Site icon Sanchika

పూచే పూల లోన-5

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[తానుంటున్న రిసార్టు నుంచి సాయంకాలం సాగరం అంచున అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ ఆలోచిస్తుంటాడు సుందర్. ప్రకృతి లోని లయని చూసి అబ్బురపడతాడు. సముద్ర తీరాల వద్ద ఎదిగిన చరిత్ర గురించి తలుస్తాడు. ఓ చిన్న పిట్ట ఎక్కడి నుంచో వచ్చి దగ్గరలోని ఓ కొమ్మ మీద వాలి సూర్యుడిని చూస్తుండం గమనించి దానికి సూర్యుడు ఎలా కనిపిస్తాడో అని అనుకుంటాడు. చుట్టు ఉన్న ప్రకృతిని, సముద్రాన్ని చూస్తూ పరవశిస్తాడు సుందర్. కాసేపటికి రిసార్టు లాన్‍ చివర్న ఉన్న గోడ వద్దకు వస్తాడు సమీర్. అది ఓ పిట్ట గోడ. ఆ గోడ మీదకి కాళ్ళు ఆన్చి ఓ కుర్చీలో కూర్చుంటాడు సమీర్. సమీర్‍కు ప్రక్కగా ఉన్న టేబుల్ వద్దకు ఓ వృద్ధ జంట వచ్చి కూర్చుంటుంది. వాళ్ళు సమీర్ కేసి చూస్తూ కొద్దిసేపు కళ్ళు మూసుకుని ఏవో అంటారు. సమీర్ ఒక సిగరెట్ ముట్టించి వాళ్ళ వైపు పొగ వదులుతాడు. వాళ్ళు పట్టించుకోరు. రెండు సార్లు గ్లాసులు పైకెత్తి మరల ఏదో అంటారు. సమీర్ అటు తిరిగి మొహం చాటేస్తాడు. వాళ్ళు మరల ఏవో ఒకే గొంతుతో అంటారు. సమీర్‍తో వాళ్ళకేం పనో సుందర్‍కి అర్థం కాదు. తర్వాత వాళ్ళిద్దరూ ఏదో పుస్తకం తెరచి అందులోంచి ఏదో చదువుతారు. అలా చదువుతున్నంత సేపూ సమీర్ కళ్ళు మూసకుని చాలా అసహనంగా ఉంటాడు. కాసేపయ్యాకా, పుస్తకం మూసేసి ఆయన తన చేతిని సమీర్ తల మీద తాకకుండా పెడ్తాడు. చుట్టూ ఉన్న జనాలు ఆసక్తిగా చూస్తూ ఉంటారు. కాసేపటికి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. సుందర్ వెళ్ళి సమీర్ ఎదురుగా కూర్చుంటాడు. వాళ్ళేం చేసారని అడుగుతాడు. వాళ్ళు తనకు మేలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని అంటాడు సమీర్. ఎవరైనా తన అస్తిత్వాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తుంటే ఇలా చేసి వారికి వారి గురించి తెలియజేసే తమ ప్రాంతపు పద్ధతి అని చెప్తాడు. ఒకచోట మీరు తీవ్రంగా స్పందించారని అంటాడు సుందర్. తనది చాలా పెద్ద కథ అంటాడు సమీర్. ఇక చదవండి.]

