[ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది డాక్టర్ హెచ్.నరసింహయ్య గారి ఆత్మకథ అనువాదాన్ని అందిస్తున్నారు శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్.]
లోయర్ సెకండరీ పరీక్ష
[dropcap]మా[/dropcap]ధ్యమిక పాఠశాలలో చివరి తరగతి అయిన నాలుగవ తరగతి ఆఖరులో జరిగే పబ్లిక్ పరీక్షకు లోయర్ సెకండరీ పరీక్ష అని పేరు. నాలుగవ తరగతి చదివిన అందరు విద్యార్థులకూ నేరుగా ఈ పరీక్ష వ్రాయడానికి అవకాశం లేదు. తరగతిలో నిర్వహించే సెలక్షన్ పరీక్షలో నెగ్గిన వారికి మాత్రమే లోయర్ సెకండరీ పరీక్ష వ్రాయడానికి అర్హత లభిస్తుంది.
లోయర్ సెకండరీ పరీక్ష రుసుము ఐదు రూపాయలు. దానిని ఐదు రూపాయల పరీక్ష అని కూడా పిలిచేవారు. ఆ కాలంలో ఐదు రూపాయలకు విలువ ఉండేది. పబ్లిక్ పరీక్షలకూ విలువ ఉండేది. అప్పుడు ఐదు రూపాయలకు ఒక బస్తా అంటే ఒక క్వింటాల్ కన్నా ఎక్కువ రాగులు వచ్చేవి. ఇప్పుడు దాని వెల సుమారు 300 రూపాయలు. లోయర్ సెకండరీ పరీక్షలో నెగ్గినవారికి సమాజంలో ఒక స్థానం ఉండేది. నా కంటే కొన్ని సంవత్సరాల ముందు లోయర్ సెకండరీ పరీక్ష ఉత్తీర్ణులైనవారిని పల్లెలలో ఊరేగించేవారట. కొంచెం ఆలస్యంగా పుట్టినందువల్ల నాకు ఆ అవకాశం తప్పిపోయింది!
మా పాఠశాల పరీక్షాకేంద్రం కాదు. సుమారు 30 మైళ్ళ దూరంలోని దొడ్డబళ్లాపురానికి పరీక్ష కోసం వెళ్లవలసి వచ్చింది. అక్కడికి పోవడమే ఒక దొడ్డ సంభ్రమం. మాకు తోడుగా ఒక ఉపాధ్యాయుడు వచ్చేవారు. మా అందరికీ గౌరీబిదనూరు నుండి దొడ్డబళ్ళాపురానికి రైలులో ప్రయాణం. అక్కడ భోజన వసతికి కొంగాడియప్ప గారి ధర్మసత్రంలో ఏర్పాటు చేశారు. మేమంతా ఆ సత్రంలో భోజనం చేసేటప్పుడు కొంగాడియప్పగారు అక్కడికి వచ్చి మా అందరినీ పలకరించేవారు. పరీక్ష ముగిసింది. ఒకటి రెండు నెలల తర్వాత ఫలితాంశం వచ్చింది. నిరీక్షించినట్లే నేను ఉత్తీర్ణుడైనాను. అప్పుడు క్రీ.శ.1934 మే మాసం. నాకు 14యేళ్ళ వయస్సు.
జాతీయ చింతన
ఉపాధ్యాయుల మూలకంగా మేము గాంధీజీ పేరును విని వున్నాము. అంతే కాదు వారి గురించిన కొన్ని ‘సాహసగాథలు’ పల్లెటూరి ప్రజలలో ప్రచారంలో ఉండేవి. గాంధీజీగారు జానపదులకు దైవసమానులు. వారిని జైలుకు వేసినప్పుడు తమ అద్భుతశక్తి వల్ల జైలు తలుపులన్నీ భద్రంగా మూసివున్నప్పటికీ బయటికి వచ్చి ప్రత్యక్షమైనారని ఒక వదంతి వ్యాప్తిలో ఉండేది. మా ఉపాధ్యాయులు గాంధీజీ గురించి, స్వాతంత్ర్యం గురించి, ఖాదీ ఆవశ్యకత గురించి విద్యార్థులకు అప్పుడప్పుడూ బోధించేవారు.
నేను నా 12వ యేట అంటే మాధ్యమిక స్థాయి రెండవ తరగతిలో చదువుకొనే సమయంలో చరఖాతో నూలు వడకడం మొదలుపెట్టాను. దానిని మూడు నాలుగు ఏళ్ళు కొనసాగించాను. మా తల్లి కూడా ఇంట్లో నూలు వడికేవారు. నా చెల్లెలు కూడా అప్పుడప్పుడూ నూలు వడికేది. అప్పుడే నేను ఖద్దరు ధారిని అయ్యింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే 63 సంవత్సరాలు నిరంతరంగా ఖాదీని మాత్రమే నా దుస్తులుగా ఉపయోగిస్తున్నాను. మాధ్యమిక పాఠశాలలో ధరించిన ఉడుపులే కొంచెం ఎక్కువ తక్కువగా నేటి నా అవతారం. గాంధీటోపీ, తెల్లచొక్కా మరియు ధోవతి. అవన్నీ సదా శుభ్రం!
నాతో పాటుగా మరికొందరు విద్యార్థులు నూలు వడికేవారు. హోసూరులో ఒక ఖాదీ కేంద్రం మొదలయ్యింది. గాంధీజీ గారు ప్రతిపాదించిన గ్రామోద్యోగాలలో ఖాదీ ప్రముఖమైనది. బీదలకు జీవనాధారం ఖాదీ. మనది గ్రామాలు ఎక్కువగా ఉన్న దేశం. విపరీతమైన జనసంఖ్య. వారిలో అధికులు పేదవారు. చాలినంతమంది నిరుద్యోగులు. ఇటువంటి మనదేశంలో యాంత్రీకరణవల్ల నిరుద్యోగం పెరుగుతుందని గాంధీజీగారి వాదన. ఇది నిజం. అంతే కాకుండా మన దేశం వ్యవసాయ ప్రధానమైనది. కాబట్టి యేడాదిలో కొంత భాగం రైతులు నిరుద్యోగులు. అలాగే స్త్రీలు కూడా పార్టు టైము నిరుద్యోగులు. ఇలాంటి వారందరినీ తమ సమయాన్ని లాభదాయకమైన పనులలో వినియోగించేలా చేయడం యుక్తం. ఈ పని గ్రామీణ మరియు కుటీరపరిశ్రమల ద్వారా మాత్రమే సాధ్యం. ఈ ఆర్థిక సిద్ధాంతం నేటికీ వర్తిస్తుంది. విజ్ఞానశాస్త్రపు విద్యార్థి మరియు తార్కికవాదాన్ని ప్రతిపాదించే నన్ను చాలామంది ఇంకా ఖద్దరునే ఉపయోగించడంపై ప్రశ్నిస్తుంటారు. అతార్కికమని వారి భావన. సమంజసమేనని నా వాదన. ఎప్పటివరకూ నిరుద్యోగం ఉంటుందో అంతదాకా గ్రామీణ పరిశ్రమలకు ఆర్థిక వ్యవస్థలో స్థానముంటుంది.
