‘పోరాట పథం’ – డాక్టర్ హెచ్.నరసింహయ్య ఆత్మకథ -19

1
1

[ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది డాక్టర్ హెచ్.నరసింహయ్య గారి ఆత్మకథ అనువాదాన్ని అందిస్తున్నారు శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్.]

ప్రిన్సిపాల్‌గా రెండవ విడత

ఆనర్స్ తరగతులు

[dropcap]అ[/dropcap]మెరికా నుండి 1968 జూన్ నెలలో కాలేజీకీ వచ్చిన తరువాత ఇంకా ఎక్కువ ఉత్సాహంతో కార్యకలాపాలు మొదలయ్యాయి. 1968వ సంవత్సరం కాలేజీకి ముఖ్యమైన సంవత్సరం. చాలా కొత్త ప్రణాళికలు కార్యరూపం దాల్చాయి.

అదే ఏడాది విద్యారంగంలో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని విశ్వవిద్యాలయం తీసుకుంది. అంతవరకు ప్రియూనివర్సిటీ అయిన తరువాత మూడు సంవత్సరాల నిడివి కలిగిన ఆనర్స్ తరగతులు యూనివర్సిటీకి నేరుగా సంబంధం కలిగిన సెంట్రల్ కాలేజీలో మాత్రం నడిచేవి. ఏ ప్రైవేటు కాలేజీలకు ఆనర్స్ క్లాసులను నడిపే అధికారం లేదు. ఐతే 1968 నుండి కొన్ని ప్రైవేటు కళాశాలలకు ఆనర్స్ తరగతులు నడిపేందుకు విశ్వవిద్యాలయం అనుమతి నిచ్చింది. దానితో మా కాలేజీలో మొత్తం ఐదు విషయాలలో ఆనర్స్ తరగతులు ప్రారంభించాము. మా విశ్వవిద్యాలయపు ఇంకే కాలేజీలోను ఐదు ఆనర్స్ తరగతులు నడపడానికి అవకాశమివ్వలేదు. మేమైతే అత్యంత శ్రద్ధాసక్తులతో ఆ తరగతులను నడిపి కీర్తి గడించాము. యథాప్రకారం ముఖ్యంగా సైన్సు సబ్జెక్టులలో ర్యాంకుల సింహభాగం మా కాలేజీకే. అతి పురాతనమైన, ప్రఖ్యాతిగాంచిన సెంట్రల్ కాలేజీ వెనుక పడిపోయింది. అక్కడున్న కొందరు ప్రొఫెసర్లకు దీనివల్ల ఇబ్బంది కలిగి ఉండవచ్చు. కొన్ని సంవత్సరాల తరువాత కారణాంతరాల వల్ల ప్రైవేటు కాలేజీలు నడుపుతున్న ఆనర్స్ తరగతులకు విశ్వవిద్యాలయం తన అనుమతిని వెనుకకు తీసుకుంది. ఆ విధంగా ప్రైవేటు కాలేజీల ఆనర్స్ క్లాసులు నిలిచిపోయాయి.

ఆనర్స్ డిగ్రీ మొదటి బ్యాచి విద్యార్థులతో హెచ్.నరసింహయ్య

గాంధీ శతజయంత్యుత్సవం

గాంధీ శతజయంత్యుత్సవం మన దేశానికి అతి ముఖ్యమైన సమారంభం. గాంధీజీ సందేశాలు విశ్వమాన్యమైనవి. ప్రపంచంలోని అన్నిదేశాలలో ఆలోచనాపరులకు, సామాజిక చింతన కలిగినవారికి గాంధీజీ పట్ల గౌరవ అభిమానాలున్నాయి. మా సంస్థలకైతే గాంధీజీ సమీపం. అందువల్ల 2-10-1968 నాడు గాంధీజీ శతమానోత్సవాన్ని విజృంభణతో అర్థవంతంగా ఆచరించాము. చాలా రోజులనుండి దానికి సంసిద్ధం అయినాము. ముందు రోజు అయితే విరామం లేని ఉత్కంఠభరితమైన పని. విద్యార్థులు, అధ్యాపకులు క్రియాశీలకంగా పాల్గొన్నారు.

గాంధీ శతజయంత్యుత్సవం

అన్ని కాలేజీలు విద్యార్థులు, ఉపాధ్యాయులతో సెంట్రల్ కాలేజీకి చెందిన విశాలమైన క్రికెట్ మైదానంలో ఏర్పాటయిన సభలో పాల్గొనాలని బెంగళూరు విశ్వవిద్యాలయం ఆదేశించింది. మా కాలేజీనుండి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఊరేగింపుగా వెళ్ళాము. పుష్పాలంకృతమైన గాంధీజీ ఛాయాచిత్రాన్ని ఒక వాహనం మీద ఎత్తికనిపించేలా పెట్టాము. ముందు మా పాఠశాల బ్యాండ్‌తో పాటు నాదస్వరం – మంగళ వాయిద్యాలతో సుమారు 1200 విద్యార్థులు, విద్యార్థినులు – అందరూ తెల్లని దుస్తులు ధరించారు. ఊరేగింపు ముందు భాగంలో తెల్లని వస్త్రాలను ధరించిన ఇద్దరు అశ్వారోహులు. వారూ మా కాలేజీ విద్యార్థులే.

కాలేజీ నుండి బయలుదేరి క్రమశిక్షణతో కూడిన ఈ ఊరేగింపు సెంట్రల్ కాలేజీ చేరడానికి సుమారు ఒక గంట సమయం పట్టింది. రోడ్డుకు ఇరువైపులా నిలబడి వందలాది ప్రజలు ఈ ఊరేగింపును చూసి ఆనందించారు. అశ్వారోహులు, బ్యాండ్ ఊరేగింపు నిర్ణీత సమయానికి సరిగ్గా సెంట్రల్ కాలేజీ మైదానంలో ప్రవేశించింది. అక్కడున్న వారంతా దీనిని చూసి డంగై పోయారు. అందరికీ ఆశ్చర్యం. ఇంత చక్కని క్రమశిక్షణతో కూడిన విద్యార్థుల పెద్ద ఊరేగింపును వేరే ఏ కాలేజీ ఏర్పాటు చేయలేదు. సభ మొదలయ్యింది. కొన్ని మామూలు ప్రసంగాలు. సభ ముగిసిన తరువాత అంతే క్రమశిక్షణతో మా విద్యార్థుల ఊరేగింపు కాలేజీకి వెనుదిరిగింది. పని ముగిసిన తరువాత క్రమశిక్షణతో వెనుకకు రావడం అపురూపం. 27 సంవత్సరాలు గడిచినా ఆ జ్ఞాపకాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి.

గాంధీ శతజయంతిలో భాగంగా Gandhiji’s Message to the Indian Youth అనే 175 పేజీల పుస్తకాన్ని మా కాలేజీ గాంధీ అధ్యయన కేంద్రం ప్రకటించింది. అది బీద ప్రజల, ఇంకా సమాజపు వివిధ సమస్యలపై గాంధీగారి రచనల సంకలనం. గాంధీగారి ఆ చరిత్రాత్మకమైన శతజయంత్యోత్సవంలో భాగంగా ప్రతి విద్యార్థికీ ఆ పుస్తకాన్ని ఒక్కొక్క ప్రతి ఉచితంగా పంచాము. దానిని కొన్నవారికి ఆ పుస్తకం వెల రెండున్నర రూపాయలు. ఉత్సవాలలో మితిమీరిన ధనాన్ని ఖర్చుచేయడానికన్నా ఇలాంటి అర్థవంతమైన పుస్తకాన్ని ఇవ్వడం మేలు. నేను తరువాత బెంగళూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి అయ్యాక ఆ సంవత్సరం అందరు పట్టభద్రులకు ఒక్కొక్క చిన్న పుస్తకాన్ని గుర్తుగా స్నాతకోత్సవం ముగిసాక పంచే ఏర్పాటు చేశాను.

గాంధీ అధ్యయన సంఘం – జాతీయ సాహిత్యపు లోతైన అధ్యయనం

నేషనల్ హైస్కూలు మా పదకొండు సంస్థలకు తల్లిలాంటిది. గాంధీజీ, మిగిలిన దేశనాయకుల నుండి స్ఫూర్తిని పొంది ఈ పాఠశాల ప్రారంభించబడింది. గాంధీజీ, ఇంకా జాతీయ చింతనలకు ప్రోత్సాహమిచ్చే ఉద్దేశంతో గాంధీ అధ్యయన కేంద్రాన్ని మొదలు పెట్టాము.

గాంధీ అధ్యయన కేంద్రాన్ని ప్రారంభిస్తున్న రాష్ట్ర విద్యాశాఖామాత్యులు కె.వి.శంకరగౌడ

గాంధీ ఆత్మకథ, నెహ్రూ ఆత్మకథ, వారిదే డిస్కవరీ ఆఫ్ ఇండియా, గాంధీతత్త్వాలైన కుటీరపరిశ్రమలకు సంబంధించిన, విద్యా విధానానికి సంబంధించిన, ఇంకా స్వామీ వివేకానంద మొదలైన జాతీయ నాయకులచే రచింపబడిన పుస్తకాలను 200 లేదా 300 ప్రతులు కొన్నాము. ఇన్ని ప్రతులను ఇంకే సంస్థా కొనలేదు. ఈ పుస్తకాలను తరగతిలో విద్యార్థులకు పంచి వాటి జతలో ఒక ప్రశ్నాపత్రాన్ని ఇచ్చేవాళ్ళం. పుస్తకం చదివి ఆ ప్రశ్నలకు ఉత్తరం వ్రాసి ఇవ్వడానికి సుమారు 2 నెలలు గడువు ఇచ్చేవాళ్ళం. వేసవి సెలవులు మొదలయ్యే ముందు పుస్తకాలను, ప్రశ్నాపత్రాలను ఇచ్చి సెలవులు ముగిసాక ఆ పుస్తకాలను, సమాధాన పత్రాలను తీసుకునేవాళ్ళం. అత్యంత సంతోషకరమైన విషయం ఏమంటే 75 శాతం విద్యార్థులు జాతీయ సాహిత్యాన్ని చదివేవారు. సమాధానాలను వ్రాసి ఇచ్చేవారు. వాటిని మూల్యాంకనం చేసి బహుమానాలను గాంధీ అధ్యయన కేంద్రం తరఫున ఇచ్చేవాళ్ళం. ఇది విజయవంతం కావడానికి వెనుక ఎంతో ప్రయత్నం ఉంది. నేను ఒక్కొక్క తరగతికీ వెళ్ళి దాని ప్రాముఖ్యాన్ని వాళ్ళ మనసుకు హత్తుకునేలా నొక్కి చెప్పేవాణ్ణి. ఇలాంటి కష్టతరమైన పనులు విజయవంతం కావాలంటే అధ్యాపకుల, విద్యార్థుల మధ్య మంచి సంబంధాలు ఉండాలి. ఈ ప్రణాళికలో ఈ క్రింద పేర్కొన్న పుస్తకాలున్నాయి.

