Site icon Sanchika

పూచే పూల లోన-55

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[భూగృహంలో ఎంత కిందకి దిగుతున్నా సుందర్‌కి, మాధవ్‍కి చెమటలు పట్టవు. పైగా మధ్య మధ్యలో చల్లగాలులు వీస్తూంటాయి.  మరికొన్ని మెట్లు దిగాకా, తరువాత ఏం జరిగిందని అడుగుతాడు సుందర్. జ్యోతి మాటలకి తాను తికమకి గురయ్యానని, మామూలు సమయాల్లో బానే ఉన్నా, ఒక్కోసారి విచిత్రంగా ప్రవర్తిస్తుందని అంటాడు మాధవ్. ఆ విచిత్రమైన ప్రవర్తన ఎప్పుడు ఉంటుందో నీ అనుభవం నుంచి చెప్పు అని మాధవ్‍ని అడుగుతాడు సుందర్. ఆమె ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహించలేమని, మనకి కనిపించేది ఒకటి, ఆమెకు కనిపించేది మరొకటని అంటాడు. అసలా అడవిలో ఏం జరిగిందో వివరంగా చెప్పమంటే చెప్తాడు మాధవ్. తాను తీసిన ఓ ఫొటో తనని ఎలా కష్టాల పాలు చేసిందో చెప్తాడు. ఫొటో తీసాకా, జ్యోతి ఎందుకు ఫొటో తీసావని కోపంగా కెమెరా లాక్కుని నేలకేసి కొట్టబోయిందనీ, కానీ అందులోని డిజిటల్ కార్డు తీసుకుని తన బ్యాగ్‍లో దాచుకుని కెమెరా ఇచ్చేస్తుంది. కొన్ని సందర్భాలలో ఫొటోలు తీయకూడడని అంటుంది, ఎలాంటి సందర్భలని మాధవ్ అడిగితే, మాట దాటేస్తుంది. తర్వాత అడవిలోంచి బయటకి తీసుకొస్తుంది. ఓ టాటా సుమో వచ్చి ఆగగానే జ్యోతి అందులో ఎక్కేసి వెళ్ళిపోయిందని చెప్తాడు మాధవ్. వారం తరువాత కార్వాలో మాధవ్ గదికి వచ్చి గవడె గారు అర్జెంటుగా పిలుచుకు రమ్మన్నారని అంటాడు. ఎందుకని అడిగితే పోలీసులు వచ్చారని అంటాడు. మాధవ్ వెళ్ళేసరికి అక్కడ ఓ సి.ఐ. కూర్చుని డ్రింక్ తాగుతుంటాడు. గవడె మాధవ్‍ని రమ్మని పిలిచి, ఇతనే మాధవ్ అని సి.ఐ.కి చెప్తాడు. ఆయన ఓ కవర్ లోంచి కొన్ని పొటోలు బయటకు తీసి, ఇవి నువ్వు తీసినవేనా అని అడుగుతాడు. అందులో ఓ ఫోటో ట్రిక్ ఫొటోగ్రఫీలా ఉండి జ్యోతి శరీరం మీద బట్టలు ఉన్నాయో లేవో తెలియకుండా ఉన్నట్టుంది. ఆ ఫొటో తాను తీయలేదంటాడు మాధవ్. డిజిటల్ కార్డు చూపించి ఇది నీదే కదా అని అదిగితే, తనదేనంటాడు. తాను ఆ అమ్మాయిని బట్టలు లేకుండా ఫొటో తీయలేదని, దీనితో తనకు సంబంధం లేదని మాధవ్ అంటాడు. ఇంతలో అక్కడికి జ్యోతి వచ్చి ఆ ఫొటోలు తన సమక్షంలోనే ప్రింట్స్ వేసారని, నువ్వు నన్ను మోసం చేసావని మాధవ్‍తో అని, సర్ ఇతన్ని అరెస్టు చేయండి అని సి.ఐ.తో అంటుంది. సి.ఐ. మాధవ్‍ని విచారిస్తాడు. గోవా ఎందుకొచ్చావనీ, ఆ అడవిలోకి ఎందుకు వెళ్ళావనీ, ఆ అమ్మాయికి డ్రగ్స్ ఎందుకిచ్చావని రకరకాల ప్రశ్నలు వేస్తాడు. అప్పటి దాకా తెరవని మరో కవర్ తెరిచి అందులో ఉన్న ప్రింట్‍ని మెల్లిగా బయటకు తీసి, తనకు మాత్రమే కనిపించేలా పట్టుకుంటాడు. మాధవ్ ముందుకు వెళ్ళబోతే ఆపుతాడు. – ఇక చదవండి.]

