Site icon Sanchika

‘పోరాట పథం’ – డాక్టర్ హెచ్.నరసింహయ్య ఆత్మకథ -1

[ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది డాక్టర్ హెచ్.నరసింహయ్య గారి ఆత్మకథ అనువాదాన్ని అందిస్తున్నారు శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్.]

బాల్యం

పుట్టిన ఊరు

[dropcap]హొ[/dropcap]సూరు గౌరీబిదనూరు తాలూకాలోని ఒక గ్రామం. ఇది ఒక హోబళి కేంద్రం (కర్నాటకలో కొన్ని పల్లెల సమూహాన్ని హోబళి (Revenue Block) అంటారు). గౌరీబిదనూరు – మధుగిరి మార్గంలో గౌరీబిదనూరుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది పుట్టినప్పుడు కొత్త ఊరు (హొస ఊరు)గా ఉండేది. ఇప్పుడు చాలా పాత ఊరుగా మారింది. ఆ గ్రామంలో సుమారు 1500 గృహాలు. 7500 కన్నా ఎక్కువ జనాభా. గ్రామంలోని రోడ్లు, డ్రైనేజి వ్యవస్థ మన దేశపు సాంప్రదాయంలా అంతా అస్తవ్యస్తంగా ఉంది. గృహ నిర్మాణం కూడా అంతే. ఎక్కడ చోటు కనిపిస్తే అక్కడో ఇల్లు కట్టేయడమే. ఎక్కడా ప్రణాళిక లేదు. పద్ధతీ లేదు.

అన్ని చోట్లా ఉన్నట్లే ఇక్కడా ఒక హరిజనవాడ – షెడ్యూలు కులాలవారి వాడ. ఊరి చివరలో ‘ఎడమ చేతి’ వారికొక వాడ, ‘కుడి చేతి’వారికి మరొక వాడ. ఒక్కొక్క దానిలో సుమారు 100 ఇళ్లు. ఇవన్నీ జనాలతో పొంగి పొర్లుతున్న కుటుంబాలు. ‘కుడి’, ‘ఎడమ’ వారికి ప్రత్యేకమైన బావులు, గుళ్ళూ. ఒకరి బావి మరొకరు ఉపయోగించడానికి పనికిరాదు. గుడులు కూడా అంతే. ఈ ‘కుడి’ ‘ఎడమ’ల మధ్య వివాహాలు, విందులూ నిషిద్ధం. ‘కుడి’ చేతివారు ‘ఎడమ’ చేతి వారికంటె శ్రేష్ఠమనే ప్రతీతి మొదటి నుంచే ఉంది. ఊరిలో బలిజకులం వారి ఇళ్ళు 200కు పైగా ఉన్నాయి. ‘నాయక్’ల ఇళ్ళు 150, బ్రాహ్మణుల ఇళ్ళు 15-20 ఉన్నాయి. వైశ్యుల ఇళ్ళు 20 నుండి 40 దాకా ఉన్నాయి. ఒక్కలిగ, కుమ్మర, మరాఠీలు మిగిలిన ముఖ్యమైన జాతులు. 10-20 ముసల్మాన్ల ఇళ్ళూ ఉన్నాయి. ఊరిలో బీదవాళ్ళే ఎక్కువమంది. ఎక్కడో కొంతమంది మాత్రమే మధ్య తరగతివారు. ఒకరో ఇద్దరో శ్రీమంతులు కూడా ఉన్నారు. అధికులకు తెలుగు మాతృభాష. మిగిలిన వారికందరికీ కన్నడ భాష బాగా తెలుసు.

వెంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి, వీరభద్రస్వామి, ఈశ్వరుడు, గ్రామదేవతలైన మారమ్మ, మరిగమ్మ, బండమ్మ – వీరందరి దేవస్థానాలున్నాయి. ఈ మధ్యనే శనిదేవుడికీ ఒక మంచి దేవస్థానం కట్టారు. ప్రజల్లో ఉన్నట్టే దేవతలలో కూడా ఆర్థిక అసమానతలున్నాయి. కొంత అటూ ఇటూ అందరు దేవుళ్ళూ బీదరికంతోనే కాలం వెళ్ళబుచ్చుతున్నారు. శనిమహాత్ముడు కొంచెం నయం. కొత్త ఆంజనేయస్వామి రావడంతో ఇదివరకు ఉన్న ఆంజనేయస్వామికి కొంత అనాదరణ. ఏ దేవుడూ శ్రీమంతుడు కాడు. పల్లెటూర్లలో అలా కావడానికి సాధ్యమూ కాదు.

