పూచే పూల లోన-61

0
2

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[సమీర్, సుందర్ కలిసి సుందర్ గదికి వచ్చేసరికి – అప్పటికే నిద్ర లేచిన మాధవ్ సుందర్‍ని వెతుక్కుంటూ కనబడతాడు. సుందర్ మాధవ్‍ని సమీర్‍కి పరిచయం చేస్తాడు. తమ డ్రైవర్ పరిస్థితి, సమీర్‍ని పోలీసులు వెంబడించటం వంటివి తనకు భయం కలిగిస్తున్నాయని చెప్తాడు. ముగ్గురు భోజనానికి కూర్చుంటారు. తాము కూర్చున్న ప్రదేశం 400 ఏళ్ళ క్రితం సంగమ స్థలమని, కుశావతి నది అక్కడ సముద్రంలో కలిసేదని చెప్తాడు సమీర్. ఎందుకు దారి మార్చుకుందో, ఎందుకు ఎండిపోయిందో తెలియదని చెప్పి, ఈ రివర్ బెడ్ కింద బేరియం డిపాజిట్లు ఉన్నాయని చెప్తాడు. అయితే గవడె గారితో సహా అందరూ వెతుకుతున్న గని ఇదేనేమో అని మాధవ్ అనుకుంతాడు. సుందర్ ఆశ్చర్యపోతే, మరో ఇరవై ఏళ్ళ తరువాత ఇక్కడ అన్నీ బయటపడతాయని చెప్తాడు సమీర్. మా డ్రైవర్ పరిస్థితి ఏమిటని సుందర్ అడిగితే, అతనికేమీ కాదని, సురక్షితంగా ఉంటాడని చెప్తాడు. తమ కారుని పట్టుకుంటే తమ రాకపోకల్ని ట్రాక్ చేయవచ్చని సుందర్ అంటే, ఆ కార్టు స్టీరింగ్‍ని మార్చేసామని, దానిలో ఉండే చిప్ ఇప్పుడూ ఏదీ చూపించదని, పోలీసుకు తమని కనుక్కోలేరని అంటాడు సమీర్. పూల బుట్టలు, అక్కడి వాళ్ళు మెడలో వేసుకున్న మాలల గురించి అడిగితే, ఆ పూల గింజలలో స్పందనలుంటాయనీ, వాటి ద్వారా వచ్చిన పూలు ఎక్కడున్నా అవి స్పందిస్తాయని, అందుకని తమకి మొబైల్స్‌తో పనిలేదని అంటాడు సమీర్. – ఇక చదవండి.]

[dropcap]ఆ[/dropcap] రాత్రి బొత్తిగా నిద్ర పట్టలేదు. ఈ అర్థం కాని ప్రదేశంలో జ్యోతి కోసం మందు తయరవుతోంది. ఇంకో నాలుగు రోజులలో ఆ లేహ్యం మరో లేహ్యంతో పూర్తిగా కలసిన తరువాత నా చేతికిస్తారన్నారు. నెట్‍వర్క్ లేదు. ఎవరికీ  ఏమీ తెలియపరచటానికి లేదు. చిత్ర పరిస్థితి ఏమిటలో అర్థం కావటం లేదు. తొందరపడి పోలీస్ స్టేషన్‌లో తప్పిపోయినట్లు ప్రకటన చేస్తుందా? పొరపాటుగా కూడా చేయదు. గవడె ఏ పథకంలో ఉన్నాడో తెలియదు. ఇక్కడ నుండి బయటపడ్డాక నన్ను ఏం చేస్తారో తెలియదు. నిజానికి ఈ ప్రదేశాన్ని చూపించమన్నా అది నా వల్ల కాదు. నాకు ఏ ఇబ్బందీ ఉండదని సమీర్ చెప్పియున్నాడు. ఇంత ఆధునిక రంగంలో, ఇంత సాంకేతిక పరమైన ప్రగతిలో ఇంత రహస్యంగా ఒంటరిగా కాలం గడపగలగటం విడ్డూరమే. ఎంత కాలం దాక్కుంటాడు? అది సరైన ప్రశ్న. ఏదో రోజు దొరికిపోగలడు. మరి ఏం చేస్తున్నాడు? నిద్ర పట్టటం లేదు..

