Site icon Sanchika

పూచే పూల లోన-71

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[అర్ధరాత్రి. సమీర్ రోడ్డు మీద నడుస్తూంటాడు. ఇంతలో ఓ పిల్లాడొచ్చి తనని రోడ్డు దాటించమని అడుగుతాడు. తన చెయ్యి పట్టుకోమని చెప్పి, రోడ్డు దాటిస్తాడు సమీర్. రోడ్డు దాటాకా ఆ కుర్రాడి చెయ్యి వదిలేసి, అంత రాత్రివేళ ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతాడు. బదులుగా ఆ కుర్రాడు మా అక్కని చూడవా అంకుల అని అడుగుతాడు. వాడి అక్కని తాను చూడడమేమిటని అనుకుంటాడు సమీర్. ఆ కుర్రాడు సమీర్ చేయి పట్టుకుని గబగబా లాక్కెళ్ళిపోతాడు. ఆ పిల్లాడు వేగంగా లాక్కుపోతుంటే, ఆయాసం వచ్చిన సమీర్ అక్కడున్న ఓ గట్టు మీద కూర్చుంటాడు. తనదీ ఊరు కాదనీ, తనని వదిలేయమని ఆ కుర్రాడితో అంటాడు. తన అక్కయ్య గురించి సమీర్‍కి తెలియదనీ, అక్కయ్య చాలా బాగుంటుందని అంటాడు. సమీర్‍కి కోపం వచ్చి ఆ పిల్లాడ్ని తిడతాడు, తనని వదిలేయమంటాడు. ఆ కుర్రాడు మాట వినడు, అక్కయ్యని చూసి తీరాలని పట్టుపడతాడు. ఒకసారి అక్కయ్యని చూస్తే జీవితం మారిపోతుందని అంటాడు. అవసరం లేదని చెప్పి, ఆ కుర్రాడిని తప్పించుకుని, రోడ్డు దాటి వచ్చేస్తాడు సమీర్. రెండు అడుగులు వేస్తాడో లేదో, చెయ్యి దగ్గర వెచ్చగా స్పర్శ తగిలి, పక్కకి చూస్తే, ఆ కుర్రాడు కూడా సమీర్ వెంట వస్తూంటాడు. ఆ కుర్రాడు తప్పిపోయాడేమే, ఇంటికి చేరుద్దాం అనుకుని, ఆ కుర్రాడు చూపించిన దారిలో నడుస్తాడు సమీర్. ఓ కొండ ప్రాంతం దగ్గరకి వచ్చి ఆగుతారు. అక్కడ్నించి ఇక దారి లేదని చెప్తాడా కుర్రాడు. తాను అక్కడే ఉంటానని చెప్తాడు. ఆ కుర్రాడిని తిట్టి, వెనుతిరుగుతాడు. తన కుడి భుజం మీద ఎవరిదో చేయి పడేసరికి నెమ్మదిగా, ఎవరా అని ఓరకంట గమనిస్తాడు. సారిక! ఏంటి ఇదంతా అని అడిగితే, తానే అక్కయ్యని అని చెబుతుంది. హఠాత్తుగా నిద్ర నుంచి మెలకువ వచ్చిన సమీర్ అదంతా కల అని గ్రహిస్తాడు. – ఇక చదవండి.]

[dropcap]మే[/dropcap]క్ అప్ రూమ్ లోంచి ఇవతలికి వచ్చాను. అక్కడ ఉన్నంత సేపూ ఎవరో ఒకరు మొహం మీద ఏదో తుడుస్తూనో, అద్దుతూనో ఉన్నారు. కొద్దిగా వయసులో పెద్దగా కనిపిస్తున్న ఒకాయన వచ్చారు. జేబులోంచి నల్ల కళ్ళద్దాలు తీసాడు.

“పెట్టుకోండి”, అన్నాడు.

“ఎందుకు?”, మెల్లగా అడిగాను.

“మీరు హీరో అని మా అందరికీ ఎలా తెలియాలి?” అంటూనే ఎందుకో చుట్టూతా చూసి బిగ్గరగా నవ్వాడు. కొందరు నవ్వారు.

“పెట్టుకోండి సార్, “ ఓ అసిస్టెంట్ అన్నాడు, “..సార్ చేతి మీదుగా ఏమిచ్చినా కలసి వస్తుంది.”

దానిని తీసుకుని జాగ్రత్తగా చూసాను.

“బాగా లేదా?” ఆయన అడుగుతున్నాడు.

“బాగానే ఉంది.”

“మరి?”

“నేను హీరోని అని ఎవరికీ తెలియనక్కరలేదు.”

“ఓహో..”, మరల నవ్వాడు. “..ఇది మెరుపుల ప్రపంచం. గ్లామర్. ఆ మాత్రం గ్లామర్ లేకపోతే హీరోయిన్ ఒప్పుకోదు.”

