Site icon Sanchika

‘పోరాట పథం’ – డాక్టర్ హెచ్.నరసింహయ్య ఆత్మకథ -17

[ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది డాక్టర్ హెచ్.నరసింహయ్య గారి ఆత్మకథ అనువాదాన్ని అందిస్తున్నారు శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్.]

బెంగళూరు సోషియల్ సైన్స్ ఫోరం

[dropcap]వి[/dropcap]జ్ఞానం ఎంత ముఖ్యమో సామాజిక విజ్ఞానమూ అంతే ముఖ్యం. ఈ అవగాహన నాకు చాలా సంవత్సరాల ముందు నుండే ఉంది. అందువల్ల బెంగళూరు సైన్స్ ఫోరం మాదిరిగా బెంగళూరు సోషియల్ సైన్స్ ఫోరం స్థాపించడానికి ప్రయత్నించాను. అయితే సరియైన, నిష్ఠ కలిగిన కార్యకర్తలు లభించక పోవడం వల్ల ఈ ప్రయత్నాన్ని వాయిదా వేశాను. చివరకు నాలుగు సంవత్సరాల క్రితం ఇలాంటి ఒక సంస్థను ప్రారంభించడానికి అన్ని అనుకూలాలు కలిగింది. ఈ సంస్థ కూడా నేషనల్ కాలేజీ ఆవరణలోనే ఉండి సైన్స్ ఫోరం లాగే కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నది. అర్థశాస్త్రం, సామాజిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం, విద్య, సంస్కృతి, కళలు మొదలైన విషయాలపై నెలకు రెండు ఉపన్యాసాలు ఉంటాయి. 1991లో ప్రారంభమైన ఈ సంస్థ ఇంతవరకూ ఉపన్యాసాలను విజయవంతంగా ఏర్పాటు చేసింది. గుల్బర్గా విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి అయిన డా. కె.హెచ్.చలువ రాజ్ గారు దీనికి అధ్యక్షులుగా ఉన్నారు.

నీతి మరియు ఆరోగ్యవిద్య

మొదటినుండీ నేను పాఠ్యపుస్తకాలలో లేని, జీవితానికి ఉపయోగపడే విషయాలను సందర్భోచితంగా తరగతులలో చెప్పేవాడిని. విద్యను రెండు భాగాలుగా చేయవచ్చు. ఒకటి జీవనోపాధికై విద్య (Education for livelihood). రెండవది జీవితానికై విద్య (Education for Life). జీవనోపాధికై కావలసిన చదువు చాలా భాగం మన సాంప్రదాయిక విద్య(Formal Education) నుండి లభిస్తుంది. అయితే జీవిత విద్యకు పాఠ్యపుస్తకాలు అంతగా సహకరించవు. నా అభిప్రాయం ప్రకారం జీవనోపాధికై కావలసిన విద్య ఎంత ముఖ్యమో జీవిత విద్య కూడా అంతే ముఖ్యం. ఒకవిధంగా దానికన్నా ఎక్కువ ముఖ్యం. అది నేను మొదటి నుండీ గమనించాను. అందుకే అలాంటి విషయాలను తరగతులలో ప్రస్తావించేవాణ్ణి.

నాకు తెలిసినంత వరకూ నేను తరగతులలో చెబుతున్న పాఠ్యేతర విషయాలపై విద్యార్థులకు ఎక్కువ ఆసక్తి ఉండేది. ఇలాంటి జీవిత విద్యకు ఒక వ్యవస్థాగతమైన స్వరూపాన్ని ఇవ్వాలనే దృష్టితో కాలేజీలో నీతి మరియు ఆరోగ్య విద్య (Moral and Health Education) ప్రణాళికను సమాలోచన చేసి 1965లో ప్రవేశ పెట్టాము.

ఇది ధార్మిక శిక్షణ కాదు. నీతి, నడవడిక, మానవీయ విలువలు, సమాజ సేవ, ఆరోగ్య విజ్ఞానం, సాహిత్యం, సమాజ విజ్ఞానం మొదలైన జీవితానికి చాలా దగ్గరగా ఉన్న విషయాలపై ఉపన్యాసాలను ఏర్పాటు చేసే ఈ ముఖ్యమైన విద్యా కార్యక్రమాన్ని 1965లో మొదలు పెట్టాము. ఇది విద్యార్థులందరికీ అన్వయించినది. అయితే దీనిని ప్రభావవంతంగా నడపాలనే దృష్టితో కాలేజీ విద్యార్థులను వారి క్లాసుల ఆధారంగా ఆరేడు విభాగాలుగా వర్గీకరించాము. ఒక్కొక్క విభాగానికి వారానికి ఒక ఉపన్యాసం ఉండేది. ఇది కూడా టైమ్‌టేబుల్‌లో ఒక భాగమై ఉంది. విద్యార్థులకు హాజరు తప్పనిసరి చేయలేదు. చేయడానికి కుదరలేదు. అయితే హాజరు సంతృప్తికరంగా ఉండేది. హాజరు ఉపన్యాసకులపై, వారు మాట్లాడే అంశాలపై ఆధారపడి ఉండేది. ప్రొ. జి. పి. రాజరత్నం గారి క్లాసులకు 95 శాతంకన్నా ఎక్కువ విద్యార్థులు హాజరయ్యేవారు. రామకృష్ణాశ్రమం స్వామీజీలు, ప్రొ. జి. పి. రాజరత్నం, ప్రొ. జి. ఎస్. శివరుద్రప్ప, ప్రొ. ఎ. ఎన్. మూర్తిరావ్, ప్రొ. ఎస్. కె. రామచంద్రరావ్, డా. ఎస్. ఎస్. జయరాం, డా. అనుపమానిరంజన్, డా. వి. పరమేశ్వర, డా. ఎం. వి. కృష్ణారావు మొదలైన తమ తమ రంగాలలో ఖ్యాతి గడించిన ప్రసిద్ధులు ఈ తరగతులను తీసుకునేవారు. ప్రొ. జి. పి. రాజరత్నం గారు ‘మానం – మర్యాద’ అనే అంశంపై ఉపన్యాస పరంపరను కొనసాగించారు. దాన్ని వారు ఒక పుస్తకంగా కూడా ప్రకటించారు.

లైంగిక విద్య

ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినీ విద్యార్థులకు ఒక రకమైన లైంగిక విద్యను ఇవ్వడం యుక్తమనిపించింది. చాలా ఆలోచించాము. లైంగిక విద్య అంటే మనలో వివిధమైన భావనలు, అభిప్రాయాలు కలుగుతాయి. పైగా దీని గురించి ఏమి చెప్పాలి? ఎలా చెప్పాలి? అనేది ముఖ్యం. కూలంకషంగా నిపుణులతో చర్చించిన తరువాత దీనికోసం విద్యార్థులను, విద్యార్థినులను వేరుచేసి విడివిడిగా వారికి సంబంధించిన అవసరమైన విషయాలను చెప్పాలని నిర్ణయించాము. పేరుమోసిన వైద్యులు, సాహితీవేత్తలు అయిన డా. అనుపమా నిరంజన్, ప్రఖ్యాత మానసికవైద్యులు డా. ఎస్. ఎస్. జయరాం వరుసగా విద్యార్థినులకు మరియు విద్యార్థులకు ఉపన్యాసాలిచ్చారు. డా. అనుపమా నిరంజన్ గారు ఇచ్చిన ఉపన్యాసాలను కాలేజీ ‘కేళు కిశోరి ‘ (వినుము బాలికా) అనే పుస్తక రూపంలో ప్రకటించింది. కేళు కిశోరి, మాన – మర్యాదె పుస్తకాలు విద్యార్థులలోనే కాదు మిగిలిన వారిలో కూడా ఎక్కువ ప్రాచుర్యం పొందింది. లైంగిక విద్యను విద్యార్థులకు చెప్పే విషయంలో నేటికీ దేశంలో చర్చ నడుస్తూ వుంది. ఇది సున్నితమైన అంశం. ఎవరు చెప్పాలి ఎలా చెప్పాలి అనేదానిని కూలంకషంగా చర్చించడం అవసరం. మేము ఈ అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాము. మన రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఇలాంటి ముఖ్యమైన విద్యాకార్యక్రమాన్ని మొదలు పెట్టాము. విద్యార్థి, విద్యార్థినుల ప్రతిక్రియ ఆరోగ్యకరంగా ఉంది. ఇద్దరు ముగ్గురు తల్లిదండ్రులు వచ్చి ఈ కార్యక్రమాన్ని బాగా మెచ్చుకున్నారు. “ఇలాంటి సున్నితమైన విషయాలను మా పిల్లల దగ్గర మేము మాట్లాడటానికి కుదరదు. అదీకాక మాకు వైజ్ఞానికంగా ఈ విషయాలు తెలియవు కూడా. మీరు మంచి పని చేస్తున్నారు. వందనాలు. మా పిల్లలకు దీనివల్ల ఉపయోగముంటుంది” అని చెప్పారు. దీనికి సంబంధించిన వారందరికీ సంతోషమయ్యింది.

నీతి మరియు ఆరోగ్య విద్య ప్రణాళికను అందరూ స్వాగతించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు (ఇలాంటి వారే ఎక్కువ ఉన్నారు) దీని నుండి ఎక్కువ తెలివిడిని, జ్ఞానాన్ని పొందారు. ఈ ప్రణాళికను మొదలు పెట్టిన రోజు నుండి చివరివరకూ ఏ కారణంవల్ల నైనా ఒక్క క్లాసూ తప్పకుండా నడిపాము. సాంప్రదాయిక తరగతులు అక్కడక్కడ తప్పాయి కానీ ఇది మటుకు అక్షరాలా ఒక్క రోజూ తప్పలేదు. మాకు ఇలాంటి వ్యవస్థ చేయడానికి చాలా శ్రమ అయినా, విద్యార్థులకు నిజంగానే ఉపయోగమవుతుందనే వెలుగులో మా శ్రమ మంచులా కరిగిపోయేది. తగ్గని ఉత్సాహంతో పని చేశాము.

నీతి విద్య అమలు

నీతి నడవడికలను బోధించడం సులువు. అయితే వాటిని అమలు పరచడం కష్టం. అందువల్ల నీతి మరియు ఆరోగ్య తరగతులలో నేర్చుకున్నదానిని జీవితంలో అమలు చేయడం మంచిదని ఆలోచన కలిగింది. ఎప్పుడూ మా కాలేజీ కొత్త కొత్త ప్రణాళికల గురించే ఆలోచించేవాడిని. నాకు ఇల్లూ లేదు, మఠమూ లేదు. కొంచెం తప్పు చెప్పాను. మఠమే నా ఇల్లు కూడా. విద్యార్థులు నీతి ఆరోగ్యా పాఠాల నుండి నేర్చుకున్న గుణాలను గీటురాయితో గీచి ప్రయోగం చేయాలనిపించింది.