లేచి కొద్ది సేపు అటూ ఇటూ తిరిగాను. అసలు ఏం జరిగింది అన్నది సూటిగా అడిగి తెలుసుకోవాలి. బాహ్య ప్రపంచానికి అందని ఏ పరికరమూ ఇక్కడ లేదు. ఎక్కడో ఎవరో మూలుగుతున్నట్లు అనిపించింది. మెల్లగా తలుపు తెరచి బయటకు వచ్చాను. ఆ వరండా చివర ఒక వృత్తాకారంలో ఒంటి స్తంభం మేడలా ఉంది. దాని క్రిందకు వెళ్లి నిలున్నాను. నిజమే. దాని పైన ఏదో జరుగుతోంది.

“నిద్ర పట్టటం లేదా?”

వెనక నుండి వినిపించింది. అటు చూసాను. నేల మీద గోడకి అనుకుని ఓ పెద్దాయన కూర్చునున్నాడు. కళ్ళు మూసుకుని ధ్యాన ముద్రలో ఉన్నాడు.

“మీరు నన్నే అడిగారా?”

“అవును.”

“నిజమే. నిద్ర పట్టటం లేదు.”

“ఎందుకని?”

“ఆలోచనలు దాడి చేస్తున్నాయి.”

“కూర్చో.”

నేల మీద చతికిలబడ్డాను.

కళ్ళు తెరచి నన్ను చాలా సేపు చూసాడు.

“నువ్వు దేని క్రింద కూర్చున్నావో తెలుసా?” అడిగాడు.

“తెలియదు.”

అసలు ఏమీ తెలుసుకునే లోపలే అన్నీ అయిపోతున్నాయిని చెబుదామనుకున్నాను. కానీ ఇలాంటి వాళ్ళతో జోక్ వేస్తే మొదటికే మోసం రాగలదని ఊరుకున్నాను.

“పైన పంచ శబ్ద ఉపాపన జరుగుతోంది.”

ఇదేదో తెలుసుకునే అవసరమో, అవకాశమో అర్థం కాలేదు.

“పైకి వెళ్ళొచ్చా?” అడిగాను.

“దూరంగా మెట్ల మీద నుంచే చూసి, అయిదే అయిదు నిమిషాలలో వెనక్కి రా. అక్కడ ఉన్న ఆ అయిదుగురిలో ఎవరి కంట పడ్డా అయిదింటిలో కలిసిపోతావు. ఆలోచించుకుని వెళ్ళు, తిరిగి ఇక్కడికే రా.”

మనసు వద్దంటోంది. బుద్ధి వెళ్ళమంటోంది. చిత్తం చపలమవుతున్నది. ఇతను మళ్ళీ  కళ్ళు మూసుకున్నాడు.

నెమ్మదిగా లేచాను. ఆ మెట్లు సన్నని నడుము గల యువతి గిరగిరా తన చుట్టూ తాను తిరిగినట్లున్నాయి. రెండు మెట్లు ఎక్కి ఆలోచించాను. ఇక్కడ జాగ్రత్తగా అడగు వెయ్యకపోతే వాళ్ళెవరూ కళ్ళు తెరవక్కర లేదు. పైలోకాలకి ద్వారాలు దీని క్రింద తెరుచుకునేటట్లున్నాయి. మూడు రౌండ్లు తిరిగిన తరువాత ఒక ఆలోచన వచ్చింది. నిజానికి పూర్తిగా పైకి వెళ్లక్కరలేదు. ఒక సన్నని సందులోంచి అక్కడి దృశ్యం బాగానే కనిపిస్తోంది. ఆ గదిలో లైటు లేదు. కానీ వెలుతురు ఎక్కడ నుంచి వస్తోందో తెలియదు. అయిదుగురు మనుషులు వృత్తాకారంలో కూర్చున్నారు. వారికి మధ్యలో ఏదో తిరుగుతోంది. కొన్ని రౌండ్లు తిరిగిన తరువాత ఒక్కసారిగా పైకి లేస్తోంది. మరల క్రిందకి దిగి అలాగే తిరుగుతోంది. వీళ్లు ఏవో మంత్రాలను ఉచ్చరిస్తున్నారు. ఆ శబ్దం ప్రకారం అక్కడ అది కదులుతున్నట్లు అర్థమవుతోంది. నాకు పూర్తిగా ఏకాగ్రత కుదరటం లేదు కానీ నేను శోధించి చూసిన తాళపత్రాలలోని పంచ శబ్ద ఉపాసన గురించి తెలుసుకునే అవకాశం మరల రాదని గ్రహించాను.

