పూచే పూల లోన-62

0
2

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[ఆ రాత్రి సుందర్‍కి నిద్రపట్టదు. జ్యోతికి అక్కడ మందు తయారవుతూంటుంది. చిత్ర పరిస్థితి ఏమిటో తెలియదని అనుకుంటాడు. లేచి కొద్ది సేపు పచ్చార్లు చేస్తాడు. ఎక్కడూ ఎవరో మూలుగుతున్నట్టు అనిపిస్తే, బయటకి వచ్చి చూస్తాడు. వరండా చివర ఒక వృత్తాకారంలో ఒంటి స్తంభం మేడ క్రిందకి వెళ్ళి నిలుచుంటాడు. దాని పైన ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అక్కడ కళ్ళు మూసుకుని ధ్యానముద్రలో ఉన్న పెద్దాయన పలకరించి, నిద్ర పట్టడం లేదా అని అడుగుతాడు. అవునంటాడు సుందర్. కూర్చోమని చెప్పి, పైన ఏం జరుగుతోందో తెలుసా అని అడుగుతాడాయన. తెలీదని సుందర్ చెప్తే, పంచ శబ్ద ఉపాసన జరుగుతోందని అంటాడు. పైకి వెళ్ళొచ్చా అని సుందర్ అడిగితే, వెళ్ళి చూసి, అయిదు నిమిషాల్లో వెనక్కి రమ్మని చెప్తాడాయన. అక్కుడున్న వాళ్ళ కళ్ళల్లో పడితే పంచభూతాల్లో కలిసిపోతావని హెచ్చరిస్తాడు. సుందర్ నెమ్మదిగా పైకి వెళ్ళి అక్కడ జరుగుతున్న ప్రక్రియని చూసి క్రిందకి వస్తాడు. ఎలా ఉందని పెద్దాయన అడిగితే, అద్భుతంగా ఉంది, కానీ అర్థం కాలేదని అంటాడు సుందర్. అది శక్తి ఉపాసన అనీ, అత్యంత రహస్యమైనదని అంటాడు. మరి నేను చూశాను కదా అని సుందర్ అంటుంటే, – నువ్వు కేవలం దృశ్యాన్ని చూశావు. అదృశ్యంలోనే అంతా ఉంది – అంటూ ఓ చిన్న కాయ ఇచ్చి, అదీ మందార పువ్వేననీ, తింటే నిద్ర వస్తుందని చెప్తాడాయన. అది తీసుకుని తన గదికి వచ్చేస్తాడు సుందర్. డైరీలో పంచ శబ్ద ఉపాసన గురించి తాను రాసుకున్న వివరాలు చదువుతూ నిద్రలోకి జారుకుంటాడు. – ఇక చదవండి.]

[dropcap]స[/dropcap]మీర్ నన్నూ ప్రత్యేకంగా ఒక డాబా మీదకి తీసుకొని వెళ్లాడు. ఒక టీపాయ్‌కి అటూ ఇటూ కుర్చీలున్నాయి. అటు నుండి నడుచుకుంటూ వచ్చాడు.

“ముందుగా వచ్చారు?” అన్నాడు.

“సినిమాకి టికెట్ దొరకదేమోనని!”

“ఏ సినిమాకి?”

“ఈ రోజు అసలు ఏం జరిగిందో మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నాను.”

కుర్చీ కొద్దిగా వెనక్కిలాగి కూర్చున్నాడు.

“ఎవరికి? ఎక్కడ? ఏమిటి?” అడిగాడు.

“ఇంత దూరం వచ్చాక జరిగినది తెలుసుకోకపోవటం తప్పు కదా?!”

“నిజమే. అన్ని చెబుతున్నాను. కానీ నా వెనక పోలీసులు ఎందుకు తిరుగుతున్నారన్నది నేను చెప్పలేదు.”

“అది నాకు తెలుసు.”

కళ్ళు పెద్దవి చేసాడు సమీర్. నేనే తిరిగి అన్నాను,

“నాకు ప్రత్యేకంగా తెలిసినదేమీ కాదు. అందరూ చెప్పుకునేదే.. సారిక మర్డర్.”

దీర్ఘంగా నిట్టూర్చాడు సమీర్.

“అదొక్కటే తెలుసుకుంటారా?”

ఆలోచించాను. సారిక అనే స్టార్‌ను హత్య చేసిన ఆరోపణ మీద ఇతని మీద గాలింపు ఉన్నదన్నది కిరణ్ చెప్పాడు. పేపర్లు అడిపోసుకున్నాయి, లోకం కోడై కూసింది. ఇతను అది చేసాడా అన్నది ఎవరికి అక్కరలేదు. అదంతా అలా ఉంచి సమీర్ అతని స్వగతం గురించి ఇప్పటికే చాలా చెప్పి ఉన్నాడు. ఒక నిజమైన హీరోగా కనిపించాడు. ఈ ఆరోపణ విషయంలో అతను చెప్పవలసినది ఖచ్చితంగా చాలానే ఉండగలదు.

