Site icon Sanchika

పూచే పూల లోన-73

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[సారిక సెట్ లోకి రాగానే లేచి నిలబడతాడు సమీర్. నన్ను చూడగానే నిలబడమని ఎవరైనా చెప్పారా అని అడుగుతుంది. సమీర్ ఏదో చెప్పబోతే ఆపుతుంది. ఇంతలో అసిస్టెంట్ వచ్చి స్క్రిప్ట్ ఇస్తాడు. జాగ్రత్తగా చదువుతుంది. అందులో ఏదో సందేహం కలిగితే, అతన్ని అడుగుతుంది. ఈ సీన్‍లో ఇంతేనని, తర్వాత సమీర్ డైలాగ్స్ ఉంటాయనీ, మిగతా విషయం డైరక్టర్ గారు తర్వాత చెప్తారని అంటాడు. రజనీశ్ రావటంతో అంతా ఫ్లోర్ పైకి వెళ్తారు. సమీర్ నటించే మొదటి షాట్‌ చిత్రీకరిస్తారు. సమీర్ తన డైలాగ్స్ బాగా చెబుతూ, నటిస్తాడు. అందుకు తగినట్టుగా స్పందిస్తుంది సారిక. డైరక్టర్ కట్ చెప్తాడు. అసిస్టెంట్ వచ్చి షాట్‌ని రీ-టేక్ చేద్దామా అని రజనీశ్ అని అడిగితే వద్దంటాడు. అది సమీర్ మొదటి షాట్ అనీ, సెంటిమెంట్ ప్రకారం మొదటి షా‍ట్‌ని ఓకే చేయాలని అంటాడు. సమీర్‍ని అభినందిస్తూ, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్తాడు రజనీశ్. వారి సంభాషణలో రజనీష్ యస్ అనే మాటని రకరకాలు పలికిన తీరుని మెచ్చుకుంటుంది సారిక. రజనీష్ తన అసిస్టెంట్లతో మాట్లాడుతూ – ఒక్కో మాట పలికే తీరులో నటన దాగి ఉంటుందనీ, సమీర్ తన మాటల్లో ఎంరో అర్థాన్ని చూపించాడని చెప్పి, డబ్బింగ్‍లో దాన్ని అలాగే చెప్పమని సమీర్‍తో అంటాడు. అందరూ చప్పట్లు కొడతారు. రెండు వారాలు షూటింగ్‌లో మునిగిపోతాడు సమీర్. బాగా అలసిపోతాడు. మర్నాడు షూటింగ్ లేకపోయేసరికి చాలా ఆలస్యంగా నిద్రలేస్తాడు సమీర్. ఫోన్ చూసుకునేసరికి ఆరు మిస్డ్ కాల్స్ ఉంటాయి. ఆ నెంబర్ ఎవరిదో తెలియదు. ఆ నెంబర్‍కి ఫోన్ చేస్తే ఎవరూ మాట్లాడరు. కాసేపయ్యాకా ఆ నెంబర్ నుంచే ఫోన్ వస్తుంది. సారిక మాట్లాడుతుంది. షూటింగ్ లేదు కదా, మనం కలుద్దాం అంటుంది. సరేనంటాడు సమీర్. – ఇక చదవండి.]

[dropcap]సా[/dropcap]రిక ఇంటి గేటు ముందు ఆగాను. ఆ వాచ్‍మన్ ముందు నుంచే నా కోసం చూస్తున్నట్లున్నాడు. గేటు తెరవకుండా బయట నిలబడి ఉన్నాడు. నేను డోర్ తెరవబోతుంటే ఆపాడు. అద్దం క్రిందకి దించాను.

“మేడమ్ లేరా?”

“ఒక్కసారి ఇలా రండి” అన్నాడు.

క్రిందకి దిగి వాడితో నాలుగడుగులు వేసాను.

“ఇంట్లో లేరు”, అన్నాడు.

“మరి రమ్మన్నారు కదా?”

