస్థితి ఉండేది.”
“ఎందుకలాగ?”
“ఏ లోకంలోనో ఉంటుంది. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో చెప్పటం కష్టం.”
“ఇంతకీ ఏం జరిగింది?”
“చాలా పెద్ద కథ. తరువాత చెబుతాను. కానీ ప్రస్తుతం ఒక్కసారి మీ సమక్షంలో జ్యోతిని కలిసేలా చెయ్యాలి. ప్లీజ్!”
“జ్యోతికి వైద్యం జరుగుతోంది.”
“అవును.”
“ఐనా కలుస్తావా?”
“మీరు చెబుతున్నది.. ఇబ్బంది అవుతుందనా?”
“ఆలోచించాలి. కాకపోతే దేనికి కలవాలి?”
“నేను నిర్దోషిని అని చెప్పాలి.”
“నాకు తెలిసి ఆమె ఆ మాటలు నమ్మక పోవచ్చు.’
“మీరూ చెప్పాలి.”
“నేనేమీ ఆమె దృష్టిలో శ్రీరాముడిని కాను.”
కారు అలా పోతుంది. మా డ్రైవర్ పిచ్చి వేషాలు వేసినా ఒకసారి అడ్రస్సు చెబితే మారు మాట్లాడడు. అలా లాక్కుంటూ పోతాడు.
“ఇంకా ఎంత దూరం?” అడిగాను.
“అరగంట.”
ఎందుకో ఈసారి నవ్వలేదు. నవ్వు లేనప్పుడు ఏదో ఆలోచిస్తాడన్నమాట!
“మాధవ్..”
“సార్”
“జ్యోతికి మానసిక జబ్బు అన్నమాట నిజమా?”
“చెప్పలేను సార్. కానీ మామూలు అమ్మాయి మటుకు కాదు.”
“ఎందుకనిపించింది అలాగ?”
“తనకి తెలియకపోవచ్చు కానీ అందరికీ కనిపించే దానికంటే మరేదో కనిపిస్తుంది తనకి. నా అభిప్రాయంలో దానిని తట్టుకోలేక లోలోపల ఊగిసలాడుతూ ఒక వింత ప్రవర్తనను బహిరంగం చేస్తుంది.”
ఆశ్చర్యం వేసింది. ఇంత పెద్ద కథకు ఇంత చక్కని, చిక్కని సంక్షిప్తం ఇచ్చాడంటే ఈ అమ్మాయి గురించి ఇంతకంటే ఎక్కువ ఎవరికీ తెలీదని అర్థం.
“జ్యోతికి రకరకాల ఫొటోలు తీసావా?”
“సార్, మీ భాషలో కొంత ఇతర అర్థాలు వినిపిస్తున్నాయి.”
నవ్వాను. “మరోలా అనుకోవద్దు. ఫోటోగ్రాఫర్స్ కథలు ఇలానే ఉంటాయి.”
“ప్రత్యేకంగా జ్యోతికి మాడలింగ్‍లా ఏమీ తీయలేదు.”
“మరి?”
“గవడె గారు కేవలం పురావస్తు విభాగం, చరిత్ర యొక్క అధ్యయనానికి సంబంధించిన వారు కారు!”
“ఓ.”
“ఎన్నో అలౌకికమైనవి, ఆలోంచింపజేసీని ఆయన వద్ద ఉన్నాయి.”
“మచ్చుకి?”
“ఏదీ వదలరు. ఇప్పుడు ఓపిక లేదు కానీ ఒకప్పుడు ఒంటరిగా అడవులలో, గుహల్లో తిరిగేవారు. ఒకానొక సందర్భంలో కుశావతీ నది జలపాతంలా మారి ఒక గుహలోంచి ప్రవహించే ప్రాంతంలో ఏవో కట్టడాలను ఆయన టీమ్ శోధిస్తున్నది.”
“ఆయన అక్కడ లేరా?”
“లేరు. గుహ లోపల ఉన్న కోనేరులో జ్యోతి అలా ఆడుకుంటూ విచిత్రమైన భాష మాట్లాడుతూ పైకి చూస్తూ తెగ నవ్వింది. నేను ఆయనకు ఫోన్ చేస్తే వీడియో తియ్యమన్నారు. నేను వీడియో చేసాను. కానీ విచిత్రం ఏమిటంటే కోనేరు, ఆకాశం, చెట్లు, గుహ, రాళ్లూ, రప్పలు, మబ్బులు అన్నీ వీడియోలో వచ్చాయి. జ్యోతి అందులో రాలేదు. గలగలా ఫొటోలు తీసి చూసాను. వాటిల్లోనూ అదే పరిస్థితి!”
“గవడె ఏమన్నారు?”
“ఆయన నమ్మలేదు.. వీడియోను కాదు, నన్ను!”
(ఇంకా ఉంది)