నేను ఏదో మాట్లాడే లోపు అతనే అన్నాడు.

“సార్, ఈ కేసులోంచి బయట పడటానికి నేను మిమ్మల్ని ఇప్పటికే సహాయం కోరి యున్నాను..”

“ఎలాగ, ఎలాంటి సహయం అన్నది నాకు అర్థం కావటం లేదు.”

“ఆ సందర్భంలోనే పూర్తి కథ మీకు చెప్పాలి. మీరు నమ్మక పోయినా నేను చెప్పాలి.”

“ఇదే సమస్య..” అన్నాను, “..మృత్యువు అంటే నాకు భయం లేదన్నాడొకాయన.”

“మీరేమంటారు?”

“భయం ఉన్నా లేకపోయినా మృత్యువు తన పని అది చేసుకుని పోతుంది.”

“దీనిని బట్టి, మీకు నమ్మకం ఉన్నా లేకపోయిన ఒక పని అవ్వాలి అంటారు.”

“ఒక విధంగా.”

“అలా సముద్రం వైపు చూడండి.”

అటు తిరిగాను. దృశ్యం బాగుంది. దూరంగా ఆకాశం సముద్రాన్ని తాకుతున్నట్లున్న చోట ఒక మేఘం ఏదో ఒక స్థలాన్ని ఎంచుకొన్నట్లు అక్కడ కురుస్తోంది.

“బావుంది.”

“బావుంటుంది చూడటానికి. అక్కడి అనుభవం అక్కడి వరికే. కానీ వ్యక్తిగతంగా చూస్తే అతను ప్రదర్శిస్తున్న దృశ్యం అందరికి మనోరంజకంగా ఉంటుంది. వాడు పడుతున్నది, పడ్డది ఈ పోలీసులు పెట్టే హింసలకు పదింతలుంటుంది.”

“కరెక్ట్.”

“ఆ హింసలో సగం అసలు సినీరంగంలోకి వచ్చే మందర రావాలా వద్దా అనే అంశం దగ్గర పడ్డాను.”

“మీరు ప్రయత్నించారా లేక ఎవరైనా మిమ్మల్ని అడిగారా?”

“నేను, జోవాక్విమ్ కలిసి ఒక కారు రిపేరు షెడ్ నడుపుతున్న రోజులవి. అదే సమయంలో ఎలా సంపాదించాడో డాఫోడిల్స్ థియేటర్ సంపాదించాడు. కానీ మేము షెడ్‌లో ఎవరు లేనప్పుడు అతడు గిటార్ వాయించటం, నేనేదో ప్రదర్శన ఇవ్వటం జరిగేది..” సమీర్ చెప్పటం ప్రారంభించాడు.

***

గిటార్ వాయిస్తున్న జో ఒక్కసారిగా ఆగిపోయి

“మన ఇద్దరిలో పిచ్చివాడు ఎవరు?” అన్నాడు.

“నీ మనసుతో నువ్వు మాట్లాడుకుంటావా?” అడిగాను.

“యస్.”

“మరి నువ్వే పిచ్చివాడివి.”

“ఓ మరి నీ మనసుతో నువ్వు ఎన్నడూ మాట్లాడవా?”

“నెవర్.”

“ఎందునికి?”

“అది నాకు చెప్పినది నేను చెయ్యటమో లేక నేను చెప్పినది అది చెయ్యటమో జరుగుతుంది. ఇద్దరం ఏ రోజూ మాట్లాడుకోము.”

“నేను గిటార్ వాయిస్తే, డాన్స్ వేస్తావా?”

“ఓ.”

అతను ఒక ట్యూన్ వాయించాడు. నేను మాటలు చేర్చాను.

‘గరీబోడిదీ నాటకం, గరీబోడితోనే నాటకం

పరణాలు లేవూ, సరదాలు లేవు

వరదలా పారే పేదరికం

గరీబోడిదీ నాటకం, గరీబోడితోనే నాటకం’

నలుగురైదుగురు పోగయ్యారు.

జూ గిటార్ ప్రక్కన పెట్టాడు.

“లేడీస్ అండ్ జెంటిల్‍మెన్..”, అందరి వైప తిరిగి చెప్పాడు, “నా ప్రక్కనున్న ఇతను మీరనుకుంటున్నట్లు మనిషి కాడు. ఆలోచించడు. నేను మనసుతో మాట్లాడకుంటాను కాబట్టి నేను పిచ్చివాడిని. ఇతను అలా చెయ్యడు. కానీ మంచివాడట.”

