[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[సుందర్, మాధవ్ కారులో వెళ్తుంటారు. జైల్లో ఎందుకున్నావని సుందర్ అడిగితే, సమస్యా తెలియదు, సమాధానమూ తెలియదంటాడు మాధవ్. గవడె గారితో ఏమిటి సంబంధం అని అడిగితే, తాను గవడె గారి కోసం పని చేస్తాననీ, ఆయనకి తన మీద అనుమానం రావడంతో సమస్యలు మొదలయ్యాయని అంటాడు మాధవ్. జ్యోతిని ఒప్పించి తన మీదిచ్చిన కంప్లయింట్ వెనక్కి తీసుకోడంలో సాయపడమని సుందర్‍ని అడుగుతాడు. ఆమె తన మాట కూడా వినదనీ, ప్రస్తుతానికి కష్టమనీ అంటాడు సుందర్. కొంచెం దూరం వెళ్ళాకా, ఓ చోటు కారు ఆపి – ఇలా క్రిందకి వెళ్లిపోయి కుడి ప్రక్కకు తిరగండి – అని చెప్తాడు డ్రైవర్. పూల సంచులు పట్టుకుని కారు దిగుతారు సుందర్, మాధవ్‍లు. ఇంతలో డ్రైవర్ సుందర్‍ని పిలిచి, వాటర్ బాటిల్ మర్చిపోయారంటూ, అతనికి అందేలా విసురుతాడు. ఆ బాటిల్‍ని ఓ సంచీలో పడేసుకుని లోయలోకి దిగడం మొదలుపెడతారు. పూలు నలుగుతాయోమో అని మాధవ్ అంటే, వైద్యుడు కూడా పూలని నలిపే మందు తయారు చేస్తాడని చెప్తాడు సుందర్. పూలు గొప్పవని సుందర్, తుమ్మెదలు గొప్పవని మాధవ్ అంటారు. జ్యోతి తన గురించి ఏవైనా చెడుగా చెప్పిందా అని అడుగుతాడు మాధవ్. జ్యోతికీ, నీకూ గొడవేంటని అడిగితే, జరిగిన ఘటనలన్నీ చెప్తాడు సుందర్. ఆమె కోరిక మేరకు ఆమెను పెళ్ళి కూతురు గెటప్‍లో కలర్ ఫొటో తీశాననీ, ఆమె కాసేపు దానికేసి చూడగానే అది బ్లాక్ అండ్ వైట్ ఫొటోగా మారిపోయిందని చెప్తాడు. ప్రింట్స్ వేసినవాడు సరిగా వేయలేదేమో అంటే, కాదని ఆ పొటో ఇప్పటికీ తన వద్ద ఉందని చెప్తాడు మాధవ్. దగ్గర్లో ఏదైనా నది ఉందా అని సుందర్ అడిగితే, కుశావతి నది ఉందని అంటాడు. ముందుకు సాగుతారు. – ఇక చదవండి.]
మాధవ్ నా చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు.
“భయం లేదు..” అన్నాను. “..నేను జారి పడను.”
“అది కాదు సార్.”
“నువ్వూ జారిపడవు”
“సీరియస్‌గా సార్, జ్యోతి ఏమన్నదో మీరు చెప్పనే లేదు”
“నిన్ను జైల్లోంచి విడిపించమన్నది.”
ఒక్కసారిగా ఆగిపోయాడు. ఆకాశం వైపు చూసాడు.
“తొందరపడకు..!” మెల్లగా చెప్పాను, “..ఎందుకో తెలుసా?”
“నన్ను నమ్మండి, నాకు మరో ఉద్దేశం, ఆలోచనా ఏమీ లేవు.”
“అవి కావు. నిన్న జైల్లోంచి విడిపించమన్నది.. నిన్ను చంపుకునేందుకు.”
“అన్యాయం సార్. నేనేం చెయ్యలేదు”
“జాగ్రత్తగా ఆలోచించు. నీకు జైలే మంచి చోటు. జ్యోతి లాంటి అమ్మాయి నుంచి తప్పించుకోవటం చాలా కష్టం”
చాలా సేపు ఇద్దరం ఏమీ మాట్లాడకుండా అలా నడిస్తూ వెళ్లిపోయాం.
“జైలు అంటే ఏంటి సార్?”, మెల్లగా అడిగాడు.
ఇది సరైన ప్రశ్న. స్వాతంత్ర్యం గురించి చాలా మంది అనవసరంగా ఎక్కువగా మాట్లాడారు. జైలులో ఎంతో కాలం ఉండి కూడా జైలు గురించి ఎక్కువ చర్చించలేదు ఎవరూ.
“ఒక ఆలోచన సరళికి నిబద్ధమైపోయి ఉండటం జైల్లోని జీవితం”
“జ్యోతి జైల్లో లేదంటారా?”
