[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[లోయలోకి దిగుతుంటారు సుందర్, మాధవ్. సుందర్ చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు మాధవ్. భయపడకు, నేను జారిపోను అంటాడు సుందర్. తాను అందుకు పట్టుకోలేదని, జ్యోతి ఏమన్నదో మీరు చెప్పలేదంటాడు. నిన్ను జైలు నుంచి విడిపించమందని చెప్తాడు. మాధవ్ ఆగి, ఆకాశం కేసి చూస్తుంటే, తొందరపడకు నిన్ను విడిపించమన్నది, చంపుకునేందుకు అని చెప్తాడు సుందర్. తానేమీ చేయలేదని అంటాడు మాధవ్. కాసేపు జైలు గురించి, కుశావతి నదీ తీరంలోని గనుల గురించి మాట్లాడుకుంటారు. ఖనిజాలు ఏయే ప్రాంతాల్లో ఉన్నాయో, అక్కడ ఫోటోలు తీసి గవడె ఇవ్వమంటే, ఇవ్వనందుకు తన మీద కోపం పెంచుకున్నాడనీ, ఆ విషయంలోనే ఆయన ఎవరో పెద్దవాళ్లతో గొడవల్లో చిక్కుకున్నాడనీ మాధవ్ చెప్తాడు. ఇంకొంచెం ముందుకు నడుస్తారు. ఇంతలో సుందర్‍కి కిరణ్ ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నారని అడిగితే, ఎందుకంటాడు సుందర్. పర్వాలేదు చెప్పండి అని కిరణ్ అంటే, గనుల లోతులలో ఏదో పరిశీలిస్తున్నాను అంటాడు సుందర్. మీ కదలికలు ట్రాకింగ్‍లో ఉన్నాయనీ, కొంత దూరం వెళ్ళాకా సిగ్నల్స్ రావనీ, ఆ లోయలో మరో నెట్‍వర్క్ ఉంటుందనీ, అది ఎవరికీ తెలియదని, అక్కడికి వెళ్తే మీ కదలికలు ఎవరికీ తెలియవని కిరణ్ చెప్తాడు. నన్నేం చెయ్యమంటావని సుందర్ అడిగితే, మొబైల్ ఫోన్‍ని నీళ్ళలో పడేయమని చెప్తాడు. పోలీసులే కాదు, ఇతరులు కూడా సుందర్‍ని ట్రాక్ చేస్తున్నారని, భయపడద్దని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు కిరణ్. ఇవన్నీ కిరణ్‍కి ఎలా తెలుసా అని ఆశ్చర్యపడతాడు సుందర్. తాను వెళ్ళాల్సిన సాయా అనే ప్రదేశం ఎక్కడా కనబడదు. అక్కడున్న ఓ గోడ దగ్గరకు దాదాపు దొర్లుకుంటూ వెళ్తారు సుందర్, మాధవ్. అక్కడ సిగ్నల్స్ ఉండవు. మరాఠీ చదవడం వచ్చా అని సుందర్ అడిగితే చదవగలనని చెప్తాడు మాధవ్. కొంత దూరం వెళ్లాకా, అక్కడి పూలలో ఏదో సరళి కనిపించి, మొబైల్ కెమెరా లోంచి చూడమని మాధవ్‍కి చెప్తాడు. మాధవ్ కెమెరా జూమ్ చేసి చూసి, ఆ పూలలో దాగి ఉన్న సరళిని అర్థం చేసుకుని, అదే సాయా అని చెప్తాడు. – ఇక చదవండి.]
[dropcap]వి[/dropcap]పరీతంగా వాన కురుస్తుండగా ఆ గోడ దాటి అక్కడ గల చూరు క్రింద అలా నిలబడి ఉన్నాం.
“ఇక్కడ ఇల్లు లాంటిదేమీ లేదు”, అన్నాను.
“ఏదో స్టేడియమ్‌లా ఉంది. అది కూడా ఏ కాలంలోనిదో అర్థం కావటం లేదు. అన్నీ పగిలిపోయి ఉన్నాయి”, మాధవ్ చేతులు కట్టుకుని కొద్దిగా వొణుకుతున్నట్లున్నాడు.