ఆ ఖాదీ కేంద్రాన్ని కోలార్ జిల్లా మండలి (Kolar District Board) నిర్వహిస్తూ ఉండేది. చాలామంది దాని ఉపయోగాన్ని పొందేవారు. ఖాదీకేంద్రం ఏడాదికొకసారి నూలు వడికే పోటీని నిర్వహిస్తూ ఉండేది. అప్పటి జిల్లా బోర్డు అధ్యక్షులు, స్వాతంత్ర్యానంతరం మైసూరు తొలి ముఖ్యమంత్రి అయిన శ్రీ కె.చెంగల్రాయరెడ్డి గారి నుండి నేను రెండవ బహుమతి స్వీకరించిన జ్ఞాపకం ఇంకా ఉంది.
గాంధీజీగారి నిర్మాణాత్మకమైన కార్యక్రమాలలో ఖాదీ ఉద్యమము, హిందీ ప్రచారము, అస్పృశ్యతానివారణ, మద్యపాన నిషేధము ముఖ్యమైనవి. హోసూరులో ఈ కార్యక్రమాలన్నీ కొంత మటుకు ఆచరణలో ఉండేవి. పాఠశాలలో మునుపు హరిజన విద్యార్థులను ప్రత్యేకంగా తగినంత దూరంలో కూర్చోబెట్టేవారు. వారికి ప్రత్యేకంగా కూర్చోబెట్టకూడదన్న సర్కారు ఆజ్ఞ వచ్చిన తరువాత రాష్ట్రమంతటా అగ్రవర్ణాల నుండి తీవ్రమైన ప్రతిఘటన, అసమాధానం, కోపం వ్యక్తమయ్యింది. అశాంతికి కూడా అవకాశమిచ్చింది. మా పాఠశాలలో ఈ మార్పు సహజంగానే జరిగింది. హరిజన విద్యార్థులు మా పాఠశాలలో అంత ‘అస్పృశ్యు’లు కాలేదు. హరిజన విద్యార్థులు మాతోపాటు కూర్చొన్నప్పుడు కొంతమందికి చీకాకును కలిగించింది. కొంతమంది ‘మడి’వంతులైన విద్యార్థులు స్కూలు ముగిసిన తర్వాత ఇంటికి వెళ్ళి స్నానం చేసి దుస్తులను మార్చుకొనేవారు. కొంత కాలం తరువాత అంతా సద్దుమణిగింది.
మా ఊరిలో ఒక కల్లు అంగడి ఉండేది (ఇప్పుడూ ఉంది). కొన్నివర్గాల ప్రజలు మామూలుగా అక్కడ త్రాగేవారు. వారిలో హరిజనులు ఎక్కువ. త్రాగుడు వలన జరిగే నష్టాన్ని అరికట్టడానికి ఉద్యమాన్నే ఆరంభించాము. మేము ప్రతి రోజు సాయంత్రం అంగడి ముందు నిలుచొని పికెటింగ్ చేసేవాళ్ళం. జాగ్రత్తగా కాపలా కాసేవాళ్ళం. కల్లు త్రాగడానికి వచ్చినవారికి వినయపూర్వకంగా చేతులు జోడించి కల్లు త్రాగవద్దని వేడుకొనేవాళ్ళం. వారిలో చాలామందికి మా పట్ల మంచి అభిప్రాయమే ఉండేది. కల్లు త్రాగడం తప్పు అని వారికీ తెలుసు. అయితే వారికి అదొక దౌర్బల్యం. త్రాగకుండా వాపసు వెళ్ళేవారు. ఇంకే సమయంలోనైనా త్రాగేవారో ఏమో తెలియదు. కల్లు అంగడి యజమాని మాత్రం మా అందర్నీ కోపంగా నమిలి మింగేసేటట్టు చురచురా చూసేవాడు. శివుడికి మాదిరిగా అతనికీ మూడోకన్ను ఉంటే మేమంతా భస్మమైపోయేవాళ్ళం. పాపం! అతడు మంచివాడు. మాకు ఏ ఇబ్బందీ కలిగించలేదు.
హేతువాదానికి పునాది
పాఠశాలలో ఉపాధ్యాయులు సాధారణంగా జాతీయ దృక్పథాన్ని విద్యార్థులలో నాటడానికి ప్రయత్నిచేవారు. అస్పృశ్యత, మతపద్ధతులు మొదలైన విషయాలపై మా మధ్య ఆలోచనలు, చర్చలు జరుగుతుండేవి. ఒకసారి నేను ఉపాధ్యాయులను “హరిజన వెంకడిని (అప్పుడు వెంకడు నా సహపాఠి) మన ఇంటిలోపలికి వచ్చినప్పుడు అడ్డు చెబుతాము. అదే వాడు ముస్లిం అయితే అడ్డు చెప్పము. ఇది సరైనదేనా?” అడిగాను. తప్పు అని సమాధానం ఇచ్చారు ఉపాధ్యాయులు. అంటే వెంకడు ఇంటిలోపలికి వచ్చినప్పుడు అడ్డు చెప్పరాదు అని అర్థం. స్నేహితుల మధ్య ఇలాంటి చర్చ విపులంగా నడిచేది. కులమతాలు మనుష్యులు ఏర్పరచుకొన్నవి. దేవుడికీ, వీటికి సంబంధం లేదు అని వాదించేవాళ్ళం. కొంతమంది సనాతన భావాలు కల స్నేహితులు ఒప్పుకొనేవారు కాదు. వారి తల్లిదండ్రుల సాంప్రదాయకవాదాన్ని బలపరచేవారు. పరమాత్ముడైన శ్రీకృష్ణుడే ఈ మతాలను సృష్టించాడని ఒకసారి ఒక వైదిక విద్యార్థి వాదించాడు. “అది ఎక్కడుంది?” అని అడిగినప్పుడు అతడు భగవద్గీతలోని ‘చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః’ అనే శ్లోకాన్ని నుడివాడు. నేను సంస్కృత విద్యార్థిని. మాలో కొంతమంది వైదిక విద్యార్థులు ఉదారస్వభావులు. వారూ సంస్కృత విద్యార్థులు. ఈ శ్లోకంలో నాలుగు వర్ణాల సృష్టి గుణము మరియు వృత్తి మీద అవలంబించాలి అని కాని పుట్టుక వల్ల కాదు అని మా వాదం. ఈ వాదాన్ని తాత్వికంగా అందరూ ఒప్పుకొనేవారు కానీ కార్యాచరణ కష్టంగా ఉండేది.
