పూచే పూల లోన-59

0
2

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[కొత్త వ్యక్తి తనని బంధించి తీసుకెళ్తుంటే ఏం జరిగిందో సుందర్‍కి చెప్తుంటాడు మాధవ్. అక్కడున్న మూడు టాటా సుమోలలో మొదటి దానిలో తనని ఎక్కించారనీ, కొండల్లోంచి, లోయల్లోంచి కళ్లకు కంతలు కట్టి తీసుకొని వచ్చారనీ, రోడ్డు ఎక్కించగానే అని తీసేశారని చెప్తాడు. జన సందోహం గల ప్రాంతాలలోంచి ఓ నలభై నిముషాలు ప్రయాణించాక ఒక టర్నింగ్ దగ్గర ఆపాడని చెప్తాడు. అక్కడ ఉన్న ఓ కారు లోంచి ఓ పెద్దయాన దిగాడనీ, లుంగీ ధరించి అరవ పద్ధతిలో విభూతి పెట్టుకున్నాడని చెప్తాడు. అతను వీరమణి వారసుడని తెలిసిందని అంటాడు. అతను తన దగ్గరకి వచ్చి, నీ పేరు మాధవ్ కదూ అని అడిగాడనీ, తన పేరు రంగదాస అని చెప్పాడని చెప్తాడు మాధవ్. తనను అతని మనుషులే ఇక్కడికి తెచ్చారని రంగదాస అన్నాడని మాధవ్ చెప్తాడు. అక్కడున్న పూలని చూపిస్తూ, వాటిని గార్డెనియా అని అంటారని, వాటిని బెడ్ రూమ్‍లో పెట్టుకుంటే, ఒత్తిడి, నీరసం లాంటివి మాయమై చక్కని నిద్రపడుతుందని చెప్పాడని అంటాడు. తనకి అలాంటి సమస్యలేవీ లేవని చెప్పానని మాధవ్ అంటాడు. ఆ అడవిలో పని పూర్తయ్యాకా, తనని చంపేయాలనుకున్నారని, అందుకని తను జైలులో ఉండడమే క్షేమమని రంగదాస చెప్పాడని మాధవ్ సుందర్‍కి చెప్తాడు. అంతలో అటు నుంచి ఓ పోలీసు జీపు వస్తుండడం చూసి తనని ఆ జీపులో కూర్చోబెట్టి పంజిమ్ చేర్చారనీ, అదీ జరిగిన కథ అనీ చెప్తాడు మాధవ్. ఇంతలో లోపలి నుండి ఒకాయన వచ్చి మీ మందు తయారవటానికి ఏడు రోజులు పడుతందని చెప్తాడు. అయితే మళ్ళీ వారం రోజుల తర్వాత వస్తామని అంటాడు సుందర్. అలా కుదరదని అక్కడే ఉండి మందు తీసుకువెళ్లాలని చెప్తాడాయన. పోనీ మాధవ్‍ని పంపించేసి, తాను ఉంటానని అంటాడు సుందర్. అది కూడా కుదరదని అంటాడాయన. తమ డ్రైవర్ ఎదురుచూస్తుంటాడని అంటే, తమ మనుషులని పంపి డ్రైవర్‍కి కబురందిస్తామని అంటాడు. వాళ్ళిద్దరికి ఉండటానికి గది చూపిస్తాడు. కాసేపు నిద్ర పోయాకా, సుందర్‍కి హఠాత్తుగా మెలకువ వస్తుంది. గది నుంచి బయటకు వచ్చి చూస్తే దూరంగా సముద్రం కనిపిస్తుంది. అంతా అయోమయంగా అనిపిస్తుంది. బాల్కనీలో ఉన్న కుర్చీని దగ్గరకు లాక్కుని కూర్చోబోతుండగా అక్కడ అలికిడై ఎవరో వస్తున్నట్లు అనిపిస్తే సుందర్ నిలుచుని ఉండిపోతాడు. వచ్చింది సమీర్ కుమార్. – ఇక చదవండి.]

[dropcap]కొ[/dropcap]ద్ది సేపు నాకు నమ్మకం కుదరలేదు. సమీర్ కూడా మాట్లాడకుండా అలా నా ముందరకొచ్చి నన్ను పరీక్షగా చూసి అక్కడున్న ఓ కుర్చీని పిట్టగోడ వరకూ లాగాడు. నేను నిలబడి ఉన్నాను. చాలా చక్కగా నవ్వాడు. సమీర్‌లో ఆ పద్ధతిలో నవ్వటమే తెర మీద అంత పేరు తెచ్చింది. పెదవులు సన్నగా తెరుచుకుంటాయి. తల మెల్లగా కుడి వైపుకు ఒరుగుతుంది. పై వరుస పళ్ళు కొద్దిగా మెరుస్తాయి. ఆ నవ్వులో ఒక తెలివి, ఒక అవగాహన, ఒక చిలిపితనం, కాలాన్ని పసిగట్టి కసిగా కసురుతున్న ఒక విసురు – అన్నీ కలబోసుకుని ఉంటాయి.

