[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[గవడె గారింట్లో తనని పోలీసు అధికారి ప్రశ్నించిన వైనం, స్టేషన్‍కు తీసుకెళ్ళబోతుంటే గవడె గారు ఆపిన సంగతి సుందర్‍కి చెప్తాడు మాధవ్. గవడెగారు తనని అడిగిన ప్రశ్నల గురించి మాధవ్ చెబితే, గవడె గారు విలన్‍లా అనిపిస్తారు సుందర్‍కి. తానేదో ఆయన దగ్గర దాస్తున్నట్లు, మైనింగ్ విషయంలో మోసం గట్టిగా నమ్మారని అంటాడు మాధవ్. తర్వాత గవడెగారు ఎవరెవరికో ఫోన్లు చేశారనీ, కాసేపయ్యాకా, కుర్చీలో కూర్చుని తనతో మాట్లాడారనీ, తనకొచ్చిన అవార్డుల గురించి చెప్పి, ఆ అవార్డులతో నాలుక గీసుకోలేను కదా అన్నారని చెప్తాడు మాధవ్. కుశావతీ పరివాహక ప్రాంతంలో కోర్టాలిమ్ దాటి సముద్రానికి యాభై మైళ్ళ ఈశాన్య ప్రాంతంలోని కో-ఆర్డినేట్స్ కావాలని అడిగారనీ, అది తాను తీసిన ఫొటోలో జ్యోతి పడని ప్రదేశమని సుందర్‍కి చెప్తాడు మాధవ్. అక్కడ తీసిన ఫొటోలో జ్యోతి పడకపోవటంలో ఏదో మర్మం ఉందనీ, మళ్ళీ జ్యోతిని అక్కడికి తీసుకువెళ్ళమని, నువ్వు ఫోటోలు తీస్తుండు, నేను నీ వెనకే జీపులో వస్తానని గవడే అన్నారని అంటాడు. సుందర్, మాధవ్ ఇద్దరూ మళ్ళీ మెట్లు దిగడం ప్రారంభిస్తారు. తర్వాత ఏమైందని సుందర్ అడిగితే, చెప్తాడు. అన్ని మెట్లు పూర్తయి క్రిందకి చేరుతారిద్దరూ. అక్కడ ఓ ద్వారంలో పూలతోనే సాయా అని ఉందని చెప్తాడు మాధవ్. అటువైపు వెళ్ళబోతుంటే పూలమాలలతో భయంకరంగా అలంకరించుకుని చేతిలో పిస్టల్ పట్టుకుని ఉన్న ఓ యువతి వాళ్ళని అడ్డుకుంటుంది. ఇంతలో ఓ పెద్దాయన వచ్చి ఆ యువతిని వెళ్ళిపొమ్మని చెప్పి, సుందర్, మాధవ్ లను లోపలికి తీసుకువెళ్తాడు. కూర్చోమని సైగ చేసి, లోపలి నుంచి ఏవో డ్రింకులు తెచ్చి వాళ్ళకిస్తాడు. ఇద్దరు అమ్మాయిలు ఎక్కడ నుంచో వచ్చి సుందర్ తీసుకొచ్చిన సంచీలలోని పువ్వులను – తాము తెచ్చిన కుండలలో లోని నీటిలోకి వేసి, ఖాళీ సంచులని సుందర్‍కి ఇచ్చేస్తారు. ఆ అమ్మాయి పేరేంటి అని అడిగితే, జ్యోతి అని చెప్తాడు మాధవ్. పూర్తి పేరు అని అడిగితే తెలియదంటారు. పంచ శబ్ద ఉపాసనకి పూర్తి పేరు చాలా అవసరమని ఆ యువతి చెప్తుంది. జ్యోతి అనే పేరు వచ్చేలా రెండు మూడు పేర్లు చెబితే కాదంటుంది. చివరికి జ్యోతిర్మయి అని చెబితే, ఏవో లెక్కలు వేసి, కరెక్ట్ అని చెప్పి వెళ్ళిపోతుందా యువతి. – ఇక చదవండి.]
