పూచే పూల లోన-7

0
2

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[ఓ రోజు సుందర్‍కి చిత్ర ఫోన్ చేస్తుంది. సుందర్ ఫోన్ ఎత్తి కొన్ని క్షణాలు మాట్లాడాకా, తన ఎదురుగానే కనిపిస్తుంది చిత్ర. టీ చెప్పనా అని సుందర్ అడిగితే, వైట్ చర్చ్ దగ్గర  కామత్‍కి వెళదామని అంటుంది. కార్లో అక్కడికి వెళ్తుంటే, మీతో పనుందని, ఒక అమ్మాయిని పరిచయం చేయాలని అంటుంది. ఆమె కూడా రచయిత్రి అనీ, మొదటిసారి సమావేశం హోటల్లో పెట్టుకుంటే బాగుంటుందని ఇక్కడికి రమ్మని చెప్పానని అంటుంది.  హోటల్ దగ్గర స్వీట్ షాప్ ముందు ఓ అమ్మాయి నిల్చుని ఉంటుంది. ఆమె జ్యోతి. చిత్ర ఇద్దరినీ ఒకరికొకరిని పరిచయం చేస్తుంది. ముగ్గురూ హోటల్ లోకి వెళ్తారు. మాటల సందర్భంలో జ్యోతి తన గురించి చెబుతుంది. తాను గోవాలో ఎమ్.బి.ఎ. చేయటానికి వచ్చాననీ, అలా అనీ ఈ మధ్యనే కాలేజీ నుంచి పాసవుట్ అయిన దానిని కాదని అంటుంది. ఈ మధ్యనే రచనలు చేస్తున్నానని చెప్పి, తమది హైదరాబాద్ అని చెప్తుంది. మాధవ్ అనే వ్యక్తి మీ బంధువా అని సుందర్‍ని అడుగుతుంది. అవునంటాడు. అతను జైల్లో ఉన్నాడని అంటుంది జ్యోతి. విడిపించాలా అని అడుగుతాడు సుందర్. జైల్లోకి వెళుతూ అతను మీ పేరూ, నంబరూ ఆ ఎస్.ఐ.కి రాసి ఇచ్చాడని సుందర్‍కి చెబుతుంది జ్యోతి. ఇక్కడ జైల్లో ఉన్నాడా అని ఆశ్చర్యపోతాడు సుందర్. మాధవ్, తానూ ఒకే కాలేజీలో చదివాం అనీ అంటుంది జ్యోతి. తాను రాస్తున్న పుస్తకం పేరు చెబుతుంది. ఆసక్తిగా ఉందంటాడు సుందర్. మాధవ్‍ని జైలు నుంచి విడిపిస్తే, తాను అతన్ని చంపాలని అంటుంది జ్యోతి. ఇక చదవండి.]

[dropcap]స[/dropcap]మీర్ కారు నడుపుతుంటే ఏదో బోట్‍లో అలా నీటిపై తేలుతూ వెళ్ళిపోతున్నట్లుంటుంది. కేవలం తన కుడి చేతితో అలా తిప్పేస్తూ ఉంటాడు. ఎక్కడా జెర్కులుండవు. పైకి వెళుతున్నపుడు ఎస్కలేటర్ మీద ఉన్నట్టు, క్రిందకి అలా ఆ లోతుల్లోకి వెళుతుంటే ఏదో జెయింట్ వీల్ మీద కూర్చుని అలా జారిపోతున్నట్లుంటుంది. చుట్టూతా ఉన్న ప్రకృతి తెలియని ఉత్సాహాన్ని తెచ్చిపెడుతోంది. వర్షానికి తడిసిన చెట్లు ఇక చాలన్నట్లు ఉదయించిన సూర్యుని వేడిని స్వాగతిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఇంత దట్టంగా పెరిగిన అడవుల మధ్య ఒక చిన్న ఇల్లును చూసినప్పుడల్లా ఆశ్చర్యం కలుగుతుంది. ఎవరు వీళ్ళు? ఎలా ఉంటారు? ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్ళి వస్తూ ఉంటారు?

“జీవితం అంటే ఏంటి సార్?” ఉన్నట్లుండి అడిగాడు సమీర్.

“మనకు దొరికిన కాలం” అన్నాను.

ఒక హెయిర్ పిన్ బెండును ఎంతో సునాయాసంగా దాటించి తిరిగి సూటిగా ఉన్న రోడ్డు మీదకి తెచ్చాడు సమీర్.