నేను ఇక్కడికి వస్తున్నట్లు తెలుసన్నమాట. జైల్లో జో ఇచ్చిన ఆనవాళ్ళు ఈ ‘సాయా’, జ్యోతికి వైద్యం అన్నది ఒక పక్క అయితే; సమీర్‌ను కలవటం జోవాక్విమ్ యొక్క వ్యూహం అన్నమాట.

“ఎలా ఉన్నారు?” అడిగాను.

కుర్చీని తన చేతిలో ఉన్న గుడ్డతో ఆకతాయితనంగా తుడిచి కూర్చోమని సైగ చేసాడు.

“మీ సంగతేమిటి?” అడిగాను.

అటూ ఇటూ చూసాడట. ఒక పూల కుండీ తీసి క్రింద పెట్టాడు. ఆ చిన్న స్టాండును జరిపి నా ముందర పెట్టాడు.

“కుర్చీ లేదా?” అడిగాను.

నన్ను చెయ్యి పెట్టుకొని మెల్లగా నడిపించి కుర్చీలో కూర్చోపెట్టాడు. ఒక్కసారిగా కాళ్లు పైకి పట్టుకుని పైకి లేపి ఆ స్టాండ్ మీద పెట్టాడు. నేను ‘అరె’ అనే లోపల పిట్టగోడ మీదకి గెంతి కూర్చున్నాడు. రెండు కాళ్ళు దాని మీదనే జాపి వెనక ఉన్న స్తంభానికి నడుం వాల్చాడు.

“నన్ను క్షమించండి” అన్నాడు.

“దేనికి?”

“ఇంత శ్రమ పెట్టినందుకు.”

“నేనొక పని మీద వచ్చాను.”

“మీకు తెలిసింది, మీరు అనుకున్నది ఒకటే.”

“అంటే?”

“ఇక్కడ రెండు పనులున్నాయి.”

“అర్థం కాలేదు.”

సముద్రం వైపు చూసి, సిగరెట్ తీసి ముట్టించాడు.

“నన్ను పోలీసులు వెతుకుతున్నారు.”

“నేను గోవాకి వచ్చినప్పటి నుంచీ.”

“కాదు, ఇంకా ముందు నుంచే.”

“జో ఎలా ఉన్నాడు?”

“దెబ్బలు తింటున్నాడు.”

కళ్లు మూసుకుని బాధపడ్డాడు.

“మిమ్మల్ని పోలీసులు ఇబ్బంది పెట్టారా?”

“లేదు. కానీ నన్ను జాగ్రత్తగానే కనిపెడుతున్నారని తెలుసు.”

“మీకేం కాదు.”

“ఇందాక రెండు పనులున్నాయి, అన్నారు”

“అవును. జ్యోతికి సరైన మందు ఒకటి, నాకు కావలసిన మందు రెండు.”

ముందరికి వంగాను. చెయ్యి అడ్డు పెట్టాడు.

“ఈజీ. నాకేం కాలేదు. నేనే ఒక వైరస్‍ని. నన్ను ఏడిపించే జబ్బు ఏదీ లేదు.”

“నిజమే. గోవాలోనే కాదు, చాలా చోట్ల మీరు ఎంతో పాపులర్. అది కేవలం సినిమాల ప్రభావం కాదు!”

మనిషిలోని హవభావాలు ఏ మాత్రం తగ్గలేదు. సమీర్ మామూలుగా తెరమీద కనిపించే దిష్టిబొమ్మ లాంటి స్టార్ కాడు. చరిత్రను ఒక ఇరుసులో తిప్పుకుని దెబ్బ తినినా, దెబ్బకొట్టినా, బొమ్మ బొరుసూ, రెండో నేనే అని చెప్పగలిగే సమష్టి స్వరూపం.

“మీరు ఎవరినైనా ప్రేమించారా?” హఠాత్తుగా అడిగాడు.

“లేదు.”

“ప్రేమించబడ్డారా?”

నవ్వుతూ గెడ్డం గోక్కున్నాడు.

“సుందరం గారూ..” చిత్రంగా అన్నాడు. “..రచయితలు నిజాలు చెబుతారు, కానీ నిజాలని ఒప్పుకోరు!”

“అంటే అబద్ధాలు చెబుతున్నట్లే కదా?”