[dropcap]‘సా[/dropcap]యా’ నిజంగానే ఎడారిలో నడుచుకుంటూ వచ్చిన వానికి ఓ వటవృక్షపు ఛాయ లాగానే అనిపించింది. పైపెచ్చు వాళ్లిచ్చిన పానీయం కూడా అమృతాన్ని ఎన్నడూ ఆస్వాదించక పోయినప్పటికీ, అందరూ ఉదహరించే అమృతం ఖచ్చితంగా ఇదే అనిపించింది. పెద్ద గ్లాసు ఐనప్పటికీ గబగబా లోపలికి పోనిచ్చి ఆ సుందరాంగిని జాలిగా చూసాను. ఆమె అంతకంటే జాలిగా నన్ను చూసి మాధవ్‌ను ఓరకంటితో చూసి చిరునవ్వు నవ్వింది. ఈ ప్రాంతంలో ఈ చిరునవ్వు నన్ను ఎక్కువగా ఆకర్షించింది. ఆడదాని అందం చిరునవ్వు నవ్వేటప్పుడు కళ్లల్లో చూపించే నైనంలో ఉంటుందని ఎక్కడో పిచ్చి రాతలు వ్రాసుకునేటప్పుడు వ్రాసుకున్నాను. అలా కాకుండా ఆ చిరునవ్వు అనే విన్యాసాన్ని అటూ ఇటూ చూస్తూ ఇతరులను కదిలించే కార్యక్రమంలో అందమైన ముగ్గులో అంతకంటే అందమైన రంగులు నింపేలా ముందరికి వస్తుంది. సహ్యాద్రి ప్రాంతంలో మరింత అదిరేలా వీళ్లు పెదవి విరుస్తున్నారా లేక వెటకారాన్ని కనపడనీయకుండా దాచేస్తూ చిరునవ్వులు కనబరుస్తున్నారా అనేది కావాలని తెలిసీ తెలియకుండా మనలో కదులుతున్న గుండెలను నిశ్శబ్దంగా పూలలో తుంచినట్లు తుంచేస్తున్నారా అనే ప్రశ్న కించిత్ పండ్ల రసం సేవించాక గ్లాసు చివర చేదు గింజలు మిగిలినట్లు మిగిలిపోగలదు..
లోపలి నుండి ఓ జగ్ తీసుకుని వచ్చి ఇద్దరి గ్లాసులూ నింపింది. ఈ అమ్మాయిలో మరో అంశం బాగా నచ్చింది. మమ్మల్ని చూస్తూ గ్లాసులు నింపింది కానీ అవి నిండిపోయి ఒలికిపోకుంగా సరిగ్గా అక్కడే ఆపింది. చేతికందించినప్పుడు మా ముఖాలలోకి సి.బి.ఐ వాడు – చూపులతోనే రక్త పరీక్ష- కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేసి చూసినట్లు చూసింది. ఇలాంటప్పుడు పాపం విశ్వామిత్రుడు మేనక వద్ద ఎటువంటి అవస్థ పడి ఉంటాడా అని తలచుకుని నేను ఎన్నో సార్లు జాలిపడ్డ సందర్భాలు లేకపోలేదు. ఎన్నో ప్రమాదకరమైన ఘట్టాలను ఎదుర్కొని ఇక్కడికి రావలసి ఉంటుందని కాబోలు రాగానే ఈ పండ్ల రసంతో కలిసిన రసరంజనిని ఇక్కకి నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారన్న సమంజసమైన నిండుభావన మెంగా కలిగింది. ఊరట కూడా కలిగింది. ఇంక చాలులే అన్నట్లు ఆ జగ్ తీసుకుని లోపలికి నడుస్తూ ఏదో గుర్తుకొచ్చి ఈ వైపు తిరిగి మరల జగ్ పైకెత్తింది. మాకు జరుగుతున్నదంతా చందమామ కథలా ఉండటంతో ఈ లోకంలో ఉన్నట్లు మేం అనుకోవటంలేదు.
అందుచేత ఆమె మరింత కావాలా అని అడిగే ఆ విన్యాసాన్ని త్వరగా గుర్తించక దిష్టిబొమ్మల్లా చూస్తూ ఉన్నాము. అది గమనించి ఈసారి చక్కని పలువరసను అకస్మాత్తుగా ప్రకటించి తల కుడి వైపుకు వంచింది. ఏదో ప్రపంచం ఎక్కడో కొద్దిగా కంపించింది.
చాలు.. అన్నట్లు చేతులు చూపించాం. రయ్యిన వెనక్కి తిరిగి వయ్యారంగా వెళ్లిపోయింది. ఆ నాలుగడుగుల వ్యత్యాసంలో ఒక్కసారి మరల ఆగకూడదా అనిపించింది. మాధవ్‌కి బహుశః అలాగే అనిపించి ఉండవచ్చు. కాకపోతే అలా ఆగి అతన్ని ఓ చూపు చూడాలని కూడా ఆశించవచ్చి ఉండవచ్చు. అతని వయసుకు ఆ అదనపు వంఛ నాకునూ సమ్మతమే! కానీ అదే కనక జరిగితే ఆ విసురులోనే ఆ చూపు వెనక్కి తీసుకునేటప్పుడు నన్ను కూడా విసురుగానైనా కలిపేసుకున్నట్లయితే ఈ జీవుడు, అంతటితోనే అల్పసంతోషిని కావటం వలన అందుకోలేని అందలం ఎక్కినట్లు తలచేవాడు! అలా జరగలేదు..
