‘పోరాట పథం’ – డాక్టర్ హెచ్.నరసింహయ్య ఆత్మకథ -14

4
3

[ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది డాక్టర్ హెచ్.నరసింహయ్య గారి ఆత్మకథ అనువాదాన్ని అందిస్తున్నారు శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్.]

సాల్ట్ లేక్ పట్టణం

అక్కడి నుండి సాల్ట్ లేక్ సిటీ చూడటానికి వెళ్ళాను. దాని ప్రక్కనే సాల్ట్ లేక్ – లవణ సరోవరం ఉంది. ఆ సరోవరంలోని ఉప్పు నీటి సాంద్రత (Density) మనిషి సాంద్రతకన్నా ఎక్కువ. అందువల్ల గాభరా పడకుండా మనిషి ఆ నీటి మీద పడుకుంటే ఆ సరోవరంలో మునిగిపోడు. సాల్ట్ లేక్ సిటీ అత్యంత సుందరమైన నగరం. ఇది ఎడారిలాంటి యూటా(Utah) రాష్ట్రంలో ఒక ఒయాసిస్సులా ఉంది. విశాలమైన రహదారులు, చెట్ల వరుసలు, పూల తోటలు, మార్మాన్ (Mormon) శాఖకు చెందిన దేవాలయాలు, యూటా విశ్వవిద్యాలయం, ఇంకా కొన్ని దర్శనీయ స్థలాలను టూర్ గైడ్ సహాయంతో చూశాను. ఆ గైడ్ ఆయా ప్రదేశాల వివరాలను మసాలా జోడించి చెప్పేవాడు. హరికథలో ఎన్నోసార్లు ఉపకథలే ఎక్కువగా ఉంటాయి. అలాంటి ఉపకథ ఒకటి చెప్పాడు. ఆ కథ ఇలా వుంది. అమెరికాలో టెక్సాస్(Texas) రాష్ట్రం ప్రజలు ఎక్కువ ప్రగల్భాలు పలుకుతారని ప్రతీతి. మిగిలిన రాష్ట్రాల ప్రజలకంటే తాము గొప్ప అనే భావన వారిలో ఉంది. ఒకరోజు ఒక టెక్సన్ ఒక టాక్సీలో కూర్చొని సాల్ట్ లేక్ చూడటానికి వెళ్ళాడు. అక్కడ ఒక ప్రసిద్ధమైన దేవాలయాన్ని చూసి దీనిని కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అని డ్రైవర్‌ను అడిగాడు. సుమారు 15 సంవత్సరాలు పట్టిందని డ్రైవర్ చెప్పాడు. దానికి అతడు మేమైతే 7-8 సంవత్సరాలలో పూర్తి చేసేవాళ్ళం అని చెప్పాడు. డ్రైవర్ మాట్లాడలేదు. ఇంకొక భవనాన్ని చూసి దీన్ని కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అని అడిగాడు. డ్రైవర్ సుమారు ఐదేండ్లు అని సమాధానం చెప్పాడు. దానికి అతడు మేమైతే ఒక సంవత్సరంలో కట్టేసేవాళ్ళం అని బడాయి పోయాడు. డ్రైవర్‌కు మండిపోయింది. ఆ రాష్ట్రం పరిపాలనా భవనం కాపిటల్ బిల్డింగు(The Capital Building)ను చూసి దీన్ని కట్టడానికి ఎన్నేళ్ళు పట్టింది అని డ్రైవర్‌ను అడిగాడట. దానికి ఆ డ్రైవర్ నాకు తెలియదు, నిన్న సాయంత్రం ఇది ఇక్కడ లేదు అని చెప్పి అతడి నోరు మూయించాడు.

శాన్‌ఫ్రాన్సిస్కో

1959 సెప్టెంబర్ 1న కాలిఫోర్నియా రాష్ట్రంలోని పెద్ద నగరమైన శాన్‌ఫ్రాన్సిస్కో చేరాను. అక్కడ రామకృష్ణాశ్రమంలోనే ఉన్నాను. అక్కడి స్వామి అశోకానంద, స్వామి శ్రద్ధానందలతో మాట్లాడుతూ నా నేపథ్యాన్ని తెలిపాను. అక్కడి బ్రహ్మచారులలో ఎక్కువమంది అమెరికన్లు.

కాలిఫోర్నియా రాష్ట్రం చాలా విషయాలలో ప్రసిద్ధి చెందింది. అక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంది. కొంచెం బెంగళూరు వాతావరణాన్ని పోలివుంది. అక్కడ మేధావులు, ఆలోచనాపరులు ఎక్కువ. ప్రగతిశీల వైఖరి ఉన్నవారు. వారు ఎంత ఆధునికులు అంటే ఆ రాష్ట్రంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువ. సుమారు 40 శాతం! శాన్‌ఫ్రాన్సిస్కోలో తరచూ భూకంపాలు వస్తూవుంటాయి. అందువల్ల అక్కడ ఇళ్ళను చెక్కలతో నిర్మిస్తారు. ఆ పట్టణం విపరీతమైన హెచ్చు తగ్గులతో కూడివుంది. కారులో వెళుతున్నపుడు నాకు మొదటిసారి తల తిరిగినట్లయ్యింది. కడుపులో తొలిచినట్టయ్యింది.

ఇక్కడ సుప్రసిద్ధమైన కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ఉంది. జగత్ప్రసిద్ధమైన కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా ఇక్కడే ఉంది. ఈ సంస్థల కొన్ని భాగాలను చూశాను. అక్కడి ఐదు మైళ్ళ పొడవువున్న గోల్డెన్ గేట్ బ్రిడ్జి ప్రపంచంలోనే అతి పొడవైనది. అది ఒకే కమాను ఉన్న సేతువు. ఆ బ్రిడ్జికి సంవత్సరానికి ఒకసారి రంగులు వేస్తారు. ఒక చివరి నుండి రంగులు వేయడం మొదలు పెడితే రెండవ చివరకు చేరడానికి ఒక సంవత్సరం పడుతుంది. ఆ చివర ముగించి మళ్ళీ మొదటికి వస్తారు. అంటే రంగులు వేసే కార్యక్రమం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఆ బ్రిడ్జికి సమీపంలోనే నయనాందకరమైన ఒక పార్కు ఉంది. శాన్‌ఫ్రాన్సిస్కో ఒక విశ్వనగరంలా ఉంటుంది. ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలూ ఇక్కడ నివసిస్తారు. చైనావారి సంఖ్య ఎక్కువ. వారంతా చైనా టౌన్ అనే ప్రాంతంలో నివసిస్తారు.

శాన్‌ఫ్రాన్సిస్కో సముద్ర తీరంలో ఉంది. దాని ఒడ్డులో ఒక బెస్తవారి కార్యక్షేత్రం(Fishermen’s Wharf) ఉంది. ఆ వైపు వెళ్ళాము. చేపల కంపు. చెడు వాసన. చేపలతో చేసిన అన్ని తినుబండారాలు అమ్ముతారు. జీవించిన పీతలను బాణలిలో వేసి వేయించే దృశ్యం హృదయవిదారకం. అయ్యో! ఈ ప్రాంతానికిఎందుకు వచ్చామురా భగవంతుడా అనిపించింది. వీలైనంత వెంటనే ఆ స్థలాన్ని వదిలాము.

శాన్‌ఫ్రాన్సిస్కోకు 35 మైళ్ళు దక్షిణం వైపున్న స్టాన్‌ఫోర్డ్ (Stanford) విశ్వవిద్యాలయానికి వెళ్ళాము. ఇది కూడా మంచి విశ్వవిద్యాలయం అని పేరుగడించింది. విశ్వవిద్యాలయం క్యాంపస్ అతి సుందరంగా ఉంది.

