Site icon Sanchika

పూచే పూల లోన-8

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[సమీర్, సుందర్ కలిసి కారులో వెళ్తుంటారు. వారి మధ్య జీవితం గురించి సంభాషణ జరుగుతుంది. ఎక్కడికి వెళ్తున్నామంటే, జవాబు చెప్పడు సమీర్. ఒక చోట కారు ఆపుతాడు. దూరంగా ఓ నది కనిపిస్తుంది. దాని పేరు కుశావతి అని చెప్తాడు సమీర్. ఒకప్పుడు ఆ నది తాము ఆగిన చోటు వరకు ప్రవహించేదనీ, కానీ నలభై ఏళ్ళుగా  ఇటు ప్రవహించడం మానేసిందని అంటాడు. మరో చోట ఓ బ్రిడ్జ్ మీద ఆపి, నదీ జలాల రంగు ఇటు ఒకలాగా, అటు ఒకలాగా ఉంది చూడమని సుందర్‍కి చెప్తాడు. ఆ భూమిలో మేంగనీజ్, బాక్సైట్ విరివిగా దొరుకుతాయనీ, ఆ రెండు ఖనిజాలు ఇక్కడి జనాలను పూర్తిగా రోడ్డు మీదకు తెచ్చాయని అంటాడు. కాసేపటికి రివోనా అనే చిన్న పల్లెటూరి దగ్గర ఆగి టీ తాగుతారు. అక్కడికి దూరంలో కొన్ని గుహలున్నాయని, ఆ ప్రాంతాన్ని ఋషివనం అనేవారనీ, అక్కడ కుశావతీ తీరంలో గొప్ప తపస్సులు చేసేవారని చెప్తాడు. మెల్లగా డ్రైవ్ చేస్తూ ప్రకృతిలోకి కారు నడుపుతాడు సమీర్. ఆ అందాలను చూస్తూ మైమరిచిపోతాడు సుందర్. కాసేపటికి కొండల మధ్య కారు ఆపి, దిగి, సుందర్‍ని కూడా నడవమంటాడు. ఒక సన్నని దారిలోంచి నడుస్తూ ఒక ధార వెంట సాగుతారు. కొంత దూరం వెళ్ళాక, రెండు కొండల మధ్య ఒక బిలం లాంటిది కనిపిస్తుంది. కాని దగ్గరకు వెళ్ళి చూస్తే, ఒక కొండ ముందరకి ఉంటుంది. వారిద్దరూ లోపలికి ప్రవేశిస్తారు. సమీర్ కొంత ముందుకెళ్ళి అదృశ్యమవుతాడు. సుందర్ కొద్దిగా ముందుకు నడిచి అక్కడ నీటి ధారను అనుసరిస్తూ క్రిందకి దిగడం మొదలుపెడతాడు. క్రింద కనిపిస్తున్న దృశ్యం చూసి సంభ్రమాశ్చర్యాలలో మునుగుతాడు. ఇక చదవండి.]

[dropcap]దృ[/dropcap]శ్యం నన్ను ఎంతగానో కదిలించింది. కొండలు కట్టిన చూరు ఏదో బూరల వ్యాపించి ఆ చివార్న వంగి అటు నమస్కరిస్తున్నట్లుంది. దూరంగా సముద్రం ఇక్కడ ఎక్కడ చూసినా నేనే అంటునట్లుంది. క్రింద దాదాపు అయిదు కొలనుల ఎవరో కట్టినట్లున్నాయి. వాటిలోని నీరు చక్కగా నీలి రంగులో ఎవరో చిత్రం గీసినట్లుంది. కుడి, ఎడమ వైపు ఏదో ఆశ్రమంలా చిన్న చిన్న ద్వారాలు గోడలలోనే ఉన్నాయి. ఎంత వింత ఇది? ఋషి వనం అంటే ఏమో అనుకున్నాను. ఆ కొలనుల మధ్యలో నిలబడి నన్ను చూస్తున్నాడు సమీర్. క్రిందకి రమ్మని సైగ చేస్తున్నాడు.

“ఎలా రావాలి?” గట్టిగా అడిగాను.