[dropcap]స[/dropcap]మీర్ తన గతాన్ని దాదాపు కథ చెప్పినట్టే చెబుతూ వచ్చాడు. జరిగినది జరిగినట్టు చాలామంది చెప్పరు. చెప్పాలనుకున్నా కొందరు చెప్పలేరు. అందరికీ ఎందుకు చెప్పాలని కొందరనుకుంటారు. ఇలా చెప్పటం వలన ప్రయోజనం ఏమిటని తలచి లోలోన ఎక్కడో దాచేసుకుటారు. ఎక్కడో ఏదో జరుగుతుంటే చూసి దానిని లోలోపలే బుజ్జగిస్తారు. మనసు ఒక మార్మికమైన మ్యూసియమ్. చిత్ర విచిత్రాలన్నీ ఆలోచనలలా, అనుభూతులల్లా అమర్చుకున్న పురావస్తుశాల. ఇవి అందరూ చూడాలని ప్రదర్శన. కానీ అందరికీ నచ్చాలని ఏర్పాటు చేసిన మనోరంజనార్థం చేసే ప్రక్రియ కాదు. నీకు నచ్చకపోయినా నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి చూస్తూ వెళ్ళిపో! కనెక్ట్ అయ్యావో, అదో ప్రపంచం. లేదూ, అది నీకేమీ పంచదు. సమీర్ రెండు మూడు గంటలు ఎంతో మృదువుగా, హాయిగా మాట్లాడాడు. మద్యం ప్రభావం అని నేననుకోలేదు. అక్కడక్కడ కళ్ళు మూసుకుని మాట్లాడాడు. మధ్య మధ్యలో కళ్లు తెరిచి శూన్యంలోకి చూసాడు. కొన్ని సందర్భాలలో బాగా వయసు మీద పడ్డవాడు ఏదో నెమరు వేసుకునట్లు గెడ్డం నిమురుకుంటూ భావోద్రేకంతో చెప్పాడు. చుట్టుపక్కల ఎంతో గొడవగా ఉన్నా ఆ శబ్దాలు అతన్ని ఏ మాత్రం బాధించలేదు. ఇదంతా ఓ పద్ధతిలా చెప్పి ఎంతో ఆశ్చర్యాన్నీ, ఆసక్తినీ కలిగించే చోట సినిమాలో విశ్రాంతి ఇచ్చిన సందర్భంలా ఆగిపోయి నన్ను సరైన సైజు చొక్కా తొడుక్కోని పిచ్చివాడిని చూసినట్టు చూసాడు. ఇతను పిచ్చివాడు కాదు! అనామకుడు అంతకంటే కాదు. మెదడుకు కావలసినంత మేత పెట్టి “ఏమీ తినరా?” అని అడిగాడు.

“ఏదో కొద్దిగా తిన్నాను” అన్నాను.

కుర్చీకి తగిలించిన కోటు తీసుకుని తొడుక్కున్నాడు. అతనితో పాటు నేనూ లేచాను. గేటు వరకూ వచ్చాం. సముద్రంలో దూరంలో ఓ షిప్పు లైట్ల అందాలను తళుక్కుమనిపిస్తూ ఎటో సాగిపోతోంది.

ఈ రిసార్ట్‌కు ముందరున్న రోడ్డుకు అడుగున మరో డొంకలు తిరుగుతున్న రోడ్డు ఉన్నది. దానికి ఆనుకుని ఉన్న సన్నని ఫెన్స్ మీద ఆ ఫోటోగ్రఫీ జంట ఆనుకుని దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్నారు. సముద్రం వైపు చూస్తూ సిగరెట్ ముట్టించాడు సమీర్.

“నాకు చెప్పినవి కొద్దిగా గూఢమైనవి..” అన్నాను. “..మరి ఇవి నా దగ్గర దాగి ఉంటాయని అనుకుంటున్నారా లేక ఎవరికైనా చెప్పినా ఫరవాలేదని మీ ఆలోచనా?”

“ఆ పిల్లలు బాగున్నారు కదూ?” అన్నాడు.

“ఒకరినొకరు నమ్మి ఇక్కడికి వచ్చినట్టున్నారు”

“అంతేనా?”

“అంటే?”

“ఒక రచయితలా.. కాకపోతే పోనీ ఆలోచనలలో వ్యభిచారం చేసేవాడిలా చెప్పండి!”

నన్ను తిట్టాడో, వెక్కిరించాడో అర్థం కాలేదు.

“అందరిలా కాకుండా ఈ భూమి మీద పుట్టినందుకు ఓ సారి ప్రపంచాన్ని ప్రేమతో కౌగిలించుకుందామనే ఒకే ఆలోచన ఇద్దరికీ వచ్చి..”

“ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకున్నారు. అవునా?”

“ఓకే. అలా అనుకుందాం. ఇంతకీ నేనడిగిన దానికి సమాధానం చెప్పలేదు!”

“ఊ.. వీళ్లు ఇక్కడే కలిసారో, ఎక్కడూ కలసి ఇక్కడికి వచ్చి ఇలా కలుసుకుంటున్నారో తెలియదు. ఆ దూరంగా ఎన్నో అలలు వస్తున్నాయి, పోతున్నాయి. మధ్యలో తెలియకుండానే అలా ఓ పెద్ద తరంగం ప్రేమ తరంగంలా ఈ ఒడ్డుకు వచ్చి మిగిలిన అలలను ఓడించి కనిపించి కొద్ది సేపట్లో అది కూడా మాయమవుతుంది”

“ఇద్దరూ ప్రస్తుతం ఆ అలలో ఊగుతున్నారు. అంతేనా?”

సిగరెట్ పాడేసాడు. నా భుజాన్ని గట్టిగా తట్టాడు.

“మనిద్దరమూ అంతే! ఆ అల మాయమైపోయక, అంతా ఆవిరే! నాలోని బాధ కొంత ఆవిరైనది! మిగతాది మీ ఇష్టం!” అంటూనే అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.

మలుపు తిరిగి ఆ క్రింది రోడ్డు మీదకు వచ్చాడు. ఆ జంట మీదుగా వెళ్ళిపోయాడు, కానీ వాళ్ళవైపు చూడను కూడా చూడలేదు..

***

ఆలోచిస్తూ ఎప్పుడు నిద్రపోయానో తెలియలేదు. మామూలుగానే గోవా ఎప్పుడు కానీ నిద్ర లేవదు. ఎంతో బద్ధకంగా కిటికీ దగ్గరకు వచ్చి సముద్రం వైపు చూసాను. అర్ధరాత్రి దాటే వరకు జరిగే కోలాహలం ఆ చెల్లా చెదురైన టేబుళ్ళు, కుర్చీలలోంచి మరల వినిపిస్తున్నది. చీకటి పడేవేళకి మరల అందరూ గుమిగూడతారు. సమీర్ కుమార్ మరల ఆ కుర్చీనే పట్టుకుంటాడు. నిన్నటి కథ ఆపేసిన చోటు నుండి మరల చెబుతాడా?

దూరంగా చెట్లలోంచి పిట్టల అల్లరి సూర్యోదయానికీ, ఆ కిరణాల తాకిడికీ చక్కని లయని కలుపుతోంది..

సమీర్ గతం మీదుగా తిరిగి ఓ తెర మెల్లగా పైకి లేస్తోంది. అతని మాటలు ఒక్కొక్కటే గుర్తుకొస్తున్నాయి.

“సృష్టి లోని సౌందర్యాన్ని వెతికి వెతికి ఆస్వాదించాలని నిర్ణయించుకున్న రోజులవి..!” అతను చెప్పాడు. “..నేనొక చిత్రకారుడనో లేక సంగీతజ్ఞుడినో లేక కథకుడినో అని ఎన్నడూ అనుకోలేదు. ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అక్కడ చిన్న పిల్లలతో పరుగులు తీస్తూ ఆడుకునేవాడిని. చంటిపిల్లలెవరైనా ఉయ్యాలలో ఉంటే కొద్దిగా జాగ్రత్తగా ఊపుతూ వాళ్ళ ముఖ కవళికలు పరీక్షగా చూస్తూ ఉండేవాడిని. ఇంట్లో రకరకాల పుస్తకాలు ఉండేవి. కొన్ని పూర్తిగా చదివినవి, కొన్ని సగం సగం చదివినవి. కాలేజీ కెళ్ళినా క్లాసులు బోర్ కొడితే లైబ్రరీలో కూర్చునేవాడిని. పై అంతస్తులోని నా ప్రైవేటు గదిలో అలా నిలబడి కిటికీ లోంచి దేనినో చూస్తూ ఉండేవాడిని. మాది ఓ వ్యాపారస్థుల కుటుంబం. ఎన్నో సంవత్సరాల క్రితం మంగేశీ నుండి కాండోలిమ్ వచ్చి స్థిరపడిపోయిన వాళ్ళం. నాన్న ఎక్కువగా ముంబై-గోవా, గోవా-ముంబై తిరుగుతూ ఉండేవారు. పలుసార్లు బెంగుళూరు, అప్పుడప్పుడు కోచీ.. ఇలా తిరిగేవారు. జీవితంలో ఒక్క క్షణం కూడా ఆయన వ్యర్థం చేసుకోలేదు. క్రింద హాల్లో కూర్చుని టీ త్రాగుతూ, చూపుడు వేలొక్కటి పైకి చూపించి నా గురించి అడిగేవారు.