శాన్‌ఫ్రాన్సిస్కోకు 45 మైళ్ళు ఉత్తరంవైపు ఒలిమా (Olema) అనే ప్రదేశం ఉంది. అక్కడొక రామకృష్ణాశ్రమం ఉంది. సుమారు 2000 ఎకరాల జమీను ఆ ఆశ్రమానికి చెందినది ఉంది. ప్రశాంతమైన వాతావరణం. ఎక్కడ చూసినా పచ్చని చెట్లు, చిన్న చిన్న గుట్టలు. అక్కడికి వెళ్ళి అక్కడి బ్రహ్మచారులతో కలిసి భోజనం చేసి వచ్చాము. స్వామీ వివేకానంద ఆ స్థలాన్ని దర్శించారు.

బుద్ధుని జననాన్ని చూసిన వృక్షాలు

శాన్‌ఫ్రాన్సిస్కోను సెప్టెంబర్ 6వ తేదీ వదిలి దానికి దక్షిణంలో ఉన్న సియార నివేడ (Sierra Nevada) పర్వతశ్రేణిని ఆనుకుని యూసిమిటి (Yosemite National Park) అనే నేషనల్ పార్కు ఉంది. దీని విస్తీర్ణం సుమారు 1200 చదరపు మైళ్ళు. ఈ ఉద్యానవనంలో ఓక్, పైన్, సెక్టేరియా వృక్షాలు ఉన్నాయి. సరోవరాలు, లోయలు దీని సౌందర్యాన్ని పెంచుతున్నాయి. ఇక్కడున్న కొన్ని సెక్టేరియా వృక్షాలు అత్యంత పురాతనమైనవి. నమ్మలేనంత పురాతనమైనవి. వాటి వయసు సుమారు 3000 సంవత్సరాలు. వాటిని చూసినప్పుడు నా శరీరం పులకరించింది. వాటి ప్రక్కనే పరవశంతో నిలుచున్నాను. తలలో ఎన్నో ఆలోచనలు కలిగాయి. ఈ వృక్షాలు ప్రపంచంలోని ఎన్నో సామ్రాజ్యాల చావుపుట్టుకలను చూశాయి. బుద్ధుడు పుట్టడానికన్నా 500 ఏళ్ళ ముందే, ఏసుక్రీస్తుకన్నా సుమారు 1500 సంవత్సరాల ముందే ఇవి పుట్టాయి. ప్రపంచంలోని వేలాది అద్భుత ఘటనలకు ఇవి సాక్షిభూతాలు! ఏమి ఆశ్చర్యం! అవి లావులోనూ, ఎత్తులోనూ చూడదగిన వృక్షాలు. ఒక వృక్షం మొదలును తొలిచి రహదారి చేశారు. అందులో ఒక లారీ హాయిగా పోవచ్చు.

యూసిమిటీకి అమెరికాలోని అనేక రాష్టాలనుండి పర్యాటకులు వస్తారు. విదేశీయులైతే లెక్కలేదు. పర్యాటకులు ఉండటానికి డేరాలు, కాబిన్లు ఉన్నాయి. అక్కడు సుమారు 1500 మందికి వసతి సౌకర్యముంది. పర్యాటకులు రాత్రి భోజనం ముగించుకుని ఒక చోటకు చేరుతారు. ఇది చూసి నాకు కాంప్ ఫైర్ జ్ఞాపకం వచ్చింది. అక్కడ సంగీతం మొదలైన మనోరంజన కార్యక్రమాలు జరుగుతాయి. ఏర్పాటు చేసిన సంగీతంతో పాటు పర్యాటకుల పాటలు; ఒకరు ఒక పాట పాడటం మొదలు పెడితే మిగిలిన వారు గొంతు కలిపి అదే ధాటిలో సుశ్రావ్యంగా పాడుతారు. ఇలా అదొక సామూహిక గానకచేరీ అవుతుంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చినా ఆ పాటల పరిచయం మాత్రమే కాదు వాటిని ఒకే కోరస్‌లో పాడటం నేర్చుకున్నారని అనిపిస్తుంది. అవన్నీ ఒక విధంగా జాతీయ గీతాలు. ఆబాలవృద్ధులు ఉత్సాహంతో పాడుతున్నప్పుడు మనదేశం జ్ఞాపకం వచ్చింది. ఏ పాటనైనా కనీసం విద్యావంతులైనా అందరూ ఒకే ధ్వనితో పాడటం అసాధ్యం. అత్యంత పరిచయమున్న, అతి ముఖ్యమైన జాతీయ గీతాన్ని కూడా మనదేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చినవారు ఒకే ధాటిలో పాడటానికి కష్టపడాలి. అమెరికాలో ప్రముఖంగా ఒకే భాష – ఇంగ్లీష్ భాష; భావ ఐక్యతకు ఇది ఒక ముఖ్యమైన కారణం. మన దేశంలో లెక్కలేనన్ని సమస్యలుండి దేశ సమగ్రతకు ఎక్కువ అవరోధం అయ్యాయి. భాషతో పాటు జాతి, ధర్మం మొదలైనవి కలిసి సమస్యలను జటిలం చేస్తున్నాయి. భిన్నత్వంలో ఏకత్వం అని సమర్థించుకుంటాము. ఎంతైనా మనం బుద్ధిమంతులం – అతి బుద్ధిమంతులం కదా!

అక్కడ మనోరంజకమైన మరొక కార్యక్రమాన్ని చూడటానికి అందరూ వేచివుంటారు. పక్కనే ఉన్న పర్వతశిఖరాల పైనుండి మండే చెక్క దిమ్మెలను క్రిందకు తోస్తారు. అవి వేలాది అడుగులు క్రిందకు దొర్లుకుంటూ వచ్చి అడుగులో పడిపోతాయి. ఇదొక అగ్నిప్రవాహంలా కనిపిస్తుంది. యూసిమిటీలో చూడవలసినవన్నీ చూసుకుని లాస్ ఏంజిలీస్ పట్టణానికి సెప్టెంబర్ 8వ తేదీ రాత్రి 8 గంటలకు చేరాను. రైల్వే స్టేషన్ నుండి శ్రీ రామకృష్ణాశ్రమానికి వెళ్ళాను. ఆశ్రమపు వాతావరణం చాలా ప్రశాంతం.

లాస్ ఏంజలీస్

అమెరికాకు వచ్చిన తరువాత మొట్టమొదటి సారి నేను ఈ ఆశ్రమంలో అరటి చెట్టు, మల్లె పూలు, చెండుమల్లె, మందారం, సింధూరపూలను చూశాను. ఇక్కడి వాతావరణం బెంగళూరులో ఉన్నట్టేవుంది. ఇక్కడి ఆశ్రమంలో ముఖ్యులు సుప్రసిద్ధులైన స్వామీ ప్రభవానందగారు. ఇంకొక స్వామీజీ వందనానంద గారు. వీరు బెంగళూరు నుండి వచ్చారు. మా కాలేజీ పక్కనే  వున్న శంకరపురకు చెందినవారు. సహజంగానే వీరికి మా పాఠశాల, కళాశాలల పరిచయం ఉంది. అక్కడున్నన్ని రోజులూ వారితో ఆత్మీయంగా మాట్లాడేవాణ్ణి. ఒకరోజు నేను, స్వామీజీగారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం లాస్ ఏంజలీస్ శాఖను చూడటానికి వెళ్ళాము. ముఖ్యంగా అణువిజ్ఞానానికి సంబంధించిన ప్రయోగశాలకు వెళ్ళాము. ప్రసిద్ధ శాస్త్రవేత్త లారెన్స్ నుండి కనిపెట్టిన అణు త్వరణం(Acceleration) ను కలిగించే మొట్టమొదటి సైక్లోట్రాన్ (Cyclotron) అనే యంత్రాన్ని చూశాము. దీనికి లారెన్స్ సైక్లోట్రాన్ అనే పేరు. ఇంకా కొన్ని భౌతికశాస్త్రపు ప్రయోగశాలలను చూశాము.

