Site icon Sanchika

పూచే పూల లోన-72

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[మేకప్ చేయించుకుని సమీర్‍ సెట్‍లోకి వస్తాడు. ఓ పెద్దాయన వచ్చి జేబు లోంచి నల్ల కళ్లద్దాలు తీసి, సమీర్‍కి ఇచ్చి పెట్టుకోమంటాడు. ఎందుకని అడుగుతాడు సమీర్. మీరు హీరో అని అందరికీ ఎలా తెలియాలి అని చుట్టూ చూసి నవ్వుతాడు. అక్కడున్న కొందరు నవ్వుతారు.  ఆ కళ్ళజోడుని పెట్టుకోమని, ఆయన చేతులమీదుగా ఏదిచ్చినా కలిసొస్తుందని ఒక అసిస్టెంట్ అంటాడు. కళ్ళజోడు బాగా లేదా అని ఆయన అడుగుతాడు. బానేఉందని చెప్తాడు సమీర్. మరి పెట్టుకోవచ్చుగా అంటే, నేను హీరోనని అందరికీ తెలియాల్సిన అవసరం లేదంటాడు సమీర్. ఇది గ్లామర్ ప్రపంచమని, ఈ మాత్రం గ్లామర్ కూడా లేకపోతే హీరోయిన్ ఒప్పుకోదని అంటాడాయన. ఒప్పుకోకపోయినా పర్వాలేదని చెప్తాడు సమీర్. ఒకసారి పెట్టుకోండి చూద్దామని అంటాడాయన. సరేనని పెట్టుకుంటాడు. ఎలా ఉందని ఆయన అడిగితే, బానే ఉందంటాడు. సినీరంగంలో తాను ఎంతోమందిని చూశాననీ, తెర మీద ఓ కొత్త రంగుని చూడబోతున్నానని చెప్పి వెళ్ళిపోతాడాయన. తనకి చెరో పక్కన కూర్చున్న ఇద్దరు అసిస్టెంట్ డైరక్టర్లతో మాట్లాడుతుంటాడు సమీర్. ఆయనెవరని అడిగితే, ఒకప్పటి ప్రసిద్ధ దర్శకుడని, జీవితంలో చితికిపోయాడని చెప్తారు. వాళ్ళు సమీర్‍కి కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తారు. ఈ సినిమా పూర్తయ్యేలోపు మరో సినిమా చేస్తున్నట్టు ప్రకటన రావటం ఎంత ముఖ్యమో చెప్తారు. తమ వద్ద ఒక కథ ఉంది వింటారా అని అడిగితే, తప్పకుండా వింటాను, మరి నిర్మాత ఎలా అని అడుగుతాడు. మీకు కథ నచ్చి సినిమా చేస్తానంటే నిర్మాత తప్పక దొరుకుతాడని వాళ్ళు చెబుతారు. సెట్‍కి వచ్చిన నిర్మాతని జర్నలిస్టులకి ఇంటర్వ్యూలు ఇస్తూంటాడు. వాళ్ళు వెళ్ళాకా, నిర్మాత సమీర్ దగ్గరకి వస్తాడు. సమీర్ లేచి నిలబడి నమస్కారం చేస్తాడు. ఆయన కూర్చోగానే, ఒక అసిస్టెంట్ వచ్చి గుమ్మడికాయతో సమీర్‍కి దిష్టి తీస్తాడు. సమీర్‍కి విపరీత రాజయోగం నడుస్తోందని చెప్తాడు నిర్మాత. తనకీ లాభం వచ్చేట్టు చేయమంటాడు. ఇంతలో సారిక వస్తుంది. అందరూ నమస్కారాలు చేస్తారు. – ఇక చదవండి.]

[dropcap]“న[/dropcap]న్ను చూడగానే నిలబడమని ఎవరైనా చెప్తారా?”, సారిక అడిగింది. ప్రక్కనున్న కుర్చీని దగ్గరగా లాక్కుని కూర్చుంది.

“లేదండీ.. నేను నిలబడింది..”

చెయ్యి అడ్డం పెట్టింది .

“మీరు అందరికీ హీరో. నాకు మటుకు సమీర్. దట్సాల్”. కొంటెగా చూసింది.

అసిస్టెంట్ వచ్చి స్క్రిప్ట్ పట్టుకున్నాడు. జాగ్రత్తగా చదివింది.