అమెరికాలో ఉన్నప్పుడు అక్కడి ప్రజలు, విద్యార్థులు తమ దైనందిన జీవితంలో నిజాయితీగా నడుచుకోవడాన్ని నేను కళ్ళారా చూశాను. రోడ్డు పక్కన వార్తా పత్రికలు, ఒక హుండీ. చూసుకునేవారు ఎవరూ లేరు. కావలసిన పేపర్ తీసుకుని వేయవలసిన డబ్బులు హుండీలో వేసేవారు. బస్ ఎక్కే ప్రయాణీకులు అక్కడున్న హుండీలో ఎంత డబ్బులు వేయాలో అంత వేసి లోపలికి వెళ్ళి కూర్చునేవారు. దాన్ని ఎవరూ పరీక్షించేవారు కాదు. అంగడి లోపలికి వెళ్ళి తమకు కావలసిన సామాన్లను తీసుకుని అంగడి ముందుకు వచ్చి బిల్ చేయించుకుంటారు. ఫోన్ చేస్తే ఇంటికి కావలసిన సరుకులను అంగడి వారే తెచ్చి ఇంటికి తాళం వేసివుంటే బయట పెట్టి వెళ్ళిపోతారు. అలాగే ప్రొద్దున పాల సరఫరా కూడా. ఇవన్నీ నా మనసు పై ఎక్కువ ప్రభావాన్ని చూపాయి. దానికి విరుద్ధంగా మన దేశంలోని పరిస్థితి కూడా జ్ఞాపకం వస్తూ ఉండేది.

వీటన్నిటి నేపథ్యంలో విద్యార్థుల నిజాయితీని పరీక్షించే కొన్ని కార్యక్రమాలు నా దృష్టికి వచ్చాయి. అధ్యాపకులు సంతకం చేయనవసరం లేదనే ప్రయోగాన్ని 1961లోనే మొదలుపెట్టాము. ఆ ప్రయోగం విజయవంతమయ్యింది. అధ్యాపకులు తమ నిజాయితీని, మర్యాదను నిలుపుకొనడం సంతోషకరమైన విషయం. నేను ప్రిన్సిపాలైన 12 ఏళ్ళూ అధ్యాపకుల హాజరును వారి ఆత్మసాక్షికే వదిలివేశాను.

పర్యవేక్షణ లేకుండా పరీక్షలు

మొదటే చెప్పినట్లు అజమాయిషీ అపనమ్మకాన్ని సూచిస్తుంది. మన దేశంలో తనిఖీ లేకుండా ఏ పనీ జరగదు. పనివారికంటే పర్యవేక్షకులే ఎక్కువ. క్రింది వాడిపై అతని పైవాడికి నమ్మకం లేదు. అతడి మీద అతడి పైవాడికి నమ్మకం లేదు. ఇలా మనది అపనమ్మకపు నిచ్చెన లాంటి సమాజం. ఐ.ఎ.ఎస్. వంటి జాతీయస్థాయి పరీక్షలకూ ఇది వర్తిస్తుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులై అసిస్టెంట్ కమీషనర్ లేదా దానికి సరిసమానమైన గౌరవప్రదమైన పదవిని పొంది ప్రతిష్ఠాత్మకమైన అధికారులౌతారు. అలాంటి వారిని కొన్ని నెలల క్రింద నమ్మదగిన వారు కాదు అని ఈ వ్యవస్థ తీర్మానించి కఠిన పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ అసంబద్ధమైన, అవమానకరమైన పద్ధతి గురించి ఆలోచించి మా విద్యార్థులకు పర్యవేక్షణ లేకుండా పరీక్షలను నిర్వహిద్దామని నిర్ణయించాము. మొదట ఈ విషయాన్ని మా అధ్యాపకుల సంఘంలో ప్రస్తావించాను. వారికి ఇటువంటి నా ఆలోచనలు అన్నీ ముందే తెలుసు. అధ్యాపకులు ఈ కొత్త ప్రయోగాన్ని విజయవంతం చేయడానికి సంపూర్ణ మద్దతు తెలిపారు.

అధ్యాపకులు ఇచ్చిన భరోసాతో నేను ఒక్కొక్క తరగతికీ వెళ్ళి విద్యార్థులను ఉద్దేశించి, ఈ ప్రణాళిక ప్రాముఖ్యతను వివరంగా, సోదారహణంగా చెప్పాను. “బయటి పర్యవేక్షకులను (External Supervisors), కాపలాదారుల్నీ విద్యార్థులు మోసం చేయవచ్చు. అలాగే జీవితంలోని అన్ని రంగాలలోనూ వారి పై అధికారులను మోసం చేయవచ్చు. ఇన్‌కమ్ టాక్స్ అధికారులను మోసం చేయవచ్చు. అయితే మన లోపల సదా మనలను కాపలా కాచే ఆత్మసాక్షిని ఎవరూ ఎప్పుడూ మోసం చేయలేరు. అందువల్ల మీరు విద్యార్థులుగా ఉన్నప్పుడు, పెద్దయ్యాక ఆత్మసాక్షికి భయపడి, ఆత్మసాక్షి చెప్పినట్లు మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోండి. ఈ పరీక్షలలో పర్యవేక్షకులు ఉండరు. అప్పుడు మీరు మోసం చేయవచ్చు. కాపీ కొట్టవచ్చు. అలా చేస్తే మీరు పర్యవేక్షకులను మోసం చేయరు. ఎందుకంటే వారు అక్కడ ఉండరు కాబట్టి. అంటే మీరు మిమ్మల్నే మోసం చేసుకున్నట్టు అవుతుంది. ఆత్మద్రోహం చేసుకున్నట్టు అవుతుంది..” ఈ విధంగా నా మాటలు సాగేవి. విద్యార్థులను కళవళంతో మనవి చేసుకున్నాను. వారి పేర్లు నాకు తెలుసు. 80, 90 శాతం విద్యార్థులు నాకు దగ్గరి నుండి తెలుసు. వారికంతా నాపైన చాలా నమ్మకం ఉంది. సమాధాన పత్రాలపైన పర్యవేక్షణ లేని పరీక్షలకు సంబంధించిన కొన్ని సూచనలను ముద్రించాము. వాటిలో ఆత్మసాక్షి ప్రకారం నడుచుకోండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు అనే అంశాలకు ప్రాధాన్యత ఇచ్చాము. ప్రశ్నాపత్రాలను పంచి, మిగిలిన ప్రశ్నపత్రాలను, ఎక్కువగా కావలసిన ఖాళీ పేపర్లను (Additional sheets) టేబుల్‌పై పెట్టి బయటకు వచ్చి, సమయం గడచిన తరువాత సమాధానపత్రాలను సంగ్రహించుకుని రావాలి అని తీర్మానించుకున్నాము.

వార్తాపత్రిక మొదటి పేజీపై

అందరు అధ్యాపకులు ప్రశ్నాపత్రాలను పంచి లోపలి హాలులోకి వచ్చారు. మేమంతా అంటే 15-20 మంది అధ్యాపకులు కూర్చుని లోకాభిరామాయణంగా మాట్లాడుకుంటున్నాము. అంతలోనే సరిగ్గా ‘ప్రజావాణి’ పత్రికలో పేరుమోసిన ఛాయాగ్రాహకులైన శ్రీ టి. ఎల్. రామస్వామి గారు తమ విల్లంబులు (కెమెరా మొదలైనవి) పట్టుకుని మా లోపలి హాలులోనికి వచ్చారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. విద్యార్థులకు మినహాయించి ఈ విషయాన్ని మేము ఎవరికీ చెప్పలేదు. “ఎందుకు వచ్చారు” అని వారిని అడిగాను. “టి. ఎస్. ఆర్. (టి. ఎస్. రామచంద్రరావ్ – ప్రజావాణి సుప్రసిద్ధ సంపాదకులు) పంపారు. మీ వద్ద పరీక్షల విషయంలో కొత్త ప్రయోగం ప్రారభించారట. పర్యవేక్షణ లేకుండా క్లాసురూములో సమాధానాలు వ్రాస్తున్న విద్యార్థుల ఫోటో తీసుకుని రమ్మని పంపించారు” అన్నారు. టి.ఎస్.ఆర్. గారి దగ్గరి సంబంధీకులు ఎవరో మా కాలేజీలో విద్యార్థిగా ఉన్నారట. అతని మూలకంగా ఈ నూతన ప్రయోగం గురించి వారికి తెలిసింది. “మేము ఎవరమూ రాము. మీరే క్లాస్‌రూములోనికి వెళ్ళి స్వయంగా చూసి ఫోటో తీసుకోండి” అన్నాను. ఫోటో తీసుకుని 10-15 నిమిషాల తరువాత వచ్చారు. “నేను క్లాసురూమ్‌లో ప్రవేశించడానికి ముందు కిటికీగుండా విద్యార్థులను గమనించాను. తలవంచుకుని అటూ ఇటూ చూడకుండా చాలా ఏకాగ్రతతో పరీక్షలు వ్రాస్తున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. సంతోషం అయ్యింది. లోపలికి పోయి నేను ఫోటో తీసుకున్నప్పుడూ ఎవరూ దీని కోసం తలెత్తి పోజ్ ఇవ్వలేదు. తమ పనిలో నిమగ్నమై ఉన్నారు” అంటూ మెచ్చుకోలు మాటలతో మమ్మల్ని అభినందించారు. ఆ అభినందనలు విద్యార్థులకు చెందాలని చెప్పాను. ఆపైన వారు ఈ పరీక్షకు సంబంధించిన పూర్వోత్తరాలను మమ్ములను అడిగి తెలుసుకుని వ్రాసుకొని వెళ్ళారు. మరుసటి రోజు ఉదయం ‘ప్రజావాణి’ మొదటి పేజీలో సచిత్ర వార్తా కథనంగా వచ్చింది. ఇది విద్యారంగంలోనే కాదు మిగిలిన రంగాలలో ఒక కోలాహలాన్ని రేకెత్తించింది. పరీక్షలు గొప్ప విజయాన్ని సాధించింది. అక్కడొకరు, ఇక్కడొకరు కాపీ కొట్టి ఉండవచ్చు, మోసం చేసివుండవచ్చు.