శ్రీ శేషగిరిశాస్త్రిగారు మా ఊరిపెద్దలలో ఒకరు. నిష్ఠాగరిష్ఠుడైన వైదిక మతావలంబి. శుద్ధ సాంప్రదాయవాది. గాంధీజీగారి అభివృద్ధి కార్యక్రమాలను అంగీకరించేవారు కాదు. వాటిని సహించేవారు కాదు. మా స్నేహితుడు శ్రీ హెచ్.ఎన్.రామారావు ఇంటి అరుగుపై మా విద్యార్థులంతా ఏమో మాట్లాడుకుంటూ కూర్చొన్నాము. శ్రీ శాస్త్రిగారి ఇల్లు పక్కనే ఉంది. శ్రీ శాస్త్రిగారు వచ్చి మమ్మల్ని ఉద్దేశించి “మీ గాంధీ వల్లనే ఈ కులవ్యవస్థ నాశనమై పోతోంది” అని ఆరోపించారు. నేను తక్షణమే “గాంధీ గారికన్నా ఎక్కువగా హోటళ్ళ కారణంగా కులాలు అంతరిస్తున్నాయి” అన్నాను. వారు నన్ను అలాగే ఎగాదిగా చూస్తూ “నీవు చెప్పినదాంట్లో కొంచెం నిజముంది” అని వెళ్ళిపోయారు.
దెయ్యాలు, పూనకం రావడం, పిల్లి అడ్డంగా పోవడం, కుడివైపు లేవడం మొదలైన నమ్మకాల గురించి మేము చర్చ చేసేవాళ్ళం. ఆ వయసులోనే నాకు ఇవన్నీ నిజం కాదనే భావన ఉండేది. ఆకాలంలో (ఇప్పుడు కూడా కొంత మట్టుకు) పిల్లి అడ్డంగా వెళ్తే, విధవ, కట్టెలమోపు, ఒంటి బ్రాహ్మణుడు ఎదురైతే అశుభమని నమ్మకం ఉండేది. ఇలాంటి నమ్మకాలకు అంతూ పొంతూ ఉండేది కాదు. పిల్లి అడ్డంగా వెళితే అనుకున్న పని నెరవేరదని వెనక్కు మళ్ళేవారు లేదా కాస్సేపు కూర్చొని మళ్ళీ బయలుదేరేవారు. ఎవరైనా సరే (హిందువులు) ఎడమవైపు నుండి లేచేవారు కాదు. అకస్మాత్తుగా లేస్తే మళ్ళీ పడుకొని కుడివైపు లేచేవారు. ఇప్పటికీ కుడివైపు లేవడమే వాడుక. నేను రెండు సంవత్సరాల క్రిందట ఒక హైస్కూలు విద్యార్థుల కార్యక్రమంలో భాగం వహించాను. నా ప్రసంగం అయిన తరువాత మీరంతా ప్రొద్దున ఏవైపు నుండి లేస్తారు? అనే ప్రశ్నకు కుడివైపునుండి అని మూకుమ్మడిగా సమాధానం వచ్చింది. ఎడమవైపు లేస్తే ఏమవుతుంది? అని అడిగాను. దానికి ఒక చిన్న విద్యార్థిని “అమ్మ వచ్చి లెంపలు వాయించి నన్ను మళ్ళీ పడుకోబెట్టి కుడివైపు నుండి లేపుతుంది” అని చెప్పింది.
పిల్లి అడ్డంగా వస్తే అపశకునమని నేను భావించేవాడిని కాదు. మనస్సు మొదట్లో కొంచెం సంకోచించేది. తరువాత సరిపోయింది. పిల్లి పాటికి పిల్లి పోయేది. నా పాటికి నేను వెళ్లేవాడిని. పిల్లికి ఏమీ అయ్యేది కాదు. నాకూ ఏమీ అయ్యేది కాదు.
కొన్నిసార్లు పిల్లలకు ‘దిష్టి’ తీసి దారికి అడ్డంగా ఎఱుపు, పసుపు నీళ్ళను పోసేవారు. దానితోపాటు బొగ్గులు, నిమ్మ పండు, పసుపు కుంకుమ మొదలైనవి ఉండేవి. దానిని దాటరాదన్న నమ్మకం బలంగా ఉండేది. దాటితే చెడు జరుగుతుందన్న నమ్మకం. నా స్నేహితులతో కలిసి వెళ్తున్నప్పుడు వారందరూ దానిని దాటకుండా చుట్టూ తిరిగి వెళ్ళేవారు. నేను అదే పనిగా దాటేవాడిని. నిమ్మపండు, బొగ్గులను కాలితో తన్నుకొంటూ పోయేవాడిని. మిగిలినవారికీ నిదానంగా ధైర్యం వచ్చింది.
