పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

0
3

[dropcap]‘మ[/dropcap]న పెద్దలు మనిషిని నిండు నూరేళ్లు చల్లగా జీవించాలని ఆశీర్వదిస్తూ ఉంటారు. కాని మనిషి జీవితం అలా సాగదు. అది అతి స్వల్పం. ఎందుకంటే నూరేళ్ళు బ్రతుకుతారనుకున్నా ఆ నూరేళ్ళలో సగం రాత్రి నిద్రకి, మిగతా కార్యక్రమాలకి పోతుంది. మిగతా దానిలో కూడా పూర్తి జీవితం సాగించలేకపోతున్నాడు మనిషి.

మనిషి జీవన సరళి మారింది. అలవాట్లు మారాయి. ఆహార విధానం మారింది. ఏ వస్తువు చూసినా కల్తీయే. ఆ కల్తీ ప్రభావం మనిషి జీవితంపై పడుతోంది. అందుకే నిండు నూరేళ్ళు బ్రతకమని పెద్దల దీవెనలా మనిషి జీవితం జరగటం లేదు. అనేక రోగాల పాలవుతున్నాడు. ఐదు పదులు వయస్సు దానిన వెంటనే కొందరు, అంతకు మునుపే మనిషి అకాల మృత్యువాత పడ్తున్నాడు.’ ఇలా భావోద్వేగంతో ఆలోచిస్తున్నాను నేను.

“మన స్కూళ్ళో చదువుకున్న మన బ్యాచి వాళ్ళంతా ఒక దగ్గర కలవాలనుకుంటున్నాం. ఎందుకంటే మనలో కొంతమంది మృత్యువాత పడ్డారు. మరి కొందరు అనారోగ్య సమస్యల్తో ఇంటికే పరిమితమయ్యారు. మిగతా వాళ్ళమేనా కలుసుకుందాం.” ఫోనులో ముకుందం చెప్పాడు. నాకు కూడా ఇది మంచిదే అని అనిపించింది. ఎందుకంటే జీవన మలి సంధ్యలో ఉన్న మా కందరికీ గతం తాలూకా తీపి జ్ఞాపకాలు, తీపి గురుతులు నెమరవేసుకున్న అవకాశం కలుగుతుంది. ఆ తీపి గురుతులు అలా వెంటాడూతూనే ఉంటాయి.

మాతో చదువుకున్న వాళ్ళు ఎన్నో సంవత్సరాల క్రితమే విడిపోయారు. ఎవరు ఎక్కడ ఉన్నారో? ఎలా ఉన్నారో? ఏం చేస్తున్నారో తెలియదు. వాళ్ళలో కొంత మంది ఉద్యోగస్థులు అయితే, మరి కొంతమంది వ్యాపారులు, మిగతా వాళ్ళు వివిధ రంగాల్లో స్థిరపడి పనులు చేసి చేసి అలసిపోయి జీవిత చరమాంకంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు.

అలాంటి వాళ్ళందరి ఫోను నెంబర్లు సేకరించి అందరికీ ఫోను చేసి అందర్ని ఒక చోట చేర్చే బాధ్యత ముకందం తన భుజస్కందాలపై తీసుకున్నాడు. ముకుందం గురించి చెప్పాలంటే మా ఇద్దరి బాల్యం, చదువులు, వృత్తులలో స్థిరపడ్డం ఒకే ఊరులోనే అయ్యాయి. తేడా ఏమిటంటే నేను ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడితే, ముకుందం ఓ ప్రైవేటు కంపెనీలో క్లర్కు ఉద్యోగంలో స్థిరపడ్డాడు. విచిత్ర విషయం ఏమిటంటే ఉన్న ఊర్లోనే మా స్థిర నివాసాలు, వృత్తి కార్యకలాపాలు. అందుకే ఇద్దరం తరచూ కలుసుకుంటూ ఉండేవాళ్ళము.

ముకుందం చెప్పిన మాటలు వినగానే నాకు చాలా సంతోషం కలిగింది. ఇన్ని సంవత్సరాల తరువాత నిన్నటి తరం వాళ్ళమందరం ఒక దగ్గర కలుసుకోబోతున్నాం. అంటే చాలా థ్రిల్‌గా ఉంది. ఇప్పుడు మా సహచరుల రూపురేఖలు ఎలా ఉన్నాయో? అప్పటి రూపురేఖల్ని తలుచుకుంటూ ఉంటే అప్పటి రూపంతో ఇప్పటి రూపాన్ని చూడాలన్న కుతూహలం. ముకుందం నేను ఒకే ఊరిలో ఉండటం వలన మాలో వచ్చిన మార్పులు మాకు తెలియవు.