  1. Gandhiji’s Autobiography 400 copies
  2. Nehru’s Discovery of India 300 copies
  3. Constructive Programme 300 copies
  4. Evil Wrought by English Medium 300 copies
  5. Linguistic Provinces 300 copies
  6. Medium of Instruction 400 copies
  7. My Socialism           300 copies
  8. Prohibition at any cost 300 copies
  9. Rebuilding our Villages 300 copies
  10. Strikes 300 copies
  11. Unto this Last           300 copies
  12. Women 300 copies
  13. Education           400 copies
  14. India and her Problems 400 copies

గోరా భేటీ

శ్రీ గోపరాజు రామచంద్రరావు గారు సాంప్రదాయిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినవారు. వారిని అందరూ ‘గోరా’ అనే గుర్తించేవారు. వారు విశిష్టమైన వ్యక్తులు, తీవ్రమైన నాస్తికులు. ఏ ములాజాకు లొంగని నాస్తికులు. అయితే అంతే గొప్ప సంఘసంస్కర్త, గాంధేయవాది, నిస్వార్థ సేవకులు. వారికి గాంధీజీగారి కార్యక్రమాలపై అచంచలమైన నమ్మకం. సదా ఖద్దరు ధరించేవారు.

విజయవాడలో ‘నాస్తిక కేంద్రం’ అనే సంస్థను స్థాపించారు. పేరు నాస్తిక కేంద్రమైనా దాని ఆశ్రయంలో వివిధ రంగాలలో ఉత్తమమైన సమాజసేవ చేస్తూ ఆంధ్రప్రదేశపు ఆ ప్రాంతంలో, ఇంకా మిగిలిన భాగాలలో కూడా జనప్రియత్వాన్ని సంపాదించింది. వారికి కుటుంబ నియంత్రణపై నమ్మకం లేదు. (వారికి 9 మంది సంతానం). వారి పేరు రామచంద్రుడైనా ఆ పేరుకు వారు జవాబుదారీ కాదు. వారి తల్లిదండ్రులకు తమ కుమారుడు ఇంత తీవ్రమైన నాస్తికుడు అవుతాడని తెలిసి ఉండలేదు. అయితే ఒక కఠోరమైన నాస్తికుడు తన పిల్లలకు దేవుని ప్రభావం ఇసుమంతైనా లేని పేర్లను పెట్టాలనుకోవడం వారి తాత్విక దృష్టిలో సరైనదే. అందువల్ల వారి పిల్లలకు పెట్టాల్సిన పేర్లలో రామ, కృష్ణ, నరసింహ, సీత, గీత మొదలైన ధార్మికమైన పేర్లు నిషిద్ధం. వారు స్వతంత్ర భావాలు కలిగినవారు. పిల్లల పేర్ల విషయంలో కూడా అంతే. వారి పిల్లల పేర్లు దేశపు ముఖ్యమైన సంఘటనలను గుర్తించేలా ఉండాలని నిర్ణయించారు.

గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం మొదలుపెట్టిన సంవత్సరం పుట్టిన కుమారునికి లవణం, గాంధీ-ఇర్విన్ ఒప్పందం జరిగిన సంవత్సరంలో పుట్టిన కుమార్తెకు మైత్రి, గాంధీజీ మూల విద్యను ప్రతిపాదించిన సంవత్సరం పుట్టిన కుమార్తెకు విద్య, దేశంలో మొదటిసారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ అద్భుతమైన గెలుపు సాధించిన సంవత్సరం పుట్టిన కుమారునికి విజయం ఇలా మిగిలిన పిల్లలకు (పేర్లు మరిచిపోయాను) ఇలాంటి పేర్లనే పెట్టారు. తొమ్మిదవ సంతానానికి ఇంకేమీ తోచక నౌ అని పేరు పెట్టారు. పదవ సంతానం పుడితే దానికి బస్ (చాలు) అని పేరు పెడతానని వారు స్నేహితులతో తమాషాగా చెప్పేవారట. అయితే దేవుని దయవల్ల పదవ సంతానం కలుగలేదు. అలా దస్ లేకుండానే బస్ అయ్యింది!

గోరా గారు జూలై 1968లో బెంగళూరుకు వచ్చారు. వారిని కాలేజీకి పిలిపించి విద్యార్థులకు ఒక ఉపన్యాసం ఇప్పించాలని నా ఆశ. అప్పుడు నేను కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఉన్నాను. బెంగళూరులో ఉన్న వారిని మా హాస్టల్లోనే వుండి విద్యార్థులకు ఉపన్యాసమివ్వాలని అడిగాను. ఒప్పుకున్నారు. సాయంత్రం వారి ఉపన్యాసం ఏర్పాటు చేశాము. మేము ఇద్దరమూ సభాప్రాంగణానికి బయలు దేరాము. కార్యక్రమం ప్రార్థనతో మొదలౌతుందని చెప్పాను. “నేను ప్రార్థనలో పాల్గొనను. నేను ఇక్కడే నిలబడి ఉంటాను. మీరు ప్రార్థన ముగించుకుని రండి. ఆపైన ఇద్దరమూ వెళదాము” అన్నారు. అలాగేనని సభలోనికి ప్రవేశించాను. విద్యార్థులకు ఆశ్చర్యం వేసింది. ముఖ్య అతిథులే లేరు. కారణం చెప్పాను. విద్యార్థులకు ముఖ్య అతిథి గారిని చూడాలనే కుతూహలం ఇంకా ఎక్కువ అయ్యింది. ప్రార్థన ముగించుకుని వారిని పిలుచుకుని వచ్చాను. సమాజ సేవా కార్యక్రమాలపై చాలా బాగా మాట్లాడారు. నాస్తికత గురించి ఏ ప్రస్తావనా తీసుకురాలేదు. ఉపన్యాసానికి వచ్చే ముందు తాను పూల హారం వేయించుకోననీ, కూరగాయల హారం వేయించుకోవడానికి అభ్యంతరం లేదని చెప్పారు. ఆ విధంగానే వంకాయ, బీన్స్, టమోటా, క్యారెట్, ముల్లంగి, బెండకాయ మొదలైన కూరగాయలతో కూర్చిన హారాన్ని వేశాను. విద్యార్థులకు ఆశ్చర్యమే ఆశ్చర్యం. పూల హారం వ్యర్థమౌతుంది కూరగాయల హారం ఉపయోగించుకోవచ్చు అనేది వారి వాదన.

వారి నాస్తికవాదం గురించి ఆ రోజు రాత్రి వారితో చర్చించాను. వారి నాస్తికవాదాన్ని నేను ఒప్పుకోనని, దేవుడున్నాడు లేడు అనేది నమ్మకానికి సంబంధించిన విషయమే తప్ప తార్కికంగా దేనిని నిరూపించడానికి సాధ్యం కాదని తెలిపాను. అయితే వారి వైఖరి తిరుగులేనిది.

నాస్తిక కేంద్రంలో గోరా గారి కొడుకులు, కోడళ్ళు, మనుమలు అందరూ నివసిస్తున్నారు. మొత్తం 20-25 మంది ఉండవచ్చు. వారంతా పక్కా నాస్తికులే. నాస్తిక కేంద్రానికి నేను రెండు సార్లు వెళ్ళాను. పైకి చూడటానికి అదొక దేవుడు లేని ఆశ్రమం లాగా ఉంది. అయితే అక్కడున్నవారంతా సమాజంలోని వివిధ రంగాలలో నిస్వార్థ సేవ కోసం తమను తామే జీవితాంతం అర్పించుకున్నారు. దేవుడు ఉంటే నాస్తిక కేంద్రంలో ఉండే సంభవం ఎక్కువ. సాంప్రదాయిక ధార్మిక మఠాలలో ఉండేది అనుమానమే.

మనియార్డర్ అందలేదు

1969వ సంవత్సరం అక్టోబర్ 9వ తేదీ శుక్రవారం. ఆయుధపూజ. తెల్లవారు జామునే మెలకువ అయ్యింది. సమయం 4.15 అయ్యింది. మళ్ళీ పడుకున్నాను. నిద్ర రాలేదు. అలాగే ఆలోచిస్తూ ఉన్నాను. ఆ రోజు నా ఆలోచనలకు చిక్కిన అంశం తద్దినం పెట్టే విధానం. దానిని ఆమూలాగ్రంగా విమర్శిస్తున్నాను. ‘కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతాలను తార్కిక నమ్మకాలను కలిగిన హిందువులు ఎంత అతార్కికంగా ఈ కర్మలను చేస్తారు. కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి తరువాతి జన్మ అతని కర్మపై ఆధారపడి ఉంటుందని చెబుతాము. అయితే చనిపోయిన వారిని ఆత్మ శ్రేయస్సు కోసం ఏడాదికొకసారి కర్మ చేస్తే సాంప్రదాయాన్ని ఆచరిస్తాము. ఈ కర్మల వల్ల సద్గతి దొరికేటట్టయితే కర్మసిద్ధాంతం మొదలుకు గొడ్డలి పెట్టు అవుతుంది. చనిపోయిన వారు ఎక్కడో పుట్టి ఉండవచ్చు. అయితే మనం చేసే కర్మలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. తిథి జరిపే ముఖ్య ఉద్దేశం చనిపోయినవారిని కృతజ్ఞతతో జ్ఞాపకం చేసుకోవడం. ఆ రోజు చనిపోయినవారి పేరు మీద బీద విద్యార్థులకు పుస్తకాలనో, అన్నమో, బట్టలో ఇస్తే లేదా ఆసుపత్రిలో ఉన్న పేద రోగులకు దానమో చేస్తే ఎంత సార్థకమైన కార్యమౌతుంది. ఈ కర్మల సదుద్దేశాన్ని మరిచి పొట్టునే బలమైనదిగా భావించి ఎలాంటి మొండి సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఉన్నాము’ అని మనసులో మథనపడ్డాను. ఎంతో మందికి ఈ ఆచారం ఓ వార్షిక హింస అయింది కదా అని బాధపడుతూ మళ్ళీ లైట్ వేసినప్పుడు సమయం 5-30 అయ్యింది. ఆ రోజు ఉదయం 6.30కు మా విద్యాసంస్థల అధికారులలో ఒకరైన శ్రీ ఎస్. బాలసుబ్రహ్మణ్యం గారూ, నేనూ మా కళాశాల రజతోత్సవాల నిధి కోసం దానం అడగడానికి ఒక శ్రీమంతుని ఇంటికి వెళ్ళవలసి ఉంది. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు హాస్టల్‌కు 6.15 గంటలకు వచ్చారు. ఇద్దరమూ ఆటోరిక్షాలో 6.30 గంటలకు ఆ శ్రీమంతుల ఇంటికి వెళ్ళాము. ప్రతిరోజూ సామాన్యంగా ఉదయం 7 గంటలకు ఇల్లు వదిలే వారు ఆ రోజు 6 గంటలకే ఏదో పని తగిలి వారు ఇల్లు విడిచారు. మేము వచ్చేది తెలిసి ఇలా చేశారు కదా అని నిరాశతో నిట్టూర్చాము. చాలా అర్జెంటు పనిమీద వెళ్ళివుండవచ్చని సమాధాన పరచుకున్నాము. మళ్ళీ కాలేజీకి వచ్చి సుమారు 7.30 గంటలకు కాలేజీ శ్రేయోభిలాషులు మరియు నా అభిప్రాయంలో దానమిచ్చేటంతటి ధనమున్న వారూ అయిన నలుగురికి ఫోన్ చేశాను. మూడు రోజులక్రిందటే వారికి వినతి పత్రం పంపాను. ఒకరు పూజ చేస్తున్నారు. ఇంకొకరు బాత్రూమ్‌లో ఉన్నారు. ఇంకొకరి ఫోన్ మ్రోగుతూనే ఉంది. అయితే ప్రత్యుత్తరం లేదు. నాలుగవ వారి ఆర్థిక స్థితి చాలా చింతాజనకంగా ఉందని తెలిసింది. ‘ఎందుకో ఈ రోజు ఏ పనీ కాలేదు కదా’ అనుకుంటూ పేపర్ చదువుతూ కూర్చున్నాను. ఒక ఫోన్ కాల్ సుమారు 8.15 గంటలకు వచ్చింది. “హలో” అన్నాను. దానికి బదులుగా “మధుగిరి నుండి నరసింహయ్య గారికి ఒక ట్రంక్కాల్ ఉంది” అని ఆపరేటర్ చెప్పారు. మధుగిరి నుండి ఫోన్ కాల్ అన్నప్పుడు నా గుండె కొట్టుకుంది. మధుగిరి సమీపంలోని గుండ్లహళ్ళిలో ఉన్న నా చెల్లెలికి కొన్ని రోజులనుండి ఆరోగ్యం బాగాలేదు. “ఔను. నేనే నరసింహయ్య” అన్నాను. “మాట్లాడండి” అని అక్కడ పార్టీకి ఆపరేటర్ చెప్పారు. యంత్రదోషం వల్ల ఆ పార్టీకి, నాకూ కనెక్ట్ కాలేదు. రెండు మూడు సార్లు ప్రయత్నించినా కుదరలేదు. చివరకు ఆపరేటరే “మీ చెల్లెలు గంగమ్మకు సీరియస్‌గా ఉంది. వెంటనే వెళ్ళాలట” అని చెప్పారు. వెంటనే టాక్సీ వెదకడం ప్రారంభించాను. దొరకలేదు. నాకు పరిచితులు, టాక్సీ యజమానీ కమ్ డ్రైవర్ అయిన శ్రీ సింగ్ గారి ఇంటిని మా కాలేజీ అటెండర్ ద్వారా తెలుసుకున్నాను. “ఇంటిలో సింగ్ ఉన్నారు. ఆయుధ పూజ చేస్తున్నారు. ఇంకా 15-20 నిముషాలకు వస్తారట” అని చెప్పారు. అక్కడ నిలబడటానికి కాక అటెండర్‌తో కలిసి కాలేజీ సమీపంలోనే సర్వేయర్ వీధిలో ఉన్న వారింటికి వెళ్ళాను. వారు తమ వాహనానికి పూజ చేస్తూ ఉన్నారు. పూజ ముగించి ప్రసాధాన్ని ఇచ్చి తమ డ్రైవర్ వేషాన్ని ధరించి వచ్చిన తరువాత అక్కడి నుండే మధుగిరికి బయలుదేరాము. ఇంతకు ముందు రెండుసార్లు అదే పల్లెకు వచ్చి ఉన్నారు. వారికి రహదారి కానీ, ఊరు గానీ కొత్తది కాదు.

