పూచే పూల లోన-75

0
2

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[తన ప్రవర్తనకి సారీ చెబుతుంది సారిక. తాను ఎప్పుడు ఏం చేస్తానో తనకే తెలియదని, జీవితం ఇలా సాగిపోతోందని చెబుతుంది. ఇంటికి వెళ్ళినప్పుడు చక్కగా రిసీవ్ చేసుకున్న ఈమె, ఇప్పుడిలా పిచ్చిదానిలా ప్రవర్తించిందనీ, రేపు ఈమెతో కలిసి నటించడమెలా అని అనుకుంటాడు సమీర్. తాను జీవితాంతం నో నో లలో నలిగిపోయాననీ, అందుకే సమీర్ యస్ అనడం తనకి నచ్చుతోందని అంటుంది సారిక. తన తల్లిదండ్రులతో సమస్యలెదుర్కున్నానని చెబుతుంది. స్వతంత్రపు ఆలోచనల ద్వారా మనం ఎదగాలంటూ, తాను ఆస్తిని వదిలేసి కారు షెడ్‍లో కాలం గడుపుతూ ముంబై వచ్చిన సంగతి చెప్తాడు. డ్రింక్ తాగమంటే తాగనంటాడు. సమీర్ మంచివాడే కానీ మెల్లమెల్లగా చెడిపోగలడని అంటుంది సారిక. చెడిపోతున్నప్పుడూ చూస్తూండకూడదని, ఆదుకోవాలని అంటాడు. తాను గోవా వదిలి ఎందుకు వచ్చేసింది చెప్తాడు. ఇద్దరూ పైకి వెళ్తారు. – ఇక చదవండి.]

[dropcap]సా[/dropcap]రికతో చాలా సినిమాలు చేసాను. పలు చోట్ల మానసికంగా దెబ్బ తింటున్నప్పుడు నన్ను ఎంచుకుని గట్టిగా పట్టుకుని బేలగా కన్నీళ్లు పెట్టుకునేది.

మా ఇద్దరి మధ్య జరిగిన ఒక సన్నివేశం – రజనీశ్ దర్శకత్వం లోనిదే, ఆ అమ్మాయిని బహు విధాల ఇబ్బంది పెట్టింది. చాలా సార్లు అనుకునే వాడిని, సినిమా సినిమానే నిజ జీవితం నిజ జీవితమే అని. అది పూర్తిగా నిజం కాదని తెలుసుకొన్నాను.

ఆశ్చర్యం ఏమిటంటే ఆ దృశ్యం మా ఇద్దరినీ ఎంతో ప్రాచుర్యంలోకి తీసుకొని రావటమే కాదు, ఇద్దరి జీవితాలలో ఒక చిత్రమైన సరిక్రొత్త మలుపును ముందర ఉంచింది. అది తొలుత మరాఠీలో ‘అభంగ్’ అనే చిత్రం. తరువాత హిందీలోకి వచ్చింది. అభంగ్ అనేది ఒక సంగీత ప్రక్రియ, ఒక భజన లాంటింది. వాటిని పాడుకునే హీరోని. నాతో పాటు గంతులేసే పాత్ర సారికది. నేను డప్పు కొడుతుంటే సారిక చిందులెయ్యాలి. చాలా ఆసక్తితో ఆ పాత్ర చేసింది. ఎన్ని రీటేక్స్ అయినా చేసేది. ఇంట్లో నాట్యం అభ్యసించేది. ఆ నెపంతో నన్ను ఇంటికి పిలిచేది..

“నన్ను ఆటలాడిస్తున్నావు కదూ?”, అడిగింది.

“నీ ఆటలో ఆటనైపోయాను. ఏం చెయ్యను?”

పాట మొదలవ్వగానే కుడి చేయి చెవి దగ్గర పెట్టుకుని బొమ్మ కదలినట్లు కదిలేది.

“కమాన్”, అరిచేది.