కలవబోతున్న అందరం ఏడు పదుల వయస్సు దాటిన వాళ్ళమే. జీవిత చరమాంకంలో బ్రతుకు పోరాటంలో పోరాడి పోరాడి అలసిపోయిన వాళ్ళమే. అందరి జీవితాల్లో ఎన్నో ఆటుపోట్లు. భవిష్యత్ పట్ల అనిశ్చిత, ఆర్థిక సమస్యలు. పిల్లల వల్ల అనేక సమస్యలు. ఇవన్ని కొన్ని కొంతమందిని కుంగుబాటుకి గురి చేశాయి. మరి కొంతమంది ఎన్ని సమస్యలొచ్చినా కష్టమొచ్చినా మనస్సులోనే దాచుకుని కుమిలిపోయి డిప్రెషనుకి గురయితే, – అలా అవకుండా కష్టాన్ని దిగమింగుకుని పైకి గంభీరంగా ఉండేవారు కూడా ఉన్నారు.

అలాంటి వాళ్ళ మనస్సులో భావాల్ని, ఆలోచనల్ని, బాధల్ని, వైఫల్యన్ని పంచుకోడానికి ఇలాంటి పూర్వ విద్యార్థుల కలయిక ఎంతో అవసరం. ఎందుకంటే మెదడులో చేసుకున్న విపరీత ఆలోచనల చెత్తంతా వదిలి పోతుంది అని అనుకున్నాను నేను.

మా పూర్వ విద్యార్థి సహచరులలో కొంతమంది ఈ సమావేశానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ బాధ్యతను ముకుందంపై ఉంచారు. అతను ఓ ఫంక్షను హాలులో సమావేశానికి తగిన ఏర్పాట్లు చేసే బాధ్యత తన భుజస్కందాలపై వేసుకున్నాడు.

అనుకున్న రోజు రానే వచ్చింది. ఒక్కొక్కళ్ళూ సమావేశ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఒకర్ని మరొకరు పరిచయం చేసుకుని పలకరించుకుంటున్నారు. ఒకరిలో వచ్చిన శారీరిక మనసిక మార్పుల్ని మరొకరు పరిశీలించుకుంటున్నారు. అయితే గోవిందు తీరే వేరు. అతనిలో శారీరికంగా మార్పు వచ్చినా మాట తీరు మాత్రం మారలేదు. ఇలాంటి వాళ్ళు మానసికంగా ఎదగలేదా అని అనిపిస్తుంది. అతని మాట తీరు వ్యవహార శైలి, ఎదుటి వాళ్ళని ఆట పట్టించడం, వ్యంగ్యంగా, హేళనగా మాట్లాడ్డంతో ఏ మాత్రం మార్పు లేదు.

మొదటి హేళనకి, వ్యంగ్యాస్త్రానికి గురయిన వాడ్ని నేనే.

“మూర్తీ! నీవేనా? అప్పటిలాగే ఉన్నావా? లేక నీలో ఏమేనా మార్పు వచ్చిందా? చదువుకునే రోజుల్లో బిడియపడ్తూ, సిగ్గుపడ్తూ ఎవ్వరితో మాట్లాడకుండా ఉండేవాడివి. అందుకే మేమందరం నిన్ను ‘అమ్మాయ్’ అంటూ ఆటపట్టించే వాళ్ళమి” అన్నాడు గోవిందు. అతని మాటలకి నవ్విన వాళ్ళు కొందరయితే అతడ్ని వారించిన వాళ్ళు మరికొందరు.

గోవిందు స్వభావం అంతే. అతని హేళనకి గురి కాని వాడెవరు? మధు నత్తిగా మాట్లాడుతాడని ‘నత్తి పకోడి’ అని అనేవాడు. రమేష్‌కి ఎప్పుడూ జలుబే. ముక్కు నుండి చీమిడి కారేది. ‘చీమిడి ముక్కు చిన్నోడా’ అని పిలిచేరు. వాళ్ళు కూడా ఈ సమావేశానికి వచ్చారు. “ఓరే గోవిందు. నీవు అప్పుడూ, ఇప్పుడూ ఏం మారలేదురా” నవ్వుతూ అన్నారు వాళ్ళు.