ఆశ్రమం ఎదురుగా ఉన్న ఒక ఇంటి ముందు Beware of Dog – కుక్క ఉన్నది జాగ్రత్త అనే బోర్డును చూశాను. దాన్ని చూసిన వెంటనే నాకు ఒక తలంపు వచ్చింది. దానిని స్వామీజీ గారికి చెప్పాను. “చూడండి స్వామీజీ ఆశ్రమం ఎదురుగా Beware of Dog అని ఉంది. ఆశ్రమం ముందు Beware of God – దేవుడున్నాడు జాగ్రత్త అని బోర్డు పెట్టించండి” అన్నాను. వారు మనసారా నవ్వారు. తరువాత “అలాంటి బోర్డు పెడితే మీరు ఆశ్రమం లోపలికి రాకండి అని వారిని బెదిరించినట్లు అయినా కావచ్చు. అయినా మీ యోచన బాగుంది. ఇంతవరకూ మాకెవరికీ ఇది తోచనే లేదు” అని చెప్పారు.

స్వామీ ప్రభవానంద

సినిమా ప్రపంచంలో అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన హాలీవుడ్ (Hollywood) లాస్ ఏంజలీస్‌లో ఉంది. ఈ ప్రాంతంలోనే సినిమా నటీనటుల నివాసం. వీటిలో ముఖ్యమైనది బేవర్లీ హిల్స్ (Beverly Hills). శ్రీరామకృష్ణాశ్రమం ఉన్నది కూడా హాలీవుడ్ ప్రాంతంలోనే. హాలీవుడ్‌లో చూడదగినది ఏమీ లేదు. అయినా ఒకరోజు హాలీవుడ్‌లో నడుచుకుంటూ వెళుతూ ఎదురుగా కనిపించిన ఒక అమెరికన్‌ను ఇక్కడ ఏమైనా దర్శనీయ స్థలాలు ఉన్నాయా అని అడిగాను. అతడు నావైపు ఆశ్చర్యంగా చూస్తూ “మీరు భారతీయులా? ఇది విశ్వవిఖ్యాతమైన హాలీవుడ్ అని మీకు తెలియదా?” అని అడిగారు. “తెలుసు” అని చెప్పాను. “ఐనా ఇక్కడ చూడదగిన ప్రదేశాలు ఏమైనా వున్నాయా” అని పునఃప్రశ్నించాను. “ఇక్కడ ఒక సినిమాహాల్లో ప్రసిద్ధ సినిమాతారల పాదముద్రలు, వారి సంతకాలు ఉన్నాయి. హాలీవుడ్ రోడ్డూ, వైన్ రోడ్డూ కలిసే జంక్షన్ జగత్ప్రసిద్ధమైనది” అని చెప్పాడు. నా పాదాలు, నా సంతకం ఏ సినిమా తారకూ తక్కువ కాదు అని అనుకుని ఆ ప్రసిద్ధమైన జంక్షన్ ఎలావుందో చూద్దామని వెళ్ళాను, చూశాను. ఎంతో నిరాశ కలిగింది. చెప్పుకొనేంత విశేషమేమీ అక్కడ లేదు. అమెరికన్లు ఒక్కోసారి తమ దేశం గురించి, ఊరి గురించి ఎక్కువ గొప్పలు చెప్పుకుంటారు. హాలీవుడ్‌లో పేరెన్నిక గల హాలీవుడ్ బౌల్(Hollywood Bowl) అనే ఓపెన్ ఎయిర్ స్టేడియం ఉంది. సుమారు 20000 మంది ప్రేక్షకులు కూర్చుని అక్కడ నడిచే సాంస్కృతిక కార్యక్రమాలను చూచి, విని సంతోషిస్తారు.

లాస్ ఏంజలీస్ లోని పాసడేనా (Pasadena) అనే ప్రాంతంలో ప్రతి యేటా జనవరి 1వ తేదీన ప్రపంచ ప్రసిద్ధమైన ఒక ఉత్సవం నడుస్తుంది. దీనికి ‘రోజ్ బౌల్ పెరేడ్’ (Rose Bowl Parade) అని పేరు. అమెరికన్లు ఏమీ చేసినా భారీగా, వైభవోపేతంగా చేస్తారు. పూలతో అలంకరించిన నయనానందకరమైన వందలాది శకటాలు – బ్యాండ్ సంగీత నృత్యాలను కలిగివుంటాయి. భారీ ప్రతిమలు, అపారమైన కళాకృతులు ఇవన్నీ చూస్తే ఈ ఉత్సవానికి సమానమైన ఉత్సవం ప్రపంచంలో బహుశా ఇంకొకటి లేదని ధారాళంగా చెప్పవచ్చు. విద్యార్థి దశలో టి.వి.లేక పోవడంవల్ల ఈ ఉత్సవాన్ని చూడలేక పోయాను. అయితే మళ్ళీ ప్రొఫెసర్‌గా అమెరికాకు వెళ్ళినప్పుడు నాకు టి.వి.సౌకర్యం కల్పించారు. అప్పుడు టి.వి.లో చూశాను ఈ ఉత్సవాన్ని. నిజంగా ఇది ఒక అత్యంత వైవిధ్యమైన కార్యక్రమం.

లాస్ ఏంజలీస్‌కు అతి సమీపంలోనే డిస్నీల్యాండ్ అనే ప్రపంచ ప్రసిద్ధ అద్భుతమైన విశిష్టత కలిగిన అంశాలతో కూడిన మనోరంజకమైన ఒక ప్రేక్షణీయ స్థలం ఉంది. అనేక విషయాలలో ఇదొక మాయాలోకం. దీనిలో అనేకమైన ఆకర్షణలున్నాయి. ఇది అత్యంత పెద్ద స్థాయి కలిగిన ప్రదర్శనాలయం. వాల్ట్ డిస్నీ అనే మహాశయుడు దీనిని తన అద్భుత ఆలోచనాశక్తి, క్రియాశక్తులతో సృష్టించాడు. ప్రతిరోజూ వేలాది మంది దీనిని దర్శిస్తారు. అక్కడున్న ప్రత్యేకాకర్షణల జాబితా చేయడం సాధ్యం కాని పని. మొత్తం మీద కళాత్మకశక్తి ఉన్న ఒక వ్యక్తి ఏమేమి ఊహించవచ్చో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. లాస్ ఏంజలీస్ సమీపంలో ట్రబుకో క్యానియన్ ఉంది. అక్కడ కూడా ఒక శ్రీరామకృష్ణాశ్రమం ఉంది. నాకు జ్ఞాపకమున్నంత వరకూ అది భూగర్భంలో ఒక నేలమాళిగలో ఉంది. అక్కడ రామకృష్ణ పరమహంస, శారదాదేవి, వివేకానందుల చిత్రపటాలు ఉన్నాయి. అక్కడే ఆశ్రమపు పూజ, ప్రార్థనాదులు జరుగుతాయి. అక్కడి బ్రహ్మచారులలో ఒక నీగ్రో కూడా ఉన్నారు. అమెరికన్లు ఏమి చేసినా ఎక్కువ శ్రద్ధతో చేస్తారు.

లాస్ ఏంజలీస్ నుండి ప్రపంచ వింతల (Wonders of the world) లో ఒకటైన గ్రాండ్ క్యానియన్ చూడటానికి వెళ్ళాను. అది అరిజోనా ప్రాంతంలో ఉంది. క్యానియన్ అంటే లోతైన వాగు. పొడవు సుమారు 300 మైళ్ళు. వెడల్పు సుమారు 18 మైళ్ళు. లోతు ఒక మైలు. దీని క్రింద కొలరాడో నది ప్రవహిస్తూ ఉంది. పై నుండి చూసినప్పుడు సన్నని త్రాడులా కనిపిస్తుంది. ఈ ప్రపంచ ప్రసిద్ధమైన గ్రాండ్ క్యానియన్ను చూడటానికి నిత్యం వేలాదిమంది పర్యాటకులు వస్తూవుంటారు. ఇది ప్రకృతి నుండి వేలాది సంవత్సరాలలో సహజసిద్ధంగా ఏర్పడింది. మానవ నిర్మితం కాదు. క్రిందకు దిగి నదిలో పడవలో వెళ్ళవచ్చు. విమానంలో క్రింద వరకూ ఎగిరి ఆ వాగు యొక్క కొన్ని ముఖ్యభాగాలను చూడవచ్చు.

