పూచే పూల లోన-6

0
2

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[సమీర్ తన గతాన్ని సుందర్‌కి చెప్తాడు. సమీర్ రెండు మూడు గంటలు ఎంతో మృదువుగా, హాయిగా మాట్లాడుతాడు. కొన్ని సందర్భాలలో ఏదో నెమరు వేసుకునట్లు గెడ్డం నిమురుకుంటూ భావోద్రేకంతో చెప్తాడు. ఉన్నట్టుండి హఠాత్తుగా చెప్పడం ఆపేసి, సినిమాకి ఇంటర్వెల్ ఇచ్చినట్టుగా అక్కడ్నించి వెళ్ళిపోతాడు సమీర్. అంతకుముందు రకరకాల భంగిమలో ఫొటోలు దిగిన జంట అక్కడ కనబడతారు. కానీ సమీర్ వాళ్ళ వైపు చూడకుండా వెళ్లిపోతాడు. మర్నాడు సమీర్ చెప్పిన అతని గతాన్ని గుర్తు చేసుకుంటాడు. సమీర్‌ది మంగేశీ నుండి కాండోలిమ్ వచ్చి స్థిరపడిన వ్యాపారస్థుల కుటుంబం. చిన్నప్పటి నుంచి పిల్లలన్నా, ప్రకృతి అన్నా సమీర్‍కి బాగా ఇష్టం. పుస్తకాలు తెగ చదివేవాడు. తండ్రి వ్యాపార నిమిత్తం పలు ఊర్లు తిరుగుతుంటాడు. వారింట్లో ఓ కుర్రాడు పని చేస్తూంటాడు. అందరికీ అతనే వారధి. ఓ రోజు సమీర్ తన గది కిటికీ లోంచి సముద్రం మిద సూర్యస్తమయాన్ని చూస్తుండగా వాళ్ళ నాన్న అతని గదిలోకి వచ్చి నిలబడతాడు. కొడుకు జీవితంలో నిలదొక్కుకోలేదని ఆయన బాధ. వాళ్లిద్దరి మధ్య వాదన జరుగుతుంది. ఆయన విసిగిపోయి తన ఫ్లయిట్‍కి టైమ్ అవుతోందని వెళ్ళిపోతాడు. కాసేపయ్యాక సమీర్ కిందకి వెళ్తే అమ్మ ఎదురవుతుంది. తండ్రికి బాయ్ ఎందుకు చెప్పలేదని అడుగుతుంది. సమీర్ ఏదో చెప్పబోతే, లెక్చర్లు ఇవ్వదని అంటుంది. ఆమెకు బాయ్ చెప్పి, బయటకు వెళ్తాడు సమీర్. ఇక చదవండి.]

ఫోన్ మ్రోగింది. ‘నవ్వాలనే ఉంది’ అనిపించే ఓ ఫొటో మెరిసింది. చిత్ర ఫొటో అది.

“హలో”

“మాష్టారూ..”

“ఓ. ఈ మాష్టారుని మరచిపోలేదన్న మాట?”

“లేదు. మరచిపోయాను. ఎందుకో అలా అలా వాట్సప్‍లు కదుపుతుంటే ఓ వింత మొహం కనిపించింది.”

“నాదే కదా? అంత వింతగా ఉందా?”

“అవును. ఎంత వింతగా ఉందంటే, ఎవరయి ఉంటారా అని ఏకంగా కాల్ చేసేసాను”

“ఇప్పటికైనా గుర్తుకొచ్చానా?”

“కమాన్ సర్! గుర్తుకొచ్చేంత గొప్పవారా? ఏం లేదు. ఎవరో ఒక పని చెబితే గోవాకి వచ్చేసి ఏదో పెద్ద సాంఘికవేత్త లాగా పోజు పెట్టేసి హోటల్లోనో, రిసార్ట్‌లోనో ఎవరికీ తెలియకుండా టైం పాస్ చేస్తున్నారు. అవునా?”

“ఇప్పుడు టైం ఎంతో తెలుసా?”

“తెలుసు. రాత్రంతా ఏదో మబ్బుల్లో తేలి ఇప్పుడే నిద్రలేచి వాస్తవాల్ని తెలుసుకుని బాధపడుతూ కిటికీ లోంచి ఏదో చూస్తున్న వాళ్ళకేనా టైం తెలిసేది?”

మొబైల్‍ను ముందరకి తెచ్చి చూసి అటు తిరిగాను. అక్కడ నిలబడి ఒకటే నవ్వుతోంది. సల్వార్ కమీజ్‍లో చాలా చిన్నపిల్లలా ఉంది. చున్నీ నేల మీద దేకుతోంది. గబగబా నన్నేదో అనేసి ఎలా స్పందిస్తానో అనుకునే ఒక చిన్న జంకు ఆ అమ్మాయికి ఎందుకో కాసింత అందాన్నే తెచ్చిపెట్టినట్లుంది.

