ఓ సామాన్యుడి అసామాన్య జీవితాన్ని కళ్ళముందుంచిన ‘పోరాట పథం’

0
3

[శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్ గారు అనువదించిన ‘పోరాట పథం’ అనే డా. హెచ్. నరసింహయ్య గారి స్వీయచరిత్రని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[dropcap]త[/dropcap]న గురించి తాను అత్యంత నిజాయితీగా చెప్పుకున్న మనుషుల స్వీయచరిత్రలు పాఠకులపై చెరగని ముద్ర వేస్తాయి. నమ్మిన విలువలకు కట్టుబడి జీవించిన వ్యక్తుల జీవిత గాథలు ఏ కాలంలోనైనా మనలో ప్రేరణని కలిగిస్తాయి. జీవితంలో అట్టడుగు స్థాయి నుంచి మొదలుపెట్టి, ఉన్నత స్థానాలకు చేరుకున్నా తన మౌలిక స్వభావాన్ని మార్చుకోకుండా జీవన ప్రస్థానం కొనసాగించే వ్యక్తులు అరుదు. అలాంటి వారిలో డా. హెచ్. నరసింహయ్య ఒకరు. డా. హెచ్.ఎన్.గా ప్రసిద్ధులైన ఆయన నడక వదలని నిరాడంబరుడు, నడత మార్చని ధీమంతుడు.

కర్ణాటకలోని ఒక మారుమూల గ్రామంలో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన నరసింహయ్యగారి జీవితంలో ఎన్నెన్నో మలుపులు. పేదరికాన్ని అధిగమించాలంటే, చదుకొక్కటే మార్గమని విశ్వసించి – ఎందరో గొప్ప గురువుల మార్గదర్శనంలో చదువులో రాణించారు. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల చదువులను ఒక్కోటిగా పూర్తి చేస్తూ, బి.ఎస్.సి, ఎం.ఎస్.సి, చేసి, అనంతరం అమెరికాలో న్యూక్లియర్ ఫిజిక్స్‌లో డాక్టరేట్ చేశారు నరసింహయ్య.

చిన్నప్పుడు బడిలో చదువుతున్నప్పుడు గాంధీజీని కలవడం నరసింహయ్య గారి జీవితంలో ఓ గొప్ప మలుపు. అప్పటి నుంచి గాంధేయవాదయ్యారు. నిరాడంబరతని ఆభరణం చేసుకున్నారు, సరళమైన జీవన శైలిని అలవర్చుకున్నారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలుకి వెళ్ళారు. జైలు నుంచి విడుదలై మళ్ళీ చదువు కొనసాగించారు. విద్యార్థిగా ఉన్నప్పుడు హాస్టల్‍లలో, రామకృష్ణ మఠం వారి ఆశ్రమాలలో ఉండడం వల్ల – వసతి గృహాలని, సంస్థలను నిర్వహించడంపై అవగాహన కలిగింది.

తాను చదివిన నేషనల్ కాలేజిలోనే లెక్చరర్‍గా చేరి ఆ కాలేజీకే ప్రిన్సిపాల్ అయి, అక్కడ్నించి బెంగుళూరు విశ్వవిద్యాలయానికి ఉపకులపతి పదవీ బాధ్యతలు స్వీకరించడం విశేషం.

ప్రిన్సిపాల్‍గా ఉన్నప్పుడు కాలేజీలో ఎన్నో కీలకమైన మార్పులు చేశారు. వాటిల్లో ముఖ్యమైనది – పర్యవేక్షణ లేకుండా పరీక్షలు నిర్వహించడం! ఈ పద్ధతి విజయవంతమైందని వేరే చెప్పనక్కరలేదు. విద్యార్థుల, అధ్యాపకుల అభిమానాన్ని చూరగొన్నారు.

బెంగుళూరు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఎన్నో సంస్థల స్థాపనకు కృషి చేశారు. నూతన విధానాలకు ఆద్యులయ్యారు. తన కంచాన్ని తానే కడుక్కునే వైస్ ఛాన్స్‌లర్‌ని చూసిన వేరే రాష్ట్రపు ఉన్నతాధికారి ఆశ్చర్యానికి అంతుండదు. అలాగే, సెలవు రోజున – డ్రైవర్‌ని రావద్దని చెప్పి ఆటోలో ప్రయాణించిన సందర్భంలో ఒకాయన అడిగిన ప్రశ్నకు నరసింహయ్య గారి జవాబు అందరికీ అనుసరణీయం. అలాగే అప్పటి ముఖ్యమంత్రి దేవరాజ్ అరసు గారు నరసింహయ్యకి నేర్పిన గుణపాఠం ఏమిటో తెలుసుకోడం అత్యంత ఆసక్తిగా ఉంటుంది.