“ఇంకో మాట చెప్పండి”

“ఇదేం బేరం సార్?”

నవ్వాడు. నిజమే. మనం ఏం చెప్పుకున్నా, ఎన్ని వ్యాఖ్యానాలు చేసుకున్నా జీవితం జీవితమే. దానికే తెలియలి అదేవిటో, అదలా ఎందుకు ఏర్పడుతుందో..

“బేరమే అనుకోండి. రాజీ పడడం అంటే బేరం కుదుర్చుకోవటమే కదా?”

“నిజమే”

“చెప్పండి”

“ఏంటి?”

“జీవితం అంటే ఏంటి?”

ఏదో చెప్పాలనుకుంటున్నాడు. మరేదో చెప్పించాలనుకుంటున్నాడు. ఇక్కడ అరటి చెట్లు చిన్నగా ఉండి పెద్ద ఆకులతో కనిపిస్తున్నాయి.

“జీవితం అంటే.. కాలమనే పండుగను సకాలంలో జరుపుకోవటం”

“ఓ..”

“ఇది ఓకేనా?”

“ఊ.. మీ ఆలోచనలతో పండుగ చేసుకుంటున్నారు”

“ఇంతకీ ఎక్కడికి వెళుతున్నాం సార్?”

చిన్నగా తల ఆడించాడు. కారు స్పీడు తగ్గింది. ఓ చిన్న మలుపు తీసుకుని ఆపాడు. ఇద్దరం దిగాం. ఆ ఎత్తు మీది నుంచి ఎక్కడో దూరంగా ఓ నదిలా కనిపిస్తోంది.

“ఈ నది పేరు?” అడిగాను.

“కుశావతి. ఇది మరో నదికి పాయ. కానీ ఈ ప్రాంతానికి ప్రాణం. మరి కొంతసేపు ప్రయాణం చేశాకా ఓ బ్రిడ్జ్ వస్తుంది. అక్కడ ఇంకా బాగా చూడవచ్చు.”

“బాగుంది”

“ఇంకా ఏం కనిపిస్తోంది?”

“ఏముంది? ఎక్కడ చూసినా ఇలానే ఉంటుంది ఇక్కడ ఏ ప్రాంతమైనా..”

చెయ్యి అడ్డు పెట్టాడు. సిగరెట్ ముట్టించాడు.

“కరెక్ట్. అందరూ అలాగే ఉంటారు. ఒకలాగే ఉంటారు. కానీ అందరూ ఒకరేనా?”

“కాదు”

“ఇదీ అంతే”

“సరే, ఏముందో చెప్పండి”

“నదికి ముందర భూమి రంగులు మారినట్టు కనిపిస్తోందా?”

జాగ్రత్తగా చూసాను. నిజమే. ఏదైనా పరికరం ఉంటే ఇంకా జాగ్రత్తగా చూడవచ్చు.

“ఒకప్పుడు ఈ నది అదుగో అక్కడి వరకూ ఉండేది.”

“ఓ..”

“అవును. ఇప్పుడు.. ఇప్పుడు కాదు, దాదాపు నలభై ఏండ్లగా ఆ నది ఇటు ప్రవహించటం మానేసింది. దానికి బలమైన కారణం ఉంది”

గబగబా కారెక్కాడు. నేను లోపలికొచ్చి తలుపు వేసాను. ముందుకు వెళుతున్నాం. అతను చెబుతున్నాడు..

“ఆంగ్లంలో మైన్ అంటే నాది.. అవునా?”

“అవును”

“మైన్ అంటే గని కూడా”

“అవును”

“నాది అనే ప్రతీదీ గని అవుతుందా?”

“చెప్పటం కష్టం”

“అన్నీ నావే అనుకుంటూ మైనింగ్ చేసేస్తే మిగిలేది ఏది?”

“ఏమీ మిగలదు”

“రచయితలా మాట్లాడండి సార్”

“అంటే?”

“నీది అన్నావు కాబట్టి ఎవరిదీ కాదు నాది అంటుంది ఈ ప్రకృతి. అక్కడితో కథ కంచికెళుతుంది”

“బావుంది. అంతా అక్రమమైన మైనింగ్”

“అలా ఎలా అంటాం? కాగితం మీద ఈ సమస్య ఉంది అని చెబుతారు. అనుమతి నిరాకరించరు. నాలుగు రోజులయిన తరువాత మైనింగ్ ప్రారంభమైపోతుంది”

కారు బ్రిడ్జ్ మీద ఆగింది. కారులోంచే చూపించాడు సమీర్.