ఈ ప్రయోగంతో పాటు ప్రత్యేకంగా ప్రతి యొక్క అధ్యాపకుడు తమ తమ తరగతులలో తనిఖీ లేని లఘు పరీక్షలను నిర్వహించే ప్రయత్నం చేశాము. దానికోసం కవర్లలో ప్రశ్నాపత్రాలను ఉంచి వాటిని సీల్ చేసి ఒక్కో విద్యార్థికి ఒక్కో కవరును పంచాము. సాధారణంగా లఘుపరీక్షల వ్యవధి ఒక గంట. విద్యార్థులు ఆ కవరును ఇంటికి తీసుకువెళ్ళి ఆ రోజు రాత్రి కవరును చింపి పుస్తకం నుండి కాపీ కొట్టకుండా ఒక గంటలో ఎవరి సహాయమూ తీసుకోకుండా వాటికి సమాధానాలు వ్రాసి మరుసటి రోజు ఉదయం తమ ఉపాధ్యాయులకు అందించాలి. ఇక్కడ కూడా పర్యవేక్షణ ఉండదు. తనకు తానే పర్యవేక్షకుడు. ఈ పర్యవేక్షణ లేని పరీక్షలను మా మిగిలిన విద్యాసంస్థలలో నడపడానికి ప్రయత్నించాము.

మోసం చేసే అవకాశం ఉన్నా మోసం చేయకపోతే అతడు నిజంగా సత్యవంతుడు, నిజాయితీపరుడు.

నా బాస్కెట్‌బాల్, హాకీ ఆటలు

నేను మావూరిలో మిడిల్ స్కూలులో చదువుతున్నప్పుడు బ్యాడ్మింటన్ ఆడేవాడిని. కొన్ని రోజులు వాలీబాల్‌నూ ఆడాను. ఆపైన శ్రీరామకృష్ణాశ్రమంలో చదువుతున్నప్పుడు బాస్కెట్‌బాల్‌నూ ఆడటం మొదలు పెట్టాను. నేషనల్ కాలేజీలో అధ్యాపకుడైన తరువాత నేను బాస్కెట్‌బాల్‌, హాకీ క్రీడలను విద్యార్థులతో కలిసి ఆడటం మొదలుపెట్టాను. ఒకటి రెండు సంవత్సరాలలో ఈ ఆటలలో ఒకస్థాయికి చేరాను. మా మైదానంలో ప్రతిరోజు సాయంత్రం ఆడేవాడిని. రెండు ఆటలూ బిరుసైనవి. తగినంత సత్తువ ఉన్నవారు మాత్రం ఆడడం సాధ్యం. నిత్యమూ రెండు ఆటలను ఒకటి తరువాత ఒకటి ఆడేవాడిని. అవి నాకు ఎక్కువ వ్యాయామాన్నిచ్చేవి.

నిరంతర సాధనవల్ల రెండింటిలోనూ పెద్ద పెద్ద పోటీలలో ఆడే స్థాయికి చేరుకున్నాను. రెండింటిలోనూ మా వైపు గోల్ కాకుండా అడ్డుపడే రక్షణా స్థానం (Full Back) నాది. బాస్కెట్‌బాల్‌ ఆటలో ఐదుగురు ఆటగాళ్ళు. ముందు వరుసలో ముగ్గురు, వెనుక వరుసలో ఇద్దరు. ఆ ఇద్దరిలో నేను ఒకడిని. ఎదుటి జట్టు మావైపు వచ్చి గోల్ చేసే ప్రయత్నాన్ని అడ్డుకోవడం నా పని. అంతే కాకుండా చేతికి చిక్కిన బంతిని ముందు కాచుకుని ఉన్న మా ఆటగాళ్ళకు అందేలా విసరాలి. మా జట్టులో డి. ఎస్. భారద్వాజ్ ఉన్నారు. వారూ ఉపాధ్యాయులు. జాతీయస్థాయి ఆటగాడు. ఆజానుబాహువు. ఒక్కోసారి నేను మావైపు నుండి ఎదుటి జట్టు గోల్ సమీపంలో బంతి కోసం కాచుకుని ఉంటున్న భారద్వాజ్ గారికి చిక్కేలా బంతిని విసిరేవాణ్ణి. అది వారికి గోల్ చేయడానికి సహాయపడేది.

హాకీలో 11మంది ఆటగాళ్ళు. ముందు వరుసలో ఐదుగురు, మధ్య వరుసలో ముగ్గురు, చివరి వరుసలో ఇద్దరు, ఇంకా ఒక గోల్‌కీపర్. వెనుక వరుసలో ఉన్న ఇద్దరు ఆటగాళ్ళలో నేను ఒకడిని. మా స్థానంలో ఆడే ఆటగాళ్ళను Full Backs అని పిలుస్తారు. సరే, నాది అదే రక్షణ పనే. ఎదుటి జట్టు మా వైపు గోల్ చేయకుండా అడ్డుపడటం, దొరికిన బంతిని ముందు వరుసలో ఉన్న మావాళ్ళకు, ఎదుటి జట్టును తప్పించి, అందించడం నా పని. ఇది బాస్కెట్‌బాల్‌ కన్నా ఎక్కువ అపాయకరమైన ఆట. ఒక్కోసారి విసురుగా బంతిని కొట్టినప్పుడు గాలిలో ఎగిరిపోయే అవకాశం ఉంది. అలాంటి వేగంగా వస్తున్న బంతి అజాగ్రత్తగా ఉన్న ఆటగాడికి తగిలి గాయం కావచ్చు. లేదా విసిరిన హాకీస్టిక్ ఎదుటి ఆటగాడిపై పడి దెబ్బ తగలవచ్చు. లేదా హాకీస్టిక్ ఎదుటి ఆటగాడి కాళ్ళకు తగిలి అతడు క్రింద పడి గాయం కావచ్చు. మా జట్టులో ఉపాధ్యాయులైన శ్రీ కె. శ్రీనివాసన్ ఆడేవారు. వారు ఉత్తమస్థాయి క్రీడాకారులు. విద్యార్థిగా ఉన్నప్పుడు విశ్వవిద్యాలయపు హాకీజట్టుపైన, రాష్ట్రస్థాయి జట్లపైన ఆడాము. గెలిచేవారం కూడా. ఓడిపోవడమూ అపురూపమేమీ కాదు. రెండు ఆటల్లోనూ పూర్వార్థం ఉత్సాహంతో, కఠినంగా, ధృఢంగా ఆడేవాళ్ళం. ఉత్తరార్థంలో కొంచెం అలసిపోయేవాళ్ళం. ఆట ముగిసిన తరువాత మైదానం నుండి బయటకు వచ్చేటప్పుడు ఓడినా గెలిచినా నవ్వుతూ ఉండేవాళ్ళం.

సుఖదుఃఖే సమేకృత్వా

లాభాలాభౌ జయాజయౌ

అన్న కృష్ణుని గీతాశ్లోకంలోలా సుఖము – దుఃఖము, లాభము – నష్టము, గెలుపు – ఓటమి అన్నింటినీ సమానంగా తీసుకొనేవాళ్ళం. అయితే మా ప్రయత్నాన్ని పూర్తిగా, శ్రద్ధగా చేసేవాళ్ళం. “Not to win, but to participate” – పాల్గొనటం ముఖ్యం, గెలుపు కోసం కాదు అనే ఒలంపిక్ లక్ష్యాన్ని రచించడంలో బహుశా మా జట్ల మనోభావమే వారికి స్ఫూర్తిని ఇచ్చినట్లు కానవస్తోంది!

శ్రీరామనవమి నాడు ఎముక విరుపు

1956వ సంవత్సరం శ్రీరామనవమి పండుగరోజు మా కాలేజీ హాకీ జట్టుకు, ‘సిటీ హాకీ క్లబ్’ జట్టుకూ మా మైదానంలోనే పోటీ జరిగింది. నిర్ణీత అర్థకాలం వరకూ ఆట బాగానే సాగింది. ఏవైపూ గోల్ కాలేదు. ఆట ఉత్తరార్థం మొదలైన కొన్ని క్షణాలకే అవతలి జట్టు మాపై ఒక గోలు కొట్టారు. ఆటలో వేడి పెరిగింది. మా వైపు ముందు వరుసలో ఆడుతున్నవారు (Forwards) ఎదురుజట్టుపై బిరుసైన దాడిని మొదలుపెట్టారు. కొన్నిసార్లు ఎదుటి జట్టు గోల్ సమీపం వరకూ బంతి వెళ్ళింది. ఎదుటి జట్టుకు భయం వేసింది. వారివైపు కొందరినుండి కొంచెం మొరటు (Rough) ఆట మొదలయ్యింది. ఫలితంగా మా జట్టు నాయకుడు రాజగోపాల్ క్రింద పడి వారికి ఎముకలు విరిగివుండవచ్చు అనిపించింది. వారిని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. అయినా అధైర్యపడక మా జట్టునుండి దాడి కొనసాగింది. ఎదుటి జట్టువారు పట్టుదలతో మా దాడిని ఎదుర్కొంటున్నారు. ఇంకొన్ని నిమిషాలకు మా వైపు ఇంకో ఆటగాడు నేలకూలాడు. అతడినీ ఆసుపత్రికి తరలించారు. అయితే అదే స్కోరు. మాది సున్న గోలు, వారిది ఒక గోలు. ఇంకా ఆట ముగియడానికి 5-6 నిముషాలున్నాయి. అప్పుడు నాకు బంతి చిక్కింది. దాన్ని ముందుకి అలాగే ఒకరిద్దరు ఆటగాళ్ళను తప్పించుకుంటూ ఎదుటి గోలు వైపుకు వెళ్ళాను; సాధారణంగా వెనుక వరుస ఆటగాళ్ళు తామే బంతిని ముందు ముందుకు తీసుకుపోరు – తమ వైపు ఇంకొకరికి అందేటట్లు చేస్తారు. అయితే ఆరోజు నేను ముందు ముందు వెళ్ళి ఎదుటిజట్టు గోల్‌కు సమీపించాను. ఎదుటిజట్టుకు భయమయ్యింది. ఎక్కడ తమవైపు గోల్ అయ్యి రెండు జట్లు 1-1 స్కోరుతో డ్రా అవుతుందో అన్న భయం. ఇంక కొన్ని నిముషాలు అలాగే నిలువరించగలిగితే తామే గెలవవచ్చని వారి అభిప్రాయం. ఈ సందిగ్ధ సమయంలో నేను వారి గోల్‌ను సమీపించాను. అప్పుడు ఎదుటి జట్టుకు చెందిన ఒకరి హాకీస్టిక్ నా రెండు కాళ్ళమధ్య చిక్కుకొంది. ముందుకు పడ్డాను. ఎడమచేతికి గాయమయ్యింది. ఆసుపత్రికి పోవడం నా వంతయ్యింది. నాకన్నా ముందు గాయపడిన ఇద్దరు ఆటగాళ్ళు మంచాలపై పడుకున్నారు. మూడవ మంచం నాది. డాక్టర్ గారు వచ్చి విషయం తెలుసుకున్నారు. “ఏమిటండీ ఇది, ఐదైదు నిముషాలకొకరు ఎముకలు విరగగొట్టుకుని వస్తున్నారు. ఏమి ఆటండీ ఇది. కొట్లాట ఉన్నట్టుంది. ఇది ఇంగ్లీషు హాకీ కాదు. కన్నడ ‘హాకి’ ఉన్నట్టుంది” అని తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. నా ఎడమ చెయ్యి ఎముక పూర్తిగా విరుగలేదు. విక్టోరియా ఆసుపత్రిలో పేరుపొందిన డాక్టర్ ఆదికేశవులు గారు సుమారు 5 నిముషాలు నాకు తాత్కాలికంగా మత్తుమందు ఇచ్చి ఎడమ చెయ్యిని లాగి, సీదా చేయడానికి 10 రోజులు ప్రయత్నించారు. తరువాత ప్రొ. కె. వి. అయ్యర్ ద్వారా చేతిని తీడించుకొనమని చెప్పారు. వారు సుమారు 15 రోజులు చేతిని తీడిన తరువాత చెయ్యి యథాస్థితికి వచ్చింది. ఆటలో మేము 0-1 స్కోరుతో ఓడిపోయాము.