పూనకం
అన్ని ఊర్లలో ఉన్నట్లే మావూరిలోనూ కొందరు ‘అమ్మ’లు ఉన్నట్లు ఇదివరకే చెప్పాను. మరిగమ్మ, బండమ్మ, మారమ్మ, పిళేకమ్మ మొదనలైనవాటి పరిచయం ప్రజలకు ఉంది. మరిగమ్మ, బండమ్మలకు ప్రత్యేకమైన దేవస్థానాలున్నాయి. మొదటి నుంచీ ఈ దేవతలు ఊరిలో తిష్టవేశారు. మారమ్మ వెనుక ఏడాదికొకసారి వూరి జాత్రలో కనిపించేది. అయితే పిళేకమ్మను ఊరిలో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు మాత్రం గుర్తు చేసుకొనేవారు. పెద్దమ్మ (Smallpox) వారిని కూడా. ఒక్కొక్క ఖాయిలా ఒక్కొక్క దేవత ఆధీనంలో ఉందన్న నమ్మకం ఉంది. ఇలాంటి నమ్మకాలు పల్లెలకు మాత్రమే పరిమితం కాలేదు. పట్టణాలలోనూ ఉన్నాయి. బెంగళూరులోని బసవనగుడి లే ఔట్ ప్రక్కనే ఉన్న త్యాగరాజనగరులో పిళేకమ్మకు ఒక మహత్తరమైన ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడు ప్లేగే లేని కారణంతో ఆ పిళేకమ్మ సంపూర్ణ నిరుద్యోగి. దేవుళ్ళు వొంటి మీదకు పూనే దృశ్యాలు, ఘటనలు పల్లెలలో సాధారణమైన విషయం. ప్రజల కోరికతో ఒక మనిషిపై దేవుడు పూని ఆ జనుల అభీష్టాలను నెరవేర్చే భరోసా ఆ దేవుళ్ళ నుండి లభిస్తుంది. ఏ కోరికలూ లేని సందర్భాలలో కూడా ఉన్నట్టుండి దేవుళ్ళు పూనే సందర్భాలూ ఉన్నాయి.
ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా కష్టాలు వచ్చినప్పుడు వారు నమ్ముకున్న దేవస్థానానికి వెళ్ళి, పూజలు చేయించి, మొక్కులు మొక్కుకుని తరువాత ఆ విధంగా ముడుపులు చెల్లించుకొంటారు. ప్రజలకు సార్వత్రికంగా అంటే మొత్తం గ్రామానికంతా కొన్ని కష్టాలు రావడం జరిగేది. ఉదాహరణకు కొన్ని నెలలు వానలు కురియనప్పుడు, లేదా ప్లేగో అటువంటి మరొక ఉపద్రవమో వచ్చినప్పుడు వూరిలోని బహుజనులు కొమ్ము, కాహళి, తప్పెటలతో సహా దేవస్థానానికి వెడతారు. దేవుని అభిప్రాయాన్ని పరోక్షంగా ‘పువ్వు’ ద్వారా తెలుసుకోవచ్చు. మైనంలాంటి జిడ్డుతో కూడిన దేవుని విగ్రహానికి సాధారణంగా గన్నేరు పువ్వును మెత్తుతారు. పూజ చేస్తారు. వాయిద్యాలు మ్రోగుతాయి. వాన వస్తుందా లేదా అనేది సమస్య ఐతే వర్షం పడేటట్టైతే పువ్వు దేవుని కుడివైపు పడాలి లేకుంటే దేవుని ఎడమవైపు పడాలని మొక్కుకుంటారు. ఆ పువ్వు రాలేవరకూ వాద్యాలు మోగుతూనే వుంటాయి. ఆ పువ్వు ఎప్పటికైనా ఏదో ఒక వైపుకు పడాల్సిందే కదా! కుడివైపుకు పువ్వు రాలి పడితే అందరూ సంతోషంగా, ఎడమ వైపు పడితే విచారంగా వెనుదిరుగుతారు.
నేరుగా దేవుని అభిప్రాయం తెలుసుకోవడం మరొక విధానం. వాద్యాలన్నీ మిన్నంటేలా మోగుతూ ఉంటాయి. కొంత సేపయ్యాక ఉన్నట్టుండి ఒకడు ఆవేశంగా అరుస్తాడు. అప్పుడు అతని శరీరంపైకి దేవుడు వచ్చాడని అర్థం. చుట్టుముట్టూ ఉన్నవారు అతడిని గట్టిగా పట్టుకుంటారు. తమ కోరికలను ఆ దేవుని ముందు పెడతారు. ఒంటి మీదికి దేవుడు పూని ఆ సమయంలో అతనికి ఏమి తోచుతుందో దాన్ని చెబుతాడు. అదే దైవవాణి అని తెలుసుకుని జనం సమాధానంతోనో, అసమాధానంతోనో వెనుదిరుగుతారు.
ఒకసారి మా ఊరికి ప్లేగు వచ్చింది. ఇదొక భయంకరమైన పీడ. ఈ కాలం వారికి ప్లేగ్, దాని పరిణామం తెలియదు. ఆలస్యంగా పుట్టడం వల్ల ఈ విషయంలో వారికి మంచే జరిగింది. ప్లేగ్ ఎలుకల ద్వారా వస్తుంది. ప్లేగు ముందస్తు సూచన ఎలుకల ద్వారా తెలుస్తుంది. ఇంటిలో ఎలుక పడింది అంటే ఎలుకలు ఉరవడిగా చనిపోతాయని అర్థం. అంటే ప్లేగ్ మొదలయ్యింది. మనిషికి ప్లేగ్ తగులుకుంటే ఒకటి రెండు రోజుల్లో చనిపోతాడు. ప్లేగు విపత్తును తట్టుకోవాలంటే ఆ కాలంలో ఊరిలోని వారందరూ తమ ఇల్లూ వాకిలిని వదిలిపెట్టి దూరంగా తమ తమ పొలాల్లోనో, బయలులోనో గుడిసెలు వేసుకుని కొన్ని వారాలు గడపాలి. దీనివల్ల జనాలకు మహాకష్టం. చిన్న ఊరైతే సమస్య తక్కువే. మా వూరువంటి 1500 గడపలున్న పెద్ద గ్రామమైతే అన్ని సంసారాలు తాత్కాలికంగా వలస పోవడం అతి ప్రయాసతో కూడుకొన్న పని. దీనినుండి తప్పించుకోవడానికి ప్రజలు అమ్మవారి దేవస్థానానికి వెళ్ళి ఒకరి ఒంటిమీదికి అమ్మవారు పూనేలా చేసి ప్లేగు బారిన పడకుండా ఉండడానికి గ్రామం వదిలివెళ్ళాలో వద్దో తెలుసుకోవాలని ప్రయత్నించారు. మామూలుగానే ఒంటిపైకి దేవత వచ్చింది. ఆరోజు నేను అక్కడే ఉన్నాను. అప్పటికి నేనింకా మాధ్యమిక పాఠశాలలో చదువుకొంటున్నాను. “మీ కష్టాలు ఏమిటో చెప్పండి బిడ్డల్లారా! తీరుస్తాను” అమ్మ అడిగింది. సర్వజ్ఞుడైన దేవునికి ప్రజలకు ఏ కష్టం వచ్చిందో తెలియక ఆ ప్రజల మూలకంగానే వారి కష్టాలు తెలుసుకునే దుస్థితి రావడం శోచనీయం! అదలా ఉంచండి. “తల్లీ మాకు కష్టకాలం వచ్చింది. ఊరికి ప్లేగు తగులుకుంది. ఊరు వదిలి వెళ్ళాలో వద్దో చెప్పు తల్లీ” అంటూ అమ్మను వేడుకున్నారు. “బిడ్డల్లారా, ఏమాత్రం భయపడకండి. మిమ్మల్ని కాపాడేందుకు నేనున్నాను. మీరు ఊరు విడిచి వెళ్ళే అగత్యం లేదు. ఒకటి రెండు రోజుల్లో ప్లేగు సంపూర్ణంగా పోతుంది” అంటూ అమ్మవారు అనుజ్ఞ ఇచ్చింది. జనాలు సహజంగానే సంతోషంతో వెనుదిరిగారు.
నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు ఇంకో సంఘటన జరిగింది. మా ఊళ్ళో హనుమంతుని దేవస్థానముంది. ఆ హనుమంతుడు ఎన్నడూ ఎవరి ఒంటిమీదికీ రాలేదు. అసలు రాడనే నమ్మకమూ ఉండేది. ఒకరోజు ఏదో కష్టసమయంలో భక్తుల కోరికమీద మామూలుగానే మరిగమ్మ ఒకావిడ ఒంటిమీద పూనింది. మేము కొంతమంది పిల్లలం హనుమంతుని దేవస్థానపు కాంపౌండు గోడపైన కూర్చొని ఇదంతా చూస్తూ ఉన్నాము. మాతో పాటు కూర్చొన్న ఒక యువకుడు అరుస్తూ కాంపౌండు దూకి పూనకం వచ్చినవాడిలా ప్రవర్తించసాగాడు. అక్కడున్న అనేకమంది భక్తులు అతనివైపుకు పరిగెత్తి వచ్చారు. “నేను హనుమంతరాయుణ్ణి” అంటూ పూనకం వచ్చినవాళ్ళు చెప్పే ధాటిలోనే కళ్ళు మూసుకొని శరీరాన్ని ఊపుతూ, చేతులను అన్ని దిక్కులా జాడిస్తూ “చెల్లెమ్మా చెల్లెమ్మా” అంటూ మరిగమ్మ పూనిన వ్యక్తి వైపుకు పరిగెత్తాడు. “అయ్యో అన్నా అన్నా నిన్ను చూసి ఎన్నేండ్లు అయ్యింది” అంటూ హనుమంతరాయుడి వైపుకు మరిగమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది.. అక్కడున్న కొంతమందికి హనుమంతుడు పూనిన వ్యక్తిపై అనుమానం వచ్చింది. అతడిని తిడుతూ ఇలా బూటకమాడితే తగిన శాస్తి చేస్తామని బెదిరించారు. అప్పుడు అతడు తమాషాకు ఇలా చేశానని చల్లగా ఒప్పుకున్నాడు. ఇంకోసారి ఇలా చేయవద్దని అతడిని హెచ్చరించారు. అక్కడితో అతడు తప్పించుకున్నాడు.
దేవుని ఉత్సవాలు ప్రతి ఊరిలోనూ, పట్టణాలలోనూ జరుగుతూ ఉంటాయి. ఉత్సవమూర్తిని అలంకరించి నలుగురు మోస్తూ బాజాభజంత్రీలతో ఊరి వీధులలో రాత్రిపూట వూరేగిస్తారు. ప్రతి ఇంటి ముందూ దేవుడు నిలబడతాడు. ఇంటివారినుండి దేవునికి పూజ జరుగుతుంది. ఒక్కోసారి ఉన్నట్టుండి దేవుని మోస్తూవున్న ఆ నలుగురూ ఆవేశంగా ముందుకూ, వెనక్కీ, ఇష్టం వచ్చినట్లు పరిగెడుతూ ఉంటారు. అంటే ఆ నలుగురిపైకి దేవుడు ఆవహించినాడని అర్థం. పిచ్చిపిచ్చిగా పరిగెట్టి ఆయాసంతో అలసిపోయిన తరువాత వాళ్ళు మామూలు స్థితికి వస్తారు.