“కూర్చోండి. ఎలా తెలుసుకున్నారు నా చిరునామా?”

చేతి బాగ్‍ను జాగ్రత్తగా సోఫాలో పెట్టింది. చున్నీ సర్దుకుంది. కావాలని సోఫాలోకి కూలబడింది.

“నేను డాక్యుమెంటరీలు తీస్తాను”

“అవును”

“చిత్రచిత్రాలు ఎక్కడెక్కడో దాగి ఉంటాయని చెప్పినప్పుడు అలవోకగా వెతికి పట్టుకుంటాం”

“టీ చెప్పనా?”

“వద్దు. వైట్ చర్ఛ్ దగ్గర కామత్‍కి వెళదాం”

***

పన్‍జిమ్ సెంటర్‍కి నేనున్న ప్రదేశం కొద్దిగా దూరమైనా నాగరికతకి దగ్గరగా వెళ్ళాలంటే ఎందుకో పన్‍జిమ్‍కే వెళ్ళాలనిపిస్తుంది. నేనొక్కడినీ ఉన్నప్పుడు ఎవరు ఎంత పళ్ళికిలించినా నాకేమీ ఇబ్బంది ఉండదు.

ఈ చాలకుడు తెగ నవ్వుతూనే నడుపుతున్నాడు ఈ కారు. ఈ అమ్మాయి ఏమనుకుంటుందో ఏమో.

“ఏంటి సంగతి?” అడిగాను.

“మీతో పనుంది”

“అర్థమవుతోంది. నాలాంటి వాడితో ఎవరూ సరదాగా గడిపేందుకు రారు”

ఈ అమ్మాయి పేరే చిత్ర అనుకున్నాను. చేష్టలన్నీ చిత్రమైనవే! మొహం లోకి మొహం పెట్టింది.

“అలా ఎవరైనా రావాలని ఆశ కదూ? నిజమే. ఇంత దూరం ఎందుకు వస్తారు?”

“చిత్రా.. నా గురించి పూర్తిగా తెలీదు నీకు”

ఎందుకో చప్పట్లు కొట్టింది.

“శభాష్. ఇప్పటికి చిత్తు చిత్తు చేసాను”

చాలకుడు నవ్వుతూనే ఉన్నాడు.

“ఏమైందని?”

“సుందర్ గారూ! చూసారా? నన్ను ఏకవచనంలోకి ఎంత సులువుగా లాగేసారో?”

“అది నిజమే. అలా మాట్లాడితేనే హాయిగా ఉంటుంది”

“ఒక అమ్మాయిని పరిచయం చెయ్యాలి మీకు”

“మరి నన్ను మీరు అని సంబోధిస్తే ఎలాగ?”

“నో. రచయితలను నువ్వు, నీకు అనకూడదు”

“ఎందుకనో? ఏం పీకారని వీళ్ళు?”

“కరెక్ట్. ఏమీ పీకలేరు కాబట్టి”

నా వల్ల కాదని అర్థమైపోయి కిటికీ వైపుకు తల తిప్పాను. నా ఖర్మ ఏమిటంటే, ఆ చాలకుని మొహం వాడి ప్రక్కనున్న చిన్ని అద్దంలో కనిపిస్తోంది. ఎంత చక్కని నిజం అన్నట్లు పళ్లికిలిస్తున్నాడు.

“ఏమీ పీకలేని వాడికి ఇన్ని కొత్త పరిచయాలెందుకు?”

“ఆమె కూడా ఏమీ పీకలేదు”

“నా వల్ల కాదు”

“అది నాకు తెలుసు. ఏంటి వల్ల కాదు అని ప్రత్యేకంగా చెప్పండి”

“ఈ సంభాషణ అర్థం కాదు. దీని కంటే ఎక్యుపంచర్ లాగా శరీరమంతా సూదులు గుచ్చి రిలాక్స్ అనటం మేలు”

“ఏం లేదు మాష్టారూ! ఆమె కూడా రచయిత్రి! రచనలు చేస్తూ ఉంటుంది”

“ఓ. అలా అయితే రిసార్ట్‌కే తీసుకుని రావలసింది కదా? అక్కడే మాట్లాడుకునే వాళ్ళం”

“అనుకున్నాను. కానీ ఇలా మొదటిసారి కలుసుకున్నప్పుడు మసాల దోశ మధ్యలో పెట్టుకుంటే కలసి వస్తుందనే దిక్కుమాలిన సెంటిమెంట్ నాకుంది!”

“మంచి సెంటిమెంటే! ఇంతకీ ఈ అమ్మాయి నీకెలా పరిచయం?”

“అని నేనన్నానా?”