సెట్‌లో ఎలాగూ తప్పదు. ఇక్కడ కూడా ఈ బాధేనా అనిపించేది. సోఫాలో వాలిపోయి ఉండేవాడిని.

నాలుగు రౌండ్లు అటూ ఇటూ తిరిగి నడుము మీద చున్నీని తీసి చెమట అద్దుకుని ప్రక్కనే కూర్చొనేది.

“ఇదే సెట్ మీదయితే ఎవరో వెంటనే వచ్చి  మేకప్ అద్దేవారు”, అంది.

“నేను అద్దాలా? ఏంటి సంగతి?”

“సర్లె, నేను ఎంత చనువిచ్చినా అలాంటి పనులు చెయ్యవు..”

ఆ రోజు సరదాగానే ఉంది నాకు.

“ఎలాంటి పనులు?”, మెల్లగా అడిగాను.

ఒక్కసారి ఆగిపోయి సూటిగా గుచ్చుతున్నట్లు చూసింది.

“ఓహో! ఇలాంటి ప్రశ్నలు వేయగలిగావంటే నీలో ఏదో మార్పు వస్తోంది. నాట్ బాడ్!”

“ఏం మార్పో ఏంటో గోల. కెమెరా ముందు ఎన్నో సార్లు నిన్ను దగ్గరకి తీసుకున్నాను. కానీ షాట్ అయ్యాక, ఎన్నడూ ఎటువంటి ఆలోచనా రాలేదు.”

సారిక ఏమీ మాట్లాడలేదు. లేచి డైనింగ్ టేబిల్ మీద నుండి బాటిల్ లోంచి ఓ గ్లాసు నింపుకుని గడగడా త్రాగింది.

“సమీర్..”

“యస్?”

కొంటెగా చూసింది.

“ఆడది బాగా నటిస్తుందా? మగాడు బాగా నటిస్తాడా?”

నేనేదో చెప్పబోతుంటే చెయ్యి అడ్డు పెట్టింది.

“ఏదో టెక్స్ట్ బుక్ సమాధానం వద్దు. ఆలోచించి చెప్పు.”

“అసలు ఎవరైనా ఎందుకు నటించాలి?”

“కమాన్.. అది లేకుండా జీవితం ఉందా?”

“ఎందుకుండదు?”

“ఉండాలి.”

“ఉండదు.”

ఆలోచించాను. ఇదేంటి? ఇంత నిక్కచ్చిగా చెబుతోంది?

“ఎందుకుండదు?”

“చంటిపిల్లని బజ్జగించేటప్పుడు చేసేది నటనే కదా?”

“….”

“ఏదో అవసరానికి భార్యను భర్త లాలిస్తూ ఉంటాడు. నటనే కదా?”

“ఎక్కడికో వెళ్లిపోతున్నావు.”

“నో. పూజలు పునస్కారాలు చేసి అలవాటుగా భర్త పాదాలకు నమస్కారాలు చేసేస్తారు. చాలా మటుకు నటనే కదా? ఆఫీసులో బాస్ ముందు తలవంచి వినయం చూపిస్తారు. నటన కాదా?”

“అవి లేకుండా జీవితం లేదా?”

“ఉంది. సాఫీగా ఉండదు.”

“నీ బాధేంటి?”

“నేనడిగిన ప్రశ్న.”

“ఎవరు బాగా నటిస్తారు? ఆడవాళ్ళా, మగవాళ్లా? అంతే కదా?”

“అవును. కమాన్. నీకు సమాధానం తెలుసు. తెలిసి కూడా చెప్పకపోతే..”

“ఆ బాటిల్‌తో నా తలకాయ పగలగొడతావు. అవునా?”

చిరునవ్వు నవ్వింది.

“సమీర్..!”, చాలా మృదువుగా అడిగింది. “అలాంటి ఆలోచన కూడా రానీయకు.”

“ఎందుకు?”

ఎందుకో చున్నీని తల మీద కప్పుకుంది.