హొసూరు, చుట్టు పక్కల గ్రామాలలో ఎప్పుడూ కరువే. కోలారు జిల్లానే అంత. మెట్ట పొలాలే ఎక్కువ. రాగులు, వేరుశెనగ ముఖ్యమైన పంటలు. బోరు బావులు, మరి ఇతర బావుల ఆసరాతో అక్కడక్కడా వరి పండిస్తారు. తోటలు పెంచుతున్నారు. ఊరి ప్రక్కనే సదా ఎండిపోయిన కాలువ. ఎన్నో ఏళ్ళకొకసారి దానిలో నీళ్ళు పారడం చూడవచ్చు. అది ఉత్తర పినాకినీకి ఉపనది. ఊరి ప్రక్కనే పెద్ద చెరువు. ఇక్కడ పెద్దది అంటే చెరువు పొడవు అని అర్థం. హనుమంతుడి తోకలాగా ఒక కిలోమీటరు కన్నా ఎక్కువ పొడవు అని అర్థం. చెరువు లోతు చాలా తక్కువ. అప్పుడప్పుడూ చెరువులో నీళ్ళను చూడవచ్చు. నాలుగైదు ఏళ్ళకొకసారి చెరువు నిండుతుంది. త్రాగడానికి మంచినీటి బావులు రెండున్నాయి. ఇప్పుడు బోరుబావులతో నీటిని తోడి శుభ్రం చేసి నల్లాల ద్వారా ప్రజలకు అందించే సౌకర్యం ఉంది. ఊరి వెనుక ఒక ప్రాథమిక మరియు మాధ్యమిక పాఠశాల. ఆడపిల్లల పాఠశాల, ఉర్దూ పాఠశాలలు ఉన్నాయి. ఒక సంస్కృత పాఠశాల కూడా ఉంది. పూర్వం ఒక ఖాదీకేంద్రం ఉండేది. ఊరి ముందు ఒక ప్రభుత్వ ఆసుపత్రి. దానిని ఆనుకొని ఒక ప్రముఖ స్మశానం. సహజంగానే ఆసుపత్రికీ, స్మశానానికి అవినాభావ సంబంధం ఉండేది. ఇప్పుడు ఆ స్మశానం వేరే చోటికి తరలించబడింది. ఊరికి అన్నిదిక్కులలోనూ ఊరిని ఆనుకుని ఎన్నో స్మశానాలు. ఊరి ముందు ఒక పోలీస్ స్టేషన్.

మా ఊరి విద్యాలయాలు

మావూరి సర్కారు ప్రాథమిక – మాధ్యమిక పాఠశాలకు నా అంత వయస్సే ఉంది. ఇది 75 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ప్రాథమిక శాల నాలుగేళ్ళు.. మాధ్యమిక శాల కూడా అంతే. ఇది ఆరు గదులున్న పెంకులతో నిర్మించిన కట్టడం. దీనికి చుట్టూ ఎకరా కన్నా ఎక్కువ వైశాల్యమున్న మైదానం. భవనం దృష్టిలో గాని, ఇతర విద్యాసదుపాయాల దృష్టిలో గాని ఇది అంతగా చెప్పుకోదగిన పాఠశాల ఏమీ కాదు. ఐతే విలువల దృష్టితో మంచి స్థానాన్ని సంపాదించుకొంది. మొదటి నుండీ ఎంతో నిష్ఠ, శ్రద్ధాసక్తులు ఉన్న ఉపాధ్యాయులను కలిగి ఉంది. దీనికి తోడు దక్షతతో కూడిన ప్రధానోపాధ్యాయుల పరంపర. ఉపాధ్యాయులు ఒక్క నిముషం ఆలస్యంగా కూడా తరగతులకు పోయేవారు కాదు. ఎన్నడూ విద్యార్థులను అనాదరణతో చూసినవారు కాదు. కొందరు ఉపాధ్యాయులకు స్కూలే ఇల్లు. సాయంకాలం కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులతో అటపాటలలో భాగం వహించేవారు. వాలీబాల్, బ్యాడ్మింటన్ ప్రియమైన ఆటలు. అప్పుడప్పుడూ విద్యార్థులు కబడ్డీ ఆడేవారు.

తరగతి గదుల్లో ఉపాధ్యాయులు; అయితే క్రీడా మైదానంలో వారు సోదరులు, స్నేహితులు. ఆటపాటలతో పాటు దగ్గరలో ఉన్న గుట్టలకు పిక్‌నిక్, క్యాంప్ ఫైర్, పోటీలు, చర్చాకూటములు, ప్రతి శుక్రవారం సరస్వతీ పూజ మొదలైన కొన్ని పాఠ్యేతర కార్యక్రమాలను ఏర్పాటు చేసేవారు. పాఠశాల ప్రతిరోజూ “స్వామి దేవన లోక పాలన తే నమోస్తుతే” మరియు “కాయౌ శ్రీ గౌరి కరుణా లహరీ, తోయజాక్షీ శంకరీశ్వరి” అనే ప్రార్థనా గేయాలతో ప్రారంభమయ్యేది. రెండవ ప్రార్థనలో పరిపాలిస్తున్న మహారాజు వంశానికి శుభం జరగాలని, దేవుడు ఆ వంశాన్ని కాపాడాలని విద్యార్థులందరూ మూకుమ్మడిగా ప్రార్థన చేసేవారు.