“అటూ ఇటూ చూడండి. ఈ నదీ జలాల రంగు ఇటు ఒకలాగా, అటు ఒకలాగా ఉంది. అవునా?”

నిజమే. ఒక వైపు తగరపు రంగు స్పష్టంగా ఉంది. మరొక వైపు రంగు తగ్గి మరోలా కనిపిస్తోంది.

“ఈ భూమిలో మేంగనీజ్, బాక్సైట్ విరివిగా దొరుకుతాయి. ఆ రెండు ఖనిజాలు ఇక్కడి జనాలను పూర్తిగా రోడ్డు మీదకు తెచ్చాయి”

“ఈ ప్రాంతంతో మీ అనుబంధం గొప్పది సార్”

“నేనూ అందుకే రోడ్డు మీదకి వచ్చాను”

ఈయనకేం? ఓ గొప్ప పారిశ్రామికవేత్త బిడ్డ కదా?

“అదేంటి?” అడిగాను.

కారు ముందుకు దూకుతోంది.

“చెబుతాను. ఇంత దూరం వచ్చి, మిమ్మల్ని తీసుకొచ్చి, చెప్పకుండా ఉంటానా? కానీ దానికంటే ముందు మనం వెళుతున్నది ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించే ప్రదేశం..”

దాదాపు పావుగంట తరువాత ఓ చిన్న పల్లెటూరులో ఆగాం. అక్కడే ఓ చిన్న టీ షాపులోకి వెళ్ళి కూర్చున్నాం. టీ చెప్పాడు సమీర్.

“ఈ ఊరు పేరు రివోనా” అన్నాడు.

నాకు గోవాలో ఒక్క విషయం మటుకు అర్థం కాలేదు. ఎక్కడ చూసినా అక్కడక్కడ నాలుగిళ్లు, కొండలు, దారులూ ఉంటూనే ఉంటాయి. ఇది ఈ ఊరు, అది ఆ ఊరు అని అనుకునేందుకు రూఢిగా ఏదీ కనిపించదు.

“రివోనా” అన్నాను.

“అవును. ఈ పేరెలా వచ్చిందో తెలుస్సా?”

“ఏదో కథుంటుంది”

“కథా.. పోనీ అలా అనుకోండి. ఇది ఋషి వనం!”

చుట్టూతా పరికించి చూసాను. ఇది ఆలోచించాలి అని అర్థమైంది. ఈ సమీర్ సామాన్యుడు కాడు. చక్కని సూటూ బూటూ వేసుకుని అందంగా ఓ సన్నని కర్ర పట్టుకుని టేబుల్ మీద బంతులను మృదువుగా కొట్టి అటూ ఇటూ తిరుగుతూ బిలియర్డ్స్ ఆడటం ఒక ఎత్తు. మట్టిలో దొరలుతూ, పడుతూ, లేస్తూ, చుట్టూతా ఉన్న వాళ్ళని సద్దుకుంటూ గీత అవతల ఉన్నవాళ్ళని గమనిస్తూ ఊపిరి బిగబడుతూ కూత కూస్తూ కబడ్డీ ఆడడం ఒక ఎత్తు.

మామూలు జీవితాన్ని విస్మరించి ఋషులు అడవుల లోకి వెళ్ళి తపస్సు చేసారా లేక జీవితాన్ని మరింత గాఢంగా అర్థం చేసుకునేందుకు అలా చేసారా? జీవితం అంటే, ప్రాణం అంటే ఎటువంటి భయం లేదు కాబట్టి క్రూరమృగాల చెంతన నిర్భయంగా సత్యాన్ని శోధించారా?

టీ వచ్చింది.

“అంటే ఇక్కడ ఋషులుండేవారన్న మాట”

“ఇక్కడంటే ఇక్కడ కాదు. మరి కాస్త దూరంలో కొన్ని గుహలున్నాయి. కుశావతీ నదీ తీరం ఒకప్పుడు గొప్ప తపస్సుకు పేరు. ఆ ప్రాంతంలో సహజంగానే కొన్ని గుహలు, అక్కడక్కడ కొన్ని సరస్సులు ఏర్పడి ఉన్నాయి. అవి ఋషులు నిర్మించినవని కొందరు, బౌద్ధ భిక్షువులు ఏర్పాటు చేసుకున్నవని కొందరు చెబుతారు. ఏది ఎలా ఉన్నా ఋషులు బుద్ధుని కంటే పాతవారు..”

