[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[మూడు రకాల పూలని మూడు సంచులలో కట్టించుకుని బయల్దేరబోతున్న సుందర్‍ని, వైద్యుడెవరని అడుగుతారు కృష్ణప్రసాద్. తెలియదంటాడు సుందర్. రోగి ఎవరో తెలుసా అంటే, తెలుసంటాడు. ఆ రోగిని చూడాలని ఉందని కృష్ణప్రసాద్ గారు అంటే, తప్పకుండా చూడచ్చు, ఎక్కడికీ వెళ్ళకండని అంటాడు సుందర్. ఆయన మళ్ళీ వైద్యుని గురించి అడుగుతారు. ప్రస్తుతానికి తనకీ తెలియదనీ, ఆ ప్రయత్నం మీదే వెళుతున్నానని చెప్పి బయల్దేరుతడు సుందర్. తోట బయటకు రాగానే వాచ్‍మన్ కారుని ఆపి, సుందర్ కోసం ఇద్దరు వ్యక్తులు చాలా సేపటిగా వేచి ఉన్నారని చెప్తాడు. కారు దిగుతాడు సుందర్. వాళ్ళు వచ్చి పరిచయం చేసుకుంటారు. ఒకరు ఫోటోగ్రాఫర్ మాధవ్, మరొకరు డైరక్టర్ ప్రేమ్. నా గురించి మీకెలా తెలుసని సుందర్ అడిగితే, గవడె గారు చెప్పారని మాధవ్ అంటాడు. సుందర్‍తో కాసేపు మాట్లాడాలని, అతనికి అభ్యంతరం లేకపోతే తనూ సుందర్ కారులో వస్తానని అంటాడు. సరేనంటాడు మాధవ్. ప్రేమ్ తాము వచ్చిన కారులో వెళ్ళిపోతాడు, మాధవ్ సుందర్ కారెక్కుతాడు. తాను గోవాకి ఎందుకు వచ్చిందీ, అనుకోకుండా జ్యోతి పరిచయమైన సంఘటన, ప్రొడ్యూసర్ చేతులెత్తేయడంతో ఇక్కడ ఇరుక్కుపోయిన సంగతి చెప్తాడు మాధవ్. జ్యోతిలో మీకేదైనా విశేషం కనిపించిందా అని సుందర్ అడిగితే, ఏ లోకంలోనో ఉంటుంది. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో చెప్పటం కష్టమని అంటాడు మాధవ్. వివరాలన్నీ తరువాత చెప్తాననీ, ముందు సుందర్ సమక్షంలో జ్యోతిని కలిసే ఏర్పాటు చేయమంటాడు మాధవ్. జ్యోతికి వైద్యం జరుగుతోందని, ఆమెకి ఇబ్బంది కావచ్చని అంటాడు సుందర్. తాను నిర్దోషినని జ్యోతికి సుందర్ చెప్పాలని కోరుకుంటాడు మాధవ్. జ్యొతివి రకరకాల ఫోటోలు తీశావా అని అడుగుతాడు సుందర్. ఓ గుహలో ఉన్న కోనేరులో ఆడుకుంటూ జ్యోతి విచిత్రమైన భాష మాట్లాడుతూ పైకి చూస్తూ తెగ నవ్విందనీ, తాను గవడె గారికి ఫోన్ చేస్తే ఆయన వీడియో తియ్యమన్నారనీ, ఆ ప్రకారమ్ వీడియో తీసాననీ, వీడియోలో అన్నీ వచ్చాయి కానీ జ్యోతి రాలేదని అంటాడు. ఆశ్చర్యపడి ఫోటోలు తీస్తే, అందులోనూ అలాగే అయిందని చెప్తాడు. ఇవన్నీ గవడె గారికి ఆయన నమ్మలేదని అంటాడు మాధవ్. – ఇక చదవండి.]