ఒక విధంగా మాధవ్ నన్ను కలవటం వలన నాకు చాలా లాభంగానే ఉంది. గజిబిజిగా ఉన్న వ్యవహారాలన్నీ మెల్ల మెల్లగా అర్థమవుతున్నాయి.

“ఏముంది ఆ ప్రింట్‌లో?”, అడిగాను.

“ఎవరన్నా సృష్టించారో తెలియదు, కల్పన అనాలో తెలియదు. కళారంగంలో అదొక అద్భుతమైన బొమ్మ, కానీ లౌకికంగా నేను తలపెట్టిన నేరం!”

“ఓ, ఇదో వింత మాట. అలోచింప చేసే మాట! ఒక్కోసారి నాకూ అనిపిస్తుంది. కల్పనా ప్రపంచంలో నిరంతరం మునిగి తేలే ప్రతి వాడు నేరస్థుడేనేమో..”

“ఆ ప్రింట్‍లో జ్యోతి దాదాపు కాళికలా ఉంది. ఆవిడ పుర్రెలను మాలగా తొడిగితే, ఈమె మందారాలను మాలగా వేసుకుని ఉంది. కళ్లు ఎర్రగా ఉన్నాయి. వక్షస్థలాన్ని నిండు మందారాలు కప్పి ఉంచాయి. కుడి చేతిలో కొడవలి, ఎడమ చేతిలో ఎవరిదో జుట్టు, తెగ నరికిన తలకాయ.. భయంకరంగా, అందంగా ఉంది.”

“ఓ! అందుకా ఈ అమ్మాయి మందారం పువ్వు ఉందంటే చాలు, ఆమడ దూరం పరుగులు తీస్తుంది.”

మాధవ్ ఆలోచిస్తున్నట్లు కనిపించాడు.

“నా సమస్య అది కాదు. నేను ఈ ఫొటో తియ్యలేదు కదా?”

“అయినా అది ప్రింట్‍లో వచ్చింది” అన్నాను.

మాధవ్ చెప్తున్నాడు

“సి.ఐ. గర్జించాడు- ‘వాట్ ఈజ్ దిస్ నాన్సెన్స్?’ అన్నాడు.

నేనీ ఫొటో తీయలేదు!? అన్నాను.

‘ఇది నీ డిజిటల్ కార్డ్. అమ్మాయిని డ్రగ్గింగ్ చేసి నీ ఇష్టం వచ్చినట్లు చేసావు.’

‘నాకు డ్రగ్స్ తెలియవు. అమ్మాయిని టెస్ట్ చెయ్యండి.’

అతను దగ్గరగా వచ్చి మెల్లగా ఫొటో లన్నింటినీ కవర్లలో పెట్టాడు.

‘అబ్బాయ్..’, మెల్లగా అన్నాడు ‘..అవన్నీ మెల్లగా తేల్తాయి. మనం అలా క్రిందకెళ్లి ఆ ఖాళీగా ఉన్న జీవ్ ఎక్కేస్తే మా డ్రైవర్ ముందరకి పోనిస్తాడు. పద!!’

‘నన్ను దేనికి అరెస్ట్ చేస్తున్నారు?’

‘కంప్లయింట్ అమ్మయి ఇచ్చింది. వాస్తవం ఇక్కడ కనిపిస్తోంది. ఛాయిస్ లేదు.’

గవడె గారు లేచారు. సి.ఐ.ని ఎందుకో కూర్చోమని సైగ చేసారు.