లాస్ వేగాస్ ప్రపంచంలోనే సరదాలకు, జూదానికి ఎంత ప్రఖ్యాతిని గడించిందో అంత అపఖ్యాతిని కూడా సంపాదించుకుంది. గ్రాండ్ క్యానియన్‌కూ, లాస్ వేగాస్‌కూ పెద్ద దూరమేమీ లేదు. అయినా అక్కడకు వెళ్ళలేదు. గ్రాండ్ క్యానియన్ నుండి నేరుగా కొలరాడో రాష్ట్రపు రాజధాని డెన్వర్‌కు వెళ్ళి అక్కడ ఒక రోజు ఉండి, దాని సమీపంలో ఉన్న బౌల్డర్ విశ్వవిద్యాలయాన్ని చూసుకొని చికాగో గుండా కొలంబస్‌కు సూమారు 25 రోజుల సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించుకుని సెప్టెంబర్ 19వ తేదీన చేరుకున్నాను. అన్ని విధాలా ఈ యాత్ర బాగావుంది, ఉపయోగకరంగా ఉంది. గడచిన రెండు సంవత్సరాలలో ఒక రోజు అయినా నాకు తీరిక లేదు. వేసవిని కూడా నా చదువు కోసమే ఉపయోగించుకున్నాను. అలాంటి ఒత్తిడి సమయంలో ఇలాంటి విహార యాత్ర నాకు తప్పనిసరి అయ్యింది.

పరిశోధన

మా ప్రొఫెసర్ గారికి యాత్రావిశేషాలను తెలిపాను. సావధానంగా విన్నారు. మధ్యలో అక్కడక్కడ చిన్నచిన్న ప్రశ్నలను అడిగారు. వారికీ సంతృప్తి కలిగింది. సరే, మరుసటి రోజు నుండి మొదలయ్యింది తీరికలేని నా పరిశోధనా వ్యాసంగం.

పరిశోధన చేస్తున్న నలుగురైదుగురు విద్యార్థులు ఒకే యంత్రాన్నే ఒక్కొక్కరే ఉపయోగించుకునే వాళ్ళం. అది ఆ కాలంలోనే లక్షలాది రూపాయల విలువ చేసే యంత్రం. దాన్ని ఉపయోగించుకునే కాలాన్ని మేము పంచుకునేవాళ్ళం. ప్రయోగం వ్యవధి 5-6 గంటలు. కొన్నిరోజులు రాత్రి 12 గంటలకు ఎముకలు కొరికే చలిలో, మంచులో రోడ్ల మీద నడుచుకుంటూ ప్రయోగశాలకు వెళ్ళిన కష్టం ఇంకా నాకు గుర్తుంది. నా పరిశోధనా క్షేత్రం న్యూక్లియర్ స్పెక్ట్రోస్కోపీకి సంబంధించినది. నా పరిశోధన ఏప్రిల్ నెల చివరకు ముగిసింది. దానికన్నా కొన్ని వారాల ముందు వాషింగ్టన్‌లో ఏర్పాటు చేసిన భౌతిక శాస్త్రపు జాతీయ సెమినార్‌లో నా పరిశోధనా పత్రాన్ని సమర్పించాలని మా ప్రొఫెసర్‌తో పాటు వెళ్ళాను. జతలో ఇంకొక విద్యార్థి కూడా ఉన్నారు. కొలంబస్ నుండి మా ప్రొఫెసర్ కారులో వెళ్ళాము. ప్రొఫెసర్ గారే కారును నడిపారు. కొలంబస్ నుండి వాషింగ్టన్‌కు సుమారు 500 మైళ్ళ దూరం. దారిపొడుగునా ప్రయాణ సూచన నియమాలను పాటించారు. మధ్యలో ఒక రోడ్డుసైడు హోటల్లో మధ్యాహ్న భోజనం చేయడానికి ఆగాము. యథాప్రకారం నేను శాఖాహారిని. ప్రొఫెసర్ గారికి అది తెలుసు. భోజనం తరువాత నా పళ్ళెంలో ఎక్కువ అయిన ఒక కూరగాయ ముక్క తినకుండా వదిలివేశాను. ప్రొఫెసర్ నా వైపు చూసి “We don’t waste food మేము ఆహారాన్ని వ్యర్థం చేయము” అని చెప్పారు. నాకు తల తీసేసినట్టయ్యింది. మన పేద దేశంలో పెళ్ళి విందులలో వ్యర్థం చేసే ఆహారం పరిమాణాన్ని చూస్తే వారు ఏమనేవారో! సాయంత్రానికి వాషింగ్టన్ చేరుకున్నాము. ఆ సెమినార్‌లో నా పరిశోధనా పత్రాన్ని సమర్పించాను. కొన్ని ప్రశ్నలను అడిగారు. సమర్పకుడిగా వాటికి జవాబు చెప్పాను. బాగానే చెప్పాను అని అనుకుంటాను. మా ప్రొఫెసర్ ఆ సెమినార్‌లో ఉన్నారు. నా పత్రసమర్పణ, నా సమాధానాలు మా ప్రొఫెసర్‌కు తృప్తిని కలిగించింది.

వాషింగ్టన్‌లో చూడదగిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇది అమెరికా రాజధాని. అమెరికా దేశానికి తూర్పున చివరలో ఉంది. మ్యూజియంలు, వాషింగ్టన్ మెమోరియల్, లింకన్ మెమోరియల్, లైబ్రరీలు మొదలైన వాటిని చూశాను. అక్కడ ఒక దర్శనీయ స్థలమైన ఆర్లింగ్టన్ సెమెటరీ (Arlington Cemetery) అంటే శ్మశానం ఉంది. అదొక పెద్ద ఉద్యానవనంలా ఉంది. చాలా క్రమపద్ధతిలో ఉంది. ఎక్కడ చూసినా గోరీలు. కొన్ని సమాధులపై చనిపోయినవారిపై వ్రాసిన కవితలున్న ఫలకాలు (Epitaph) ఉన్నాయి. అసలు అది శ్మశానం అనే అనిపించదు. కొన్ని సమాధులపై పుష్పగుచ్ఛాలు. వందలాది మంది ఆ శ్మశానాన్ని దర్శిస్తూ ఉంటారు. కొందరు తమ సమాధికి స్థలాన్ని అక్కడ ముందుగానే కొనుక్కొంటారు. భార్యాభర్తలు, మిగిలిన సమీప బంధువులను ప్రక్కప్రక్కనే సమాధి చేస్తారు.

వాషింగ్టన్ నుండి తిరిగి వచ్చాక పరిశోధనకు సంబంధించి ఒక మౌఖిక పరీక్ష మే 25న నడిచింది. పరీక్షా సమయం సుమారు 100 నిమిషాలు. దానిలోనూ ఉత్తీర్ణుడైనాను.

డాక్టర్ హెచ్.ఎన్.