“అవును. ఈ కారుని పంపించేసి అలా నాలుగడుగులు వేసి ఆ ముందరున్న చౌరస్తా వరకూ వెళ్లండి. నన్ను ఇంతే చెప్పమన్నారు.”

కారు అతన్ని వెళ్లిపోమని సైగ చేసాను.

ఇతను మటుకు గేటు తెరవను అన్నట్లు అడ్డంగా నిలుచున్నాడు. నాకు చెప్పిన పని నేను చేసేసాను అన్నట్లు అలా నిలబడ్డాడు. చేసేదేమీ లేక నా కుడి వైపుకు అతను చూపించినట్లు చౌరస్తా వరకూ వెళ్లాను.

మొబైల్ మ్రోగింది. సారిక నంబరు.

“యస్?”

“ఈ యస్ కోసమే చాలా కాలంగా నా జీవితాన్ని ‘నో’ లో గడిపేసాను.”

“నన్ను నడవమన్నాడు అతను.”

“తెలుసు. నడుస్తున్నారు. తెలుసు. సిగ్నల్ దాటిన తరువాత రావి చెట్టు దగ్గర నా కారు కనిపిస్తుంది.”

“ఓ.”

ఫోన్ పెట్టేసి సిగ్నల్ వైపు నడిచాను. ఈ అమ్మాయి ఇలా ఉందా, లేక ఈ సినిమా వాళ్ళంతా ఇంతేనా? ఇదేంటి? కలుసుకుని నాలుగు రోజులు కాలేదు, పెద్ద పెద్ద డయలాగులు చెప్పేస్తోంది?

నన్ను ఆటపట్టించటం కోసమా? జాగ్రత్తగా ఉండాలి.

ఇంటికి రమ్మని కారులో కూర్చుంది. ఏంటి ప్లాను? మెల్లగా సిగ్నల్ దాటాను. దగ్గరలోనే రావి చెట్టు, బీజ్ రంగు కారు కనిపిస్తున్నాయి. సైడ్ మిర్రర్‌లో నన్ను చూస్తోందని తెలుసు, ఎందుకైనా మంచిదని డోర్ దగ్గరే ఆగాను. అద్దం దించింది. డ్రైవర్ సీట్లో కూర్చొనుంది.

“కారులో కూర్చుని చాట్ చెప్పించుకుని తిందామా?”

నేనేమీ మాట్లాడలేదు.

“యస్?” కళ్ళెగరేసింది.

చిరునవ్వు నవ్వుతూ నిలబడ్డాను.

“సమీర్ ఓ సంగతి తెలుసా?”

“ఏంటి?”

“ఆడవాళ్ళు ఏమీ మాట్లాడటం లేదు అంటే ఏదో చెప్పాలని అనుకుంటున్నారని అర్థం.”

“..”

“ఏదో చెబుతున్నారంటే ఏమీ చెప్పటం లేదని అర్థం.”

“నాకు ఏమీ అర్థం కావటం లేదు.”

“కమాన్.”

లోపలికి వెళ్లి డోర్ వేసాను, అద్దం పైకి లేచింది. నన్ను కొంటెగా చూసింది.

“నువ్వు నా బందీవి సమీర్” రహస్యంలా చెప్పింది.

వెటకారంగా నవ్వి ఏమీ మాట్లాడలేదు.

నోట్లో ఏదో చప్పరించింది.

“హీరోయిన్ల గురించి నీకు తెలియదు కదూ?”

“తెలుస్తోంది”

“ఓ.. నాట్ బాడ్.. ఏం తెలుస్తోంది?”

“సినిమాలో నిజమైన స్టంట్లు చేయవచ్చు. కానీ హీరోయిన్లతో మటుకు సరిగ్గా మాట్లాడలేము.”

“కరెక్ట్. హేరోయిన్లతో తిక్కగానే మాట్లాడాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నట్లు.”

“ఓ. ఆరోగ్యం బాగానే ఉంది కదా? ఏదైనా నిద్ర పట్టకపోవటం లాంటివి..?”

“చి ఛీ. అలాంటివి నాకు నాకు ఎప్పుడు ఉండవు.”

“మరి ఏంటి సంగతి?”

