పూచే పూల లోన-63

0
2

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[సమీర్ సుందర్‍‌ని ప్రత్యేకంగా ఒక డాబా మీదకి తీసుకువెళ్తాడు. ఆ రోజు అసలేం జరిగిందో మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నానని అంటాడు సుందర్. తన వెనుక పోలీసులు ఎందుకు తిరుగుతున్నారనేది తాను చెప్పలేదని సమీర్ అంటే, కారణం తనకు తెలుసునని అంటాడు సుందర్. తనకి ప్రత్యేకంగా తెలిసినదేమీ కాదనీ, అందరూ చెప్పుకునేదేననీ, సారిక మర్డర్ అనీ చెప్తాడు సుందర్. ఈ కేసులోంచి బయటపడడానికి తాను ఇప్పటికే సుందర్ సాయం కోరానని అంటాడు సమీర్. అదెలాంటి సాయమో తనకి అర్థం కాలేదంటాడు సుందర్. తన కథ పూర్తిగా వింటే తెలుస్తుంది అంటూ చెప్పడం మొదలుపెడతాడు. జో తానూ కలిసి కారు షెడ్ నడుపుతున్న రోజుల్లో – తాను ఓ ప్రదర్శన ఇస్తున్నానని, అప్పుడు జో కట్టిన ట్యూన్‍కి తాను మాటలు చేర్చి పాటగా మార్చానని చెప్తాడు. గిటార్ పక్కన పెట్టి, అక్కడ చేరిన వారితో మాట్లాడాతాడు జో. సమీర్‍ని ఓ బల్ల మీద కూర్చోపెడతాడు. వెంట్రిలాక్విసమ్‌లో బొమ్మలా – జో అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్తుంటాడు సమీర్. జనం మధ్యలోంచి కోటు తొడుక్కున్న ఓ పెద్దయిన ఇవతలకి వచ్చి జో ని పిలిచి – ఈ బొమ్మని నాకు అమ్ముతావా అని అడుగుతాడు. – ఇక చదవండి.]

[dropcap]“ఇ[/dropcap]ది బొమ్మ కాదు.”

ఆయన దగ్గరగా వచ్చాడు.

“బొమ్మే.”

“కాదు.”

“మరి?”

“మా సమీర్.”

“మీ సమీర్?”

“అవును. అజరామరమైన ప్రతిభ.”

అయన గెడ్డం గోక్కున్నాడు.

“ఊ. మీరూ నమ్మించారు, నేను నమ్మలేనట్లు నటించాను. ఎలా ఉంది?”

అందరూ నవ్వారు. జో కూడా నవ్వాడు. నేను క్రిందకి దిగి నిలబడ్డాను.

“ఓకే..” అన్నాడాయన. “..నాతో పని చేస్తావా?”

“ఏం పని?” అడిగాను.

ఆయన తన కార్డు తీసి ఇచ్చాడు.

దాని మీద రజనీశ్ అని ఉంది. జాగ్రత్తగా చూసాను. ఈయన పేరు మోసిన సినీ దర్శకుడు. మొదటిసారి ఇలా చూస్తున్నాను.

జో కార్డు లాక్కుని చూసాడు.

“సార్..” అన్నాడు, “..బొమ్మ అయితే ఒక ధరకు ఇచ్చేస్తాం. మీరు ఒక కళాకారుడిని అడుగుతున్నారు.”

“నేను అమ్మమని అనటం లేదు.”

“మరి?”

“నా సినిమాలో నటిస్తావా అని అడుగుతున్నాను.”

ఇద్దరం ఒకరి మోహలొకళ్ళు చూసుకున్నాం.

మరి కొద్దిమంది జనం మూగారు. ఈయనను వింతగా చూస్తున్నారు. కొందరు గుసగుసలు చెప్పికుంటున్నాయి.

“తొందర లేదు..”, ఆయనన్నాడు. “..ఆలోచించకుని నిర్ణయం తీసుకోండి. ఈ రజనీశ్ ఎవరినీ ఎన్నడూ అడగడు. అడిగితే ఒక్కసారే అడుగుతాడు. నెల రోజులే ఆగుతాడు. ఉంటాను.”

***

షెడ్ బయట జోరుగా వాన కురుస్తోంది

“వెళతావా?”, జో అడిగాడు.

“నువ్వు చెప్పు.”

“అది మాయా ప్రపంచం.”

“కరెక్ట్.”

“వెళ్లాక తిరిగి రాగలవా?”

“ఎందుకు రాలేను?”

“ఎవరూ రాలేదు.”

“చక్రవ్యూహమా?”

“అంతే.”

జో ఎందుకో నా దగ్గరకొచ్చి తల నిమిరాడు.

“నన్ను వదిలేస్తావా?” అడిగాడు.