“ఒరే గోవిందు. మొదట నీలో ఏం మార్పు రాలేదురా?” అంటూ ముకుందం గోవిందుని మన్నింతగా మందలించాడు. గోవిందు మాటలకి నా మనస్సు ఒక్కసారి చివుక్కుమంది. నిజమే నేను రిజర్వుడుగా, బిడియస్థుడుగా ఉండేవాడిని. అందుకే నేను టీచరు ట్రైనింగుకి వెళ్తానంటే, ‘నీ స్వభావానికి ఆ వృత్తి సరిపోదు’ అన్నారు కొందరు. అయితే నేను పట్టుదలతో నా జీవన సరళిని మలచుకున్నాను. ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కుని రాటుదేలాను.

‘వయస్సు పెరుగుతున్నా, అనుభవం పెరుగుతున్నా జీవిత చరమాంకంలో చేరుకున్నా గోవిందు లాంటి వాళ్ళ చిన్నప్పటి స్వభావం మారదు. ఎదుటివారి వ్యక్తిగత విషయాల్ని చర్చిచడమే వాళ్ళ పని. తమ మాటలకి ఎదుటివాళ్ళు ఎంత బాధ పడ్తారన్న ఆలోచన వాళ్ళకి ఉండదు. ఇది వాళ్ళ బలం కాదు ఒక విధంగా ఇది వాళ్ళ బలహీనత’ అనుకున్నాను. నా బాధను పైకి కనబడనీయకుండా చిన్నగా నవ్వాను గోవిందు మాటలకి.

“మూర్తి ఏం అప్పటి మూర్తి అనుకున్నావేంటి? ఎన్నో వేల మంది విద్యార్ధుల అల్లరి చిల్లరి చేష్టల్ని తట్టుకుని రాటుదేలిన ఉపాధ్యాయుడు మన మూర్తి. అంతే కాదు. పి.జి. చేశాడు. రచయితగా సమాజంలో కొద్దో గొప్పో పేరు సంపాదించాడు కూడా” ముకుందం అన్నాడు.

“అబ్బో! మన మూర్తి అంత పెద్దవాడయ్యాడా? సారీ మూర్తీ.. సారీ.. సారీ!” క్షమాపణ కోరే ధోరణిలో అన్నాడు గోవిందు. నేనేం మాట్లాడలేదు. చిన్నగా నవ్వేసాను.

సమావేశ సభ అరంభమయింది. మా పూర్వ విద్యార్ధి సహచరులు కొంతమంది వివిధ కారణాల వల్ల మృత్యువాత పడ్డారు. వాళ్ళకి నివాళులు అర్పించే కార్యక్రమం మొదలు జరిగింది. ఆ తరువాత ఒక్కొక్కళ్ళూ తాము విద్యార్ధిగా ఉన్న సమయంలో జరిగిన తమ అనుభవాలు వివరిస్తున్నారు. మరి కొందరు ఆ సమయంలో ఉన్న లేదా టీచర్లని, అమ్మాయిల్ని ఎలా ఆట పట్టించింది, అల్లరి పెట్టింది వివరిస్తూన్నారు. వాళ్ళ మాటల్లో హుందాతనం నాకు అగుపించలేదు.

గతం ఒక్కసారి నా కళ్ళెదుట నిలిచింది. అప్పుడు మా స్కూల్లో పని చేసిన వనజా మేడమ్ జడ అటూ ఇటూ ఊగేది. ఆవిడకి మా సహాచరులు ‘లోలకం’ అని పేరు పెట్టారు. ఆ నిక్ నేమ్‌తో ఆవిడ్ని పిలిచేవారు. మరో లేడీ టీచరు పేరు రూపవతి. అయితే ఆవిడ రూపం మాత్రం వేరు. ఏం చేయగలం? దేవుడు ఇచ్చిన రూపం అది. ఆవిడ్ని ఆట పట్టిస్తూ ‘ఫ్రంట్ పర్సనాలిటీ బ్యాక్ మున్సిపాలిటీ’ అనేవారు. సంగీతం టీచరు, సోషల్ సబ్జక్టు కూడా బోధించేవారు. ఆవిడ నిక్ నేమ్ ‘సరిగమప’.

ఇక లెక్కలు టీచరు రామారావు గారి పేరు ‘ఆల్ జీబ్రా గాన్ గాబ్రా’. సోషలు టీచరు మూర్తి గారి మూతి ఎత్తుగా ఉండేది. అతని నిక్ నేస్ ‘ఆవు మూతి’. సైన్సు మాష్టారికి మరో నిక్ నేమ్ అదే ‘దనాదన్’. అది అతని ఊతపదం. దనాదన్‌గా ప్రయోగం చేసేయాలి అనేవాడు. అందుకే అతనికా నిక్ నేమ్. హిందీ మాష్టారు రాజుగారు. బోళా మనిషి. అతనికి చప్పున కోపం వస్తుంది. వెంటనే తగ్గపోతుంది. అతడ్ని రెచ్చగొట్టేవారు. అతని కోపం తారాస్థాయికి చేరుగానే చల్లని ఐస్ వేసిన షరబత్తు తీసుకుని వచ్చేవారు. అది త్రాగగానే అతన కోపం చల్లారిపోయేది. అది అతని బలహీనత.