“నిరంతరం మనసులో మెదిలే వాళ్లని బాధపెట్టే ఆలోచన ఎన్నడూ రాదు, రాకూడదు.”

“డయలాగ్ బాగుంది. ఇంతకీ సమాధానం చెబుతాను, విను.”

“చెప్పు.”

దగ్గరగా వెళ్లి ఆ చున్నీని తల మీద నుంచి లాగాను.

“ఆడవాళ్లే బాగా నటిస్తారు” అని నవ్వాను.

కోపంతో ఊగిపోయింది. ఒక్క దెబ్బ వెయ్యాలనుకుంది. నేను తప్పుకునేసరికి కొద్దిసేపు ఆ హాలులో పరుగు పందెం లాంటి కార్యక్రమం జరిగిపోయింది..

***

పూర్ణచంద్రుడు ఆకాశంలో వెలిగిపోతున్నాడు. కొండల మాటున ఎక్కడో డప్పు సన్నగా వినిపిస్తోంది. ఇక్కడ ఎవరూ కనిపించకపోయినా ఎక్కడో గజ్జెల చప్పుడు వినిపిస్తోంది. రెండుసార్లు డప్పు, రెండుసార్లు గజ్జెల చప్పుడు.. అలా లయబద్ధంగా వినిపిస్తోంది. కొద్ది సేపు నిశ్శబ్దం కమ్ముకుంది. మెల్లగా జోడు శబ్దాలు మరల మొదలయ్యాయి. ఆకాశంలో మబ్బు మెల్లగా చంద్రుని వైపు వెళుతోంది. కుడి వైపు దూరంగా సారిక కొండ గట్టు మీదకి ఎక్కింది. రెండుసార్లు కాలితో నేలను తన్నింది. గజ్జెల శబ్దం ఏదో చెప్పాలనుకున్నట్లు చెబుతోంది. దానికి సమాధానంగా డప్పు వినిపించటం లేదు. సారిక ఆగిపోయింది.

రెండడుగులు వెనక్కి వేసి ఊపిరి తీసుకుంది. చుట్టూతా చూస్తోంది.

మబ్బు చంద్రుని వైపు కదులుతోంది. చెట్లకు ఊగుతున్న కొమ్మలు ఈదురుగాలికి వింత చప్పడు చేస్తున్నాయి. నేల మీద రాలియున్న ఎండుటాకులు దుమ్ముతో పాటు గాలిలోకి ఎగిరి సుడిగండంలో దూకుతున్నాయి. మరల నిశబ్దం కమ్ముకుంది. తుఫాను రాబోతోందా? ఏమో, లేక వచ్చి ఎందుకో మరల వచ్చేందుకు ఆగిపోయి ఉన్నదా? ఏమో..

అప్పటికప్పుడు అనుకోని విధంగా డప్పు శబ్దం దూరంగా రెండుసార్లు వినిపించింది. సారిక మొహంలో ఆనందం – మబ్బు చాటు నుండి చంద్రుడు వెలుపలికి వచ్చినట్లు వెలిగిపోయింది. గట్టు మీద తిరిగి పరుగు తీయబోయి ఎందుకో ఆగింది. కుడిచేతి చూపుడు వేలు పెదవుల మధ్యకు తీసుకొని వెళ్లింది. అటూ ఇటూ బిత్తర చూపులు చూసింది.

ఆలోచించి మరల రెండుసార్లు గజ్జెలతో శబ్దం చేసింది – ఈసారి కొద్దిగా దగ్గరగా డప్పు శబ్దం రెండుసార్లు వినిపించింది.

అలోచిస్తున్నట్లు కనిపిస్తునే సారిక ఈసారి మూడుసార్లు శబ్దం చేసింది. డప్పు కూడా మూడుసార్లు శబ్దం వినిపించింది. కానీ ఎక్కడి నుండి వస్తోందో తెలియటం లేదు. ఇంతలో చున్నీ గాలిలోకి ఎగిరిపోయింది.