“ఇదేంటి?..”, అడిగింది. “..అంతవరకు ప్రేమించిన తరువాత ఏ కారణం చెప్పకుండా నన్ను మరచి పో అంటోంది. ఇష్టం లేదా!!”

“మేడమ్, అది తరువాత డైరెక్టర్ గారు చెబుతానన్నారు. ఈ సీన్ ఇంతే. ఆ తరువాత సార్ డైలాగ్స్ ఉంటాయి.”

“ఓ.కె. పొజిషన్ చూపించు.”

నన్ను రమ్మని సైగ చేసింది. ఇద్దరం ప్లోర్ మీదకి వెళ్లాం. ఈసారి అందరూ లేచి నిలుచున్నారు. మా కోసం కాదు. రజనీశ్ వచ్చాడు. అందరినీ కూర్చోమన్నాడు. డైరక్టర్ కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసాడు. రెండ చేతులూ తల మీదకి పోనిచ్చి కళ్ళు మూసుకున్నాడు. మెల్లగా తెరిచాడు.

“సారికా..”

“ఇతనొట్టి పిచ్చివాడు..”

“కరెక్ట్.”

అందరూ నవ్వారు.

“అదేంటి? అప్పుడే తెలిసిపోయిందా?”

“అలా కాదు సార్. కథలో”

“ఊఁ.. నిన్ను ప్రేమించేసాడు.. గ్రుడ్డిగా.”

“ఓ.కే.”

“నువ్వు ముందుకెళ్ళావు”

“ఓ.కే.”

“కానీ ఇంకో కథ ఉండటం వలన నో అనాల్సి వస్తోంది. లైన్లు చూసుకున్నావా?”

“చదివాను సార్.”

“ఊఁ.. సమీర్.”

“సార్..”

“సినీ రంగంలో అడుగుపెడుతున్న తొలి షాట్ లోనే ప్రేమ తిరస్కారం అని బాధపడకు!”

“అలాంటిదేమి లేదు సార్.”

“ఉండకూడదు కూడా, అసలు కళాకారులకు కళ పట్ల తప్ప దేని మీదా ప్రేమ పనికి రాదు.”

అందరూ చప్పట్లు కొట్టారు. సిగరెట్ తీసాడు. కుర్రాడు ముట్టించాడు.

“నిజం చెబుతున్నాను సమీర్. ఈ పరిశ్రమలో నేను చూసి మరిచిపోయిన దాంట్లో సగం కూడా ఎవరూ చూడలేదు.”

“కరెక్ట్.”

“ఊఁ, లైన్లు చూసావా?”

“చూసాను సార్.”

“ప్రొసీడ్. లైట్స్..”

ఒక్కసారిగా ఆ ఫ్లోరంతా కాంతి నిండిపోయింది. ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చానా అనుకున్నాను. ఈ వెలుగులే నా జీవితంలో నిజమైన వెలుగులు నింపుతాయా అని ఎందుకో అనుకున్నాను.

“కెమెరా”, అరిచాడు రజనీశ్.

అవును, నా జీవితం చిత్రమైనదే. చిత్రీకరించవలసినదే.

“ఏక్షన్!”

ఉత్సాహంగా లోపలికి వచ్చాను. సారిక గోడకి ఆనుకుని చేతులు కట్టుకునుంది.

తన వైపు చూసి కొద్దిగా తల ఎడమ వైపు వంచాను.

“అయితే..”

సారిక తన తలను నన్ను చూడకుండా కుడి వైపుకు తిప్పింది.

“జీవితంలో అదృష్టం అంటే ఏమిటో తెలుసా?”

ఇప్పుడు నన్ను చూసింది. తల దించుకుంది.

“నేను చెబుతాను.”

తల ఎత్తింది.

“కావలసిన వారు ఎదురుగా ఉన్నప్పుడు ఏదైనా సాధించగలం అనే ఆశ తనంతట తానే సముద్రం లోని అలలా అలా పైకి లేవటం.. ఏమైంది రమణి?”

సారిక ఏమీ మాట్లాకుండా నాలుగడుగులు తన కుడి వైపుకు వేసింది.

“రమణీ..”

అటు తిరిగింది సారిక. ఆకాశం వైపుకు చూసింది.

దగ్గరగా వెళ్లాను.

“ఒంట్లో బాలేదా?”

తల అడ్డంగా తిప్పింది.

