[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘పూర్వ సంస్కార వాసనలే మలి జన్మకు కారణభూతం’ అనే రచనని అందిస్తున్నాము.]
శ్రీ భగవానువాచ:
పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోఽపి సః।
జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతివర్తతే॥
(భగవద్గీత 6వ అధ్యాయము, 44వ శ్లోకం)
[dropcap]పూ[/dropcap]ర్వ జన్మ యొక్క సంస్కార బలం కారణంగా సాధకుడు లేక ముముక్షువు కోరకుండానే అప్రయత్నంగా యోగం, ఆధ్యాత్మిక పథం వైపు ఆకర్షింపబడతాడు. అటువంటి సాధకుడు యోగ శాస్త్రములలో తెలుపబడిన దివ్య కర్మలను చేస్తూ, లౌకిక జీవితం పట్ల ఆకర్షితులు కాకుండా ఉన్నతమైన పవిత్రమైన పరిపూర్ణమైన భగవద్ భక్తిని పొంది దివ్యమైన ఆధ్యాత్మిక పథంలో పయనిస్తారని భగవానుడు అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని పై శ్లోకం ద్వారా మానవాళికి దివ్యోపదేశం చేస్తున్నాడు.
పూర్వ సంస్కారముల ఆధారంగా వచ్చే ఈ భగవంతుని పిలుపు ఒక్కోసారి ఎంత బలంగా ఉంటుందంటే, వ్యక్తి జీవితంలో వచ్చే అత్యంత బలమైన పిలుపు ఈ భగవంతుని పిలుపే అని అంటారు. బుద్ధుడు, రమణమహర్షి మొదలైన ఎందరో సిద్ధ పురుషులు ఈ పూర్వ జన్మ సంస్కార వాసనలు కారణంగానే మరు జన్మలో అన్ని భౌతిక సుఖాలను వదిలిపెట్టి, మహోన్నతమైన సాధన చేసి ఆత్మ సాక్షాత్కారం పొందారు.
అయితే ఈ పూర్వ జన్మ వాసనల హెచ్చుతగ్గుల కారణంగా, జ్ఞానం స్థిరంగా ఉండటానికి సమయం పడుతుంది. పునర్జన్మలకు స్వస్థి పెట్టడానికి అస్థిరమైన జ్ఞానం సరిపోదు. అయితే ఒక గొప్ప గురువు సన్నిధిలో, వాసనలు చురుగ్గా పనిచేయడం మానివేస్తాయి, మనస్సు నిశ్చలంగా మారుతుంది కాబట్టి శిష్యుడు గురువు సమక్షంలో నిజమైన జ్ఞానాన్ని మరియు సరైన అనుభవాన్ని పొందుతాడు.
మనస్సు దేనిని గట్టిగా పట్టుకొని ఉంటుందో ఆ వాసనే అలవడుతుంది అంటుంది వేదాంతం. మనకు గత జన్మలో ఉన్న మంచి లేక చెడు అలవాట్లే సంస్కారాలుగా ప్రస్తుత జన్మలో మనస్సును ప్రభావితం చేస్తాయి. మరణం దేహానికే గానీ ఆత్మకు కాదు కాబట్టి ప్రతీ జీవి మరణించాక ఆ జన్మలో చేసిన పనులు, జ్ఞాపకాల ఆలోచనలు, కోరికలు ఆత్మను పట్టుకొని, వాసనల రూపంలో మరొక దేహాన్ని చేరి కర్మఫలితాలను చూపుతాయి. పూర్వ జన్మల సంస్కారాలు మన మీద బలీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి అని విస్పష్టంగా వేదాంత శాస్త్రం చెబుతోంది. గత జన్మలలోని మన అలవాట్లు, ఇష్టాయిష్టాలు ఈ జన్మలో మన ప్రవర్తనను, జీవితాన్ని నియంత్రిస్తాయి. వాటిని వదిలించుకొని బయట పడడం కష్టం. కాబట్టి వర్తమానంలో అనుక్షణం జ్ఞానాన్ని ఆశ్రయిస్తూ చెడు ఆలోచనలను వదిలించుకుంటూ, చెడు ప్రవర్తనకు దూరంగా వుంటూ, దుర్జన సాంగత్యం విసర్జించి పవిత్ర జీవనం సాగించడం మంచిది. మరణ సమయంలో ఆ మంచి సంస్కారాలు ఆత్మతో పాటే ప్రయాణం చేసి నూతన ఉపాధి శరీరంలో తిరిగి ప్రవేశిస్తాయి.
గత జన్మలో చేసిన పాపాల ప్రభావం, వాటికి విరుగుడుగా చేసే పూజలు, వ్రతాలు శాంతులు, ఇతర ఆధ్యాత్మిక సాధనలు సమాంతరంగా సాగుతుంటాయి. ఎప్పుడైతే జీవితంలో ఆ భగవంతుని ప్రభావం ఎక్కువవుతుందో.. మనలో పుణ్యఫలం పెరుగుతుందో గత జన్మలో చేసిన పాపాలు పటాపంచలై దోషాలు తొలగి సుఖజీవనాన్ని పొందుతారు.