కొద్ది సేపు మంత్రాలు ఆగిపోయాయి. నాకు వెన్ను చూపిస్తూ కూర్చున్న వ్యక్తి కుడి చేతితో దేనినో లాగాడు. మెల్లగా పై నుంచి మందార పూలు రాలుతున్నాయి. ఆశ్చర్యం ఏమిటంటే ఎవరో ఒక్కొక్క పువ్వు రాలుస్తున్నట్లు పడుతున్నాయి. ఆ పడుతున్న పూలను మధ్యలో ఉన్న ఆ చట్రం లోపలికి తీసుకుంటోంది. ఒక చేయి పైకి వచ్చింది. దానితో రెండో చేయి కలిసింది. పూలన్నింటటినీ దోసిటిలోకి తీసుకుని ఆ చేతులు రెండు క్రిందకి వెళ్లిపోయాయి.

మెట్లను గట్టిగా పెట్టుకున్నాను. మరల మంత్రోచ్చారణ ప్రారంభమైంది. వాళ్ళు ఏమంటున్నారో అది మటుకు స్పష్టంగా అర్థం కాలేదు. మరల ఆగిపోయారు. అయిదుగురు లేచారు. ఇద్దరు వెనక్కి నడుచుకుంటూ వచ్చారు. ఇద్దరు అటు వెనక్కి వెళ్లారు. ఒక్కడు మటుకు అక్కడే నిలుచుని రెండు చేతులూ మధ్యలో ఉన్న చట్రం వైపు చూపాడు. ఇటు ప్రక్కనున్న ఇద్దరు అటు వెళ్లి అక్కడున్న ఇద్దరు ఇటు వచ్చారు. మధ్యలోనున్న అతను చట్రానికి అవతల ప్రక్కకు వెళ్లాడు. అలాగే చేతులు చాచాడు.

రోకలితో పోట్లు వేస్తున్నారనిపించింది. అయిదు సార్లు శబ్దం వినిపించింది. తరువాత ఒక్కో శబ్దానికి మధ్య అయిదు మాత్రల అంతరం స్పష్టంగా గోచరించింది. ఆ పైన రెండు రెండు పోట్లు, ఒకటి, మూడు, ఒకటి, ఇలా ఎంతో లయబద్ధంగా సాగింది. మరల అయిదుగురు కూర్చున్నారు.

ఇక దిగిపోదామనుకుంటున్నాను. ఇంతలోనే అద్భుతం జరిగింది. మరో మనిషి ఎవరో ఆ గదిలో కనిపిస్తున్నారనిపించి జాగ్రత్తగా చూసాను. మధ్యలో ఉన్న చట్రంలోంచి ఒక అమ్మాయి మందారాలతో శరీరాన్ని కప్పుకుని పైకి వచ్చింది. స్పష్టంగా తెలియలేదు కానీ కొంకణీ కన్యలాగానే ఉంది. విప్పారిన కళ్ళు. అవి ఎటు చూస్తున్నాయో తెలియదు. రెండు చేతులూ – ఆకాశం లోకి లేపి తల కూడా అటే పెట్టింది. మాధవ్‍కి ఫొటోలో కనిపించిన జ్యోతి స్వరూపం ఇదేనా? నా తెరచిన నోరు అలాగే ఉండిపోయింది. ఈ అమ్మాయి ఖచ్చితంగా ఈ లోకంలో లేదని అర్థమతోంది. మెల్లగా రెండు చేతులూ క్రిందకి దించి దోసిట పట్టుకుంది. అయిదుగురు మనుషులూ చెరో దీపం ఆమె చేతులలో పెట్టారు. శబ్దం వినిపిస్తూనే అంది.