“ఒప్పుకోకపోయినా ఫరవాలేదు.”

“ఈయనెవరండీ బాబూ, చిత్రంగా ఉన్నాడే? ఒకసారి పెట్టుకోండి చూద్దాం..”

ఎందుకులే అని పెట్టుకున్నాను.

“ఎలా ఉంది?”, అడిగాడు.

“నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటే అంతా నల్లగా.. అంటే అరవంలో అంతా బాగానే ఉంటుంది. ఎండ కూడా చల్లగా, మీ రంగు కూడా మారిపోయి అదేదో చిత్రమైన రంగులా.., అంతకంటే ఏమీ ఉండదు”, అన్నాను.

ఆయనేమీ మాట్లాడలేదు.

“మీకెలా ఉంది?”, అడిగాను.

“నేను ఈ రంగంలో ఎంతోమందిని చూసాను. ఎన్నో రంగులు చూసాను. రణరంగాలను ఎదుర్కొన్నాను. కానీ ఎందుకో ఈ రోజు నుంచీ తెర మీద ఏకంగా ఒక క్రొత్త రంగునే చూడబోతున్నానని అర్థమైంది”.. అంటూనే జనం లోకి వెళ్ళి మాయమైపోయాడు.

కళ్ళజోడు తీసేసి నా కుర్చీలో నేను కూర్చున్నాను.

“ఎవరాయన?”, అడిగాను.

నాకు అటూ ఇటూ చెరో ఒక అసిస్టెంట్ డైరక్టర్లున్నారు.

“ఒకానొక కాలంలోని పెద్ద డైరక్టరు. అలా పిచ్చివాడిలా తిరుగుతూ ఉంటాడు. ఎందుకొస్తాడో హఠాత్తుగా వస్తాడు, వెళ్ళిపోతాడు. ఒక వెలుగు వెలిగినవాడు. జీవితంలో చితికిపోయాడు.”

“సార్..”, ఇటు పక్క నుండి ఇతను తగులుకున్నాడు.

“సార్, మీకు ఆస్తులున్నాయా?”

“లేవు.”

“ఏర్పాటు చేసుకోండి సార్. కానీ ఏ రోజూ తాకట్టు పెట్టకండి.”

“కరెక్ట్.”

“నటించండి.”

“ఏ రోజూ డైరక్షన్ లోకి దిగకండి.”

“సినిమా ఎన్నడూ తీయకండి.”

“ఎందుకిలా చెబుతున్నారు?”, అడిగాను.

“ఇలా చాలా మంది అనుకుంటూ ఉంటారు. అందుకే ఈ జాగ్రత్తలు చెబుతున్నాం.”

“కొందరు ఏదో అనుభవం సంపాదించాకా ఓ సినిమా.. ఏదో అద్భుతాన్ని సృష్టించి ఏదో గొప్ప పేరు తెచ్చుకోవాలనుకుంటారు.”

“అలా ఎన్నడూ జరగదు.”

“ఇంతకీ మీరు స్వయంగా దర్శకత్వం వహించాలని అనుకోలేదా?”, అడిగాను.

ఇద్దరూ నిలబడ్డారు. దర్శకుడి కుర్చీని కొద్దిగా కదిల్చారు.

“ఇందులో ఏ రోజైనా కూర్చోలేకపోతామా అనే దురదతో తిరిగి తిరిగి ఇక్కడ ఇలా కూర్చున్నాం, ఆ కుర్చీ దొరకదని తేలిపోయింది. ఇలా తిరుగుతూనే ఉంటాం..”

“అలా నిరాశ పడకండి..”, అన్నాను. “..ఏదో ఒక రోజు కథ మారుతుంది.”

“మీరు మంచివారిలా ఉన్నారు.”

“ఎందుకలా అనిపించింది?”

“అనిపించటం కాదు సార్, అలా అనాలి.”

నవ్వాను. “అదేంటి?”

“ఏం లేదు సార్. ఖాళీగా ఉన్నప్పుడు ఓ కథ చెబుతాం.”

“వింటారా?”

వింతగా తోచింది.

“ఎందుకు వినకూడదు?”

“అలా అడక్కూడదు.”

“ఎలా అడగాలి?”

“దేనికి వినాలి? అని అడగాలి.”

“ఓకే. దేనికని వినాలి?”

“రేపు మీరు తెర మీద ఎగురుతారు.”

“అయితే?”

“ఈ సినిమా నాలుగో షెడ్యూల్ పూర్తయ్యే వేళకి ఇంకో సినిమా తాలూకు ప్రకటన ఇవ్వకపోతే మీరు నిలబడలేరు.”

“అవునా?”

“అదే మార్కెట్.”

“అక్కడ చూడండి.”

అటూ ఇటూ చూసాను. నిజమే. అక్కడ నిర్మాత గారు ఎవరెవరికో ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు. నాకు సందేహం కలిగింది.

