Site icon Sanchika

పూచే పూల లోన-60

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[హఠాత్తుగా సమీర్ – సుందర్ ముందు ప్రత్యక్షమవుతాడు.  అక్కడున్న ఓ కుర్చీని సుందర్ ముందు వేసి, తాను పిట్టగోడ మీద కూర్చుంటాడు. తనని క్షమించమని అంటాడు సమీర్. నేనో పని మీద వచ్చానని సుందర్ చెబితే, తెలుసంటాడు సమీర్. తనని పోలీసులు వెతుకున్నారని అంటాడు. జో ఎలా ఉన్నాడని సుందర్ అడిగితే, జైల్లో దెబ్బలు తింటున్నాడని అంటాడు. తనని కూడా పోలీసులు జాగ్రత్తగా గమనిస్తున్నారని చెప్తాడు సమీర్. మీరిందులో ఎలా చిక్కుకున్నారని సుందర్ అడిగితే, సమాధానం చెప్తాడు. తన కోసం జో హింస అనుభవిస్తున్నాడని అంటూ, జ్యోతి ద్వారా తనకో సాయం అందాల్సి ఉందని చెప్తాడు. జ్యోతి గురించి మీకు జోవాక్విమ్ చెప్పాడా అని అడిగితే, చెప్పడమే కాదు, జో కి ఇలాంటి వాళ్ళ గురించి ఎక్కువ తెలుసు అని చెప్తాడు సమీర్. అదెలా అని సుందర్ అడిగితే, ఒకప్పుడు జో కూడా జ్యోతి లాంటే వాడేననీ, సాయాజీ నేర్పిన వైద్యంతో, ఈ పూలతో మామూలు మనిషి అయ్యాడని సమీర్ చెప్తాడు. ఇంతలో అక్కడికి ఇద్దరు మనుషులు వచ్చి తాము సుందర్ గారి డ్రైవర్ వద్దకు వెళ్ళే లోపు ఓ జీపు వస్తుంటే దాక్కున్నామనీ, పోలీసులు ఆ కారుని వెతికారనీ, అందులో డ్రైవర్ లేడనీ, ఓ బుట్ట మాత్రం ఉందని చెప్పి – ఆ బుట్టని చూపిస్తారు. సుందర్ తన డ్రైవర్ గురించి కంగారు పడితే, సమీర్ ధైర్యం చెప్తాడు. ఆ బుట్ట వీరమణి మనుషులదనీ, డ్ర్రైవర్‍ని వాళ్ళే తీసుకెళ్ళారని సమీర్ చెప్తాడు. – ఇక చదవండి.]

[dropcap]ఆ[/dropcap] మనుషులు వెళ్లిపోయారు. మేమిద్దరం తిరిగి నా గది వైపుకు వచ్చాం. అక్కడ అప్పటికే మాధవ్ లేచి అటూ ఇటూ తిరుగుతూ వెతుక్కుంటున్నట్లు అర్థమైంది, సమీర్‌ని చూసి భయపడ్డాడు మాధవ్.

“ఇతని పేరు మాధవ్..” చెప్పాను, “..చిత్రమైన కెమెరామేన్.”

”హలో” అన్నాడు సమీర్, “..అందరూ విచిత్రమైన వాళ్లే. అందులో మీతో కలిసి ఉన్నారంటే పూర్తిగా చిత్రమే.”

“నాకు భయంగా ఉంది”, అన్నాను.

“దేనికి?”

“డ్రైవర్ పరిస్థితి, మిమ్మల్ని పోలీసులు వెంబడించటం, ఇదంతా సినిమాలలో చూపిస్తారు.”

“సినిమాలలో ఈ మధ్య ఏమీ చూపించటం లేదు.”

“మరి?”

“కెమెరా అలా ఆన్ చేసి వదిలేస్తున్నారు. మిగతాది అదే జరిగిపోతోంది. సినిమా మంచినీళ్ల బాటిల్ లాంటిది, అందరూ అందులోంచి త్రాగేసి బ్రతికేస్తున్నాం అనుకుంటున్నారు. యస్ మాధవ్, నీకెలా ఉంది?”

మాధవ్ ఎందుకో అటూ ఇటూ చూసాడు.