[dropcap]మా[/dropcap]ధవ్ చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నట్లు అనిపించింది. జైల్లోంచి విడుదల అయిన వాడు నేరుగా తన ఊరికి వెళ్లిపోవచ్చు కదా? బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి ఏదో పూర్తిగా కేసు క్లోజ్ చేయించుకుని వెళ్లాలని నిర్ణయించుని ఉండవచ్చు.
“ఇంతకీ ఫోటోగ్రఫీలో వచ్చిన చిక్కా ఇది?” అడిగాను.
“సమస్యా తెలియదు, సమాధానమూ తెలియదు, ఆరు నెలలు లోపల ఉన్నాను.”
“గవడె గారికి, నీకు ఏంటి సంబంధం?”
“సార్, నేను పని చేసేది గవడె గారి కోసం. ఆయనకి నా మీద అనుమానం రావడంతో ఈ సమస్యలొచ్చాయి. అలా నేననుకుంటున్నాను.”
“నేనేం చెయ్యాలి?”
“జ్యోతికి చెప్పి కంప్లెయింట్ వెనక్కి తీసేలా చేస్తారని ఆశ పడుతున్నాను.”
గట్టిగా నవ్వాను. డ్రైవర్ కూడా నాతో ఏకీభవిస్తున్నట్లు నవ్వేసాడు.
“సార్, ప్లీజ్”, అన్నాడు మాధవ్ .
“ఒక్క విషయం చెబతాను. ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఒకసారి అయితే నన్ను కూడా చితక్కొడుతుందనే అనుకున్నాను. నా మాట విని ఏదో చేస్తుందనుకోవటం.. ప్రస్తుతానికైతే కష్టం.”
“గవడె గారి దగ్గరే ఉంటూ ట్రీట్‌మెంట్ తీసుకుంటోంది కదా?”
“గవడె గారి బిల్డింగ్ క్రింద కార్వాల్లో అనే వ్యక్తి ఉంటాడు.”
“తెలుసు.”
“ఎలా తెలుసు?”
“నన్ను ఆ హాలు కొనుక్కోమని అడిగాడు.”
“ఇప్పుడు కొంటావా పోనీ?”
“సార్, నాతో కామెడీ వద్దు. కష్టాలలో ఉన్నాను.”
“బావున్నావు గదా? బెయిల్ వచ్చిందంటే కేసు తేలేందుకు ఆరేడు సంవత్సరాలు పట్టవచ్చు.”
“ఏదో ప్రాజెక్ట్ అని ఇంట్లో చెప్పి వచ్చాను. జైల్లోకి వెళ్ళాను. ఇంతకంటే ఏం కావాలి సార్, ఒక ప్రతిభావంతుడైన ఫోటోగ్రాఫర్‍కి?”
“హ! హ! నెల్సన్ మండేలా పూర్తి ఇరవై సంవత్సరాలు జైల్లో గడిపాడు.”
“నాకు సహయం చేయ్యండి సార్, ప్లీజ్.”
కారు ఎందుకో ఒక సన్నని దారి ఎడమ పక్క కనిపిస్తున్న చోట ఆపాడు.
“ఇలా క్రిందకి వెళ్లిపోయి కుడి ప్రక్కకు తిరగండి” చక్కగా చెప్పాడు డ్రైవర్.
“ఎంత దూరం?” అడిగాను.
“అరగంట నడవండి”, అంటూ చక్కగా నవ్వాడు.
ఇద్దరం దిగాం. ఆ సంచీలను మాధవ్ పట్టుకున్నాడు. నేను వెళుతున్న చోటుకి మాధవ్ రావటం సముచితమా అనే ఆలోచన వచ్చింది కానీ ఎందుకో ఈ అబ్బాయి మంచివాడి లాగానే కనిపించాడు. మెల్లగా ఆ దారి వైపు నడిచాం.
“సార్..!” డైవర్ అంటున్నాడు.
“ఏంటి?”
“వాటర్ బాటిల్” అంటూ చక్కగా విసిరాడు. పట్టుకుని సంచీలో పడేసాను.