“జ్వరం లాంటిది ఉన్నదా?” అడిగాను.
“లాంటిది కాదు. జ్వరమే ఉంది.”
“అదేంటి? వారి నాతో ఎందుకు వచ్చావు?”
“మాకు మామూలే. సరిహద్దుల్లో సైనికులకూ మాకూ పెద్ద తేడా ఉండదు.”
“ఇంతకీ ఇక్కడ దారేదో అర్థం కావటం లేదు.”
“సాయా అయితే ఇదే.”
“ఇక్కడ సాయా లాంటిది ఏదీ లేదు.”
“మనం నిలుచున్న చూరే అయి ఉంటుంది.”
“కరెక్ట్.”
కొద్ది సేపట్లో చీకటి పడగలదని పించింది. ఈ పూలు తడవకుండా చూస్కోవాలి. ఎవరికీ ఫోన్ చెయ్యటానికి లేదు. సిగ్నల్స్ లేవు. ఎందుకెత్తుకున్నానా ఇంత పని అనుకున్నాను.
“మాధవ్..”
“సార్”
“గవడె గారు ఎందుకు అరెస్టు చేయించారు నిన్ను?”
“ఆయన చేయించలేదు సార్. జ్యోతి చేయిస్తుంటే బాగానే ఉందని అనుకున్నారు.”
“ఎందుకలా అనుకునుంటారు?”
“నేను చెప్పేది మీరు నమ్మలేకపోవచ్చు.”
“అయినా ఫరవాలేదు. మన దగ్గర సమాచారం ఉండటం చాలా అవసరం!”
“ఒకానొక సందర్భంలో జ్యోతి ఫోటోలో పడలేదని నేను అన్నాను.”
“కరెక్ట్. మనకొచ్చిన నష్టం ఏదీ లేదు.”
అతను మొహం లోకి మొహం పెట్టాడు.
“నష్టం కాదు సార్ సబ్జెక్ట్.”
“సబ్జెక్ట్ ఏంటి?”
“జ్యోతి.”
“నేను గవడె గురించి అడుగుతున్నాను.”
“నా దృష్టిలో రెండు ఒకటే.”
ఎక్కడో మెరుపు మెరిసింది. ఆలోచించాను. ఇక్కడ ఏదో పెద్ద తిరకాసుంది.
“క్రమంగా వెళదాం. జ్యోతి ఫొటోలో పడకపోతే ఏంటట?”
“సార్, జాగ్రత్తగా ఆలోచించండి. ఈ అమ్మాయికి ఏవో అతీంద్రయమైన విద్యలున్నాయి.”
“నిజమే. నేను కళ్లారా చూసాను.”
“అదే విధంగా ఒక భిన్నమైన అనుమానం నా మీద ఉన్నది.”
“నీకు కూడా శక్తులున్నట్లు అనుకున్నారా ఆయన?”
“అవునో కాదో తెలియదు కానీ మైనింగ్ మాఫియా వాళ్లకి నేను ఏవో రహస్యాలు ఇచ్చినట్లు ఆయన అంచనా.”
“ఇచ్చావే అనుకో, ఐతే ఆయనకేంటి?”
వాన మెల్లగా సన్నగిల్లుతోంది. మాధవ్ ఆలోచనలో పడ్డాడు. మరీ పాయింట్ బ్లాంక్‌లో అడిగానా అన్న అనుమానం కలిగింది. ఈ వ్యవహరం, ఈ నెక్సస్ గురించి తెలియుకుండా నేను ముందుకెళ్ళటం ఎలాగ?
గోడను ఆనుకుని మెల్లగా క్రిందికి జారి కూర్చున్నాడు.
అదే పని చేసాను.
“ఆశలు ఉంటాయి అందరికీ..” మాధవ్ చెప్పాడు, “..నెరవేరేది కొందరికే అనే పాట ఉంది.”
“అవును. మళ్లీ మళ్లీ పాడాలి ఈ పాట.”