కుడి వైపు దేనినో చూపిస్తున్నాడు. ఏమీ అర్థం కాలేదు. జాగ్రత్తగా వెతికితే అక్కడ ఓ సన్నని త్రోవ క్రిందకి వెళుతోంది. దాని మీద కాలు పెడితే అక్కడికి వెళ్ళిపోగలం. కానీ శరీరంలోని పార్ట్స్ మామూలుగా ఉంటాయా అనిపించింది. అతను రమ్మని తొందర పెడుతున్నాడు. మెల్లగా అక్కడి దాకా వెళ్ళి మరల క్రిందకి చూసాను. అర్థమైంది. వాస్తవానికి ఆ డొంక దారిలో చిన్న చిన్న మెట్లున్నాయి. అవి కనిపించడం లేదు. ధైర్యం చేసి ఒక మెట్టు మీద కాలు వేసాను. అంతే. ఒళ్ళంతా ఎవరో పట్టుకుని ఊపినట్లు ఊగిపోయింది. ఆ చిత్రమైన, ఆందోళనా పూరితమైన స్పందనలో ఇదేదో కూడా ఆనందమే అనుకుంటుండగా రెండో కాలు తనంత తానే మరో మెట్టు మీదకి జారింది. జారుతున్నానా లేక ప్రాణం కోసం పారిపోతున్నానా అని ఆలోచించే లోపు సమీర్ చేతులలో ఉన్నాను. అతను గట్టిగా కౌగిలించుకుని వీపు తడుతున్నాడు. ‘శభాష్’ అంటున్నాడు. బ్రతికే ఉన్నానని తేలిపోయింది! ఆ కౌగిలి లోంచే మెల్లగా అన్నాను, “బాగా అనుభవం ఉన్నట్లుంది..”

“దేనిలో?” అడిగాడు.

“అన్నింటిలో”

“ఊ.. ఈ ప్రాంతం నాకు చాలా అలవాటు”

“ఈ ప్రదేశం గురించి కాదు..”, ఆ కౌగిలి లోంచే అన్నాను చెవిలో మెల్లగా రహస్యం చెబుతున్నట్లు.

“మరి దేని గురించి?”

“ఇలా హీరోయిన్లు పరుగులు తీస్తూ వచ్చి వాటేసుకోవటం.. మరి అలవాటే కదా?”

నన్ను వదిలి పెట్టి గట్టిగా నవ్వాడు. ఆ శబ్దం ఆ చిత్రమైన గుహలో మారుమ్రోగుతోంది.

“మీరు మటుకు?..” అన్నాడు. “..దర్శకుడు చెప్పినట్లు చక్కగా గాభరాలో, ఆనందంలో ఉత్సాహంలో ప్రియురాలు ప్రియుడిని చేరుకున్నట్లు చేరుకున్నారు. నేనే దర్శకుడినైతే, సింగిల్ షాట్‌లో ఓకే చేసేసేవాడిని!”

“సింగిల్ షాట్‍లో ప్రాణాలు పోయి ఉండేవి”

ఇద్దరం కొద్ది సేపు చుట్టూతా చూసాం.

“ఇంతకీ ఈ ప్రదేశానికి మీకూ.. ఏదో కథ ఉండాలి కదా?”

“అవును. చాలా చిన్నప్పుడు ఇక్కడికి ఒంటరిగా వచ్చి, ఇంట్లో అందరినీ ఇబ్బంది పెట్టేవాడిని. విపరీతంగా నడిచేవాడిని. నాకు భయం అనేది తెలియదు. ఇక్కడ.. ఇదిగో ఈ కొలనుల మధ్యలో కూర్చుని గంటల తరబడి ఆలోచిస్తూ ఉండేవాడిని. తరువాత తెలిసింది – ఈ కొలనుల మధ్యలోనే ఋషులు తపస్సు చేసేవారని! ఆ ద్వారాలలోకి వెళ్ళాలనుండేది. కానీ లోపలికి వెళ్ళేందుకు వీలు లేదు. మట్టితో కప్పేసారు. లేక కాలక్రమంలో అవే పూడుకుని పోయాయో తెలియదు.”

కొంత దూరం నడిచాం.

“ఈ గొయ్యి ఏమిటి? ఇక్కడ కూడా మైనింగ్ చేసారా?”

“ఇది ఆ కాలంలో యజ్ఞవాటిక అని కొందరు, కాదు ఏదో నుయ్యి లాంటిదని మరికొందరు చెబుతారు.”

“ఏమై ఉంటుంది?”

“ఇక్కడ ధ్యానం చేసేవారు. ఇది ఖచ్చితంగా ఋషులు నిర్మించుకుందని చెబుతారు.”

ఎక్కడో పిట్టల కూతలు అవునంటున్నాయి.

“కారు, బౌద్ధులు కట్టుకున్న ప్రదేశం అంటారు. ఆ మాటకొస్తే ఇలాంటి ఏ గుహలకైనా వెళ్ళండి మన దేశంలో, ఈ రెండు మాటలూ వినిపిస్తాయి.”

