Site icon Sanchika

పూచే పూల లోన-53

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[అదే సాయా అని మాధవ్ చెప్పినచోటకి నడుస్తారు సుందర్, మాధవ్. బాగా వాన కురుస్తూంటుంది. గోడ దాటి అక్కడున్న చూరు కింద నిలబడతారు. ఇక్కడ ఇల్లు లాంటిది ఏదీ లేదని సుందర్ అంటే, ఏదో స్టేడియమ్‍లా ఉందనీ, ఏమీ అర్థం కావడం లేదని మాధవ్ అంటాడు. ఇక్కడ దారేదో అర్థం కావటం లేదని సుందర్ అంటే, సాయా అయితే ఇదే అని అంటాడు మాధవ్. గవడె గారు నిన్ను ఎందుకు అరెస్టు చేయించారు అని సుందర్ అడిగితే, ఆయన చేయించలేదు – జ్యోతి చేయించిందనీ, ఆయన ఊరుకున్నాడనీ చెప్తాడు మాధవ్. వివరాలడిగితే, రెండు కారణాలుండవచ్చనీ – ఒకటి జ్యోతికి అతీంద్రియ విద్యలుండడం, రెండు మైనింగ్ మాఫియా వాళ్ళకి తానేవో రహస్యాలు అందజేసినట్లు ఆయన అనుమానం అని చెప్తాడు మాధవ్. ఇచ్చావే అనుకో, ఐతే ఆయనకేంటి అని సుందర్ అడిగితే, మైనింగ్ అనేది సామన్యమైన వృత్తి కాదని, గని ఉన్నదని నిర్ధారణగా తెలిసి, పెట్టుబడి పెట్టించగల్గిన వాడు సునాయాసంగా కోట్లు గడిస్తాడని అంటాడు మాధవ్. ఇక్కడ ఏవో పెద్ద స్టేక్స్ ఉన్నాయని అనుకుంటాడు సుందర్. వర్షం ఆగుతుంది. ఇద్దరూ మరింత ముందుకు వెళ్తారు. ఒక తీగల కంప లాంటిది అడ్డం వస్తుంది. ఆ తీగల వెంబడి నడుచుకుంటూ వెళ్తాడు మాధవ్. ఒక చోట ఆగి, సుందర్‍ని పిలుస్తాడు. అక్కడి గడ్డిని ఎవరో రోజూ కోస్తూ మెయిన్‍టెయిన్ చేస్తున్నట్లుందనీ, ఆ గడ్డిపూలు ఏదో భాష మాట్లాడుతున్నాయని అంటాడు. వాటిని ఫోటోలు తీస్తాడు. ఆ ఫోటోలను విశ్లేషించి, మరాఠీ భాషలో అది ద్వారం అని చెప్తాడు. చుట్టూ చూసిన సుందర్, అక్కడ ద్వారం ఏదీ లేదుగా అని అంటాడు. మనం నిలుచున్న చోటే ద్వారం, ఇది కృత్రిమ గడ్డి అంటూ, జాగ్రత్తగా అక్కడి గడ్డిని పెకిలిస్తాదు. లోపల భూగృహంలోకి మెట్లు కనబడతాయి. అక్కడ పూలతో మరాఠీలో సాయా అని రాసి ఉంటుంది. ఈ ప్రదేశానికి ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చావా? సాయాజీ గారు తెలుసా అని సుందర్ అడిగితే, ఎప్పుడూ రాలేదనీ, సాయాజీ గారి మనవడిని ఒకసారి కలిసానని చెప్తాడు మాధవ్. అతనిప్పుడు ఎక్కడ దొరుకుతాడు అని సుందర్ అడిగితే, వీరమణి మనుషులతో తిరుగుతుంటాడు, తేలికగా దొరకడని అంటాడు మాధవ్. – ఇక చదవండి.]

మానవుని మేధస్సు ఎప్పుడెప్పుడు ఏమి చేసిందో, ఎందుకు చేసిందో ఒక్కసారి ఓ చిన్ని మేధస్సుతో ఆలోచిస్తే చాలు – చాలా విషయాలు తెలియకపోయినా, తెలుసుకోవచ్చనే ఆలోచన కలుగుతుంది. వాస్తవానికి నేను గోవాలో చేస్తున్నవన్నీ ఎంతో రిస్కుతో కూడినవని నేను అవగతం చేసుకునే లోపలే చాలా లోపలికి వెళ్లిపోయానన్న సంగతి తెలుసుకున్నాను. ఈ పరిస్థితి నుండి వెనక్కి రావటం అంత మంచిది కాదనీ అర్థమైంది. చిత్రం ఏమిటంటే కొన్ని దారులు ఇలానే ఉంటాయి. చాలా దూరం ప్రయాణం చేసిన తరువాత అసలు ఎందుకొచ్చామా అని అనిపించి ఆశ్చర్యం వేస్తుంది. నా చుట్టూతా ఉన్నది చక్రవ్యూహమే అయితే ఇది సహజంగా ఏర్పడిందా లేక ఎవరైనా జాగ్రత్తగా పన్నిన వ్యూహమా?