మాలో కొందరం ఒంటిపైకి దేవుడు పూనడాన్ని విమర్శించేవాళ్ళం. దేవుడు ఒంటిపైకి రావడం సాధ్యమే కాదనేది మా వైఖరి. పూర్వం ఋషులు దేవుని సాక్షాత్కారం కోసం ఎంత కష్టపడేవారు. ఐనా దేవుని జాడ దొరికేది కాదు. ధ్రువుడు ఉపవాసం ఉన్నాడు. ఒంటికాలిపై నిలబడి తపస్సు చేశాడు. అయినా అతడిపై దేవుని కృప పడలేదు. ఏ ప్రయత్నమూ చేయని అతి సాధారణ మనుష్యుడిపై దేవుడు రావడం ఎలా సాధ్యమని మా వాదన. ఇది విన్న పెద్దలకు మాపై మహాకోపం వచ్చేది. “నాలుగు ముక్కలు చదివి అంతా మీకే తెలుసని ప్రగల్భాలు పలకకండి. మీలాంటి వారి వల్లే భూమి మీద పాపం పెరిగిపోయింది. సమయానికి వర్షాలు పడటమూ కష్టమైపోయింది” అంటూ కసరుకొనేవారు. తిట్టేవారు. వారితో నేనొకసారి ఎదురు వాదించాను. దానికి వారు “చూడు నరసింహా. ఇలా రా. నీకు దీనిపై నమ్మకం కలిగేలా చేస్తాము. మేము నలుగురం ఉత్సవమూర్తిని ఎత్తుకుంటూ వూరిలో ఊరేగిస్తాము కదా. మాలో ఒకరికి బదులు నీవు దేవుని ఎత్తుకో. అప్పుడు తెలుస్తుంది నీకు దేవుని ప్రభావం, దేవుని శక్తి. దేవుడు ఎటు వెళితే నీవు అటే వెళ్ళాల్సి వస్తుంది” అంటూ సవాలు విసిరారు. “మీవాళ్ళు ముగ్గురుండీ నాల్గవ వాడిని నేనైనప్పుడు ఆ ముగ్గురూ ఇష్టానుసారం లాగితే నేను అసహాయకుడినై వారితోపాటు ఊగాల్సి వుంటుంది. అప్పుడు నా శరీరంపై కూడా దేవుడు ఆవహిస్తాడని అనుకోవచ్చు. అందువల్ల మా గుంపులోని నలుగురికి దేవుడిని ఎత్తుకునే అవకాశం ఇవ్వండి. అప్పుడు దేవుని ప్రభావాన్ని పరీక్షిద్దాం” అన్నాను. “అయోగ్యుడు, తలపొగరు” అనే అర్థం వచ్చే మాటలతో తిట్లు తిన్నాను. నమ్మకాలను ప్రశ్నించడం, పరీక్ష చేయడానికి ప్రయత్నించడం, చివాట్లు తినడం సుమారు అరవైనాలుగు సంవత్సరాల క్రిందే మొదలయ్యింది. ఇప్పటికీ కొనసాగుతూనే వుంది.
దెయ్యం
తల్లిదండ్రులు తమ పిల్లలను తెలిసో తెలియకో పిరికివాళ్ళుగా తయారు చేస్తారు. భయాన్ని కలిగించే అనేక విషయాలు చెబుతారు. “అక్కడికి పోవద్దు. బూచి ఉన్నాడు. ఇక్కడ దిష్టిబొమ్మ వుంది. చింతచెట్టు మీద దెయ్యం ఉంది. ఆ పాడుబడ్డ మంటపంలో పిశాచముంది.” ఇలాంటి మాటలు పిన్నవయస్కులైన పెరిగే పిల్లలపైన ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయన్న సంగతి తీవ్రంగా ఆలోచించాలి.
మావూరి ముందున్న దెయ్యాలకు నిలయమని పేరుబడ్డ చింతచెట్టు దగ్గరికి ఒక్కడే పోకూడదని చిన్నప్పుడు మా తల్లి చేసిన హెచ్చరిక పెద్దవాడినైన తరువాత కూడా ఆ చెట్టు ముందు వెడుతున్నప్పుడంతా జ్ఞాపకం వస్తూవుంటుంది.
దెయ్యాలు పిశాచాలు ప్రతివూరిలోనూ ఉంటాయన్న నమ్మకం దేశవ్యాప్తంగా వ్యాపించింది. వీటి గురించి అనేక కట్టుకథలు ప్రచారంలో ఉన్నాయి. దెయ్యం తెల్లచీర కట్టుకుంటుందని, పాదాలు వెనక్కు ఉంటాయని, చెట్లను ఎక్కుతాయని ఇలాంటి నమ్మకాలకు తుదీమొదలూ లేదు. మన వూరిలో దెయ్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయో పెద్దవాళ్ళు చెప్పినందువల్ల అక్కడకు వెళ్ళినప్పుడల్లా వాటి జ్ఞాపకాలు వస్తుంటాయి. కొంచెం భయపడే అవకాశమూ ఉంది. అయితే ఇంకో గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడి దెయ్యాల స్థలపురాణం మనకు తెలియని కారణంగా అన్నిచోట్లా నిర్భయంగా సంచరిస్తూ ఉంటాము. దెయ్యాలు లేనే లేవని నా ఖచ్చితమైన అభిప్రాయం. అవి మన తలలో మాత్రం ఉన్నాయి.
బాబయ్య పండగ
మావూళ్ళో ముస్లిముల జనసంఖ్య సుమారు 100. ఊళ్ళో వారికో మసీదు. సమయానుసారం నమాజు, బక్రీద్, రంజాను, మొహరం మొదలైన పండుగలను కట్టుబాటుతో ఆచరించేవారు. మొహరం పండుగలో హిందువులూ ఎక్కువగా పాల్గొనేవారు. ఊరిలో రెండు చోట్ల బాబయ్యలను పెట్టేవారు. ఇది 8-10 రోజుల కార్యక్రమం. హిందువులు పప్పులపొడి, బత్తాసు, చక్కెర, ఖర్జూరాలు మొదలైనవి పళ్ళెంలో పెట్టుకుని వెళ్ళి బాబయ్య ముందు పెట్టి ఆశీర్వాదం తీసుకుని ఆ తిండిని ఇంటిలో అందరికీ పంచిపెట్టేవారు. బాబయ్య ముందు ఒక పెద్ద గుండం. దాని నిండా నిప్పులు. ఒకరోజు నిప్పులపై నడిచే కార్యక్రమం. ఆ నిప్పులు తొక్కేవారంతా హిందూ భక్తులే. ఉపవాసముండి, స్నానం చేసుకుని వచ్చి నిష్టతో బాబయ్య ముందు నిలిచి అక్కడి నుండి పరిగెట్టుకుని వచ్చి అగ్గిలో దూకి నిప్పులను చల్లి ఇటువైపుకు వచ్చేవారు. ఇదంతా అర క్షణం కూడా పట్టేది కాదు. వారికి ఏమీ అయ్యేది కాదు. మాకంతా ఆశ్చర్యం. అదొక అద్భుతమైన దృశ్యం. అయితే ఒకసారి ఒకడికి కాళ్ళు కాలి బొబ్బలు పోయాయి. అతడు నిష్ట నుండి ఈ పని చేయలేదని ఆపాదించారు.