“ఆ అబద్ధం నేనెందుకు చెప్పాలి?”

“నేను అరగంట సేపు కళ్ళు మూసుకుంటాను.”

“ఎందుకు? ధ్యానం చేసే వేళైందా?”

“కాదు.”

“మరి?”

“రచయితలను తిట్టవలసినవన్నీ ఒకేసారి తిట్టి కళ్ళు తెరవమని చెప్పినప్పుడు తెరుస్తాను.”

“హహహ.. ఈసారి పొగుడుతాను.”

“అలాక్కానీయండి.”

“రచయితల కళ్ళు ఎల్లవేళలా తెరిచే ఉంటాయి. నిదురిస్తున్నా దేనినో ఎదిరిస్తూనే ఉంటారు.”

“మేము హీరోలము కాము.”

“వద్దు. ఈ దేశంలో హీరోలు ఎక్కువయ్యారు.”

ఈసారి నేను నవ్వాను..

“ఇంతకీ రెండో మందు ఎందుకు?”

“ఆ మందు నాకు కాదు. నా కోసం కావల్సిన మందు.”

“అర్థం కాలేదు.”

“కొద్దిగా సమయం పడుతుంది.”

“ఇంతకీ మీరు ఎందుకు ఇలా చిక్కుకున్నారు?”

నన్ను చాలా సీరియస్‌గా చూసాడు. ఇంత ఉన్న పళంగా ఆ ప్రశ్న వేస్తాననుకుని ఉండక పోవచ్చు.

“పేపర్లు వ్రాయటానికే కాదు, చదవటానికీ ఉపయోగించాలి.”

“కరెక్ట్.”

“నేను ఎందులోనో చిక్కుకున్నానని నిజంగా నమ్ముతున్నారా?”

“అవును. మీ గతాన్ని పరిశీలించి చూస్తే అంత దారుణమైన పనిని మీరు చేస్తారని నేను ఎన్నడూ అనుకోను.”

“లోకం మరోలా అనుకుంటుంది. ఇంత పేరున్న నేను ఎందుకు దాక్కుంటున్నాను? దాక్కుంటున్నానంటే తప్పించుకుంటున్నాననే కదా? తప్పించుకుంటున్నానంటే తప్పు చేసాననే కదా?”

“అవి న్యాయవిచారణలో చెప్పే మాటలు.”

“అంతేకాదు. ఇలా తప్పించుకుని తిరుగుతూ ఏవో ఆధారాలను కూడదీసుకుంటూ ప్రజలను పోగు చేస్తూ కాలక్షేపం చేస్తున్నానని పోలీసువారు అంటారు.”

“అది మామూలే.”

“కానీ ఇలా ఎంతకాలం? జో నా కోసం దెబ్బలు తింటున్నాడు. హింస అనుభవిస్తున్నాడు. నేను ఎక్కడున్నాను అన్నది చెప్పడు. ప్రాణాలు వదిలేయగలడు, కానీ చెప్పడు. అతనికి నాకంటే ఎక్కువ పేరుంది గోవాలో. అందుకని పోలీసులు జాగ్రత్తగానే ఉన్నారు.”

“నా వల్ల మీకు సహయం?”

“జ్యోతి.”

లేచి నిలబడ్డాను. కరెంటు తీగలతో నన్ను చుట్టేసి స్విచ్ వేసినట్లు తృటిలో అనిపించింది.

“జ్యోతితో మీకేంటి పని?”

“రండి” అంటూ లేచాడు. ఇద్దరం సముద్రతీరం వరకు నడిచాం. అలా తీరం వెంబడి నడుస్తున్నాం.

“చీకటిలో సముద్రం ఎలా ఉంది?” అడిగాడు.

“శబ్దం వింటుంటే భయం వేస్తోంది.”

“మనిషి వ్యక్తిత్వం కూడా సముద్రం లాంటిది, చీకటిలో భయపెడుతుంది. గర్జిస్తుంది, ధ్వనిని మారుస్తూ ఉంటుంది. కొందరికి వాళ్ల గురించి వాళ్లకి తెలియదు. తెలిసిన రోజున వాళ్ళు వాళ్ళు కారు. అలా వాళ్ళు ఎందుకున్నారో అందుకు ఎన్నడూ తెలుసుకునే ప్రయత్నం చేయరు.”

“జ్యోతి గురించి మీకు జోవాక్విమ్ చెప్పాడా?”

“చెప్పటమే కాదు, జో కి మనందరి కంటే ఇలాంటి వాళ్ళ గురించి ఎక్కువ తెలుసు.”

“ఏంటి విశేషం?”

దూరంగా ఎక్కడో చివార్న ఓ షిప్ అలా లైట్లను మినుకు మినుకుమనిపిస్తూ మాకు దూరంగా వెళ్ళిపోతోంది.