బాలికల నాలుగు ఏళ్ల ప్రాథమిక పాఠశాల ఊరిలోని ఒక అద్దె ఇంట్లో నడిచేది. ఉర్దూ స్కూలు నేను చదివే సమయంలో లేదు. ఇప్పటికి కొన్నేళ్ల ముందు ఉర్దూ పాఠశాల ప్రారంభమైంది.

సంస్కృత పాఠశాల ఒక ప్రత్యేకమైన పాఠశాల. తరగతులు సర్కారు పాఠశాలలోనే నడిచేవి. ప్రథమ, మధ్యమ, కావ్య పరీక్షల కోసం విద్యార్థులకు ఈ పాఠశాల తర్ఫీదునిచ్చేది.

ఈ అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు డబ్బు దృష్ట్యా పేదవారు; నెలకు 15 రూపాయల జీతం. ఐతే వీరిని చూస్తే విద్యార్థులకు, ఊరి ప్రజలకు అపారమైన గౌరవం. వీరు వీధిలో వెళుతుంటే ఇళ్ళ ముందు కూర్చున్నవారు లేచి నిలబడి గౌరవాన్ని ప్రదర్శించేవారు.

నా తల్లిదండ్రులు

నేను పుట్టింది 1920వ సంవత్సరం జూన్ 6వ తేదీ. ఆ దినం ఆదివారం, శెలవురోజు. అందుకే కాబోలు నా జీవితంలో శెలవు దినమనేదే లేదు. తండ్రి హనుమంతప్ప. తల్లి వెంకటమ్మ. నేను జన్మించే నాటికే మా తల్లిదండ్రులకు ఎక్కువ వయస్సు ఉండేది. నా చెల్లెలు గంగమ్మ చివరి సంతానంగా నేను పుట్టిన రెండేళ్లకు జన్మించింది.

మాది చాలా వెనుకబడిన వర్గానికి చెందిన బీద కుటుంబం. మా తండ్రి కూలినాలి చేసుకొనేవారి పిల్లలకు చదువు చెప్పే పల్లెటూరి మేష్టారు. ప్రభుత్వ ఉద్యోగం కాదు. మా తండ్రి కార్యక్షేత్రం హొసూరుకు ఒక కిలోమీటరు దూరంలో ఉన్న పాత ఉప్పారహళ్ళి. చాలా చిన్న పల్లెటూరు. సుమారు 100 ఇళ్లుంటాయి. పేరుకు పాత ఉప్పారహళ్ళి ఐనా హొసూరు కన్నా కొంత కొత్తగానే ఉంటుంది. అన్ని పల్లెటూర్ల లాగా ఇదీ ఒక పల్లెటూరు.

ప్రతిరోజూ మా తండ్రి ఆ పల్లెలోని నరసింహస్వామి దేవస్థానంలో కూర్చొని ఆ పల్లెటూరి పిల్లలకు పాఠాలు చెప్పేవారు. మా తండ్రి ఎంతవరకు చదువుకొన్నారో నాకు తెలియదు. ఐతే వారికి కన్నడభాషలో మంచి పట్టు ఉంది. రామాయణ, మహాభారతాలను బాగా చదువుకొన్నారు. ఎన్నో పద్యాలు, అమరకోశంలోని కొన్ని భాగాలు కంఠతః వచ్చు. వారి చేతివ్రాత ఒక విధంగా మొరటుగా ఉండేది. ఇతరులు చదవడానికి చాలా కష్టపడవలసి వచ్చేది. ఒకసారి ఎవరికో వ్రాసి ఇచ్చిన కాగితాన్ని చదవడానికి గౌరీబిదనూరు లోని తాలూకా కచేరిలో ఎవరికీ సాధ్యం కాకపోవడంతో అప్పటి అమల్దారు దానిని చదవడానికి మా తండ్రినే పిలిపించారట. “అమల్దారు మిమ్మల్ని చూడడానికి పిలిచారు” అని మా తండ్రికి చెప్పినప్పుడు వారికి గాభరా అయ్యిందట. “మీరేమీ భయపడాల్సిన పనిలేదు. మీరు వ్రాసిన ఉత్తరం అక్కడ ఎవరికీ స్పష్టంగా చదవడానికి కాలేదు. కాబట్టి మీరే వచ్చి చదవాలని అమల్దారు తెలిపారు” అని చెప్పాక మనసు నిమ్మళించి వెళ్ళి చదివారట!