మెట్లు చాలా కనిపిస్తున్నాయి. సూర్యరశ్మి ప్రసరించేందుకు అవకాశం కూడా లేదనిపిస్తోంది. కాళ్ళు నా వల్ల కాదు అని హెచ్చరిస్తున్నాయి. ఎందుకైనా మంచిదని ఆ మెట్ల దారిలో ఓ మలుపు దగ్గర కూర్చుని ఇద్దరం మంచి నీరు తాగాం. మాధవ్‌ని ఓ చూపు చూసాను.

“మాధవ్?”

“సార్”

“ఒక్క విషయం అడుగుతాను సూటిగా చెప్పు.”

“మీరడిగింది గుర్తుంది సార్.”

“ఏంటది?”

“జ్యోతికి, నాకూ మధ్య ఏం జరిగింది అని.”

“అది బాకీ ఉన్నావు రైటే. కానీ మరొకటి ఇప్పుడే తలెత్తుతున్న ప్రశ్న!”

“అడగండి సార్.”

“నా వల్ల నీకు మంచే జరుగుతుందని అనుకుంటున్నావా?”

“అర్థం కాలేదు సార్.”

“ఏం లేదు, నన్ను ఈ రోజే కలిసేవు. అతనెవరో నీతో వచ్చాడు.”

“నా మీడియా పార్ట్‌నర్ సార్.”

“ఓకే. ఇలా నా వెంట అర్థం కాని ఈ ప్రదేశానికి వచ్చేసావు. ఒక్క విషయం నేనూ ఒప్పుకుంటాను.”

“చెప్పండి!”

“నువ్వే నా వెంట లేకపోతే ఇలా ఈ రహస్య ప్రదేశానికి రాలేను. ఏదో తంటాలు పడేవాడిని.”

“ఇంతకీ మీరెందుకిలా ఇంత కష్టంతో కూడిన పనిని చేపట్టారో అర్థం కాలేదు!”

మాధవ్‌కి ఈ సందేహం రావటం సహజమే. కొద్దిగా ఆలస్యంగా వచ్చింది.

“తరువాత చెబుతాను. నాకు కలిగిన ప్రశ్న అడిగేస్తాను, విను!”

“అడగండి సార్. ఈ నిర్మానుష్యమైన వాతావరణంలో కొద్దిగా మాట్లాడుకుంటుంటూనే మనం ఓ నాగరికతతో కూడిన సమాజంలో గాలి పీలుస్తున్నామన్న భావం కలుగుతూ ఉంటుంది.”

మంచి నీళ్లు త్రాగి నవ్వాను.

“బాగా మాట్లాడతావు మాధవ్. ఇంతకీ నాతో నువ్వు కేవలం జ్యోతికి నచ్చ చెప్పేందుకు నేను పనికొస్తానని, ఆ మాట నన్నడగటానికి వచ్చావా లేక దానితో పాటు మరేదైనా పని ఉన్నదా లేక ఎవరైనా పురమాయించారా?”

“లేదు సార్, మరే పనీ లేదు. నాకు అవసరమూ లేదు.”

“అలా అయితే అర్జీ పెట్టుకుని మరో రోజు కలుస్తానని వెళ్లిపోవచ్చు కదా?”

మాధవ్ ఆలోచించాడు. పక్షులేవో వింత వింతగా కొట్టుకుంటున్న శబ్దం వినిపిస్తోంది. ఆశ్చర్యం ఏమిటంటే అంత భూగృహం లాంటి ప్రదేశంలో కూడా ఎక్కడి నుండో చల్లగాలి తగులుతోంది.

మాధవ్ నన్ను అదోలా చూసాడు.

“ఏమనుకోనంటే ఒక మాట చెబుతాను.”

“మీ మీద నాకు చాలా అనుమానాలున్నాయి.”

“నాకూ ఉన్నాయి.”

“ఏంటి నా మీదనా?”

“కాదు, నా మీదనే.”

ఇద్దరం నవ్వుకున్నాం.

“ఏంటి అనుమానం?” అడిగాను.

“సార్, మీ రచనలు, మీ ఆలోచనలు ఒక పట్టాన అర్థం కావు.”

“నా రచనలు చదివావా?”

“చాలా చదివాను. మీ కారెక్టర్ నా కెమెరాలో – ఆదే, నా మెదడులో బంధించలేక పోయాను.”