“సుందరం గారూ..”, సమీర్ అన్నాడు, “..జో కూడా ఒకప్పుడు జ్యోతి లాంటివాడే. సాయాజీ నేర్పిన వైద్యంతో, ఈ పూలతో మరో మనిషి అయినాడు. ఎన్ని శిలాశాసనాలను, తాళ పత్రాలను, రాగి రేకులను చదివుంటారు?”

“ఇరవైకి పైన లిపులను బయటకు లాగాను.”

“ఎన్నింటిని దర్శించారు?”

“అంటే?”

“ఎన్నింటికి గత వైభవం ద్వారా స్కెచింగ్ లోకి జ్యోతి తెచ్చింది?”

“నాలుగు. ఒకటి చాలా పెద్ద రహస్యం. నా పని కంటే ఎక్కువ. చిత్ర చేసే పనిలో ఇంకా ఎక్కువ ఉన్నాయి.”

“పూల లోంచి సౌరభాన్ని తీసిన తరువాత పూలు దానిని తిరిగి కోరుకుంటే కనుక తిరిగి ఇవ్వగలరా?”

“అసంభవం.”

“జో ఆ విధంగా కోరుకుని, కోరుకుని, తహతహలాడిపోయి కాలం గడుపుతున్నాడు. జ్యోతికి అలా కాకూడదని కూడా బాధ పడుతున్నాడు.”

“ఇదేంటి? మరి నేనిక్కడికి వచ్చింది వైద్యం కోసమే కదా?”

“నిజమే. ఆమెకు వైద్యం తప్పకుండా జరిగి తీరాలి, ఇది మానవ ధర్మం. మన స్వార్థం కోసం ఏదో చెయ్యకూడదు.”

ఆలోచించాను. ఇది చిక్కు ప్రశ్న. జ్యోతి మామూలు మనిషి అయిపోతే, ఇక మాకు ఏ విధంగానూ ఉపయోగపడదు. కానీ మామూలు మనిషి కాకుండా ఉంచే అధికారం మాకు లేదు. ఇప్పటికి మా దగ్గరున్న వివరాలతో గోవా గురించి ప్రపంచానికి తెలియజేయవచ్చా?

“మీరేమంటారు?”, అనుకోకుండా సమీర్‍ని అడిగాను.

“జ్యోతితో నాకు పనుంది అని అన్నాను. అదెలాగో చెబుతాను.”

ఇద్దరు మనుషులు పరుగులు తీసుకుంటూ వచ్చారు.

“ఏమైంది?”, సమీర్ అడిగాడు.

“సార్, డ్రైవర్ దగ్గిరకి వెళ్లే లోపు దూరంగా ఓ జీవు వస్తూ ఉండటంతో మేము దాక్కోవల్సి వచ్చింది. మేం దూరంగా దాక్కుని చూసాం.. పోలీసులు కారును వెతికారు. అందులో డ్రైవర్ లేడు.”

“ఎక్కడికో వెళ్ళి ఉంటాడు.”

“లేదు.”

“మరి?”

“ఈ బుట్ట చూడండి.”

సమీర్ ఆ బుట్ట తీసుకొని చూసాడు. అందులో రకరకాల పూలున్నాయి. చిరునవ్వు నవ్వాడు.

“ఇదెక్కడ దొరికింది?”

“పోలీసులు వెళ్ళిపోయాక కారు దగ్గరికి వెళ్ళి చూసాం. ఏ చెట్టు క్రింద అయితే కారు అగి ఉందో ఆ చెట్టు పైన కట్టి ఉంది.”

“మీకెలా తెలిసింది?”

“మా మెడలో ఆ పూల విత్తనాలతో మాలలున్నాయి.”

సమీర్ ఆ బుట్టను నాకు చూపించాడు. ఆ బుట్ట లోకీ, వాళ్ళ మెడలలోకీ చూసాను. ఈ పూల సువాసన వారి మెడలో కూడా వస్తోంది. బుట్టను దూరం చేసినప్పుడు రావటం లేదు.

“నాకు అయోమయంగా ఉంది. మా డ్రైవర్ పోలీసులకు దొరికిపోయాడా?”

“లేదు. దానికి ముందే వీరమణి మనుషులు పసిగట్టి లాక్కుపోయారు. ఈ బుట్ట వాళ్ళదే. మనకు సంకేతం ఇచ్చారు.”

వెనుక సముద్రం గర్జిస్తోంది. వీళ్ళ మెడల్లో గింజలు మెరుస్తున్నాయి. ఆకాశంలో చుక్కలు తళుక్కుమంటున్నాయి..

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here