కారు స్టార్ట్ చేసింది.

ఏమీ మాట్లాడకుండా ఎటో లాక్కుంటూ పోతోంది.

అమితమైన వేగంతో నడుపుతోంది. ఖచ్చితంగా ఏదో సమస్య ఉంది. ఈ అమ్మాయి ఏవైనా డ్రగ్స్ తీసుకుంటోందా?

దాదాపు ఓ గుట్ట దాకా తీసుకొని వెళ్లి గుద్దబోయి ఆపేసి బిగ్గరగా నవ్వింది.

ఎంతో కోపం వచ్చింది కానీ తమాయించుకున్నాను.

“నాకు నవ్వు రావటం లేదు”, చెప్పాను.

నవ్వు ఆపేసి నా వైపు తిరిగి గంభీరంగా శ్వాస తీసుకుంది,

“నవ్వు రావటం లేదు. అంతేగా నువ్వన్నది?”

“కరెక్ట్.”

బండి స్టార్ట్ చేసింది. రకరకాల సందుల్లోంచి చిత్ర విచిత్రంగా నడిపింది. ఎక్కడకి వెళుతోందో తెలియదు. కారు అలా దూసుకొని పోతోంది.

మలబార్ హిల్స్ మీదుగా ఓ మలుపు తిప్పింది. అటంతా సముద్రం కనిపిస్తోంది. ఒక ఫెన్స్‌ను గుద్దబోయి ఆపింది. నవ్వలేదు కానీ నా వైపు తిరిగింది.

“ఇప్పుడు నవ్వొస్తోందా?”, అడిగింది.

నేను డోర్ తియ్యబోయాను. చెయ్యి పట్టుకొని ఆపింది.

“ప్లీజ్.. వెళ్లకు. నాకు ఇలాంటివి అలవాటు. ఏమీ అనుకోకు.”

“సారికా..” సీరియస్‌గా అన్నాను “..ఏదో తీవ్రమైన బాధలో ఉన్నావు. లేదా నిన్ను ఎవరో ఇబ్బంది పెడుతున్నట్లున్నారు. నాకు చెప్పుకోవాలనుకున్నావా లేక కొద్దిసేపు నాతో ఆడుకోవాలకున్నావా? నాకు ఏదీ అర్థం కావటం లేదు.”

“ఓ..” కళ్ళెగరేసింది. “..ప్రతి మగాడు ఎందుకో తనను తాను హీరో అనేసుకుంటాడు. నాకేదో సమస్య.. అది నువ్వు తీర్చేయగలవు. ఎందుకు ఈ మాటలు?”

డోర్ తీసి దిగిపోయాను. నన్ను ఆపలేదు.

“జాగ్రత్తగా ఇంటికి వెళ్లు”, అన్నాను.

“అంతేనా?”, అడిగింది.

“అవును మరి. నన్ను ఎందుకు రమ్మన్నావో తెలియదు. నేను ఈ వ్యవస్థకి కొత్త, నాకు ఇలాంటి వ్యవహారాలు అర్థం కావు.”

“ఊ.. ఎందుకు పిలిపించానో తెలుసుకోకుండానే వెళ్లిపోతావా?”

“తప్పటం లేదు. ఊరు ఇలా కూడా చూపిస్తారని నాకు తెలియదు.”

నవ్వింది.

“సారీ. ఏమనుకోవద్దు.”

బై చెప్పి నా దారిన నేను నడవటం మొదలెట్టాను.

‘ఏంటిది? నాకు అందరూ చిత్రమైన వాళ్లు దొరుతారు?’ అనుకుంటూ, ఎందుకో ఆగాను. ఈ ప్రాంతమంతా నాకు ఆ రోజు కలలో కనిపించింది. ఏంటి ఈ విడ్డూరం? అతనెవరో కుర్రాడు అలా నన్ను ఎక్కడికో లాక్కెళ్లాడు. ఇంతలో వర్షం మొదలయింది. నన్ను దాటి ఆమె కారు ముందరికి వెళ్లిపోయింది. పార్కింగ్ లైట్లు వెలిగాయి. నా కోసం ఆగినట్లుంది. సారిక బయటకు వచ్చింది. తడుస్తూ కూడా అలాగే నిలబడింది.