అమ్మాయిల్ని వదిలే పెట్టారా? అదీ లేదు. ఒక అమ్మాయి కొంచం బొద్దుగా ఉంటుందని ‘బాతు’ ఆమె నిక్ నేమ్. మరో అమ్మాయి తిప్పుకుని నడుస్తుందని ఆమె నిక్ నేమ్ ‘వయ్యారి’. మరో అమ్మాయికి పళ్ళు ఎత్తుగా ఉంటాయని ఆమె నిక్ నేమ్ ‘దంతసుందరి’.

ఇవన్ని తలుచుకుంటున్న నాకు ఒక్కసారి నా స్వీయానుభవం గుర్తుకు వచ్చింది. రెండు పదుల వయస్సు దాటగానే ఉపాధ్యాయుడి అవతారం ఎత్తాను. అసలే ఒడ్డూ పొడుగు లేని శరీరం. పీలగా ఉండే కుర్ర మాష్టార్ని. తమలాగే అగుపించే టెన్తు క్లాసు విద్యార్ధులు నన్ను ఆట పట్టించేవారు. ఒక విధంగా నాకు ఆ సమయం ర్యాగింగ్ అనిపించేది.

“జి.జి.కే. మూర్తి అంటే పూర్తి పేరు ఏంటిరా?” ఒకడు వెనక నుండి నాకు వినిపించేటట్టు అనేవాడు. “గీర గార కృష్ణమూర్తి” ఒకడి సమాధానం. “లేదు లేదు. గుంట గాడిద కొడుకు.” మరొకడి సమాధానం. “హిందీ బూందికి మన మాటు వినబడటం లేదు కాబోలు” అనేవారు. వాళ్ళ మాటలకి నాలో అసహనం. గిర్రున వెనక్క చూస్తే అందరూ గప్ చిప్.

అందులో కుర్ర మాష్టార్ని. విగ్రహ పుష్టి లేని వాడ్ని. అందుకే వాళ్లకి లోకువ. వచ్చిన కోపాన్ని దిగమింగుకోవడమే. ట్రైనింగ్ సమయంలో పిల్లల మనస్తత్వాల గురించి బోధించిన విషయాలు గుర్తు చేసుకుని అసహనాన్ని జయించాను. అలాంటి విషయాలు తాత్కాలికమే. ఆ తరువాత విద్యార్ధులు నాకు చేరువయ్యారు. తెలియని విషయాలు చెప్పించుకునేవారు. వారి చర్య నాకు ఎలా అనిపించిందేటే కొన్ని విద్యాసంస్థల్లో సీనియర్స్ జూనియర్స్‌ని నానా యాతనలకి మొదట గురిచేసి ఆ తరువాత వారిని స్నేహపూరితంగా అక్కున చేర్చుకునేవారు. జూనియర్స్‌లో భయాన్ని పోగట్టడానికే ఇలా ప్రవర్తించాము అని సీనియర్స్ వాదన. ఇదే పిల్లికి చెలగాటం ఎలకకి ప్రాణ సంకటం. మొదట్లో నాకు కూడా విద్యార్థుల విషయంలో అలాగే జరిగింది.

ఆలోచనా ప్రపంచం నుండి బయట పడ్డాను. నాకు మా పూర్వ విద్యార్ధి సహచరులు ఆడ మగ ఉపాధ్యాయుల్ని అమ్మాయిల్ని ఆ రోజుల్లో ఆట పట్టించిన విధానం చెప్తూ ఉంటే నాకు వాళ్ళ మాటలు నచ్చలేదు. నాకే కాదు నాలాగే మరికొంత మందికి కూడా నచ్చలేదు. అందరం ఏడు పదుల వయస్సు దాటిన వాళ్ళము. ఎన్నో కష్ట నష్టాలు ఒడిదుడుకులు ఎదుర్కున్న వాళ్ళము. జీవిత చరమాంకంలో కూడా కష్టాలకి మౌనంగా రోదించి, కొన్ని సందర్భాల్లో కన్నీరు పెట్టుకున్న వాళ్ళము. ఎన్నో సమస్యలు ఒక్కక్కరి జీవితంలోనూ. అలాంటివి మన సహచరులు తమ జీవితంలోని జరిగినవి వివరించకుండా ఇలా చౌకబారు మాటలు వెకిలిగా మాట్లాడ్డం నాకు నచ్చలేదు.