మా తండ్రి ఒక మంచి, సమర్థుడైన ఉపాధ్యాయుడిగా పేరు గడించారు. వారిని చాలా గౌరవించేవారు. వారు పాఠం చెప్పినందుకు గురుదక్షిణగా కొంత తృణధాన్యం ముట్టజెప్పేవారు.

మా తల్లి మహా కష్టజీవి. నిరక్షరాస్యురాలు. ఎప్పుడూ పనే. కూలి పని, పరులయింటిలో పని. ఇలా కూలీనాలీ, ఇతరుల ఇళ్లలో ఊడిగం చేస్తూ అంతో ఇంతో సంపాదించేవారు. ప్రొద్దునే లేచి ఇద్దరు వైశ్యుల ఇళ్ళల్లో చెత్త ఊడ్చడం, గిన్నెలను తోమడం వంటి పనులు చేసేవారు. సద్ది అన్నం, చారు మిగిలితే అప్పుడప్పుడూ ఇంటికి తెచ్చేవారు. సాధారణంగా అదే మాకు బ్రేక్‌ఫాస్ట్. మొదట పిల్లలకు, తరువాత మా తండ్రికి పెట్టి మిగిలితే మా తల్లి భుజించేవారు. మధ్యాహ్నం కూలిపనికి వెళ్ళేవారు. శక్తి ఉన్నంతకాలం అహర్నిశలు కష్టపడ్డారు. ఒక్క నిమిషం హాయిగా కూర్చొని సంతోషపడలేదు.

మా ఇల్లు

మా ఇల్లు చాలా చిన్నది. సుమారు 15’ X 25’. మట్టి గోడలు. పైకప్పు కూడా మట్టిదే. అయినా దాని ఉపయోగం దృష్ట్యా దానిని స్థూలంగా మూడు భాగాలుగా విభజించవచ్చు. ఇంటిలోనికి ప్రవేశించిన వెంటనే ఒక ఆవునో, ఎనుమునో కట్టేంత జాగా. ఆ ఎనుము కట్టేంత స్థలం పైభాగాన నలుగురైదుగురు పడుకోగలిగినంత చోటు. దాని వెనకల ఒక పొయ్యి, కొన్ని మట్టి కుండలతో కూడిన వంటిల్లు. వంటింటికి ఒక వాకిలి. ఇంటికొక మునివాకిలి. ఇంటికి కిటికీలు లేవు. అయితే మూడు గవాక్షాలున్నాయి. ఈ ఇంటికి ప్రత్యేకమైన అస్తిత్వమంటూ లేదు. చుట్టుపక్కల ఇళ్ళు ఒకదానిని ఒకటి అంటుకొని ఉన్నాయి. దీనివల్ల ఒక్కో ఇంటికీ గోడలు మిగులు. అయితే దీనివల్ల గాలి వెలుతురుల తీవ్రమైన కొరత. గాలి వెలుతురులకు సింహద్వారం నుండి మాత్రమే ప్రవేశం. ఇంటిలో గాలి చలన రహితంగా స్థంభించి ఉంటుంది. ఇంటిలోనికి ప్రవేశించిన గాలి చెర విడిపించుకొనాలంటే వచ్చిన దారిలో వెనక్కి మళ్లాల్సిందే! ఇంటిలోనికి వెలుతురు ప్రవేశానికి కూడా చాలినన్ని ఆటంకాలు. దీనివల్ల సాధారణంగా ఇంట్లో చీకటే ఎక్కువ. రాత్రిపూట చమురు మట్టి దీపాల వెలుగు. అప్పుడప్పుడూ వత్తి ఆరిపోతుండేది. ఇంటి ముందు 20-25 అడుగుల లోతున్న బావి. దాని పక్కనే మూడు వైపులా మూడడుగులు ఎత్తున్న మట్టిగోడలతో పైకప్పులేని ఒక ప్రదేశం. ఇది చుట్టుపక్కలున్న ఐదారు ఇళ్లకు స్నానం చేసే చోటు మరియు మూత్రశాల. దీనిని సాధారణంగా స్త్రీలే ఉపయోగించేవారు. దీనికొక దీటైన మురుగు గుంట. దానిని తలుచుకుంటే ఇప్పుడు ఒళ్ళు జలదరిస్తుంది. దాని లోతు సుమారు మూడు అడుగులు. అటువంటి అనారోగ్యకరమైన, కుళ్ళిన వాసన గల మురుగు గుంటను నేను ఎక్కడా చూడలేదు. అన్ని దోమలకు అదే జన్మస్థానం మరియు నివాస స్థలం. ఆ దోమలు విహరించడానికి చుట్టుపక్కల ఉన్న ఇళ్ళకు ఎటువంటి ఆహ్వానం లేకుండానే భేటీ ఇస్తాయి. రాత్రి వాటిని చంపడానికి అనువైన సమయం.