జూన్ 19వ తేదీ ఉదయం 9 గంటలకు స్నాతకోత్సవం (Convocation). సుమారు రెండు గంటల కార్యక్రమం. పట్టభద్రులు ఇక్కడిలాగే హుడ్, గౌన్, క్యాప్ పెట్టుకోవాలి. అన్నట్లు వారిని చూసేకదా మనం దానిని అనుకరించాము. మా విశ్వవిద్యాలయం అద్యక్షులైన ఫాసెట్ తమ ప్రసంగంలో చెప్పిన ఈ క్రింద కనిపించే ఒక ముఖ్యమైన వాక్యాన్ని నా డైరీలో నోట్ చేసుకున్నాను. “ఈ ప్రపంచంలో రెండు రకాలైన ప్రజలున్నారు. ఒకటి స్వతహాగా పనిచేసే గుంపు. మరొకటి వీరు చేసిన పనితో పేరుగడించే గుంపు. మొదటి గుంపులో పోటీ ఉండని కారణంగా మీరందరూ ఆ గుంపులో చేరుకోవాలని నా ఆశయం.” అన్ని కాలాలలోనూ, అన్ని దేశాలకూ అన్వయించే అర్థగంభీరమైన మాటలు ఇవి.

కాన్వొకేషన్ ముగించుకుని అదే రోజు మధ్యాహ్నం కొలంబస్‌ను వదిలి రైలులో బఫెలో, బోస్టన్‌ల మీదుగా న్యూయార్క్‌కు పోవాలను ముందే నిర్ణయించుకున్నాను. టికెట్ కూడా ముందే తీసుకున్నాను. నాకు డాక్టరేట్ వచ్చిన తరువాత అక్కడే నేను ఒకటి రెండు సంవత్సరాలపాటు పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా పని చేయాలని నా ప్రొఫెసర్ గారు పదే పదే చెప్పేవారు. అది నా నుండి సాధ్యం కాదు. నేను వీలైనంత త్వరగా వెళ్ళిపోవాలి అని చెబుతుండేవాడిని. దానిని వారు అంతగా పట్టించుకోలేదు. నేను స్నాతకోత్సవం ముగించుకుని అదే రోజు కొలంబస్ విడిచిపోతాను అని చెప్పినప్పుడు వారికి తీవ్రమైన మనస్తాపం కలిగింది. నేను అమెరికాను ద్వేషిస్తాను కనుకనే వీలైనంత త్వరగా ఆ దేశాన్ని విడిచి వెళుతున్నానన్న భావన వారికి కలిగింది. అదే రోజే ఒక చేతిలో డిగ్రీని మరో చేతిలో ప్రయాణపు టికెట్టును పట్టుకుని కొలంబస్‌ను విడిచే నా నిర్ణయం మా ప్రొఫెసర్ మనసుకు చాలా బాధ కలిగించింది. స్నాతకోత్సవ సభ ముగించుకుని నాకు మూడు సంవత్సరాలు అమూల్యమైన మార్గదర్శకాన్ని చేసిన నా ప్రొఫెసర్ గారికి కృతజ్ఞతలు తెలిపి వారి నుండి వీడ్కోలు తీసుకుందామని వారి గదికి వెళ్ళాను. వారు అక్కడ లేరు. ప్రయోగశాల అంతా వెదికాను. వారు దొరకలేదు. అక్కడున్న ప్రతి ఒక్కరినీ అడిగాను. మాకు తెలియదని అన్నారు. నా ప్రొఫెసర్‌కు కృతజ్ఞత చెప్పుకోవడానికి కుదరలేదు కదా అని చింతించాను. వారు ఎప్పుడూ తమ గది, ప్రయోగశాల వదిలి పోయినవారు కాదు. ఆరోజు వారు నాకు కనిపించకపోవడం నా మనస్సుకు తీవ్రమైన బాధను కలిగించింది. నేను త్వరగా వెళ్ళిపోవాలన్న తొందరలో, ఉత్సాహంలో అదే రోజు వెళితే జరిగే పర్యవసానాన్ని ఊహించలేక పోయాను. వారు లేనప్పుడు తట్టింది నేను చేసిన అపరాధం. అదే రోజు వదిలి వెళ్ళిపోవడం అసభ్యమైన ప్రవర్తన అని.

నేను అమెరికాలో సుమారు మూడు సంవత్సరాలు ఉన్నా ఏ అమెరికనూ నా స్నేహితుడు కాలేదు. దానికి నేను అమెరికన్లను తప్పు పట్టడం లేదు. ఇద్దరు స్నేహితులు కావాలంటే కనీసం కొన్నైనా అలవాట్లు, అభిరుచులు సరిపోవాలి. నాకూ అమెరికన్లకూ సమానమైన అభిరుచులు ఏవీ లేవు. నేను కాఫీ, టీ త్రాగేవాడిని కాను. మాదక పానీయాలను సేవించను అని చెప్పేపని లేదు. శాఖాహారిని. అక్కడ ఎప్పుడూ సినిమాకు వెళ్ళలేదు. సినిమా హాలులో అడుగు పెట్టలేదు. నేను బెంగళూరులో చూసిన చివరి సినిమా 1942 డిసెంబరులో. నా జన్మలో మూడే మూడు సినిమాలు చూశాను. ఒకరోజైనా ఒక అమెరికన్ జతలో హోటలుకు పోలేదు. అలాంటప్పుడు నాతో అమెరికన్ స్నేహితుడు కావడం అసాధ్యం. నేను అక్కడ ఏ వేడుకలకూ వెళ్ళలేదు. అందువల్ల నేను వెళ్ళేరోజు సహజంగానే ఏ అమెరికనూ నన్ను వీడుకోలు పలికేందుకు రాలేదు. మా భౌతికశాస్త్ర విభాగంలో ఉన్న నలుగురైదుగురు విద్యార్థులను స్నేహితులు అనేదానికన్నా పరిచయస్థులు అనడం సబబు. నాకు ఎవరితోనూ బాతాఖానీ కొట్టడానికి, మామూలు విషయాలు చర్చించడానికి సమయమూ లేదు, మనస్సూ లేదు. నా దృష్టి అంతా డాక్టరేట్ వైపే. ఇద్దరు భారతీయ విద్యార్థులు మాత్రం నా గదికి వచ్చి శుభాకాంక్షలు చెప్పి వెళ్ళారు.

కొలంబస్‌కు వీడుకోలు – నయాగరా జలపాతం

కొలంబస్ నగరానికి వీడుకోలు చెప్పి సాయంత్రం రైలులో అక్కడినుండి బఫెలో నగరానికి అర్ధరాత్రి చేరాను. అక్కడ ఒక హోటల్లో ఉండి ప్రొద్దున నా ప్రొఫెసర్‌కు ఫోన్ చేశాను. వారు దొరికారు. నేను కొలంబస్ వదలడానికన్నా ముందు వారికి కృతజ్ఞతలు చెప్పి, వారి నుండి సెలవు పుచ్చుకోవడానికి వీలు కానందుకు వారిని క్షమించమని అడిగాను. నన్ను కలవలేక పోయానని వారూ విచారం వ్యక్తం చేశారు. నా జీవితంలో అంతా మంచే జరగాలని కోరుకున్నాను. అప్పుడు నా మనసు కొంత నెమ్మదించింది. దర్శనీయ స్థలాలను చూడాటానికి అన్ని నగరాలలో సౌకర్యం ఉన్నట్లే ఆ నగరంలోనూ ఉంది. దాన్ని ఉపయోగించుకుని బస్సులో బఫెలోకు 20 మైళ్ళ దూరంలో ఉన్న నయాగరా జలపాతాన్ని చూడటానికి వెళ్ళాను. బస్సునుండి దిగి జలపాతాన్ని చూసినప్పుడు నిరాశ కలిగింది. అది ప్రపంచ ప్రసిద్ధి చెందిన జలపాతమనీ, తొమ్మిది ప్రపంచ వింతలలో అదీ ఒకటనీ పేరు సంపాదించింది. సహజంగానే అలాంటివి చూసేముందు వాటి గురించి అతిగా ఊహించుకుంటాము. అలాంటిదే నేను కూడా ఊహించుకున్నాను. అందుకే నిరాశ కలిగింది. అంటే దాని విశిష్టతను తగ్గించినట్టు కాదు. జలపాతం ఎత్తుకన్నా వెడల్పు ఎక్కువ. అనంతమైన జలరాశి.