మొహరం చివరిరోజును జల్ది అని పిలిచేవారు. ఆ రోజు సాయంత్రం బాబయ్యల వూరేగింపు. దానిలోనూ హిందువులు చురుకుగా పాల్గొనేవారు. అందులో ముఖ్యమైనది పులివేషం. హిందువులు పులివేషం వేసుకుని తప్పెట వాద్యానికి తగినట్లుగా నృత్యం చేసేవారు. సీమనూనెను తాగి, ఊసే నూనెకు నిప్పును అంటించినప్పుడు భగ్గుమని మంటలు వచ్చేవి. పులివేషగాండ్రు టెంకాయను గాలిలోకి విసిరి తమ తలను ఒడ్డినప్పుడు ఆ టెంకాయ రెండు ముక్కలయ్యే దృశ్యం ఇంకా నా కళ్ళకు కట్టినట్టు ఉంది. ఆ ఊరేగింపు చాలా కోలాహలంగా జరిగేది. వందలాది మంది హిందువులు దీనిలో పాల్గొనేవారు. మావూరిలో హిందు-ముస్లిం సౌహార్ద్రత చాలా గాఢంగా ఉండేది. ఇప్పటికీ ఉంది. ఇంత వరకు హిందు ముస్లిములలో ఎప్పుడూ విభేదాలు తలెత్తలేదు.
ధార్మిక కార్యకలాపాలు – అఖండ రామభజన
వార్షిక కార్యక్రమాలలో రామోత్సవము ఒకటి. ముఖ్యంగా యువకులు శ్రద్ధాసక్తులతో ప్రతియేటా 8-9 రోజులు ఈ ఉత్సవాన్ని జరిపేవారు. కార్యక్రమం అంతా సంప్రదాయ పద్ధతిలో నడిచేది. ఉదయం, సాయంత్రం రామునికి పూజ, దానితో పాటు పారాయణం, రామాయణంపై ఉపన్యాసాలు ఉండేవి. ఉపన్యాసం వినడానికి చాలామంది పెద్దవారు, మహిళలు హాజరయ్యేవారు. ప్రసాదం పంపిణీ లేకుండా ధార్మిక కార్యక్రమం ముగిసేది కాదు.
మేమాచరిస్తున్న మరో వార్షిక కార్యక్రమం విదురాశ్వత్థ యాత్ర. విదురాశ్వత్థం మా ఊరికి సుమారు 8 మైళ్ళ దూరంలో ఉంది. అక్కడున్న అశ్వత్థ వృక్షం మహాభారత కాలంలో విదురుడు నాటినదని ప్రతీతి. అందువల్ల అది పుణ్యస్థలం. పిల్లలు లేనివారు పూజ చేసి అశ్వత్థ వృక్షానికి కొన్ని ప్రదక్షిణలు చేస్తే పిల్లలు పుడతారనే బలమైన నమ్మకం జనంలో ఉంది. ఇదొక స్థల మహత్యం. ఆ వృక్షం క్రింద వందలాది నాగ ప్రతిమలు. ఏడాదికోసారి అక్కడ పశువుల జాతర. రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలూ, పశువులూ ఆ సమయంలో అక్కడికి చేరుకోవడం ఖాయం. వందల మంది పిల్లల కోసం పూజలు చేసి ఆ వృక్షాన్ని కావలసినన్ని సార్లు ప్రదక్షణ చేసేవారు. అంత మందిలో సహజ ప్రకృతి నియమంవల్ల కొందరికైనా పిల్లలు పుట్టవలసిందే కదా! అయితే ఆ కీర్తి మాత్రం అశ్వత్థ వృక్షానికే దక్కేది. పిల్లలు కలగనివారు ఆ వృక్షాన్ని దూషించకుండా అది తమ కర్మఫలమని సమాధాన పడేవారు. పిల్లలు కలిగినా కలగకపోయినా ఆ అశ్వత్థవృక్షం ప్రతిష్ఠకు మాత్రం ఎప్పుడూ ఢోకా రాలేదు. పైగా పిల్లలు కలిగినవారి ప్రచారంతో యాత్రికుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ‘జనమరుళో జాతరె మరుళో!’ అన్న సామెత నిజంగానే సత్యం.
మేము ఐదారుగురు స్నేహితులం జాతర సమయంలో విదురాశ్వత్థానికి నాలుగైదు సార్లు వెళ్ళాము. 8 మైళ్ళు నడవడం సరదాగా ఉండేది. జాతర సమయంలో సంతర్పణం. అక్కడే భోజనం. పక్కనే పారుతూవున్న ఉత్తర పినాకినీ నది ఇసుకతిన్నెలపై నిద్ర. పగలంతా జాతరలో చక్కర్లు కొట్టడం, పశువులను చూడడం, దానికన్నా ముందు ప్రొద్దునే లేచి ఏదైనా ఒక బావిలో ఈదులాడడం, అశ్వత్థవృక్షానికి కొన్ని ప్రదక్షణలు చేయడం (పిల్లలు కలగాలని కాదు!), సాష్టాంగ నమస్కారం చేయడం. ఇలా ఒకటిరెండు రోజులు గడిచాక వచ్చినదారిలోనే యథాప్రకారం కాలినడకతోనే వెనుదిరిగేవారం.
ఇంకొక ప్రసిద్ధమైన యాత్రాస్థలం ఘాటి సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం అనేది ఒక దేవస్థానం పేరు. ఘాటి అనే పదం ఆ దేవుని మనోభావాన్ని సూచించేది కాదు. అడవితో కూడిన ఘాట్ లేదా లోయ ప్రదేశంలో ఉన్నందువల్ల ఆ ప్రాంతానికి ఘాటి సుబ్రహ్మణ్యం అనే పేరు వచ్చింది. గౌరీబిదనూరు నుండి దొడ్డబళ్ళాపురం వైపు 18 మైళ్ళ దూరంలో ఉంది ఘాటి సుబ్రహ్మణ్యం. అక్కడ ప్రతియేటా జనవరి నెలలో పశువుల పెద్ద జాతర నడుస్తుంది. మా ఊరి నుండి ఘాటికి సుమారు 24 మైళ్ళు. రెండుసార్లు జాతర సమయంలో ఘాటికి నలుగురైదుగురు స్నేహితులం వెళ్ళివుంటిమి. నడుచుకుంటూ వెళ్ళి వాపసు నడుచుకుంటూ వచ్చామని చెప్పవలసిన పనిలేదు. ఎప్పుడూ బస్సు లేదా రైలు ప్రయాణం చేయలేదు. నా మొదటి రైలు ప్రయాణం దొడ్డబళ్ళాపురానికి లోయర్ సెకండరీ పరీక్షకు పోయినప్పుడు.
