Site icon Sanchika

పూచే పూల లోన-76

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[సారికకీ, తనకీ ఎంతో పేరు తెచ్చిన ఒక సీన్ గురించి చెప్తాడు సమీర్. రజనీశ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అది. ‘అభంగ్’ అనే మరాఠీ సినిమాకి హిందీ రీమేక్. ఆ సినిమాలో సారిక గాయనిగా, సమీర్ డప్పు కళాకారుడిగా నటిస్తారు. ఈ సన్నివేశం కోసం ఇంట్లోనూ నాట్యం సాధన చేసేది సారిక. తాను చేయడమే కాకుండా, సమీర్‌ని కూడా పాల్గొనమనేది. అలా రిహార్సల్స్ చేస్తున్నప్పుడు – ఆడవాళ్ళు బాగా నటిస్తారా? మగవాళ్ళు బాగా నటిస్తారా అని సమీర్‍ని అడుగుతుంది. అసలెవరైనా ఎందుకు నటించాలి అని సమీర్ అడిగితే, నిత్యజీవితంలోని నటనకి సంబంధించిన కొన్ని ఉదాహరణలు చెప్తుంది. కాసేపు ఆమెను ఉడికించి, ఆడవాళ్ళే బాగా నటిస్తారని చెప్తాడు సమీర్. షూటింగ్ మొదలవుతుంది. కొండలు, మేఘాలు, చండ్రుడితో కూడిన అందమైన ప్రకృతి దృశ్యం. డప్పు ధ్వనిని అనుసరిస్తూ, నాయిక కొండలలో నృత్యం చేస్తూ ఉంటుంది. ఆ డప్పు నాదం వెంటే వెళుతూంటుంది. ఆ డప్పు వాయిస్తున్నది తన ప్రియుడని భావిస్తుంది. కానీ అది ఆమె అనుకున్న వ్యక్తి కాదు. విలన్. నాయికను భ్రమలో ఉంచి, ఆమె పై అదును చూసి దాడి చేస్తాడు. తన భుజాల మీద వేసుకుని ఎత్తుకెళ్ళిపోతాడు. కట్ చెప్తాడు రజనీశ్. – ఇక చదవండి.]

[dropcap]ఏ[/dropcap]దైనా చిత్రం సూపర్ హిట్ అయిపోయి మీడియాలో విపరీతంగా చర్చ లోకి రాగానే కొన్ని చానెల్ వాళ్లు కార్యక్రమాలకు పిలిచేవాళ్లు. సారిక ఏ రోజూ ఒంటరిగా వెళ్లేది కాదు. నేను ఉండాల్సిందే అని పట్టుపట్టేది. అలా ఎందుకు చేసేదో అర్థం అయ్యేది కాదు. చాలా మంది, కలసి నటించాం కాబట్టి ఏదైనా ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే సమీర్ ఉండాలని కోరుకుంటోంది అనుకునేవారు. నేనే ఒకసారి ఒక మీడియా మనిషిని అడిగాను. అతను

ఓ మాట అన్నాడు.

“అది సరైన పద్ధతే సార్..!”, చెప్పాడు. “..ఓ విషయంలో మీరొక మాట చెప్పి, ఆమె మరో మాట చెబితే ఇండస్ట్రీలో గొడవలు ప్రారంభం అవుతాయి.”

“మరేదో అర్థాన్ని మరి చాలా మంది చెప్పేస్తున్నారు?” అన్నాను.

అతను నవ్వాడు.

“అలా చెబితేనే జనం చూస్తారు.”

“నిజాల గురించి ఎవరికీ అక్కరలేదన్నమాట.”

“ఏం చేస్కుంటారు నిజాలని?”

