Site icon Sanchika

‘పోరాట పథం’ – డాక్టర్ హెచ్.నరసింహయ్య ఆత్మకథ -15

[ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది డాక్టర్ హెచ్.నరసింహయ్య గారి ఆత్మకథ అనువాదాన్ని అందిస్తున్నారు శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్.]

ప్రాంశుపాలునిగా

విచిత్రమైన ఆరంభం

[dropcap]నే[/dropcap]ను కాలేజీకి వచ్చినప్పుడు నా సహోద్యోగులైన రసాయనశాస్త్రపు ప్రొఫెసర్ శ్రీ ఎస్. టి. సీతారామయ్యగారు ప్రిన్సిపాల్. కాలేజీ ప్రథమ ప్రిన్సిపాల్ ప్రొ. కె.సంపద్‌గిరిరావు గారు 1958లో రిటైరయ్యారు. ప్రొ. సీతారామయ్య గారు కాలేజీ ప్రారంభమైన 1945లోనే అధ్యాపకులుగా చేరారు. నేను మరుసటి సంవత్సరం అంటే 1946లో అధ్యాపకుడిగా చేరాను. నేను వచ్చిన 15-20 రోజులైన తరువాత నేను ప్రిన్సిపాల్ కావాలనీ, దానికోసం తాను ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేస్తాననీ శ్రీ సీతారామయ్యగారు చెప్పారు. నాకు ఒక రకంగా షాక్ అయ్యింది. “ఎలాగూ మీ మూడు సంవత్సరాల ప్రిన్సిపాల్‌షిప్ వ్యవధి 1961 మే నెలలో ముగుస్తుంది. ఆపైన నియమానుసారం ఎవరు అవుతారో వారు కానీయండి” అన్నాను.

ఈ సందర్భంలో మా కాలేజీలో ప్రిన్సిపాల్ అయ్యే విధానం తెలియజేయాలి. అనేక విద్యాసంస్థలలో ప్రిన్సిపాల్ కావడానికి జ్యేష్ఠత్వము (Seniority) ఆధారం. అయితే మా కాలేజీలో జ్యేష్ఠత ఆధారం కాదు. కాలేజీలోని అందరు అధ్యాపకులూ మూడు సంవత్సరాలకు ఒకసారి ప్రిన్సిపాల్‌ను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకుంటారు. ఈ పద్ధతి మా నేషనల్ హైస్కూలు నుండి వచ్చింది. నేను సీతారామయ్య గారికి అదే చెప్పాను. 1961 మే నెలలో మన పద్ధతి ప్రకారం ఎన్నికలు జరగనీ అని. వారు ఒప్పుకోలేదు. “అమెరికాకు పోయి పి.హెచ్.డి. సంపాదించుకుని వచ్చింది ప్రిన్సిపాల్ కావడానికే అనే అభిప్రాయం వచ్చి నాకు పెద్ద కళంకం వస్తుంది. నేను ఇప్పుడు కాను” అని ఖచ్చితంగా చెప్పాను. చాలామంది అధ్యాపకులూ ఒత్తిడి చేశారు. కుదరదు అన్నాను. శ్రీ సీతారామయ్యగారు పదవికి రాజీనామా చేశారు. మా పద్ధతి ప్రకారం ఎన్నికలు జరగాలి. నేను వద్దు అని ఇంకోసారి నా ధృఢమైన నిశ్చయాన్ని వ్యక్తం చేశాను. చివరకు ఇంగ్లీష్ అధ్యాపకులైన శ్రీ బి.పి.నంజుండయ్య గారిని ప్రిన్సిపాల్‌గా మిగిలిన సమయానికి అంటే 1961 ఏప్రిల్ నెల వరకూ అధ్యాపకులు ఎన్నుకున్నారు. ఏప్రిల్ నెలలో తరువాత మూడు సంవత్సరాలకు ప్రిన్సిపాల్ ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవంగా నేను ఎంపికయ్యాను. కొత్తగా ప్రిన్సిపాల్ అయిన బి.పి.నంజుండయ్యగారికి నాపై కొంచెం కోపం ఉంది. దానికి కారణం ప్రిన్సిపాల్ పదవిని పూర్తిగా మూడు సంవత్సరాలు వారికి ఇవ్వలేదని. మిగిలిన కాలానికి వారిని ఎన్నుకున్నది నియమాల ప్రకారం సరైనదే. ఈ 8-9 నెలల తరువాత మళ్ళీ మీరే తరువాతి మూడు సంవత్సరాలకు ఎన్నిక కావడానికి ఏ అడ్డంకి లేదని చెప్పినా వారికి సంతృప్తి కలగలేదు. ఏదో అనుమానం. వారి అనుమానానికి తగినట్లే నేను ప్రిన్సిపాల్ కావడం వారి కోపాన్ని ఇనుమడింప జేసింది. నాకు చార్జ్ ఇచ్చిన విధానం ఇంకా నాకు కళ్ళకు కట్టినట్లు ఉంది.

ఛార్జ్ ఇచ్చే రోజు వారి ఆఫీసుకు పోయి కూర్చున్నాను. నా వైపు చూడనే లేదు. కొన్ని పత్రాలపై సంతకం చేస్తూ ఉన్నారు. అంతలో మా కాలేజీలో పనిచేస్తున్న నాలుగవ తరగతి ఉద్యోగయిన మాదయ్య చేతిలో ఒక విచిత్రమైన రంగురంగులున్న యజ్ఞపశువుకు వేసేటటువంటి ఒక దండను పట్టుకుని ఆఫీసు ద్వారం వద్ద నిలుచున్నాడు. అది వీడ్కోలు చెప్పడానికి తెచ్చిన హారమో లేదా స్వాగతించడానికి తెచ్చిన హారమో నాకు తెలియలేదు. నంజుండయ్యగారు అతనివైపు, హారం వైపు గుర్రుగా చూసి, వారి ఆసనం నుండి లేచి, అతడి చేతిలోవున్న హారాన్ని లాగుకొని, మొఖంపై కొట్టినట్టు నా మెడకు ఆ హారాన్ని వేసి, ఆఫీసుకు సంబంధించిన తాళం చెవుల గుత్తిని టేబుల్ పై విసిరి, ఒక్క మాటకూడా మాట్లాడకుండా వెళ్ళిపోయారు. బాధాతప్త హృదయంతో ప్రిన్సిపాల్ కుర్చీలో కూర్చున్నాను. ఆ ఘటన జరిగింది ఒక శనివారం ఉదయం 9 గంటలకు అనుకుంటాను. అక్కడ ఎవరూ లేరు. నేను అలాగే మౌనంగా దిక్కుతోచకుండా కూర్చున్నాను. ఎలాంటి చేదు వాతావరణంలో ఛార్జ్ తీసుకున్నాను అని చింతిస్తూ ఉన్నాను.

నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు తిథి, వారం చూసుకోలేదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాకు చార్జ్ ఇవ్వడం పట్ల నమ్మకస్థులు అపశకునమయిందని అధైర్యపడినా ఆశ్చర్యం లేదు. నాకు శకునాలు, అపశకునాలపై నమ్మకం లేనందువల్ల అధైర్యపడే ప్రశ్నే ఉదయించలేదు. సుమారు 15 సంవత్సరాలుగా సహోద్యోగియై ఉండి నాకన్నా వయసులో చాలా సీనియర్ అయినవారు ఈ విధంగా నాకు ఛార్జ్ ఇచ్చారు కదా అనేదే నా బాధకు కారణం. పైగా వారు నాకు మంచి స్నేహితులూ, ఆత్మీయులూ కూడా. ఆ తరువాత నేను నాలుగుసార్లు పోటీ లేకుండా ఏకగ్రీవంగా 12 సంవత్సరాలు ప్రిన్సిపాల్ అయ్యాను. ప్రిన్సిపాల్‌గా ఉన్నప్పుడే నేను బెంగళూరు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా నియమించబడ్డాను.