ఇలాంటి ఒక ఇంటిలో, ఇలాంటి వాతావరణంలో నేను మంత్రసాని అవసరం లేకుండానే ఆదివారం నాడు 6-6-1920న జన్మించాను. మా తల్లి బొడ్డుతాడును కొడవలితో వేరుచేసిన తర్వాత నాకు విముక్తి లభించింది. అన్ని ఆరోగ్య నియమాలను ఉల్లంఘించి నేను నా శైశవాన్ని దాటడమే ఒక ఆశ్చర్యం.

పాఠశాల ప్రవేశం

మా తండ్రికి చదువు విలువ తెలిసిన దృష్ట్యా సహజంగానే నన్ను హోసూరు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. నాకు మొదటి నుండి చదువంటే చాలా ఇష్టం. ఒక్కరోజు కూడా నేను తరగతికి గైర్హాజరు కాలేదు. పాఠాలను చక్కగా గురిపెట్టి వినేవాణ్ణి. నాకు జ్ఞాపకం ఉన్నంతవరకూ సహవిద్యార్థులతోగానీ మిగిలిన పిల్లలతో కానీ ఎప్పుడూ నేను పోట్లాడలేదు. ఏ ఉపాధ్యాయుడూ నన్ను దండించినట్లు నాకు జ్ఞాపకం లేదు. మిగిలిన విద్యార్థులకన్నా నేను కొంచెం ఎక్కువ బుద్ధిమంతుడిననే పేరుండేది. బహుశా దానివల్లే కాబోలు ఉపాధ్యాయులకు నన్ను చూస్తే ఎక్కువ మమకారం, నా చదువు పట్ల కొంచెం ఎక్కువ ఆసక్తి ఉండేవి. నా తలకూడా మిగిలిన వారి తలలకన్నా పరిమాణంలో పెద్దగా ఉండటం వల్ల ఎక్కువమంది నన్ను పెద్దతలకాయ అనే పిలిచేవారు.

ఇంటిలో తండ్రి పాఠాలు చెప్పేవారు కాదు. ఐతే ప్రభవ, విభవలనుండి మొదలయ్యే 60 హిందూ సంవత్సరాలను ప్రతిరోజూ చెప్పించేవారు. దానితో పాటు అమరకోశంలోని శ్లోకాలను నేర్పించేవారు. నాకు తరగతిలోని ఏ విషయమూ కష్టంగా కనిపించలేదు. పాఠ్యపుస్తకాలు లేకపోవడమే నా చదువుకు ఒక పెద్ద సమస్య. పుస్తకాలు కొనడానికి డబ్బులు ఉండేవి కావు. స్నేహితుల పుస్తకాల సహాయంతో చదువుకొనే వాడిని. తరగతిలో మాత్రం శ్రద్ధతో, ఏకాగ్రతతో పాఠాలు వినేవాడిని. ఎక్కువభాగం అక్కడనే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడిని.

అప్పటి విద్యావిధానంలో ప్రాథమిక విద్య వ్యవధి నాలుగు సంవత్సరాలు. మాధ్యమిక విద్య వ్యవధి కూడా నాలుగు సంవత్సరాలే. ప్రాథమిక తరగతులలో నన్ను ఎక్కువ ప్రభావితం చేసినవారు శ్రీ రాఘవేంద్రాచారి గారు. క్రమశిక్షణకు మారుపేరు. అయితే వీరు ముక్కోపి. వీరి తరగతిలో విద్యార్థులకు అల్లరి చేయడానికి అవకాశమే లేదు. వీరిని చూడగానే విద్యార్థులు గడడా వణికేవారు. తరగతిలో పిల్లలున్నట్లే తెలిసేది కాదు. అంత ప్రశాంత వాతావరణం. చడీచప్పుడు అంతా ఉపాధ్యాయులదే. వారు అడిగిన ప్రశ్నలకు విద్యార్థి తప్పు సమాధానం చెబితే విద్యార్థికి తగిన శాస్తి. విద్యార్థి జుట్టు పట్టుకొని గోడకు కొట్టడమో, బెత్తంతో చేతిమీద చావ బాదడమో, పలకతో చేతి గణుపులపై కొట్టడమో ఇవీ వారి వివిధ రకాల శిక్షలు. గోడ కుర్చీ అయితే చాలా మామూలైన శిక్ష. అయితే పాఠం బాగా చెప్పేవారు. వీరి శిక్షలనుండి నేను నెగ్గుకు రావడమే ఒక విశేషం.