***

అది వరకు చెప్పిన సీను ప్రజలలో చిరస్థాయిగా మిగిలిపోయింది. దాని పేద ప్రత్యేకమైన వార్తలు సాగుతున్నాయి. ఈసారి యాంకర్ ఒక అమ్మాయి. ప్రశ్నలు వేస్తోంది.. ఇద్దరం ప్రక్కప్రక్కన కూర్చున్నాం. నాకు ఈ రోజుకి అర్థం కానిది ఒకటి ఉంది. షూటింగ్‌లో ఎన్నో సార్లు ఎంతో దగ్గరగా కలసి ఏ జంకూ లేకుండా పాల్గొన్నప్పటిని ఎందుకో ఇలాంటి సందర్భాలలో భయం భయంగా, ఏదో సిగ్గు పడతున్నట్లు కనిపించేది సారిక.

“మేడమ్, ఈ సీన్ మీరే చెయ్యగలరు, మరెవరూ చెయ్యలేరు అని చాలా మంది సినీ విశ్లేషకులుంటారు.. మీకేమనిపిస్తుంది?”

“అభిమానంతో చాలా మంది మాట్లాడతారు. ఎవరైనా చేస్తారు.”

“మీరేమంటారు సార్?”

“ఎవరైనా చెయ్యగలరు అనేది తరువాత మాట. సారికలో ఒక టైమింగ్, ఒక చక్కని మూడ్ షిప్ట్ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ డప్పు శబ్దం తన ప్రియుడు చేస్తున్నాడా లేక ఎవరా అన్న అనుమానం వచ్చినప్పుడు ఆ దగ్గర షాట్‌లో నాకు బాగా గుర్తు. నాతో కూర్చున్న వారంతా గుసగుసలు చెప్పుకున్నారు.”

ఆ అమ్మయి అడిగింది, “సార్, మామూలుగా కొన్ని అద్భుతాలు జరుగుతున్నప్పుడు అక్కడ పని చేస్తున్నవారికి తెలిసిపోతుంది కదండీ?”

“అవును. ఎన్నో షాట్లు తీస్తూ ఉంటారు. ఏదైనా మనసును ఆకట్టుకునేదీ, తప్పకుండా ప్రజలను కదిలించేదీ రాబోతుందనకున్నప్పుడు సృజన నింపుకున్న వారు చాలా మంది స్పందిస్తూ ఉంటారు. ఇక్కడా అలాగే జరిగింది.”

“మేడమ్.. ఆఁ.. సారిక గారూ, ఇంత ఆలోచింపజేసే సన్నివేశం మీకిచ్చినప్పుడు ముందర మీరేమనుకున్నారు? అంటే దర్శకుడు మీకు వివరించినప్పుడు ఏమనిపించింది?”

“నిజమే. అమాయకంగా, ఏదో పాటకి చిందు వేస్తూ హాయిగా జీవితం గడపుకునే ఒక అమ్మాయికి ఇలా అదే ప్రక్రియలో ఒక దర్మార్గుడు దురాగతం చేయటానికి సిద్ధంగా ఉండగలడనే ఊహ అంత తేలిగ్గా రాదు. చాలా సార్లు నాలో నేను చర్చించుకున్నాను.”

“ఓ. సారికగారూ, నిజ జీవితంలో ఎవరైనా మోసం చేస్తే మీకెలా ఉంటుంది?”

నా వైపు తిరిగింది సారిక.

ఇదేంటి? మోసం అన్న మాట వచ్చేసరికి నా వైపు తిరిగింది?

ఆ మాటే అడిగాను

“ఏంటి? నను చూస్తావెందుకు?”

విరగబడి నవ్వింది.

“మోసం..”, చెప్పింది, “..మోసమంటే ఏం చెయ్యగలం? అది జరిగిపోయాకే తెలుస్తుంది. చేతనైతే ముందుగా జాగ్రత్త పడాలి.”

“మోసం చేసిన వారిని ఏం చెయ్యాలనిపిస్తుంది?”

“చంపేయాలన్నంత కోపం వస్తుంది.”

