పూచే పూల లోన-70

0
2

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[ఆ రాత్రి సమీర్‍కి ఒంటిగంటకి మెలకువ వచ్చేస్తుంది. మామూలుగా ఎప్పుడూ అలా జరగదు. కాస్త గాలి పీల్చుకుందామని డాబా మీదకి వెళ్తాడు. సారిక వదనం గుర్తొస్తుంది. ఇంతలో ఇద్దరు కుర్రాళ్ళు డాబా మీదకు వస్తారు. ఓ మూలగా రాళ్ళతో ఏర్పర్చిన వసతి మీద కూర్చుంటారు. మందు తాగుతూ, రజనీష్ గురించి, ఓ నటుడి గురించి మాట్లాడుకుంటుంటారు. వాళ్ళ మాటలు వింటున్న సమీర్‍కి వాళ్ళు అప్పటికే షూటింగ్ జరుగుతున్న మరో సినిమా షెడ్యూల్ గురించి మాట్లాడుకుంటున్నారని అర్థమవుతుంది. మాటల మధ్యలో రజనీష్ గోవా నుంచి ఎవరో కొత్త హీరోని తెచ్చాడని ఒకడు చెప్తాడు. రజనీశ్ ఖిలాడీ అని, ఎంతమందినైనా మారుస్తాడు కానీ సారికని మార్చడని మరొకడంటాడు. సారికను ఎందుకు పెళ్ళి చేసుకోడో అని మొదటివాడు అడుగుతాడు. సమీర్ వాళ్ళకి దగ్గరగా వెళ్లి కూర్చుంటారు. ఇక్కడేం చేస్తున్నారని ఒకడడిగితే, మిత్రుడు ప్రొడక్షన్‍లో ఉన్నాడనీ, ఎక్కడికో వెళ్ళి ఇంకా రాలేదని అంటాడు సమీర్. కొత్త హీరో పేరేంటని అడుగుతాడు. వాళ్ళలో ఒకడు -సమీర్ – అని చెప్తాడు. అసలు హీరోని ఎందుకు మార్చారని సమీర్ అడిగితే, రజనీశ్ అదో టైప్ అని అంటాడొకడు, జనం కథలు కథలుగా చెప్పుకుంటారని అంటాడు. వాటిలో కొన్ని చెప్పమని అడుగుతాడు సమీర్. రజనీశ్ ఈ సినిమాని ప్రాణం పోసి చేస్తున్నాడనీ, కానీ ఆ పాత్రలో ఆ హీరో సరిపోడని కొందరి అభిప్రాయమని అంటాడు. అది కాదండీ, అంటూ మరో అతను – రజనీశ్ సారికకి చెక్ పెట్టడానికే ఇలా చేశాడు అని అంటాడు. సారిక హీరోకి దగ్గరవుతోందని అనుకుని, హీరోని తీసేసాడని అనుకుంటున్నారు అని చెప్తాడు ఇంకొకడు. కాసేపు మాట్లాడకా, సమీర్ లేస్తాడు. మీ పేరేంటని ఒకడు అడిగితే, చెప్తాడు. ఆ కొత్త హీరో పేరూ అదే అంటూ వాళ్ళిద్దరూ గట్టిగా నవ్వుతారు. ఎందుకో ఒక్కసారిగా ఆగిపోయి, సమీర్‍ని జాగ్రత్తగా చూసి లేచి నిలబడతారు వారిద్దరూ. – ఇక చదవండి.]

“నన్ను రోడ్డు దాటించవా అంకుల్”, అన్నాడు చిన్న కుర్రాడు.

ఆ ఎత్తైన ప్రదేశం మీద నుండి ముంబయి నగరం మిల మిలా మెరిసిపోతోంది. నడక అలవాటున్న వాళ్లకి ఆలోచనలు నడవవు. పరుగులు తీస్తాయి. నడచుకుంటూ చాలా దూరం వచ్చేసాననిపించింది.

“చెయ్యి పెట్టుకో”, అన్నాను.

కుర్రాడు గట్టిగా చెయ్యి పట్టుకున్నాడు.

ఇద్దరం రోడ్డు దాటాం. చెయ్యి వదిలేసాను.

“ఇంత రాత్రి వేళ నువ్వు ఒంటరిగా ఎందుకు నడుస్తున్నావు? ఎక్కడికి వెడుతున్నావు?”

“నా అక్కను చూడవా అంకుల్?”

ఇదేంటి? వీడి అక్కను నేను చూడటమేమిటి? ఈ కుర్రాడికి ఏదైనా వింత సమస్యా?

“రండి” అంటూ చెయ్యి పట్టుకున్నాడు.

“నేను..”

ఏదైనా అనే లోపల నన్ను గబగబా లాక్కెళ్లి పోతున్నాడు. మహానగరం లైట్లు చిన్నవైపోతున్నాయి. ఇదేంటి? ఈ కొండల మీద కట్టిన దార్లు నా కోసం పరుగులు తీస్తున్నాయా? ఏమో!

ఆయాసం వచ్చి అక్కడ కనిపించిన గట్టు మీద కూర్చున్నాను.

