పూచే పూల లోన-58

0
3

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[‘సాయా’లో సుందర్‍కి, మాధవ్‍కి చక్కని ఆతిథ్యమిస్తారు. తరువాత వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి అందరూ లోపలికి వెళ్ళిపోతారు. మనకి ఈ పానీయలిచ్చి పంపేస్తారా లేక మనం వచ్చిన పని పూర్తి చేస్తారంటావా అని మాధవ్‍ని అడుగుతాడు సుందర్. కాసేపట్లో ఎవరో ఒకరు వస్తారనీ, పైగా మనం తెచ్చిన పూలను కుండలలో వేసుకుని తీసుకెళ్ళారు కదా అని అంటాడు మాధవ్. ఇంతకీ అసలు నువ్వు జైల్లోకి ఎందుకి వెళ్ళాల్సి వచ్చిందో ఆ వివరాలు చెప్పు అంటాడు సుందర్. మాధవ్ చెప్పడం మొదలుపెడతాడు. తనని, జ్యోతికి అడవిలోకి మళ్ళీ తీసుకెళ్ళారనీ, తమతో పాటు ఆ రోజు జియాలజిస్టులు, అర్కియాలజిస్టులూ, పోలీసులు చాలామంది వచ్చారని చెప్తాడు. వయసులో ఉన్న ఓ పెద్దాయన జ్యోతి కాళికలా కనిపించిన ప్రదేశం ఇదేనా అని ఓ చోటుని చూపించి అడిగాడని, తనని కిందకి దిగనీయమన్నానని అంటాడు మాధవ్.  ఆ పరిసరాలను పరికించి, ఇక్కడ కాదు అన్నానని చెప్తాదు. వాళ్ళు ఏదో తర్కించుకుని తనని బండెక్కించి, ఇంకొంత దూరం తీసుకెళ్ళారనీ, ఓ చోట దింపి నలుగురు బలాఢ్యులు తన చుట్టూ నిలుచున్నారనీ చెప్తాడు. ఆ పెద్దాయన ఓ పెద్ద ఉపాసకుడనీ, ఈ వ్యవహారంలో చాలా డబ్బుందని ఒకతను చెప్పి, నువ్వొక్కడివే హీరోవని అనుకోవద్దన్నాడని మాధవ్ చెప్తాడు. ఇంతలో హఠాత్తుగా తన వీపుకి ఎవరో గన్ పెట్టి, కదలద్దు మేము నీ మిత్రులమే అన్నారనీ, ఇంతలో గన్ షాట్స్ వినిపించాయని చెప్తాడు. తనను తీసుకొచ్చిన వాళ్ళు వచ్చి, తనను ఇప్పుడు కొత్తగా పట్టుకున్న వ్యక్తిని ఎవరు నువ్వు అని అడిగారనీ, అతను తన వెనుక తన టీమ్‍ను చూడమన్నాడని చెప్తాడు. అలా కొత్త వ్యక్తి చేతిలో బంధింపబడ్డాననీ, తనని మళ్ళీ ఇంకో బండెక్కించారని అంటాడు మాధవ్. – ఇక చదవండి.]

“అక్కడ మూడు టాటా సుమోలున్నాయి. అన్నిటికంటే ముందరున్న బండిలో ఎక్కించుకుని చాలా దూరం తీసుకెళ్లారు. ఆ కొండల్లోంచి, లోయల్లోంచి కళ్లకు కంతలు కట్టి తీసుకొని వచ్చారు కానీ రోడ్డు ఎక్కించగానే అని తీసేసారు. కొద్దిగా జన సందోహం గల ప్రాంతాలలోంచి ఓ నలభై నిముషాలు ప్రయాణించాక ఒక టర్నింగ్ దగ్గర ఆగారు.

అక్కడ ఎడమ పక్క పార్క్ చేసి ఉన్న ఓ కారు లోంచి ఓ పెద్దాయన దిగాడు.

లుంగీలో ఉన్నాడు. అరవ పద్ధతిలో విభూతి పెట్టుకునున్నాడు. ఈ బండి దగ్గరకు వచ్చి కళ్లల్లోకి కళ్ళు పెట్టాడు. నన్ను నా ప్రక్కనున్న వాడు గిల్లాడు.

‘సార్ తెలీదా?’ అడిగాడు.

‘తెలీదు.’