సుమారు సగం దూరం వెళ్ళాక “నా చెల్లెలికి చాలా ఖాయిలా అంట. ట్రంక్కాల్ వచ్చింది. అందుకే వెళుతున్నాము” అన్నాను. “ఏమి ఖాయిలా స్వామీ?” అన్నారు. “నేను గౌరమ్మ పండగ రోజు వెళ్ళాను. అప్పుడు కొంచెం కోలుకుని ఉన్నారు. ఇంకే తొందరా లేదు అని డాక్టర్లు చెప్పారు. ఇంజక్షన్, టానిక్ తీసుకుంటున్నారు” అన్నాను. ఆ 65 మైళ్ళ దూరం ప్రయాణంలో మా యిద్దరి మధ్యా అంతే సంభాషణ. ఆ రెండున్నర గంటల కాలం నా మనసులో ఏమేమో ఆలోచనలు చెలరేగాయి. అన్నీ నా తల్లి, తండ్రి, నా బాల్యానికి సంబంధించినవి. పల్లెకు 11.30కి చేరాము. నా చెల్లెలి కొడుకు పల్లె ముందే నిలబడి వున్నాడు. చెల్లెలు తెల్లవారు జామున మరణించిందని తెలిపాడు. చెల్లెలి పక్కలో కొంచెం సేపు కూర్చున్నాను. తరువాత కార్యక్రమాలకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఒకరిద్దరు వదిలి రావలసిన వారంతా సుమారు మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చారు.

నాలుగు గంటల సమయానికి శవం ఇల్లు వదిలింది. దాని వెనుక ఆ చిన్న పల్లెలో ఉన్న ఎక్కువ మంది ఆబాలవృద్ధులు, స్త్రీలు, పురుషులు అందరూ ఉన్నారు. ఒక విద్యాసంస్థకు వివిధ హోదాల్లో సుమారు 35 సంవత్సరాలు పనిచేసి 6-7 సంవత్సరాల క్రితం చనిపోయిన ఒకరి అంతిమయాత్ర అప్పుడు జ్ఞాపకం వచ్చింది. వారి పార్థివ దేహం వెనుకల వెళుతున్న వారి సంఖ్య కేవలం నలుగురు. బెంగళూరు ఫుట్‌పాత్‌పై వెళుతున్నప్పుడు చూసిన వారికి ఎవరిదో అనాథ శవం వెళుతున్నదన్న భావన కలిగేలా ఉంది. (దీనిని ఇంకొక చోట ప్రస్తావించాను.) అకస్మాత్తుగా వారికి ప్రాణం వచ్చి చుట్టూ చూసి తమ ఆప్తులు, శ్రేయోభిలాషులు, ప్రాణస్నేహితులు, తమ నుండి సహాయం పొందిన లెక్కలేనంత మంది ప్రజలు, ఇంకా ఏళ్ళ తరబడి కలిసి పనిచేసిన సహోద్యోగులు ఎవరూ లేకపోవడం చూసి ఈ లోకమెంత కృతఘ్నమైనదని నిట్టూరుస్తూ గుండెపోటుతో మళ్ళీ చనిపోతారని నాకు అనిపించింది.

పట్టణపు వాతావరణం మానవీయతను నశింపజేస్తుంది. పక్క ఇంటివారిని ప్రేమించలేని నాగరీకులు ప్రపంచాన్ని ప్రేమిస్తారట! నగరజీవితం యాంత్రికమైనది, అసహజమైనదని నాగరీకుల నడత విషయమై ఖేదపడుతూ శవాన్ని అనుసరించాను. అంతలో కొద్దిగా వాన మొదలయ్యింది. నా పక్కన ఒక ముసలాయన వస్తున్నారు. వారు నా వైపు చూసి “అయ్యో వాన మొదలయ్యింది కదా. మీకు ఒక గొడుకు తెచ్చి ఉండాల్సింది కదా” అన్నారు. ఆ మాట నాకు మొఖం మీద కొట్టినట్టు అయ్యింది. నా మనసుకు చాలా నొప్పి కలిగింది. “నా చెల్లెలు వర్షంలో తడుస్తూ ఉంది. పిల్లలు, ముసలి వారు అందరూ వర్షంలో తడుస్తూ ఉన్నారు. తెల్ల బట్టలు వేసుకున్న నేనెందుకు వర్షంలో తడవకూడదు? ఈ వృద్ధుని మూలాన పట్టణవాసి ఐన నాకు మంచి శాస్తి జరిగింది” అంటూ ఆలోచిస్తూ శ్మశానాన్ని చేరాము.

శ్మశానం పక్కనే ఒక గుట్ట. మిగిలిన దిక్కులలో పచ్చని పొలాలు. ప్రశాంతమైన వాతావరణం. ఇక మట్టిలో కలపాలి. అంతలో ఆ గుంపు నుండి ఒకరు “ఆగండి, ఆగండి. పల్లె వైపు నుండి ఒకరు పరిగెత్తుకుని వస్తున్నారు. అతడు ఆఖరి చూపు చూడనీ. కొంచెం ఆపండి” అన్నారు. మూడు నాలుగు నిముషాలు అందరమూ ఆ దిక్కుకు చూశాము. మనిషి వచ్చాడు. అతడు అల్లుడు కాదు. అదే పల్లెలోని వ్యక్తి. మొదటి పిడికెడు మట్టి దేహంపై వేసి ముఖం తిప్పుకుని కొంత దూరంలో కనిపిస్తున్న మధుగిరి కొండను చూస్తూ నిలుచుకున్నాను. అంతా అయిపోయింది. వెనుకకు చూడకుండా నడవండి అని ఎవరో చెప్పారు. అందరూ మళ్ళీ పల్లె వైపుకు కదిలాము. దారిలో కనిపించిన ఒక కాలువలో అందరూ కాళ్ళూ చేతులు, ముఖం కడుగుకున్నారు. నేనూ కడుగుకున్నాను. అందరూ మౌనంగా ఉన్నారు. ఒక స్త్రీ “పుణ్యం చేసింది. ముత్తైదువుగానే పోయింది, మార్నోమి (మహర్నవమి) రోజు “ అన్నారు. “ఔను” అని పలువురు గొంతు కలిపారు.

ఇంటికి వచ్చాము. పక్కింటివారు “నీళ్ళు కాచినాము. స్నానం చేయాలి” అన్నారు. “ఎందుకు చేయాలి” అని అడగలేదు. స్నానం చేశాను. నా హేతువాద బుద్ధికి ఒక గంట విరామమిచ్చాను.

నాకన్నా వెనుక పుట్టి, నాకన్నా ముందే చనిపోయింది కదా అనేదే నాకు చాలా వ్యథను కలిగించింది. నేను చనిపోయాక ఏడ్వడానికి చెల్లెలు లేకపోయింది. ముందు పుట్టిన వారు ముందు ఎందుకు చచ్చిపోరు? చిన్నవాళ్ళు ముందు చనిపోవడం చాలా అన్యాయం. చదువుకున్న ప్రజలు, ఉద్యోగం చేస్తున్న ప్రజలు ‘సీనియారిటి, సీనియారిటి’ అని జీవిత పర్యంతం మొత్తుకుంటూ ఉంటారు. జీవితపు ముఖ్యమైన విషయంలో నా ‘సీనియారిటి’ పోయింది కదా. ప్రజలు చేసుకున్న నియమాలకూ, దేవుడి నియమాలకూ పొంతనలేదు. ఏదీ సరిగ్గా తెలియదు వంటి ఆలోచనలు ఒకదాని వెంట ఒకటి వస్తున్నాయి.

నా చెల్లెలికి రెండు రోజుల క్రితం పంపిన చివరి మనియార్డర్ చేరలేదు. ఎక్కడికో వెళ్ళిపోయింది. మారిన అడ్రస్ ఇవ్వలేదు. ఆమె లోకంలో మన దేశపు కరెన్సీ చలామణీలో లేదేమో?