“అదేంటి?” ఓ అమ్మాయి అడిగింది. “మనసుతో మాట్లాడలేని వాడు, ఆలోచన లేని వాడు మంచివాడెందుకవుతాడు?”

“మీకు పెళ్లయిందా?” జో అడిగాడు.

“లేదు.”

“బోయ్ ఫ్రెండ్ ఉన్నాడా?”

“ఉన్నాడు.”

“ప్రేమించుకుంటున్నారా?”

అమ్మాయి సిగ్గుపడింది. అందరూ నవ్వారు.

“అయితే చెప్పు, నీ స్నేహితుడు ఏమీ ఆలోచించకుండా నీ మాట వింటాడా?”

“..వింటాడు.”

“అంటే మంచివాడు కదా?”

అందరు నవ్వారు.

“లేడీస్ అండ్ జెంటిల్‍మెన్.. ఇతనూ అంతే” అని చెప్పి, “ఇలా రా..” అంటూ నన్ను దగ్గరకు తీసుకున్నాడు. ఒక స్టూల్ మీద కూర్చోపెట్టాడు.

“ఎక్కడించి వచ్చావు?”

నేను వెంట్రిలాక్విసమ్‌లో బొమ్మలా అటూ ఇటూ తల తిప్పాను.

“చెప్పు, మాట్లాడు.”

చిత్రమైన కంఠాన్ని తెచ్చుకొని చెప్పాను.

“అప్పుడే పూచిన పువ్వును ఎక్కడినుంచి వచ్చావని అడిగితే ఏం చెబుతోంది?”

“ఓ! నీకు పూవు వికసించినట్లు తెలుసు. కానీ ఎలా అన్నది తెలియదు.”

“తెలియదు. ఎవరికీ తెలియదు.”

అందరూ ఒకళ్ళ మొహలొకళ్ళు చూసుకున్నారు. ఆ ప్రక్కగా ఎవరో బైక్ మీద వెళ్తూ ఆగారు.

“ఏం చేస్తూ ఉంటావు?”

“నిరుద్యోగం చేస్తూ ఉంటాను.”

అందరూ నవ్వారు.

“నిరుద్యోగం అంటేనే ఉద్యోగం లేదని, నిరుద్యోగం చెయ్యటం ఏంటి?”

“ఎవరి చేతిలోకైనా వెళ్లిపోయి ఆటబొమ్మలా ఆడటం నా నిరుద్యోగం. నేను ఆడను. ఉద్యోగులు నీలాగా స్టైల్‌గా ఆడతారు.”

“నీకు స్టైల్ లేదా?”

“స్టైలూ లేదు, స్టేటస్ కూడా లేదు.”

“మరి నీలో ఏముంది?”

“స్టేట్ ఆఫ్ మైండ్ ఒక్కటే ఉంది.”

“ఏం చదువుకున్నావు?”

“నన్ను చదవలేని వాళ్లని చదివాను.”

“నువ్వు ఏ రకం బొమ్మవి?”

“పైవాడు గీసిన పిచ్చిగీతలలోని మోడర్న్ ఆర్ట్‌ని.”

అందరూ నవ్వారు.

జో దగ్గరికి వచ్చి మెల్లగా అడిగాడు, “దిష్టిబొమ్మవా?”

“అవును. ఆ అమ్మాయి ఎవరో చాలా బాగుంది. దగ్గరకి వచ్చి దిష్టి తీయమని చెప్పవా?”

ఆ అమ్మయి మొహం మీద చెయ్యి పెట్టుకుంది.

“నీకు దిష్టికొట్టే వారెవర్రా, నువ్వే దిష్టిబొమ్మవి.”

“నేను బొమ్మలా మిగిలిపోయాను. అసలు సిసలు భారతీయి ప్రతిభ బజారులో కలసిపోగా, ఇలా మిగిలాను. ఇంతకీ నీకేమి కావాలి?”

“నాకు ప్రత్యేకంగా ఏమీ అక్కరలేదు. ఇక్కడ ఎవరికైనా ఏదైనా అమ్మిపెట్టాలంటే మార్కెటింగ్ చెయ్యగలవా?”

“ఓ యస్.”

అందరి మధ్యలోంచి ఓ పెద్దయిన ఇవతలకి వచ్చాడు. కోటు తొడుక్కున్నాడు. చేతిలో సిగరెట్ ఉంది. జో ని దగ్గరకి పిలిచాడు.

“ఈ బొమ్మను నాకు అమ్ముతావా?” అని గట్టిగా నవ్వాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here