ప్రాథమిక విద్య ముగించి మాధ్యమిక పాఠశాలకు చేరాను. నా జీవితంలో మాధ్యమిక పాఠశాల విద్య ఒక ముఖ్యమైన ఘట్టం.

ఇద్దరు ఉపాధ్యాయులు

నా జీవితంపై ప్రభావాన్ని చూపిన వ్యక్తులలో మాధ్యమిక పాఠశాలకు చెందిన ఇరువురు ఉపాధ్యాయులున్నారు. శ్రీ ఎస్.వెంకటాచలయ్య గారు అదే ఊరికి చెందినవారు. కన్నడ ఉపాధ్యాయులు. హిందీలో కూడా పండితులు. వారిది క్రమశిక్షణతో కూడిన జీవితం. స్వయంగా ప్రత్తితో నూలు వడికేవారు. నిఖార్సైన ఖద్దరు ధారి, గాంధేయవాది.

తరగతిలో పాఠాలను చాలా స్ఫూర్తితో, శ్రద్ధతో చెప్పేవారు. వారి ఉపదేశం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాలేదు. సమయం చిక్కినప్పుడల్లా క్రమశిక్షణ, దేశప్రేమ, దేశభక్తుల జీవిత చరిత్రలు, మూఢనమ్మకాలు మొదలైన వాటి గురించి బోధించేవారు.

రెండవ వారు శ్రీ ఎం.ఎస్.నారాయణరావు గారు. వారు మాధ్యమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు. చాలా బాగా పాఠం చెప్పేవారు. అందులో ఇంగ్లీష్ పాఠాన్ని పల్లెటూరి పిల్లలకు ఎంతో చక్కగా మనస్సుకు హత్తుకొనేలా చెప్పేవారు. పాఠశాల పనులపై వారికి ఎక్కువ శ్రద్ధాసక్తులు ఉండేవి.

ఈ ఇద్దరు ఉపాధ్యాయులూ ప్రతిరోజు సాయంత్రం విద్యార్థులతో కలిసి ఆటల్లో పాలుపంచుకొనేవారు. వాలీబాల్, బ్యాడ్‌మింటన్‌లకు ఎక్కువ ప్రోత్సాహముండేది. నేను నిత్యమూ వారితో ఆటలలో పాల్గొనేవాడిని. నేనంటే వారిద్దరికీ ప్రత్యేకమైన వాత్సల్యం.

దాగుడుమూతలు

నేను మాధ్యమిక పాఠశాలలో చదువుతున్నప్పుడు ఉజ్జయిని సుబ్బయ్య అనే కన్నడ ఉపాధ్యాయుడు ఉండేవారు. అప్పటికే ఆయనకు రిటైర్ అయ్యే వయస్సు. మా తరగతిలో వెంకప్ప అనే స్నేహితుడుండేవాడు. మంచివాడు అయితే కొంచెం మొరటు. వెంకప్ప మరియు ఉజ్జయిని సుబ్బయ్యలకు ఏదో దూరపు సంబంధం ఉంది. ఇద్దరూ తెలుగువారు. ఒకసారి సుబ్బయ్యగారు పాఠం చెబుతూ వెంకప్పను ఏదో ప్రశ్న అడిగారు. దానికి వాడు “పో పో నాకు తెలియదు” అని తెలుగులో మొరటుగా బదులిచ్చాడు. మొదలే ఎర్రగా ఉండే సుబ్బయ్యగారి ముఖం కోపంతో ఇంకా ఎర్రబడింది. టేబిల్‌మీద ఉన్న బెత్తాన్ని అందుకొని “నన్ను పో, పో అంటావేమిరా వెర్రి ముండా కొడుకా” అంటూ వాడిని కొట్టేందుకు వెళ్లారు. ఆ తరగతిగదికి రెండు తలుపులు ఉన్నాయి. ఒక తలుపునుండి వెంకప్ప తప్పించుకొని బయటకు పరిగెత్తాడు. సుబ్బయ్యగారు కొట్టడానికి వాణ్ణి వెంబడించాడు. వాడు ఇంకో తలుపు నుండి గదిలోకి వచ్చాడు. ఇలా వారిద్దరి దాగుడుమూతలు ఇప్పటికీ నాకు కళ్ళకు కట్టినట్లే ఉంది. దానిని చూసి మాకు భలే సంతోషం వేసింది. అయితే గట్టిగా నవ్వడానికి భయం. వెంకప్ప సుబ్బయ్య గారికి చిక్కనూ లేదు తరగతి వదిలి బయటకు వెళ్ళనూ లేదు. చివరికి మేష్టారు అలసిపోయి ఆయాసంతో వగరుస్తూ కుర్చీలో కూలబడ్డారు. వెంకప్ప కూడా వచ్చి తన స్థానంలో కూర్చొన్నాడు. మేష్టారికి వాడిని తిట్టడానికి కూడా శక్తి లేదు. అంతగా అలసిపోయారు. వాడివైపు చురచుర చూస్తూ పాఠాన్ని కొనసాగించారు.