నేను గబగబా నడిచాను.

డోర్ తీసి లోపల కూర్చోపెట్టాను. నేనూ లోపలికి దూరాను. మెల్లగా బెల్ట్ పెట్టుకుంది.

“ఇష్టం లేకపోయిన నాతో ప్రయాణం తప్పదు, సమీర్”

బండి స్టార్ట్ చేసింది. మరల ఎక్కడికి వెళుతోందో తెలియదు.

“ఆరోగ్యం పాడవుతుంది సారికా..”, అన్నాను. “..రేపు షూటింగ్ కూడా ఉంది.”

తను ఏమీ మాట్లాడలేదు. ఒక్కసారిగా ఈ అమ్మాయి తరహా మారిపోయింది. కారు బయట వర్షపు ధార అలా కారుతోంది, లోపల ఈమె కళ్లల్లోంచి అలా కన్నీరు కారిపోతోంది. ఈ సాయంత్రం ఈ కారు ఎక్కడో దిగబడటమో లేక మరెవరినో కొట్టెయ్యటం నిర్ణయమైనట్లుంది పైన. నా కుడి చేతిని హండ్ బ్రేక్‍కి దగ్గరగా ఉంచాను. ఏమి ఆలోచిస్తోందో తెలియదు. ఏం చేయాలనుకుందో తెలియదు. నన్ను ఎక్కడికి తీసుకునిపోతోందో తెలియదు..

చివరికి ఓ బంగళా ముందు ఆపింది. నన్ను చూసి నిట్టూర్చింది. ఫోన్ తీసి ఎవరికో కలిపింది.

“ఇంటి ముందున్నాను.”

“మేడమ్.”

“రెండు గొడుగులు తీసుకుని రా.”

ఫోన్ ప్రక్కన పెట్టి తల వంచుకుంది.

“ఏడుస్తున్నావెందుకు?”, అడిగాను.

అటు తిరిగిపోయింది, ఏ సమాధానం లేదు. లోపలి నుంచి ఓ పెద్దాయన రెండు గొడుగులు తీసుకుని వచ్చాడు. అతన్ని చూసి వెంట వెంటనే కళ్ళు తుడుచుకుంది. అద్దం దించింది.

“లోపల అడ్డంగా ఆ కార్లు ఎవరివి?”

“తెలియదు మేడమ్, సార్‌కు తెలిసినవారు రోజూ మీటింగ్ పెట్టుకుంటారు.”

“ఇటు పక్క మెట్ల తలుపు తెరు.”

“తెరిచే ఉంది మేడమ్.”

డోర్ తెరచి గొడుగు చేతిలోకి తీసుకుంది. అతను నా పైన గొడుగు పట్టుకున్నాడు. లోపలికి నడిచాం. మేడ మీద ఇంట్లోకి తీసుకొని వెళ్లింది. అతను గొడగులు బాల్కనీలో పెట్టి లోపలికి వచ్చాడు.

“వంట అయిపోవచ్చింది”, అని చేతులు కట్టుకున్నాడు.

“స్నాక్స్ పెట్టు.”

అతను వెళ్లిపోయాడు.

“ఇక్కడే డిన్నర్ చేద్దాం, ఓకేనా?”

“ఓకే. ఇది మీ ఇల్లా?”

“నేను పుట్టి పెరిగిన ఇల్లు.”

“ఓ. చాలా పెద్దది.”

చిరునవ్వు నవ్వింది. ఎందుకో ఇప్పుడు మామూలుగా ఉన్నట్లుంది. ఏదైనా అటాక్ వచ్చిందా?

నాలుగు గుటకలు మింగింది.

“సమీర్..”

“యస్?”

“ఆ యస్ అనేది మృదువుగా అనవా?”

“యస్?”

“ఏమీ అనుకోకు సమీర్.”

(ఇంకా ఉంది)

Exit mobile version