“ఈ వయస్సులో ఇలా సమావేశమయిన మనం మాట్లాడుకోవల్సిన మాటలు ఇవా?” అని కొంతమంది అలా మాట్లాడిన వాళ్ళని వారిస్తే ఈ మాటల్ని సమర్థించే వాళ్ళ వాదన వేరేగా ఉంది. “ఇన్నాళ్ళూ మన జీవితంలో ఎన్నో సమస్యలూ, కష్టాలూ, నష్టాలూ, చేదు అనుభవాలు అనుభవించాం. వాటి నన్నింటిని మరిచిపోయి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆహ్లాదకరమైన ఆ మధుర స్మృతుల్ని తలుచుకోవడం తప్పుకాదు.” అని మరి కొందరి భావన.

మధుర స్మృతుల్ని తలుచుకోవాలంటే మరో మధుర జ్ఞాపకాలు లేవా? ఎదుటి వాళ్ళని కించపరచడమే మధుర స్మృతులా? అందులోనూ ఆడవాళ్ళ గురించి. మనింట్లోనూ ఉన్నారు ఆడవాళ్ళు. వాళ్ళని ఎవరైనా కించపరుస్తే మనం తట్టుకోగలమా? మనం వాళ్ళని ఆదరించాలే కాని చులకన చేయడం మంచిది కాదు. ఈ చర్యను వారించిన వాళ్ళ వాదన.

నన్ను మాట్లాడమన్నారు. నేను అందుకు పూర్వం మాట్లాడిన వాళ్ళలా మాట్లాడలేను. ఎందుకంటే వాళ్ళు మసలిన వాతావరణం వేరు, నేను మసలిన వాతారవణం వేరు. రెండు పదుల వయస్సు నిండగానే ఉపాధ్యాయుడిగా అవతారం ఎత్తాను. వయస్సుతో సంబంధం లేదు. ఉపాధ్యాయుడంటే తల్లిదండ్రుల తరువాత గురువుదే ఆ స్థానం. ఆ స్థానంలో ఉన్న నేను అందరూ మాట్లాడినట్లు మాట్లాడలేను. విద్యార్ధులు ఉపాధ్యాయుడికి పిల్లల్తో సమానం.

ఆనాడు నా దగ్గర చదువుకున్న వాళ్ళు ఈనాడు కొంత మంది తాతయ్యల అవతారం ఎత్తితే ఆడపిల్లలు, నాయనమ్మ, అమ్మమ్మలయ్యారు. ఇప్పుడు కూడా వాళ్ళు నాకు తారసపడ్తే వెంటనే నాకు నమస్కరించి యోగక్షేమాలు అడుగుతారు. అందుచేత నేను మిగతా వాళ్ళలా మాట్లాడలేను. అందుకే నాకు తోచిన నాలుగు ముక్కలు మాట్లాడి వచ్చి కూర్చున్నాను.

మా పూర్వ విద్యార్ధి సహచరులలో మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది కళాకారులు ఉన్నారు. మంచి పాటలు పాడిన వాళ్ళు ఉన్నారు. మిమిక్రి చేసిన వాళ్ళు ఉన్నారు. భోజనాలు అయిన తరువాత వాళ్ళ వాళ్ళ కళల్ని ప్రదర్శిస్తారు అని అనుకున్నాను.

అంతే కాదు ఇన్ని సంవత్సరాల తరువాత కలుసుకున్నాం. అందరూ జీవితంలో తమకి ఎదురయిన అనుభవాలు తీపి గుర్తులు, చేదు అనుభవాలు చెప్తారు. చెప్పి వాళ్ళ మనస్సు తేలిక పరుచుకుంటారు, నేను కథలు వ్రాసుకోడానికి తగిన మేత లభిస్తుంది అని అనుకున్నాను. అయితే అలా జరగలేదు.

భోజనాలు అయిన వెంటనే అందరూ వాళ్ళ వాళ్ళ గమ్యస్థానాలకి వెళ్ళడానికి తయారయ్యారు. వీడ్కోలు తీసుకుంటున్నారు. నేను అనుకున్నది జరగకపోయేసరికి నాకు నిరాశ కలిగింది. చివరికి మా పూర్వ విద్యార్ధుల కలయిక అదీ ఆత్మీయ కలయక నాకు నిరాశనే మిగిల్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here