“అవునూ, వీళ్ళు నా ఇంటర్వ్యూ ఎందుకు తీసుకోవటం లేదు?”

“కరెక్ట్. రజనీశ్ ఆర్డర్స్.”

“ఓ. ఎందుకా ఆర్డర్స్?”

“అడక్కూడదు, చెప్పకూడదు. ఇక్కడే మీరు జాగ్రత్త పడాలి. ఇంతకీ కథ వింటారా?”

“వినను అనేందుకు నా దగ్గర కారణాలేమీ లేవు.”

“ప్రామిస్?”

“ప్రామిస్.”

“మరో షరతు.”

“ఏంటది?”

“ఎవరికీ తెలియకూడదు.”

“ఓకే.”

“అలాగే. ఇంతకీ నిర్మాత ఎక్కడ నుండి వస్తాడు?”

“ఇక్కడి నుండే. మీకు కథ చెప్పాము అంటే వాళ్ళే వస్తారు.”

మార్కెట్ గురించి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.

“ఇంతకీ డైరక్టర్ గారేరి?”, అడిగాను.

“రజనీశ్ గారు స్టార్ డైరక్టర్.”

“కరెక్ట్.”

“అయితే?”

“అంతే.”

“అంటే?”

“ఆయన వచ్చినప్పుడు టైమ్ అవుతుంది. అందుకే పెద్ద పెద్ద హీరోలను పెట్టుకోడు.”

“ఓ.”

“అందరూ ఆయన మాట వినవలసిన మాటే గానీ, ఆయన ఎవరి మాటా వినడు.”

“అది తెలిసిన విషయమే.”

“అవును. ముందరే జాగ్రత్తలు చెబుతున్నాం. ఆయన చెప్పించి చెప్పినట్లు చెయ్యండి. ఇంకో ఆలోచన పొరపాటుగా కూడా కూడా రానీయకండి.”

“అలాగే. మీ సలహాలను గౌరవిస్తాను.”

నిర్మాత గారు వచ్చారు. కొద్దిగా ఇరుకుగానే మొహం పెట్టాడు.

“నమస్కారం సార్.”, అన్నాను.

చేతులు జోడించాడు.

“నాటకాల అనుభవం ఉన్నదని చెప్పారు.”

“అవునండి.”

“మొదటి సినిమాలోనే హీరో, అది కూడా రజనీశ్ గారి దగ్గర.. దీనినే విపరీత రాజయోగం అంటారు జ్యోతిష శాస్త్రంలో..”

“చెప్పండి.”

ఒకడు గుమ్మడికాయ తెచ్చాడు. ఇంకొకడు దాని మీద మూడు కర్పూరం బిళ్ళలు పెట్టాడు. నిర్మాత గారు అగ్గిపుల్లతో ముట్టించాడు. మూడు సార్లు అటూ, ఇటూ నా మొహం చుట్టూ తిప్పి పగలగొట్టాడు.

“సార్, విపరీత రాజయోగం అంటే ఇంకొకరి నష్టం మీకు జీవితకాలపు లాభంగా మారటం”, అంటూ వెనుతిరిగాడు. ఎందుకో ఇటు తిరిగాడు ఒక్కసారిగా.

“నాక్కూడా లాభాలు ఇవ్వండి దయచేసి”, అంటూ వెళ్ళిపోయాడు. చిత్రంగా అనిపించింది.

బాగానే ఉందనుకుంటూ కుర్చీలో కూర్చున్నాను. నా కళ్ళు నీళ్ళతో తుడిచారు. మేక్ అప్ మ్యాన్ మరలా అద్దాడు.

అటు నుండి సారిక వస్తోంది. అందరూ నమస్కారాలు చేసుకుంటూ, దారికి అటూ ఇటూ నిలబడుతున్నారు. నేను లేచి నిలబడ్డాను.

“అయ్యో, కూర్చోండి”, అంటోంది సారిక..

నేను నిలబడ్డది దేని గురించో కాదు, కొద్ది సేపు స్థాణువులా మారాను..

నేను కలలో చూసిన సారిక ఇదే పద్ధతిలో, ఇలాగే చీరెను పూర్తిగా భుజాల మీద కప్పుకుని ఉంది. నా కళ్ళని చూస్తూ అలా నిలబడిపోయింది సారిక. ఆమెకు ఏమీ అర్థం కావటం లేదు..

జో ఒకసారి గిటార్ అద్భుతంగా వాయించి ఎందుకో ఆగిపోయాడు.

“ఏంటి?”, అన్నాను.

“నీ బాధలు, నీ తోటివాళ్ళు, నీ చుట్టూ ఉన్న ప్రపంచం అంతా కేవలం ప్రక్క వాయిద్యాలు.. నువ్వు బ్రతికి, బట్టగట్టి నిలుచునున్నా అదే ఓ గొప్ప ప్రదర్శన అయిపోతుంది!” అన్నాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version