మా ఇంట్లో అన్నీ గదులలో గిరగిరా తిరిగే ఓ కుర్రాడు ఉండేవాడు. ఎవరికి ఏ సమాచారం చెప్పాలన్నా అతనే. నాన్నకి దగ్గరగా వెళ్లి ఏదో కూసినట్లున్నాడు. ఆయన మెల్లగా మెట్లెక్కి తలుపు దగ్గర నిలబడి నన్ను చూస్తునట్టు నాకు తెలుసు. ఎవరో మనోవైజ్ఞానికుడు ఈ అబ్బాయిని ఓ కంట కనిపెట్టి ఉండండి అని చెప్పినట్లనిపిస్తుంది. మాటలు పెద్దగా ఉండవు. నా గది మొత్తం కలయజూస్తూ, అది కెలికి, ఇది కెలికి ఏవేవో నిర్ధారించుకుంటున్నట్లు కూడా నాకు తెలుసు. అప్పుడప్పుడు నేను గమనిస్తున్నానో లేదో కూడా గమనిస్తున్నట్లు నాకు తెలుసు! మెల్లగా నా వద్దకు వచ్చి ఆ ప్రక్కనున్న కిటికీ తెరని తెరచి అటు చూస్తున్నారాయన. సూర్యాస్తమయం రంగు ఆయన  ముఖం మీద పడుతున్నది.”

“ఏముందక్కడ?” అడిగారు.

ఏముందక్కడ? నిజానికి ఏమీ ఉండదు. సూర్యుడు, సముద్రం, వెలుతురు, చీకటి, చంద్రుడు, నక్షత్రాలు.. ఎప్పుడూ ఉన్నాయి, ఎప్పుడూ ఉంటాయి. ఎన్నో కాలచక్రాలు, జీవితచక్రాలు దాటుకుంటూ ఇక్కడికి వచ్చి ఓ చిన్న జీవితకాలన్ని గడుపుకునే మనకు ఆ అద్భుతాన్ని ఆస్వాదించి అర్థం చేసుకుని ఆనందించే అవకాశాన్ని పుచ్చుకునే ఆలోచన వచ్చిన ప్రతి వ్యక్తీ మానసిక రోగి లాగానే కనిపిస్తాడు!

“ఇక్కడేముంది?” అడిగాను.

“ఈ తిక్క సమాధానాలే వద్దన్నాను. ప్రతి వెర్రివాడు తనకు తాను కళాకారుడనుకుంటాడు! నిజం తెలుసుకున్న ప్రతి సారీ నిట్టూర్చాల్సి వస్తుంది! నాకు నిట్టూర్పులంటే పడదు. నేను ఇంత మాట్లాడుతున్నాను”

“నేను మాట్లాడమని అడగలేదు”

“అయినా మాట్లాడుతాను”

“నేను ఆపలేదు”

“నా వైపు మొహం కూడా తిప్పటం లేదు”

“ఏముంది ఈ రెండు మొహాల్లో?”