హిందీ – సంస్కృత అధ్యయనం

మాధ్యమిక పాఠశాలలో చదువుతున్నప్పుడే శ్రీ ఎస్.వెంకటాచలయ్య గారి ప్రోత్సాహంతో హిందీ భాష చదవడం మొదలు పెట్టాను. అలాగే సంస్కృత విద్యాభ్యాసమూ మొదలయ్యింది. మాధ్యమిక తరగతుల పాఠ్యాంశంగా మా పాఠశాలలో హిందీ భాష లేదు. హిందీని ప్రత్యేకంగా చదివాను. శ్రీ వెంకటాచలయ్య గారే హిందీని బోధించేవారు. 15-20 మందికి ఉచితంగా హిందీని నేర్పించేవారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాథమిక మరియు మధ్యమ పబ్లిక్ పరీక్షలలో ఉత్తీర్ణుడనై రాష్ట్రభాష పరీక్ష వరకు చదివాను.

మాధ్యమిక స్థాయిలో సంస్కృతం, ఆరోగ్య శిక్షణ ఐచ్ఛికాంశాలు. నిజంగా ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఆరోగ్య విద్యను నిర్బంధంగా నేర్పించాలి. దానికి బదులుగా సంస్కృత పాఠాలను ఎంపిక చేసుకొనే వీలు కల్పించడం వెనుక ఉన్న తర్కమేమిటో నాకు అర్థం కాలేదు. నేను చదువుకొనే సమయంలో ఇలాంటి సందేహమే రాలేదు. నా ఆరోగ్యం భేషుగ్గా ఉండడంతో ఆరోగ్య విద్యకు బదులుగా సంస్కృతాన్ని ఎంపిక చేసుకొన్నాను.

మా పాఠశాల సంస్కృత ఉపాధ్యాయుని పేరు శ్రీ పి.సుబ్బాశాస్త్రి గారు. మంచి విద్వాంసులు, సంస్కృత పాఠాశాలలో సాంప్రదాయ రీతిలో సంస్కృతాన్ని అభ్యసించి నిజమైన పాండిత్యాన్ని గడించారు. మా ఊరిలో ఒక సంస్కృత పాఠశాల కూడా ఉండేది. శ్రీ సుబ్బాశాస్త్రి గారి ప్రోత్సాహంతో ఉదయం పూట ఆ సంస్కృత పాఠశాలకూ వెళ్లి సంస్కృతాన్ని అభ్యసించాను.

వారాన్న భోజే

సుబ్బాశాస్త్రి గారు మంచి రసికులు, శృంగార ప్రియులు. సంస్కృతంలో శృంగార ప్రస్తావనలు పుష్కలంగా ఉంటాయి. కొంతమంది సంస్కృత ఉపాధ్యాయులు ఇలాంటి సన్నివేశాలను ఇంకా ఎక్కువ రంజకంగా, ఉత్సాహంతో వర్ణిస్తూ వ్యాఖ్యాన, ఉపాఖ్యానాలను చేస్తారు. నేను బి.ఎస్.సి (ఆనర్స్)లో ఉన్నప్పుడు ఉన్న ఇద్దరు సంస్కృత అధ్యాపకులు ఇలాంటి చిత్త ప్రవృత్తి కలిగినవారే. తరగతిలో అమ్మాయిలు ఉన్నా ఎలాంటి అసౌకర్యానికీ లోనుకాకుండా నిస్సంకోచంగా సునాయాసంగా, రసమయంగా పాఠం చెప్పేవారు.

మా మాధ్యమిక తరగతిలో పొరుగున ఉన్న పల్లెలైన ఆరూడి, బనవతి నుండి వచ్చిన సుబ్బయ్య, శీనప్ప అనే ఇద్దరు విద్యార్థులుండేవారు. వారిద్దరూ మా ఊరిలో వారాలు చేసుకొంటూ చదువుకొనేవారు. సుబ్బాశాస్త్రిగారికి వీరిద్దరూ ప్రియశిష్యులు. సుబ్బాశాస్త్రిగారికి వీరి చదువు పట్ల అసంతృప్తిగా ఉండేది. ఒకరోజు వీరి గురించే కాబోలు ఈ క్రింది కవితను చదివారు.