“నాకు ఆకలిగా ఉంది సార్”, అన్నాడు.

***

మాకు భోజనాలు ఏర్పాటు వేసిన చోటు అద్భుతంగా ఉంది. నేను, మాధవ్, సమీర్ బాల్కనీలో ఉన్న చోట ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నాం.

“మనం ఎక్కడన్నాం?” ఆడిగాను. సమీర్ నవ్వాడు.

“ఎప్పుడైనా నది మీద కూర్చున్నారా?” అడిగాడు.

“లేదు. పడుకునే అవకాశం కూడా ఎవరూ ఇవ్వలేదు.”

“హహ.. సముద్రంలో ఒక నది కలిసేటప్పుడు ఇక్కడే ఎందుకు కలుస్తుంది? అనే ప్రశ్న చాలా ప్రధానమైనది.”

“పల్లపు ప్రదేశాన్ని ఎంచుకుని ఆ మార్గంలో చేరుకుంటూ పోతుంది.”

“కొన్ని చోట్ల జలపాతంలా జారిపడుతుంది.”

“కావచ్చు.”

“ఆ దూకుడు వలన మరింత పల్లపు ప్రాంతం ఏర్పడుతుంది. నది భూమితో ఒక విధంగా పోరాడుతుంది. మెల్లగా సముద్రం దగ్గరకి వచ్చేసరికి కాస్త పొంగుతుంది. ఆ తరువాత చిన్నగా సిగ్గు పడుతుంది. ఆ తరువాత సముద్రం కొద్దిగా ముందుకు వస్తుంది. అక్కడ ఒక బెడ్ ఏర్పడుతుంది. దానిని మనం సంగమం అంటాం.”

“మీలో ఒక రచయిత ఉన్నాడు.”

“మీరు నన్ను మనం ఎక్కడున్నాం అని అడిగారు.”

“కరెక్ట్.”

“మీరు సరిగ్గా అక్కడే ఉన్నారు. సంగమం.”

“మరి ఆ దృశ్యం నాకేమీ కనిపించలేదు.”

“అది ఇప్పుడు లేదు.”

“అదేంటి?”

“నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇది ఓ సంగమం ప్రాంతం.. కాలక్రమంలో ఇదంతా దారి మారి మరో దారి పట్టుకుంది. అప్పుడు ఇది కుశావతి ప్రాంతం. ఇది ఎందుకు ఎండిపోయింది అన్నది ప్రక్కన పెట్టండి. ఈ బెడ్ క్రింద బేరియమ్ డిపాజిట్స్ ఉన్నాయి.”

మాధవ్ ఒక్కసారిగా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. అంటే గవడె గారితో సహా ఇంత కాలం అందరు వెతుకుతున్న గని ఇదేనన్నమాట.

“మన క్రింద ఓ గని ఉన్నదా?”

“అవును. కానీ ఇది మా కంచుకోట. ఇరవై సంవత్సరాల తరవాత ఇక్కడ అన్నీ బయటపడగలవు.”

రకరకాల ఆహర పదార్థాలతో ప్లేట్లు మా ముందరకొచ్చాయి.

“సమీర్ గారూ, నా డ్రైవర్ సంగతేమిటి? ఆ కారు సంగతేమిటి? అది నేను వాడుతున్న కారని వాళ్లకి తెలిసాక నా పరిస్థితి ఏంటి?”

“మాకు మీతో పనుంది..” అన్నాడు సమీర్, “..మీ వెంట్రుక ముక్క పీకటం కాదు తాకటం కూడా ఎవరూ చేయలేరు. మీ డ్రైవర్‍ని వదిలిపెడతాం, మీరు రిసార్టుకి వెళ్ళిన తరువాత.”

“పోలీసులు కారుని తీసుకెళ్లి పోయింటారు కదా?”

“లేదు. పోలీసులని మా వాళ్లు తీసుకొని పోయుంటారు. గెరిల్లా వార్‍ఫేర్ సామాన్యమైనది కాదు. శత్రువు బుర్రలోకి సరైన ఆలోచన వచ్చేలోపల వాడిని వాడి ప్రాణాల గురించి తప్ప మరే ఏ ఆలోచన రానీయం.”

“నాతో పని అన్నారు.”