“మీకెలా ఉంటుంది సార్? ఆ సినిమాలో ఐతే పళ్ళు బిగించి స్టంట్స్ చేస్తారు.. అవునూ, స్టంట్ అంటే గుర్తుకొచ్చింది. మీరు నిజంగానే స్టంట్ చేస్తారు, ఇందులో ప్రావీణ్యం ఉందని విన్నాను. నిజమేనా?”

“ఒకానొకప్పుడు ట్రెయినింగ్ తీసుకున్నాను.. స్టంట్‌లో కాదు. నిజంగానే అవసరమైతే ఓ నలుగురుని చితక్కొట్ట గలను కానీ అలా ఎప్పుడు చెయ్యలేదు. నేను చాలా మామూలు మనిషిని!”

“ఓ. అందుకే ఇంత గొప్ప స్టార్ అయ్యారు.”

“అది మీరనుకునే మాట.”

“సారిక గారు..”

“యస్?”

“ఓ! అవునూ, ఈ ‘యస్’ అనే మాట మీద కోకొల్లలుగా కథలు కథలుగా వస్తున్నాయి. ఏంటండీ ఇది?”

“మా డైరక్టర్ రజనీశ్ గారు మొట్టమొదటి సారి సమీర్‌లో ఈ ‘యస్’ అనే స్టైల్‌ను గుర్తించారు. అది అలా ప్రాకిపోయింది. ఒక్కొక్కరిలో ఒక్కక్క మణిపూసను ఆవిష్కరించటం అది ఆయన గొప్పతనం.”

“రజనీశ్ గారికి సమీర్‌ను పరిచయం చేసింది మీరే అంటారు నిజమా?అంటే సమీర్‌కు మీకు ఎలా పరిచయం?”

దొంగ చూపు చూసింది సారిక.

“ఆశ్చర్యంగా ఉంది. ప్రాచుర్యానికి ఒక సమస్య ఉంది. తెలియని క్రెడిట్లన్నీ వచ్చి పడుతూ ఉంటాయి. సమీర్‌ను తెరకు పరిచయం వేసింది రజనీశ్‍ గారే.”

“ఓ. మీ ఇద్దరి జోడీ ఇండస్ట్రీని ఏలుతోంది. చాలా చోట్ల చాలా పుకార్లున్నాయి!”

సారిక నమస్కారం పెట్టింది.

“దయ చేసి వాటి జోలికి వెళ్లకండి. పుకార్లని ఒక ప్రక్క మీరే అంటున్నారు.”

ఆ అమ్మాయి నా వైపు చూసింది.

నేనూ నమస్కారం పెట్టాను.

“ఇదిగోండి. నేను కూడా నమస్కారం పెడుతున్నాను. అక్కడితో ఆపెయ్యండి.”

ఆ అమ్మాయి నవ్వింది. ఈ చానెల్ వాళ్లకి ఎన్నో టెక్‍నిక్కులుంటాయి.

“తప్పకుండా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ఇక్కడికి ఆహ్వానించలేదు. మీ అందరికీ మేమందరం అభిమానులం. అంచాత నో ప్రాబ్లమ్. సార్, మిమ్మల్ని ఒకటి అడగాలి.”

“మరి అందుకే కదా పిలిపించారు?”

“యస్.. నో.. యస్., అది కాదు, సినిమాలో హీరోయిన్‌ని గానీ, లేక మరే ఇతర చిన్న ఆర్టిస్ట్‌ని గానీ ఇబ్బంది పెడుతూ, కొద్దిగా అశ్లీలంగా వ్యవహరిస్తున్నప్పుడు మీరేమైన అడ్డుకునే ప్రయత్నం చేస్తారా?”

నన్ను ఎక్కడో గట్టిగా తగులుకుంది ఈ అమ్మాయి.

“సామాన్యంగా అటువంటి సన్నివేశాలున్నప్పుడు, అవసరమా అని నేను అడుగుతాను.”

“అవసరమే అంటే?”

“ఏం చెయ్యగలం? మోతాదు తగ్గించమంటాం.”

“అంతకంటే ఏం చేయలేరా?”