“మాధవ్..”
“సార్..”
“మనకి ఈ పానీయాలను ఇచ్చి పంపించేస్తారా లేక మనం వచ్చిన పని..”
“పానీయాలు ఇచ్చారంటే ఖచ్చితంగా కొద్దిసేపట్లో ఎవరో ఒక వస్తారు సార్. మీ పూలు కుండలలో నింపి తీసుకొని వెళ్ళారు. ఏదో, ఎవరిదో ఒక పథకం ఇక్కడ కనిపిస్తోంది.”
“అవును. ఇంతకీ జైల్లోకి ఎలా వెళ్ళావో నాకు అర్థం కాలేదు. ఆ చిక్కు ప్రశ్న తీరకుండా ఇక్కడ ఎంత మేజువాణీ ఏర్పాటయినా నాకు ఉపయోగం లేదు.”
“అవును. కుశావతీ ప్రాంతానికి బయలుదేరాం. గవడె గారు, మరి కొంతమంది, జ్యోతి, కార్వాల్లో.. ఇలా చాలా మంది ఉన్నారు. అడవులలోకి దూసుకుంటూ వెళ్లాం. దాదాపు ఆరు టాటా సుమోలు అవి. నన్ను మటుకు అందరూ జాగ్రత్తగా కనిపెట్టి ఉన్నారని అర్థమైంది. కుశావతి నది చిత్రమైనది. పేరుకు తగ్గట్లు సన్నగా ప్రవహిస్తోంది. కొన్ని చోట్ల కాలువలా, మరికొన్ని చోట్ల చెరువులాగా, కొన్ని చోట్ల మైదానంలాగా ఉంటుంది. కృష్ణానది లాగా వైశాల్యం ఉండదు. జియాలజీ ప్రకారం జ్వాలాముఖులు, గనులు గల చోట ఏదైనా నది ఉంటే ఆ నది యొక్క ప్రవర్తన ఇలాగే ఉంటుంది. క్రింది వైపుకు గుహల్లాంటివి ఏర్పడ్డప్పుడు నది విస్తీర్ణంలోని మధ్య భాగంలో ఒక ఊబి కాని ఊబిలా కనిపిస్తుంది. అందలోంచి డ్రిల్లింగ్ చేస్తూ ఉంటారు. దాని తరువాత రెండు మూడు పొరలు వదిలేసి నది యొక్క ప్రవర్తనను చూడాల్సి ఉంటుంది. నీరంతా లోపలికి జారిపోయి ఒక వారం రోజులుగా వాన లేకుండా ఉన్నప్పుడు నది దిగువ ప్రాంతంలోని విస్తీర్ణం కనుక తగ్గితే ఇక్కడ ఏదో ఖనిజం ఉన్నదని అర్థం. లోలోపల దానికి సముద్ర గర్భం యొక్క తాకిడి కూడా లభిస్తుంది..”
చెయ్యి అడ్డం పెట్టాను.
“మాధవ్..”
“సార్?”
“మనం ప్రస్తుతం అలాంటి చోటులోనే కూర్చున్నట్లు తెలుస్తోంది.”
“మీరు మాములుగా అన్నప్పటికీ అది నిజం కూడా కావచ్చు.”
“కాకపోతే ఇంత కాలం నేను రచయితనే అనుకున్నాను.”
“అదేంటి సార్?”
“నేనే కాను. అసలు నువ్వు రచయితవి! ఎందుకో తెలుసా?”
“అస్సలు తెలియదు. తెలిస్తే ఇలా ఎందుకుంటారు సార్?”
“కరెక్ట్. సహజంగా వ్రాయగలిగే ఏ రచయితకీ తాను రచయిత అన్న సంగతి ఎప్పుడూ తెలియదు.”
“ఇది అర్ధం కాలేదు.”
“కాదు.”
“ఇంతకీ నేను ఎందుకు రచయితను అని అన్నారు సార్?”