బయలు నాటకం
పెద్ద పెద్ద పల్లెల్లో బయలు నాటకం ఆడే గుంపు లేదా గుంపులు ఉంటాయి. ఒక నాటకం ఆడాలంటే దాని వెనుక చాలా కృషి ఉంటుంది. కొన్ని నెలలపాటు నిరంతర సాధన చేయాల్సివుంటుంది. కొన్నిరోజులైతే రాత్రి 4-5 గంటలపాటు అదే పనిగా అభ్యాసం చేయాలి. తరువాత ఒకరాత్రి సార్వజనిక ప్రదర్శన ఉంటుంది. పరదా మొదలైన నాటకానికి ఆవశ్యకమైన వాటిని కావలసిన డబ్బులిచ్చి బాడుగకు తెస్తారు. అప్పటికింకా విద్యుచ్చక్తి లేదు. అంతా గ్యాస్ లైట్లే. రంగస్థలాన్ని తదేకనిష్ఠతతో సిద్ధం చేసేవారు. దాని ముందు సుమారు 8-10 అడుగుల పొడవు, 2 అడుగుల లోతు, 3 అడుగుల వెడల్పు ఉన్న గోతిని తవ్వేవారు. దానిలో పక్కవాయిద్యాలు వాయించేవారు కూర్చుంటారు. పక్కవాయిద్యాలలో ‘లెగ్ హార్మోనియమ్’ ప్రముఖమైనది. తక్కినవి తబలా వంటివి. నాటకం పూజతో ప్రారంభమౌతుంది. ఊరి ప్రజలు చాలామంది రంగస్థలానికి ముందున్న విశాలమైన స్థలంలో కూర్చుంటారు. కొంతమంది చాపలమీద కొంతమంది నేలమీద. నాటకం చూడటానికి తల్లి, చెల్లెలితో వెళ్ళేవాడిని. తండ్రి నాటకం చూడటానికి వచ్చేవారు కాదు. నాటకం మొదలయ్యేదే రాత్రి సుమారు 10 గంటలకు. లంకా దనహనం, సంపూర్ణ రామాయణం, కృష్ణలీల, కంసవధ మొదలైన బయలు నాటకాలను చూసిన జ్ఞాపకం ఉంది. నాకు తెలిసినంతవరకూ ఏ నాటకమూ పూర్తిగా చూడలేదు. ఒకటి రెండు గంటల తర్వాత నిద్రముంచుకొచ్చేది. నేలమీదే అలాగే నిద్ర పోయేవాడిని. నాటకం ముగిసే సమయానికి మా తల్లి నన్ను నిద్ర లేపేవారు.
లంకాదహనం నాటకానికి సంబంధించిన ఒక సంఘటన నాకు బాగా గుర్తుంది. హనుమంతుడు రంగస్థలం మీదికి నేరుగా, సులభంగా, మామూలుగా ప్రవేశించేవాడు కాదు. అతడు ప్రవేశించడంలో ఒక విశిష్టత ఉంది. వేదికకు 100, 200 గజాల దూరంలో వరుసగా కొన్ని ఇండ్లు ఉన్నాయి. రంగస్థలానికీ, ఆ ఇళ్ళవరుసకు మధ్యలోనే ప్రేక్షకులు కూర్చున్నారు. హనుమంతుని ప్రవేశానికి ముందు రెండు చేతుల్లోను అంటించిన ఊదుకడ్ల గుచ్చం, తోక, రంగులు సరేసరి. ఆ గుచ్ఛాన్ని రెండు చేతులతో పట్టుకుని రామా రామా రామా అంటూ భజనచేస్తూ ఒక ఇంటి మిద్దెమీద అటూఇటూ తచ్చాడుతూ ఉంటాడు. ఆ మిద్దె మీద అతడు కనిపించే ముందు పెద్దగా పటాకుల శబ్దం వినిపిస్తుంది. ప్రేక్షకులంతా తాము కూర్చున్న స్థలంనుండే తమ తలలు వెనుకకు తిప్పి చూస్తారు. ఆ హనుమంతుడి పాత్రధారి కొంతసేపు భజన చేసి ఆ మిద్దెపై నుండి క్రిందకు దూకుతాడు. అక్కడి నుండి అదే భజన చేస్తూ, అదే భంగిమలో వేదిక ప్రక్కన ఏర్పాటు చేసిన ఒక పది అడుగుల నున్నని ఇనుపపైపును ఎత్తి వ్యాయామం చేస్తాడు. అందరూ దీనిని ఎంతో ఉత్సాహంతో చూస్తారు. ఇదంతా జరిగేటప్పుడు రాముడు మూగప్రేక్షకుడిలా రంగస్థలంపై నిలుచునివుంటాడు. వ్యాయామం ముగిసాక అలసటతో వేదికనెక్కి రాముని పాదారవిందాలవద్ద భక్తితో, నమ్రతతో కూర్చుంటాడు. అప్పుడు అతడికి కొంత విశ్రాంతి దొరుకుంతుంది. ఆ వ్యవధిలో పాటలూ లేవు, తబలా లేదు, ఎలాంటి శబ్దమూలేదు. ఉంటే బహుశా ఒకటి రెండు సార్లు టపాకాయల చప్పుడు అంతే. ప్రేక్షకులంతా స్తంభీభూతులై చూస్తూ ఉంటారు. ఆ దృశ్యం ఇప్పటికీ నాకు కళ్ళకు కట్టినట్లుంది.
ఇలాంటి ఒక బయలు నాటక ప్రదర్శనకు ఆకాలంలోనే కొన్ని వందల రూపాయలు ఖర్చయ్యేవి. కళాకారులంతా బీదవారైనా వారికి నాటకం ఆడాలన్న సంకల్పం ఉండేది. అందువల్లే వారు శ్రమను కానీ, ఖర్చును కానీ లెక్కపెట్టేవారు కాదు. ఇప్పుడా అర్థవంతమైన జానపదకళ పూర్తిగా నశించిపోయింది. బ్రహ్మరాక్షసి టి.వి. ముందు ఏ కళ అయినా బతికి బట్టకడుతుందా!
(సశేషం)