నయాగారా జలపాతాన్ని చూసి బోస్టన్ నగరానికి వెళ్ళాను. అక్కడే పేరెన్నికగన్న హార్వర్డ్ యూనివర్శిటీ, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉన్నాయి. ఈ ఉన్నత సంస్థలను ఎక్కువ ప్రతిభావంతులైన విద్యార్థులతో, అధ్యాపకులతో కూడి ఉన్నాయి. బోస్టన్‌లో ఇంకా కొన్ని దర్శనీయ స్థలాలను చూసి న్యూయార్క్‌కు వచ్చాను. అక్కడ మరొక ప్రసిద్ధమైన విశ్వవిద్యాలయం ప్రిన్స్‌టన్ యూనివర్సిటీని చూడటానికి వెళ్ళాను. మా కాలేజీ పూర్వ విద్యార్థి వేదాంత కడాంబి ఆ విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు. వారిని కలిశాను. వారు చాలా ప్రతిభావంతమైన విద్యార్థి అని చెప్పనవసరం లేదు. వారు మా కాలేజీ విద్యార్థి అయినప్పుడు నాతో చనువుగా ఉండేవారు. నాతో వాగ్వాదం చేయడమే వారి పని. కొన్ని గంటలు ఈ వాగ్యుద్ధం కొనసాగేది. వాగ్వాదం నాకూ ఇష్టమే. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అక్కడే ప్రొఫెసర్‌గా, పరిశోధకునిగా పనిచేశారు. అక్కడి నుండి మళ్ళీ న్యూయార్క్‌కు వచ్చి చూడాల్సిన కొన్ని ప్రదేశాలను చూసి జూన్ 15వ తేదీ క్వీన్ మేరీ నౌకలో లండన్‌కు పయనమయ్యాను.

ఈసారి నౌకాప్రయాణం పోయినసారి నౌకాప్రయాణం కన్నా మెరుగ్గా ఉంది. నా ఆరోగ్యానికి అంత ఇబ్బంది పెట్టలేదు. నేను అమెరికా వదిలి వచ్చే ముందు లండన్‌లోని నా పూర్వ విద్యార్థి కె. రామరత్నంకు నేను వచ్చే తారీఖును తెలిపివున్నాను. వారు నన్ను లండన్ రైలేస్టేషన్లో స్వాగతించారు.

షేక్‌స్పియర్

అప్పుడు అంతర్జాతీయ టెన్నిస్ పోటీలు లండన్‌లో నడుస్తూ ఉన్నాయి. నాకు టెన్నిస్ కొంచెం తెలిసినందువల్ల వింబుల్డన్ టెన్నిస్ పోటీలను చూడాలన్న కోరికను ముందే వ్యక్తం చేశాను. వారు ముందుగానే టికెట్లు తీసుకున్నారు. మేము పోటీలు చూడటానికి వెళ్ళిన రోజే కాకతాళీయంగా సెంట్రల్ కోర్టులో మనదేశపు అగ్రశ్రేణి క్రీడాకారుడైన రామనాథన్ కృష్ణన్ గారి క్వార్టర్ ఫైనల్స్ పోటీ ఉండింది. నాకైతే చాల సంతోషం అయ్యింది. పోటీ తరువాత ఇంకా సంతోషం కలిగింది. ఎందుకంటే ఆ ఆటను కృష్ణన్ గెలిచి సెమీఫైనల్స్‌కు చేరారు. అంటే పురుషుల వింబుల్డన్ పోటీలలో ప్రపంచంలో నలుగురు అగ్రగణ్యులైన ఆటగాళ్ళలో ఒకరు అయ్యారు. నాకైతే అత్యంత సంతోషం కలిగింది సెమీఫైనల్స్‌లో వారు ఓడిపోయారు అని నేను స్విట్జర్లాండులో ఉన్నప్పుడు పత్రికలో చదివి నిరాశ కలిగింది. కృష్ణన్ తన జీవితంలో వింబుల్డన్ పోటీలలో సెమీఫైనల్స్ చేరింది ఒకే ఒక్కసారి. దానికన్నా ముందుకు వెళ్ళలేదు.

ఇంగ్లాండులోని ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జిలను చూసుకుని జగత్ప్రసిద్ధులైన నాటక రచయిత షేక్‌స్పియర్ జన్మస్థలమైన స్ట్రాట్ఫర్డ్-అపాన్-ఏవన్ (Stratford-upon-Avon) అనే ఊరికి వెళ్ళాను.

ఏవన్ (Avon) అనేది ఒక నది. దాని మీద ఉన్న ఊరు స్ట్రాట్ఫర్డ్ కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. కొన్ని ఊర్ల పేర్లు ఇదే విధంగా ఉన్నాయి. షేక్‌స్పియర్ పుట్టిన ఇంటిని బహుజాగ్రత్తతో కాపాడుతున్నారు. ఆ ఇల్లు పూర్వకాలం నాటింది. అతడు ఉపయోగించిన వస్తువులు, జీర్ణమైన పాతకాలపు చాప మొదలైన అన్నింటినీ సురక్షితంగా ఉంచారు. అతడి సమాధి కూడా ఆ ఊరిలోనే ఉంది. అతని జ్ఞాపకార్థం ఆ ఊరిలో ఒక నాటకశాల ఉంది. దానిలో ప్రతినిత్యం షేక్‌స్పియర్ నాటకాలను కొన్ని దశాబ్దాలుగా విజయంతంగా ఆడుతూ వస్తున్నారు. ఈ నాటకాలను చూడటానికి ఒకటి రెండు నెలల క్రితమే టికెట్లు బుక్ చేసుకోవాలి. షేక్‌స్పియర్ అంటే ఇంగ్లీషువారికి సహజమైన గర్వం. ఇంతవరకూ ఇంకొక షేక్‌స్పియర్ కానీ, షేక్‌స్పియర్‌ను సమీపించగలిగే నాటకకర్తగానీ ప్రపంచంలో పుట్టలేదు. ఇంగ్లాండ్ మొత్తం మీద సుందరమైన ప్రదేశం. అక్కడి గ్రామాలలో ఎక్కడ చూసినా పచ్చని గడ్డి. చిన్న చిన్న నదులు. అందుకే అక్కడ ప్రకృతికవులు (Nature poets) జన్మించారు.

ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఇటలీ

లండన్ నుండి ఫ్రాన్స్ ముఖ్యపట్టణం ప్యారిస్‌కు వచ్చాను. అక్కడికి రావడానికి ముందు అక్కడున్న నా స్నేహితుడూ, బెంగళూరుకు చెందిన ఎ.ఎన్.శ్రీనివాసన్ గారికి నేను వచ్చే తేదీ తెలిపాను. ఫ్రెంచ్ ప్రజలకు తమ దేశం పట్ల, భాష పట్ల ఎక్కువ అభిమానం. భాష పట్ల దురభిమానం అని చెప్పినా తప్పుకాదు. ఇంగ్లీషు, మరో రెండు భాషలు తెలిసినా తమ భాషను వదిలి వేరే ఏ భాషలోనూ పొరపాటున కూడా మాట్లాడరు. వారిలో వారు ఇంగ్లీషులో మాట్లాడక పోయినా పరవాలేదు. విదేశాలనుండి వచ్చిన వారితో కూడా ఇంగ్లీషులో మాట్లాడరు. మనవాళ్ళు దానికి వ్యతిరేకం. కన్నడ తెలిసి ఉన్నా మనవాళ్ళు ఒకరితో ఒకరు ఇంగ్లీషులోనే మాట్లాడుకుంటారు. ఇంగ్లీషు వారు వెళ్ళిపోయినా ఇంగ్లీషు భాషకు గులాములయ్యారు. మరొక గాంధీ పుట్టి ఈ గులాంగిరీనుండి మనలను కాపాడాలి. అక్కడ మరొక విశేషం ఏమంటే ఇంగ్లాండుకు అంత సమీపంలో ఉన్నా క్రికెట్ ఆడరు. మనకు క్రికెట్ అంటే మితిమీరిన వ్యామోహం.