చాలకుడు కొద్దిగా మరో రకంగా పళ్లికిలించాడు. అన్నీ అనేసుకుంటావు, నువ్వెందుకు పనికొస్తావు అన్న అర్థం అందులో చూపించేసాడు.

“మరి? ఇప్పుడు మనిద్దరం వెతుక్కోవాలా ఆమెను?”

“అక్కరలేదు. కామత్‍లో పై ఫ్లోర్‍లో ఎ.సి. ఉంటుంది”

“ఓకే”

“అదే. బిల్లు మీరే కట్టాలి మరి!”

చాలాకుడు నోరు మూసేసి నవ్వుకుంటున్నాడు.

“అది సరే. అయితే ఏంటి?”

“పై ప్లోర్‍లో చివరి టేబుల్ దగ్గర కూర్చుని మనం లోపలికి రాగానే కళ్ళజోడు టేబుల్ మీద ఏ అమ్మాయి అయితే పెట్టేస్తుందో ఆమెయే జ్యోతి”

“నీ మొహం మండ”

బ్రేక్ వేసి మరల పోనిచ్చాడు.

“ఆహా! తెలుగు వారనిపించారు”

పన్‍జిమ్ లోకి వచ్చాం. మాండోవీ మీది నుంచి బ్రిడ్జ్ దాటి ఏదో గల్లీ లోకి లాక్కెళ్ళి వైట్ చర్చ్ ముందరకి వచ్చాడు చాలకుడు.

చర్చ్ చాలా బావుంది. ‘లేడీ ఆఫ్ ఇమాక్యులేట్ కన్సెప్షన్’ చర్చ్ అది. అందరూ వైట్ చర్చ్ అంటారు. దాని ముందర చక్కని చిన్న సైజు పార్కు ఉంది. దాని ప్రక్కగా పోనిచ్చి కామత్ ముందర ఆపాడు. ఇద్దరం దిగాం. అక్కడ స్వీట్ షాప్ దగ్గర ఓ అమ్మాయి నిలబడి ఉంది.

“సార్.. ఇదిగో, ఈమెయే జ్యోతి. జ్యోతీ.. ఈయనే సుందరం గారు.. గొప్ప రచయిత..” అన్నదే కానీ అంతా పప్పే అన్నట్లు విరగబడి నవ్వింది.

“హలో సర్!”

“హలో”

ముగ్గురం పైకి నడిచాం. చివరి టేబుల్ చూసుకున్నాం. ఇద్దరూ అటు కూర్చున్నారు, నేనొక్కడినీ ఇటు కూర్చున్నాను.

“కళ్లజోడు తీసి టేబుల్ మీద పెట్టాలి కదా?”, నవ్వుతూ అన్నాను. చిత్ర తన మొబైల్ తీసి వాట్సప్‍లో జ్యోతి ఫొటో చూపించింది.

ఆ చాలకుడు ఇక్కడ లేడు. అయినా వాడు ఆ బేరర్ రూపంలో పళ్లికిలిస్తున్నట్లు కనిపిస్తున్నాడు!

మెనూ చూసాను.

“మసాలా..” అంటూ ఆగిపోయాను.

చిత్ర కొంటెగా చూసింది. మళ్ళీ ఆటపట్టించే అవకాశం వచ్చింది. బేరర మునిలా కళ్లు మూసుకున్నాడు. ఇలా ఎన్ని చూసాడో!

మెనూ దగ్గరకి తీసుకుంది చిత్ర.

“మూడు ప్లేట్లు ఇడ్లీ”

అతను వెళ్లిపోయాడు.

“మరి ఇడ్లీ సెంటిమెంట్ కాదు కదా?”

“మీరు మసాల దోశ తినరు. నాకు తెలుసు”

“ఎవరు చెప్పారు?”

“తరువాత చెబుతాను. జ్యోతీ.. నువ్వు మాట్లాడు”

ఆ అమ్మాయి కొద్దిగా సద్దుకుంది.

“నేను గోవాలో ఎమ్.బి.ఎ. చేయటానికి వచ్చాను.”

“ఓకే”

“అలా అని నేను ఈ మధ్యనే కాలేజీ నుంచి పాసవుట్ అయిన దానిని కాను”

“ఓ”

“ఈ మధ్యనే కొన్ని రచనలు చేస్తున్నాను”

“బావుంది”

“మాది హైదరాబాదు. మిమ్మల్ని ప్రత్యేకంగా కలవటానికి ఒక కారణం ఉంది”

“ఏంటది?”

“మీకు మాధవ్ అనే బంధువు ఎవరైనా ఉన్నారా?”

ఆలోచించాదు.

“మాధవ్ అంటే.. బక్కగా, కెమెరా పట్టుకుని తిరుగుతూ ఉంటాడు!”