కర్నాటక శాసన మండలి సభ్యుడిగా ఎంపికైనప్పుడు – ప్రభుత్వ పక్షంలో చేరకుండా ఇండిపెండెంట్‍గానే ఉండడం, పదవీకాలం ముగిసాకా, తనను నామినేట్ చేసిన (మాజీ) ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెబుతూ లేఖ వ్రాయగా, అది చదివిన శ్రీ ఆర్. గుండూరావుగారు వారి వ్యక్తిత్వానికి అబ్బురపడడం గొప్పగా ఉంటుంది.

ఈ స్వీయచరిత్రలోని ‘కొన్ని ఉపాఖ్యానాలు’ సరదాగా ఉంటాయి. పాఠకుల పెద్దలపై చిరునవ్వుని తెప్పిస్తాయి. ఉన్నత విలువలే కాదు, హయిగా నవ్వించే హాస్య చతురుత కూడా ఉంది నరసింహయ్యగారిలో. ఎన్నో సందర్భాలలో ఓ జోక్ చెప్పి, గంభీరంగా ఉన్న పరిస్థితిని తేలికజేయడం ఈ స్వీయచరిత్రలో కనబడుతుంది.

కుటుంబ సభ్యులంటే అమితమైన ప్రేమ ఉండేది నరసింహయ్య గారికి. అవివాహితుడైన నరసింహయ్యగారికి చెల్లెలంటే చాలా అభిమానం. చెల్లెలు గంగమ్మ మరణం ఆయనను క్రుంగదీస్తుంది. ‘ముందు పుట్టిన వారు ముందు ఎందుకు చచ్చిపోరు? చిన్నవాళ్ళు ముందు చనిపోవడం చాలా అన్యాయం’ అని వాపోతారు. తన చెల్లెలికి అంతకు ముందు రెండు రోజుల క్రితం పంపిన చివరి మనియార్డర్ చేరలేదంటూ, చెల్లెలు మారిన అడ్రసు ఇవ్వలేదనీ, ఆమె లోకంలో మన దేశపు కరెన్సీ చలామణీలో లేదేమోనంటారు. కళ్ళు చెమ్మగిల్లుతాయి ఈ ఉదంతం చదువుతుంటే.

ఇలా వ్యక్తిగా, లెక్చరర్‍గా, ప్రిన్సిపాల్‍గా, వైస్ ఛాన్స్‌లర్‍గా బలమైన ముద్ర వేసిన నరసింహయ్య గారి గురించి చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన లక్షణం వారి హేతువాద దృక్పథం. కొందరు నకిలీ స్వాములు గుట్టు రట్టు చేయడం; చేతబడి వంటి చర్యలను ఎదుర్కోవడం, సత్యసాయిబాబా గారి మహిమలను ప్రశ్నించడం వంటివి ఆయనను కొందరికి విరోధిగా మార్చాయి. అయినప్పటికీ నరసింహయ్యగారు తన శాస్త్రీయ దృక్పథాన్ని విడనాడలేదు.

కొన్ని సంవత్సరాల పాటు రోజూ ఉప్మా తిన్న వ్యక్తిగా డా. హెచ్. ఎన్. గుర్తుండిపోతారు. ఉప్మా అంటే ఆయనకి అంత ఇష్టమా? అసలు కారణం తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాలి.

మితాహారం, మద్యపానానికి దూరం, నడక వంటి అలవాట్లని ఆయన జీవితాంతం వదల్లేదు. వైస్ ఛాన్స్‌లర్ అయినా తాను ధరించే దుస్తులలో మార్పు చేయకపోవడం – నడవడిని బట్టి పదవికి హోదా, దుస్తులను బట్టి కాదని తెలుపుతుంది.

తన మరణాంతరం తన శరీరాన్ని ఏమి చేయాలో వీలునామాలా రాసి తమ స్వీయచరిత్రని ముగించారు నరసింహయ్య.

***

కన్నడంలో ‘హోరాటద హది’ అనే పేరుతో ప్రచురితమైన ఈ పుస్తకాన్ని తెలుగులోకి శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్ అనువదించారు. తొలుత సంచిక వెబ్ పత్రికలో ధారావాహికంగా ప్రచురితమైందీ రచన. ఓ గొప్ప వ్యక్తి జీవితాన్ని తెలుగువారికి పరిచయం చేసినందుకు మురళీమోహన్ గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి.

***

పోరాట పథం (ఆత్మకథ)
మూలం: డా. హెచ్. నరసింహయ్య.
అనువాదం: కోడీహళ్ళి మురళీమోహన్
ప్రచురణ: ది నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆఫ్ కర్నాటక, బెంగుళూరు.
పేజీలు: 475/-
వెల: ₹ 500/-
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు.
అనువాదకులు మురళీమోహన్ గారి 9701371256 నెంబరుకి ₹ 500/- ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి మీ చిరునామా తెలియజేస్తే, పుస్తకం రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపబడుతుంది.

 

 

 

~

‘పోరాట పథం’ పుస్తకం వెలువరించిన శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్ ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-kodihalli-murali-mohan/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here