కో-ఎడ్యుకేషన్ నిర్ణయం

కాలేజీ మొదలైనప్పటి నుండీ అది విద్యార్థులకు మాత్రమే పరిమితమయ్యింది. అనేక కారణాల వల్ల మేము ఆడపిల్లలను కాలేజీలో చేర్చుకోలేదు. నేను ప్రిన్సిపాల్ కావడానికన్నా ఒకటి రెండు నెలల ముందు విద్యార్థినులను కాలేజీలో చేర్చుకోవాలనే అంశాన్ని కాలేజీ అధ్యాపకుల కౌన్సిల్ ముందు ప్రవేశపెట్టాను. దానిని ఇంగ్లీషు అధ్యాపకులు ఒకరు తీవ్రంగా శక్తివంచన లేకుండా ప్రతిఘటించారు. వారు ఉత్తమ ఇంగ్లీష్ విద్వాంసులు. చివరకు రెండు వైపులా వాద పత్రివాదాలు, చర్చ హెచ్చు స్థాయిలో సుమారు ఒక గంటకన్నా ఎక్కువ సమయం నడిచింది. చివరకు ఆ అంశాన్ని ఓటింగుకు వేసినప్పుడు ఆడపిల్లలను కాలేజీలో చేర్చుకోవాలని నిర్ణయం జరిగింది. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఆ ఇంగ్లీష్ ఉపాధ్యాయుని పక్షం నిలిచి వారి వాదనను సమర్థించి వారి వైపు మాట్లాడిన రెండవ వ్యక్తే ఓటింగులో నావైపు చేయి ఎత్తాడు. “మీరు ఇలాంటి అనుయాయులను పెట్టుకుంటే ఎలా గెలుస్తారు” అని ఆ ఇంగ్లీషు అధ్యాపకునితో హాస్యం చేశాను. అక్కడున్నవారంతా నవ్వారు. ఒక సంతోషకరమైన విషయం ఏమంటే ఆ తరువాత కూడా మాలో ఏ విధమైన ద్వేష భావమూ లేదు. మేమంతా ఆత్మీయ స్నేహితులలాగే ఉన్నాము. ఇది జరిగిన రెండు నెలలకే నేను ప్రిన్సిపాల్‌గా ఎన్నుకోబడ్డాను. అప్పుడు ఆడపిల్లలను చేర్చుకుంటే కలిగే అవరోధాల గురించి ఆ రోజు జరిగిన చర్చ పదే పదే నా మనసులో మెదులుతూ వచ్చింది. కో-ఎడ్యుకేషన్ విజయవంతం చేయడానికి నా బాధ్యత పెరిగింది.

ప్రిన్సిపాల్‌గా పని ప్రారంభం

నాకు పాలనానుభవం మొదటినుండీ ఉంది. మా కాలేజీ నియమం ప్రకారం అధ్యాపకులందరితో కూడిన ఒక కాలేజ్ కౌన్సిల్ ఉంది. దానికి అధ్యక్షులు ప్రిన్సిపాల్. దాని కార్యదర్శిని ప్రిన్సిపాల్ గారే తమ అధ్యాపకులలో ఒకరిని మిగిలిన ఉపాధ్యాయుల అభిప్రాయాన్ని పరిగణనలో తీసుకుని ఎంపిక చేసుకుంటారు. నేను ఉపాధ్యాయుడినైన మరుసటి సంవత్సరం నుండే కార్యదర్శి అయ్యే అవకాశం ఉండింది. కానీ ఇంకా కొన్ని సంవత్సరాలు కానీ అని చెప్పేవాడిని. “నన్ను ఒకసారి కార్యదర్శిని చేస్తే తరువాత ఎవరికీ అవకాశం దొరకదు. కనుక కార్యదర్శి కావాలనే కోరిక ఉన్నవాళ్ళందరూ అయిన తరువాత నేను అవుతాను” అని తమాషాగా చెప్పేవాడిని. అది అలాగే అయ్యింది. కాలేజీ ప్రారంభమైన మూడు నాలుగేళ్ళ తరువాత కాలేజీ కౌన్సిల్ కార్యదర్శిని అయ్యాను. నేను అమెరికాకు విద్యాభ్యాసానికై 1943లో వెళ్ళేవరకూ అంటే 7-8 సంవత్సరాలు నేనే కార్యదర్శిగా ఉన్నాను. ఇంత దీర్ఘకాలం మరే ఉపాధ్యాయుడూ కార్యదర్శి కాలేదు. కార్యదర్శి అయిన తరువాత కాలేజీ పరిపాలనకు సంబంధించిన అన్ని పనులనూ నేనే చేసేవాడిని. కార్యదర్శిని కాకపోయినా చాలామటుకు నేను అదే చేసేవాడిని. ప్రిన్సిపాల్ మొదలుకొని ఎవరూ నన్ను తప్పుగా తీసుకోలేదు. వారందరూ నా పనులను స్వాగతించేవారు. ప్రిన్సిపాల్ గారైన ప్రొ. కె. సంపద్‌గిరిరావు గారికి ఇంటిలో మనశ్శాంతి లేదు. వారు కన్నడ, ఆంగ్ల భాషలలో ఉత్తమ పండితుడు కావడం వల్ల బయటి సంస్థలు వారి కార్యక్రమాలలో పాల్గొనడానికి అనేకసార్లు ఆహ్వానించేవారు. వాటిని వారు సాధారణంగా అంగీకరించేవారు. వాటిలో వారికి మనశ్శాంతి లభించేది. కాబట్టి కాలేజీకి సంబంధించిన పాలనాపరమైన పనులు చాలా నా బారిన పడేవి. నేను ఆ పనులను సంతోషంతో, ఉత్సాహంతో చేసేవాడిని. బాగా పనిచేయడానికే నేను నేషనల్ కాలేజీలో చేరింది. కాలేజీ ఉపాధ్యాయుడు కాక మునుపు నేషనల్ హైస్కూలులో సేవాదళం విద్యార్థిగా, పేదపిల్లల విద్యార్థి నిలయంలో ప్రిఫెక్ట్ (prefect) గా చక్కగా, క్రమశిక్షణతో పనిచేయడంలో అనుభవం సంపాదించి ఉన్నాను. దీనికి బీజం హోసూరులోని స్కూలులో ఉన్నప్పుడే పడింది అంటే తప్పుకాదు. ‘బానిస అయినవాడు రాజు కాగలడు’ అనే సామెత అక్షరాలా నిజం. ‘వేదాలు తప్పు కావచ్చు కానీ సామెతలు తప్పు కావు’ అనే సామెత వేదాలకన్నా సామెతలకే ఎక్కువ ప్రాముఖ్యాన్నిచ్చింది. నేను రాజును అయ్యానో లేనో నాకు తెలియదు. అయితే నా పని బానిసగానే మొదలయ్యింది.

అనుకున్నది సాధించాలనే పంతం నా జీవితంలో అవిభాజ్యమైన భాగమయ్యింది. నేషనల్ కాలేజీ అధ్యాపకుడిని అయ్యాక కాలేజీని అభివృద్ధి చేయడానికి అనేక కలలను కన్నాను. అమెరికాలో మూడు సంవత్సరాలు విద్యార్థిగా ఉన్నప్పుడు ఈ కలలు ఇంకా ఎక్కువయ్యాయి. కొన్ని కలలలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. కలలను సాకారం చేసుకోవడానికి పదవి చాలా ముఖ్యం. “ఏ పదవీ లేకపోయినా, ఎక్కడున్నా పనిచేయగలను” అని కొందరు చెప్పడం సహజం. ఏ స్థానంలో ఉన్నా పని అయితే చేయవచ్చు కాని ఆ పని స్వరూపాన్ని నియంత్రించడంలో అలాంటివారి పాత్ర ఏమీ ఉండదు. ఉదాహరణకు భూదానోద్యమాన్ని ఆచార్య వినోబాభావే గారు వ్యక్తిగతంగా ప్రారంభించారు. అది అంత ప్రభావవంతం కాలేదు. దానినే ఒక ముఖ్యమంత్రి చట్టం రూపంలో తృప్తికరంగా నిర్వహించడం సులభం.

నా కలలన్నింటినీ కార్యరూపంలోనికి మార్చడానికి నేను ప్రిన్సిపాల్ అయ్యాక మంచి అవకాశం లభించింది. అమెరికాలో ఉన్నప్పుడు అక్కడి విద్యావిధానం, విద్యార్థుల, ఉపాధ్యాయుల, ఇంకా ప్రజల స్వాభిమానం, కష్టించి పనిచేసే వారి స్వభావం నా పైన ఎక్కువ ప్రభావాన్ని చూపించింది. వారి అవగుణాలు నాకు అక్కరలేదు.

హాజరుపట్టీలో సంతకం

మన అన్ని పాఠశాలలు, కళాశాలలలో అధ్యాపకులకు, పనివారికి ప్రతిరోజూ హాజరు పుస్తకంలో సంతకం చేసే పద్ధతి ఉంది. విద్యార్థులకు హాజరు కావలసి వస్తుంది. అయితే, అధ్యాపకులు తమ విద్యాసంస్థలలో హాజరు పుస్తకంలో సంతకం చేయడం అధ్యాపకుల స్వాభిమానానికి లోపం కలుగుతుంది. ఇది అపనమ్మకానికి చిహ్నమూ అవుతుంది. ఉపాధ్యాయులే నమ్మకానికి యోగ్యులుకారు అనే అభిప్రాయం కలిగితే అది వారికి పెద్ద కళంకమవుతుంది. ఇదంతా విస్తృతంగా ఆలోచించి అధ్యాపకులు ప్రతిరోజూ హాజరుపట్టీలో సంతకం చేయడాన్ని తీసివేయాలని నిశ్చయించాను. ఈ విషయాన్ని, దాని వెనుక ఉన్న ఉదాత్త గుణాన్ని, అధ్యాపకుల జవాబ్దారీనీ కాలేజీ కౌన్సిల్ సభలో కూలంకషంగా చర్చించాము. అధ్యాపకులందరూ నా సూచనను మెచ్చుకున్నారు.