శ్రీనివాసన్ చాలా సంవత్సరాల నుండీ ప్యారిస్‌లోనే నివసిస్తున్నారు. వారి సహాయంతో ప్యారిస్ పట్టణాంలో చూడవలసిన ప్రదేశాలన్నీ చూశాను. ప్యారిస్ చాలా సుందరమైన పట్టణం. విశాలమైన రహదారులు, ఎక్కడ చూసినా అంతా క్రమబద్ధమైన పట్టణం. ప్యారిస్ కళకు ప్రాధాన్యతను ఇచ్చింది. కళామందిరాలు, వస్తుసంగ్రహాలయాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధమైన చిత్రకళాఖండాలు ప్యారిస్ మ్యూజియంలలో ఉన్నాయి. వాటన్నింటినీ చూడటానికి ఒకటి రెండు నెలలు సరిపోక పోవచ్చు. ప్యారిస్‌లో ఒక మూలలో ఉన్న ఒక శాఖాహార హోటల్‌ను శ్రీనివాసన్ వెదికిపెట్టారు. అక్కడ భోజనం చేశాము. ఫాన్స్ దేశపు ఒకటి రెండు పట్టణాలను చూసి స్విట్జర్లాండుకు వెళ్ళాను. అది అత్యంత సుందరమైన దేశం. దాని ప్రకృతి సౌందర్యాన్ని వర్ణించడం నాకు సాధ్యం కాదు. అక్కడి ముఖ్యపట్టణాలైన జెనీవా, జెనోవాలను చూశాను. జెనీవాలో అంతర్జాతీయ సంస్థలైన రెడ్ క్రాస్, నాయస్థానాలు ఉన్నాయి. అక్కడ రెండు రోజులుండి ఇటలీ ముఖ్యపట్టణమైన రోమ్‌కు వెళ్ళాను. ఈ ప్రయాణమంతా రైలులోనే. ఇటలీకి వచ్చిన వెంటనే అక్కడి టాక్సీ నడిపేవాళ్ళు చేసే మోసం, బేరాలు మొదలైన వాటిని చూశాక వెంటనే మన దేశం జ్ఞాపకం వచ్చింది. ఇంత త్వరగా మనదేశ వాతావరణం దొరికింది కదా అని అనుకున్నాను. దీనిని బాధతో చెబుతున్నాను.

రోమ్ అత్యంత పురాతనమైన పట్టణాలలో ఒకటి. జూలియస్ సీజర్ పాలించిన ప్రదేశం. వేలాది సంవత్సరాల ప్రాచీన స్థలాలు చూసినప్పుడు చారిత్రక సంఘటనలు నా కళ్ళముందు జరిగినట్లు అనిపిస్తుంది. అక్కడి నుండి ఒకటి రెండు పట్టణాలు చూసి నేపుల్స్‌కు వచ్చాను. కన్నడలో ఒక సామెత ఉంది. “నేపుల్స్‌ను చూసి చావు” అని. చనిపోయేముందు నేపుల్స్‌ను చూసే తీరాలని అర్థం. అక్కడ అంతా సౌందర్యమే. అక్కడికి సరిగ్గా నేను చేరిన రోజే న్యూయార్క్ నుండి బయలుదేరిన నౌక క్వీన్ మేరీ వచ్చి చేరింది.

అమెరికాలో ఉన్నప్పుడూ నేను కొన్ని దర్శనీయ స్థలాల ఫోటోలను తీసుకున్నాను. ఇప్పుడు ఫోటోలు లేవు. అయితే స్లైడ్లు ఉన్నాయి. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఇటలీ దేశాలలో తీసిన ఫోటోలను డెవలప్ చేయడానికి నేపుల్స్‌లోని ఒక దుకాణంలో ఇచ్చాను. అతడు ఆలస్యం చేశాడు. ఆ రోజు నేను నేపుల్స్ వదిలాల్సి ఉంది. అందువల్ల ఆ దుకాణదారుడిని నమ్మి డెవలప్ చేయడానికి అయ్యే ఖర్చుతో పాటు పోస్టులో పంపితే అయ్యే ఖర్చును కలిపి అతడికి ఇచ్చి బెంగళూరుకు పంపమని చెప్పి నా అడ్రస్సును ఇచ్చాను. అతడు మొండి చెయ్యి చూపించాడు. పంపనే లేదు. డబ్బు పోయినందుకు నాకు బాధలేదు. అయితే ఉపయోగమైన ఫోటోలను పోగొట్టుకున్నాను కదా అని బాధ కలిగింది.

అదే నౌకలో కొన్ని రోజుల తరువాత బొంబాయికి వచ్చి దిగాను. బొంబాయి చేరిన వెంటనే నాకు విపరీతంగా దుఃఖం కలిగింది. మూడు సంవత్సరాలు నేనున్న లోకానికీ దీనికీ సంబంధమే లేదు. బొంబాయిలో ఏమి జనం, ఏమి పేదరికం. భిక్షుకులు, మురికి ప్రదేశాలు. అయ్యో! ఏమి ఈ దేశ దౌర్భాగ్యం అనుకున్నాను.

బొంబాయి నుండి బెంగళూరు వచ్చేవరకూ నా సహోద్యోగులు, స్నేహితుల గురించి ఆలోచిస్తూ వచ్చాను. వారినందరినీ చూసి మూడు సుదీర్ఘ సంవత్సరాలయ్యింది. రైల్వే స్టేషన్‌లో ఆశ్చర్యకరమైన స్వాగతం. బొంబాయి చేరినప్పుడు నా కోటూ, బూటూ అన్నీ మాయమై పోయాయి. నా మామూలు వేషం మొదలయ్యింది. హాస్టలు చేరినప్పుడు నా సంతోషానికి అంతేలేదు. అభిమానులంతా ముట్టడి చేశారు. నన్ను స్వాగతించి నాతో మాట్లాడుతున్న మా హైస్కూలు జీవశాస్త్రపు అధ్యాపకులు, మా గురువుగారైన శ్రీ కె.నంజుండయ్య (సుప్రసిద్ధ క్రికెట్ క్రీడాకారుడు అనిల్ కుంబ్లె తాతగారు) ఆత్మీయంగా అందరి ముందూ “ఏమప్పా నరసింహయ్యా, మూడు సంవత్సరాలు అమెరికాలో ఉన్నా నీ మాటల్లోనూ, ప్రవర్తనలోనూ ఏమీ మార్పులేదు. నిజంగా నీవు అమెరికా వెళ్ళావా లేక మూడు సంవత్సరాలు యలహంకలో ఉండి వచ్చావా” అని అన్నారు. అందరూ నవ్వారు. వారు అలా అడగడంలో కొంత అర్థం ఉంది. సామాన్యంగా అమెరికాకు వెళ్ళి వచ్చినవారి ప్రవర్తనే మారిపోతుంది. మిగిలినవారి కన్నా ప్రత్యేకమైనవారు, ఉత్తములు అనే అహంభావం. అసహజంగా మాట్లాడతారు. ‘హలో’ అనేదానికి బదులు ‘హాయ్’ అంటారు. ‘యస్’ అనేదానికి బదులుగా ‘యా’ అని అంటారు. ఇంకా కొన్ని పదాలు, మాట్లాడే విధానం అంతా అమెరికా అనుకరణే. అమెరికాలో ఉన్నప్పుడూ నేను హలో, యస్ అనే పదాలనే ఉపయోగించేవాడిని. నా ఉచ్చారణ పట్ల నాకు ఎక్కువ అభిమానం ఉండేది. మా ఉపాద్యాయులను ‘సార్’ అనే పిలిచేవాణ్ణి. అక్కడ ఎవరూ సార్ అని పిలిచేవారు కాదు. వారి పేరుతోనే పిలుస్తారు. అధ్యాపకులే కానీ వేరే ఎంత పెద్దవారైనా కానీ ఉదాహరణకు “Mr Joseph, Mr Johan” అని పిలుస్తారు.