“అడిగినది చెప్పవు కదా? అడగనిది ఏదో చెబుతూ దానినే గొప్ప గనిలా చూపిస్తే పిచ్చివాడిని చేసి అందులోకి తోసుకుంటూ పోతావు. గొప్పవాడివి.. కాదు, గొప్ప రచయితవి.”
మాధవ్ గ్లాసు ఖాళీ చేసాడు,
“నేను జరిగింది గుర్తు చేసుకుంటూ చెప్పాలి సార్. మధ్య మధ్యలో చాలా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి.”
“అది నేను ఒప్పుకుంటాను. మంచి వయసులో ఉన్నావు మరి.”
“ఊర్కోండి సార్. ఆ రోజు జియాలజిస్టులు, అర్కియాలజిస్టులూ, పోలీసులు, ఇంకా ఎవరో నాకు తెలియదు. పున్నమి నాటి రాత్రి. చుట్టుతా పిచ్చి పిచ్చిగా ఉంది. బళ్ళు పోతున్నాయి. శాస్త్రజ్ఞల సూచన మేరకు ఒక చోట ఆగాం. నన్ను ఎవరూ కదలనీయ లేదు. జ్యోతిని క్రిందకి దింపారు. వాళ్ళల్లో వాళ్లు ఏదో మాట్లాడుకున్నారు. వయసులో చాలా పెద్దవాడైన ఒక నా దగ్గరకు వచ్చాడు.
‘జాగ్రత్తగా గుర్తు తెచ్చుకో..’, అన్నాడు, ‘ఈ అమ్మాయి కాళికలా కనిపించింది. ఇక్కడేనా?’
‘నన్ను దిగనీయండి’ అన్నాను.
మెల్లగా దిగనిచ్చి చుట్టూతా నిలుచున్నారు. పరిసరాలను పరికించి చూసాను. చెట్లు ఆకాశాన్నంటే ఉన్నాయి. వీళ్లు ఏం చేస్తున్నారు? ఎందుకు నన్ను ఇలా పట్టుకున్నారు? కొద్దిగా విశ్లేషణ చేసుకున్నాను. తాత్త్విక చింతన అనే మార్గాన్ని పట్టుకుని అలౌకికమైన వాటిని అన్వేషించి ఓ లౌకికమైన ప్రపంచంలో వాటిని స్థూలంగా నిర్ధారించి చూసిన వారు బహుశః విద్యావేత్తలు, శాస్త్రజ్ఞులు నడచిన దారిలో ఎక్కడో ఆగిన చోట అనుకోకుండా వీరు కూడా అక్కడికే చేరుకోవటంతో ఒక సూక్ష్మమైన పంథాను చర్చలోకి తెచ్చి ఏ పుట్టలో ఏ పాముందో అని ఆలోచించి ఆ కలిసి వచ్చిన చౌరస్తా దగ్గర నన్ను ఆపినట్లు అర్థమైంది. నాకు గానీ, జ్యోతికి గానీ తెలిసిన దానికి పైన మరేదో సాంకేతికమైనది పోల్చి చూసి వీరు పనిలోకి దిగారు. మాకు చాలా వివరాలు చెప్పవలసిన అవసరం వారికి లేకపోవచ్చు.
‘ఇక్కడ కాదు’ అన్నాను.
వాళ్లల్లో వాళ్లు ఏదేదో చర్చించుకున్నారు. మరల బండి ఎక్కి కొంత దూరం వెళ్లాం. వారు నన్ను క్రిందకి దింపారు. ఈసారి నలుగురు బలీయంగా ఉన్నవారు నా చుట్టుతా నిలుచున్నారు. ఒకడు నా భుజం మీద చెయ్యి పెట్టాడు.
‘చూడు బాబూ..’, చెప్పాడు. ‘..ఆ పెద్దాయన చాలా పెద్ద ఉపాసకుడు. నువ్వు నిజం చెబుతున్నావా, అబద్ధం చెబుతున్నావో కనుక్కోలేని వాడు కాదు. నిన్ను స్వతంత్రంగా వదిలేస్తాం. ఏ భయమూ లేదు. అలా అటూ ఇటూ నీ ఇష్టం వచ్చినట్లు తిరిగి అ ప్రదేశాన్ని గుర్తుపట్టి వచ్చి చెప్పు.’
ఇంకొకతను వచ్చాడు.
‘మాధవ్, మేము నిన్ను ఏమీ చెయ్యం. నీకు మిత్రులమే. కమాన్!’
నాకు కూడా ఎందుకో కొంత అటూ ఇటూ నడవాలనిపించింది.
నాలుగడుగులు వేసాను. ఎదురుగా ఎవరో వచ్చారు.