ఆటలో హాకీస్టిక్ వేసిన ఆటగాడు ఎం. కె. రాధాకృష్ణ మా కాలేజీ విద్యార్థి. మా కాలేజీ విద్యార్థి ఐనా ఇంకొక జట్టులో ఆడటానికి అభ్యంతరమేమీ లేదు. రాధాకృష్ణ చాలా మంచి పిల్లవాడు. నన్ను పడవేయాలని హాకీస్టిక్‌ను నా కాళ్ళ మధ్య వేయలేదు. అలా అకస్మాత్తుగా అయ్యింది. అయితే నేను పడిపోయి, ఆసుపత్రికి వెళ్ళడం రాధాకృష్ణ మనసుకు చాలా నొప్పి కలిగించింది. “దయచేసి ఏమీ అనుకోకండి సార్. అది అకస్మాత్తుగా జరిగింది. ఏమైనా ఈ అపాయం నావల్లనే జరిగింది. మీకు గాయమయ్యింది. క్షమించండి” అంటూ బాధపడ్డాడు. “అయ్యో, ఫరవాలేదు లేప్పా. ఆటలో ఇదంతా మామూలే” అని ఎంత చెప్పినా అతనికి నెమ్మది కాలేదు. అప్పటి నుండి ప్రతి శ్రీరామ నవమికి “ఈ రోజే మీ చేతిని విరుగగొట్టింది. దయచేసి క్షమించండి” అనే అర్థం వచ్చేటట్లు ఒక ఉత్తరం రాసేవారు. బెంగళూరులో ఉంటే వారే స్వయంగా వచ్చి తమ విషాదాన్ని ప్రకటించేవారు. పళ్ళు తెచ్చి యిచ్చేవారు. మరిచిపొమ్మంటే మరిచిపోయేవారు కాదు. నేను అమెరికాలో ఉన్నప్పుడు నాకు దీని గురించి ఉత్తరం వచ్చిందో లేదో జ్ఞాపకం లేదు.

దీనినిబట్టి రాధాకృష్ణగారి మనసు ఎంత మృదువైనదో తెలుస్తున్నది. సుమారు 39 యేళ్ళయినా వారు దానిని మరిచిపోలేదు. వారి పిల్లలూ మా కాలేజీలోనే చదివి ప్రతిభావంతులుగా నాలుగైదు సంవత్సరాల క్రితం ఉత్తీర్ణులైనారు.

సన్యాసి సంసారిగా మారిన వైనం

ఇంకొక సంఘటన. మా కాలేజీలో రసాయనశాస్త్ర విభాగంలో ఒక అధ్యాపకి ఉండేవారు. ఒక సంవత్సరం పాఠం చెప్పి విసుగు కలిగి (చాలామంది విద్యార్థులకూ విసుగు కలిగింది) ఉద్యోగం వదిలి పెట్టారు. వేసవి సెలవులయినా నేను యథాప్రకారం ఆఫీసులో కూర్చొని పనిచేస్తూ ఉన్నాను. ఒక రోజు ఆ మేడమ్ వచ్చారు. “కూర్చోండి మేడమ్” అన్నాను. కూర్చొన్నారు. “ముందు ఏమి చేస్తారమ్మా?” అని అడిగాను. “హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయాలని అనుకుంటున్నా సార్” అన్నారు. “ఏమమ్మా మీరు ఎం.ఎస్.సి. చదువుకున్నారు. పైగా సేవాదృక్పథం ఉన్నవారు. ఏదైనా సేవారంగాన్ని ఎన్నుకుని సమాజ సేవ చేయడం మంచిది” అన్నాను. తరువాత తమాషాగా “స్వార్థంతో మీరొక్కరే మోక్షం పొందితే ఎట్లా? మాకూ కొంచెం మోక్షాన్ని ప్రసాదించండి” అంటూ నవ్వాను. “లేదు సార్, తపస్సు చేయాలనే నాకు ఇష్టం సార్” అన్నారు. “సరే అమ్మా (మనసులో మీ ఖర్మ అనుకుని) మీ ఇష్టం” అన్నాను. ఇది ఆ సంఘటనలో ఒక భాగం.

ఇంకొక భాగం ఒక స్వామీజీకి సంబంధించినది. ఆ స్వామిగారు, ఒక ఆనందులు (రామకృష్ణాశ్రమానికి చెందినవారు కాదు). చాలా బాగా వీలైనంత వైజ్ఞానికంగా ఆధ్యాత్మిక విషయాలపై ఉపన్యసించేవారు. మా కాలేజీకి అనేకసార్లు ఆహ్వానించాము. గౌరీబిదనూరు కాలేజీకి కూడా వారిని పిలుచుకుని పోయాను. ఒకరోజు వారు మా బసవనగుడి కాలేజీలో ఉపన్యసిస్తూ “ప్రేమ – Love” గురించి ప్రస్తావించి ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు He fell in love లేదా She fell in love అని చెబుతారు. Falling in love అంటే ప్రేమలో క్రింద పడటం అనే అర్థం వస్తుంది. ఇది సభ్యమైన మాట కాదు. ప్రేమ ఎప్పుడూ పైకి లేపాలిగానీ క్రిందకు పడరాదు” falling in love అనేదాన్ని హేళన చేశారు. తరువాత “నేను ఏదో ఒక కాలేజీకి వెళ్ళాను. అక్కడ ఒక ఆకర్షణీయమైన దుస్తులు ధరించిన ఒక స్ఫురద్రూపియైన అమ్మాయి నన్ను ఒక ప్రశ్న అడిగింది. అయితే నేను ఆ అమ్మాయివైపు చూడనేలేదు” అంటూ వివరించారు. ఉపన్యాసమయ్యాక విద్యార్థులకు ఏమైనా అనుమానాలుంటే ప్రశ్న అడగవచ్చని ప్రకటించారు. తక్షణమే సభలో కూర్చున్న విద్యార్థిని హెచ్. వి. గాయత్రి వేదికపైకి వెళ్ళి “ఏమి స్వామీజీ, స్ఫురద్రూపి, ఆకర్షణీయమైన దుస్తులు ధరించిన అమ్మాయి వైపు నేను చూడలేదు అని చెప్పారు, ఎందుకు చూడలేదు? ఆ అమ్మాయి ఏమి తప్పు చేసింది? మీరు ఆమె వైపు చూడకుండానే ఆమె స్ఫురద్రూపి, మంచి దుస్తులు ధరించింది అని మీకు ఎలా తెలిసింది” అంటూ కంచుకంఠంతో అడిగింది. స్వామీజీ నిశ్చేష్టులయ్యారు. హర అనలేదు శివ అనలేదు. మౌనంగా కూర్చున్నారు. నేను గాయత్రితో “చాలు వదిలేయమ్మా” అన్నాను. క్రిందకు దిగి వచ్చింది.

గాయత్రి చాలా ధైర్యమున్న అమ్మాయి. మంచి అమ్మాయి. సమాజసేవ మొదలైన కార్యక్రమాలలో (నాకు జ్ఞాపకమున్నంత వరకూ క్రీడల్లో కూడా) ఎక్కువ ఆసక్తి. ఆమె తండ్రి శ్రీ హెచ్. ఎస్. వేణుగోపాల్ నా స్నేహితులు. ఉపన్యాసం అయిపోయాక గాయత్రిని పిలిచి “ఎందుకమ్మా ఆ స్వామీజీని అలా సతాయించావు” అని అడిగాను. “చూడండి సార్, వారు మాట్లాడింది. స్వామి అని అనిపించుకున్నవారు అట్లంతా మాట్లాడరాదు సార్” అంది. “నీవు చెప్పేది సరైనదేనమ్మా” అన్నాను.

తరువాత ఆ స్వామిగారూ, హిమాలయాలకు తపస్సు చేయడానికి వెళతానన్న మేడమ్ గారూ పెళ్ళి చేసుకున్నారు. ఇది వారి ఆప్తవర్గంలో కలకలాన్ని సృష్టించింది. అప్పుడు నేను అమెరికాలో ప్రొఫెసర్‌గా ఉన్నాను. నాకు విద్యార్థులు, అధ్యాపకుల నుండి చాలా ఉత్తరాలు వచ్చేవి. ఒక వారం అన్ని ఉత్తరాలలో ఈ పెళ్ళి ప్రస్తావనే ఉంది. మా కాలేజీలో రసాయనశాస్త్ర విభాగంలో పనిచేసే ఒక మేడమ్‌కు ఒక విధమయిన షాక్ అయ్యింది. ఆ ఇద్దరు మేడమ్‌లు స్నేహితులుగా ఉన్నారు. ఇద్దరికీ ఆ స్వామీజీ మీద గౌరవం, విశ్వాసం ఉండింది. వారు తమ ఉత్తరంలో ఈ పెళ్ళిని సుదీర్ఘంగా ప్రస్తావించి చివరకు “ఈ కాలంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియడమే లేదు సార్” అంటూ తన బాధను వ్యక్తం చేశారు. “నన్ను నమ్ముకో అమ్మా, ఫరవాలేదు” అని తమాషాగా బదులు వ్రాశాను.