“కరెక్ట్. మైనింగ్ అనేది సామాన్యమైన వృత్తి కాదు సార్.”
“అవును.”
“అందరూ ప్రాణాలకు తెగించి పోరాడి కోట్లు గడిస్తారు. కానీ ఇక్కడ గని ఉన్నది అన్నది నిర్ధారణగా చెప్పి, పెట్టుబడి పెట్టించగల్గిన వాడు సునాయాసంగా కోట్లు గడిస్తాడు.”
“అంటే ఆ గని గురించి నీకేమైనా తెలిసిందా?”
తల రెండు చేతులలో పెట్టుకున్నాడు మాధవ్.
“అయ్యో సార్, ఇదే నా సమస్య. అలాంటిదేమీ జరగలేదు. అలా వందల సార్లు మొత్తుకున్నా అతగాడు నమ్మడు. నేను జ్యోతి గురించి చెబుతూ వస్తుంటే కథలు చెబుతున్నానని మొహం అటు తిప్పుకునే వాడు. నేను మోసం చేస్తున్నానని అనుకున్నాడో ఏమో, నన్ను ఈ ప్రపంచం లోంచి తప్పించటం కోసం నన్ను లోపలికి తోయించారు! ఇదీ కథ.”
“గవడె గారికి ఏమైనా దొరికిందా?”
“జైల్లో ఉన్న నాకు తెలియదు, మీకు తెలియాలి.”
ఆలోచించాను. నిజమే. జ్యోతి విషయంలో, మరో వ్యవహారంలోనో నేను ఏదైనా మాట్లాడినప్పుడు ఏవో స్కెచ్‍లు వేసుకొనే వాడు. తనలోని విద్య వలన లాభం పొందాలని ఎవరైనా అనుకుంటారు. తప్పమీ లేదు. ఇక్కడ ఏవో పెద్ద స్టేక్స్ ఉన్నట్లున్నాయి..
వాన తెలిసింది. ఇద్దరం లేచాం. మందరికి నడిచాం. ఆ మైదానం లాంటిది దాటి అవతల ప్రక్కనున్న గోడ దగ్గరకి వెళ్లి ఏదో గేటు లాంటివి అనుకుని తికమక పడ్డాం. అది తీగలతో అల్లిన ఏదో కంప లాంటిది.
ఇప్పుడర్థమైంది. అది దాట వెళితే ఒక అందమైన తోట కనిపిస్తోంది.
“ఇది దాటటం ఎలా?”
“ఒక్క పాతాళభైరవి సినిమా గురు తెచ్చుకుని చెబుతాను సార్.”
“శభాష్. సాహసం శాయరా..”
అతను నవ్వలేదు కానీ ఎందుకో దేనినో చూస్తూ ఉండిపోయాడు.
“ఏమైంది?” అడిగాను.
“ఉండండి..” అంటూ ఆ తీగల వెంబడి నడుచుకుంటూ వెళ్లాడు. నేనూ అనుసరించాను. ఒక చోట ఆగి నన్ను రమ్మన్నాడు.
ఇక్కడ ఎవరో గడ్డిని రోజూ కొస్తూ మెయింటెయిన్ చేస్తున్నట్లుంది. మధ్యలో గడ్డిపూలు రకరకాల రంగులలో కనిపించాయి.
“సార్.. నన్ను చూడనీయండి.”
“ఏంటి?”
“ఇదిగో సార్.. ఈ పూల ఆవరణ ఒక భాష మాట్లాడుతోంది.”
అతను మొబైల్ కెమెరాతో రక రకాల స్నాప్స్ తీసాడు.
“అయ్యో చార్జ్ అయిపోతోంది.”
“జాగ్రత్త.”
“ఉండండి.”
ఈ విషయంలో చాలా నైపుణ్యం ఉన్నట్లుంది ఇతనికి. నాతో ఇతను రాకపోతే నేను ఏం చేసేవాడినో. ఇవన్నీ నేను అస్సలు ఊహించనే లేదు. జో ఇచ్చిన ఏవో సూచనలను పట్టుకొని బయలుదేరి పోయాను.