“అవును”

“నిజమే. మాధవ్ నాకు బంధువే. కానీ ఈ మధ్య కలవలేదు. మీకెలా పరిచయం?”

“అతను జైల్లో ఉన్నాడు”

ఇడ్లీలు వచ్చాయి. జైలు మాట ఆ బేరర్ వినే ఉంటాడు. కానీ ఎటువంటి స్పందనా లేదు. తన పని తను చేసుకుని వెళ్ళిపోయాడు.

“ఓ, సమస్య ఏంటి? విడిపించాలా?”

అమ్మాయి ఆలోచించింది.

“విడిపించగలరా?”

“పూర్తి వివరాలుంటే చూడాలి ఏం చేయాలో..”

మాట్లాడకుండా టిఫిన్ చేస్తున్నాం. అమ్మాయి అద్దం బైటకి చూస్తోంది. ఇటు తిరిగింది.

“జైల్లోకి వెళుతూ అతను మీ పేరూ, నంబరూ ఆ ఎస్.ఐ.కి రాసి ఇచ్చాడు.

“ఇంతకీ ఎక్కడ జైల్లో ఉన్నాడు? ఎందుకున్నాడు?”

“ఇక్కడ జైల్లోనే ఉన్నాడు”

“ఇక్కడా? ఇక్కడ ఏం చేసాడు?”

చిత్ర చాలా సీరియస్‍గా చూస్తోంది. ఆమెను ప్రశ్నించినట్లుగా చూసాను.

“నాకు ఏమీ తెలియదు మాష్టారూ! ఏదో మాటల్లో మీ పేరు వచ్చింది. వెంటనే, ‘అయ్యో మొన్ననే కలిసాను’, అన్నాను”

“ఓ..”, జ్యోతి వైపు చూసాను.

“మాధవ్, నేను ఒకే కాలేజీలో చదివాం”

“ఇష్టపడ్డారా?”

“లేదు. ఒకరినొకరు ఇష్టపడాలని చాలా కష్టపడ్డాం”

“ఇది వింతగా ఉంది”

“అలాగే అనుకోండి”

“ఇంతకీ ఏమైంది?”

“అతని దారి అతనిది, నా  దారి నాది అయిపోయాయి! అదేమి చిత్రమో ఇద్దరికీ పెళ్ళి కాలేదు. మరి నన్ను కోరుకుంటున్నాడో తెలియదు, నేను అతను కాకపోతే ఇంకెవరినీ చేసుకోననీ లేదు. ఇద్దరం అలా ఉన్నాం”

చిత్ర ఎందుకో చిరునవ్వు నవ్వింది. టాపిక్ మారిస్తే బాగుండు ననిపించింది.

“ఏం వ్రాస్తున్నారు?” అడిగాను.

“కలయిక అనే నవల.. నవల అనాలో, పుస్తకం అనాలో తెలియదు”

“ఏంటి సబ్జెక్ట్?”

“కల.. యిక! అంటే నేను ఓ కలను కలుసుకుంటాను”

“బాగుంది. ఆలోచనే.. చిత్రంగా ఉంది”

“అది నా కలే”

“ఓ.”

“ఆ కలని తన రంగు, రూపురేఖలను మార్చమని చెబుతున్నాను”

“పుస్తకం చదవాలని ఉంది”

“ఇప్పుడు కాదు. పూర్తయ్యాక ఇస్తాను”

“ఓకే”

కాఫీ తెప్పించాం. బేరర్ జాగ్రత్తగా కప్పులు పెట్టాడు.

“ఇంతకీ మాధవ్ ఏం చేసాడు?”

కాపీ రెండు గుటకలు మ్రింగింది జ్యోతి. చిత్ర అటూ ఇటూ చూస్తోంది.

“ఏమో”

“అంటే మీకు తెలియదా?”

“అలా అని చెప్పలేను”

“ఫరవాలేదు. చిన్న అపరాధమా? పెద్దదా?”

“అపరాధాలకు సైజులుంటాయని నాకు తెలియదు!”

చిత్ర నవ్వు ఆపుకుంది. జ్యోతి సీరియస్‍గా ఉంది.

“ఎందుకు లోపలేసారు? ఎవరు కంప్లయింట్ చేసారు?”

“నేనే!”

చేతిలో కప్పు కదిలింది. చిత్ర కప్పు టేబుల్ మీద పెట్టేసింది. జ్యోతిని జాగ్రత్తగా చూసింది. నాకు ఒళ్లు మండింది.

“మరి విడిపించటం ఎందుకు?”

“నేను వాడిని చంపాలి!”

బేరర్ ప్రక్కనే ఉన్న టేబుల్ మీద స్పూన్లు, ఫోర్క్‌లు సద్దుతూ ఒక్కసారిగా ఆగిపోయాడు..

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here