గాంధీ అధ్యయన కేంద్రం

1917లో మొదలైన నేషనల్ హైస్కూలు మా అన్ని విద్యాసంస్థలకు తల్లి లాంటిది. గాంధీజీ, ఇతర జాతీయ నాయకుల నుండి స్ఫూర్తిని పొంది ఈ పాఠశాల స్థాపించబడింది. ముందే చెప్పినట్లు ఈ పాఠశాలను ‘గాంధీ స్కూల్’ అని కూడా పిలిచేవారు. మొదటి నుండీ నేనూ గాంధేయవాదం వైపు మొగ్గు చూపేవాణ్ణి. గాంధీ మరియు జాతీయ చింతనలకు ప్రోత్సాహం ఇచ్చే ఉద్దేశంతో ‘గాంధీ అధ్యయన కేంద్రా’న్ని 2-10-1966వ తేదీన గవర్నర్ గారైన వి. వి. గిరి ప్రారంభించారు. గాంధీ అధ్యయన కేంద్రంలో 5500 పుస్తకాలు ఉన్నాయి. ఈ అధ్యయన కేంద్రంలో కొన్ని ఉపన్యాసాలను, సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేశాము.

మరువరాని సంఘటన

ప్రారంభోత్సవం నాడు జరిగిన ఒక సంఘటనను ప్రస్తావించడం యుక్తమని భావిస్తున్నాను. ఆ రోజు గాంధీ జయంతి. గాంధీ అధ్యయన కేంద్రం ఉద్ఘాటన కూడా. పైగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించేది గవర్నర్ శ్రీ వి. వి. గిరిగారు. ఇవన్నీ మనసులో పెట్టుకుని ముందురోజు సాయంత్రం మొదలైన ముందస్తు సన్నాహాలు రాత్రి 10-12 గంటలవరకూ కొనసాగింది. అది అయిన తరువాత నేనూ, విద్యార్థి నిలయపు కొందరు విద్యార్థులూ మిగిలిన పనులను ముగించాము. నేను పడుకునే సరికి సుమారు రెండు గంటలు అయ్యింది. కార్యక్రమం ఉదయం 9 గంటలకు. విద్యార్థులంతా క్రమశిక్షణతో సభలో ఉన్నారు. అధ్యాపకులంతా తమతమ స్థానాలలో ఉండి కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. గవర్నర్ వచ్చినప్పుడు బ్యాండ్‌తో వారికి గౌరవ స్వాగతాన్ని పలికాము. వేదికపై వచ్చి వారి స్థానంలో కూర్చున్నారు. మా కార్యక్రమాలన్నీ మా కాలేజీ ప్రార్థనతో మొదలవుతాయి. ఎప్పటిలానే నేను లేచి “కార్యక్రమం సామూహిక కాలేజీ ప్రార్థనతో ప్రారంభమవుతుంది” అని మైకు ద్వారా ప్రకటించాను. గవర్నర్‌తో సహా అందరూ లేచి నిలబడ్డారు. సాధారణంగా ప్రార్థనను మొదలుపెట్టేది నేనే. అప్పుడు మా విద్యార్థులు, అధ్యాపకులు నాతో కలిసి పాడేవారు. వందలాది మంది ఏక కంఠంతో చేస్తున్న ప్రార్థనను అందరూ మెచ్చుకునేవారు. “యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుతః..” అనే పదంతో ప్రారంభమవుతుంది ప్రార్థన. దానికి బదులుగా నేను “జనగణ..” అని మొదలు పెట్టాను. రాత్రంతా పనిచేసి పూర్తిగా అలసిపోయాను. పనికన్నా ఎక్కువ ఆయాసాన్ని కలిగించేది ఆందోళన, అశాంతి మొదలైన మానసిక ఒత్తిడులు. చిన్న పని మొదలుకొని, ముఖ్యమైన పనులవరకూ నాకు ఒత్తిడులు యథాశక్తి ఉంటాయి. మొత్తం మీద ఇదొక దౌర్బల్యం అనుకోవచ్చు. నిశ్చింతగా, ప్రశాంతంగా నా మనసు ఎప్పుడూ ఉండదు. ఏదో పరధ్యానంతో నేను “జనగణ..” అన్నాను. ప్రక్కనే కూర్చున్న గాంధీ అధ్యయన కేంద్రం డైరెక్టరు అయిన శ్రీమతి సి. ఎన్. మంగళ గారు “సార్, యం బ్రహ్మా..” అన్నారు. నేను గాభరా పడకుండా, పరధ్యానంలో ఉన్నట్టు తెలియకుండా మా ప్రార్థనను మొదలు పెట్టాను. ప్రార్థన ముగిసింది. అప్పుడు మా విద్యార్థుల ఒక మరువలేని గుణం వెలుగులోనికి వచ్చింది. నేను “జనగణమన..” అన్నప్పుడు ఒక్క విద్యార్థి కూడా చప్పుడు చేయలేదు, నవ్వలేదు, గుసగుసలాడలేదు. వారి ముఖంలో ఆశ్చర్య చిహ్నంకానీ, మరే మార్పు కానీ కనబడలేదు. క్రమశిక్షణగల సిపాయిల్లా నిలబడ్డారు. ఆపైన వారు బిగ్గరగా కాలేజీ ప్రార్థనను పాడారు. విద్యార్థుల ఆనాటి నడవడిక నన్నైతే చాలా మెప్పించింది. నేను చేసిన అజాగ్రత్తను నలుగురు నవ్వి ఉంటే, లేదా కొంతమంది నా జాతీయగీతాన్ని కొనసాగించి ఉంటే, లేదా నేను చేసిన తప్పును తిద్దడానికి వారే కాలేజీ ప్రార్థనను మొదలుపెట్టివుంటే గవర్నరు, ఇంకా ఇతర ప్రముఖులైన ఆహ్వానితుల సమక్షంలో అభాసుపాలు అయ్యేది. దానికి నేను కారణమైనందువల్ల నా మనసుపై తీవ్రమైన ప్రభావాన్ని కలిగించేది. అప్పుడు మనసుకు కలిగే గాయం తగ్గడానికి చాలా సమయం కావలసి వచ్చేది. నాది సున్నిత మనస్తత్వం. పైగా నేను ఏపని చేసినా అది కొంచెం కూడా తప్పులేకుండా చేయాలనేది నా జీవితంలో విడదీయలేని భాగమయింది. ఇలాంటి విపరీతమైన ఆందోళన నా కడుపులో అల్సర్ కనిపించడానికి ఒక కారణం. దీన్ని మరోచోట ప్రస్తావిస్తాను.

సమాజ సేవ – సేవా సంఘం

సమాజ సేవకు నేను మొదటి నుండీ ప్రాధాన్యతను ఇస్తూ వచ్చాను. సమాజ సేవలో ఆసక్తిని రేకెత్తించడం, సమాజ సేవా కార్యక్రమాలలో యువకులను, విద్యార్థులను క్రియాశీలకంగా పాల్గొనచేయడం చదువులో ఒక భాగం. నిరుపేదల బాధలకు స్పందించకుండా ఎప్పుడూ తన సుఖసంతోషాలపైనే దృష్టిపెట్టేవాడు స్వార్థజీవి. అంతేకాదు సమాజఘాతకుడు కూడా. “ఇతరుల కోసం ఎవరు జీవిస్తారో వారే నిజంగా బ్రతికున్నవారు. మిగిలినవారు బ్రతికినా చచ్చినట్లే” (They alone live who live for others. The rest are more died than alive) అని స్వామీ వివేకానంద దశాబ్దాల క్రితమే చెప్పారు.

మన దేశం సమాజ సేవకు చాలా అనుకూలమైన దేశం. ఇక్కడ సమాజ సేవ వందల సంవత్సరాలు చేసినా తరగనంత పని ఉంది. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా మనకన్నా క్రింద ఉన్నవారిని పైకి లేపడానికి ప్రయత్నించాలి. ఇల్లు ఉన్నవాడు మహడి లేదని గింజుకుంటాడు. మహడి ఇల్లు ఉంటే తప్పులేదు. కానీ దానికోసం నిద్రచెడి జీవితమంతా పోరాడుతూ కష్టపడనవసరం లేదు. ఎంతో మంది ఫుట్‌పాత్ మీదనే పుడతారు. అక్కడే చస్తారు. వారిది ఎంతటి దుర్భర జీవితం! దానికోసం మనం ఫుట్‌పాత్ పైన పడుకోనక్కర లేదు. మనమున్న చోటనే దురదృష్టవంతులకు ఎంత సహాయం చేయాలో అంత నిజాయితీతో చేయాలి. దశాబ్దాల నుండి చూస్తున్న, ఇప్పుడు ఇంకా ఎక్కువగా చూస్తున్న, నా ప్రేగులను మెలిపెట్టే దృశ్యం నుండి తప్పించుకునే అవకాశమే లేదు. పెళ్ళిళ్ల సమయంలో విందు భోజనం చేసి, ఆ ఎంగిలి ఆకులను బయటకు విసిరివేసినప్పుడు ఆ ఎంగిలి అన్నం కోసం ఒక వైపు భిక్షకులు, మరోవైపు కుక్కలు ఎగబడటం. ఎంతటి ఘోరమైన దృశ్యం! ఇలాంటి సామాజిక వ్యవస్థకు మనం ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా బాధ్యులం. ఒకవైపు మురిగిపోతున్న ఐశ్వర్యం, మరోవైపు జీవచ్ఛవాలు. ఇలాంటి సమాజపు నిజస్వరూపాన్ని విద్యార్థుల దృష్టికి తెచ్చి వారి మనోభావాలను మార్చి సమాజానికి వీలైనంత సహాయం చేయడానికి ప్రయత్నించాలి.