జాతీయ సేవా పథకం (National Service Scheme)

1968వ సంవత్సరంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ ఒక ముఖ్యమైన పథకాన్ని మొదలుపెట్టింది. ఇది అన్ని కాలేజీలకు అన్వయించే ఒక సేవా కార్యక్రమం. మాకేమీ ఇది కొత్తకాదు. కొన్ని సంవత్సరాల క్రితమే సేవా సంఘాన్ని ఇదే ఉద్దేశంతో ప్రారంభించాము. సేవా సంఘం పనులను చక్కగా నడుపుకుంటూ వస్తున్నాము. ఐతే ఒక వ్యత్యాసముంది. సేవాసంఘానికి డబ్బుల సర్దుబాటు మేమే చేసుకోవలసి ఉండేది. అయితే జాతీయ సేవా పథకానికి యూ.జి.సి. కాలేజీల ద్వారా ధనసహాయం చేస్తుంది. మాకు ధన భారం కొంచెం తక్కువ అయ్యింది. 100 మంది విద్యార్థినీ విద్యార్థులను ఈ పథకంలో పాల్గొనడానికి ఎంపిక చేశాము. వారిలో ఎక్కువ మంది సేవాసంఘంలో పనిచేసి ఆరితేరినవారు. మా వెనుకటి కార్యకలాపాలను ముందుకు నడిపాము.

జాతీయ సేవా శిబిరం

ఎన్.ఎస్.ఎస్. నియమాల ప్రకారం సంవత్సరానికి ఒకసారి 10 రోజుల ఒక శిబిరాన్ని ఒక పల్లెలో నడపాలి. శిబిరం గురించి మేము కొంచెం గాఢంగా ఆలోచించినాము. 10 రోజుల శిబిరంలో పోవడానికి ఒక రోజు, తిరిగి వాపసు రావడానికి ఒక రోజు. ఆ రెండు రోజులు ఏ పనీ చేయడానికి కుదరదు. ఇక మిగిలింది 7-8 రోజులు. ఆ ఒక వారంలో కొత్తగా అడుగుపెట్టిన పల్లెలో ప్రభావవంతంగా పనిచేయడం సాధ్యపడదు. పల్లెకు వెళ్ళిన తరువాత కొంచెమైనా ఉపయోగమైన పని చేయాలి. ఇవన్నీ సుదీర్ఘంగా ఆలోచన చేసి ఒక నెల శిబిరాన్ని నడపడానికి నిశ్చయించినాము. విశ్వవిద్యాలయం ఇచ్చే ధనం 10 రోజుల శిబిరానికి మాత్రమే. మిగిలిన 20 రోజుల శిబిరానికి సార్వజనికుల నుండి ధనసేకరణ ఒకటే మార్గం. ప్రతి ఏడు పని చేయడానికి అనుకూలంగా బెంగళూరుకు 20-25 కి.మీ. దూరమున్న పల్లెలను వెదకాలి. శిబిరం మొదలు కావడానికి ఒకటి రెండు నెలలకు ముందే వెదికే పని మొదలయ్యేది.

రాష్ట్రంలో రికార్డు సృష్టించిన నాలుగు శిబిరాలు

ఒక నెల ఎన్.ఎస్.ఎస్. శిబిరాన్ని వేసవి సెలవులలో నిలకడగా నాలుగు సంవత్సరాలు నడిపాము. ఆ నాలుగు శిబిరాలలోనూ క్రియాశీలక పాత్రను నేను నిర్వహించానని చెప్పవలసిన పనిలేదు. ఆ నాలుగు శిబిరాల కార్యక్రమాలు స్థూలంగా ఒకటే. సుమారు 60-70 మంది విద్యార్థులు పాల్గొనేవారు. వారిలో సుమారు 20 మంది విద్యార్థినులు. విద్యార్థులకు ఒక నెల రోజుల శిబిరం. అయితే విద్యార్థినులకు శిబిరపు ఉత్తరార్థంలో 15 రోజులు మాత్రమే. శిబిరం కార్యక్రమం తెల్లవారు జామున మొదలయ్యేది. ఉదయం 5 గంటలకు లేచి, 5.30 గంటలకు ప్రార్థనతో కార్యక్రమాలు ప్రారంభమయ్యేది. ఉదయం ఫలహారం ముగించుకుని ఆ పల్లెలో ముందే నిర్ణయించుకున్న పనిని చేయడం మొదలెట్టేవారు. అది అక్కడున్న పాఠశాలకు రెండు మూడు అదనపు గదులను నిర్మించే పని కావచ్చు లేదా ఆ పల్లెకు అవసరమైన ఇంకేదైనా పని కావచ్చు. ఈ పని ఉదయం సుమారు మూడుగంటలు, మధ్యాహ్నం సుమారు మూడుగంటలు చేసేవారు. ఇలా రోజంతా శ్రమతో కూడిన పని అయితే రాత్రి పూట బుద్ధితో కూడిన పని. మొదటి మూడు శిబిరాలకు నేను ప్రతిరోజూ సాయంత్రం వెళ్ళి రాత్రి అక్కడే ఉండేవాణ్ణి. ప్రతిరోజు బౌద్ధిక శిబిరంలో దేశానికి, సమాజానికి సంబంధించిన సమస్యల గురించి సుమారు ఒక గంట మాట్లాడేవాణ్ణి. అవి విద్యాపరమైన సమస్యలు కావచ్చు. శాస్త్రీయ దృక్పథం లేదా మూఢనమ్మకాలపై కావచ్చు. ఈ కార్యక్రమం గురుకుల పద్ధతిలో జరిగేది. మేమంతా చాపపైన కూర్చునేవాళ్ళం. నా ముందు, చుట్టు పక్కల విదార్థులు కూర్చునేవారు. నా ఉపన్యాసం ముగిసిన వెంటనే ఒక గంట ప్రశ్నోత్తరాలు. కొన్నిరోజులు ఈ రాత్రిపూట రెండు గంటల కార్యక్రమం మూడు గంటలు దాటేది. ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమం చాలా ఆహ్లాదకరంగా ఉండేది. ఉల్లాసంగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో ప్రశ్నలను అడిగేవారు. న్యాయంగా తరగతులలోనూ చర్చకు అవకాశం ఉండాలి. ప్రశ్నోత్తరాలు తరగతులకు జీవం పోస్తాయి. అధ్యాపకులే ఎప్పుడూ మాట్లాడుతుంటే విద్యార్థులకు విసుగు కలిగే సంభవం ఉంది. చర్చయే నిజమైన విద్య. ఎన్.ఎస్.ఎస్. విద్యార్థిని కేవలం శారీరిక శ్రమలో మునిగేటట్టు చేయడం తప్పు అవుతుంది. వాడిని కూలివాడిగా చేసినట్లు అవుతుంది. మనదేశంలో చేతులతో పనిచేయడం చేతులకు మట్టిని అంటించుకోవడం తక్కువపని, అవమానం, తమ ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుందని సామాన్యుని భావన. అందుకే ఎన్.ఎస్.ఎస్. కార్యక్రమాలలో కాయకష్టానికి అంత ప్రాధాన్యతను ఇస్తారు. నాకు తెలిసినట్లు ప్రతి కాలేజీలో ఎక్కువ సంఖ్యలో కష్టజీవులే చేరుతారు. వారికి చేతికి మట్టి అంటించుకుని పని చేయడం కొత్త కాదు. పై స్థాయి విద్యార్థులు, బుద్ధివంతులైన విద్యార్థులు, మునుముందు పెద్ద పెద్ద అధికారులు, శాస్త్రజ్ఞులు, ఉన్నతులు కాబోయేవారు ఈ ఉపయుక్తమైన సేవా కార్యక్రమాలలో పాల్గొనాలి. ఒక సంతోషకరమైన విషయం ఏమిటంటే మునుపటి సేవా సంఘంలోను, ప్రస్తుతపు ఎన్.ఎస్.ఎస్.లోను ఎక్కువమంది విద్యార్థినీవిద్యార్థులు మధ్యతరగతి వర్గానికి చెందినవారు. అక్కడక్కడా శ్రీమంతులు ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే అన్ని శిబిరాలలోనూ స్థానిక యువకులను మా పనులలో కలుపుకునేవాళ్ళం. ఈ శిబిరాల జ్ఞాపకాలు వీటిలో పాల్గొన్న వారికి ఇప్పటికీ మాసిపోలేదు. పాఠాలను మరిచిపోయే సంభవముంది. అయితే ఈ విశిష్టమైన అనుభవాలను, స్వచ్ఛందంగా చేసిన పనులు అంత త్వరగా జ్ఞాపకాల నుండి దూరం కావు. నన్ను అప్పుడప్పుడు పూర్వవిద్యార్థులు అకస్మాత్తుగానో, వ్యవస్థితంగానో కలుస్తారు. ఆ శిబిరాలలో పాల్గొన్న విద్యార్థులు తమ అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటారు. “మేము ఈ పల్లె శిబిరంలో పాల్గొన్నాము. ఆ పల్లెలో పాల్గొన్నాము” అని గర్వంగా చెప్పుకుంటారు. ఆ అనుభవం వారి జీవితంలో ఎక్కువ మార్గదర్శనం చేస్తుందని వారికి ఒక తృప్తి.

మొదటి శిబిరం

బెంగళూరుకు 20-25 కి.మీ. దూరంలో మాగడి మార్గంలో ఉన్న బాపా గ్రామాన్ని ఎంచుకున్నాము. అది నిర్జన ప్రదేశం. పక్కన ఉన్న పల్లెలు సుమారు 1 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఆ పల్లెలో స్వచ్చతా కార్యక్రమాలు; రెండు మూడు ఆస్ట్రా (Astra) శౌచాలయాలను మా విద్యార్థులు కట్టారు. కాలేజీ పని ముగించుకుని ప్రతి సాయంత్రం సుమారు 6 గంటలకు సిటీ మార్కెట్టు నుండి బస్సులో బాపా గ్రామానికి వెళ్ళేవాడిని. అప్పుడు సేవా శిబిరపు ప్రారంభోత్సవం బెంగళూరు విశ్వవిద్యాలయపు ఉపకులపతి ప్రొ. వి. కె. గోకాక్ గారు నెరవేర్చారు.

బాపా గ్రామంలో జరిగిన జాతీయ సేవా శిబిరం ముగింపు కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ వీరేంద్ర పాటిల్.

ముగింపు సమావేశానికి ముఖ్యమంత్రి గారైన శ్రీ వీరేంద్ర పాటిల్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారి సంభాషణలో నాగురించి ఇలా చెప్పారు. “మీ ప్రిన్సిపాల్ గారు నన్ను ఆహ్వానించడానికి వచ్చారు. వారిని నేను చూడటం అదే మొదటిసారి. వారిని చూసినప్పుడు ఏదో గ్రామానికి చెందిన పంచాయతీ సభ్యుడని అనుకున్నాను.” కనీసం పంచాయతీ ఛైర్మన్ స్థానం ఐనా ఇవ్వలేదన్నదే వారిపై నాకున్న అసంతృప్తి!