మరో వైపు పిట్టలు అదీ నిజమేననట్లు కూసాయి. సముద్రం హోరు ‘మా జోలికి రాకండి, మమ్మల్ని మా మానాన వదిలెయ్యండి’ అన్నట్లు సింహగర్జన చేస్తున్నట్లుంది.

“బౌద్ధులకైతే ఇలా యజ్ఞవాటిక ఉండదు కదా?” అన్నాను.

“అదలా ఉంచండి. ఇది మనుషులు కట్టిందా? మీకేమనిపిస్తుంది?”

“అంతగా చెప్పలేను. సాంకేతిక పరిజ్ఞానం ఏమని వివరించినా, ఆ సముద్రాన్ని మటుకు మనిషి నిర్మించలేదని చెప్పగలను.”

“రచయితలతో ఇదే బాధ. ఆటను గడి బయట నుంచే చూస్తామంటారు. లోపలికి వచ్చి ఆడరు!”

“మీ బాధేంటి?”

“రండి!”

మెల్లగా ఆ గుహ దాటి సముద్రం ఒడ్డుకు వచ్చాం. అలల వైపుకు లాక్కెల్లాడు సమీర్.

“ఇటు తిరగండి” అంటూ కొండల వైపుకు తిప్పడు. కొండలు అందమైన రీతిలో ఒకరి జబ్బ మీద ఒకరు చేతులు పెట్టి ఏదో జానపద గీతం ఆలపించాలనుకుంటున్నట్లుంది.

“ఒకవేళ మనుషులే చేసుంటే ఇలా అన్నిటి దగ్గర ఆ ప్రయత్నం చేసుకుండాలి కదా?”

“నిజమే. కానీ అవసరం అనిపించి ఉండదు”

“కమాన్! స్పర్ధ అనేది మానవ సహజం. పోనీ ఒక తరం వెళ్ళిపోగా ఆ తరువాత వచ్చే తరమైనా ప్రయత్నించదా?”

“కరెక్ట్. పోనీ మీరన్నట్లు ఇప్పుడైనా ఎవరూ ప్రయత్నించ లేదు”

“ఇప్పుడు కొట్టనీరు ఆ బండలని. మైనింగ్ అయితే ఎక్కడైనా తవ్వేస్తారు”

“నిజమే. అయితే ఇది ఋషివనం. అంటే ఋషులు తపస్సుతో నిర్మించుకున్న సహజమైన ఆశ్రమం.”

ఇద్దరం కొంత దూరం నడిచాక, ఒక రోడ్డు కనిపించింది. దేవుడున్నాడని తేలిపోయింది.

“ఇదేంటి ఈ రోడ్డు ఎక్కడికి పోతుంది?”

“సూటిగా మన కారు ఆగి ఉన్న చోటకి వెళుతుంది”

చెడ్డ కోపం వచ్చింది సమీర్ మీద.

“అంటే నన్ను ఆట పట్టించి, ఏ కాలో చెయ్యో విరగాలని విశ్వప్రయత్నం చేసి విఫలులైనారు. అవునా?”

చెమట తుడుచుకున్నాడు సమీర్.

“థ్రిల్ ఉండాలి సార్ జీవితంలో. పదండి, అలసిపోయరు.”

అలా వెళుతున్నాం.

“తపస్సు, తపశ్శక్తి గురించి మహర్షుల విషయంలోనే విన్నాం కానీ బౌద్ధ భిక్షువుల విషయంలో కాదు” అన్నాడు.

“కావచ్చు”

“ఋషుల స్థావరాలలోనే, ఆశ్రమాల లోనే బౌద్ధులు చేరారని ఎందుకనుకోకూడదు?”

“అనుకోవచ్చు. దానికేం?”

“కానీ ఆ కొలనుల మధ్యలో మీకెలా అనిపించింది?”

ఆగిపోయాను. “ఖచ్చితంగా మరోసారి వీలు చూసుకుని వచ్చి అక్కడ ధ్యానం చెయ్యాలని ఉంది”

చెయ్యి అడ్డంగా ఊపాడు సమీర్.

“మీ వల్ల కాదు. దేనికైనా ఓ సమయమూ, ఓ ఘటన. దట్సాల్. ఒకరి సంకల్పం వలన ఏదీ కాదు”

కారులో కూర్చుని ఎ.సి వేసాడు. మెల్లగా పోనిచ్చాడు. గాలికి చెట్లు వీడ్కోలు పలుకుతున్నట్లుంది.

