పూచే పూల లోన-77

0
3

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[సారిక, సమీర్‍లు నటించిన చిత్రాలు హిట్ అయి మీడియాలో చర్చల్లోకి రాగానే కొన్ని టీవీ ఛానెల్స్ వాళ్ళు కార్యక్రమాలకు పిలిచేవారు. ఇద్దరూ కలిసే వెళ్ళేవారు. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే, సమీర్ ఉండాలని సారిక భావిస్తుందోనని జనాలు అనుకోసాగారు. సమీర్ ఓ సినిమా మనిషిని అడిగితే, అది సరైన పద్ధతేననీ, ఓ మీరొక మాట చెప్పి, ఆమె మరో మాట చెబితే ఇండస్ట్రీలో గొడవలొస్తాయని అంటాడు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ‘అభంగ్’ సినిమాలో డప్పు సీను గురించి చర్చ వస్తుంది. యాంకర్ సారికని బాగా మెచ్చుకుంటుంది. ఎవరైనా చేయగలరా సీన్‍ని అని అంటుంది సారిక. మీరేమంటారని యాంకర్ సమీర్‍ని అడిగితే, ఆ సీన్‍లో సారిక కనబరిచిన ప్రతిభని వివరిస్తాడు. తర్వాత సినిమాలకి సంబంధించి మరికొన్ని ప్రశ్నలు వేస్తుంది యాంకర్. కాసేపయ్యాకా, ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తే మీకెలా ఉంటుందని సారికని అడుగుతుంది. మోసం చేసిన వారిని చంపేయాలన్నంత కోపం వస్తుందని చెప్తుంది సారిక. తర్వాత సమీర్ ‘యస్’ అనే స్టైల్ గురించి చర్చిస్తుంది. సినిమాలో హీరోయిన్‍ని కానీ, చిన్న ఆర్టిస్టులను గానీ ఇబ్బంది పెడుతూ, అశ్లీలంగా వ్యవహరిస్తున్నట్టు మీ దృష్టికి వస్తే ఏం చేస్తారని సమీర్‍ని అడుగుతుంది. ముందు ఆ సన్నివేశాలు అవసరమా అని అడుగుతాననీ, వీలైతే మోతాదు తగ్గించమంటానని చెప్తాడు. అంతకంటే ఏం చేయలేరా అంటే, నన్నే అవతలకి పొమ్మని మరొకర్ని తెచ్చుకుంటారని చెప్తాడు. ఆపై గోవా చరిత్ర గురించి, సినీరంగం స్త్రీలపై చేస్తున్న దాడి గురించి ప్రశ్నలు వేస్తుందా యాంకర్. సమయస్ఫూర్తిగా జవాబులు చెప్తాడు సమీర్. – ఇక చదవండి.]

[dropcap]ఆ[/dropcap] చానెల్ వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచినప్పుడే అనుకున్నాను, ఏదో లోతైన విషయాన్ని మా ద్వారా సమీక్షిస్తారని! సామాన్యంగా చానెల్స్ పని చేసే విధానం గొప్ప సమీక్షలతో ఉండదు. ఈ రాత్రి గడిచింది చాలు అనేటట్లుంటుంది. కానీ ఆ యాంకర్ నన్ను ఎక్కడో నిలదీస్తుందని తెలుసు. దానికొక కారణం ఉంది. మీడియా స్టడీస్‍లో మంచి పేరున్న ఓ కాలేజీలో నన్ను ఎందుకో ఆ మధ్య స్నాతకోత్సవానికి ఆహ్వానించారు. చివరగా ప్రసంగించమన్నారు. ఆ ప్రసంగం చేయాలని నన్ను మైకు ముందుకు పిలుస్తూ ఆ కుర్రాడు ఒక మాట అన్నాడు..