నేను ఏమి మాట్లాడలేదు. నాకు పిచ్చిపిచ్చిగా ఉంది. సినిమాలో నటించటం అంటే అప్పటికి సామాన్యమైన విషయం కాదు. నేను చేయగలనా? ఆ ప్రపంచం నన్ను నమిలి మింగేస్తే?

“చెప్పు బాబూ..”, జో రెట్టిస్తున్నాడు.

బయట వాన పిచ్చి పిచ్చిగా దంచి కొడుతోంది. షెడ్ షట్టర్ సగం తెరచి ఉంచాం. కొద్దిగా నీరు లోపలికి చేరుతోంది.

రోజూ ఈపాటికి చేతిలో మిగిలిన దానితో కావలసినది తిని గాలి పాట పాడుకుంటూ హాయిగా నిదుర ఒడిలోకి జారిపోతాను. జో బాటిల్ ఖాళీ చేసి రెండు కాళ్లూ గోడ మీదకి అని, చక్కగా ఏదో గుర్తుకు వచ్చి నవ్వుకుంటున్నట్లు పడుకుంటాడు.

ఈ రాత్రి నిదుర పట్టదు. అలా జారి వచ్చిన నీటిలోకి ఒక కప్ప వచ్చి గెంతుతోంది..

ఈ సాయంత్రం మా దినచర్యను చెడగొట్టేందుకు ఆయన ఎక్కడి నుండి దాపురించాడా అనుకున్నాను.

“బాబూ..”, జో చెబుతున్నాడు, “..నీకు రకరకాల విద్యలు వచ్చు. కర్రసాము చేతవును, వీరమణి మనుషులు ఎన్నో నేర్పారు..”

“అయితే?”

“నన్ను వదిలేస్తావా?”

అర్థం కాలేదు. జో నవ్వాడు. ఓ గుటక మ్రింగాడు.

“బాబూ, నువ్వు హీరోవే. అందంగా ఉంటావు. ఆలోచించావా?”

మామూలుగా మా షెడ్‌లో ఒక పాత లారీ టైర్ పడి ఉంటుంది. అందులో ఎప్పుడు కొంత నీరు చేరి ఉంటుంది. నా కుర్చీ అక్కడి దాకా లాక్కుని రెండు కాళ్లూ అందులోకి దింపాను.

“నేను హీరోనే” అన్నాను.

“కరెక్ట్.”

“నిన్ను వదలను.”

విచిత్రంగా చూసాడు జో.

“తెర మీద కనిపించే వాళ్ళు ఎంత మంది జీవితంలో యుద్ధం చేసారు?”

“తెలియదు. నేను చేస్తూనే ఉన్నాను.”

“నన్ను వదలి చేస్తావా?”

“వదలను.”

గట్టిగా నవ్వాడు.

“అదేం హీరోవి? హీరో ఎప్పుడు ఒంటరివాడే.”

“నిన్ను తీసుకుని వెళతాను జో.. నా వల్ల కాదు.”

నా వెనకాల ఉన్న గట్టు మీద కూర్చుని అదే టైరులోకి అతని కాళ్లు కూడా జాపాడు.

“ఈ ప్రాంతం ఖాళీ కాకూడదు. మన ఊరు, మన మట్టి ఒక హీరో వలన బాగుపడాలి.”

ఒక తండ్రి తన పిల్లవాడిని ఒడి లోకి చేర్చుకుని బుజ్జగిస్తూ చెబుతున్నట్లు అనిపించింది.

“నన్ను ఇక్కడ వదలి వెళ్లు. నన్ను వదలకు.”

వాన ఆగిపోయింది. చల్ల గాలి పీల్చుకుందామాని ఇద్దరం బయటకొచ్చాం.

“అవకాశం వదలకు..”, గంభీరంగా చెప్పాడు జో. “..ఆయన ఎందుకు అడిగాడో, ఏమి కావాలో నీకు ముంబయి వెళితే కాని తెలియదు. రజనీశ్ సామాన్యమైన వాడు కాడు. గొప్ప గొప్ప వాళ్లని తయారు చేసాడు. ఎన్నో ఆటలు ఆడిన వాడివి. ఇది కూడా ఆడి చూడు. నీ వెనక నేనొక్కడినే కాదు, అనంతమైన చరిత్ర గల గోవా ప్రజలందరూ నీకు అండగా ఉన్నారు. కమాన్..”

వీపు మీద తట్టాడు. దూరంగా ఓ విమానం లైట్లు మెరిపిస్తూ ఎటో పోతోంది. నేను ఎటు పోతున్నాను.. వింతగా తోచింది.

***

ముంబయి చేరుకున్నాను. అది చాలా పెద్ద స్టూడియో. రజనీశ్ గారి ఆఫీసు వరకు చేరేసరికి శరీరం పులిసిపోయి ఉంది. ఆఫీసులో ఎవరూ లేరు. ఎక్కడో హర్మోనియమ్ వినిపించి అక్కడికి వెళ్లాను. లోపల ఏదో పాట తయారవుతున్నట్లుంది. లోపలికి వెళ్లాను. ఓ పది మంది ఏ ట్యూన్ కోసమో కుస్తీ పడుతున్నట్లున్నారు. హార్మోనియమ్ పెట్టుకున్న మనిషి తల పట్టుకున్నాడు.