ఇటువంటి మాట ఒక పాఠకుని దగ్గర నుండి మొదటిసారి వింటున్నాను.

“కొద్దిగా వివరించ గలవా?”

“మీరు హాస్యం పండిస్తారు, గంభీరంగా, గాఢంగా వ్రాస్తారు, కొన్ని నాటకీయతతో కూడినవి చెబుతారు, కొంత చరిత్రను నింపుతారు. కవ్విస్తారు, నవ్విస్తారు, ఆలోచించమంటారు, అనుభవించమంటారు.. మీరసలు ఏమిటో తెలుసుకోవాలనుకున్నాను.”

మరల ఆలోచించాను. నిక్కచ్చిగా ఇతను నాతో ఇంత దూరం రావటానికి ఇది కారణం కానే కాదని అర్థమైపోయింది. అది నాకు అర్థమైనట్లు కొద్దిగా వెటకారంగా అతన్ని చూసి నవ్వాను.

“అర్థమయ్యేందుకు ఏమీ లేదు..”, చెప్పాను. “..ఈ బాటిల్ చూడు, ప్రస్తుతానికి మంచినీళ్ల బాటిల్. గ్లాసులో పోసుకుంటే గ్లాసు. లేకపోతే దగ్గరలోనే ఉన్న కుశావతీ నది! అదీ కాదంటే సముద్రం! ఈ మనసు ఒక స్వరూపం లేని మాయలేడి! కానీ నాతో వస్తూ ఇంత రిస్కు తీసుకోవటానికి ఇది కారణం కాకపోవచ్చు. ఏ కెఫెలోనో కూర్చుని నన్ను అడగవచ్చు!”

“మీకలా అనిపించటంలో విశేషం ఏమీ లేదు. నిజానికి మీకు దగ్గరవ్వాలనుకుంటున్నాను.”

“ఇలాగా?”

“కావచ్చు. నన్ను నమ్మండి. ఆ కారు అక్కడ ఆగాక ఎలాగో అలాగ వెనక్కు వెళ్లిపోవాలనుకున్నాను. కానీ ఒంటరిగా వెళుతున్నారు కదా అని కూడా వచ్చాను. మరో కారణం లేదు. కావాలంటే నన్ను సెర్చ్ చేయండి. గన్నులేవీ దొరకవు. చాకుల౦త కంటే లేవు.”

“ఊ.. ఈ ప్రదేశాలలోని చాలా విషయాలు, ముఖ్యంగా పూలు, పూల లోంచి వచ్చేవి, పూలతో అమర్చేవి ఇలా చాలా తెలుసని అర్థమైంది. నీ కెమెరా పని గొప్పదని అర్థమైంది. జీవితంలో ఏమి సాధించాలనుకున్నావు?”

“పిక్చర్ అనేది ప్రతిబింబం.”

“కరెక్ట్.”

“ఆలోచన అనేది కూడా ఒక ప్రతిబింబం.”

“ఓ.కే.”

“ప్రతీ ఆలోచన అనంతం యొక్క ఒక చిన్న ప్రతిబింబం!”

“……”

“ఏమంటారు?”

“ఓ.కే.”

“అనంతం లోంచి ఏర్పడ్డ చిన్ని చిన్ని ప్రతిబింబాలను కలిపి ఒక నాదైన పిక్చర్‍ను తయారు చేయాలకున్నాను.”

“ఆసక్తికరంగా ఉంది.”

“ఎన్నో ప్రమాదాలను ఎదుర్కున్నాను.”

“ఎన్ని ప్రతిబింబాలు దొరికాయి?”

“అరవై దాకా. కానీ కేవలం ఆరింటిని గట్టిగా అధ్యయనం చేసాను.”

“మచ్చుకి?”

“పంచ శబ్ద ఉపాసన.”

“నేనూ విన్నాను. నాకు నీ అనుభవం తెలుసుకోవాలనుంది.”

“చాలా ఉన్నాయి సార్. ఒక్కటి చెబుతాను. ఇందులోనే జ్యోతిని గురించి మీరడిగిన ప్రశ్నకు సమాధానం దొరకగలదు.”

“నీలో ఏదో ఉంది. చెప్పు.”

“కొర్టాలెమ్ దాటి ఇద్దరం చాలా దూరం వెళ్లిపోయాం ఒక రోజు..” మాధవ్ గంభీరంగా చెబుతున్నాడు. “..అడవి అని తెలుసుకునే లోపు అడవిలోకి పూర్తిగా వెళ్లిపోయామని అర్థమైంది.”

“అలాగే ఉండాలి. ఇదిగో, ఇప్పుడు మనం ఎక్కడ కూర్చుని మాట్లాడుతున్నామో తెలియదు.”