చీపురు సంఘటన

సేవా శిబిరంలో చీపుర్ల అవసరం వచ్చింది. చుట్టూ ఏ పల్లెలోనూ చీఫురు దొరకలేదు. అందువల్ల “రేపు సాయంత్రం మీరు వచ్చినప్పుడు చీపుర్లను తీసుకురండి సార్” అని నా శిబిరార్థులు అడిగారు. “సరే” అన్నాను. మరుసటిరోజు యథాప్రకారం సిటీమార్కెట్‌కు ఆటోలో చీపుర్లతో పాటు వెళ్ళాను. పల్లెలకు వెళ్ళే సాయంత్రం బస్సులలో సాధారణంగా విపరీతమైన రద్దీ. పొద్దునో, మధ్యాహ్నమో బెంగళూరుకు వచ్చినవారు బస్సులలో తిరిగి వెళతారు. ఆ చీపుర్ల కట్టను నెత్తిమీద పెట్టుకుని ఎక్కడం సులభం అనిపించింది. ఎడమ చేతిని తలపై ఉన్న చీపురు కట్టను పట్టుకోవడానికి ఉపయోగించి కుడి చేతి సహాయంతో బస్సు ఎక్కడానికి ప్రయత్నించాను. ఎక్కువ మంది ప్రజలు బస్సు లోపలికి పోవడానికి నేను ముందు నేను ముందు అంటూ పోటీ పడుతున్నారు. వారిలో నేనూ ఒకడిని. అప్పుడు నా వయసు 49 యేళ్ళు. పల్లెటూరి వారితో పోటీ పడే శక్తి ఉంది. చీపురు తగిలిన వారు ఆక్షేపించడం మొదలు పెట్టారు. నేనింకా లోపలికి పోవడానికి కాలేదు. వాకిలి దగ్గరే చిక్కుకు పోయాను. కండక్టర్ రాగానే చీపురు కట్టలను బయటకు తోసి “నీకసలు బుద్ధి ఉందా? ఇంత పెద్ద చీపురు కట్టలను నెత్తిపై పెట్టుకుని పశువులు నూకినట్లు నూకుతున్నావు. వీరంతా ఎక్కిన తరువాత నీ సామానుతో సహా ఎక్కు. పల్లెటూరిబైతులా నూకొద్దు” అన్నాడు. అక్కడున్న వారందరూ పల్లెటూరి వాళ్ళే. అయితే వారెవరూ చీపురు కట్టలను పట్టుకోలేదు. నా తెల్ల దుస్తులను చూసి అయినా నేను అంతో ఇంతో చదువుకున్నవాణ్ణని అతనికి తెలియలేదు. నన్ను ప్రిన్సిపాల్ అని గుర్తించడమైతే అపరిచితులకు అసాధ్యం. నా రంగు, చీపురుకట్టల మోపు, ఇంకా తోసుకుంటూ పోయే అసభ్యమైన ప్రవర్తన మూలకంగా కండక్టర్ నా గురించి అలా తీర్మానానికి రావడం అసహజమేమీ కాదు. మారుమాట్లాడకుండా క్రిందపడ్డ చీపురు కట్టల మోపును నెత్తిమీద పెట్టుకుని ఒత్తిడి తగ్గే వరకూ వేచిఉండి లోపలికి వెళ్ళాను. ఆ శిబిరం నడిచింది 1969వ సంవత్సరం మే- జూన్ నెలలలో.

రెండవ శిబిరం

1970వ సంవత్సరంలో బెంగళూరుకు తూర్పు వైపు సుమారు 25 కి.మీ.ల దూరంలో ఉన్న బేగూరులో నడిపాము. ఆ ఊరిలో ఒక హైస్కూలు ఉంది. ఆ పాఠశాలకు రెండు, మూడు గదులు అవసరం ఉంది. గ్రామ పెద్దల సహాయంతో మా విద్యార్థులు చాలా శ్రమించి ఆ గదులను కట్టి ఆ ఊరివారి కృతజ్ఞతకు పాత్రులయ్యారు. బేగూరికీ ప్రతిరోజు సాయంత్రం వెళ్ళేవాడిని. శిబిరం ముగింపు సమావేశానికి రాష్ట్ర గవర్నర్ శ్రీ ధర్మవీర్ గారు వచ్చారు.

మూడవ శిబిరం

1971వ సంవత్సరంలో బెంగళూరుకు దక్షిణంలో సుమారు 15-20 కి.మీ.ల దూరంలో ఉన్న పుట్టేనహళ్ళిలో నడిచింది. నివసించడానికి పొలాల మధ్యలో గుడిసెలు వేసుకున్నాము. మంచి వాతావరణం. 15 రోజుల తరువాత విద్యార్థినులు వచ్చారు. వచ్చిన రోజు రాత్రే పెద్ద వర్షం. ఉరుములు, మెరుపులు, పిడుగు పడిన శబ్దం. గుడిసెలంతా నీళ్ళమయం. అది ఒక ద్వీపంలా ఉంది. చుట్టూ వాన నీటి కాలువలు. ఆ ద్వీపంలోనే కూర్చుని చర్చను నడిపాము. ఈ వాన, ఉరుములు, మెరుపులు, పిడుగుల రాద్ధాంతమంతా విద్యార్థినులు వచ్చిన సమయంలోనే కావాలా. దీనివల్ల విద్యార్థినులు నిరుత్సాహపడవచ్చు అనుకుని ఉదయమే “వాపసు వెళ్ళాలని అనుకుంటే వెళ్ళండి” అన్నాను. ఒక్క విద్యార్థినీ కదలలేదు. “అయ్యో ఇదేం మహా వర్షం సార్. క్యాంప్ లోనే ఉంటాము” అన్నారు. ఆ శిబిరంలోనూ అదే మామూలు కార్యక్రమాలు. పుట్టేనహళ్ళికి ప్రతిరోజు సాయంత్రం బస్సులో పోయి ప్రొద్దునే నడచుకుని వాపసు వచ్చేవాణ్ణి.

నాలుగవ శిబిరం

1972వ సంవత్సరంలో గౌరీబిదనూరు తాలూకాలో ఉన్న హోసూరులో నడిచింది. అది బెంగళూరుకు 80 కి.మీ.ల దూరంలో ఉంది. హొసూరు మా ఊరు. నేను పుట్టిన ఊరు. అక్కడ అన్ని సౌకర్యాలు శిబిరంలో పాల్గొన్నవారికి ఉంది. మాదే ఒక హైస్కూలు ఉంది. మా పాఠశాలకు సంబంధించిన కొన్ని పనులను చేశారు. సామాజిక, ఆర్థిక సర్వేను హొసూరు, మరియు ఇంకొక పల్లెలో నడిపారు. బెంగళూరుకు దూరమైనందు వల్ల నేను ప్రతిరోజు అక్కడికి వెళ్ళడానికి కుదరలేదు. వారానికి రెండు రోజులు వెళ్ళి, రాత్రి పూట బౌద్ధిక కార్యక్రమాలలో పాల్గొనేవాణ్ణి. ముగింపు సమావేశానికి ముఖ్యమంత్రి గారైన దేవరాజ్ అరసు వచ్చారు.

1972లో జరిగిన నాలుగవ శిబిరమే నాకు చివరి శిబిరం, కాలేజీకీ చివరి శిబిరం. 1972 డిసెంబర్ నెలలో నన్ను బెంగళూరు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా నియమించారు.

రికార్డ్

ఈ నాలుగు, నెలరోజుల శిబిరాలు కర్ణాటక రాష్ట్రంలో ఒక రికార్డు సృష్టించాయి. భారతదేశానికి కూడా ఒక రికార్డు కావచ్చు. ఒక నెలరోజుల పాటు శిబిరాన్ని అర్థవంతంగా, క్రమబద్ధంగా నడపడం అంత సులభమైన పని కాదు. డబ్బులు ఉంటే సరిపోదు. సమాజసేవపై పూర్తిగా నమ్మకం ఉన్న కాలేజీ ముఖ్యులు, శిబిరాధికారులుగా కనీస పక్షం 4,5 అధ్యాపకులు కావాలి. అంతే కాక సమాజ సేవ పట్ల దావంతమున్న విద్యార్థులూ అంతే ముఖ్యం. శిబిరంలో ఉదాసీనులైన విద్యార్థులు నలుగురున్నా శిబిరపు వాతావరణం చెడిపోతుంది. ఈ నాల్గు శిబిరాలను మొదటి నుండి చివరిదాకా దగ్గరగా చూసిన అనుభవంతో ఆ శిబిరాలన్నీ పరిపూర్ణంగా విజయవంతమయ్యాయని ఎలాంటి మొహమాటం లేకుండా సంతోషంతో చెప్పగలను. ఇలాంటి శిబిరాలు నడపడం శ్రమతో కూడిన పని అయినా అవి విజయవంతమైనపుడు కలిగే తృప్తి ముందు ఆ శ్రమ కరిగిపోతుంది.

మా కాలేజీ సామాజికశాస్త్రం అధ్యాపకులైన శ్రీ సి.వి.వెంకటాచల గారు ఈ నాలుగు క్యాంపులకూ శిబిరాధికారులుగా ఉన్నారు. భౌతికశాస్త్ర అధ్యాపకులైన డా. ఎ.హెచ్.రామారావు గారు రెండు శిబిరాలకు అధికారిగా పనిచేశారు. ఇద్దరూ నిష్ఠగా పనిచేశారు. వారి జతకు ప్రతి క్యాంపుకు ఇద్దరు అధ్యాపకులు, క్యాంపు ఉత్తరార్థంలో ఇద్దరు ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.

శిబిరం – శౌచాలయం

ఒక సారి మా కాలేజీ పిల్లలు ఒక నెలరోజుల సమాజ సేవా శిబిరానికి వెళ్ళే ముందు వారందరిని చేర్చి శిబిరం గురించి వివరిస్తున్నాను. నేను చెప్పవలసిందంతా చెప్పి “ఏమైనా ప్రశ్నలుంటే అడగండి” అన్నాను. కొన్ని ప్రశ్నోత్తరాలైన తరువాత ఒక విద్యార్థి ప్రశ్న అడగడానికి సంశయిస్తున్నాడనిపించి “ఏమైనా అనుమానం ఉంటే అడగప్పా ఫరవాలేదు” అన్నాను. అతడు ధైర్యం చేసి నిలబడి “మీరు అన్నీ చెప్పారు సార్, ఐతే ఆ పల్లెలో శౌచాలయ వ్యవస్థ గురించి ఏమీ చెప్పలేదు” అని కొంచెం సంకోచంతో అడిగాడు. “అయ్యో, దాని గురించి చెప్పనక్కరలేదు అనుకున్నాను. నీవు పట్టణంవాడని తెలుస్తోంది. పల్లెలతో అంత పరిచయం ఉన్నట్టు లేదు. శౌచాలయానికి విశేషమైన ఏర్పాట్లు ఏమీ అవసరం లేదు. మొత్తం దేశమే ఒక శౌచాలయం” అన్నాను. విద్యార్థులు నవ్వారు. “దీని గురించి రెండు ఉదాహరణలిస్తాను, వినండి” అంటూ చెప్పడం మొదలుపెట్టాను.