“ఈ చాయ్ తెచ్చే వాడిని తలుపు మూయమంటే మూయడు,” అన్నాడు.

నేను గబ గబా వెళ్లి తలుపు మూసాను.

“గుడ్.. అన్నాడాయన. “..నువ్వెవరో గానీ బయిటకు వెళ్లి మరల ఆ పని చెయ్యి, ఇలా లోపలికి దూరిపోవటం కరెక్ట్ కాదు.”

బుద్ధిమంతుడిలా జేబులో జాగ్రత్తగా దాచుకున్న కార్డు అతనికి ఇచ్చాను. నన్ను క్రిందా మీద చూసాడు.

“వంద మంది కలిసి ఇలా రెండు వందల కార్డులు ప్రింట్ చేసుకుంటారు.”

అందరూ నవ్వారు.

“బాబూ..”, ఓ కుర్రాడన్నాడు. అతను కార్డు లాక్కున్నాడు, “..ఇందులో ఒక నంబరుంది చూడూ, బయటకెళ్లి ఒక రూపాయి కాయిన్ వాడుకుని దానికి ఫోన్ చెయ్యి, అక్కడి నుండి ఏ జవాబు వస్తుందో దాని బట్టి ప్రొసీడ్ అయిపో. గుడ్ లక్.”

కార్డు తీసుకుని వెనుదిరిగాను.

“పచ్చి బూతులు వినిపిస్తే ఎందుకైనా మంచిది, వ్రాసుకో.”, వెనక నుండి వినిపించింది.

“సినిమా పాటకి పనికి రాగలవు.”

మాట్లాడకుండా ఇవతలకి వచ్చి ఆ పబ్లిక్ బూత్ దగ్గిర లైన్‌లో నిలబడ్డాను. పొరపాటుగా ఈ ఊరు వచ్చానా అనుకున్నాను. ఈ అర్థవంవంతమైన పని చేసి బయలుదేరాలని నిర్ణయించుకున్నాను. కాయిన్ వేసి మాట్లాడాను.

“సార్..”

“చెప్పండి.”

“సార్, నేను సమీర్‌ని మాట్లాడతున్నాను.”

“ఎవరు?”

“సమీర్. మీరు గోవాలో నాకు ఈ కార్డు ఇచ్చి కలవమన్నారు.”

కొద్ది సేపు ఏమీ వినిపించలేదు.

“హలో..”

“ఆ.. హలో.. చెప్పండి.”

“గోవాలో..”

“చూడు, నేను రజనీశ్ గారి సెగట్రీని. సార్ గోవా వెళ్లిన మాట నిజమే. కానీ ఇలా ఎప్పుడు ఎవరికీ కార్డు ఇవ్వరు. ఇంతకీ ఏం కావాలి?”

“సార్‌ని కలవాలి.”

“సార్ షూటింగ్‌లో ఉన్నారు.”

“అక్కడికి ఎలా వెళ్లాలో కాస్త చెబుతారా?”

“ఎక్కడన్నారు?”

“పబ్లిక్ బూత్.”

“పిచ్చివాడా చాలా ఉన్నాయి. ఏ బూత్?”

“గేటు దాటి ఇక్కడ పాడుబడ్డ ఇల్లు సెట్టింగ్ దగ్గిర..”

అతను నవ్వాడు.

“పాడుబడ్డ ఇల్లే అది. సెట్టింగ్ కాదు. నువ్వు తిన్నగా పావుగంట నడుచుకుంటూ రా. అక్కడ మూడు యూనిట్లుంటాయి. మూడో యూనిట్ దగ్గర కొచ్చి డోర్ దగ్గర ఎవరికైనా చెప్పు.”

“మీ పేరు చెబుతారా సార్?”

ఫోన్ కట్ అయిపోయింది. పబ్లిక్ బూత్ క్రిందకి వచ్చి ఆ పాడబడ్డ ఇంటి లోకి తొంగి చూసాను. కేవలం తుండు గుడ్డలు పరుచుకుని ఇద్దరు హాయిగా నిద్రపోతున్నారు.

అటునుండి వస్తున్న ఒకరిని అడిగాను,

“సార్, యూనిట్ మూడు ఎక్కడండి?”

అతను తన వెనక్కి చూపించాడు.

“అలా వెళ్లు, అలా పో.. అలా వెళ్లిపో.. అలా వెళ్లి.. అలా వెళుతూ పో.. పో.. ..వెళ్లిపో!”

ఎందుకో నవ్వుతూ వెళ్లిపోయాడు. బహుశః దెబ్బ లేదా దెబ్బలు తిన్న రచయిత అయి ఉంటాడు అనుకున్నాను..

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here