“పూలు నలుగుతాయేమో?”, మాధవ్ అడిగాడు.
ముందరకి కదిలాం.
“కోసేసాక పూలు నలిగేందుకే కదా? పైగా ఆ వైద్యుడు కూడా అలాంటి పనే చేస్తాడు.”
“నిజమే.”
“పూలు గొప్పవి..”, చెప్పాను. “అలిగినా అందమే, ముడుచుకున్నా అందమే, నలిగినా మకరందమే!”
“తుమ్మెదలు గొప్పవి”, అన్నాడు మాధవ్.
“ఎందుకని?”
“నలపకుండా ఎంతో నేర్పుతో తేనెను లాక్కుంటాయి.”
“ఆలోచన బాగుంది.”
చుట్టుతా అద్భుతంగా ఉంది. దూరంగా రెండు పాడుబడ్డ ఇళ్ళు కనిపిస్తున్నాయి.
“మాధవ్..!”
“సార్.”
“అమ్మాయిలు ఫోటోగ్రాఫర్ల మాటలు ఎందుకు గట్టిగా వినేస్తారు?”
“అలా అనుకుంటున్నారా?”
“కాదా?”
“అవునూ, కాదు. మేము సంస్కారం లేని వాళ్లం కాదు సార్. కొన్ని మావి వింటేనే సరైన బొమ్మ వస్తుంది.”
“కొన్ని చేష్టలు వాళ్లే చేస్తారా?”
“కొన్ని”
జాగ్రత్తగా క్రిందికి అడుగులు వేస్తున్నాం.
“మీ కళ కూడా తుమ్మెదల కున్న విద్య లాంటిదే. అవునా?”
అతనేమీ మాట్లాడలేదు.
“అవునా?” మళ్ళీ అడిగాను.
“కాదు సార్. మేము ఏదీ కోరుకోవటం లేదు కదా?”
“ఒకవేళ కోరుకుంటే?”
“నేను చాలా మంచివాడిని అన్న పేరుంది సార్.”
నవ్వొచ్చింది.
“నిన్నేమీ అనడం లేదు బాబూ.. నీలో ఉన్న కళ గురించి చమత్కారం చేస్తున్నా.”
అప్పటి వరకూ నాకు వెనుకగా మెల్లగా నడుస్తున్న వాడు జాగ్రత్తగా నా ప్రక్కకు వచ్చాడు.
“సార్”
“యస్?”
“జ్యోతి ఏమైనా నా గురించి చెడుగా చెప్పిందా?”
“లేదు. ఒక్క మాట మటుకు చెబుతూ వచ్చింది.”
“మెల్లగా చెప్పండి సార్.”
“ఇక్కడ ఎవరూ లేరు. వింటే ఆ చెట్లూ, ఆ పూలూ, ఇదిగో సంచీలో నలిగిపోటానికి సిద్ధంగా ఉన్న మూడు రకాల పూలు.”
“పూలు మన మాటలు వింటాయా సార్?”
ఎందుకో ఆ ఆలోచన గట్టిదనిపించింది.
“పూలే కాదు మాధవ్. మన మాటలే కావు, ఎందుకో మన చుట్టూ ఉన్న ప్రకృతి మన ఆలోచనలను, స్పందనలను, అనుభూతులను కూడా గ్రహిస్తాయి.”
“నిజమా?”
“అవును. సీతాపహరణం జరిగిన తరువాత శ్రీరాముడు అడవిలో చెట్లు, చేమలను, పక్షులను సీత గురించి అడిగాడు. జింకలు పైకి చూసి దక్షిణదిశగా తిరిగాయి. కేవలం శబ్దంతోనే భాష ఉండదు, బాసా ఉండదు. ఎదుగుతున్న ప్రతి అస్తిత్వంలో పొదగబడిన ఒక సత్యం ఉంది. స్వరూపం మార్పు చెందుతుంది గానీ మాయం కాదు. గతించినది కేవలం గతి పొందినది. అది లేదనుకోవటం పొరపాటు. మనలను దాటి పోయి వెళ్లిన అస్తిత్వాలు మన పైనుండి మన గతులను, సంగతులను చూడగలుగుతాయి. మనం మధ్యలో ఉన్నాం. వెనకను, ముందు ఉన్న వాటి మధ్యలో, ఒక మాధ్యమంగా ఉన్నాం. మూడింటికీ సాక్షిగా ఉన్నది అతి సూక్ష్మాతి సూక్ష్మమైన ఈ ప్రకృతి.”