ఒకరోజు రాత్రి సుమారు 10 గంటలకు హాస్టల్లో ఏ విద్యార్థి చదువుతున్నాడు, ఏ విద్యార్థి పడుకుని ఉన్నాడు అని చూడటానికి వెళ్ళాను. హెచ్. ఎస్. సత్యనారాయణ (ప్రస్తుతం బి.ఇ.ఎల్. కంపెనీలో పెద్ద ఆఫీసర్‌గా ఉన్నారు) చదువుతూ కూర్చున్నాడు. అతడితో మాట్లాడుతూ పక్కకు చూశాను. చాలా టెరిలిన్ షర్ట్ లను వేలాడదీశాడు. “ఏం సత్యనారాయణ ఇవన్నీ నీవేనా?” అన్నాను. “అవును సార్” అన్నాడు. “ఒక్కొక్క దానికి ఎంత రేటు” అని అడిగి సమాధానం కోసం ఎదురు చూడకుండా తెలిసినవాడిలా “ఒక షర్టుకు 10-15 రూపాయలు అవుతుంది కదప్పా” అని అన్నాను. “ఇది మీ ఖాదీ షర్టు అనుకున్నారా సార్. 40-50 రూపాయలు (మరిచిపోయాను) అవుతుంది” అన్నాడు. “ఏమప్పా ఇంత రేటు. పైగా ఇన్ని షర్టులు” అన్నాను. “సార్ మా తండ్రికి నేనొక్కడినే కొడుకును. ఇప్పుడు సంతోషంగా ఉండకపోతే ఇంకెప్పుడు సంతోషంగా ఉండాలి” అన్నాడు. “సంతోషంగా ఉండాలన్నదాన్ని నేను ఒప్పుకుంటాను. సంతోషపడటానికి కొన్ని విధానాలున్నాయి. ఒకడు ఇంకొకడిని హింసిస్తే, చంపితే సంతోషపడతాడు. ఇది అత్యంత ఖండనార్హమైన సంతోషం. ఇంకొకడికి మసాలా దోశ, మైసూర్ పాక్ తింటే సంతోషమౌతుంది. ఇంకొకడికి కష్టంలో ఉన్నవారికి సహాయం చేసినప్పుడు సంతోషం కలుగుతుంది. తిని తాగి తాత్కాలికంగా సంతోషపడేవారు ఎక్కువమంది. ఆకలిగొన్నవాడికి తినిపించి సంతోషపడేవారు బహు తక్కువ.” ఈ ధాటిలో చాలాసేపు నా ప్రవచనం కొనసాగింది. చివరకు సత్యనారాయణకు ఇలా చెప్పాను. “సత్యనారాయణా, నీవు పిల్లవాడివి. యువకుడివి. సంతోషపడు. అయితే నీవు సంతోషపడేటప్పుడు దురదృష్టవంతులను గుర్తుకు తెచ్చుకో. ఊరికే గుర్తు తెచ్చుకుంటే చాలదు. నీవు జ్ఞాపకం చేసుకున్నందువల్ల వారికి కించిత్ సహాయమైనా కావాలి. ఉదాహరణకు నీవు 50 రూపాయలు పెట్టి టెర్లిన్ షర్ట్ కొన్నప్పుడు ఒకటి రెండు రూపాయలు బీదవారికి తీసిపెట్టు. నీకెలాగూ డబ్బుంది. షర్టు వెల 50 రూపాయలకు బదులు 52 రూపాయలనుకో. నీవు రెండు రూపాయలు పెట్టి సంతోషంగా మసాలా దోశ తింటావు. నాలుగణాలు బీదవారికి తీసిపెట్టు. అలాగే సినిమాకు పోయినప్పుడు కూడా..” ఇలా సాగింది నా ఉపన్యాసం. సత్యనారాయణ చాలా గంభీరంగా విన్నాడు. “మీరు చెప్పినదాన్ని నేను ఒప్పుకుంటాను సార్” అన్నాడు. సమయం 12 గంటలయ్యింది. “పడుకో. రేపు హాస్టల్ విద్యార్థుల మీటింగులో దీనిని చెప్పి సామూహికంగా ప్రయత్నం చేద్దాం” అన్నాను. మరుసటి రోజు అదే విధంగా నా ఆలోచనను విద్యార్థుల ముందు ఉంచాను. విద్యార్థులు ఒప్పుకున్నారు. హాస్టల్ ప్రార్థనా స్థలంలో ఒక హుండీని పెట్టి తాము ధనం వెచ్చించి సంతోషపడినప్పుడు తమకు తోచినంత ఆ హుండీలో వేయమని చెప్పాను. హుండీ, దానిలోని డబ్బు ఏ విధమైన కాపలా లేకుండా సురక్షితంగా ఉన్నాయి. నెల చివరలో హుండీ తీసినప్పుడు చాలా రూపాయలుండేవి. కార్పొరేషన్ పాఠశాల పేద విద్యార్థులకు ఆ డబ్బుతో పుస్తకాలు కొనిపెట్టాము. ఈ కార్యక్రమాన్ని కాలేజీ విద్యార్థులకూ విస్తరించాము. ఇలాంటి పనులను వ్యవస్థా పరంగా చేయడానికి కాలేజీలో ‘సేవా సంఘం’ స్థాపించాము.

సేవా సంఘం

సమాజ సేవ క్రియాశీలకంగా చేయడానికి సుమారు 100 మంది విద్యార్థినీ విద్యార్థులు సభ్యులైనారు. విద్యార్థులకు మొదట థియరీ అంటే సమాజసేవకు సంబంధించిన తత్త్వజ్ఞానం; ఆపైన దానిని కార్యరూపంలో తెచ్చే పనులు. మొదటి భాగంలో వీలైనన్ని ఉపన్యాసాలను, చర్చలను ఏర్పాటు చేశాము. చర్చాంశాలు మన దేశపు సామాజిక సమస్యలు, ఆర్థిక, విద్యాపరమైన సమస్యలు. వీటితోపాటు సమాజసేవ చేస్తున్న సంస్థలను సందర్శించే వాళ్ళం. వృద్ధులకోసం నడుపుతున్న ‘లిటిల్ సిస్టర్ ఆఫ్ ది పూర్’ (The Little Sister of the Poor) అనే సంస్థకు ఏడాదికొకసారి వెళ్ళేవాళ్ళం. అక్కడున్న 10-20 మంది సన్యాసిను(Nuns)లు మరియు సహోదరి(Sisters)లు చడీచప్పుడు లేకుండా సేవ చేస్తున్నారు. అప్పుడు సుమారు 100 వృద్ధులున్నారు. వారిలో చాలామందిని విచారించాము. అందరూ ఆ సన్యాసినులను దేవతలాగా భావించారు. ఆ సహోదరిల సేవ మనసును తాకేలా ఉంది. ఆ సంస్థలో చేరడానికి అర్హతలేమి అని ఒక సిస్టర్ను అడిగాను. అనాథలై ఉండాలి. 60 యేళ్ళకన్నా ఎక్కువ ఉండాలి అని చెప్పారు. నేను అనాథనే. అయితే నాకింకా 45 యేళ్ళే. మరో 15 సంవత్సరాల తరువాత వస్తాను చేర్చుకోండి అన్నాను. ఆవిడ నవ్వి అలాగే రండి అని చెప్పింది. వైట్‌ఫీల్డులో ఉన్న బ్లైండ్ స్కూలును ఒకటి రెండుసార్లు సందర్శించాము. అక్కడి దురదృష్టవంతులకు జీవితంలో వెలుగే లేదు. జీవితాంతం చీకటే.

అలసూర్ ప్రాంతంలో ఒక ఆసుపత్రి రెడ్ క్రాస్ హోమ్ (Red Cross Home) ఉంది. అది యుద్ధంలో గాయపడి అంగాంగాలకు శాశ్వతంగా జఖం అయిన యోధులకు శుశ్రూష చేసే ఆసుపత్రి. కొంతమంది రెండవ ప్రపంచయుద్ధంలో గాయపడి వెన్నెముకకు తీవ్రంగా దెబ్బ తగిలి 25-30 సంవత్సరాలుగా పడుకునే ఉన్నారు. అయ్యో భగవంతుడా! వీరికేమి గతి పట్టిందప్పా అనిపించింది. దేశం కోసం ప్రాణం ఇచ్చినవారిని నిర్లక్ష్యం చేసి మనమంతా హాయిగా ఉన్నాము కదా అనే అపరాధభావన మమ్మల్ని గుచ్చుతూ ఉంది. బెంగళూరు సమీపంలో ఉన్న అంధులశాల సందర్శన కూడా మనసును తాకింది. ఈ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్న సుభాష్ రఘువీర హెరంజాల్ అనే 3వ సంవత్సరం బి.ఎస్.సి. విద్యార్థి ఈ క్రింది ఉత్తరాన్ని నాకు వ్రాశాడు.

“..Let me first thank you for letting me to see the world, the real world, a world of suffering humanity. Hitherto I saw the world with Physics and Mathematics as my eyes. I realize much remains to be done to humanity at large. I have determined after my present plan, to offer my humble services for one year. I feel that it is my duty to serve humanity and I shall. If all others could realize their duties how nice will it be? And will they?”

మురికివాడలలో నివసించే ప్రజలను చూపడానికి విద్యార్థులను మురికివాడలకు పిలుచుకు వెళ్ళాము. అంతా చూశారు. గుడిసెలలోనికి వెళ్ళిరండి అని చెప్పాను. పోయి వచ్చారు. ప్రత్యక్షదర్శనం ఎప్పుడూ మనసుపై చెరగని ముద్రవేస్తుంది. లోపలికి వెళ్ళి చూసివచ్చిన ఒక విద్యార్థి “సార్, వాతావరణపు వ్యవస్థ (Ventilation System) లేదు కదా. గాలి ఎలా లోపలికి వెళుతుంది ఎలా బయటకు వస్తుంది” అని అడిగాడు. కొట్టానికి కిటికీలు! ప్రపంచ జ్ఞానం లేని చదువు. “గాలి లోపలికి పోయి బయటకు వచ్చే వ్యవస్థ లేకపోవచ్చు. అయితే వాన వచ్చినప్పుడు ఒక్కొక్క చినుకూ కొట్టంలోనికి వెళ్ళే అవకాశముంది. ఎంత క్లిష్టపరిస్థితులలో వీరు నివసిస్తున్నారో చూడండి” అని చెప్పాను.

సేవా సంఘపు కార్యక్షేత్రం కార్పొరేషన్ పాఠశాలలు. అక్కడి విద్యార్థులకు పాఠం చెప్పడం, విక్టోరియా ఆసుపత్రిలోని కొందరు రోగులకు ఉత్తరాలు వ్రాసిపెట్టడంలాంటి ముఖ్యమైన సేవలు చేయడం వంటివి చేసేవాళ్ళం. వీటితో పాటు మా పాఠశాల, కాలేజీ ఆవరణను స్వచ్ఛంగా ఉంచడం, ఇంటింటి నుండి న్యూస్ పేపర్లను సేకరించి వాటిని అమ్మి సేవా కార్యక్రమాలకు వినియోగించడం, పాత బట్టల సేకరణ, ఫుట్‌పాత్‌పై పడుకున్నవారికి రాత్రిపూట దుప్పట్లను పంచడం మొదలైన కార్యక్రమాలను పెద్ద ఎత్తులో ఖచ్చితంగా నడిపేవాళ్ళం. మా కాలేజీ బస్సు ఈ పనులకు ఎక్కువ సహాయం చేసింది.