“జ్యోతి గురించి జ్యోతికే సరిగ్గా తెలియదు. ఏం చేస్తుంది? ఎప్పుడు ఏ గోతిలోకి జారిపోతుందో చెప్పటం కష్టం. ఇంతకీ ఆమె గురించి నాకు నువ్వు పూర్తిగా చెప్పటం లేదనిపిస్తుంది.”
“ఎందుకు సార్?”
“ఫోటోలో పడలేదన్నావు”
“కొన్ని సందర్భాలలో”
“మరి అది కూడా విచిత్రమే కదా? అలా ఎందుకని ఏమైనా శోధించావా?”
“శోధించాను. సరైన సమాధానం దొరకలేదు!”
“ఊఁ.. కుశావతీ ప్రాంతంలోని గనుల సంగతేమిటి?”
“కుశావతికి అటూ ఇటూ దాదాపు 70 గనులున్నాయి. వీటికి సంబంధించిన ఫొటోలు నేను గవడె గారికి ఇస్తూ వచ్చాను. సుల్కొర్నా, కావరెమ్, మైనా, పిర్లా, రివోనా లాంటి ప్రాంతాలలోని డీప్ డైవ్ ఫొటోలవి. ఎంతో సాహసంతో, రిస్కుతో లోలోపలికి వెళ్లి తీసిన చిత్రాలవి. బాక్సైట్, మంగనీస్, లేటరైట్ ఖనిజాలు విరివిగా ఉన్నాయి. ఏ ప్రాంతంలో ఐతే నేను ఫొటో తీసి.. నిజానికి కొన్ని వేల ఫొటోలు తీసి ఆయనకు ఇవ్వనన్నానో అక్కడే ఆయన ఎవరెవరో పెద్ద వాళ్లతో గొడవల్లో చిక్కుకున్నాడు.”
“ఆయనకేంటి సంబంధం?”
“జియాలజీ, అర్కియాలజీ కబడ్డీ ఆడుకునే ప్రదేశం ఇది.”
“ఆశ్చర్యంగా ఉంది”, అంటూనే అక్కడ ప్రక్కన ఉన్న గుట్ట మీద కూర్చుని వాటర్ బాటిల్ అందుకున్నాను.
“నా కెమెరా ఒక ఒక జైలు..”, అతను చెబుతున్నాడు. “..చిత్రాలలో బంధిస్తాను. చిత్రాలను సృష్టిస్తాను. నేను చూసిన వాటిని తలచుకుంటే నాకే పిచ్చెక్కి గిలగిలా తన్నుకుంటాను.”
“మాధవ్..!”, అన్నాను. “నువ్వెన్నైనా చెప్పు! జ్యోతికి.. నువ్వే సరైన జోడీ.”
“నన్నెందుకిలా ఆడుకుంటున్నారు సార్?”
“నిజాలు చెప్పేటప్పుడు అందుకే మెల్లగా, మెల్ల మెల్లగా చెప్పమన్నారు. నాలాగ ఒక్కసారిగా వాంతి చేసుకున్నప్పుడల్లా అంతా కామెడీగా ఉంటుంది.”
“ఆ అమ్మయి చేత ఒక్క కాగితం ఇప్పించండి సార్. ఈ సంచీలు కాదు, మరో ఆరు సంచీల పూలతో మీ నెత్తి మీద అభిషేకం చేస్తాను. గారంటీగా!”
“పూలతో అభిషేకం! శభాష్. ఏ పూలతో?”
“ఓ, మళ్ళీ ఇదొకటా? మీరు కోరుకున్న వాటితో..”
“ఇంతకీ ఆ ఫొటోలు గవడె గారికి ఎందుకివ్వలేదు? ఆర్కియాలజీ, జియాలజీ కబడ్డీ ఆడకోవటం అంటే ఏంటి? ఈ రెండు ప్రశ్నలకి సమాధానాలు తెలిసి కూడా నాకు చెప్పలేదంటే..!”
“నన్ను ఇక్కడి నుంచి తోసేస్తారా!!”
“జ్యోతినిచ్చి కాళ్లు కడిగి పెళ్లి చేసేస్తాను.”
అతను మోకాళ్ల మీద కూర్చుని నమస్కారం చేసాడు. ఎక్కడో మెరుపు మెరిసి వాన కురవాలంటోంది.
“పద.. వాన వచ్చేటట్లుంది.”
“కరెక్ట్, ఇంకా ఎంత దూరం సార్?”
“పద! ఆ భవనమే మన గమ్యం.”
“భవనమా? అది కేవలం గోడలా ఉంది. పైన ఏమీ లేదు.”
“గొప్ప గొప్ప భవనాలన్నీ గోడల చాటున దాక్కునుంటాయి.” ఫోన్ మ్రోగింది. కిరణ్ నంబరు.
“హలో!”
“సార్, ఎక్కడన్నారు”
“ఎందుకు?”
“నాకు చెప్పవచ్చు. మరేం ఫరవాలేదు.”