అయిదు జ్యోతులతో ఆ అమ్మాయి లేచి నిలుచుంది. మంత్రోచ్చారణ జరుగుతోంది. ఆ జ్యోతుల కాంతులలో ఆ అమ్మాయి అందంగా వెలిగిపోతోంది. చట్రం మెల్లగా జరగటం ప్రారంభించింది. ఆ దీపాలు ఎగిరిపోతున్నాయా అనిపించింది. అమ్మాయి కళ్ళు అలాగే తెరచి ఉన్నాయి. అందంగా చిరునవ్వు నవ్వుతోంది. తిరగటం వేగాన్ని పుంజుకుంది. నేను కళ్ళు ఆర్పకుండా చూస్తున్నాను. చట్రం పైకి వేస్తోంది. అమ్మాయి తన కుడి కాలిని ఎడమ కాలి మీద తొడ దాకా లేపి ఆన్చింది. ఆ వేగంలో ఒక మెరుపు తీగలా ఉంది. దాదాపు పావుగంట సేపు అలా తిరిగి మెల్లగా ఆగింది. తిరుగుతున్నంత సేపూ ఆ గది యావత్తూ కాంతితో నిండిపోయింది. ఆశ్చర్యం ఏమిటంటే ఆ జ్యోతులు వెలుగుతునే ఉన్నాయి. ఇంతలో సన్నని నాదస్వరం వినిపిస్తోంది. ఆ చట్రం మీది నుండి బయటకు వచ్చి అమ్మాయి జ్యోతులను ఒక్కొక్కరి ప్రక్కగా పెట్టింది. అటు వైపు నడుచుకుంటూ వెళ్లి తలుపు తెరిచి సముద్రాన్ని చూస్తూ ఏదో పలికింది. ఇక్కడ వీళ్లు అదేదో పలికారు. తిరిగి నా వైపు నడుచుకుంటూ వస్తోంది. ఎక్కడ చూస్తోందో తెలియలేదు. ఎందుకైనా మంచిదని నేను రెండు మెట్లు క్రిందకి దిగాను. ఇక్కడ కూడ ఏదో గట్టిగానే పలికింది. వాళ్లు ఏదో వత్తాసు పలికారు. అక్కడ నుండి వెళ్లిపోయింది.

నేను మెల్లగా పైకి ప్రాకాను. అమ్మాయి తిరిగి ఆ చట్రంలోకి వెళ్లి నిలుచుంది. ఆ చట్రం మంత్రాల మాటున క్రిందకి వెళ్లిపోయింది. చాలా సేపు వాళ్లు నిశ్బబ్దంగా కూర్చున్నారు. నేను క్రిందికి వచ్చి నాకు అనుమతి ఇచ్చిన ఆయన ముందర కూర్చున్నాను. ఆయన కళ్ళు తెరిచాడు.

“చూసావా?” అడిగాడు.

“చూసాను.”

“ఏమర్థమైంది?”

“ఏమీ అర్థం కాలేదు. కానీ అద్భుతంగా ఉంది.”

“అర్థమైతే అద్భుతంగా ఉండదు.”

“నాకు తెలుసుకోవాలనుంది.”

“అణువణువుకూ గల అనుబంధం మానవుని అంతరంగాలలో తరంగాల మాధ్యమం ద్వారా రంగరించుకుని సృష్టిని నడుపుతుంది.”

“కనిపించనివి కొన్ని, కనిపించేవి కొన్ని.”

“కొన్నింటినే దర్శించగలం.”

“పంచ శబ్దాలు అంటే కొంత తెలుస్తోంది. దీపాల సంగతి తెలియలేదు.”

“అగ్ని వాజంభరుడు. శబ్దం అగ్ని స్వరూపం. పంచాగ్నులు, పంచ శబ్దాలు, పంచ తన్మాత్రలు, పంచ కోశములు, పంచ భూతాలు.. ఇదే లయకు మూలం..”

“మందారం?”

“అయిదు రేకులు – ఆ పుష్పం లోని తత్త్వం అన్నిటితో ముడిపడి ఉంది. అది పలుకుతుంది. వినే వాళ్ళు కావాలి.”