టీ త్రాగి కారెక్కాం. మనసులో ఎక్కడో ఆ ప్రాంతం పట్ల అనుబంధం పెరుగుతోంది. మధుకర్ గవరె తన పుస్తకంలో ఇలాంటివి ఎన్నో ఉదహరించి వివరించాడు. సమీర్ కారు మెల్లగానే నడుపుతున్నాడు. ఎ.సి. ఆపేసి కిటికీ అద్దాలు క్రిందకి దింపాడు. ఒక రంగుల కల ఏ హంగులతో పని లేదని చెబుతూ నిజాలతో నీకేంటి పని అని రకరకాల చిరునవ్వులతో ఆ  పక్షుల స్వరూపాలను ఆ చెట్ల మధ్యలోని పచ్చిక రూపంలో నిక్కచ్చిగా ఒకరు చెక్కటం కాదు, వెతికితే ఈ శిల్పంలో నేను నీకు చిక్కగా అని చక్కగా చెబుతున్నట్లుంది. సన్నగా చినుకులు ఆకుల మీద వ్రాలుతున్నాయి. ఏవో జంతువుల కూతలు ఆ సన్నని చినుకులను పలుకరిస్తున్నాయి. అక్కడక్కడ ఓ మెరుపు మెరుస్తోంది. మట్టిని మించిన గంధం లేదు. పంచ తన్మాత్రలు గంధంలోనే కలుస్తాయనిపించింది. ఈ పవిత్ర భూమిని దాటి మరో అంతరిక్షం ఏదీ లేదని అర్థమైంది!

ఋషుల వల్ల భూమి పవిత్రమైనదా? ఈ భూమి ఉనికి గురించి నిరంతరం మననం చేసుకోవటం వలన, అంతర్ముఖులైనందుకు ప్రాణశక్తి మరింత పవిత్రమైనదా? అటూ ఇటూ చూస్తున్నాను. కాదు, కాదనిపించింది. స్థావర జంగమాలకూ సమానంగా ప్రాణశక్తిని ప్రసాదించే అనంత శక్తిని అంతులేని ప్రకృతి సౌందర్యంలో ఆస్వాదించి తనను తాను సుందరంగా కూర్చుకుని మందహాసంలో ఆ సమానత్వాన్ని సంగమింపజేసే ప్రక్రియను తపస్సుగా తెలుసుకుని అందులోనే లీనమైపోవటం వలన పంచ తన్మాత్రలూ ఒకే మాత్రలో స్పందించటం వలన, శ్వాసనిశ్వాసలు లయబద్ధమైన సంగీతంలో మ్రోగటం వలన ఈ జగత్తు పవిత్రమవుతోంది..

కారు ఆగింది. చుత్టూతా కొండలు. నదీ జలాలు దగ్గరలోనే ఉన్నట్టు తెలుస్తోంది. సమీర్ వెంట నడిచాను.

“జాగ్రత్తగా నడవండి” చెప్పాడు.

దారి చాలా సన్ననైనది. అది ఉడుతో తెలియలేదు, ఓ చిన్నసైజు కుందేలో తెలియలేదు. ఎక్కడి నుండో ఆ దారిలోకి వచ్చి చిత్రమైన శబ్దం చేసి పారిపోయింది. సమీర్ తన జీన్స్ పాంట్ రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని కొద్దిగా భుజాలను పైకి ఎత్తి నడుస్తున్నాడు. కొంత దూరం నడిచి ఆగాడు. మాకు ప్రక్కగా ఓ సన్నని ధార ఎక్కడి నుండో వచ్చి అలా నిశ్శబ్దంగా పారుతోంది. దానిని చూపించాడు.

“ఇదే మన గైడ్. ఇది ఎక్కడి నుండి వస్తోందో తెలుసుకోవాలని అనుకుని అటు నడవాలి”

“అలాగే”

ఆ ధార వెంబడే వెళుతున్నాం. ఆగిపోయిన చోట ఎలా గమనించాడో తెలియదు.

“ఆగకండి. ఏమీ కాదు. నేనున్నాను. వచ్చెయ్యండి” అన్నాదు.