“కరెక్ట్.”

“నేను మందు కోసం వచ్చాను.”

“రచయిత గారు మందులు అంటే సరిపోతుంది.”

అలా ఎందుకన్నాడో అర్థమైంది. అప్పుడే రెండ్ బాటిల్స్ తెచ్చి టేబుల్ మీద ఉంచారు. సమీర్ మాధవ్‍ను అదోలా చూసాడు. మాధవ్ నవ్వి ఊరుకున్నాడు.

“ఈ అబ్బాయి ఏంటి? ఎక్కువ మాట్లాడడా?”

నేను మాధవ్ వైపు చూసాను.

“కొందరు లోపలే మాట్లాడుకుంటారు..”చెప్పాను, “..స్వగతంలో గతంలో గంతులేస్తూ దేనినో మానంగా స్వాగతిస్తూ ఉంటారు.”

సమీర్ బాటిల్ తెరచి మరల మూసేసాడు.

“ఏమైంది?” అడిగాను.

“ఓ రచయిత ఎదురుగా కూర్చుంటే ఈ బాటిల్‍తో పనిలేదు.”

“బహు కృతజ్ఞతలు, కాకపోతే ఈ రచయితకి లోపల చాలా దిగులుగా ఉంది!”

బాటిల్ ముందుకు తోసాడు.

“సుందరం గారూ, ఏదో అయిపోతుంది, అనుకున్నప్పుడు, లేదా గొప్ప ఆశ ఏదో మనలో రగులుతున్నప్పుడు అది తీరిపోతుందన్నప్పుడు దీనిని చాలా మంది దాచుకుని పండుగ చేసుకుంటారు.

“జరుగనప్పుడు?”

మాధవ్ ముందుకు వంగాడు.

“అప్పుడు దీనిని ఖాళీ చేసి పండగ ఎందుకు చేసుకోకూడదు? అని తనలో తను అనుకుంటాడు.”

సమీర్ గబ గబా రెండు గ్లాసులు నింపాడు.

ఒకటి మాధవ్‍కి ఇచ్చాడు, ఇద్దరు ఛీర్స్ అనుకున్నారు.

“కుర్రాడు టైగర్” అన్నాడు సమీర్.

“సమీర్ గారు, ఆ కారు ఆగిన చోటు ఇప్పుడు కాగితం మీదకి వచ్చేసింది. ఇక్కడి నుండి వాళ్ల పరిశోధన ప్రారంభమవుతుంది, ఇది గొప్ప లీడ్ కాదా?’

“మా ఆపరేషన్స్ అలా ఉండవు సుందరం గారూ..” చెప్పాడు, “..ఆ కారు స్టీరింగ్ తీసేసి ఇప్పటికే మార్చేసి ఉంటారు. ఇక మీద ట్రాక్ కాదు.”

“పోలీసుల సంగతి?”, మాధవ్ అడిగాడు.

“వాళ్ళ స్టీరింగ్ కూడా మార్చేసి ఉంటారు.”

సమీర్ మీద మామూలుగానే నాకు చాలా నమ్మకం ఉంది. అన్నీ ఇంత నమ్మకంతో చెబుతున్నాడేంటి అనే అనుమనం రాలేదు గానీ పరిస్థితులు విషమిస్తున్నానని అర్థమైంది.

“వాళ్ళ స్టీరింగ్ అంటే?”

సమీర్ నన్ను జాగ్రత్తగా చూసాడు.

“అన్ని రహస్యాలు చెప్పేస్తే ఎలా? అయినా పరవాలేదు. మనిషి ఇష్టమైన దానిని, దానితో పాటు కలిసి ఉండేవాటిని, అవసరమైన వాటిని, వాటితో గట్టిగా సంబంధించిన వాటినీ గట్టుగా గుర్తుంచుకుంటాడు.”

మాధవ్ దగ్గాడు.

“యస్?” అన్నాడు సమీర్.

“సార్, మనిషి ఎక్కువ బాధపడ్డ సందర్భాలు, కష్ణపడ్డవి కూడా గుర్తు పెట్టుకుంటాడు.”

“తీవ్రంగా బాధపెట్టిన వాళ్ళని?”

“తప్పకుండా. మోసం చేసిన వాళ్లని కూడా.”