“గనుల లోతులలో ఏదో పరిశీలిస్తున్నాను.”
“రచనలు మానేస్తున్నారా?”
“ఇది నిజమైన రచన.”
“ఛా.”
“నీ బాధేంటి?”
“మీ కదలికలు ట్రాకింగ్‌లో ఉన్నాయంటే నమ్ముతారా?”
కొద్దిగా మాధవ్ నుంచి దూరంగా వెళ్లాను.
“ఉండవచ్చు. నేను అక్రమమైన పని ఏదీ చేయటం లేదు.”
“వద్దు. మీరు జైల్లో జోవాక్విమ్‍ని కలిసారు కదా?”
“అవును.”
“అక్కడి నుండి ట్రాక్‌లో ఉన్నారు.”
“నీకు ఈ సమాచారం ఎవరిస్తున్నారు?”
“తరువాత చెబుతాను. కానీ జాగ్రత్తగా ఉండండి.”
“గోవా వస్తావా?”
“రావచ్చు. మీరు వెళ్లబోతున్న ప్రదేశం సామాన్యమైనది కాదు.”
“నా ప్రక్కన ఉన్న ఓ కుర్రాడు.. అతని వివరం తెలుసా?”
“పూర్తిగా తెలియదు. మీరు కొంత దూరం వెళ్లిన తరువాత సిగ్నల్స్ దొరక్కపోవచ్చు.”
“ఓ.”
“ఆ లోయలోంచి బయటకు వచ్చిన తర్వాత మరల సిగ్నల్స్ వస్తాయి.”
“నీకెలా తెలుసు?”
“అడక్కండి. వినండి.”
“ఊఁ.”
“ఈ లోయలో మరో నెట్‍వర్క్ ఉంటుంది. అది ఎవరికీ తెలియదు. మీ కదలికలు ఇక ఎవరికీ అందవు.”
చుట్టూతా చూశాను.
“నన్నేం చెయ్యమంటావు?”
“సిమ్ తీసేసి మొబైల్‍ను నీళ్లల్లో పడెయ్యండి.”
“కుదరదు. ఐనా తెలుసుకోవచ్చు. సిగ్నల్స్ ఉండవని నువ్వే చెబుతున్నావుకదా? మరి ఇదేంటి?”
“నిజమే. మీ కదలికలను పోలీసులే కాదు. ఇతరులూ ట్రాక్ చేస్తున్నారు.”
“ఎవరు?”
“భయపడకండి. మిమ్మల్ని ఎవరూ ఏమీ చెయ్యరు. జాగత్తగా ఆ గోడ దాటండి..”
వాన వచ్చేటట్లుంది. ఇద్దరం గబ గబా ఆ గోడ వరకూ దాదాపు దొర్లుకుంటూ వెళ్లిపోయాం. గోడ దాటి లోపలకి వెళితే అక్కడ నిజంగానే ఏదో గని ఉన్నట్లుంది. మొబైల్ చూసాను. సిగ్నల్స్ లేవు. మాధవ్ వైపు చూసాను.
“ఏమైంది సార్?”
“సిగ్నల్స్ ఉన్నాయా?”
అతను గబ గబా మొబైల్ తీసాడు.
“లేవు సార్.”
ఆశ్చర్యంగా ఉంది. ఇదేంటి? ఇవన్నీ కిరణ్‍కి ఎలా తెలుసు? చుట్టూతా చూసాను. ఇంతకీ ‘సాయా’ అనే ప్రదేశం ఎక్కడ? సన్నని చినుకల మధ్య లోంచి అలా నడుచుకుంటూ వెళ్లాం. ఏదో అనిపించి ఆగాను.
“మాధవ్?”
“సార్”
“నీకు మరాఠీ చదవటం వచ్చా?”
“చదవగలను.”
“కెమెరా లేకుండా కెమెరా లెన్స్ లోంచి చూడగలవా?”
మొబైల్ తీసాడు. కెమెరా ఆన్ చేసాడు. నాకిచ్చి “మీరు చూడండి”, అన్నాడు.
“నేను నిన్నడిగాను.”
“నేను చూస్తాను. ఎక్కడ చూడమంటారో చెప్పండి.”
చాలా రోజుల తరువాత ఇంత చురుగ్గా ఉన్న కుర్రాడ్ని చూస్తున్నాను. మొబైల్‌లో చూస్తున్నాను.
ఆగాను.
“మాధవ్..”
“సార్.”
“ఓ యాభై మీటర్ల దూరంలో పూల మొక్కలు కనిపిస్తున్నాయా?”
అతను కొద్దిగా నిక్కపొడుకుని చూసాడు.
“యస్!”
“విరబూసిన పూల సరళిలో ఏదైనా భాష ఉందా?”
మొబైల్ తీసుకొన్నాడు. స్క్రీన్ పెద్దది చేసాడు.
“ఉంది.. సార్.. సా.. య.. కాదు, సాయా!”
(ఇంకా ఉంది)