“కరెక్ట్. ఆ రోజు జ్యోతిని అడిగాను.. నీకు భయం వెయ్యటం లేదా అని. తల అడ్డంగా ఊపింది. భయపడటం కాదు, భయపెట్టడం తనకి అలవాటంది. ఎలా? అన్నాను. చుట్టూతా చూసింది. ఇంకో నాలుగడుగులు నడవమంది. నిశ్శబ్దంగా వెంబడించాను. భూమిలోంచి ఏవో స్పందనలు తన కాలి లోకి ప్రవేశించినట్లు విచిత్రంగా నడిచింది. అక్కడక్కడ ఆగింది. ఏవో శబ్దాలు వింటున్నట్లు కళ్ళు పైకి, అప్పుడప్పుడు అటూ ఇటూ గిరగిరా తిప్పింది. పెదాల మీద చూపుడు వేలు పెట్టి ‘ష్’ అంది. ‘ఇప్పుడు నా మీద మెరుపు మెరుస్తుంది, ఫొటో తియ్యి’ అంది. వెంటనే కెమెరా సెట్ చేసాను. కరెక్ట్‌గా ఓ మెరుపు మెరిసింది. ‘బుద్ధి లేదు, క్లిక్ చెయ్యలేదు నువ్వు’ అని తిట్టింది.

‘మెరుపు ఒక క్షణం ఉండదు జ్యోతీ..’ అన్నాను.

‘ఆ క్షణమే జీవితం. ఎన్నిసార్లు గాలి పీల్చావన్నది కాదు మాధవ్! ఎన్నిసార్లు నీ ఊపిరి ఆగిపోయిందన్నది జీవితం. నేను ఈ సారి అంకెలు లెక్కపెడతాను. అయిదు అన్నప్పుడు క్లిక్ చెయ్యి.. ఒకటి.. రెండో.. మూడు.. నాలుగు..’

క్లిక్ చేసాను. అయిదు వినిపించలేదు కానీ మెరుపు మెరిసింది. ఆ మెరుపులో జ్యోతి చాలా చిత్రంగా కనిపించింది.

బహుశా మబ్బుల వెంట మెరిసే ఈ మెరుపులు మన మీద పడ్డప్పుడు కూడా మనం ఇంత విచిత్రంగా ఉంటామేమో అనిపించింది.

గట్టిగా నవ్వింది జ్యోతి. ఆ నవ్వులోంచి చిత్ర విచిత్రమైన శబ్దాలు వినిపించాయి. ఆకాశం యావత్తూ ప్రతిధ్వనించింది. నిజంగానే భయం వేసింది.

‘జ్యోతీ.. జ్యోతీ’ అంటూనే ఉన్నాను. ఒక్కసారి ఆపేసి నన్ను చూసి చిరునవ్వు నవ్వింది

‘జ్యోతీ..’

‘నేను జ్యోతిని.. వెలుగుతూనే ఉంటాను’ సన్నగా గుసగుసలు చెబుతున్నట్లు అంటోంది. ‘అర్థమైందా? లేదా? భయపడ్డావా?’

అలా చూస్తూ ఉండిపోయాను. ‘ఆ ఆకాశంలోని శబ్దం, నీ లోని నిశ్శబ్దంలో దాక్కున శబ్దం, నా నవ్వు లోని శబ్దం, ఈ నేల లోని ప్రతిస్పందనలో దాక్కున్న శబ్దం, ఈ గాలిలోని లయబద్ధమైన శబ్దం కూడుకుని పంచశబ్దాలుగా పయనిస్తుంది నా ఒక్కొక్క శబ్దం..’ అంటూనే భయంకరంగా నవ్వింది.

‘ఈ చెట్లన్నీ నాతో నవ్వుతున్నాయి.. అదుగో ఆ పుట్టల్లోని పాములు పైకి లేచి బుసలు కొడుతున్నాయి.. పడగలు విప్పి ఆడుతున్నాయి..!’

రెండు చేతులూ చాచి పైకి చూసింది.

‘నా అణువణువూ శబ్దమయం. పంచకోశ ప్రతీకాశం. నేను ప్రకృతిని. వికృతిని. సుకృతిని..’

ఈ మాటలన్నీ ఎక్కడైనా చదివిందా లేక..

అవునూ! అయిదవ అంకె దగ్గర మెరుపు మెరుస్తుందని ఈమెకు ఎలా తెలుసు?

గుండె అయిదు క్షణాలు ఆగిందనుకున్నాను. జ్యోతి అలాగే నిలబడి ఉంది. వాన మొదలయింది..”

(ఇంకా ఉంది)

Exit mobile version