‘వీరమణి వారసుడు.’

‘వీరమణి ఎవరు?’

అతని తెరచియున్న నోరు అలాగే ఉండిపోయింది. ఆ పెద్దాయన నవ్వాడు. నన్ను దింపమని సైగ చేసాడు. మారుమాట్లాడకుండా నన్ను దింపేసారు. ఆయన నా భుజం మీద చేయి వేసాడు. ఆయన కారు వరకు నడిపించుకు తీసుకొని వెళ్లాడు. డ్రైవరు కారు తలుపు తెరిచాడు. వెనక సీట్లో కూర్చోమన్నాడు. నాతో పాటు అతనూ లోపలికొచ్చి కూర్చున్నాడు.

‘మాధవ్ గదూ నీ పేరు?’

‘అవును’

‘నా.. రంగదాస.. నా పేరు అది.’

‘ఓ.’

‘నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది. నా మనుషులు.’

‘పోలీసులు కారా?’

‘కాదు. పోలీసులు ఇప్పుడు వస్తారు.’

‘ఎందుకు?’

‘నిన్ను తీసుకుని వెళ్లేందుకు.’

‘నేను ఏ తప్పు చెయ్యలేదు.’

అతను నవ్వాడు.

‘మాధవా.. లోకం తప్పు ఒప్పులతో నడవదు తమ్మీ. ఏది కావాలి, ఏది అక్కరలేదు అనే మాట మీద నడిస్తుంది.’

‘కరెక్ట్. కానీ నన్ను ఇంటికి పోనీయండి. నాకు ఏదీ అక్కరలేదని అక్కడికెళ్లి నిర్ణయించుకుంటాను. జీవితంలో ఈ ప్రాంతానికి మరల రాను. మీకు నమస్కారం పెట్టమంటే పెడతాను. మీరెవరో కూడా నాకు తెలియదు. తెలుసుకోవాలనీ లేదు.’

ఆయన చెయ్యి చూపించాడు. నా పక్కనున్న కిటికీ లోంచి దేనినో చూపించాడు. అటు చూసాను.

‘ఆ పూల పేరేమిటో తెలుసా?’ అడిగాడు.

‘తెలియదు. తెలుసుకోవాలని లేదు.’

‘జీవితం నీకు ఎలా ఉందో అనే దాని మీద ఆధారపడి ఉండదు. నీకు ఏమి అవసరమో, దాని బట్టి ముందుకు పోతోంది.’

‘నేను ఇంటికి పోతాను.’

‘ఆ పూల పేరేమిటో తెలుసుకో.’

‘తొందరగా చెప్పండి.’

‘గుడ్. వాటిని గార్డెనియా అంటారు.’

‘గార్డెనియా.’

‘కరెక్ట్.’

‘ఐతే?’

‘దానిని బెడ్ రూమ్‍లో పెట్టుకుంటే చక్కని నిద్ర పడుతుంది. ఒత్తిడి, నీరసం..ఇవన్నీ ఇంటికి వెళ్లి పోతాయి.’

‘వెరీ గుడ్. కానీ నాకలాంటివి లేవు.’

‘ఉండక్కర లేదు. కానీ జైల్లో నీ గదిలో పెట్టిస్తాయి.’

‘జైలు ఎందుకు? ఇవి ఎందుకు?’

‘జ్యోతి అనే అమ్మాయి నీ మీద కంప్లెయింట్ ఇచ్చింది.’

‘కరెక్ట్. కానీ ఆ గొడవ అయిపోయిందని నేను నమ్ముతున్నాను.’

‘నేను మరల ప్రారంభించాను.’

‘ఎందుకు?’

‘నువ్వు బ్రతికి ఉండటం కోసం.’

దూరంగా ఓ పోలీసు జీపు వస్తూ కనిపిస్తోంది.

‘అర్థం కాలేదు.’

‘పిచ్చివాడా! ఆ అడవిలో పని పూర్తి అయిన తరువాత నిన్ను చంపేయ్యాలనే తీసుకు వచ్చారు.’

‘ఎవరు?’

‘నేను ఇప్పుడు చెప్పను. నీకే తెలుస్తుంది. జైల్లో భద్రంగా ఉండు. నీతో మాకు చాలా పనుంది.’

జీపు వచ్చి ఆగింది. కారు డోర్ తెరిచారు. నా చెయ్యి పెట్టుకొని క్రిందకి లాగారు.