జాగ్రత్తగా రాయికీ రాయికీ మధ్యగల వ్యత్యాసాన్ని దాటి అడుగులు వేసాను. వాన కురుస్తోందా? కురిస్తే ఎలా అనే ఆలోచన వస్తోంది. తడిసిపోతే మటుకు ఏమి? నువ్వు వచ్చింది అమ్మ నీరులోంచే కదా అని ఎవరో చెబుతున్నట్లుంది. దూరంగా ఈ ధార వెలుపలికి వస్తున్న సందు కనబడుతోంది. రెండు కొండల మధ్య ఒక బిలం అది.

“అందులోకి మనం వెళ్ళలేము కదూ?” అడిగాను.

“అందరూ వెళ్ళగలరు” అన్నాడు.

ఇదేంటి? ఈ జలధారయే అతి కష్టం మీద బైట పడ్డట్లుంది ఆ కొండలోంచి. అందరూ ఏదో సినిమా హాల్లోకి ప్రవేశించినట్లు ప్రవేశించగలరంటాడేంటి?

కానీ అక్కడి దాకా వెళ్ళాక అర్థమైంది. ఒక కొండ ముందరకుంది. జాగ్రత్తగా దాన్ని దాటి ఆ సందులోకి వెళ్ళాం. ఒక్క క్షణం ఆగాం. బాగా చీకటిగా ఉంది. జేబులో మొబైల్‍ను తడుముకున్నాను. అభద్రతే మనిషిని మనిషిగా నిలబెడుతుంది. ఇంత ప్రకృతిని భద్రంగా కాపాడుకునే ఈశ్వరుని అర్థం చేసుకుంటే అసలు అభద్రత అనేది ఉన్నదా అన్న ఆలోచన కలుగుతోంది. సమీర్ అలా ఎక్కడికో వెళ్ళి మాయమైపోయాడు. చుట్టూతా పరికించి చూసాను. నవగ్రహాల మధ్య భూమి ఒంటరిది కానే కాదు. కానీ ఇంత విశాలమైన ప్రకృతి ఒడిలో నేను మటుకు ఒంటరిననిపించింది. దూరంగా మెరుపులు మెరుస్తున్నాయి. నా కుడి వైపు చాలా పెద్ద లోయ. కాలు జారితే ఈ అనంతంలో నేనొకడిని! జాగ్రత్తగా ముందరికి వెళితే నాకూ ఓ కథ ఉన్నదని వినేవాళ్ళకి ఎవరికైనా చెప్పవచ్చు. గుండె కొద్దగా చప్పుడు చేస్తోంది. అడుగులు వేసాను. ఎక్కడి కెళ్ళాడు? పోనీ కేక వేస్తాడా? ఏదీ లేదు..

అడుగులో అడుగు వేసాను. చీకటి ముంచుకొస్తోంది. ఇది పగలు అన్న సంగతి మరచిపోతున్నాను. ఆ అడుగుల మధ్యలో తెలియలేదు. తల చిన్నగా ఎదురుగా ఉన్న కొండకు తగిలింది. అంటే నేను దారి తప్పి ఎటో వెళ్ళానా? అదేంటి? అసలిక్కడ మరో దారెక్కడుంది? తల కొట్టుకున్నందుకు కళ్ళు క్రిందకి చూసి ఆ నీటి ధారను గుర్తు పట్టాయి. అది వస్తున్న ధారను పసిగట్టి కొద్దిగా ఎడమవైపుకి జరిగాను. అక్కడ ఓ సన్నని సందున్నట్లు అర్థమైంది. అందులోకి చూస్తే మట్టి గడ్డల మీదుగా  నీరు జారుతోంది. అదే దారి యని అర్థమైంది. ఆ మట్టి గడ్డల మీదుగా నడిచాను. అది నన్ను క్రిందకి దింపుతోందని అర్థమైంది. మరి నీరు? నా ప్రక్కనున్న కొండ గోడ మీరుగా సన్నగా జారుతోందని అర్థమైంది. ఈ చీకటి ఎక్కడో మాయమైంది. అక్కడ దూరంగా ఆకాశం కనిపిస్తోంది. ఒక్క క్షణం ఆగి చుట్టూతా చూసాను. నా చూపు క్రిందకి దూకింది. సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయాను. ఇది మన లోకం కాదని తోచింది..

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here