ధ్యానం

రెండు మూడు దశాబ్దాల వెనుక బెంగళూరు నుండి ఒకరు తన స్నేహితునితో కలిసి రాత్రి మద్రాస్ మెయిల్లో మద్రాసుకు బయలుదేరారు. ఆ స్నేహితుడు ఇంగ్లీషువారు. మొదటిసారి మనదేశానికి వచ్చారు. మద్రాసు చూడటానికి ఇద్దరూ వెళుతున్నారు. మద్రాస్ మెయిల్ బెంగళూరు నుండి రాత్రి 9 గంటలకో, 10 గంటలకో బయలుదేరి మద్రాసును ఉదయం 6-7 గంటలకు చేరుతుండేది. (ఇప్పుడు కూడా అంత అనుకుంటాను.) రాత్రి రైలులో నిద్ర బాగా రాదు. తెల్లవారు జామున వారు తమ సగం నిద్రతో లేసి కిటికీ నుండి బయటకు చూస్తూ కూర్చున్నారు. సూర్యోదయం కావడానికి ఇంకా సమయముంది. వెలుగు మసక మసకగా ఉంది. విశాలమైన మైదానంలో ఒక్కడొకరు, ఇక్కడొకరు కూర్చుని ఉన్నది ఆ ఇంగ్లీషు స్నేహితునికి అస్పష్టంగా కనిపించింది. ఇంత పొద్దునే వీరంతా ఎందుకు ఊరికే కూర్చొన్నారు అని అతనికి ఆశ్చర్యం వేసింది. అప్పుడు అతను తన స్నేహితుని ఉద్దేశించి “What are they doing so early in the morning? – ఇంత ప్రొద్దునే వారంతా ఏమి చేస్తున్నారు?” అని అడిగారు. మనవాడికి చాలా సిగ్గువేసింది. అయితే మనవాళ్ళు సమయస్ఫూర్తిలో తక్కువేమీ కారు. వెంటనే “They are all meditating – వారంతా ధ్యానం చేస్తున్నారు” అని చెప్పాడు. “ఔను, భారతీయులు తెల్లవారు జామున ధ్యానం చేస్తారని విన్నాను” అని ఆ ఇంగ్లీషు స్నేహితుడు తనకు తాను సమాధాన పరచుకున్నారు.

భారత రాయబారి

రెండవ ఘటన; నికటా కృశ్చేవ్ సోవియట్ రష్యా ప్రధాని. ఒకసారి కృశ్చేవ్ భారతదేశానికి అధికార పర్యటనకు వచ్చారు. వారిని నెహ్రూ గారు మర్యాదపూర్వకంగా ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో స్వాగతించారు. తరువాత ఇద్దరూ ఓపెన్ టాప్ వాహనంలో అక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరమున్న ఢిల్లీకి ప్రయాణిస్తున్నారు. కొన్ని నిముషాల తరువాత దూరంగా మైదానంలో ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేస్తున్న దృశ్యం చూసి కృశ్చేవ్‌కు అసహ్యం వేసింది. పక్కనున్న నెహ్రూను ఉద్దేశించి “చూడండి అతడేమి చేస్తున్నాడో” అన్నారు.

ఆ అయోగ్యుడు ఆ సమయంలో ఇట్లాంటి పని చేస్తున్నాడు కదా అని నెహ్రూగారికి చాలానే ఇబ్బంది కలిగింది, సిగ్గూ వేసింది. దిక్కు తోచక అంతా మింగుకుని వారి ప్రశ్నకు నేరుగా ఉత్తరం ఇవ్వకుండా “మీ దేశంలో ఇలా జరిగితే మీరేమి చేస్తారు?” అని మారుప్రశ్న వేశారు. కృశ్చేవ్ ఒక విధంగా ముఖం గంటు పెట్టుకుని “మా దేశం ఇలా జరిగితే వాడిని షూట్ చేస్తాము” అని బింకంగా చెప్పారు. ఎంతయినా అది కమ్యూనిష్టు దేశం. ప్రధాని ఏమైనా చేయవచ్చు అనుకుని పాపం, నెహ్రూ ఊరుకున్నారు.

భారతదేశం పర్యటన ముగించుకుని కృశ్చేవ్ రష్యా వెళుతూ తమ దేశంలో పర్యటించమని నెహ్రూను ఆహ్వానించారు. నెహ్రూ గారు దానికి అంగీకరించి కొన్ని నెలల తరువాత రష్యా వెళ్ళారు. మాస్కో విమానాశ్రయంలో దిగారు. సాంప్రదాయబద్ధంగా కృశ్చేవ్ నెహ్రూగారిని స్వాగతించారు. ఇద్దరూ అక్కడి నుండి కొన్ని కి.మీ.ల దూరంలో ఉన్న మాస్కో నగరానికి ఓపెన్ టాప్ వాహనంలో వెళుతున్నారు. అలా వెళుతున్నప్పుడు అటూ ఇటూ చూడటం మామూలే. అప్పుడు దూరంగా మైదానంలో ఒక వ్యక్తి మలవిసర్జన చేస్తున్న దృశ్యాన్ని చూసిన నెహ్రూ ఆనందమే ఆనందం. ఇలాంటి సందర్భంలో పాలం విమానాశ్రయం నుండి ఢిల్లీకి వెళుతున్నప్పుడు కృశ్చేవ్ నెహ్రూతో గేలిచేస్తూ ఆడిన మాటలను మరిచిపోలేదు. వారు అన్న మాటలతో అయిన మానసిక గాయం ఇంకా మానలేదు. విప్పారిన ముఖంతో నెహ్రూగారు కృశ్చేవ్‌ని ఉద్దేశించి “చూడండి కృశ్చేవ్, ఆ మైదానంలో అతడేమి చేస్తున్నాడో? ఇలాంటి ఒక సందర్భంలో మీరు నాతో ఏం చెప్పారో గుర్తుందా?” అంటూ హేళనగా చూశారు. అతడిని చూసిన తక్షణం కృశ్చేవ్‌కు ఆ అయోగ్యుడు తన మానం తీశాడని ఎక్కడలేని కోపం వచ్చింది. కోపాన్ని దిగమింగుతూ “గుర్తుంది. గుర్తుంది” అంటూ బుసకొడుతూ తమ వెంట వస్తున్న ఒక అంగరక్షకుణ్ణి పిలిచి వెంటనే అతడిని చంపి రమ్మని ఆదేశించారు. అతడు అక్కడికి వెళ్ళాడు, వాపసు వచ్చాడు. “చంపావా?” అని అడిగారు. “లేదు” అన్నాడు. “ఎందుకు” అన్నారు కోపంతో ఊగిపోతూ కృశ్చేవ్. “అతడిని చంపడానికి వీలుకాదు. అతడికి రాజ్యతంత్ర నియమాల రక్షణ ఉంది. అతడు ఇండియా దేశపు రాయబారి” ఆన్నాడు. నెహ్రూ నీరుగారిపోయారు.

ఈ ఘటన నిజంగా జరగడానికి సాధ్యం కాకపోయినా దీనిలోని నీతిలో అర్థముంది. ఇలాంటి విషయాలలో భారతీయులు ఏ హోదాలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా వారికి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్న తెలివి ఉండదు.

విద్యార్థులు ఈ రెండు దృష్టాంతాలను విని పగలబడి నవ్వారు. “శౌచాలయం ఏర్పాట్లు ఉన్నాయి. దానిని ఉపయోగించుకోవడం మీ కర్తవ్యం. భారత రాయబారిలా మేమూ భారతీయులమే అంటే మేము ఏమీ చేయలేము” అన్నాను.

ఆరోగ్య క్రేంద్రం

కాలేజీలో విద్యార్థి, విదార్థినుల ఉపయోగం కోసం ఒక ఆరోగ్య కేంద్రాన్ని (Health Centre) 1970లో ఏర్పాటు చేశాము. ఒక గదిలో విద్యార్థులను పరీక్షించడానికి కావలసిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశాము. ప్రతిరోజూ సాయంత్రం నాలుగు నుండి ఐదు గంటల వరకు ఒక వైద్యుడు వచ్చి అవసరమైన విద్యార్థులకు ఉచిత వైద్యసేవలను అందించేవారు. డా. అనుపమా నిరంజన, డా. కె. ఎస్. శ్రీనివాసమూర్తి ఇంకా ఇద్దరు ముగ్గురు డాక్టర్లు ఈ కార్యక్రమంలో భాగం వహించి సహాయం చేశారు. డా. ఎస్. ఎస్. జయరాం, డా. కృష్ణమూర్తి, డా. వి. పరమేశ్వర, డా. హెచ్. కృష్ణమూర్తి మరియు డా. వి. విశ్వేశ్వరయ్య మొదలైన వారు నిపుణుల కమిటీలో ఉన్నారు.

పుస్తక భాండాగారం నిర్మాణం

1968-69లోనే కాలేజీలో ఒక దివ్యమైన పుస్తక భండారాన్ని నిర్మించాలని ఆలోచించి పనులు ప్రారంభించాము. అది ఒక నాలుగు అంతస్తుల బృహత్ కట్టడం. ఆ భవనాన్ని 1970వ సంవత్సరంలో రాష్ట్ర గవర్నర్ శ్రీ మోహన్ లాల్ సుఖాడియా ప్రారంభించారు. గ్రంథాలయం ఒక విద్యాసంస్థకు ‘ఆత్మ’ లాంటిది. అది విద్యాసంస్థ యొక్క అతి ముఖ్యమైన భాగం. గ్రంథాలయ ప్రాముఖ్యత గురించి చాలా మంది ప్రిన్సిపాళ్ళకు ఇంకా తెలిసిరాలేదు. సుమారు 100 మంది విద్యార్థులు కూర్చుని చదవడానికి మంచి రెఫెరెన్స్ విభాగముంది. పుస్తకాల సంఖ్య దృష్ట్యా, వాటి ప్రమాణాల దృష్ట్యా, గ్రంథాలయ భవనపు వైభవం దృష్ట్యా ఆ పుస్తక భండారం రాష్ట్రంలోని అత్యుత్తమ గ్రంథాలయాలలో ఒకటి అయ్యింది.

కాలేజీ రజతోత్సవాలు

1945లో ప్రారంభమైన కాలేజీ 25 సంవత్సరాల పాటు విద్యాక్షేత్రంలో అమూల్యమైన సేవలను అందించి 1970వ సంవత్సరంలోనికి అడుగుపెట్టింది. కాలేజీ రజతోత్సవాలను తగిన రీతిలో ఆచరించాలని ముందస్తు తయారీ చేసుకున్నాము. ఆ వెండిపండుగకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి వి.వి.గిరి గారిని ఆహ్వానించాము. రాష్ట్రపతిగారు ఒక కాలేజీ రజతోత్సవానికి ఒప్పుకోవడం గురించి చాలా మందికి అనుమానం. అయితే వారు రాష్ట్ర గవర్నర్‌గా ఉన్నప్పుడు ఒకటి రెండు సార్లు మా కాలేజీ కార్యక్రమాలకు వచ్చివున్నారు. కాలేజీ గురించి వారికి మంచి అభిప్రాయం ఉంది. అందువల్ల వారు మా ఆహ్వానాన్ని మన్నిస్తారనే విశ్వాసం నాకు ఉంది. 1970 డిసెంబర్ నెలలో ఆ ఉత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాము. రజతోత్సవ సంచికను తయారు చేసుకుని వారి అంగీకారం కోసం ఎదురుచూస్తున్నాము. వారు ఆ నెల మొదటి వారంలో కేరళలోని ఒక ఆయుర్వేద వైద్యశాలలో చికిత్స తీసుకుంటున్నారు. అక్కడకు కూడా ఒక ఉత్తరం వ్రాశాము. “1970 డిసెంబర్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు కార్యక్రమం పెట్టుకోండి” అని ఒక రోజు హఠాత్తుగా టెలిగ్రామ్ వచ్చింది. మా సంతోషానికి అవధులు లేవు. అయితే మాలోని ఒక పంచాంగ ప్రియుడు “అయ్యో ఏమి సార్. ఆ రోజు మంగళవారం. యమగండ కాలం” అంటూ ఆపశ్రుతి పలకడం మొదలు పెట్టారు. “యమగండ కాలమూ లేదు మన్నూ మశానమూ లేదు. మీరు ఊరుకోండి. మనం సరిగ్గా ప్రణాళిక ప్రకారం పని చేస్తే కాలం అడ్డురాదు. అన్ని కాలాలు ఒకటే” అని చెప్పాను. “మీరు ఇలా అంటారని మాకు తెలుసు సార్” అన్నారు. ఆ ఉత్సవం రోజు మా సమీపానికి ఏ ‘యముడు’ కానీ లేదా అతని ‘కాలం’ కానీ రాలేదు.