పాలకమండలి (Governing Council) సభలో ఈ విషయాన్ని ప్రస్తావించాను. డా. బి. కె. నారాయణరావు గారు అప్పుడు పాలక కమిటీ అధ్యక్షులు. వారు క్రమశిక్షణకు మారుపేరు. ఇప్పుడున్న బెంగళూరు మెడికల్ కాలేజీ వ్యవస్థాపకులు. ఆ కాలేజీ ప్రథమ ప్రిన్సిపాల్‌గా కూడా ఉన్నారు. ప్రఖ్యాత నేత్రవైద్యులు. గౌరవనీయులు. వారు ప్రిన్సిపాల్‌గా ఉన్నప్పుడు వారి ఎదురుగా ఒక విద్యార్థి నమస్కారం చేయకుండా అలాగే వెళితే, ఆ విద్యార్థిని పిలిపించి “అధ్యాపకులు, ప్రిన్సిపాల్ ఎదురుగా వచ్చినప్పుడు వారికి గౌరవం సూచించడానికి నమస్కారం చేయడం విద్యార్థుల కర్తవ్యం” అన్నారు. ఆ విద్యార్థి “క్షమించండి సార్” అని నమస్కరించాడు. ఆపైన డా. బి. కె. నారాయణరావు గారు “తప్పుగా అనుకోవద్దు. నీ నుండి నేను ఈ వయసులో నమస్కారం చేయించుకోవాలనే ఆశ కానీ, చపలం గానీ నాకు లేదు. అయితే విద్యార్థులుగా ఉన్నప్పుడు మంచి నడత, క్రమశిక్షణ నేర్చుకోవాలి” అని అతడికి బుద్ధి చెప్పాడు. ఆ విద్యార్థి వారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసి వెళ్ళిపోయాడు.

వారిని గురించి ఇంకొక ఘటన. 1945లో మా కాలేజీ ఉపాధ్యాయులొకరు సంవత్సరం చివరలో ప్రిన్సిపాల్ గారికి అసంతృప్తితో కొంచెం హద్దుమీరి ఒక లేఖ వ్రాశారు. దానిని పాలకవర్గ సమావేశంలో ప్రిన్సిపాల్‌గారు చదివి వినిపించారు. డా. బి. కె. నారాయణరావుగారే కౌన్సిల్ అధ్యక్షులు. వారు దానిని సావధానంగా విన్నారు. “Young and impertinent teachers should be shown their places. Terminate his services. – తలపొగురున్న యువ అధ్యాపకులకు వారి స్థానం ఏమిటి అనేది వారికి చూపించాలి. అతడిని పని నుండి తీసివేయండి” అన్నారు. ఈ ప్రవర్తన అధ్యక్షుల నియంతృత్వ ధోరణిని చూపిస్తుందని, పాలకవర్గం అధ్యాపకులపై పెత్తనం చెలాయిస్తున్నదని ఈ కాలపు అధ్యాపకులు మొత్తుకోవచ్చు. అయితే ఆ అధ్యాపకుడు కాలేజీలో చేరి 8-9 నెలలు కూడా కాలేదు. అలాంటివారు ప్రిన్సిపాల్ మీద, పాలక మండలి మీద అవమానకరంగా లేఖ వ్రాయడం మంచిది కాదు. అధ్యాపకులకు అటెండెన్స్ ఎత్తివేసే సూచనను పాలకమండలి ముందు పెట్టాను. దాని చెల్లుబాటును వివరంగా తెలిపాను. ఎప్పటిలాగానే అధ్యక్షులు సావధానంగా విని “Dr. Narasimhaiah, I agree with your sentiments and arguments. But don’t you think that teachers should have some discipline – డా. నరసింహయ్య మీ ఆలోచనలను, వాదనను నేను అంగీకరిస్తాను. అయితే అధ్యాపకులకు క్రమశిక్షణ ఉండాలని మీరు భావించడం లేదా?” అన్నారు. నేను వెంటనే “Self-discipline is best discipline – స్వయం నియంత్రణే ఉత్తమ క్రమశిక్షణ సార్” అన్నాను. వారికి చాలా సంతోషమయ్యింది. “If you are confident go ahead – మీకు నమ్మకం ఉంటే అలాగే చేయండి” అన్నారు. అప్పటినుండి నేను ప్రిన్సిపాల్‌గా కొనసాగినంత వరకూ అధ్యాపకులకు హాజరు పుస్తకంలో సంతకం పెట్టాల్సిన అవసరం లేకపోయింది. అధ్యాపకులూ తమ జవాబుదారీని నిభాయించుకుని పాలక మండలి తమపై పెట్టిన నమ్మకాన్ని నిలుపుకుని స్వాభిమానాన్ని పెంచుకున్నారు. అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేయకపోవడం అనేది ఒక రకంగా చిన్న విషయమని కొందరు భావించారు. అయితే దాని వెనకున్న విలువలు మహత్తరమైనవి.

ట్యుటోరియల్ సిస్టమ్

ఒక సెక్షన్లో సాధారణంగా 80-90 మంది విద్యార్థులుండేవారు. వీరి చదువుపై, నడవడికపై ధ్యాస పెట్టి మార్గదర్శనం చేసే క్లాస్ టీచర్లు ఉన్నా అంతమంది విద్యార్థులపై దృష్టిని కేంద్రీకరించడం కష్టమని భావించి ప్రతి సెక్షన్ను మూడు భాగాలు చేశాము. ఒక్కొక్క భాగంలో సుమారు 30 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ 30 మంది బాగోగులను చూసుకోవడానికి ఒక్కొక్క ఉపాధ్యాయుడిని నియమించాము. దీనినే ‘ట్యుటోరియల్ సిస్టమ్’ అంటాము. ఆ ఉపాధ్యాయులు విద్యార్థులను సుమారు నెలకొకసారి కలిసి వారి విద్యాపరమైన సమస్యలు, ఇతరమైన సమస్యలను తెలుసుకుని వారికి మార్గదర్శనం చేసేవారు. ఈ పద్ధతి చాలా విజయవంతంగా నడిచింది. ఇదే పద్ధతిని పాటించాలని తన నియమాలలో సూచించింది. ఇది ఇంకా కాగితం పైనే ఉంది.

విద్యా కార్యక్రమాలు

ఒకరిద్దరిని మినహాయిస్తే అందరు ఉపాధ్యాయులు ఉత్తమస్థాయి ఉపాధ్యాయులు. స్ఫూర్తితో, నిబద్ధతతో, శ్రద్ధతో పాఠాలు చెప్పేవారు. అన్ని పాఠాలు చక్కగా నడుస్తున్నాయి. అధ్యాపకులు శెలవులో వెళ్ళినప్పుడు వారి తరగతులను మిగిలిన ఉపాధ్యాయులు తీసుకునేవారు. క్లాసులు జరగకపోవడం అనేది చాలా అపురూపం. యథాప్రకారం ప్రత్యేక తరగతులు, లఘుపరీక్షలు, అంత్యపరీక్షలు జోరుగా సాగుతున్నాయి. సమాధాన పత్రాలను దిద్ది అతి త్వరగా విద్యార్థులకు తిరిగి ఇచ్చేవారు. మూల్యాంకనంలో విద్యార్థులకు వచ్చిన అనుమానాలను సంతృప్తికరమైన రీతిలో నివృత్తి చేసేవారు. క్లాస్ టీచర్, ప్రిన్సిపాల్ సంతకాలు చేసిన మార్క్స్ లిస్టును విద్యార్థులకు, వారి తల్లిదండ్రుల అవగాహన కోసం పంపేవాళ్ళం. వారి సంతకం తీసుకుని విద్యార్థులు వాపసు ఇచ్చేవారు. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులతో క్లాస్ టీచరు, ప్రిన్సిపాల్ విద్యార్థుల సమక్షంలో సమాలోచనం నడిపి సరియైన సలహాలు ఇచ్చేవారు.

చదువులో వెనుకబడిన విద్యార్థులకు తరగతులు

మేము చదువుకోసం ఉత్తమ విద్యార్థులను తీసుకుంటామని, మా దృష్టి అంతా అటువంటి విద్యార్థులపైనే ఉంటుందని ఒక అపవాదు ఉంది. టెస్టులు, పరీక్షలయిన తరువాత వివిధ సబ్జెక్టులలో తక్కువ మార్కులు వచ్చినవారిని గుర్తించి వారి ప్రత్యేకమైన తరగతులను సాయంత్రం నడిపేవారం. ఈ పద్ధతి విద్యార్థులకు ఎక్కువ ఉపయోగకరంగా ఉంది. చదువు దృష్టితో ఇదొక ముఖ్యమైన కార్యక్రమం.