“నీ భాష లోనే చెబుతాను. ఒకడు సూర్యుడు, ఒకడు చంద్రుడు అనుకో. నన్ను చూడు”

“ఆ కిటికీ గ్లాసు డోర్‍లో కనిపిస్తున్నావు. స్మార్ట్‌గా ఉన్నావు.”

“ఛా! ఒక కన్న కొడుకు తండ్రిని పట్టుకుని స్మార్ట్‌గా ఉన్నావు అంటున్నాడు”

“ నా గురించి నువ్వనలేవు కాబట్టి నేను అంటున్నాను”

“నేను అనను”

“అనవద్దు”

“నేను ఎందుకననో చెబుతాను”

“నేను అడగలేదు”

“అయినా చెబుతాను. చెప్పాలి కాబట్టి”

“వినటం మటుకు వింటాను. వినాలి కాబట్టి”

“పెద్ద నవ్వు రావటం లేదు. అయినా నవ్వి చెబుతాను”

వెటకారం పుట్టిన తరువాత ఈయన పుట్టారని అమ్మ అంటుంది. కాదు, ఈయనతోనే వెటకారం పాపులర్ అయిందని నేనంటాను. బాస్ తిడుతూ కూడా జోక్ వేసినప్పుడు ఆ ఉద్యోగి నవ్వే నవ్వు ఒకటి నవ్వాడు. కరెంటు తీగ మీద కూర్చున్న పిట్టలు ఎటో ఎగిరిపోయాయి..

“జీవితం గురించి ఏదో తెలియక పోయినా అంతా తెలిసినవాడిలా పోజు పెడతావు. స్మార్ట్ కాదు నువ్వు. నీతో చదువుకునే వారు ఎంతో పైకి వచ్చే పరిస్థితిలో ఉన్నారు. నువ్వు డాబా మెట్లెక్కి పైకి వెళుతున్నావు కానీ వేరే ఏ రంగంలోనూ పైకి రావటం లేదు”

“నాకు నవ్వు రాలేదు. అందుకు నవ్వను”

“అక్కరలేదు.  నాకు కాలిపోతోంది”

ఏడవటం కూడా నాకు చేతకాదు. ఇదో సమస్య! చీకటి పడుతోంది.

“ఎంత సేపు చూస్తావు ఇలా?”

ఇదెక్కడి గోల? ఇలా నిలబడలేక పోతే ఎందుకీ బ్రతుకన్నాడు ఓ ఆంగ్ల కవి.

“నా కాళ్ళే వాడుకుంటున్నాను. ఏంటి ఇబ్బంది?”

“ఓహో! చంటి పిల్లాడిననుకుంటున్నావా? ఎత్తుకోనా?”

కొద్దిసేపు ఇద్దరం అలాగే నిలబడి ఉన్నాం. కుర్రాడొచ్చి తలుపు కొట్టాడు. తెరిచే ఉన్నా కొడతాడు. ఆ మాత్రం మర్యాద ఇంకా నాకు ఇస్తున్నారు.

“సార్, ఫ్లైట్‌కి టైం అవుతోంది”

ఆయన అటు తిరిగారు.

“ఒరేయ్, తూర్పు పడమర గురించి తెలుసా నీకు?”

“ఏముంది సార్? అక్కడ సూర్యుడు అస్తమిస్తున్నాడు కాబట్టి అది పడమర. దానికి ఇటున్నది తూర్పు. మిగతావి నాకు ఎప్పుడూ కన్‍ప్యూజనే!”

“చాలు. ఆ రెండైనా తెలిసాయి కదా? నేను తూర్పు అయితే ఇదిగో వీడు పడమర”

“సార్, సూర్యుడు ఇక్కడి నుండే వచ్చి అక్కడికి వెళతాడు. మీ అబ్బాయే సార్!”

కళ్ళజోడు సర్దుకున్నారాయన.

“నిజమే. ఈ ఇంట్లో అందరికీ అర్థమైపోయాడు వీడు – ఏంటి? నన్ను చూడడం వలన. నాకు మటుకు అర్థం కాలేదు”

“కాడు” అన్నాను.