“సార్.. మరాఠీలో ఇది ద్వారం అని అర్థం అవుతోంది.”
చుట్టూతా చూసాను. ఎక్కడా ద్వారం లేదు.
“ఎక్కడ మాధవ్?”
“మనం నిలుచున్న చోట.”
అర్ధమైంది. క్రిందకి చూసాను. మాధవ్ ఆ గడ్డిపూలను అలా అలా తాకి కొన్నిటిని ప్రక్కకు తప్పించాడు. అతని వెంట నడిచాను. ఆగిపోయి ఏదో ఆలోచించాడు. నేల మీద కూర్చుని గడ్డి వాసనను చూడటం ప్రారంభించాడు. నాకు ఏమీ అర్థం కావటం లేదు. ఆ డ్రైవర్ ఉన్నా బాగుండేది, కాసేపు నవ్వేవాడు.
“ఇలా రండి..”, అన్నాడు మాధవ్. “..ఆ గడ్దికీ, ఈ గడ్డికీ తేడా ఉంది. అవునా?”
నేను వాసన చూసాను.
“ఉంది. అయితే?”
* సార్, ఇది కృత్రిమమైన గడ్డి.”
ఆశ్చర్యం వేసింది.
“దీని అర్థం?”
అతను గబగబా ఆ కృత్రిమమైన గడ్డిని కొలిచాడు. నాకు థమ్స్ అప్ చూపించాడు.
“ఈ పూలు గోవాలో ఎక్కడ కడతారో తెలుసా?” అడిగాడు.
“తెలియదు.”
“ఇవి లేడీ బర్డ్ పూలు.”
“ఓ.”
“ఇంటి ద్వారం మీద కడతారు.”
“ఇక్కడ కృత్రిమంగా మొలుస్తున్నాయా?”
“కాదు. అలా కనిపిస్తున్నాయి. ఇదే ద్వారం.”
“అంటే?”
“మీరు ప్రక్కకి తప్పుకొండి.”
నాలుగడుగులు వేసి ప్రక్కకు వెళ్లిపోయాను. అతను అక్కడున్నా ఓ పెంకు తీసి ఆ కృత్రిమంగా ఉన్న గడ్డి వరకు పెకిలించాడు. అది తేలికగా లేచి వచ్చేసింది. నన్ను చూసి గర్వంగా మొహం పెట్టాడు. రెండు చేతులూ నడుము మీద పెట్టాడు.
దగ్గరకెళ్లి చూసాను. అక్కడ భూగృహం లోకి మెట్లు కనపడుతున్నాయి. గవడె గారు ఇతన్ని ఊరికే లోపల పెట్టలేదన్న మాట. సామాన్యుడు కానే కాదు. మాధవ్ భుజం తట్టాను. అదిగో అన్నట్లు ఆ పెకిలించిన మట్టిని చూపించాడు. దాని వెనుక మరాఠీలో పూలతోనే వ్రాసినట్లుంది.
“ఏంటది?”
“సాయా.”
“ఛా.”
“అవును. ఇది క్రిందకున్న వారికి చూరు.”
“ఈ ప్రదేశానికి ఎపుడైనా వచ్చావా?”
“నన్ను నమ్మండి, లేదు.”
“మరి సాయాజీ వ్యవహారం నీకు తెలుసా?”
“తెలియదు. ఒక్క మాట చెప్పగలను. కుశావతీ పరివాహక ప్రాంతంలో పూల రహస్యాలను, వాటి గుర్తుల గురించి చెప్పే వ్యక్తిగా సాయాజీ అనే ఆయన మనవడిని ఒకసారి కలిసాను.”
“అతను ఇప్పుడు ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? తెలుసా?”
“వీరమణి తాలూకు మనుషులతో పాటు తిరుగుతాడు. తేలికగా దొరకడు.”
“ఈ మెట్లు దిగితే?”
అతను మాట్లాడలేదు. తెలివిగల వాడు.
“దిగితే?”, మరల అడిగాను.
“మీరు వెళ్లాలనుకున్న చోటుకి వెళ్లవచ్చేమో!”
(ఇంకా ఉంది)