‘సార్, డ్రగ్స్ విషయంలో నిర్ధారణ లేదు. అమ్మాయిని మభ్యపెట్టి అశ్లీలమైన ఫొటోలు తీసినట్లు ప్రింట్స్ చెబుతున్నాయి. అమ్మాయి అసలు ఏమంటుంది అన్నది వినాలి కదా? చాలా సార్లు – కంప్లెయింట్ ఇచ్చిన తరువాత అసలు వ్యక్తి ఎదురుగా వచ్చినప్పుడు ఆ ఆదేశం జారిపోవచ్చు.’

‘మీరు అడిగి చూడండి!’

గవడె గారు అటు తిరిగారు.

‘జ్యోతీ..’

జ్యోతి చేతులు కట్టుకుంది.

‘ఇతన్ని ప్రేమించావా?’

వెటకారంగా పెదవి విరిచి తల అడ్డంగా తిప్పింది.

‘ఇతను నిన్ను ప్రేమించాడా?’

నాలుక బయటకు తెచ్చి తల అడ్డంగా తిప్పింది.

‘ఇతను నిన్ను కోరుకున్నాడా?’

‘లేదు.’

‘మరి ఇలాంటి పని ఎందుకు చేసాడు?’

‘నన్ను వాడుకొని ఏదో అవార్డు పొందాలనుకోవచ్చు.’

నేను ఏదో మాట్లాడబోతే నన్ను ఆపారు ఆయన.

‘నిన్ను బలవంతం చేసాడా?’

‘చెప్పలేను.’

‘అదేంటి? కంప్లయింట్‌లో వ్రాసావు కదా?’

‘అదే, నాకు ఇలాంటి మేక్‌అప్ ఎలా చేసుంటాడా కూడా నాకు అర్థం కావటం లేదు. అంత గొప్ప మాయగాడిలా ఉన్నాడు.’

‘ఎలా చేసి ఉండవచ్చు?’

‘అర్థం కావటం లేదు.’

‘నిన్ను అలాంటప్పుడు మరో విధంగా.. అంటే శారీరికంగా..’

జ్యోతి వెనక్కి వెళ్లి గోడకి ఆనుకుంది.

‘నో.. నన్ను పాడు చెయ్యటానికి ఈ ఫోటోలు చాలవా?’ దైన్యంగా అడిగింది.

ఆయన నా వైపు తిరిగారు.

‘మాధవ్.. అసలు ఈ అమ్మాయి ఫొటోలు నీకెందుకు?’

‘సార్! ఇద్దరం కలిసి తిరుగుతున్నాం ఈ ప్రాంతమంతా. చాలా ఫొటోలు తీసాను. జ్యోతి కూడా నావెన్నో ఫొటోలు చేసింది. ఇందులో విశేషమేయింది సార్? కాకపోతే ఈ రకం ఫొటోలు నేను ఈమెకే కాదు, ఎవరికీ తీయలేదు.’

సి.ఐ. వైపు తిరిగారాయన.

‘సార్, పోనీ ఈ ఒక్కసారికీ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే?’

అతను జ్యోతి వైపు తిరిగాడు. ఎందుకో ఒక్కసారిగా జ్యోతిలో ఆవేశం వచ్చింది.

‘సార్.. నాది జన్మ జన్మల వైరం. ఈ గడ్డ మీద నాలాంటి వాళ్ళెందరినో ఇలా మందారాలతో వాడుకుని మా జీవితాలని నాశనం చేసారు. తరువాత ఆక్రమణదారులకు అందరూ అహుతి ఇచ్చారు. ఈ రోజుకీ ఈ ప్రాంతంలో జరుగుతున్నదేమిటి? వార్నింగ్ ఇవ్వండి.. ఇలా కాదు..’

ఒక్కసారిగా సి.ఐ. చొక్కా పట్టుకొని బాల్కనీ దాకా నడిచింది. అతను ఓ పిరికిపందలాగా గబగబా ఆమెతో నడిచాడు. ఎందుకైనా మంచిదని అందరం అటు పరుగు పెట్టాం. క్రింద రోడ్డు మీద బండ్లు అటూ ఇటూ పరుగులు తీస్తున్నాయి.