“అది గొప్ప విషయం కానే కాదని చెప్పరా వాడికి!”

“సార్, ఫ్లైట్..”

“అంటే? ఆ సంగతి ఇంత తక్కువ కాలంలో చెప్పలేననా?”

నాలుగడులు వేసి వాచ్ చూస్కున్నారు.

“చూసావా? తూర్పు పడమర అంటే ఇదే. నేను ప్రతి క్షణంలో ఓ ప్రపంచాన్ని చూస్తాను. వీలు కాలం యావత్తు తన ప్రపంచానికే అంకితం చేసేస్తాడు”

ఆయన వెళ్ళిపోయారు. కుర్రాడు ఆయన వెంట దిగిపోయాడు.

నిజమే. ఇది ఒక పిచ్చి అని నాకూ తెలుసు. ఎందుకో సూర్యాస్తమయం పూర్తిగా చూడాలనుంటుంది. చీకటి ఎందుకు పడుతుందో, ఎలా పడుతుందో గమనించాలనుంటుంది సూర్యోదయంలో ఏముంది? వెలుగు రానే వచ్చింది. వెలుగుతూనే ఎండ పెరిగి తరుగుతుంది. చీకటి ఉదయించదు. పడిపోతుంది. కానీ చల్లదనాన్ని తెస్తుంది..

ఆ సముద్రంలోని రంగులు మారుతున్నాయి. ప్రతి సాయంత్రం ఒక ఆలోచనని తడుతూ ఉంటుంది. ఏదో వ్రాయాలనుంటుంది. మరేదో వినాలనుంటుంది. ఇటు తిరిగాను.

ఆ టేబుల్ మీద ఏవో పుస్తకాలు. అవి అటూ ఇటూ తిరగేసి క్రింద హాల్లోకి వచ్చాను. మా ఇంట్లోని కుక్క ఎందుకో నా దగ్గర కొచ్చి నాతోనే నిలబడుతుంది. వీడు నా వాడు అన్నట్లు నాతోనే నాలుగడుగులు వేస్తుంది. హాల్లోంచి బయటకు రాబోతుంటే అమ్మ ఎదురైంది. కార్లో ఎయిర్‍పోర్ట్‌కి వెళ్తున్న నాన్నను సాగనంపి వస్తున్నట్లుంది. ఆగింది.

“పొరపాటున ఒక్కసారి కూడా నాన్నకు బాయ్ చెప్పవు కదా!”

నిజమే భర్త, కొడుకు – ఇద్దరూ ఒకరికొకరు మిత్రులుగా చూసుకుంటూ మాట్లాడుకుంటే చూడాలనుంటుంది ఆడవాళ్ళకి!

ఇద్దరూ తరచూ కొట్టుకుంటుంటే సర్ది చెబుతూ దేశాన్ని ఉద్ధరించలని ఉంటుంది కొందరు స్త్రీలకు! కొడుకుని కొంగుకు కట్టి భర్తను కీలుబొమ్మ చేయాలని ఉంటుంది ఇంకొకరికి!

నేనేదో మాట్లాడబోతే చెయ్యి అడ్డం పెట్టింది.

“నాకు లెక్చర్లు వద్దు. నీ సిద్ధాంతాలతో పని లేదు”

లోపలికి వెళ్ళిపోవాలని నాలుగడుగులు వేసింది. మామూలు మనుషులను బాధపెట్టి శోషించి సాధించే ఐశ్వర్యం సరైనది కాదనే నా వాదన ఆవిడకు నచ్చదు.

“బాయ్” అన్నాను.

ఇటు తిరిగి పళ్ళు బిగించింది. నాతో కుక్క కూడా బయటకొచ్చింది. వీధిలో లైట్లు వెలుగుతున్నాయి. చల్లగాలి వీస్తోంది..

(ఇంకా ఉంది)

Exit mobile version