“జీవితానికి, తెరకీ మధ్య సంబంధం ఉన్నదా, ఉంటే ఏంటి? సమాజాన్ని సినిమా ప్రభావితం చేస్తుందా లేక సమాజం సినిమాని ఎలా చూపించాలో, ఆ కాలానికి అలానే చూపిస్తుందా.. ఇవన్నీ ఆలోచింపచేసే ప్రశ్నలు. సమకాలీన సమాజంలో ఒక తీవ్రవాద సంస్థలో సక్రియంగా పాల్గొంటూ తన సోదరుడు ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన తరువాత జన జీవనస్రవంతి లోకి వచ్చేసి ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకుని సినిమాలలో నటిస్తూ డాన్స్, ఫైట్స్‌తో యువతను ఉర్రూతలూగించిన ఒక హీరో గురించి అందరికీ తెలిసినదే. సమీర్ గారికి అటువంటి నేపథ్యం ఉన్నదని నేను చెప్పను. కానీ వారి జీవితంలోకి తొంగి చూస్తే ఎన్నో సుడిగుండాలు కనిపిస్తాయి. ఆయనకీ, గోవాకీ ఒక అవినాభావ సంబంధం ఉంది. ఆయిన గోవా ప్రజలకి హీరోనా? లేక యావత్ దేశానికీ హీరోనా? ఇదో ప్రశ్న అయితే అసలు నిజ జీవితంలో హీరో ఎవరు? హీరోలు లేకుండా వెండి తెర లేదా? హీరోల అవసరం లేకుండా నిజ జీవితం కొనసాగదా?.. సమీర్ గారు మాట్లాడాలని కోరుతున్నాను!”

నేను నిలబడ్డాను. కానీ చిక్కుముడి విప్పగలుగుతానని అనుకోలేదు.

మైకు ముందుకు వచ్చి నిలబడి కొద్ది సేపు ఆలోచించాను. మెల్లగా ఒక విధమైన నిశ్శబ్దం కమ్ముకుంది.

“చాలా ఆనందంగా ఉంది..”, చెప్పాను. “..ఏదో గాడిలో పడిపోయి గానుగెద్దులలాగా చట్రంలో తిరగటంలా కాకుండా, సమాజం, మీడియా పట్ల ఒక స్పందన, ఒక చైతన్యం గల చోటుకి వచ్చానని ఇప్పుడు తెలుసుకున్నాను. నిజమే. నిజ జీవితానికి హీరోలు అవసరమా? హీరోలు లేకుండా జీవితం, మనుగడ అనేవి లేవా? ఉండవచ్చు. కానీ ఎక్కడో ఏదో వెలితిగా, కొరతగానే ఉంటుంది. ఉప్పు లేకుండా వంట చేయవచ్చు. తినలేము. అందుకేనేమో, చరిత్ర యావత్తు కథానాయకులతో నిండిపోయి ఉంటుంది. నాయికలతో కూడా! ఓ చిన్నపిల్లకి తండ్రి హీరో. ఓ పిల్లవానికి తల్లి ఓ గొప్ప పాత్ర. కొందరికి అన్నయ్య హీరో. కొందరికి స్కూల్లో ఓ బాగా చదివే, బాగా ఆటలాడే వాడు హీరో. ఒకడికి వాడికి వాడే ఓ గొప్ప హీరో..

తెర మీద ఒక హీరో ఒక ఆదర్శాన్ని ప్రదర్శిస్తాడు. తప్పో ఒప్పో అన్నది ప్రక్కన పెట్టండి. వాడు ఏమి చేసినా రైటే! చివరికి జైల్లోకి వెళ్లినా హీరోగానే మిగిలిపోతాడు. పాత్రలను కేవలం కథాపరంగా ప్రజలు చూస్తారా లేక తెరను ఇంట్లో కూడా ఎక్కడో అక్కడ కట్టుకుంటారా అనేది చర్చించుకోవలసిన అంశం. ప్రభావం ఉండదు అనుకువటం తొందరపాటే అవుతుంది. నేను పుట్టి పెరిగిన ప్రాంతం సినిమా వలన అంతగా ప్రభావం చెందినది కాదు. మా చరిత్రలో నిశ్శబ్దంగా ఎన్నో తిరుగుబాట్లు జరిగాయి. ఎందరో మహనీయులు అసలు చరిత్రకే అందలేదు. మాకొక అనితరసాధ్యమైన సాహిత్యం ఉంది. ఒక ఆలోచనా విధానం ఉంది, మాకంటూ ఒక అస్తిత్వం ఉంది. మేము ఈ రాష్ట్రంలో కలవకపోవటానికి అనేక కారణాలున్నాయి.