‘వార్నింగ్ ఇవ్వండి..!’ గంభీరంగా చెప్పింది. ‘ఇతన్ని నరికి ఇక్కడ వ్రేలాడదీసి ఈ జనమందరికి వార్నింగ్ ఇవ్వండి!!’

ఆ మాట చెప్పి అతన్ని బాల్కనీకి ఉన్న పిట్టగోడ మీదకి బలంగా వంచి గబ గబా హల్లోకి వెళ్లి కాలు మీద కాలు వేసుకుని సింహగర్జన చేసింది. మేమంతా తేరుకునే లోపు లేచి బెడ్ రూం లోకి వెళ్లి తలుపులు మూసేసింది.

అరెస్టు వేయటానికి వచ్చిన సి.ఐ. సోఫాలో కూలబడి పోయి రెస్ట్ అడుగుతున్నట్లు నోరు తెరిచాడు. గవడె గారి దగ్గర ఉండే ఆ మెయిడ్ గబగబా ఫ్రిడ్జ్ లోంచి బీర్ బాటిల్ తీసి గ్లాసు నింపేసింది. చంటి పిల్లవాడు పాలపీకను పట్టుకున్నట్లు పట్టుకున్నాడు సి.ఐ. కళ్ళు కొద్దిగా అటూ ఇటూ తిప్పుతున్నాడు. పాపం! ఈ ప్రపంచమంతా ఒక దోషిలా కనిపిస్తోంది ఆ క్షణం అతనికి.

గవడె గారు ఎదురుగా కూర్చున్నారు.

సగం గ్లాసు పూర్తి అయ్యాక నా వైపు తిరిగాడు.

‘ఫస్ట్ ఎక్కడ కలిసావు?’, అడిగాడు.

‘ఎవర్నీ సార్?’

విసుగ్గా మొహం పెట్టడు.

‘ఈ మందారాన్ని!’

అంత కష్టంలోనూ నవ్వొచ్చింది.

‘ఇక్కడే, గోవా లోనే’

‘ఎప్పుడు ఇలానే ఉంటుందా?’

‘లేదు. ఇలా ఎప్పుడైనా ఉండి ఉంటే, ఎప్పుడో పారిపోయే వాడ్ని.’

‘పోదాం పద.’

‘ఎక్కడికి?’

‘పోలీస్ స్టేషన్‌కి’

గవడె గారు మరల చేయి అడ్డం పెట్టారు.

‘సార్, స్టేట్‌మెంట్ ఏదో ఇక్కటి తీస్కోండి. నేను సాక్ష్యం!’

‘స్టేట్‌మెంట్ ఏదీ తీస్కోను గవడె గారూ. మీ మీద గౌరవంతో ఈ రాత్రి ఇక్కడే ఉండనిస్తాను. మీరు అమ్మాయితో మాట్లాడండి. కంప్లయింట్ వెనక్కి తీస్కోమనండి. అది మంచి పని!’

ఆయన నమస్కారం పెట్టాడు.

సి.ఐ. లేచాడు. జాగ్రత్తగా అన్నీ సద్దుకున్నాడు. బెడ్ రూమ్ వైపు అదోలా చూసాడు. మెట్ల మీద కేవలం తల ఒక్కటే కనిపిస్తున కాన్‌స్టేబుల్ వైపు చూసాడు.

‘మెట్లు ఇవే కదా?’ అన్నాడు.

‘అవును’ గవడె గారు అన్నారు. ‘..అటు వైపు కూడా..’

అతను ఆపాడు.

‘వద్దు. నేను ఇలానే దిగిపోతారు. వస్తాను.’

నాలుగడుగులు వేసి బీరు తెచ్చిన ఆమె వైపు చూసాడు.

‘వస్తాను..’, అని చిరునవ్వు నవ్వాడు. ఆమె వెయ్యి వాల్ట్‌ల బల్బ్‌లా వెలిగి పోయింది. ఈ సారి రెండు మూడు రెడీగా పెడతాను అన్న చక్కని సందేశం ఆ మొహంలో పైపైకి తేలింది!