“అక్కడికి పారిపోయేవారా చిన్నప్పుడు?”

“అవును. ఈ ఊరు నన్ను పెంచుకుంది. వీళ్లంతా నాకు ఆప్తులు”

“అంటే జ్ఞానోదయం ఇక్కడే అయిందన్న మాట!”

వెటకారమా అన్నట్లు చూసాడు.

“తపస్సంటే మరేమీ కాదు సార్..!” చెప్పాడు. “..దేనిపట్లో తీవ్రమైన అసంతృప్తి, ఈసడింపు కలిగి మరేదో న్యాయం అనేది ఎక్కడో ఉన్నదని గట్టిగా నమ్మి దానిని శోధించటమే”

“మీ ఇంటి పట్ల మీకు ఎందుకు అసంతృప్తి?”

“మా నాన్న చేసే పని నాకు నచ్చలేదు”

“ఏంటది?”

“తపస్సు”

కారులో వెనక్కి వాలిపోయాను. వింతగా నవ్వాడు సమీర్.

“తపస్సంటే మీరనుకునేది కాదు. తపస్సులో మనం లోలోన అంతరాత్మలోకి తవ్వుకుంటాం. ఆయన ఇక్కడ కనిపించిన ప్రతి చోటా తవ్వేసారు.”

“ఓ, మైనింగ్”

“అవును. వ్యాపారం కోసం ఏదైనా చేసేవారు. రక రకాల మనుషులు కాయకష్టం చేస్తూ ఉండేవారు. నేను వాళ్ళ కళ్ళల్లో ఆకలి, భయం, నీరసం, నిస్పృహ, నిరాశ, ద్వేషం.. అన్నింటినీ మించి జీవితం ఎండిపోయిన ఎడారిలో అనవసరంగా మెరుస్తున్న కన్నీటి చుక్కలను చూసాను.”

ఒక వెండితెర వెలుగు ఈ కొండల మధ్యలోంచి అలా గతం అనే చీకటి లోకి జారిపోతున్నాడు.

“మనిషిని మనం మనిషిగా ఎందుకు చూడలేము సార్?” గట్టిగా అరిచాడు. నేను ఏమీ మాట్లాడలేదు. ఏదో ఆవేదన ఎక్కడో ఎవరికీ వినిపించనంతగా నరాలు తెంచుకుని ఆలోచిస్తున్నట్లుంది.

“గుర్తుకొస్తున్నాయి సార్..”, చెప్పాడు “..మా తాత ఇంతకంటే కిరాతకుడు. పనిలోకి రాని వాళ్ళని కొరడా దెబ్బలు కొట్టించేవాడు. స్కౌండ్రల్.. అనేవాడు. ‘లెక్కకు ఎన్ని కొట్టాలో అన్ని కొట్టు, బ్రతికుంటే వదిలెయ్, పోతే పూర్తిగా వదిలెయ్’ అనేవాడు.”

“వాళ్ళు వేరే పని చూసుకోలేదా?”

“అలా కుదరనివ్వలేదు. ఏరి ఏరి పట్టుకొచ్చేవారు”

కొంత దూరం అలా చాలా మెల్లగా, చక్కగా వెళ్ళింది కారు. ఆ వయ్యారపు దారులలో సునాయసంగా నడుపుతాడు సమీర్.

“ఈ రోజుకీ మరిచిపోలేని సంఘటన ఒకటి చెప్పాలి..” అన్నాడు.

“చెప్పండి. ఈ ప్రాంత, మీ బాధ, మీ ఆలోచనలను నన్ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి”

“నాకప్పుడు పదకొండు సంవత్సరాల వయసు”

“చాలా చిన్నప్పుడు”

“యా. ఓ రోజు మేడ మీద గదిలో పడుకునుండగా పెద్దగా చప్పుడయింది. కిటికీలోంచి చూస్తూన్నాను. ఇంటి ముందు గల తోటలో జనం నిలబడి ఉన్నారు. నలుగురు కూలీవాళ్లను చేతులు కట్టేసి కొడుతున్నారు. రక్తం కారుతోంది. వాళ్ళ వెనుక చేపల వలలో చేపలు గిలగిలా కొట్టుకుంటున్నాయి. గబగబా మెట్లు దిగుతుంటే మా నౌకరు గట్టిగా పట్టుకున్నాడు. ‘డాడీ కోప్పడతారు, లోపలికి పద..’ అంటూ గదిలోకి నెట్టి తలుపు వేసేసాడు. అతను వెళ్ళిపోయిన తరువాత మెల్లగా కిటికీ ఎక్కి తలుపుత తోసి చూస్తున్నాను. వాళ్ల వంతు అయిపోయింది. అయినా ఎవరూ కదలలేదు. వాళ్ళ వెనుక ఓ కూలీ ఓ చిన్న కుర్రాడిని ఎత్తుకుని ఉన్నాడు. అతన్ని రమ్మని సైగ చేశారు.