అది అలా పోతోంది. దారం తెగి దారి లేని గాలిపటంలా ఆకాశంలోకి వెళ్లిపోతోంది. ఏ శబ్దమూ లేదు. చంద్రుడు మరల మబ్బు వెనుకకు వెళ్లాడు. ఒక చెట్టు కొమ్మకు అతుక్కుంది చున్నీ. సారికకు ఏదో అనుమానంగా ఉంది. జాగ్రత్తగా గట్టు మీద నడుస్తోంది. గజ్జెలతో కావాలని శబ్దం చెయ్యకపోయినా ఆ సన్నని శబ్దానికి కూడా సరిజోడులా సన్నని డప్పుతో తాళం వినిపిస్తోంది. కానీ అది ఎక్కడి నుండి వస్తోందీ అన్నది అర్థం కావటం లేదు..

అయినా సారిక ముందరకి వెళుతోంది. మబ్బు తొలగి చంద్రుడు బయటికి వచ్చాడు. చీకటి తన పొరలను పెంచుకుంటోంది. వెన్నెల తన తెరలను తెరుస్తోంది, అడుగులో అడుగు వేస్తోంది సారిక. డప్పు వినిపిస్తే బాగుండని ఆగిపోయి వింటోంది. ఈసారి ఒక్క దరువు వినిపించింది. సంతోషంలో గట్టిగా గజ్జెతో శబ్దం చేసింది. డప్పు కూడా గట్టిగా వినిపించింది. గబగబా పరుగులు తీస్తోంది సారిక. గజ్జెల శబ్దం, డప్పు శబ్దం రెండు లయబద్ధంగా సాగుతున్నాయి. దాదాపు గట్టు చివర వరకూ పరుగు తీసి హఠాత్తుగా ఆగిపోయింది సారిక. చంద్రుడు మబ్బు చాటున సగమే కనిపిస్తున్నాడు. చంద్రుని వైపు చూసింది సారిక. కొద్దిగా ఆయాసపడుతోంది.

ఆ కొండగట్టుకు ఎడమ వైపు చివార్న తలకి గుడ్డ కట్టుకొని విలన్ కూర్చున్నాడు. నక్కి దాక్కున్నాడు. గజ్జెల చప్పుడు ఆగిపోయిందని గ్రహించాడు. సారిక ఎవర్నో వెతుకుతున్నట్లు అటూ ఇటూ చూస్తోంది. చెట్టు కొమ్మకు ఇరుక్కున్న చున్నీ గిలగిలా కొట్టుకుంటుంది. కూర్చునే ఉన్న అతను గుట్ట వారగా చప్పుడు లేకుండా ఎగబ్రాకాడు. తన రెండు చేతులూ గట్టు మీదకి పెట్టి పట్టు చిక్కించుకున్నాడు.

ఈ డప్పు శబ్దం ఎవరిదో అనే అనుమానం సారికకు కలుగుతోంది. ఏదో అర్థం చేసుకొని పరుగు తీసే లోపు విలన్ సారిక కాళ్ళ చుట్టూ చేతులు కొండచిలువలా చుట్టేసి క్రిందకి లాగేసాడు. తన భుజం మీద వాల్చుకుని చేతులు కట్టేసాడు. కొద్దిసేపు కుమ్ములాటలో శబ్దాలు వినిపించాయి. చివరకు నోటికి గుడ్డ కట్టేసాడు. భుజం మీద వేసుకుని గట్టు మీదుగా సాగిపోయాడు. వదిలించుకునే ప్రయత్నంలో సారిక కాళ్ళు ఊపుతూ అతన్ని తన్నే ప్రయత్నం చేస్తోంది. ఏ ఫలితం లేదు. గజ్జెల శబ్దం మటుకు గట్టిగా వినిపిస్తోంది. చంద్రుడు పూర్తిగా మబ్బు చాటుకు వెళ్లిపోయాడు.

“కట్”, అరిచాడు రజనీశ్!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here