జీప్ ఎక్కించారు. మాట్లాడకుండా నన్ను పంజిమ్ చేర్చారు. సార్.. ఇదీ నా కధ.”

అప్పటికే కొద్దిగా తూల్తున్నాను నేను.

మాధవ్ తట్టి లేపాడు.

“సార్.. నిద్ర పోయారా?”

“పూర్తిగా లేదు.”

“ఎంత వరకూ విన్నారు?”

“గార్డెనియా..”

“ఓ.. ఇంకా?”

“ఇంతకీ అది నీ జైలులో ఎందుకు?”

“తరువాత తెలుసుకున్నాను. అది సామాన్యమైన పువ్వు కాదు.”

“పూలలో ప్రపంచమున్నదా లేక పూలతోనే ప్రపంచమున్నదా అన్నది ఏ మాత్రం అర్థం కావటం లేదు.”

“పూలలో ఒకటి కాదు, చాలా ప్రపంచలున్నాయన్నది సత్యం. పూలను జాగ్రత్తగా అధ్యయనం చేస్తే సృష్టి యావత్తూ అర్థం కాగలదు.”

ఇంతలో లోపలి నుండి కాషాయ వస్త్రాలలో పూర్తిగా సాధువులా కనిపిస్తున్న ఒకాయన వచ్చాడు. ఇద్దరం నమస్కారం పెట్టుకున్నాం.

“మీ మందు తయారవటానికి ఏడు రోజులు పడుతుంది.”

“ఓ. అయితే ఓ వారం రోజుల తరువాత వస్తాము” అన్నాను.

ఆయన తల అడ్డంగా ఊపాడు.

“కుదరదు.”

“నెల తరువాత?”

“కాదు. ఇక్కడే ఉండి తీసుకుని పోవాలి.”

ఇద్దరం ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నాం.

“రాత్రి పడుకునే ముందు టీ ఒక్కటే ఇస్తాం. రేపు ఉదయం బ్రేక్‍ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం ఉంటాయి.”

“అయ్యా, మా కారులో వచ్చాం. ఆ డ్రైవర్ ఆ రోడ్డు మీద ఏం చేస్తున్నాడో ఏమో.”

“మరేం ఫరవాలేదు. మీకిక్కడ సిగ్నల్స్ రావు. కానీ అతని వద్దకు మేము మనిషిని పంపిస్తాము. మీరు నిశ్చింతగా ఉండండి.”

“పోనీ, ఈ కుర్రాడు వెళ్ళిపోతాడు. నేను..”

“కుదరదు.”

ఇదెక్కడి గోలరా అనుకున్నాను.

“నాతో రండి” అంటూ లోపలికి తీసుకుని వెళ్ళాడు. కొన్ని మెట్లెక్కి పైకి వచ్చాం. అక్కడ చక్కటి బాల్కనీ ఉంది. దూరంగా సముద్రం కనిపిస్తోంది. ప్రాణం ఎందుకో లేచి వచ్చింది.

“ఇక్కడ సిగ్నల్స్ రావా?”

“రావు.”

ఆయనను అనుసరించాం. ఒక గది తలుపు తాళం తెరిచాడు. లోపల చక్కని బెడ్స్, టేబుల్, కిటికీ అన్ని సదుపాయాలు ఉన్నాయి.

“ఇది మీ రూమ్.”

“ఏదైనా అవసరమైతే..” మాధవ్ అంటుండగా ఆయన ఆపాడు.

“మీరు చప్పుడు చెయ్యక్కరలేదు. మాకు తెలిసిపోతుంది. అన్ని విషయాలు రేపు ప్రొద్దున మాట్లాడుతాను. ప్రస్తుతం విశ్రాంతి తీసుకోండి.”

ఆయన వెళ్లిపోయారు. ఎటు వైపు వెళ్ళారో అర్థం కాలేదు. లోపలికెళ్లి బెడ్ మీద వాలిపోయాం. ఎప్పుడు ఇద్దరికీ నిద్ర పట్టిందో తెలియదు. దాదాపు గంటన్నర తరువాత లేచి చూసాను. మాధవ్ ఇంకా నిద్ర పోతున్నాడు. మెల్లగా తలుపు తెరిచి బయటకి వచ్చాను. సముద్రం మీద చంద్రుడు పున్నమి వైపు ప్రయాణిస్తున్నట్లు కనిపించాడు. చల్ల గాలి ప్రశాంతతను ఇచ్చింది. కొద్దిగా బయటకు వచ్చి తలుపు దగ్గరగా వేసాను..