ఆ వార్త వచ్చినప్పుడు మా వద్ద ఉన్న సమయం కేవలం ఏడు రోజులు. తక్కువ వ్యవధి ఉన్నా ఏవిధంగా విలువల దృష్టితో కానీ, వేడుక యొక్క ఘనత దృష్టిలో గానీ కొంచెమూ లోపం రాకుండా ఉత్సవాన్ని ఉత్సాహంతో నడిపాము. రాష్ట్రపతి గారి జతలో రాష్ట్ర గవర్నరు ధర్మవీర గారు, ముఖ్యమంత్రి వీరేంద్ర పాటిల్ గారు, ఉపకులపతి టి.కె. తుకూళ్ గారు అతిథులుగా వచ్చారు.

నేషనల్ కాలేజీ రజతోత్సవాల సందర్భంగా డా.హెచ్.ఎన్.ను సత్కరిస్తున్న భారత రాష్ట్రపతి డా. వి. వి. గిరి

ఆ ఉత్సవాల ఒకటి రెండు మరువలేని జ్ఞాపకాలు 25 సంవత్సరాలైనా ఇంకా మిగిలివున్నాయి. విద్యార్థినీ విద్యార్థులందరూ తెల్ల దుస్తులు ధరించి వచ్చారు. రాష్ట్రపతిగారు, ఇతర అతిథులు ప్రవేశించారు. కార్యక్రమం మా కాలేజీ ప్రార్థనతో ప్రారంభమయ్యింది. అంత మంది విద్యార్థులు ఏకకంఠంతో చేసిన ప్రార్థన అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అదైన తరువాత ఒక దేశభక్తి గీతాన్ని సుశ్రావ్యంగా ఆలపించారు. దీనికోసం చాలా రోజుల నుండి మా విద్యార్థులు అభ్యాసం చేశారు.

వారి సమ్ముఖంలోనే, నేను బెంగళూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి కావలన్న రాష్ట్రపతి గారి ఆకాంక్ష చాలామందికి సంతోషాన్ని కలిగించినా తుకూళ్ గారికి ఇబ్బంది కలిగి ఉండవచ్చు. కాకతాళీయంగా రెండు సంవత్సరాల తరువాత నేనే తుకూళ్ గారినుండి ఛార్జ్ తీసుకుని విశ్వవిద్యాలయం ఉపకులపతి అయ్యాను.

బెంగళూరు విశ్వవిద్యాలయం కులపతిగా

ఊహించని నియామకం

మైసూరు విశ్వవిద్యాలయం కర్ణాటకలో అతి పురాతన విశ్వవిద్యాలయం. అది 1916లో స్థాపించబడింది. అప్పుడు ఇంకా కర్ణాటక రాష్ట్రం ఏర్పడలేదు. మైసూరు రాజ్యం మాత్రం ఉంది. కర్ణాటక రాష్ట్రం అవతరించిన తరువాత ధార్వాడ కేంద్రంగా 1949లో కర్ణాటక విశ్వవిద్యాలయం ఏర్పాటయింది. బెంగళూరు విశ్వవిద్యాలయం 1964వ సంవత్సరం నవంబర్ 26న అస్తిత్వంలోనికి వచ్చింది.

బెంగళూరు విశ్వవిద్యాలయం స్థాపించినప్పుడు దాని వ్యాప్తి బెంగళూరు నగరంలోని 32 కాలేజీలకు మాత్రమే పరిమతమయ్యింది. 1975వ సంవతరంలో విశ్వవిద్యాలయం పరిధి విస్తరించి బెంగళూరు రూరల్ జిల్లా, కోలార్ జిల్లా, తుమకూరు జిల్లాలోని కాలేజీలు విశ్వవిద్యాలయం పరిపాలనలోనికి వచ్చాయి.

నేను బెంగళూరు విశ్వవిద్యాలయం స్థాపించినప్పటి నుండి దానిని సమీపంగా చూస్తూవచ్చాను. అప్పుడు నేను బసవనగుడి నేషనల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఉన్నాను. విశ్వవిద్యాలయం అప్పటి నియమాల ప్రకారం అన్ని కాలేజీల ప్రిన్సిపాళ్ళు విశ్వవిద్యాలయం సెనెట్ మరియు అకడమిక్ కౌన్సిల్ సభ్యులుగా ఉంటారు. అందువల్ల నేను మొదటినుండీ విశ్వవిద్యాలయపు ఆ రెండు ముఖ్య సంఘాలలో సభ్యుడిని. విశ్వవిద్యాలయం బాగోగులను, కార్యకలాపాలను చూడటమే కాకుండా వాటిని రూపొందించడంలోనూ ప్రిన్సిపాళ్ళు గణనీయమైన పాత్ర పోషించారు.

Dr. H Narasimhaiah

విశ్వవిద్యాలయం ప్రారంభం అప్పటి కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి శ్రీ మహమ్మద్ సి. జాగ్లా గారి చేతుల మీదుగా జరిగింది. కాకతాళీయంగా ఆ రోజు అమావాస్య కూడా. విశ్వవిద్యాలయం సమస్యలను ఎదుర్కొన్నప్పుడంతా దానికి అంతా అమావాస్యే కారణమని కొందరు ఆక్షేపించేవాళ్ళు. శ్రీ ఎస్. ఆర్. కంఠి గారు అప్పుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి. వారు సెంట్రల్ కాలేజీ ఆవరణలో ఉన్న సెనెట్ హాల్లో శాస్త్రోక్తంగా విశ్వవిద్యాలయం ప్రగతి కోసం పూజలు నిర్వహించారు. భగవద్గీత, ఖురాన్, బైబిల్ మొదలైన ధార్మిక గ్రంథాలనుండి ఆయా మతపెద్దల చేత ప్రవచనాలు ఇప్పించారు. నేను ఆ రెండు కార్యక్రమాలలోనూ పాల్గొన్నాను. ఏ దేశ, సమాజ, లేదా వ్యక్తి ప్రగతి పూజలపై, తిథి కాలాదులపై ఆధారపడుతుంది అనేది అవివేకమైన నమ్మకం. దినం కేవలం దినంగా, కాలం కేవలం కాలంగా మొదలయ్యాయి. వీటికి మనం జోడిస్తున్న ‘మంచి’, ‘చెడు’ అనే గుణవాచకాలు మన అవివేకాన్ని చూపుతాయి.

1972 డిసెంబర్ మొదటి వారం. సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో హాస్టల్లోని నా గదిలో పడుకుని ఉన్నాను. నిద్రపోవడం లేదు. కొంచెం ఒళ్ళునొప్పులు. అప్పుడు నేను నేషనల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఉన్నాను. నేను నివసిస్తున్న గది ప్రిన్సిపాల్ ఆఫీసుకు పక్కనే ఉంది. ఒక విద్యార్థి వచ్చి “సార్, మీ ఆఫీసులో ఫోన్ రింగ్ అవుతోంది” అని చెప్పాడు. “అయ్యో! ఇదేమప్పా ఈ టైములో ఫోన్ చేస్తున్నారు” అని గొణుగుకుంటూ ఆఫీసు తాళం తీశాను. ఫోన్ ఇంకా శబ్దం చేస్తూనే ఉంది. “హలో, నేను నరసింహయ్య” అన్నాను. “హార్టీ కంగ్రాచులేషన్స్ (Hearty Congratulations)” అన్నారు. “కంగ్రాచులేషన్స్! మీరు ఎవరు?” అన్నాను. “నేను కె. సి. చౌడప్ప రెడ్డి. మిమ్మల్ని బెంగళూరు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమించారని ఇప్పుడే రాజభవన్ నుండి సమాచారం వచ్చింది” అని చెప్పారు. “థ్యాంక్ యు సార్” అన్నాను. శ్రీ కె. సి. చౌడప్పరెడ్డి గారు అప్పుడు రాష్ట్ర సమాచార ప్రచార శాఖ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. “మీరు ఉపకులపతిగా నియమించబడిన విషయం మీకు ముందే తెలుసా?” అని అడిగారు. “లేదు. మొట్టమొదటిసారి మీ నుండే వింటున్నాను” అన్నాను. “ఆశ్చర్యం. మీకు ఈ సుద్ది తెలిపినపుడు ఏ భావోద్రేకాలు లేకుండా మామూలు థ్యాంక్స్ చెప్పారే” అన్నారు. మనసులో సంతోషం, ఒడిదుడుకులున్నా నేను వాటిని ప్రదర్శించకుండా సామాన్యంగా నేను వాటిని శాంతంగానే తీసుకుంటాను.

నేను ఉపకులపతి అవుతానని కలలో కూడా ఊహించలేదు. ఆ ఉన్నత పదవికోసం ఎప్పుడూ నిరీక్షించలేదు. ఈ విషయమై నేను ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎవరితోనూ ప్రస్తావించలేదు. ఇలాంటి నియామకం ఎంత ముఖ్యమైనదో నాకు తరువాత తెలిసింది. ఇప్పటికి కొన్ని సంవత్సరాల క్రితం రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను ఎంపిక చేసే సమితిలో నేను సభ్యుడిగా ఉన్నాను. అప్పుడు నాకు అభ్యర్థుల పరంగా వచ్చిన సిఫారసులు, టెలిగ్రామ్‌లు, ఒత్తిడులు, అభ్యర్థులే స్వయంగా వచ్చి తమ గురించి విన్నవించుకోవడం వంటివి అసహ్యాన్ని కలిగించాయి. ఈ నేపథ్యంలో ఒక ‘అనాథ’ ను ఉపకులపతిగా నియమించడం ఈ కాలంలో అత్యంత ఆశ్చర్యకరమైన సంగతి.

ఈ వార్త నాకు పూర్తి సంతోషాన్ని ఇచ్చేదానికన్నా ఎక్కువ నన్ను ఆలోచించేలా చేసింది. విశ్వవిద్యాలయం నిర్వహించే జవాబుదారీ, దాని క్లిష్ట సమస్యలు వెంటనే నా తలపై పెద్ద భారంలా కనిపించాయి. అన్నిటికన్నా ఎక్కువగా నాకు ప్రియమైన, దానితో పాటే పెరిగిన నేషనల్ కాలేజీ నుండి దూరం కావాలన్న దుఃఖం నన్ను బాధించింది.