అవన్నీ అలా ఉంచండి. చరిత్రలో ఒకరి మీద ఒకరి దాడి అడగడుగున మనం చూస్తాం. దేశ సంపదను, అక్కడి మహిళలను దోచుకునే సంకల్పమే మూల కారణంగా కనిపిస్తుంది. ఒక దేశం యొక్క అస్తిత్వం అక్కడి మహిళల సంస్కారం మీద ఎంతగానో ఆధారపడి ఉంటుందన్న సంగతి పూర్తిగా ఎరింగియే ఈ ఆక్రమణలు జరుగుతాయి.

ఒక మహారాజుగారు యుద్ధంలో ఓడిపోయారు అంటే, వెంటనే మహారాణి నిప్పుల్లో ఎందుకు దూకేదో కేవలం సతీ ప్రథ అనే ఒక దురాచారపు దృక్కోణంలో చూడటం సరికాదు. అది ఆచారం కాదు. ఆ రోజు ఆ దేశపు అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు మరో దారి లేదు. చరిత్రను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కేవలం ఆ సందర్భంలోనే అది జరిగేది. ఒక్కో చోట భర్త మరణించిన తరువాత సమాజం ఒంటరిగా ఉండే స్త్రీలకు మామూలుగా బ్రతకనీయనప్పుడు కూడా ఆత్మాభిమానంతో కొందరు అలా చేసారు.

ఏది దురాచారాం? స్త్రీల మీద ఎల్లవేళలా చెడు దృష్టితో ఉండటమా? పురుషునికి, పరపురుషునికి లొంగటం ఇష్టం లేక, తద్వారా తన ఉనికిని, తన కుటుంబం యొక్క మర్యాదని బజారులో పెట్టలేక ఇక్కడితో ఇది ముగిసింది అని నిర్ణయించుకుని నిప్పులలోకి దూకిన మహిళ చేసిన పని దురాచారమా? ఆ ప్రక్రియను గ్రుచ్చి చూపే ముందు ఆ ‘నిప్పు’ చుట్టుతా మసలుతున్న నీచమైన సామాజిక సభ్యుల గురించి ఒకసారి ఆలోచించండి. దురాక్రమణలు ఈ రోజూ జరుగుతున్నాయి. మన దేశం మీద దాడి జరగక్కరలేదు. మనకు నిజమైన సాంస్కృతిక సంపదగా ఉండే మన స్త్రీలను బజారు, వ్యాపారం, స్వాతంత్ర్యం పేరుతో లొంగదీసుకుని ఒక కుటుంబం అస్తిత్వం పూర్తిగా కరిగిపోయి మాయమైపోయేట్లుగా చేస్తున్న ఎన్నో కార్యక్రమాలు.. అన్నీ భీకరమైన దురాచారాల క్రిందనే జమ కట్టాల్సి ఉంటుంది. దీనిని కూడా గుర్తించి నిరోధించటం కూడా హీరోయిజమ్ క్రిందనే వస్తుంది. అలాంటి ఆలోచనతో నన్ను ఇక్కడ ఎవరైనా పేర్కొంటే యస్! నేను హీరోనే!..”

చివరి వరుసలో ఎవరో ఇద్దరు అమ్మయిలు లేచి నిలబడి చప్పట్లు కొడుతున్నారు. మరో నలుగురు నిలబడ్డారు. హలంతా చప్పట్లు మారు మ్రోగుతున్నాయి.

చప్పట్ల మోత ఆగిపోయింది. ఎవరో ఒక్కరే చప్పట్లు కొడుతున్నట్లనిపించింది. ఇటు చూసాను. నాకు ఎడమ ప్రక్క సారిక చప్పట్లు కొడుతోంది.

“ఏంటి ఆలోచన?”

ఈ లోకంలోకి వచ్చాను. కారు నడపుతున్నానని గుర్తుకొచ్చింది.

“ఓ.. సారీ.. ఎక్కడికో వెళ్ళిపోయాను”

“ఆ ఇంటర్వ్యూ ఇంకా వదలలేదా?”

“లేదు. ఆడవాళ్ళ సబ్జెక్ట్ తేలిగ్గా వదలదు.”

గట్టిగా నవ్వింది సారిక.

“అంతేనా? ఆడవాళ్ళు కూడా తేలిగ్గా వదలరా?”