“వింతగా ఉంది. ఆసక్తికరంగా ఉంది, భయంగా ఉంది.”
“ఎందుకు?”
“నిజమా అని.”
“చాలా విషయాలలో నేను లోలోన ఎంతో ఘర్షణ పడ్డాను మాధవ్. కానీ ఈ మధ్య ఒక నిష్కర్షకు వచ్చాను.”
“ఏంటి సార్ అది?”
“ఇప్పుడు నీకు చెప్పినదే. కాకపోతే ఇది నిజమని తెలుసు. కానీ అనుభూతిలోకి రాలేదు.”
“నాకు కొన్ని వచ్చాయి.”
ఆగాను. ఎక్కడి నుండో చల్లని గాలి వీస్తోంది. దగ్గరలో ఏదో నది ఉండవచ్చని అనిపించింది.
“ఏంటవి?”
“ఒకే చిత్రం మరో సమయంలో మరోలా ఉంటుంది.”
“ఊ.. ఉదాహరణ?”
“జ్యోతిని పెళ్లికూతురులా అలంకరించి ఫొటో తీసాను. ఎంతో మురిసిపోయింది.”
“మీ ఇద్దరికీ చనువు బాగానే ఉందనిపిస్తోంది.”
“చనువు కాదు సార్. ప్రొఫెషన్.”
“ఏమంది ఫోటో చూసి?”
“గంట సేపు చూసింది. ఆ తరువాత ముఖకవళికలు మారిపోయాయి.”
“ఎందుకు?”
“అది కలర్ ఫోటో. కానీ ఎందుకయిందో తెలియదు. ఆమె అలా కన్నార్పకుండా చూస్తూ ఉండగానే అది బ్లాక్ అండ్ వైట్‍గా మారింది. నేను దగ్గరికి వెళ్లి చూస్తే గానీ తెలియలేదు.”
“నన్ను పిచ్చోడిని చేస్తున్నావు. కదూ?”
“లేదు సార్. ఆ ఫోటో ఇప్పటికీ నా వద్ద ఉన్నది.”
“ఆ ప్రింట్ తీసినవాడు మంచిగా తీయలేదేమో?”
“కానే కాదు సార్.”
“మరి?”
“నా దగ్గర కలర్ ఫోటోనే ఉంది.”
“మరో ప్రింటా?”
“కాదు, అదే.”
కాళ్ళు అవే ఆగిపోయాయి. అతని వైపు జాగ్రత్తగా చూసాను.
“అంటే?”
“తెలియదు. పూచే పూలలో ఋతువులున్నాయో, ఋతువులలో పూలున్నాయో లేక వాటిని వాడే మనుషులలో ఏమున్నాయో.. నాకు తెలియదు. మీకు ఒక్కడికే చెబుతున్నాను. ఇది నిజం!”
ఆలోచించాను.
“ఇక్కడ ఏదైనా నది ఉన్నదా?”
“అవును సార్. కుశావతి దగ్గరలోనే ప్రవహిస్తుంది.”
“నదులు గొప్పవి..”, ఎందుకో అన్నాను. “..ముందరికి దారి చేసుకుంటూ వెళ్ళిపోతాయి. రివర్స్ గేర్ ఉండనే ఉండదు.”
“మధ్యలో కొన్ని పాయలు ఎండిపోతాయి.”
చిరునవ్వు నవ్వి ముందరకి వెళ్లిపోయాను.
(ఇంకా ఉంది)