“ఇంతకీ ఇదంతా దేనికి?”

“ఇది శక్తి ఉపాసన. ఒక్కసారి ఇలా నిర్వహించిన తరువాత అయిదు మాసముల వరకు అయిదు వందల యోజనముల దూర వరకూ ఏ శత్రువు మా జోలికి రాలేడు. ప్రయత్నిస్తే మాడిపోతాడు. ఇది తరతరాల నుండి వస్తున్న కదంబ సామ్రాజ్యం వారి శక్తి. అత్యంత రహస్యమైనది.”

“నేను..”

చెయ్యి అడ్డు పెట్టాడు.

“మరేం ఫరవాలేదు. నువ్వు కేవలం దృశ్యాన్ని చూసావు. అదృశ్యంలోనే అంతా ఉంది. ఈ కాయ తీసుకో.”

ఒక చిన్న కాయ ఇచ్చాడు.

“ఏంటిది?”

“ఇదీ మందారమే. నిద్ర పోవాలనుకున్నప్పుడు తినేయి.”

ఆ కాయ తీసుకుని గది లోకి వచ్చాను.

ఆ కాయ తినాలనే అనుకుని ఒక్కసారి నా డైరీ గుర్తు తెచ్చుకున్నాను. కిటికీ లోంచి సముద్రం కనిపిస్తుంటే అనంతమనేది అనంతమైనా కళ్ల ముందరే ఉన్నప్పుడు కళ్ళు మూసుకుని నిద్రపోవటం ఎలా అనిపించింది..

ఆ అమ్మాయి దీపాలతో అలా తిరుగుతుంటే స్వయంగా ఒక జ్యోతి తిరుగుతున్నట్లనిపించింది!

పంచ శబ్ద ఉపాసన గురించి శిలా శాసనాలు, తామ్ర పత్రాలు ఎక్కడెక్కడ ప్రస్తావించాయా అని ఆలోచించాను. మొదటి జయకేశి దేవుడు గోపక పట్టణం (ఇప్పటి గోవా) లో 1053లో నిర్వచించాడు. అందులో

మలయదేశం, ఉలుక దేశం, గోకర్ణ తీర్థం, సౌరాష్ట్రం, గుర్జరం, లాట, స్థానక, కొంకణ, వైయిల్య, చిప్పలోన, సంగమేశ్వరం (రత్నగిరికి ఈశాన్య భాగం) ప్రాంతాల గురించి చెప్పాడు.

చరిత్ర సంగతి ఏమో, ఆ అమ్మాయి స్వరూపం నన్ను కదిలించింది. ఆ వినీల సముద్రం మీద అలా చంచలంగా జ్యోతులను పట్టుకుని నాట్యం చేస్తున్నట్లుంది. సముద్ర తరంగాలు శబ్ద తరంగాలతో కలిసి ఆడుకుంటున్నట్లున్నాయి. ఒక మెరుపు తీగ నిటారుగా నిలుచుని సాగరాన్ని వేదికగా ఎంచుకుని విన్యాసాలు చేస్తున్నట్లుంది. శబ్దం బ్రహ్మ రహస్యాన్ని ఛేదించే ‘తాళం’ అనిపించింది.

సృష్టిలో అన్నీ స్పందిస్తున్నవే. అన్నీ నర్తిస్తున్నవే. కొన్ని శిలలలా, కొన్ని ఆధార శిలల్లా, కొన్ని సూక్ష్మంగా, కొన్ని స్థూలంగా, మరికొన్ని ప్రదక్షిణ చేస్తూ, కొన్ని గ్రహాలలా, కొన్ని నక్షత్రాలలా..

నా భరత భూమి చరిత్ర యావత్తు సుందరమే. ఈశ్వర తత్వాన్ని ప్రతి ప్రక్రియలో దర్శించుకున్న భూమి నాది. శబ్ద బ్రహ్మన్ని ఉపాసించి నిశ్శబ్దంగా సాగిపోయేవాళ్లు నా వాళ్ళు..

ఆలోచనలు ఆత్మలో లీనమైనాయి. మనసు మౌనం వహించింది.

ఎందుకో నిద్ర పట్టేసింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here