మునుపటి ఉపకులపతులు

బెంగళూరు విశ్వవిద్యాలయం మొదటి ఉపకులపతులైన డా. బి. డి. లరోయా గారు తమ పదవీ కాలం ముగియకముందే అకాలమృత్యువు పాలయ్యారు. వారి స్థానంలో ప్రముఖ సాహిత్యవేత్త, విద్వాంసులు అయిన ప్రొఫెసర్ వి. కె. గోకాక్ గారు ఉపకులపతులయ్యారు. అప్పుడు శ్రీ పి. మల్లికార్జునప్పగారు విశ్వవిద్యాలయం కులసచివులు (రిజిస్ట్రార్)గా ఉన్నారు. గోకాక్ గారికి ధార్మిక, ఆధ్యాత్మిక విషయాలలో చాలా నమ్మకం ఉంది. అరవిందుని సిద్ధాంతాలపై ఎక్కువ నమ్మకం ఉంది. దానితో పాటు సత్యసాయిబాబా గారికి ఎడతెగని భక్తులు. బాబాగారికి చెప్పుకునేంత చింతన కానీ, తత్త్వజ్ఞానం కానీ ముందూ లేదు, ఇప్పుడూ లేదు, ఇకముందు ఉండే అవకాశం లేదు. గోకాక్ గారు పుట్టపర్తి, వైట్‌ఫీల్డ్ యాత్రలు, బాబాగారి సాన్నిహిత్యం ఎక్కువ తృప్తిని ఇచ్చేవి. విశ్వవిద్యాలయానికి సంబంధించి బాబాగారి రెండు ‘మహిమ’లు (అక్రమాలు) నాకు జ్ఞాపకం వస్తున్నాయి. ఇంతకు ముందు చెప్పినట్లు విశ్వవిద్యాలయం మొదలైనప్పుడు దాని పరిధి బెంగళూరు నగరానికి మాత్రమే విస్తరించి ఉంది. బెంగళూరు సమీపంలోని వైట్‌ఫీల్డ్‌లో బాబాగారు ఒక కాలేజీ నడిపేవారు. దానితో పాటు అదే ఆవరణలో వారు వచ్చినప్పుడు ఉండడానికి ఒక ఆశ్రమం కూడా ఉంది. వైట్‌ఫీల్డ్ బెంగళూరు నగర పరిధిలోనికి రాదు. అయితే గోకాక్ గారు ప్రభుత్వంపై తమ ప్రభావాన్ని (పరోక్షంగా బాబా గారి ప్రభావాన్ని) చూపి వైట్‌ఫీల్డ్ లోని సాయిబాబా కాలేజీని అక్రమంగా బెంగళూరు విశ్వవిద్యాలయంలోకి చేర్చుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రింద పుట్టపర్తి లోని కొన్ని కాలేజీలను, అనంతపురంలోని ఒక కాలేజీని ఇంకా వైట్‌ఫీల్డ్ లోని కాలేజీని కలిపి విశ్వవిద్యాలయం అని భావించదగిన – Deemed University పుట్టపర్తి కేంద్రంగా పెట్టుకుని ప్రారంభించారు. వైట్‌ఫీల్డ్ కాలేజీని, రాష్ట్రం బయట ఉన్న ఒక విశ్వవిద్యాలయపు కాలేజీ కావడానికి మన ప్రభుత్వం మరియూ మన బెంగళూరు విశ్వవిద్యాలయం అనుమతిని ఇవ్వడం అక్రమాలలో ఒక అక్రమం. ఇది బాబాగారి రెండవ మహిమ. భగవంతుడు మనుషులు చేసుకున్న నియమాలకు అతీతులు కదా! బాబా గారు చేసిందే నియమం, చెప్పిందే వేదవాక్యం. మన రాష్ట్రంలోని ఒక కాలేజీని వేరే రాష్ట్రంలోని విశ్వవిద్యాలయానికి అనుసంధానం చేయడం ఒప్పుకుంటే విపత్తు కలుగుతుంది. ఘోరమైన పరిణామాలు సంభవించవచ్చు. ఉదాహరణకు బెలగాంలోని కాలేజీని మహారాష్ట్రలోని ఒక యూనివర్సిటీలో చేర్చడానికి అనుమతిని ఇస్తే ఏమవుతుందో మనం ఆలోచించాలి.

అన్ని విశ్వవిద్యాలయాలలోనూ సమస్యలున్నాయి. కొత్తగా మొదలైన మా విశ్వవిద్యాలయంలో సహజంగానే చాలా సమస్యలున్నాయి. ఇవి పరిస్థితి ప్రభావం వల్ల మరియు పరిపాలనా విధానం వల్ల ఉద్భవించినవి. ఇలా ఉద్భవించిన సమస్యలు మూడవ ఉపకులపతి అయిన తుకూళ్ గారి కాలంలో కూడా పరిష్కారం కాలేదు. ఇలాంటి సమయంలో నేను ఉపకులపతి అయ్యాను. అప్పుడు నేను విశ్వవిద్యాలయం సిండికేట్ సభ్యునిగా కూడా ఉన్నాను. విశ్వవిద్యాలయం సిండికేట్‌ను ప్రభుత్వ మంత్రిమండలి – కేబినెట్‌తో పోల్చవచ్చు.

నేను ఉపకులపతి అయిన వార్త ఆకాశవాణి ద్వారా ఆ రోజు రాత్రే ప్రసారమయ్యింది. మరుసటిరోజు ఉదయం పత్రికల ద్వారా ప్రజలకు తెలిసింది. వార్త తెలిసిన వెంటనే నన్ను హొసూరు నుండి బెంగళూరుకు విద్యాభ్యాసానికి పిలుచుకు వచ్చిన నా జీవితంలో అత్యంత ముఖ్యమైన మలుపుకు కారణమైన శ్రీ ఎం. ఎస్. నారాయణ రావు గారి ఇంటికి వెళ్ళి వారికి కృతజ్ఞతాపూర్వకమైన వందనాలను అర్పించాను. అలాగే రామకృష్ణ విద్యార్థిమందిరం వెళ్ళి నాకు వార్డెన్‌గా ఉన్న స్వామి ఋతాత్మానంద గారికి వందనాలు తెలిపాను. అదే రాత్రి రాష్ట్రపతి శ్రీ వి. వి. గిరిగారికి ఈ సమాచారాన్ని టెలిగ్రామ్ మూలకంగా తెలిపాను. ఇంతకు ముందే చెప్పినట్లు శ్రీ వి. వి. గిరిగారు నా శ్రేయోభిలాషి. మా కాలేజీ ఆవరణలో నేను ఉపకులపతి కావాలన్న వారి ఇచ్ఛను ఒకటికన్నా ఎక్కువసార్లు బహిరంగంగానే తెలిపారు.

వార్త తెలిసిన వెంటనే మా కాలేజీలో కోలాహలం. ఇన్ని సంవత్సరాలు కాలేజీతో పాటే పెరిగాను. పాలకవర్గం, అధ్యాపకులు మరియు విద్యార్థులలో మిశ్రమ స్పందన కనిపించింది. చాలామందికి మాలో ఒకరు ఉపకులపతి అయ్యారన్న సంతోషం, ధైర్యం. అనేకులకు నేను కాలేజీ వదిలి వెళతానన్న బాధ. కొందరు విద్యార్థినులు నా ముందే ఏడ్చారు. విద్యార్థులు అంత త్వరగా ఏడవరు. వారికి తట్టుకునే శక్తి ఉంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాలక వర్గం వీడుకోలు సభలు చేశారు. దినం కాలం చూసుకోకుండా టి. కె. తుకూళ్ గారి ఇంటిలో డిసెంబర్ 15వ తేదీ ఉపకులపతిగా అధికారాన్ని స్వీకరించాను. ఉపకులపతిగా అధికారిక కార్యాలయానికి వచ్చి నాకు అధికారాన్ని బదలాయించడం వారికి ఇష్టంలేదు.

టి.కె.తుకూళ్ గారి నుండి బెంగళూరు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఛార్జ్ తీసుకుంటున్న హెచ్.నరసింహయ్య

అధికారం తీసుకున్న మరుసటిరోజు అప్పటి ముఖ్యమంత్రిగారైన శ్రీ దేవరాజ అరసు గారిని కలిసి కృతజ్ఞతాపూర్వకమైన వందనాలు సమర్పించాను. ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని వారు భరోసా ఇచ్చారు. నా ఎంపికకు వారు కారణమని తరువాత తెలిసింది. అప్పటి విద్యామంత్రి ఐన శ్రీ ఎ. ఆర్. బదరీనారాయణగారిని కలిసి నా కృతజ్ఞతలు తెలిపాను. “మీ దట్టి పంచ, షర్టు, టోపి దుస్తులలోనే మీరు ఉపకులపతిగా అధికారం నడపడం అంత సమంజసంగా ఉండదు. అదీకాక మిమ్మల్ని చూడటానికి చాలామంది పెద్దలు వస్తూ ఉంటారు. ఢిల్లీ వంటి ప్రదేశాలను విశ్వవిద్యాలయానికి సంబంధించిన అనేక మీటింగులలో పాల్గొనవలసి వస్తుంది. అందువల్ల మీరు మీ వేషాన్ని మార్చడం మంచిది” అని సూచించారు. శ్రీ బదరీనారాయణగారు గాంధీ మార్గానికి చెందినవారు. గౌరవనీయమైన వ్యక్తులు. ఇలాంటి వారు నా దుస్తుల మార్పు గురించి మాట్లాడింది నాకు ఆశ్చర్యం వేసింది. దుస్తులను మార్చే పసక్తే లేదని వారికి స్పష్టంగా తెలిపాను.

అప్పుడు శ్రీ హెచ్. వి. శ్రీరంగరాజు గారు విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్. వారు నా స్నేహితులు మాత్రమే కాదు, 1938-40ల మధ్యకాలంలో ఇంటర్మీడియట్ (ఇప్పటి ప్రియూనివర్సిటీ) క్లాసులో నాకు సహపాఠిగా ఉన్నారు. మేమిద్దరమూ అప్పుడు చామరాజపేటలోని బి. కె. మరియప్ప హాస్టల్లో ఉన్నాము. అంతే కాదు ఒకే గదిలో ఉన్నాము. అది అయిన సుమారు 33 సంవత్సరాలకు మాలో ఒకరు బెంగళూరు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ మరొకరు రిజిస్ట్రార్ అవుతామని ఎవరు కూడా ఊహించడానికి సాధ్యమయ్యేది కాదు. వారు సహజంగానే నన్ను ఎంతో ఆత్మీయతతో ఆహ్వానించారు. నన్ను ఉపకులపతిగా ప్రకటించిన రోజు నుండి అధికారం స్వీకరించేవరకు మధ్య వ్యవధిలో నా రాకపోకలకు విశ్వవిద్యాలయపు వాహనాన్ని(కారుని) ఉపయోగించుకోవచ్చని శ్రీ రంగరాజు తెలిపారు. “నేను ఇంకా అధికారికంగా ఉపకులపతి కాలేదు. అందువల్ల వాహనం వద్దు” అని వినయంతో చెప్పాను. మునుపటిలా నా రాకపోకలకు ఆటోరిక్షానే వాహనం అయ్యింది. మహారాణి కాలేజీ నుండి రెండు మూడు పెద్ద బంగళాలు దాటిన తరువాత కార్ల్‌టన్ హౌస్ అనే బంగళా ఉంది. అదే మా విశ్వవిద్యాలయపు కార్యాలయం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here