‘నవ్వు ఒక్కడివే హీరోవి కావు..’ అన్నాడు. ‘..అందరం హీరోలమే ఈ వ్యవహారంలో ఎంత డబ్బుందో ఊహించటం కష్టం. గేమ్స్ ఆడే అవకాశం నీకు లేదు.’
జీవితంలో మొదటిసారి నా మీద నాకు జాలి, నవ్వు రెండూ వచ్చాయి. పైకి చూసి అలా అలా నడుచుకుంటూ వెళ్ళాను. నా వెనుక ఎవరు లేరు. నాకు పారిపోవాలనీ లేదు. వీళ్లు జ్యోతితో ఇంకేమైనా ప్రయోగం చేస్తున్నారా? ఏమో! గవడె గారు ఎక్కడా కనిపించటం లేదు. ఒక చిన్న పాము పుట్ట దగ్గర ఆగాను. ఆ క్రిందకి పారుతున్న సెలయరు అంచున ఒక లోయలా కనిపించింది. గుర్తు వస్తోంది. మెల్లగా దిగాను. కొంత దూరం నడిచి ఏదో అనుమానం వచ్చి ఆగాను. వెనక ఎత్తుగా ఉన్న రోడ్డు మీద రెండు సుమోలున్నాయి. నాకు దూరంగా ఒంపులు తిరిగిన రోడ్డు మీద ఒక సుమో ఆగి ఉంది. అందులోంచి జ్యోతిని దింపుతున్నారు. ఈ పెద్దాయన ఎవరో పంచశబ్ద ఉపాసకుడై ఉండాలి. వీళ్లంతా కలసి చాలా పెద్ద పథకం వేసినట్లున్నారు. జ్యోతి గబగబా దిగుతోంది. నా వెనుక ఎవరో ఉన్నారు. ఎందుకైనా మంచిదని ఆగాను.
నా వీపులో గన్ పాయింట్ దోపినట్లు తెలుస్తోంది.
‘కదలకు. నీ మంచి కోసమే. నీ మంచి మిత్రులం’, వినిపించింది. చేతులు పైకి లేపాను.
‘రిలాక్స్. చేతులు మామూలుగా ఉంచు. తల వంచి నిలబడు.’ అలాగే చేసాను.
చీకటి పడుతోంది. నన్ను కొంత దూరం నడిపించాడు అతను. ఒక చెట్టు దగ్గర గట్టిగా అదిమి పట్టుకుని నా కళ్లకు గంతలు కట్టాడు. దూరంగా గన్ పాట్స్ వినిపించాయి.
ఎక్కడో గజ్జెల శబ్దం వినిపిస్తోంది. మనుషుల మాటలు ఎక్కడా వినిపించటం లేదు. జ్యోతి అప్పుడప్పుడు గజ్జెలు కట్టుకునేది.
‘ఎవరు నువ్వు?’, ఎవరో అడుగుతున్నారు.
ఈ వ్యక్తి ముందర నాతో వచ్చిన వాళ్ళు నిలుచున్నట్లు అర్థమవుతోంది.
‘తెలియటం లేదా? నా వెనుక టీమ్ కనిపించటం లేదా?’
‘అతన్ని వదిలెయ్.’
‘ఈ అబ్బాయి మీద అరెస్ట్ వారంట్ ఉంది. మా పని మమ్మల్ని చెయ్యనివ్వండి.’
‘మాతోనూ పోలీసులున్నారు.’
‘హ హ హ.. వాళ్లు పోలీసులు కారు తమ్మీ.’
మరల గజ్జెల శబ్దం వినిపించింది. ఈసారి చాలా గట్టిగా వినిపించింది.
‘మాధవ్.. నడు. మనం మన జీప్ ఎక్కుదాం.’
‘వెళ్ళెవరు సార్? మనలను వెంబడిస్తే?’
‘సైలెన్స్.’
ఎలా నడుస్తున్నానో నాకే తెలియదు. అలా వెళ్లిపోతున్నాను.
‘సార్..’
‘యస్?’
‘నన్ను గవడె గారింట్లో ఆ సి.ఐ. అన్నీ పరిశీలించి వదిలేసాడు. మీరు మరల ఎందుకు పట్టుకుంటున్నారు?’
‘సైలెన్స్.’
అంతా సైలెంట్ గానే ఉంది. గజ్జెల శబ్దం దూరమవుతోంది. గాలిలో ఏదో తెలియని పూల గంధం అలా తగిలి మాయవువుతోంది.”
(ఇంకా ఉంది)