విద్యార్థుల హాజరు తగినంతగా లేకపోతే వారి తల్లిదండ్రులకు వ్రాసేవారు. వారిని విద్యార్థులను కలిసేవారు. కొన్ని సార్లు క్లాస్ టీచర్లే ఆయా విద్యార్థుల ఇళ్ళకు వెళ్ళి వారి తల్లిదండ్రులతో మాట్లాడేవారు.

అధ్యాపకుల సహకారం

అంతా సమర్థవంతంగా, క్రమశిక్షణతో నడుస్తున్నదనడానికి ఒక ఉదాహరణ ఇస్తాను. మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ (ఇప్పుడు ప్రి యూనివర్సిటి) చేరడానికి 1500కు పైగా దరఖాస్తులు వచ్చేవి. (ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తున్నాయి). దరఖాస్తు చేయడానికి చివరి తేదీ సమయం సాయంత్రం 5 గంటలు అనుకుంటే అదే రోజు సాయంత్రం 6 గంటలకు అధ్యాపకుల సభ కాలేజీ కౌన్సిల్ నడిచేది. దరఖాస్తులు వచ్చినవి వచ్చినట్లే వాటిని వర్గీకరించి అన్ని వివరాలనూ సేకరించి పెట్టుకునేవారు. ఈ పని అంతా అధ్యాపకులే చేసేవారు. ఆ సభలో వచ్చిన దరఖాస్తులను అన్నింటినీ పరిశీలించి నియమాలను రూపొందించి ఏయే గ్రూపులో ఎంతమందిని విద్యార్థులను చేర్చుకోవాలని తీర్మానించేవాళ్ళం. ఇదంతా పూర్తి కావడానికి సుమారు రాత్రి 8 గంటలు అయ్యేది. ఆ తరువాత కష్టమైన పని మొదలయ్యేది. ఆ దరఖాస్తులను పరిశీలించి నియమాల ప్రకారం విద్యార్థుల దరఖాస్తులను వేరుచేయాలి, జోడించాలి, తప్పులేకుండా టైపు చేయాలి. ఇదంతా చేయడానికి మూడు నాలుగు గంటలు పట్టేది. ఆ తరువాత అర్హులైన విద్యార్థులకు సీటు లభించింది అనే విషయాన్ని ప్రతి యొక్క విద్యార్థికీ పోస్టుకార్డులో వ్రాయాలి. పని ముగిసేటప్పటికి రాత్రి సమయం ఒకటి లేదా రెండు గంటలు అయ్యేది. ఆ కార్డులను బసవనగుడి (కాలేజీ సమీపంలో ఉన్న) పోస్ట్ ఆఫీసులో పోస్ట్ చేసి ఇంటికి వెళ్ళేవారు. చుట్టుపక్కల ఇళ్ళు ఉన్నవారికి అదే రోజు ఉదయం 8-9 గంటలకు చేరేది. వారికంతా మహా ఆశ్చర్యం. దరఖాస్తులను ముందురోజు సాయంత్రం ఐదు గంటల వరకు తీసుకుని మరుసటి దినం ఉదయం 8-9 గంటలకు ప్రవేశం లభించిందన్న కార్డును పోస్ట్ మ్యాన్ అందించినప్పుడు వారు మొదట నమ్మేవారు కాదు. ఈ వ్యవస్థ నుండి వ్యక్తమయ్యే కొన్ని అంశాలు మా కాలేజీ చేపట్టిన అన్ని కార్యక్రమాలు నడిచే విధానాన్ని సూచిస్తాయి. మొట్ట మొదటగా అధ్యాపకులు అన్యోన్యతతో, సంతోషంతో మా కాలేజీ అనే అభిమానంతో పనిచేసేవారు. అన్నిటికన్నా ముఖ్యమైనది టీమ్‌వర్క్. ఒక వ్యక్తి ఎంత పనిచేసినా ఇద్దరు ముగ్గురి పనులను చేయడం కుదరదు. ప్రిన్సిపాల్‌గా ఉన్నంత కాలం నాకు ఇలాంటి స్వచ్ఛందంతో కూడిన ఆత్మీయ సహకారం నా సహోద్యోగుల నుండి లభించింది.

విద్యార్థుల సహకారం

విద్యార్థుల సహకారమూ మరువలేనిది. విద్యార్థులలో కొందరు ప్రతికూలమైనా కార్యక్రమాలను తృప్తికరంగా నిర్వహించడానికి ఏ అడ్డంకి కలగలేదు. మొదటి నుండి నేను విద్యార్థులతో సన్నిహిత సంబంధాలను పెట్టుకున్నాను. తరగతిలో ఉపాధ్యాయుణ్ణి. బయట అన్నగానో, పోషకుడిగానో, హితైషిగానో ఉన్నాను. కాలేజీలో క్రీడలు, ఇతర వ్యాపకాలలో నేనూ పాల్గొనేవాడిని. నేను ఆవరణలోనే ఉన్న విద్యార్థినిలయంలోనే ఉన్నాను. అందువల్ల విద్యార్థుల అన్ని కార్యకలాపాలలో పాల్గొనడానికి, మార్గదర్శనం చేయడానికీ సులభమయ్యింది. ఎన్నో రోజులు కొందరు విద్యార్థులు కాలేజీ ఆవరణలో లేదా హాస్టల్లో ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి రాత్రి 8-9 గంటల వరకూ ఉండేవారు. ఒకరోజు ఒక పిల్లవాడు వచ్చి “మా నాన్నమ్మ మిమ్మల్ని తిట్టింది సార్” అన్నాడు. “మీ నాన్నమ్మ నన్నెందుకు తిట్టినారప్పా” అడిగాను. “చూడండి సార్. నేను నిన్న ఇంటికి లేటుగా వెళ్ళాను. మా నాన్నమ్మ ‘ఎందుకురా ఇంటికి రావడానికి ఇంత సేపయ్యింది’ అన్నారు. ‘హెచ్.ఎన్.రూములో ఉన్నాను’ అన్నాను. దానికి మా నాన్నమ్మ ‘మీ హెచ్.ఎన్.కేమీ పెళ్ళా పెటాకులా. ఆయనకు ఇల్లూ లేదు మఠమూ లేదు. నీకు ఇల్లు ఉందిరా’ అన్నారు”. “నిన్న నీవు నా రూములో లేవు కదా” అన్నాను. దానికి అతడు “నేను మా ఇంటిలో అబద్ధం చెప్పాను సార్. సినిమాకు పోయి లేటుగా వచ్చాను. సినిమాకు వెళ్ళాను అంటే బాగా తిడతారు. మీ రూములో ఉన్నాను అంటే అంత ఆక్షేపించరు” అన్నాడు. ఇలాగే అబద్ధాలు చెప్పి ఎంతమంది విద్యార్థులు నన్ను వారి ఇళ్ళల్లో తిట్టించారో తెలియదు!

నేను ప్రిన్సిపాల్ అయిన తరువాత విద్యాపరంగా, సామాజిక పరంగా అర్థవంతమైన కొత్తకొత్త పథకాలను చాలా ప్రారంభించాము. వాటికి విద్యార్థుల నుండి సంపూర్ణమైన, సంతోషమైన సహకారం లభించింది. ఇలాంటి సహకారం లభించాలంటే విద్యార్థులకూ, అధ్యాపకులకూ, ప్రిన్సిపాల్‌కూ ఆత్మీయమైన అనుబంధం ఉండాలి. తాము శ్రేయోభిలాషులమనే భావనను అధ్యాపకులు విద్యార్థులలో కలిగించాలి. ఇలా ఉన్నప్పుడు విద్యార్థుల సమస్యలే ఉద్భవించవు. విద్యార్థులతో అధ్యాపకులూ, ప్రిన్సిపాలూ చనువుగా ఉంటే వారు విద్యార్థుల దృష్టిలో చులకన (Cheap) అవుతారనే భావన చాలామంది అధ్యాపకులలో ఉంది. ఈ ఆలోచన సరికాదు అని ఇన్ని సంవత్సరాల అనుభవంతో చెబుతున్నాను. విద్యార్థులు, అధ్యాపకులు పరస్పరం అర్థం చేసుకోవడం ముఖ్యం. సమస్యలు తలెత్తినప్పుడు నవ్వుతూ ఏ విధమైన ద్వేషం లేకుండా పరిష్కరించుకోవచ్చు.

నా మొత్తం జీవితంలో నాదైన ఏ గుంపూ కట్టలేదు. అధ్యాపకుల సంబంధాన్ని విచ్ఛిన్నం చేయాలని కలలో కూడా ఆలోచించలేదు. నా అధికారం చలాయించి ఇంతవరకూ ఉపాధ్యాయులపై కానీ, విద్యార్థులపై కానీ మత్సరాన్ని చూపలేదు. నా పన్నెండు సంవత్సరాల వ్యవధిలో ఏ ఉపాధ్యాయునికి ఒక మెమో కూడా ఇవ్వలేదు. అవసరం ఉన్నప్పుడు విద్యార్థులను అప్పుడప్పుడు దండించేవాణ్ణి. అవి ఏవీ వ్యక్తిగతం కాదు. త్వరగానే విద్యార్థులు దానిని మరిచిపోయేవారు. నేనూ మరిచిపోయేవాడిని.