“ఈ అబ్బాయి ఎవరినో ప్రేమించాడు,” అన్నాడు సమీర్.

మాధవ్ గడగడా గ్లాసు ఖాళీ చేసాడు.

“సార్..”, నేనన్నాను, “..ఇంతకీ ఏంటి కథ? ఆ కారు, డ్రైవర్, పోలీసులు.. ఈ వ్యవహారం ఏంటి?”

“పూచే పూలలో చాలా ఉంటుందని ఇప్పటికే అర్థమయి ఉంటుంది?”

“చాలా ఉందా లేక అంతే ఉందా అన్నది ఇంకా తేల్చుకోలేదు.”

“న్యూరోపథి అనే వ్యవస్థలో కొన్ని సందర్భాలలో కొన్ని జ్ఞాపకాలు, కొన్ని మెదడు సంబంధించిన సందేశాలు పూర్తిగా మూసుకుంటాయి. మీ డ్రైవరుకీ, పోలీసులకి కొంత కాలం అదే జరుగుతుంది. వాళ్లు తేరుకునే లోపు కథ అయిపోతుంది.”

“ఇప్పుడు కారు ఎక్కడుంది?”

“సముద్ర గర్భంలో! భలే వారే. స్టీరింగ్ తీసేసి మరో స్టీరింగ్ బిగించి మీ రిసార్ట్స్‌కే పంపించేస్తారు వాళ్లు. ఎవరైనా వచ్చి ఏమైనా ప్రశ్నలు అడిగితే అసలు ఆ కారు అక్కడి నుండి కదలనే లేదని చెబుతారు.”

“అది ఎలా నమ్ముతారు?”

“దానికో పరీక్ష ఉంది. పోలీసులు స్టీరింగ్ క్రింద ఉన్నా చిప్‌ను రీడ్ చేస్తారు. అది అర్థం కాని డేటా ఇస్తుంది. దానితో కాదనుకుని ఇంటికి పోతారు.”

“మాధవ్?” అన్నాను.

“సార్?”

“సమీర్ గారిని ఏమైనా అడగాలా?”

“ఏమీ అడక్కుండానే ఇన్ని తెలుస్తున్నాయి. అడిగితే?”

“ఏమీ తెలియక పోవచ్చు”, అన్నాడు సమీర్, “..ఈ సృష్టి యావత్తు ఒక చోట ఏదో కదిలితే మరో చోట మరేదో కదిలేదే. దేనికి ఏది అనుబంధం అని తెలుసుకోవటమే విజ్ఞానం. నాలో ఉన్నది ఏంటి?, ఇది దేనితో ముడిబడి ఉన్నది అన్నది శోధించటం తాత్వికం. నిన్ను కలుపుకుని శోధించటం ధార్మికం అవుతుంది. అలా కాదు, నేను ఫలానా అని నిర్ధారించుకొని మిగతా వాటిని శోధించటం సైన్స్ అనుకుంటారు అందరూ. రెండూ ఒకటి కాదు చాలా తేడా ఉంది.”

“పూల బుట్ట, వీళ్లు మెడలో వేసుకున్న మాలలు.. ఇదేంటి?”

“అదే తమాషా. మాకు మొబైల్స్‌తో పనిలేదు. ఇక్కడ బీజాలు – గింజలుంటాయి. ఇటువంటి గింజల నుండి వచ్చిన పూలు ఇవి ఎక్కడున్నా స్పందిస్తాయి.”

“అదెలా కుదురుతుంది?”

“మీరు ఏ కాలంలోనో ఉండి వదిలేసిన ఇల్లు దగ్గర ఎప్పుడైనా ఒక్క క్షణం ఆగి చూసారా? ఎలా అనిపిస్తుంది?”

“తెలియని అనుబంధం ఉంటుంది.”

“ఇదీ అంతే, ఏమంటావు యంగ్ మాన్?”

మాధవ్ చిత్రంగా మొహం పెట్టాడు.

“సార్, జ్యోతి సంగతి చూడండి, నాకు మళ్ళీ జైలుకు వెళ్ళాలని లేదు. అక్కడ ఉండి వచ్చాను, అనుబంధం ఉంటుంది. అందంగా ఉండదు!” అన్నాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version