“ఒక సబ్జెక్ట్‌గా మారగల్గినది ఏదీ తేలికగా వదలదు”

“ఓ. అయితే నేను త్వరలోనే ఓ సబ్జెక్ట్‌గా మారాలనుకున్నాను.”

“ఎందుకు?”

“నేను నిన్ను వదలాలనుకున్నా నవ్వు నన్ను వదలటానికి వీలుండకూడదు!”

ఇదేంటి? ఈమెలో ఏదో తొందర! చాలా రోజుల క్రిందనే గమనించాను. కాకపోతే సినిమాలలో ఎందరో రచయితల కలాల నుండి జాలువారిన మాటలు వల్లించటం వలన డయిలాగుల్లా అన్నీ అంటూ ఉంటుంది. ఒక్కోసారి చూస్తే జాలి వేస్తుంది. బేలగా నవ్వుతుంది. జాలిగా మాట్లాడుతుంది. చిత్రమైన చూపులలో ఓలలాడిస్తుంది. నచ్చనప్పుడు మూలకి వెళ్ళి మూతి ముడుచుకుంటుంది. ఏదైనా నచ్చచెబితే చిరునవ్వులోంచి కోపాన్ని పాలలో జాలు వార్చి కుడికాలి బొటన వ్రేలితో నేలలో లీలగా నొక్కుతుంది.

“నన్ను పట్టుకోవటం ఎందుకు? వదలాలనుకోవటం ఎందుకు? నేను వదిలించుకోవాలన్నా వదలకుండా ఉండాలకోవటం ఎందుకు?”

“ఏదో అనాలని అనేసాను.”

“అంతే కదా? సీరియస్ కాదు కదా?”

“కాదు. కానీ ఇలా అందరితోనూ అనలేను.”

“ఎందుకని?”

“అందరితో ఇలా కారులో ప్రయాణించను.”

“రజనీశ్‌తో కూడా?”

ఒక్కసారి అదిరి పడింది.

“రజనీశ్ డైరెక్టర్.”

“అయితే?”

“నాకు ఎన్నో నేర్పాడు. నన్ను నడిపించాడు. కానీ ఇలా ఆయనతో ఎప్పుడూ మాట్లాడలేదు.”

“మంచివాడు.”

“అవును.”

“మంచి మిత్రుడిలా వ్యవహరిస్తాడు.”

“కరెక్ట్.”

“నేను?”

“చిత్రమైన మిత్రునిలా వ్యవహరిస్తావు.”

“అంటే?”

“మంచి స్నేహన్నీ, అనుబంధాన్ని ఏదో దయ్యం తగులుకున్నట్లు మాట్లాడుతావు.”

“ఈ ఆలోచన బాగుంది.”

“ఏది? దయ్యం గురించా?”

“అవును. సినీరంగంలో మూడు రకాలు.”

“ఓ.”

“మొదటిది దయ్యం పట్టిన వారిలా ఉంటారు.”

“ఓ. రెండు?”

“దయ్యాన్ని పట్టే వారిలా ఉంటారు.”

“మూడు?”

“దయ్యాలలానే ఉంటారు.”

భయంకరంగా నవ్వింది. విడతలు విడతలుగా నవ్వింది.

“అమ్మ! ఎంత నిక్కచ్చిగా మాట్లాడతావు సమీర్! నువ్వు బ్రూటల్‌గా హానెస్ట్‌గా ఉంటావు.”

“అవునా?”

సారిక చేసిన కామెంట్ నచ్చింది. రెడ్ లైట్ దగ్గర కారు ఆపాను.

“సమీర్..”

“యస్?”

అలా అనగానే పెదవులు రెండూ నొక్కుకొని కొద్దిసేపు అటు తిరిగి నా వైపు చూసింది.

“సిగ్నల్‌కి ఇంకా టైం ఉంది.”

“అవును.”

“అక్కడే చూడక్కరలేదు. నువ్వు ఆలస్యం చేసినా వెనక నుండి బాదేస్తారు.”

“కరెక్ట్. అయితే?”

“ఒక్కసారి నన్ను జాగ్రత్తగా చూడు.”

చూసాను.

నవ్వి, అడిగింది, “నేనెలా ఉన్నాను? దయ్యంలా కదూ?”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here