ర్యాంక్ కాలేజీ

ముందే చెప్పినట్లు మా కాలేజీ మొదలైన నాలుగైదు సంవత్సరాలలో రాష్ట్ర విద్యారంగంలో గణనీయమైన స్థానాన్ని నిలుపుకుంది. ఇంటర్మీడియట్ (ప్రస్తుతం ప్రియూనివర్సిటి), బి.ఎస్.సి. పరీక్షలలో ఉత్తమ ఫలితాలు వచ్చేవి. సంవత్సరానికి ఒకటి రెండు ర్యాంకులతో మొదలై ఇంటర్మీడియట్ పరీక్షలలో రాష్ట్రస్థాయి మొదటి 10 ర్యాంకులలో 9 ర్యాంకులను ఒక సంవత్సరం గెలుచుకుంది. 7-8 ర్యాంకులైతే సర్వసాధారణం. అలాగే బి.ఎస్.సి.డిగ్రీలోనూ 6-7 ర్యాంకులు ప్రతియేటా మా కాలేజీకే వస్తుంది. ఫలితాలను ప్రకటించిన రోజే దినపత్రికల మొదటి పేజీలలో మా కాలేజీ ర్యాంకు విద్యార్థుల గ్రూపు ఫోటో దాని వివరాలు ప్రకటించేవారు. కాలేజీలకు ఒక రోజు ముందే ఫలితాలు, ర్యాంకుల పట్టీ వచ్చేది. దానికోసం నేను కాచుకుని ఉండేవాడిని. ర్యాంకు విజేత అడ్రస్సులను తక్షణం ఆఫీసునుండి పొంది అదే రోజు సాయంత్రం 4 గంటలకు కాలేజీకి ఫోటో కోసం రావాలని వర్తమానం పంపేవాడిని. ఒకటి రెండు సార్లు ర్యాంక్ విజేతలలో ఇద్దరు ముగ్గురు విద్యార్థులు అతి సమీపంలో ఉన్న కొన్ని ఊర్లలో నివసించేవారు. మా కాలేజీ అటెండర్స్‌కు ఆ విద్యార్థుల అడ్రస్ ఇచ్చి వారిని ఎలాగైనా సాయంత్రం 4 గంటల సమయానికి నా ముందు హాజరు కావాలని హుకుం జారీ చేసేవాడిని. నాకు జ్ఞాపకమున్నంత వరకూ ఒక సంవత్సరం మాత్రం ఒక విద్యార్థి ఇలాంటి గ్రూపు ఫోటోలో పాల్గొనడానికి కాలేదు. మరుసటి రోజు అతని ఫోటోను ప్రత్యేకంగా ప్రకటించాము. ఇలాంటి ఫలితాలను చూసి మా శ్రేయోభిలాషులు చాలా సంతోషపడేవారు. మన సమాజ సాంప్రదాయం ప్రకారం కొందరికి జఠరాగ్ని ఎక్కువయ్యేది. ‘లోకోభిన్నరుచిః!’ సామాన్యంగా మా కాలేజీని ‘ర్యాంక్ కాలేజీ’ అని పిలిచేవారు.

వ్యవస్థీకృతమైన శ్రద్ధాసక్తులతో కూడిన ప్రయత్నాన్ని అధ్యాపకులు, విద్యార్థులు చేస్తే కాలేజీ ఉన్నత స్థానాన్ని గడించడం సాధ్యం.

ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మా కాలేజీలో చేరేవారు హై ఫస్ట్ క్లాస్ విద్యార్థులనే భావన ప్రజలలో వ్యాపించివుంది. ఇది సత్యదూరం, బహుదూరం. మా కాలేజీలో విద్యార్థులను చేర్చుకునే నియమాలను, దానికి పడే కష్టాలను వివరించడం అవసరం.

ఈ అడ్మిషన్ ఒత్తిడి చాలు బాబోయ్ చాలు

బెంగళూరులో రెండు నేషనల్ కాలేజీలు, ఒక నేషనల్ హైస్కూలు, ఒక హైయ్యర్ ప్రైమరీ స్కూలు ఉన్నాయి. నేషనల్ హైయ్యర్ ప్రైమరీ స్కూలు పూర్తిగా కన్నడ మీడియం స్కూలు. ప్రవేశానికి మామూలు ఒత్తిడే; తట్టుకోవచ్చు. ఈ రెండు నేషనల్ కాలేజీలు, నేషనల్ హైస్కూలు విద్యాక్షేత్రంలో కొన్ని దశాబ్దాలుగా మంచి పేరును గడించాయి. వీటిలో వేలాదిమంది పూర్వ విద్యార్థులున్నారు. ఈ పాఠశాల, కాలేజీలలో విద్యార్థుల నుండి డొనేషన్ తీసుకోము. పైగా ఈ సంస్థలు పేదరికంలోనే పెరుగుతూవున్నాయి.

ఈ సంస్థల బిల్డింగులు మొదలైన అభివృద్ధి కార్యక్రమాలకు అయ్యే ఖర్చును మేమే భరించాల్సి ఉంది. అందువల్ల మేము సార్వజనికుల నుండి, హితోభిలాషుల నుండి ప్రతియేటా ధనాన్ని సేకరించే పని మొదటినుండీ నిరంతరాయంగా కొనసాగుతూ ఉంది. ఇది నిలిచే సూచన కూడా లేదు. అందువల్ల ప్రవేశానికి విద్యార్థులనుండి, దాతల నుండి, విద్యాశాఖ నుండి, ప్రముఖ వ్యక్తుల నుండి, ఉన్నత అధికారుల నుండి ప్రతి యేటా ఒత్తిడి తట్టుకోలేనంతగా వస్తుంది. పైగా సుమారు 50 సంవత్సరాలకు పైగా నేను మా సంస్థలలో పనిచేయడంతో పాటు సమాజంలో వివిధ స్థానాలలో పనిచేయడం వల్ల, పలువురు పూర్వ విద్యార్థులతో సన్నిహిత సంబంధాలు ఉండటం వల్ల, దాతలనుండి ధనసేకరణలో ప్రముఖపాత్ర వహించడం వల్ల, వివిధ రంగాలలోని పెద్దలు పరిచయం ఉండడంవల్ల నేను ప్రత్యేకంగా వ్యక్తిగత దాక్షిణ్యానికి చిక్కి ప్రతి సంవత్సరం అడ్మిషన్ సమయంలో తీవ్రమైన శ్రమకు గురి అయ్యేవాడిని.

బహుశా ఏ ప్రవేశాధికారి అనుభవించని ఇంకొక కష్టాన్ని అనుభవిస్తూ వచ్చాను. దానికి నేనే ఎక్కువపాలు బాధ్యుడిని. నాకు ఇల్లే మఠం. ఇదే పాఠశాల, కాలేజీల ఆవరణలో ఉన్న విద్యార్థినిలయంలో సుమారు 50 సంవత్సరాల నుండి నివసిస్తున్నాను. ఎలాగూ నేను పెళ్ళాం పిల్లలు లేని బ్రహ్మచారినని నిర్భయంగా రాత్రి 10 గంటలవరకూ హాస్టల్‌కు వచ్చి సీటు కోసం పీడించేవారు. కొన్ని రోజులు సీటు అడిగేవారి ప్రారంభోత్సవం ఉదయం 5.30 గంటలకు మొదలౌతుంది. నేను లాల్‌బాగ్‌కు ప్రతి రోజూ వాకింగుకు వెళతానని తెలుసుకోవడమే కాదు, ఏ వైపు వెళతానని తెలుసుకుని దానికి వ్యతిరేక దిశలో వస్తారు. అక్కడే సంభాషణ మొదలుపెడతారు. వారినుండి వీలైనంత త్వరగా తప్పించుకొనడానికి ప్రయత్నిస్తాను. భోజనం చేసేటప్పుడు భోజనశాలకు వచ్చి చిరపరిచితుల్లా ప్రక్కనే కూర్చుని సతాయించడం మొదలుపెడతారు.

ఇలా సీటు కోసం నన్ను కలిసేవారికి కాలంతో పనిలేదు. అందరూ కాలాతీతులు! ఎప్పుడు వచ్చినా నేను దొరుకుతానన్న ధృఢమైన నమ్మకం. అడ్మిషన్ సమయంలో నాకు నమస్కారం చేసేవారి సంఖ్య గ్రాఫు పెరిగి అడ్మిషన్ ముగిసే సమయానికి దిగుతూ వస్తుంది. ఇలా సీటు అడిగేవారు తమకున్న అర్హత (Qualification)ను లేదా అధికారాన్ని(Right) వివరిస్తారు. నయంగా అడిగేవారు కొందరుంటారు. కొందరు గడుసుగా అడ్డదిట్టంగా అడుగుతారు. ప్రతియేటా మాటల్లో కొన్ని చేదు ఉన్న సంభాషణలు ఉండే ఉంటాయి. అయితే నేను సాధారణంగా నిగ్రహాన్ని కోల్పోను.