“మూడ్ బాలేదా?”

అడ్డంగా తిప్పింది.

“మరి? ఎవరైనా ఏమైనా అన్నారా?”

ఎంతో నాజూకుగా అటు తిరిగి నిలబడే నా ముఖంలోకి చూసింది.

“యస్?”

“నన్ను మరచిపో వేణు..”

“కటిట్,”, అరిచాడు రజనీశ్.

అంతే. అందరం కుర్చీల్లోకి వచ్చేసాం. మేకప్ వాళ్లు, ఇతరులు వాళ్ళ పనులలో వాళ్ళు మునిగిపోయారు.

అసిస్టెంట్ వచ్చాడు.

“సార్”

“యస్?”, అడిగాడు రజనీశ్.

“షాట్ రీటేక్ చేద్దామా?”

“నో..”

“అదేంటి సార్!”

“ఇది కూడా తెలియదా?”

“ఏంటి సార్?”

“ఇది మనోడి మొదటి షాట్. ఓ.కే. అంతే, సెంటిమెంట్.”

అందరూ చప్పట్లు కొట్టారు.

“థాంక్యూ సార్” అన్నాను.

చేతులు కలిపాడు రజనీశ్.

“అలా అని కూడా కాదు.”

“చెప్పండి సార్.”

“నీకు చాలా భవిష్యత్తు ఉంది”

“సార్.”

“యస్?”, అని వింతగా అన్నాడు.

“అర్థం కాలేదు సార్.”

సారిక వైపు తిరిగాడు.

“నీకర్థమైందా?”

చిరునవ్వు నవ్వింది సారిక.

“అర్థమైంది.”

“ఏమర్థమైంది సారికా? నవ్వు చాలా స్మార్ట్.”

“మీరు ఇప్పుడే యస్ అని మరోలా అన్నారు.”

“గుడ్. ఏంటి అర్థం?”

“ఈయన చివరగా నన్ను అడిగిన తీరు.. యస్! ఎంతో గొప్పగా ఉంది.”

“యస్”, అరిచాడు రజనీశ్.

లేచి నిలబడ్డాడు.

“బాయిస్, ఒక్కో మాట పలికే తీరులో నటన దాగి ఉంటుంది. ఎంత అర్ధాన్ని చూపించాడు? సమీర్, డబ్బింగ్‌లో దీన్ని అలాగే చెప్పు.”

“యస్ సార్!”

చప్పట్లు మ్రోగాయి..

***

రెండు వారాలు షూటింగ్‌లో మునిగిపోయాను. శరీరం పచ్చడి అయిపోతోంది.

మర్నాడు షూటింగ్ లేదని చాలా ఆలస్యంగా లేశాను. ఫోన్ చూసుకున్నాను. అప్పటికే ఆరు కాల్స్ ఉన్నాయి. నంబరు ఎవరిదో తెలియటం లేదు. బ్రష్ చేసుకొని నంబరుకి కాల్ చేసాను. స్పందన లేదు! ప్రక్కన పెట్టి బాల్కనీ లోకి వచ్చాను. సూర్యుడు పైకి లేస్తున్నాడు. ఎండ ఒక్కోసారి ఇక్కడ తీవ్రం గానే ఉంటోంది.

ఫోన్ మ్రోగింది. లోపలికెళ్లి చేతిలోకి తీసుకున్నాను.

“హలో?”

“యస్?”

సారిక గొంతు. ఇదేంటి? ఈ అమ్మాయి ఎప్పుడూ ఫోన్ చెయ్యదు.

“మేడమ్..”

“ఈసారి యస్ అనను.”

“ఎందుకండీ?”

“నేను మీలాగా యస్ అంటున్నాను. ఆ స్వరంలో మీలాగా బర్కీలో జీడిపప్పు కలిపినట్లు కలపలేను.”

“నాకు అర్ధం కాలేదు.”

“నన్ను మేడమ్ అని దూరం చెయ్యవద్దు, అండీ అండీ అని కూడా అనవద్దు. యస్?”

ఈసారి ఆ చివరి మాట ఏదో రహస్యం చెప్పినట్లు అన్నది.

“యస్.”

“గుడ్. ఈ రోజు షూటింగ్ లేదు.”

“యస్.”

“నన్ను కలుస్తున్నావు..!”

“య..”

(ఇంకా ఉంది)

Exit mobile version