“బాబూ”

“అంకుల్”

“నేను ఈ ఊరు మనిషిని కాను. నన్ను వదిలేయ్. నీ గోల ఏంటో నాకు తెలియదు. నేను వెళ్ళిపోతాను.”

అతను నడుము మీద చేతులు పెట్టుకున్నాడు.

“నా అక్కయ్య గురించి నీకు తెలియదు అంకుల్”

“తెలియనక్కరలేదు. వస్తాను. గుడ్ నైట్.”

“నో. కమాన్..”

నన్ను కాపాడు. చుట్టూతా చూసాను. ఈ కుర్రాడు ఏదో మానసికంగా దెబ్బ తిన్నట్లున్నాడు. ‘ఎవరైనా పోలీసు కనిపిస్తే బాగుండు’ అనుకున్నాను.

నా చెయ్యి పట్టుకొని లాగాడు. మరల నాలుగడుగులు వేసాం.

“అక్కయ్య చాలా బాగుంటుంది”, అన్నాడు.

అంతే. అక్కడే ఆగిపోయాను.

“నోర్ముయ్”, అన్నాను.

అతను కోపంగా చూసాడు.

“నేనెవరనుకుంటున్నావూ?”

బేలగా మొహం పెట్టాడు.

“నేనెవరనుకుంటున్నావూ?”

తల పట్టుకున్నాను. ‘భగవంతుడా!’ అనుకున్నాను.

“నాకెందుకురా నీ గొడవ?”

“అక్కయ్యని చూడరా?”

“చూడను.”

“అయ్యో చూడాలి. చూడనంటే ఎలా?”

భారతీయ కర్మ సిద్ధాంతం గొప్పదే. గత జన్మలో చేసుకుంది ఈ జన్మలో బాధించటం వరకు బాగుంది. ఇన్ని విధాల బాధిస్తుందా అనేది మరింత కలవర పెట్టింది.

“నన్ను వదిలెయ్, నేను రోడ్డుకి అటు వెళ్లి పోతాను.”

అతను మరింత గట్టిగా పట్టుకున్నాడు.

“అక్కయ్య..”

“ఎవర్రా ఈ అక్కయ్య? నన్ను వదలరా..”

“నీకు తెలియదు అంకుల్”

“ఏంటి తెలియదు?” విసుగ్గా అడిగాను.

“ఒక్కసారి చూస్తే నీకర్థమవుతుంది. పద.. కమాన్.”

“బాబూ, నీ పేరేంటి?”

“చేతన్.”

“గుడ్. చూడు చేతన్..”

“చెప్పండి అంకుల్”

“నువ్వెవరో నాకు తెలియదు.”

“ఒప్పుకుంటాను.”

“నేనెవరో నీకు తెలియదు.”

“ఒప్పుకుంటాను.”

“నీ అక్కయ్య ఎవరో తెలియదు.”

“ఒప్పుకుంటాను.”

“మరి..”

“మరి?”

“ఒక్క మాట.”

“చెప్పండి అంకుల్.”

“నేను నీతో ఎందుకు రావాలి? నీ అక్కయ్యను ఎందుకు చూడాలి?”

“ఒక్కసారి అక్కయ్యను చూస్తే, నీ జీవితం మారిపోతుంది.”

“అక్కరలేదు, వస్తాను!”

అలా అంటూనే రోడ్డు దాటేసి గబగబా వెనక్కి నడిచాను. కొద్ది సేపట్లోనే చెయ్యి దగ్గర వెచ్చగా తగిలింది. ఉలిక్కిపడి చూసాను. ఆ కుర్రాడు పళ్లు ఇకిలిస్తున్నాడు.

“నీ మొహం..”, అంటూనే జాగ్రత్తగా చూసాను. పళ్లు ఇకిలిస్తున్నాడు కానీ కళ్ళల్లోంచి కన్నీళ్ళు జారుతున్నాయి.

“నీ బాధేంటి?”

“అక్కయ్య”

ఆలోచించాను. ఏదో భయంకరమైన షాక్‍లో ఉన్నట్టున్నాడు ఈ చిన్న కుర్రాడు. తప్పిపోయాడా? ఏమో. ఇలా వదిలేస్తే సమస్య.. నన్ను నేను క్షమించుకోలేను.

ఎక్కడకి తీసుకుని వెళతాడో అలా వెళ్ళి కనీసం అక్కడైనా వాకబు చెయ్యవచ్చు కదా? అనిపించింది.

ఈసారి అతని చెయ్యి పట్టుకున్నాను. వెనుక నడిచాను. ఈ ప్రదేశం నగరమో తెలియడం లేదు, అడవో తెలియడం లేదు. ఆ కొండకి అంచున నిలుచున్నాం.

“ఇక్కడి నుండి ఇంకెక్కడికీ వెళ్ళేందుకు లేదు”, అన్నాడు.

“ఇదెక్కడి గొడవరా?”, గట్టిగా అరిచాను.

వింతగా నవ్వాడు ఆ కుర్రాడు.

“అందుకే నాకు తోడుగా రమ్మన్నాను”, అన్నాడు.