సీటు గురించి నా పనివిధానాన్ని సూక్ష్మంగా చెబుతాను. నా ఆఫీసులో ప్రవేశం ఉచితం. అడ్డం చెప్పడానికి జవాను లేడు. ఆఫీసులో చాలా కుర్చీలున్నాయి. వచ్చిన వారందరినీ “దయచేసి కూర్చోండి” అని చెబుతాను. వచ్చినవాళ్ళు నిలబడి ఉంటే నేను వారితో సంభాషణను కొనసాగించను. కూర్చోవడానికి కొందరు మీనమేషాలు లెక్కిస్తుంటే వారితో “నేను కాలేజీ సీటు ఇవ్వలేకపోయినా ఇక్కడ ఖచ్చితంగా ఇస్తాను. కూర్చోండి” అన్నప్పుడు చాలామంది నా ఆఫీసులో ఉన్న సీటు గట్టిదని తీర్మానానికి వస్తారు. వచ్చినవారు ఒక్కొక్కరూ తమ విన్నపాలను, హక్కులను చెప్పుకుంటారు. చాలా మంది సిఫారసు పత్రాల ద్వారా సీటు కోసం ఒత్తిడి చేస్తారు. నేను అంతా సావధానంగా వింటాను. (సహనం కోల్పోయిన సంఘటనలు చాలా తక్కువ.) మామూలు సిఫారసులతో పాటు నాకు ఎవరు సమీపం అని పరిశోధించి అలాంటి వారి ద్వారా సిఫారసు చేయిస్తారు. ఒకసారి నేను దశాబ్దాలుగా క్షవరం చేయించుకుంటున్న క్షురకుని నుండి ఇలాంటి సిఫారసు వచ్చింది. అలాగే మా హాస్టలు వంటవాడి నుండి, నా వైద్యుడి నుండి సిఫారసులు వచ్చాయి. ఇలా నానా విధాలుగా సీటుకోసం సతాయిస్తారు.

ప్రవేశపు నియమాలు

నాకు ఈ సీటు సమస్యల పట్ల నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. వచ్చినవారందరికీ ఒక్కొక్కరికో లేదా అక్కడ కూర్చున్న వాళ్ళందరికో నిదానంగా, తార్కికంగా మా ప్రవేశ నియమావళిని వివరంగా తెలియజేస్తాను. మా ప్రాథమిక పాఠశాలలో పాసయిన వారికందరికీ హైస్కూలులో సీటు ఇస్తాము. అలాగే హైస్కూలులో పాసయిన వారందరికీ మార్కులతో సంబంధం లేకుండా కాలేజీలో సీటు ఇస్తాము. తరువాత ప్రభుత్వ నియమాల ప్రకారం సీట్లు కేటాయిస్తాము. మిగిలిన సీట్లను మా సంస్థ అభిమానులకు, దాతలకు, పాలక వర్గానికి, విద్యాశాఖ వారికి ఇస్తాము.

ప్రభుత్వ నియమాల ప్రకారం ప్రకటించే అర్హత పట్టీ (Merit list) లో సామాన్యంగా 85 శాతం మార్కులకు నిలిచిపోతుంది. అందువల్ల ఈ సంస్థలలో చేరే విద్యార్థులు అందరూ 85% కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనే తప్పుడు అభిప్రాయానికి వస్తారు. మా పాఠశాలల నుండి వచ్చి చేరిన థర్డ్ క్లాస్ విద్యార్థులను హాయిగా మరచిపోతారు. ఇదంతా వివరంగా చెప్పినప్పుడు అందరూ ముఖ్యంగా తల్లులు జాగ్రత్తగా వింటారు. దీనివల్ల నేను వారినందరినీ నా తర్కంతో విజయవంతంగా ఒప్పించానని భావించేలోగా వారు “ఈ వివరణ అంతా మాకొద్దు సార్. ఇదంతా మాకు తెలియదు కూడా; ఏమైనా చేసి మా బిడ్డకు సీటు ఇవ్వండి” అంటారు. నాకు ఇలాంటి ప్రతిక్రియ నిరాశను కలిగిస్తుంది. ఒక్కతే కూతురు సీటు ఇవ్వండి. ఒక్కడే కొడుకు సీటు ఇవ్వండి. ఒక్కొక్కసారి కవల పిల్లల సమస్య. కవలలలో ఒకరికి సీటు దొరికితే మరొకరికి సీటు దొరకదు. ఇదొక ధర్మసంకటమైన సమస్య. సందర్భోచితంగా ఇలాంటి సమస్యలను పరిష్కరిస్తాను. తమకు సీటు దొరకనప్పుడు కొందరు తమకు అనుకూలమైన రీతిలో ప్రవేశ నియమాలను ప్రతిపాదిస్తారు. మా హైస్కూలు, కాలేజీలకు సమీపంలో నివసించే పిల్లలకు సీటు ఇవ్వాలని వాదిస్తారు. కొందరు మార్కులను పరిగణనలో తీసుకోకుండా మొదట వచ్చినవారికి మొదట సీటు ఇవ్వాలని కోపంగా కోరుతారు. అలాంటివారికి సమాధానం ఇది అంగడి కాదు, విద్యాసంస్థ అని ఒకే మాటలో చెబుతాను.

ఆసక్తికరమైన సంఘటనలు

ఒకటి రెండు ఆసక్తికరమైన సంఘటనలను చెబుతాను. మా కాలేజీలో సైన్సు సబ్జెక్టులలో (పి.సి.ఎం.బి) చేరాలంటే మా హైస్కూలు విద్యార్థులకు ఎస్.ఎస్.ఎల్.సి.లో గణితం, సైన్సు కలిపి 200 మార్కులకు కనీసం 80 మార్కులు రావాలని నియమం ఉంది. ఇదొక తప్పనిసరి నియమం. దీనికన్నా తక్కువ మార్కులు వచ్చినవారు ఆర్ట్స్ గ్రూపులో చేరవచ్చు. సుమారు 30 యేళ్ళ క్రితం నేను ప్రిన్సిపాల్ అయినప్పుడు విద్యామంత్రి గారైన శ్రీ ఎస్.ఆర్.కంఠిగారు జూనియర్ ఇంటర్లో చేర్చుకోవడానికి ఒక పిల్లవాడిని పంపారు. విద్యామంత్రులు పంపే ఒకరిద్దరు విద్యార్థులను చేర్చుకోవడం మా కర్తవ్యం. అయితే ఆ విద్యార్థికి 200లకు 80కన్నా తక్కువ మార్కులు వచ్చాయి. నేను వారికి ఫోన్ చేసి “మీ పిల్లవానికి 80 కన్నా తక్కువ వచ్చాయి. అందువల్ల మా నియమం ప్రకారం అతడికి ప్రవేశం ఇవ్వడం సాధ్యం కాదు. దయచేసి క్షమించండి” అని విన్నవించుకున్నాను. దానికి వారు “మీ రూల్స్‌ను మార్చండి” అన్నారు. “వీలుకాదు సార్” అన్నాను. “మేము రాజ్యాంగాన్నే అనేక సార్లు మార్చాము. మీరు చేసుకున్న నియమమే కదా. మార్చండి. ఏమౌతుంది” అని గడుసుగా చెప్పారు. “దయచేసి ఏమీ అనుకోకండి సార్. సాధ్యం కాదు” అన్నాను. వారు అసంతృప్తితో ఫోన్ పెట్టేశారు.