ఉపసంహారం

ఈ మూడేళ్ళ విద్యాభ్యాసం వల్ల నాకు చాలా తృప్తి కలిగింది. ఆత్మవిశ్వాసం పెరిగింది. అమెరికన్ల కన్నా మనమేమీ తక్కువ కాదు అనే భావనకు పుష్టి లభించింది. ఇక్కడున్నట్లే అమెరికాలో కూడా బుద్ధిమంతుల నుండి తెలివితక్కువ వారివరకూ అందరూ ఉన్నారు. అక్కడ చదువుకోవడానికి ఎన్నుకున్న సబ్జెక్టులలో ఏదైనా ఒకటి సరిపోకపోతే దానిని మాత్రం మార్చుకుంటారు. ఈ పద్ధతిని వివాహానికీ అన్వయిస్తారు. అందుకే అక్కడ అన్ని వివాహ విచ్ఛేదనలు అయ్యేది. విద్యలో మాత్రం ఇది మంచి పద్ధతి. ఈ విద్యావిధానంలో ఎక్కువ స్వేచ్ఛ ఉంది. అదంతా వికేంద్రీకృతం. అధ్యాపకులు మంచి స్థాయి కలిగినవారు. వారి కర్తవ్యనిష్ఠను మెచ్చుకోవాలి. ఏ ఉపాధ్యాయుడు తరగతికి ఒక నిముషమూ ఆలస్యంగా రాడు. డిసెంబరు నెలలో ఎముకలు కొరికే చలి. ఉదయం 7.30 గంటలకు క్లాసు. అధ్యాపకుడు, విద్యార్థులు అంతా సమయానికి సరిగ్గా హాజరు. విద్యార్థుల సందేహాలను తరగతిలోనూ, బయటా తీర్చడానికి ప్రయత్నిస్తారు. విద్యార్థులమీద పగ తీర్చుకోవడం ఉండదు. అధ్యాపకులను కటువుగా ప్రశ్నించినా వారు తప్పుగా భావించరు. దానికి బదులుగా ఇలా ధైర్యంగా ప్రశ్నించే విద్యార్థి ఉన్నాడని మెచ్చుకుంటారు.

మనవైపు అధికారిక సెలవులు ఎక్కువ. దానితోపాటు అధ్యాపకులూ యథాశక్తి సెలవులను తీసుకునే అవకాశం ఉంది. వివిధ కారణాల వల్ల మన వద్ద క్లాసులలో కొన్ని సందర్భాలలో పాఠాలు చెప్పక పోవడం సాధారణమైన విషయం. క్లాసులు లేవు అని ఇక్కడి విద్యార్థులు బయట తిరుగుతూ ఉంటారు. అక్కడి అది అసాధ్యం. క్లాసులకైతే గైర్హాజరు కావడమంటూ ఉండదు. అక్కడ విరామం లేకుండా పాఠాలు కొనసాగుతాయి. ఇక్కడైతే పాఠానికి పాఠానికి మధ్య ఎన్నో సార్లు విరామం. మన అధ్యాపకుల సంబంధీకుల పెళ్ళి అయితే ఒకటి కన్నా ఎక్కువ రోజులు సెలవు అడుగుతారు. తమకే ఐతే ఇక చెప్పనవసరం లేదు. పెళ్ళికి ముందు, పెళ్ళికి తరువాత ఎక్కువ రోజులు సెలవు తీసుకుంటారు. అక్కడి విద్యార్థులకు మన విద్యార్థులకంటే ఎక్కువ ఏకాగ్రత. క్లాసుకు అకస్మాత్తుగా ఎవరైనా ఒక విద్యార్థి ఒకటి రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చి కూర్చుంటే అతని ప్రక్కన విద్యార్థి అతడు ఎవరు అని అతనివైపు చూడనే చూడడు. వారికి అదంతా అక్కరలేదు. ఒక గంటసేపు ఎక్కువ ధ్యాస పెట్టి పాఠాన్ని విని అక్కడే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మన వద్ద అర్థం చేసుకోవడాన్ని వాయిదా వేస్తారు. అప్పుడే అర్థం చేసుకోవాల్సిన అవసరమూ లేదు, ప్రయత్నమూ లేదు. మనవద్ద ఎవరైనా విద్యార్థి ఆలస్యంగా వస్తే క్లాసు మొత్తం అతని వైపే చూస్తుంది. చాలా కళ్ళు అతనికి ఆత్మీయ స్వాగతాన్ని పలుకుతాయి. ఇది అయిన రెండు నిముషాలకు మరో విద్యార్థి ఆలస్యంగా వస్తే అవే కళ్ళు ఏ విధమైన పక్షపాతం లేకుండా ఆతడినీ ఆత్మీయంగా స్వాగతిస్తాయి. ఈ మధ్యలో అధ్యాపకుడు అనాథ అయిపోతాడు. ఎక్కువ మంది విద్యార్థులు అధ్యాపకుడి వైపు దృష్టి పెట్టకపోతే పాఠం ఎలా చెప్పాలి?

అక్కడి పరీక్షలు మన హిందూ పండుగల్లా; 15 రోజులకు ఒకసారి ఉపపరీక్షలు, మూడు నెలల చివరిలో అంతిమ ముఖ్య పరీక్ష. పాస్ కావాలంటే అక్కడ అన్నిపరీక్షల మార్కులు లేదా గ్రేడ్లు పరిగణనలోనికి తీసుకుంటారు. అక్కడి విద్యావిధానంలో విద్యార్థులు పాఠాలను బట్టీ పట్టే అవసరం లేదు. మూలాంశాన్ని తెలుసుకుని సమస్యలను పరిష్కరించే విధానం తెలుసుకోవడం ముఖ్యం. విద్యార్థి ఆలోచనా శక్తికి ప్రోత్సాహం ఉంటుంది. భౌతికశాస్త్ర పరీక్షలలో లెక్కలను ఇస్తారే తప్ప పెద్ద పెద్ద ప్రబంధాలను వ్రాయాల్సిన ప్రశ్నలను ఇవ్వరు. దానివల్ల విద్యార్థి పాఠాన్ని బాగా అర్థం చేసుకుంటాడు. ఆత్మవిశ్వాసంతో పరీక్షలను ఎదుర్కొంటాడు. సాధారణంగా అతనికి ఆందోళన కానీ, భయం కానీ ఉండదు. మన విద్యార్థులు సామాన్యంగా దీనికి విరుద్ధం. అందరూ అలా అని చెప్పడం లేదు. ఇక్కడ పరీక్షలంటే తలనొప్పి. చివరి ఘడియలలో చదివే వారి సంఖ్యా తక్కువేమీ కాదు. 8-9 నెలలు చెప్పిన పాఠాలను జ్ఞాపకం పెట్టుకోవాలి. సహజంగానే విద్యార్థులకు ఎక్కువ మానసిక ఒత్తిడి ఉంటుంది. కేవలం అంతిమ పరీక్ష ఆధారంగా ఒక విద్యార్థి స్థాయిని కొలవడం అతార్కికం.

అక్కడ విద్యార్థిగా, ఉపాధ్యాయునిగా నాకు మంచి అనుభవం లభించింది. ప్రపంచంలో అత్యంత పురోగామి దేశమైన అమెరికా మిగిలిన దేశాలకన్నా విభిన్నమైనది. విద్యావిధానమూ అంతే. ఎక్కువ ఉత్సాహంతో తిరిగి వచ్చిన మరుసటి రోజు నుండే కాలేజీలో పని చేయడం ప్రారంభించాను. అన్నట్లు మా కాలేజీలో మొట్టమొదటి డాక్టరేట్ పొందిన అధ్యాపకుడిని నేనే.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here