వారాన్న భోజే
వరరూపధారీ
వీధీషు వీధీషు విరాజమానః
విద్యార్థి రాజః విటసార్వభౌమః

అంటే వారాన్నము భుజిస్తూ, మంచి దుస్తులు తొడుగుకొని, వీధివీధులలో ఈ విద్యార్థి రాజులు విట సార్వభౌములలాగా విరాజిస్తున్నారు.

ఇది ఆశు కవితనో లేదా వారికి ముందే తెలిసినదో మాకు తెలియదు. అయితే వారు పై శ్లోకాన్ని ఘంటాపథంగా చెప్పి అర్థాన్ని విడదీసి విడదీసి చెప్పారు. సంస్కృత భాషలో ప్రథమ మరియు మధ్యమ పరీక్షలలో గెలుపొంది కావ్య పరీక్ష వరకు చదువుకొన్నాను. హిందీ రాష్ట్రభాష మరియు సంస్కృత కావ్య పరీక్షలు వ్రాయడానికి కొన్ని నెలలముందు ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం కొరకు బెంగళూరుకు వచ్చాను.

నా చదువు

నాకు ఎప్పుడూ పాఠ్యపుస్తకాలను అర్థం చేసుకోవడానికి కష్టం కాలేదు. ఏ పరీక్షకూ భయపడలేదు. అందుకే హిందీ, సంస్కృత పరీక్షలలో సులభంగా ఉత్తీర్ణుడయ్యాను. మాధ్యమిక తరగతులు చదివినప్పుడు మొదటి, రెండు స్థానాలలో ఉండేవాణ్ణి. మాకున్న ఉపాధ్యాయులందరూ పాఠాలు చెప్పడంలో మంచి దిట్టలు. ఎవరూ తక్కువేమీ కాదు. ఎవరూ అయిష్టంగా పాఠాలు చెప్పేవారు కాదు.

ఇంతకు ముందే తెలిపినట్టు తరగతిలో పాఠాలను బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాణ్ణి. పాఠ్య పుస్తకాలు కొనగలిగే స్తోమత ఉండేది కాదు. ఇంట్లో చదువుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు ఉండేవి కాదు. నేను చదువుకొన్నది ఎక్కువపాలు స్నేహితుల మరియు ఉపాధ్యాయుల ఇళ్ళల్లోనే.

నా ఆత్మీయ బాల్యస్నేహితులలో శ్రీ హెచ్.ఎస్.రామారావు ప్రముఖులు. ఇద్దరమూ మాధ్యమిక పాఠశాలలో చదువుకొన్నాము. నాకన్నా రెండుమూడేళ్ళు పిన్న వయస్కులు. అందువల్ల నేను పై తరగతులలో ఉండేవాణ్ణి. వారి తండ్రి శ్రీ హెచ్.ఎస్.వెంకటరావు, తల్లి శ్రీమతి చెన్నలక్ష్మమ్మ. వీరిద్దరికీ నా పట్ల విశేషమైన వాత్సల్యం ఉండేది. శ్రీ వెంకటరావు ఫారెస్టు డిపార్ట్‌మెంటులో పనిచేసి రిటైరయ్యారు. వారింట్లోనే నేను కొన్ని సంవత్సరాలు చదువుకొనే వాడిని. రాత్రి పూట అక్కడే నిద్రించేవాడిని. ఎన్నో పూటలు వారింట్లోనే భోజనం చేశాను.

కొన్ని రోజులు శ్రీ ఎస్.వెంకటాచలయ్య గారి ఇంట్లో చదువుకొని అక్కడే పడుకొనేవాణ్ణి. మామూలుగా తెలవారుఝాము 5.30 గంటలకు మేమంతా లేచేవాళ్ళం. నా స్నేహితులతో పాటు పొద్దున్నే బావిదగ్గరికో, చెరువు దగ్గరికో వెళ్ళి బట్టలు ఉతుక్కొని స్నానం చేసుకొని వచ్చేవాణ్ణి. ఒక్కోసారి ఉపాధ్యాయులు కూడా పొద్దున్నే బావిదగ్గరికి వచ్చేవాళ్ళు. నేను అప్పుడప్పుడూ ఉపాధ్యాయుల బట్టలను ఉతికి పెట్టడం, వారి ఇంటిలో చిన్న చిన్న పనులు చేసిపెట్టడం పరిపాటిగా మారింది. మొత్తానికి ఆ ఇద్దరు ఉపాధ్యాయుల ప్రియ శిష్యుడినైనాను. శ్రీయుతులు రామారావు, నాగేశ్వరరావు, చెన్నప్ప మరికొంత మందికి ఆత్మీయ మిత్రుడిని అయినాను.

(సశేషం)

Exit mobile version