ఇంకొక సంవత్సరం మా పాలకమండలి ఉపాధ్యక్షులు, బెంగళూరు నగర మేయర్ ఐన శ్రీ హెచ్. ఎస్. సీతారాం గారి కుమారుడు మా హైస్కూలు నుండి పాస్ అయ్యాడు. అతడికి గణితం, సైన్సులలో 80కన్నా తక్కువ మార్కులు వచ్చిన కారణాంగా సీటు ఇవ్వలేదు. నాకూ, సీతారాం గారికి అప్పటికే చాలా సంవత్సరాల నుండి చాలా దగ్గర పరిచయం. వారు వయసులో నాకన్నా పెద్దవారు. వారు నా ఆఫీసుకు వచ్చి “ఏమయ్యా, నా కొడుకుకు నీవు సీటు ఇవ్వలేదు” అన్నారు. వారికి మా ప్రవేశ నియమాలను వివరించాను. ఉపాధ్యక్షులుగా వారికి న్యాయంగా ఈ నియమాలన్నీ తెలిసి ఉండాలి. “నియమం గియమం పక్కన పెట్టు. సీటు ఇయ్యవయ్యా” అన్నారు. “సాధ్యం కాదు సార్” అన్నాను. ముఖం ఎర్రగా (ముందే వారు ఎర్రగా ఉన్నారు) చేసుకుని ఆసనం నుండి లేచి కుర్చీని తన్ని విసవిసా వెళ్ళిపోయారు. ఒక గంటలోపల తమ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా పంపారు. పాలకమండలి తరువాతి సమావేశంలో ఎలాంటి చర్చా లేకుండా వారి రాజీనామాను ఆమోదించారు. ఇలాంటిదే ఇంకొక ప్రకరణం. శ్రీ టి. ఆర్. శ్యామణ్ణ గారు మా పాఠశాల పూర్వ విద్యార్థులు. పాలకమండలిలో చాలా కాలం సభ్యులుగా ఉన్నారు. నేను ఇదే హైస్కూలులో విద్యార్థిగా ఉన్నప్పుడు శ్రీ టి. ఆర్. శ్యామణ్ణగారు నాకు బాగా తెలిసినవారిలో ఒకరు. మా స్కూలులోనే చదివిన వారి అబ్బాయికి 80కన్నా తక్కువ మార్కులు వచ్చినందువల్ల యథాప్రకారం సీటు రాలేదు. నాతో కోపంగా చర్చించారు. నేను తగ్గలేదు. కోపగించుకుని వెళ్ళిపోయారు. సుమారు రెండు సంవత్సరాలు నాతో మాట్లాడలేదు. మా కాలేజీలో సీటు దొరకని అతని కుమారుడు సినిమా రంగంలో చాలా పేరు గడించారు♦. రెండు సంవత్సరాలయ్యాక శ్యామణ్ణ గారి కోపం తగ్గింది. ఒక రోజు వారు “నీవు నా కొడుకుకు సీటు ఇవ్వక పోవడమే మంచిదయ్యిందయ్యా” అన్నారు. ఎప్పటిలాగానే మా ఇద్దరి మధ్య వెనుకటి బాంధవ్యం ముందుకుసాగింది.

1967లో అమెరికాకు విజిటింగ్ ప్రొఫెసర్‌గా వెళ్ళాను. 1968లో బెంగళూరుకు రష్యా దేశం మాస్కో గుండా వాపసు వచ్చాను. మాస్కోలో ఢిల్లీకి వెళ్ళే విమానంలో కూర్చున్నాను. అది ఇంకా భూమిపైనే ఉంది. ఎగరలేదు. ఇంతలోనే ఒకతను వచ్చి “నమస్కారం సార్. మీరు నేషనల్ కాలేజీ ప్రిన్సిపాల్ నరసింహయ్యగారు కదా?” అని అడిగారు. “ఔను సార్” అన్నాను. “ఇంతకు ముందు మిమ్మల్ని మీ ఆఫీసులో మా అబ్బాయి అడ్మిషన్ విషయమై కలిశాను” అన్నారు. నా గుండె వేగంగా కొట్టుకోసాగింది. నేను ఒకరికి సీటు ఇచ్చివుంటే 20 మందికి సీటు ఇచ్చివుండను. వీరు సీటు ఇవ్వని గుంపుకు చెందిన వారు కావచ్చని ఊహించాను. అట్లాగే అయ్యింది. “మీరు సీటు ఇవ్వలేదు సార్” అన్నారు. ఈ సీటు వదలిపెట్టని భూతంలా వెంటాడుతూ రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదనే సామెతను గుర్తు చేసింది. ఒక వెకిలినవ్వు నవ్వి ఊరుకున్నాను.

ఒకసారి ఇద్దరు సీటు కోసం వచ్చారు. వారి పిల్లవాడికి సీటు ఇవ్వడం కుదరదని చెప్పాను. అనేక విధాలుగా వేడుకున్నారు. అయినా తక్కెడ పైకి లేవలేదు. “సాధ్యం కాదు” అన్నాను. “మేము ఎవరమో కాస్త చూడండి” అని ఒక విజిటింగ్ కార్డ్ నా ముందు పెట్టారు. దాని నుండి ‘హసిద హులి (ఆకలిగొన్న పులి)’ అనే పత్రిక సంపాదకులని తెలిసింది. “ఆకలిగొన్న పులి ముందు ఒక సింహం కూర్చుని ఉంది. తెలుసా మీకు?” అన్నాను. “నమస్కారం సార్. వస్తాము” అని నవ్వుతూ వెళ్ళిపోయారు.

మూడు సంవత్సరాల క్రితం మా హైస్కూలు పక్కనే ఉన్న నీటి సరఫరా కార్యాలయానికి సంబంధించిన ఉద్యోగి కొడుకుకు హైస్కూలులో సీటు ఇవ్వలేదని స్కూలుకు సుమారు ఒక నెలరోజుల పాటు నీళ్ళు నిలిపివేశారు. నీళ్ళు ఆపివేసినప్పుడు దానికీ సీటుకూ సంబంధం ఉందని తోచలేదు. నీళ్ళు ఆపివేయడానికి ఒకటి రెండు కారణాలను ముందుపెట్టారు. సమగ్రంగా పరిశీలించిన తరువాత మా స్కూలుకు వచ్చే నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసింది సీటు ఇవ్వకపోవడం అని అర్థమయ్యింది. చివరకు ఏదో సాకు చెప్పి ముఖ్యమైన కారణాన్ని దాచిపెట్టి నీళ్ళు వదిలారు. అయినా సీటేమీ ఇవ్వలేదు.

అనుమానం

1987లో నాకు అల్సర్ బాధ ఎక్కువై శస్త్రచికిత్స కోసం బెంగళూరులో ఉన్న రిపబ్లికన్ నర్సింగ్ హోమ్‌లో చేరాను. ఉదయం సుమారు 11 గంటలకు ఆపరేషన్. దానికన్నా సుమారు గంట ముందు శస్త్రచికిత్సకు కావలసిన ముందస్తు పనులన్నీ చేసుకుని యజ్ఞపశువులా ఆపరేషన్ థియేటర్‌కు వెళ్ళడానికి తయారై చక్రాల కుర్చీలో కూర్చుని ఉన్నాను. సరిగ్గా అప్పుడు ఒక అపరిచితుడు వచ్చి ఒక ఉత్తరాన్ని ఇచ్చారు. అది మా బసవనగుడి కాలేజీలో మొదటి సంవత్సరం ప్రియూనివర్సిటి ప్రవేశానికి సంబంధించినది.

మా కాలేజీ శ్రేయోభిలాషుల నుండి వచ్చిన సిఫారసు లేఖ అది. దానిని చదువుకుని “దయచేసి నాలుగైదు రోజుల తరువాత రండి. ఆ తరువాత మాట్లాడుకొందాం. ఇప్పుడు ఆపరేషన్‌కు సిద్ధంగా ఉన్నాను” అన్నాను. “లేదు సార్, దయచేసి ఇప్పుడే ఇచ్చేయండి” అని ఒక విధమైన ఆత్రంతో అడిగారు. ఆపరేషన్ అయిన తరువాత నేను బ్రతికివస్తానో లేనో అని వారికి అనుమానం. వారి ఆందోళన తెలుసుకుని “ఏమీ ఆలోచించకండి. శస్త్రచికిత్స ముగించుకుని సజీవంగానే వస్తాను. నాది గట్టిపిండం. ఇంత త్వరగా పోను. తరువాత రండి” అని చెప్పాను. దానికి వారు “ఛీ,ఛీ అలాంటి ఆలోచన, అనుమానం ఏమీ లేదు సార్. శస్త్రచికిత్స విజయవంతంగా ముగించుకుని తిరిగి రండి. ఏమో ఇప్పుడే ఇస్తే బాగుండేది. ఫరవాలేదు. తరువాత వస్తాను” అని చెప్పారు. తరువాత వచ్చారు, సీటూ ఇచ్చాను.

హామీ

ఒక రోజు ఉదయం లాల్‌బాగ్ వాకింగ్ ముగించుకుని హాస్టల్‌కు వచ్చాను. నా గది ముందు ఒక స్త్రీ, ఒక కుర్రవాడు నిలుచుని ఉన్నారు. విషయం అర్థమయ్యింది. గుండె కొట్టుకోవడం ఎక్కువయ్యింది.