కాలేజీకి సున్నం వేశాము

సేవాసంఘం అండతో స్వయంసేవకులు చేసిన మరువలేని, మరపురాని ఇంకొక కార్యక్రమం – మా కాలేజీ భవనానికి సున్నం వేయడం. ఈ విశేషమైన సేవా కార్యక్రమం, గాంధీ జయంతి రోజు 2-10-1966న మొదలయ్యింది. సుమారు 200 విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల ఉత్సాహమే ఉత్సాహం. సున్నం బకెట్టు పట్టుకునేవాడు ఒకడు, నిచ్చెనను పట్టుకునేవాడు ఇంకొకడు. మరొకడు నిచ్చెన ఎక్కి గోడకు సున్నం కొట్టేవాడు. దానికన్నా ముందు ఒక ముఖ్యమైన పని కావాలి. గోడలను బాగా గీకిగీకి సున్నం వేయడానికి సిద్ధం చేయాలి. గోడలను తిక్కకుండా, లేదా సగం సగం తిక్కి దానిమీద సున్నం వేస్తే అది నిలబడదు. గోడలను గీకే పని చాలా కష్టమైన పని. పైగా గీకుతున్నప్పుడు ఆ ధూళి ముక్కులోకి, నోటిలోకి వెళుతుంది. ఈ పనిలో శ్రీమతి సి. ఎన్. మంగళ గారు ముఖ్యపాత్ర వహించారు.

ఆవిడ స్వయంగా కాలేజీ ఆఫీసు గోడలను రుద్ది సున్నం వేయడం నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. ఈ పని దసరా సెలవులు మొత్తం నడిచింది. ఈ సుమారు 200 మందికి పని చెప్పి ఏవిధమైన గందరగోళం లేకుండా చేయాలంటే దాని వెనుక ఎంత వ్యవస్థీకృతమైన ప్రయత్నం, కష్టం ఉంది అని చెప్పనవసరం లేదు. ఈ సున్నం వేసే పని ఒక నిపుణుడైన కాంట్రాక్టర్ పర్యవేక్షణలో నడిచింది. విద్యార్థులు చేనిన పనికి ‘కూలి’ లెక్కవేసి కాలేజీ నుండి తీసుకుని సేవాసంఘం పనులకు వాడుకున్నాము. కూలి అలా ఉండనీ. ఈ పనిలో భాగం వహించిన విద్యార్థుల మనసుపై మంచి పరిణామం నేరుగా కలిగింది. భాగం వహించని విదార్థులపై కూడా పరోక్షంగా దీని ప్రభావం పడింది. ఇదంతా జీవిత శిక్షణలో ఒక ముఖ్యమైన భాగం.

హెరంజాల్ చావు

మా సేవాసంఘంలో విద్యార్థులలో ఎక్కువమందికి సేవా కార్యక్రమాలపై చాలా ఆసక్తి ఉండేది. వారిలో ఎస్. ఆర్. హెరంజాల్ ప్రముఖుడు. మూడవ సంవత్సరం బి.ఎస్.సి. తరగతిలో చదువుతున్నాడు. ఉత్తమ విద్యార్థి. కరడుగట్టిన హేతువాది. ఒకరోజు వారి క్లాసులో పాఠం చెబుతున్నప్పుడు నా సబ్జెక్టు భౌతిక శాస్త్రానికన్నా ఒక విధంగా ఇష్టమైన మూఢనమ్మకాల గురించి కొన్ని మాటలు చెబుతున్నాను.

హెరంజాల్ లేచి నిలబడి “మీకు దేవుడిపై నమ్మకం ఉందా సార్” అని అడిగాడు. “ఉందప్పా” అన్నాను. “అదీ మూఢనమ్మకమే కదా” అని ఎదురుబాణం వేశాడు. ఒకటి రెండు సెకెన్లు కలవరపడ్డాను. ఆపైన “కావచ్చప్పా, ఐతే అది హైక్లాస్ మూఢనమ్మకం కావచ్చు” అన్నాను. అందరూ నవ్వారు. హెరంజాల్ కూడా నవ్వాడు.

హెరంజాల్‌కు ఆరోగ్యం సరిగ్గాలేదన్న విషయం తెలిసింది. అతడిని ఆసుపత్రిలో చేర్చారని కూడా తెలిసింది. విషయాన్ని తెలుసుకోవాలని వారి ఇంటికి వెళ్ళాను. ధనుర్వాతం (Tetanus) నుండి బాధపడుతున్నాడని తెలిసింది. దానిని గుర్తించడం కొంచెం ఆలస్యమైనదట. ధనుర్వాతం ఒక భయంకరమైన రోగం. వారి ఇంటివారితో కలిసి ఆసుపత్రికి పరిగెత్తాను. అతడిని చూచి నాకు తీవ్రమైన బాధ కలిగింది. ఆసుపత్రి దూరంలో ఉంది. “రోజూ మిమ్మల్ని ఇంకా ఇంటివారిని టాక్సీలో పిలుచుకుని పోతానమ్మా” అంటూ వారి తల్లికి చెప్పాను. అలాగే అన్నారు. మరుసటిరోజూ వెళ్ళాము. గుణం కనిపించే సూచనలు లేవు. అక్కడి నుండి బయలుదేరాము. “సార్. కొంచెం కంటోన్మెంటుకు వెళదాము. అక్కడ ఒక పేరుమోసిన జ్యోతిష్కుడున్నాడు. వారిని నా కొడుకు ఖాయిలా గురించి అడగాలి” అంటూ వారి తల్లి చెప్పారు. “అలాగే కానీయమ్మా వెళదాము” అన్నాను. నాకు జ్యోతిష్యంపై సుతరామూ నమ్మకం లేదు. అది వారికీ తెలుసు. హెరంజాల్‌కు కూడా దానిమీద నమ్మకం లేదని కూడా ఆమెకు తెలుసు. అయితే హెరంజాల్ పరిస్థితి చాలా చింతాజనకంగా ఉంది. తల్లిప్రేగు అలాంటి గడ్డు పరిస్థితులలో హేతువాదాన్ని వెనుకకు నెట్టేస్తుంది. నమ్మకం ప్రధానమౌతుంది. ఆ జ్యోతిష్యుని పేరు నేను ఇంతకు ముందే విని ఉన్నాను. అక్కడకు వెళ్ళాము. “వీరు నేషనల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా. నరసింహయ్య గారు” అని నన్ను వారికి పరిచయం చేశారు. “వీరి విషయం నాకు తెలుసు” అని సూచనప్రాయంగా చెప్పారు. అప్పటికే జ్యోతిష్యంపై చాలా వాద ప్రతివాదాలు పత్రికలలో నడిచాయి. నేను జ్యోతిష్యానికి బద్ధ శత్రువునని పలువురికి తెలుసు. వారికీ తెలుసు.

హెరంజాల్ తల్లిగారికీ, జ్యోతిష్యునికీ ప్రశ్నోత్తరాలు అయిన తరువాత వారు కొంచెం సేపు ధ్యానం చేసి లేదా ధ్యానం చేసినట్లు నటించి “మీరేమీ యోచన చేయవద్దు. మీ కొడుకు గుండ్రాయిలా ఉంటాడు” అనే హామీ ఇచ్చారు. తల్లికి సహజంగానే సంతోషమయ్యింది. నాకూ సంతోషమయ్యింది. జ్యోతిష్యం ఏమైనా కానీ హెరంజాల్ బ్రతికితే చాలప్పా అనేదే నా ఆశ. హెరంజాల్ తల్లి సత్యసాయిబాబా భక్తురాలు కూడా. వారి వద్దా ఈ విషయాన్ని వైట్‌ఫీల్డ్ ఆశ్రమంలో ప్రస్తావించారు. వారూ ఇలాంటి అభయహస్తాన్ని చూపారట! మరుసటి రోజూ ఆసుపత్రికి మేమిద్దరమూ వెళ్ళాము. హెరంజాల్ మరణశయ్యపై ఉన్నట్లు నాకు తోచింది. ఏదో దేవస్థానంలో పూజ చేయించి వచ్చి అక్కడి నుండి తెచ్చిన విభూతిని హెరంజాల్ నుదిటిపై అతని తల్లి పెట్టారు. అలాంటి ఆపద సమయంలో కూడా అతడు ఆ విభూతిని చెరిపివేశాడు. ఇతడు ఎలాంటి ధీమంతుడప్పా అని అనుకున్నాను!

హెరంజాల్ మరణించాడన్న వార్త ఫోన్ ద్వారా అదేరోజు సాయంత్రం నాకు తెలిసింది. వారి ఇంట్లోని వారి శోకం చెప్పనలవి కాదు. తల్లి అయితే క్రుంగిపోయారు. అదే రాత్రి అంతిమ సంస్కారం చేయడానికి నిశ్చయించారు. అప్పటికింకా విద్యుత్ దహనవాటిక లేదు. శ్రీరామపురం రుద్రభూమిలో రాత్రి సుమారు 10 గంటలకు హెరంజాల్ బూడిద అయ్యాడు. ఇదంతా ఇప్పుడూ నా కళ్ళముందే అచ్చుగుద్దినట్లు ఉంది. భారమైన మనసుతో హాస్టల్‌కు వచ్చాను. రాత్రి నిద్ర రాలేదు. బంగారంలాంటి పిల్లవాడిని వారి ఇంటివారూ, కాలేజీ కోల్పోయింది. సుమారు 28 యేళ్ళ క్రితం జరిగిన హెరంజాల్ మరణాన్ని మరిచిపోవడం సాధ్యం కాలేదు.

బాబాగారి బూటకపు మాటలు

హెరంజాల్ ఇంటికి అప్పుడప్పుడూ వెళ్ళేవాణ్ణి. తల్లి – తండ్రి, తమ్ముడు – చెల్లెళ్ళను ఓదార్చేవాడిని. ఒకటి రెండు నెలల తరువాత వారి ఇంటిలో హెరంజాల్ తల్లితో మాట్లాడుతున్నప్పుడు వారి ముఖంలో ఇంకా వారి మాటల్లో ఎదురుచూడని ఉపశమనం కనిపించింది. “చూడండి సార్. నేను హెరంజాల్ చనిపోయాక ఆ వర్తమానాన్ని బాబాగారికి చెప్పాను. హెరంజాల్ ఎక్కడికీ పోలేదు. మీలోనే ఉన్నాడు అని చెప్పారు. ఇప్పుడు నేను గర్భవతినైన సూచనలు కనిపిస్తున్నాయి. హెరంజాల్ నా కొడుకుగానే మళ్ళీ పుట్టొచ్చు” అన్నారు. శాస్త్రీయంగా వారు గర్భవతి కావడం అసాధ్యమని హెరంజాల్ తండ్రో లేక హెరంజాలో నాకు ఏదో సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు. అయినా ఎంతైనా తల్లి కదా, ఇలాంటి సమయంలో నమ్మకానికి ఎక్కువ ప్రాధాన్యత. నాకైతే అసాధ్యమని తెలిసినా “చాలా సంతోషమమ్మా, హెరంజాల్ మళ్ళీ మీ కొడుకుగానే పుట్టనీ” అంటూ చెప్పాను. వారికీ సంతోషమయ్యింది. అయితే అది తాత్కాలికమైన సంతోషం. ఆమె గర్భవతి ఐన సూచనలు ఏవీ లేవని వారి డాక్టరు కొన్ని రోజుల తరువాత చెప్పారట.