అతను వెళ్లిపోయాడు.

గవడె గారు నన్ను క్రిందకి తీసుకొని వెళ్లారు. ఆయన ఆఫీసు అది. దాని కంటే క్రింద ఈ బిల్డింగ్ యావత్తు ఎప్పుడు కూలగొట్టచ్చా అనే ఆలోచనతో కార్వాల్లో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఎవరు ఎప్పుడూ అర్ధం కాలేదు. ఫొటోలే నాతో మాట్లాడతాయి.

ఆయిన కంప్యూటర్ ఆన్ చేసాడు.

‘అసలు ఏం జరిగింది?’ అడిగాడు.

‘దారి తప్పి అడవిలోకి వెళ్లాం. చల్లని వాతావరణం. ఈ అమ్మాయికి ఏదో అయిపోయి వింతవింతగా పాడటం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆకాశంలో మెరుపు మెరుస్తుంది, అన్నది. అలాగే మెరిసింది. నేను ఎందుకో జారి నేల మీద పడ్డాను. ఈమె రెండు చేతులూ చాచి ఏదేదో మాట్లాడుతుండగా నేను అలవాటుగా కెమెరా క్లిక్ చేసాను. నా కెమెరా లోంచి కార్డు లాక్కుంది. ఆ తరువాత నన్ను ఇక్కడికి పిలిపించారు’

ఆయన డైరీలో ఏదో వ్రాసారు.

‘మాధవ్.., రెండు విషయాలు స్పష్టం. ఆ స్థితిలో ఫొటోలో మరేదో పడుతుందన్నది ఆమెకు అవగాహనలో ఉంది. అందుకే కార్డు లాక్కుంది. యస్?’

‘అవును సార్. ఆ స్థితి ఏమిటో నాకు అర్థం కావటం లేదు.’

‘దాని సంగతి తరువాత చూద్దాం. ఆమెకు అప్పుడప్పుడు ఏదో జరుగుతుంది అని తెలిసినప్పుడు నిన్ను అపరాధిగా ఎందుకు చూస్తోంది?’

‘మామూలు జీవితంలో ఇది సమస్య కదా? ఈ సంగతి తెలిసిన వాళ్లందరూ శత్రువులేనేమో.’

‘అందరూ అంటే ఎంత మంది? ప్రస్తుతం నువ్వు, నేను అంతే కదా?!’

‘సి.ఐ. కూడా’

ఆయన నవ్వాడు.

‘సీరియస్ పాయింట్‌కి వద్దాం. నాకు కుశావతీ పరివాహక ప్రాంతంలో మైనింగ్ సోర్స్ కావాలి. నీ కెమెరాలో ఎక్కడో ఖచ్చితంగా బందీ అయింది. నువ్వు, ఈ అమ్మాయి ఫొటోలో ఏం లేదని కథలు చెప్పి దాటేస్తున్నారు. ఆ ఫొటో మీద నాకు కోట్ల వ్యవహారం ఉంది. బేరియమ్ ఓర్ అంటే ఏమనుకుంటున్నావు?’

నాకు ఒక్కసారిగా పిచ్చెక్కింది.

‘నన్ను నమ్మండి సార్’, అన్నాను.

‘క్రింద కాన్‍స్టే‌బుల్‍ని ఉంచి వెళ్లాడు సి.ఐ. పైన పెద్ద పోలీసు బెడ్ రూమ్‌లో ఏం చేస్తోందో తెలియదు.. అంటే నా రూపంలో నీకు ఓ భవిష్యత్ ఉంది. తెలివిగలవాడివి! ఎక్కువ వద్దు, కొద్దిగా ఆలోచించి చూడు.’

ఆయన వెనుక ఒక పూల డిజైన్ మెరుస్తోంది. ఒక్కొక్క కోణంలోంచి ఒక్కొక్క పూవు మెరుస్తోంది.”

(ఇంకా ఉంది)

Exit mobile version