తాళం తీస్తూ “ఏమమ్మా వచ్చావు” అని సాంప్రదాయకంగా అడిగాను. “కొడుకుకు 8వ తరగతిలో సీటు ఇవ్వాలి” అని అడిగారు. “దయచేసి క్షమించండి. కుదరదు” అన్నాను. ఈ సంభాషణ కొనసాగుతుండగానే ఆమె ఏడ్చడానికి మొదలు పెట్టారు. యథేచ్ఛగా ఏడ్చారు. కాలు పట్టుకోవడానికి వచ్చారు. “దయచేసి ఇలా చేయవద్దమ్మా, మీరు ఏమి చేసినా సీటు ఇవ్వడానికి సాధ్యం కాదు” అన్నాను. అంతగా ఇబ్బంది పెట్టినవారు చాలా తక్కువ. ఇంటిలోని సమస్యలంతా ఏకరువు పెట్టారు. మొగుడు తనను విడిచిపెట్టి వెళ్ళాడని గోడు వెళ్ళబోసుకున్నారు. నేను ఏమి చెప్పినా ఎంత సమాధానం చేసినా ఆవిడ వినలేదు. 20-25 నిమిషాలు ఈ సంకటాన్ని అనుభవించాను. ఒక్కొక్క నిముషం ఒక్కొక్క యుగమయ్యింది. ఎంతెంతో చెప్పి చూశాను. ఆవిడ తగ్గలేదు. చివరకు ఒక పరిషారం తట్టింది. “చూడమ్మా, ఎస్.ఎస్.ఎల్.సి. ముఖ్యం కాదు. దానిలో ఎన్ని మార్కులు వచ్చినా మెడికల్ లేదా ఇంజనీరింగ్‌కు సంబంధం లేదు. పి.యు.సి. ముఖ్యం. కాబట్టి ఇంకా మూడు సంవత్సరాలు అయిన తరువాత రామ్మా. నీ కొడుకుకు పి.యు.సి.లో సీటు ఇస్తాను” అన్నాను. ఏడుపు కొంత తగ్గింది. నాకు ధైర్యం వచ్చింది. దాన్నే ఒత్తి ఒత్తి చెప్పాను. “మూడు సంవత్సరాల తరువాత తప్పక సీటు ఇస్తారా సార్” అని అడిగారు. “ఖచ్చితంగా ఇస్తానమ్మా” అన్నాను. సంతృప్తిగా వెళ్ళారు. నేను నెమ్మదిగా నిట్టూర్చాను. ఆవిడను మోసం చేయాలనే ఉద్దేశంతో నేను అలా చెప్పలేదు. నేను మూడు సంవత్సరాలు బ్రతుకుతానని ఆమె ఏ ధైర్యంతో నమ్మారో నాకు తెలియదు. ఆ వైపుకు ఆమె దృష్టి పోలేదని అనిపిస్తుంది. మూడు సంవత్సరాలలోపు అకస్మాత్తు యముడు వస్తే “అప్పా, ముందుకు వెళ్ళప్పా. ఒక అబలకు మూడు సంవత్సరాల తరువాత ఆమె కొడుకుకు సీటు ఇస్తానని మాటిచ్చాను. చివరి దశలో ఇచ్చిన మాట తప్పడం నాకు ఇష్టం లేదు. కొంచెం నీవు నిరీక్షిస్తే కొంపలేమీ అంటుకోవు” అని యముడిని నచ్చచెప్పి పంపడానికి ప్రయత్నిస్తాను. ఆ యముడు నాకేమి బదులిస్తాడనేది ఆ సమయంలో అతని చిత్తం (Mood) ఎలా ఉంటుదో దాని మీద నా మరియూ ఆ విద్యార్థి భవిష్యత్తు ఆధారపడివుంటుంది.

అడ్మిషన్ సీజన్ అంటే తల్లిదండ్రులకు కష్టం, విద్యాసంస్థలకూ కష్టం. తల్లిదండ్రులు తమ పిల్లల సీటుకోసం ఒక స్కూలు నుండి మరో స్కూలుకు, ఒక కాలేజీ నుండి మరో కాలేజీకి ఎంతో ఆందోళనతో తిరగడం చూస్తే నాకు అయ్యో అనిపిస్తుంది. నాకైతే ఈ అడ్మిషన్ సీజన్ (మే, జూన్, జూలై నెలలు) ఒక విధమైన సింహస్వప్నం. ఎంతమందికి చెప్పాలి. ఎంత అని చెప్పాలి. ఎంతమందికి సమాధానం ఇవ్వాలి. మాట్లాడి మాట్లాడి అలసిపోతాను. సీటు అడగడానికి వచ్చినవారి సమస్య ఒక రకంగా స్వల్పమైనది. ఒక్కొక్కరికి ఒక్కొక్క సీటే కావలసింది. అయితే నాకు లెక్కలేనన్ని. 200 మందికి సీటు ఇస్తే సుమారు 2500 మందికి సీటు ఇవ్వడానికి కుదరదు. అంటే 2500 మంది విద్యార్థుల, 5000 మంది తల్లిదండ్రుల, వందలాది మంది అవ్వ, తాత ఇంకా బంధువుల శాపం ఏటేటా నాకు తప్పింది కాదు. ఇలా సుమారు 40-45 సంవత్సరాల నుండి ఈ శాపకూపంలో మునిగిపోయాను. ప్రతి యేడు ఈ ప్రవేశాల అవాంతరం గడిస్తే నాకు పునర్జన్మ ఎత్తినట్లవుతుంది.

కో-ఎడ్యుకేషన్

కో ఎడ్యుకేషన్ నాకేమీ సమస్య కాలేదు. అందరూ స్నేహితులలాగే వ్యవహరించేవారు. అయినా ఒకటి రెండు తమాషా సంఘటనలను తెలుపడానికి ఇష్టపడతాను.

ఒక చిన్నపిల్ల కాలేజీకి ‘స్కర్ట్’ వేసుకుని వచ్చే దాన్ని కాలేజీ అధ్యాపకులు ఆక్షేపించారు. ఆ పిల్ల చాలా చిన్నపిల్ల. దానిని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదని అధ్యాపకులకు చెప్పాను. ఇది చిన్న విషయమని ఉదాసీనంగా ఉంటే రేపు మేడంలు కూడా స్కర్ట్ వేసుకుని రావచ్చు అని వాదించారు. “సరేనప్పా. వారి తల్లిదండ్రులకు చెప్తాను” అని ఫోన్ చేశాను. వారి తల్లి ఫోన్ ఎత్తారు. చాలా సంకోచంతో ఈ విషయాన్ని తెలిపాను. “తెలిసిందిలెండి సార్” అన్నారు. మరుసటి రోజు నేను క్లాసుకు అటూఇటూ చూడకుండా నేరుగా వెళుతున్నాను. పక్కనే పోతున్న ఒక అమ్మాయి “నమస్కారం సార్” అని నవ్వుతూ చెప్పి నా దృష్టిని ఆకర్షించింది. “నమస్కారమమ్మా” అంటూ ఆ అమ్మాయి వైపు చూసినప్పుడు స్కర్ట్‌కు బదులుగా చీర కట్టుకుని ఉంది. నాకూ నవ్వు వచ్చింది.

ఎందుకు కలిసి వెళ్ళకూడదు?

ఒక క్లాసులో విద్యార్థీ విద్యార్థినులు తరగతిలో, బయటా ఎలా ఉండాలనే విషయం పై చర్చ నడిచింది. బస్సులో, ఇంకా కొన్ని సందర్భాలలో కూర్చొనే విధంగా క్లాసులో విద్యార్థినీ విద్యార్థులు ఒకే డెస్క్‌పై ఎందుకు కూర్చోరాదు? స్నేహితుల్లాగా కలిసి హోటల్‌కు ఎందుకు వెళ్ళరాదు? చెల్లెలిగా భావించి కలిసి ఎందుకు సినిమాకు పోరాదు? ఇవి ఆ విద్యార్థుల కొన్ని ప్రశ్నలు. “ఎందుకు పక్కపక్కనే కూర్చోరాదు, ఎందుకు కలిసి హోటల్‌కు వెళ్ళరాదు అనే ప్రశ్నలకు నా వద్ద సమాధానం లేదు. అయితే ఇంకొక ఆడపిల్లను ప్రయాసతో చెల్లెలు అని భావించి ఆ విద్యార్థినితో సినిమాకు వెళ్ళే బదులు మీ చెల్లెలు జతలోనే సినిమాకు వెళ్ళడం మేలు” అన్నాను. అప్పుడు క్లాసు క్లాసంతా ఘొల్లున నవ్వింది. ఆ బాతాఖానీకి తెరపడింది.

(♦ అనువాదకుల నోట్: ఇతని పేరు పేర్కొనలేదు కానీ ఇతని పేరు టి.ఎస్.రంగా. ప్రముఖ కన్నడ, హిందీ చలనచిత్ర దర్శకుడు. గీజగన గూడు, సావిత్రి మొదలైన కన్నడ సినిమాలకు, గిద్ద్, ఉద్భవ్ లాంటి హిందీ సినిమాలకు దర్శకత్వం వహించాడు. గిద్ద్ సినిమాను దర్శకత్వం వహించినందుకు 1984లో ఇతనికి భారత జాతీయ చలనచిత్ర ప్రత్యేక జ్యూరీ పురస్కారం లభించింది.)

(సశేషం)

Exit mobile version