“నన్నే అవతలకి పొమ్మని మరొకరిని తెచ్చుకుంటే నేనేం చెయ్యగలను?”

“నిజమే. ఇండస్ట్రీలో హీరోలుండవచ్చు, హీరోయిజమ్ ఉండదు.”

“సారిక గారూ, నేనొకటి విన్నాను.”

భయపడుతూనే తల పైకి ఎత్తింది సారిక.

“ఏం లేదూ, క్రొత్త హీరోయిన్లు, లేదా చిన్న ఆర్టిస్టులూ.. వీళ్లందరినీ పెట్టుకుని రక రకాల సీన్లు ఊరికే తీసుకొని ఎడిట్ చేసి డైరక్టర్లు, కెమెరామెన్లు సరదాలు తీర్చుకుంటూ ఉంటారట. నిజమేనా?”

“నాకు తెలియదు. నేను అలాంటివి ఎప్పుడూ చూడలేదు.”

“విన్నారా?”

“ఏమో పెద్దగా గుర్తు లేదు.”

“ఆ రంగాన్ని ఎంచుకున్నవారికి అది తప్పదన్న ప్రచారం ఉంది. అన్నింటికీ సిద్ధపడే వస్తారు. అవునా?”

సారిక మొహం ఎర్రగా మారింది.

“నేనలా రాలేదంటే నమ్మగలరా?”

అమ్మయి చిరునవ్వు నవ్వింది.

“మేడమ్, రజనీశ్ గారి గురించి చాలా చక్కని పేరుంది ఇండస్ట్రీలో.”

“కరెక్ట్.”

“సార్, మీరేమంటారు?”

“సినిమా అనేది కెమెరాతో చూపెట్టేది, పది మందిలోకి వచ్చి సిగ్గు పడుతున్నట్లు నటించాలన్నా సిగ్గు విడిచి నటించాలి. ఇది బజారు, మార్కెట్. అయినప్పటికీ కొన్ని నియమాలుండాలని నేను చాలా సందర్భాలలో చెప్పి ఉన్నాను. నాకు వీలైనంత వరకు పాటించాను.”

ఆ అమ్మాయి ఎక్కడి నుంచో ఓ పుస్తకం తీసింది. ఒక పేజీ తిరగేసి, “సార్, ఇది గోవా చరిత్ర గురించి చెప్తున్న పుస్తకం.” అంది.

“ఓ.”

“ఒక జాతి ఔన్నత్యం అక్కడి స్త్రీలు హింసింపబడే వరకేనిని అంటాడు ఈ చరిత్రకారుడు. మీరు గోవా నుంచి వచ్చారు కాబట్టి అడుగుతున్నాను. సినీ రంగం స్త్రీలను చూపించినంత అసభ్యంగా మరే రంగం చూపించదు. మన జాతి మీద ఈ ఇండస్ట్రీ దాడి చేయలేదంటారా?”

నన్ను కత్తితో పొడిచిన ప్రశ్న అది.

“కీర్తి, కాంత, కనకం.. ఈ మూడే చరిత్రను, చరిత్రకారులను కూడా చుట్టూతా తిప్పుకున్నాయి. ఒక రంగాన్ని అనుకుని ఉపయోగం లేదు. బలవంతుడే క్షత్రియుడు. పేరున్నవాడిదే ధర్మం, నలుగురు చెప్పేదే న్యాయం.. నన్ను నిలదీయవలసిన అవసరం ఏముంది? ఒక్క గోవా చేసిన పాపం ఏది?”

“మీరు బలవంతులు, పేరు కలవారు కూడాను. ఎంతో ఫాలోయింగ్ ఉన్నవారు. ఏదైనా అవార్డు కోరుకుంటున్నారా?”

“వద్దు. మాములుగా ఓ పది మంది తిట్టుకుంటూ ఉంటారు. అవార్డు ఇస్తే పది మందీ తిట్టుకుంటారు!”

(ఇంకా ఉంది)

Exit mobile version