అదొక లోయలా ఉంది. దూరంగా మరో కొండ, దాని అంచున ఒక దారి కనిపిస్తున్నాయి. ఏవో బండ్లు – కారుల్లానే ఉన్నాయి, అలా వస్తూ పోతూ ఉన్నాయి.

“అక్కడికి దారి లేనప్పుదు ఇక్కడికి ఎందుకు తెచ్చావు?”

“అంకుల్, నువ్వు నాతో ఎందుకు వచ్చావు?”

అక్కడి నుండి దూకెయ్యాలనిపించింది.

“నేను వెనక్కి వెళతాను. ఏదైనా టాక్సీ దొరుకుతుందేమో, ఉండు.”

“అబ్బా అంకుల్”

“రేయ్, నన్ను పోనీ”

“అంకుల్, అక్కడికి వెళ్ళాలి.”

“ఆ ప్రాంతం పేరేమిటి?”

“తెలియదు, అక్కడ అక్కయ్య ఉంటుంది.”

“నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు?”

“నేను ఇక్కడికి రావటం ఏంటి?”

“అదేంటి?”

“నేను ఇక్కడే ఉంటాను.”

“రేయ్.. నాకు మతిపోతోంది.”

“అక్కయ్యని చూడవా?”

“చూడను.”

“ఎందుకు?”

“నా ఖర్మ. దట్సాల్. వెళతాను.”

గబగబా నాలుగడుగులు వెనక్కి వేసాను. నా వెనక అతను ఏమయ్యాడో నాకు అనవసరం అనుకున్నాను.

కొంత దూరం వచ్చాక అనుమానం వచ్చింది. వీడు దూకేస్తాడా? ఏ శబ్దమూ లేదు. భయం వేసి మెల్లగా వెనక్కి చూసాను. వాడు ఆ దారి అంచున రెండు చేతులూ నడము మీద పెట్టు అలా అటు తిరిగి ఉన్నాడు..

ఇక్కడి నుండే గమనిస్తున్నాను.

“అక్కయ్యా..” బిగ్గరగా అరిచాడు. ఆ శబ్దం ప్రతిధ్వనిస్తోంది. అనుకోని పరిణామం ఇది. ఎవరో ఈ కుర్రాడు, ఏం జరిగిందో పాపం!

మరల అరుస్తున్నాడు..

వింతగా తోచింది. ఒక్కక్షణం ఒక చిత్రమైన ఆలోచన వచ్చింది. ఈ ప్రాంతంలో ఏంటి? మరే ఎవరూ కనిపించారే? ఏంటీ, మాయ? తప్పు నాదే. ఇంత రాత్రి వేళ ఇలా ఒంటరిగా ఎందుకు నడుచుకుంటూ వచ్చాను? పిచ్చి నాకే. ఎవరికో కాదు.

అటు చూస్తూనే కొద్దిగా వెనక్కి అడుగులు వేసాను. ఆ కుర్రాడు ఆ రోడ్డు అంచు మీద కూర్చొన్నాడు. నా సంగతి ఏదీ పట్టించుకోవటం లేదు.

నా కుడి భుజం మీద ఎవరిదో చెయ్యి చాలా మెత్తగా తాకింది. నేను మాములుగా భయపడే మనిషిని కాను. ఓర కంట ఆ చెయ్యిని గమనించాను – నిమ్మకాయ రంగులో ఉంది – అమ్మాయి చెయ్యి. నా ఎడమ చెయ్యి ఆ చెయ్యి మీద పెట్టాను.

చాలా మృదువుగా ఉంది చెయ్యి., ఆ సన్నని నవ్వు..

ధైర్యంగా వెనక్కి తిరిగాను.

నాకు నమ్మకం కుదరలేదు. సారిక నన్ను చూసి నవ్వుతోంది.

“సారి.. సా..”

సారిక తన నోటి మీద చూపూడువేలు అడ్డం పెట్టింది.

“ష్..”

“ఇక్కడ.. ఏంటి ఇదంతా?”

“ష్..”, మరల అంది.

“నేనే అక్కయ్యను”

ఉలిక్కిపడి లేచాను. ఫాన్ మోత నన్ను ఈ లోకం లోకి తెచ్చింది. ఆలోచనలు ఎక్కువవటం వలన పిచ్చి కలలు వస్తాయో తెలియదు; ఏదో అయిపోవాలని, మరేదో జరిగిపోవాలని కలలు కంటామో తెలియదు; జీవితంలోని రంగు రంగుల మలుపుల లోంచి ఏ మాత్రం విశ్రాంతి లేని అడ్డదిడ్డపు ప్రయాణం నుండి విసుగు చెందుతూ కూడా సాగిపోతున్న నాకు నిజానికి ఆలోచనలతోనూ, కలల తోనూ పని లేదు.. కానీ ఎందుకో నా మనసే నన్ను ఒక్కింత నన్ను కన్నతల్లిగా నిద్ర పుచ్చినట్లనిపించింది. నన్ను కనిపెంచిన వారెలా ఉన్నారో తెలియదు, ప్రస్తుతం కలకలం రేపే ఓ కలను కనిపెట్టి జోకొట్టటం చేతకాక మేలుకొలిపినట్లుంది..

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here