ఇక్కడ సముద్ర తీరం ఉన్నదంటే ఖచ్చితంగా మరో దారి ఇక్కడి నుండి ఏ సొరంగం లోంచో లేదా మరేదో రోడ్డు నుండో మెయిన్ రోడ్డుకు ఉండవచ్చు.

ఈ మాధవ్‍కు బహుశః సాయాజీ, ఈ లోయలు, ఈ పూలు, ఈ వ్యవహారమంతా ఎంతో కొంత పరిచయం ఉండే ఉంటాయి. సిగ్నల్స్ ఉండవంటారు. మీ పరిస్థితులు వీళ్లకి తెలుస్తాయి అంటారు. అదెలా సాధ్యం? ఆ బాల్కనీలా ఉన్న పిట్టగోడ మీదకి ఆనుకుని జాగ్రత్తగా క్రిందకి చూసాను. వాస్తవానికి మేమున్నది ఒక గుట్ట లాంటిది. ఈ గుట్ట క్రింద ఇదేదో వీళ్లు నిర్మించుకున్న భవనంలా ఉంది. ఈ ప్రదేశం యావత్తూ భూమితలానికి క్రిందున్నట్లు గోచరిస్తున్నది.

కానీ సముద్ర తీరం ఇప్పుడు మా ముందున్నదేంటి?

అర్థం కాలేదు. ఇదే పరిస్థితి చాలా కాలం క్రితం నాగవళి నదీ పరివాహ ప్రాంతంలో చూసాను. మరో ఆలోచన తలెత్తింది. ఇక్కడికి విద్యుత్ ఎలా వస్తోంది? దొంగతనంగా లాగారా? ఎక్కడా ట్రాన్స్‌ఫార్మర్ గానీ, సబ్ స్టేషన్ గానీ కనిపించలేదు. స్విచ్ బోర్డులు, వైర్లూ లేవు. కానీ విద్యుత్ దీపాలున్నాయి..

ఆ పిట్టగోడ మీదుగా అలా చూస్తూ వెళ్ళాను. రకరకాల పూల కుండీలు ఎంతో అందంగా ఉన్నాయి. వెన్నెల కాంతిలో ఒక్కొక్కటి ఒక్కో విధంగా మెరుస్తోంది. ఈ గది ప్రక్కన మరో గది ఉంది. దానిని ఆనుకుని పిట్టగోడ ఆగిపోయింది. దానిని ఆనుకుని ఓ త్రోవ ఈ గది వెనక్కి వెళుతుంది.

అక్కడ ఓ చెక్క కుర్చీని కొద్దిగా, కాళ్ళు జాపుకునేందుకు జరుపుకుని, అందులోకి జారి, ఆ పిట్టగోడ మీదకి ఆన్చాను. మబ్బుల్లోకి చంద్రుడు అలా వెళ్ళిపోయాడు. కొద్దిగా పెద్దగా ఉన్న మొక్కల ఆకారాలు ఎంతో వయ్యారంగా కదులుతున్నాయి. ఎందుకో ఓ వెర్రి ఆలోచన వచ్చింది. ఈ పూలన్నీ ఏదో సరదాగా పెట్టారా లేక ఏదైనా తంత్రం లాంటిది ఉన్నదా?

ఎక్కడో అలజడి అనిపించి అటూ ఇటూ చూసాను. పిల్లో కుక్కో అనుకుని మరల వెనక్కి వాలాను. కాదు. అటు ఉన్న గది పక్కగా ఉన్న చీకటి లోంచి ఎవరో ఇటు వస్తున్నట్లు అర్థమైంది. ఎందుకైనా మంచిదని కాళ్ళు గోడమీద నుండి తీసాను. ఒక్కో పూల కుండీని సున్నితంగా తాకుతూ అతను నా వైపే వస్తున్నాడు. ఆ పూల మాటున నీడ అలా జారి కదులుతోంది. నేను లేచి నిలబడ్డాను. నాలుగడులు దూరంగా చేతులు వెనుక కట్టుకుని నిలబడ్డాడు.

“బాగున్నారా?” అడిగాడు.

సమీర్ కుమార్!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here