‘కుర్రాడు పడులోలేదు..’ అంటున్నాడు.

ఇక్కడ కొరడా పట్టుకున్నవాడు అరుస్తున్నాడు.

‘ఏరా? పడుకోకపోతే అలాగే వచ్చి నిలబడు. ఓ రెండు వాడి మీదా పడతాయి. నేర్చుకుంటాడు!’

అతను కళ్ళు మూసుకుని లోలోన బాధపడుతున్నాడు.

‘రారా..’ ఉరిమాడు వస్తాదు.

మెల్లగా ఆ కుర్రాడిని చంక దింపాడు అతను. తాటికాయ లోంచి తీసేసిన కళ్ళ గుంతల్లోంచి ఏదో నీరు కారినట్లు ఆ కుర్రాడి కళ్ళ క్రింద రెండు పాయలు కనిపిస్తున్నాయి. వాడు ఎందుకో చేతులు కట్టుకున్నాడు. ఇతను ముందు వచ్చి వంగున్నాడు. వస్తాదు అతని భుజం మీద చెయ్యి పెట్టి ఎందుకో నొక్కాడు. కొరడాను మెల్లగా నిమిరాడు. ఎందుకో ఆకాశంలోకి చూసాడు. కుర్రాడు కళ్ళు మూసుకున్నాడు. నేనూ కళ్ళు మూసుకున్నాను..”

***

“బాగా అర్ధరాత్రి దాటిన తరువాఅత నిద్ర పట్టక అమ్మా, నాన్నల గదిలోకి వెళ్ళాను. ఇద్దరూ మత్తు నిద్రలో ఉన్నారు. తలుపుకు ప్రక్కగా గల టేబుల్ మీద ఒక గుర్రపు బగ్గీ బొమ్మ ఉండేది.. అది నా చెయ్యి తగిలి క్రింద పడింది. ఆ శబ్దానికి ఎవరూ లేవలేదు. మెల్లగా దానిని తీసి టేబుల్ మీద పెట్టాను. కిటికి లోంచి చల్లగాలి వీస్తోంది. ఆ కిటికీ ప్రక్కన ఉన్న ఓ హుక్కుకి కొరడా తగిలించి ఉంది. మెల్లగా దానిని తీయబోయాను..”

“ఒక కొరడా పోతే మరొకటి వస్తుంది”, వెనుక నుండి వినిపించింది. నాన్న లేచి నిలబడి ఉన్నారు. అమ్మ మెల్లగా లేస్తోంది.

“ఏం నాన్నా? కడుపు నొప్పా?”

తల అడ్డంగా ఊపాను.

“పీడకల వచ్చిందా?”

“లేదు”

“మరేమైంది?” నాన్న దాదాపు అరిచారు.

“ఒకటి కనిపించింది”

“ఏంటది?”

“నన్ను నువ్వు చంకలో ఎత్తుకునున్నావు”

“ఊ..”

“ఎవరో అరుస్తున్నారు”

“ఓ..”

“నన్ను నువ్వు దింపేసావు”

“..”

ఫాన్ దారుణమైన శబ్దం చేస్తోంది. ఆయన దగ్గరగా వచ్చారు.

“దింపేసాకా?”

నేను గోడదాకా వెళ్ళి కళ్ళు మూసుకున్నాను. కొరడా శబ్దం వినిపించింది. నాన్న గోడ మీద ఒక్క దెబ్బ కొట్టారు.

“గదిలోకెళ్ళి పడుకో”, అరిచారు. “..కొట్టటం, తిట్టటం తెలియకపోతే, బ్రతుకు గడవదురా హీరో.. నిన్ను మోస్తున్న గుర్రాన్ని కొడుతూనే ముందరికి వెళ్ళాలి.. అదే జీవితం..”

ఆ బండి బొమ్మను నా వైపు విసిరారు నాన్న. అది నేల మీద పడి చిట్లిపోయింది. నాలో ఏదో అప్పటికే పగిలిపోయిందని నాకు తెలుసు.

(ఇంకా ఉంది)

Exit mobile version