పైకి చాలా లోతైన అర్థాన్ని స్ఫురించేలా బాబాగారు మాట్లాడుతారు. వాటిని సూక్ష్మంగా పరిశీలిస్తే అవన్నీ జారుడు మాటలు. బూటకాలు. దీనిని సమర్థించడానికి నేను ఎన్నైనా ఉదాహరణలు చెప్పవచ్చు. అయితే ఇంకొకటి మాత్రం చెప్పదలిచాను.

దక్షిణ కన్నడ జిల్లాలో అళికె అనే గ్రామం ఉంది. బాబాగారి అంతర్వలయానికి (Inner Circle) చెందిన అక్కడి వారిలో ఒకరు నారాయణ భట్టు. వారికి నాపైనా విశ్వాసం ఉండేది. ఒక సారి మా హాస్టల్‌కు వచ్చి అనేక విషయాలు చర్చించారు. బాబాగారి అద్భుతాలను, మహిమలను సమర్థించుకున్నారు.

ఆ సమర్థనకు గుడ్డి నమ్మకమే పునాది. బాబాగారిపై నాకున్న అభిప్రాయంలో కించిత్తూ మారలేదు. నారాయణ భట్టుగారు మంచివారు. సేవాభావంతో మసలుకొనేవారు. అళికెలో ఒక హైస్కూలును బాబాగారి పేరుమీద తెరిచినారు. ఇప్పటికి 10-12 సంవత్సరాల క్రితం భట్టుగారు పుట్టపర్తికి వెళ్ళి బాబా గారిని తమ జిల్లాలో పర్యటించి ‘పతితులను’ ‘పావనులు’గా చేయమని కోరారు. దివ్యపురుషులు అంగీకరించారు. పర్యటనకు సంబంధించిన టైమ్‌టేబుల్ వివరాలన్నీ సిద్ధం చేశారు. ఇక మూడు నాలుగు రోజులలో బాబా గారు పుట్టపర్తి వదిలి తమ ‘జ్ఞానయజ్ఞం’ మొదలు పెట్టాలి. నారాయణ భట్టుగారు అక్కడి కార్యక్రమాలకు ముందస్తు సన్నాహాలు చేసే దృష్టితో ముందుగానే బయలుదేరారు. అయితే నారాయణ భట్టుగారు తమ ఊరు చేరడానికి ముందే రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. చాలా అన్యాయం. ఒక నిష్ణావంతుడైన సమాజసేవకుడు అకాల మరణం పొందారు. నారాయణ భట్టు మరణ వార్తను బాబాగారికి తెలిపినప్పుడు వారు శాంతంగా “భట్టు ఎక్కడికీ వెళ్ళలేదు. నాలోకే వచ్చి ఐక్యమయ్యాడు” అని మామూలు కల్లబొల్లి మాటలు అన్నారట. ఈ బొంకు వారి అసంఖ్యాక బూటకాలలో ఐక్యమయ్యింది.

తమకు నచ్చిన ప్రియ శిష్యుడు నారాయణ భట్టు గారి అకాల మరణపు ముందు సూచన ఎవరికీ తెలియలేదు. ఎవరికీ అనేదానిలో బాబాగారూ ఉన్నారు. వారి చావు గురించి ముందుగానే బాబాగారికి తెలిస్తే వారు దాన్ని తప్పించవచ్చు. ఏవిధంగానూ సామాన్య మనుషులకూ, బాబాగారికీ తేడా లేదు. తప్పు చెప్పాను, ఒక విషయంలో చాలా వ్యత్యాసం ఉంది. ధార్మిక క్షేత్రాన్ని దురుపయోగం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న దివ్యపురుషులలో వీరు అగ్రగణ్యులు. దివ్యపురుషులు, జ్యోతిష్యుల బూటకపు మాటలకు అంతులేదు. అమాయకులు వీటిని నమ్ముతారు.

గోపాలస్వామి ఐయ్యంగార్ గారి మరణం

శ్రీ వి. గోపాలస్వామి ఐయ్యంగార్ గారు ముందే చెప్పినట్లు రెండేళ్ళు మా కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. ఆ తరువాత మా సంస్థ కార్యదర్శిగా కొనసాగారు. ప్రిన్సిపాల్ కాక మునుపు కూడా చాలా సంవత్సరాలు కార్యదర్శిగా ఉన్నారు. వారు ఇప్పటికి సుమారు 32 సంవత్సరాల క్రితం 1963లో మరణించారు. అప్పుడు నేను ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాను. వారి ఇల్లు విశ్వేశ్వరపురంలో, మా కాలేజీకి సమీపంలోనే ఉంది. వారి స్మరణార్థం మా సంస్థలకు సెలవు ప్రకటించాము.

వారిలో మతపరమైన భక్తిప్రపత్తులు ఎక్కువగా ఉండేవి. సాంప్రదాయవాది. విద్యుఛ్ఛక్తితో నడిచే దహనవాటికను వారి శవదహనానికి ఉపయోగించడం నిషిద్ధం. అంతేకాక స్మశానానికి శవాన్ని సాగనంపడానికి ఏ వాహనాన్నీ ఉపయోగించలేదు. వారి శవయాత్ర ఇంటినుండి చామరాజపేట దగ్గరున్న స్మశానానికి బయలుదేరింది. అది చాలా దూరం ఉంది. శవం వెనుక నలుగురు ఉన్నాము. నేషనల్ హైస్కూలు ప్రధానోపాధ్యాయులైన శ్రీ కె. నంజుండయ్య, సైంటిస్ట్ డా. ఎ. ఆర్. వాసుదేవ మూర్తి, నేషనల్ కాలేజీ అధ్యాపకులైన డా. ఎం. ఎన్. గుడి మరియు నేను. శవాన్ని మోస్తున్నవారు నలుగురు. వారికి చాలా వయసు అయ్యింది. ఫుట్‌పాత్ పైన శవం వెనుక వెళుతున్నాము. కొంచెం దూరం నడిచిన తరువాత వారి నడకలో అభద్రత కనిపించింది. శవాన్ని ఎక్కడ పడవేస్తారో లేదా నేలపై పెట్టాల్సిన పరిస్థితి వస్తుందో అని మాకు భయం వేసింది.

వెనుక వెళుతూ ఉన్నప్పుడు అనేక ఆలోచనలు వచ్చాయి. శ్రీ గోపాలస్వామి ఐయ్యంగార్ తమ సంస్థలకు సుమారు 30-40 సంవత్సరాలు నిస్వార్థంగా సేవ చేశారు. అలాంటివారు చనిపోయాక వారి శవాన్ని అనుసరించేవారు కేవలం నలుగురు. మా సంస్థలలో చాలా మంది అధ్యాపకులూ, సిబ్బంది ఉన్నారు. వారి అభిమానులూ, వారి నుండి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయం పొందినవారు తక్కువ సంఖ్యలో లేరు. అలాంటి వారి వెనుక కేవలం నలుగురు. జనులెంత కృతఘ్నులు.

మన గౌరవాన్ని ప్రదర్శించడానికి మనకున్నది అదే చివరి అవకాశం. పైగా వారి పేరుమీద సెలవును పొందారు; హాయిగా ఇంటికి వెళ్ళారు. లేదా కొంతమంది మ్యాటినీకి వెళ్ళివుండవచ్చు. వారి తిండి, భోజనం, సంతోషాలపై ఆ మరణం ఏ విధమైన ప్రభావాన్ని చూపించకపోయి ఉండవచ్చు. వారి వద్ద చదువుకున్నవారు ఎంత స్వార్థపరులు, కృతజ్ఞత లేనివారు అనుకుంటూ వెళుతున్నాను. వారి సహోద్యోగులూ, స్నేహితులూ కర్తవ్యాన్ని మరిచారు కదా అనేదే దారిపొడుగునా నన్ను పీడిస్తున్నది. చనిపోయిన వారికి ఎవరు తమ శవాన్ని అనుసరిస్తున్నారు లేదా ఎవరు తమ సంతాపసభలో పొగుడుతారు అనేది తెలియదని చెప్పనవసరం లేదు. ఇవన్నీ వారి కోసం కాదు. మన కర్తవ్య పాలనకోసం.

స్మశానం చేరుకున్నాము. గోపాలస్వామి ఐయ్యంగార్ గారికి మగపిల్లలు లేరు. ఒక కూతురు ఉంది. వారి ఆస్తికి ఉత్తరాధికారియైన ఒకరు అంత్యక్రియను నడిపారు. పక్కనున్న చామరాజపేటలోని ఒక కుండల అంగడి నుండి రెండు మూడు కుండలను వారి ఇంటి పనిమనిషి కొనుక్కొని వచ్చాడు. వాటికి ఎక్కువ డబ్బు చెల్లించాడంటూ అతడిపై వాగ్యుద్ధానికి దిగారు. శవం పక్కన ఉంది. మేను నలుగురు సమీపంలోనే ఒక రాతిబల్లపై కూర్చున్నాము. నాకైతే ఆ సమయంలో వారి అరుపులు అసభ్యమనిపించాయి, అసహ్యం వేసింది. ఆ పాత్రలేమీ బంగారంతో చేయలేదు, వెండితో చేయలేదు. లేదా వేరే ఏ లోహంతోనూ చేయలేదు. కేవలం మట్టితో చేసిన కుండలు. ఇంక ఎన్ని రూపాయలు ఎక్కువ ఇచ్చివుండవచ్చు. పైగా వారే గోపాలస్వామి ఐయ్యంగార్ గారి ఆస్తికి వారసులు. మనసుకు నొప్పి కలిగించే ఆ దృశ్యాన్ని చూసి నేనే గోపాలస్వామి ఐయ్యంగార్ అయివుంటే ఆ అల్లరి, గొడవ విని లేచి “ఎందుకు ఇట్లా బేరం చేస్తావు? అసభ్యంగా ప్రవర్తిస్తావు? ఆ డబ్బులు నావే. గొడవ చేయొద్దు అని చెప్పి మళ్ళీ మొదలు ఉన్నట్లే పడుకునేవాణ్ణి” అని నా ప్రక్కన కూర్చున్న స్నేహితులకు చెప్పాను. ఆ దృశ్యం వారికే కాదు ఎంతవారికైనా చీకాకును కలిగిస్తుంది.

(సశేషం)

Exit mobile version